పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, జులై 2012, సోమవారం

కొన్ని కవితలు ( బ్లాగు- తొలివారాల్లోని పోస్టింగులు)

1

నీతో మాట్లాడానివుంది

 

పెదవుల కదలికల్లో
ధ్వనించే అంతరంగంతో సంభాషించాలి

సాంకేతిక పనిముట్లు శబ్దాన్నే అంతరీకరిస్తాయి
వ్యవహాళికెల్లిన చేతిస్పర్శ వాటికేం తెలుసు పాపం!

వంటరిరాత్రి మోసుకొచ్చే ధ్వనిచిత్రాలు
భయపెడుతూనో ముద్దాడుతూనో
సమూహాంతర ప్రవాహంలోకి నెట్టేస్తున్నాయి

నలుదిక్కులనుండి విసిరే వలలు

ఎదురెదురాగా వుంటూనే మనం
ముక్కలు ముక్కలుగా విసిరేయబడుతున్నాం

సంభాషణకోసం సమయాన్ని వెదుక్కునేలోగా
ముచ్చటపడ్డ రింగుటోను పాట
ఏదో మూలకు లాక్కెళుతుంది

ఎవ్వరూలేని తరగతి గది ఓమూల బెంచీలో
మనదైన ప్రపంచానికి ఎల్లలుగీస్తూ
ఎన్ని మాటలు ఎన్ని సంభాషణలు

రావిచెట్టుక్రింద ఎంకిపాటలతో
వర్డుస్వత్తు కీట్సుతో కలిపి 
రాల్తున్న ఆకుల్ని ఏరుతూ
మారకంలేని చిరునవ్వుతో సంభాషణ కావాలన్పిస్తుందిప్పుడు 

అక్షరీకరించలేని ఎన్నో సంభాషణలు
మెమరీనుంచి డిలీట్ అవుతూనేవున్నాయి

కాలానికి ఎదురీదడం కొత్తేమీ కాదు
కాలంలో కలిసిపోవడం పాతా కాదు

మాట్లాడలనే ఆశ
కోర్కై గూడుకట్టడానికి ప్రయాణిస్తుంది

*******************************************************
2 

 మెర్సీ మార్గరెట్ కవిత


అమ్మ
కంటి కాటుకతో పెట్టిన దిష్టి చుక్కే
తన సొంతమయ్యానని
తాను చేసిన తొలి సంతకం

నా చిట్టి చేతులు పట్టుకొని
చిన్ని వేళ్ళు ముద్దాడుతూ
గుండెపై నా అడుగులు వేయనిచ్చి
తన ప్రతి ఛాయను నాకివ్వడమే
నాకు తెలిసిన నాన్న సంతకం

పాలు కక్కుతూ ఏడ్చిన ప్రతిసారి
తన కోక నాకు ఓదార్పు
తన మంగళ సూత్రాలే గమ్మత్తైన
ఆటవస్తువులు
తను ఇచ్చిన ఆమె పోదిగిలిలోని
వెచ్చదనమే అమ్మమ్మ సంతకం

పడుతూ లేస్తూ తొందరగా ఎదిగి
ఏదో చేయాలని
త్రవ్వి త్రవ్వి రహస్యాలను చేదించాలని
మట్టిలో "నే" ఆడిన ఆటలన్నీ
ఎప్పటికైనా నే తనకి సొంతమని
ఒంటికే అంటుకొని
కనిపించేలా చేసిన మట్టి సంతకం

అన్నీ జ్ఞాపకాల కన్నా ఎక్కువే
ఊపిరికి ఉనికినిచ్చే నిన్నా మొన్నల
నేటి నాలో
మరిచిపోలేని విలువైన ముద్రలే 


******************************************************** 

3


మొన్న రాత్రి

=======
బిజీ బిజీ వల్లకాడులా వుంది (pub)పబ్బులో వాతావరణం !
వద్దనుకున్న ఙ్ఞాపకాలను సామూహికంగా దహనం చేయడానికి
సుందరంగా తీర్చిదిద్దిన స్మశానం సెట్టులా వుంది.

స్మృతుల చితి రగలడానికి తలో మందూ వేస్తున్నారు.
మనుషులను కాల్చడానికి కిరోసినూ, డీజిలూ, పెట్రోలుల్లా...
మనసులను కాల్చడానికి విస్కీ, బ్రాందీ, రమ్మూ
ఇంకా బోలెడు మిశ్రమాలూ వున్నాయక్కడ!

ఆ కాలుతున్న వెలుగుల్లోనే నృత్యాలు,
చితుల చిటపటలు వినిపించకుండా సంగీతం.

గతం తాలూకు ఙ్ఞాపకాలూ - వర్తమానంలో స్పందనలూ -
భవిష్యత్ గురించి ఆలోచనలే జీవితమయితే,
వాటన్నింటినించీ దూరంగా పోయే ఈ ప్రయత్నం
ఒక సామూహిక ఆత్మహత్యాయత్నంలా వుంది.

నచ్చని వాస్తవాల బూడిదల్లోంచి
అందమయిన అవాస్తవాల పూలు
పుడతాయేమోనని చేస్తున్న
'ఎమోషనల్ అత్యాచారం'లా వుంది.

రంగుల్లేని వెలుగునీడల జీవితాలను
ముదురు వర్ణాల మత్తు అద్దాలతో
చూసుకునే ప్రయాసలా వుంది.

ఇంకెలాఎలా వుందో చెప్పలేకుండా
నా మనసూ చూపూ మసక మసక,
రేపటి ఉదయపు 'హాంగోవర్'(hangover) వాస్తవం
మరచిపో-యేం-త-గా.గా..గా..



************************************************** 

4


కట్టా శ్రీనివాస్ కవిత

సై కూత - పై మాట
 
----------------------------
గది బయట
ఊరంతా ఖాళీ చేసి ఎటో వెళ్ళినట్లుంది.

--క--
దేహాలే మంచాలపై దీర్ఘ శ్వాస తీస్తూ
పడున్నాయ్‌ ఆ రాత్రి వేళ.

--చ--
అస్పష్టంగా ఆగంతకుని అడుగుల శబ్దం
చెవి పక్కగానే సంచరిస్తోంది.
గది లోపల నే ఒక్కడినే
ఐనా, నాతో ఒకలాంటి వెర్రి నవ్వుతో
ఒంటరితనం కూడా.

--ట--
పక్కనెవరో హృదయానికి
గురక దారం వేసి గుంజి గుంజి వదుల్తున్నారు.

--త--
ఢన్..ఢన్.. ఢన్..
బలమైన దుండగులెవరో`
ఓ రెండు గడియారాలలోనుండీ,
ఆగకుండా సమ్మెట దెబ్బలేస్తున్నారు.
కాలాన్ని తుత్తునియలు చేస్తారేమో?

--ప--
పక్క గదిలో నుండి పిండి మిల్లులో కంకర పట్టిస్తున్నట్లు
కఠోఱ శబ్దం చేస్తూ ఓ పంఖా
ఆగి ఆగి మళ్ళీ పూనకంతో వూగిపోతోంది.

oo-0-oo

అదే రాత్రి మరోలా అదే నేను. కాదు కాదు
మరో రాత్రి అదేలా నాలాంటి నేను. అవునవును,
ఏదో రాత్రి ఏదోలా ఇంకోనేను.

--గ--
పగటి శ్రమకు దూరమై
జనమంతా నిద్రిస్తుంటే
ఏకాంత ఆలోచనల్ని శ్వాసిస్తున్నట్లు
పడుకునుంటే.

దూర తీరాల నుంచి గాలిలో అలలు అలలుగా
కదిలొస్తున్న కమ్మని పాట
చెవికి తాకకుండా హృదయంలో విహరిస్తోంది.

--జ--
బయటెవరో నడుస్తున్న శబ్దం
నాలాగే నిద్ర పట్టటం లేదేమో!

--ద--
గోడ గడియారాల జుగల్‌ బందీ
ఒక దానితో ఒకటి పోటీ పడి
మృదంగ సాధన చేస్తున్నాయి.

--బ--
విశ్వ విస్ఫోటనాన్ని, అణు విచ్ఛిత్తిని
పాఠం చెప్తున్నట్లు పక్కింట్లో ఫ్యాను
చెప్పాలా? వద్దా? అన్నట్లు
వెనక్కీ ముందుకీ తన్నుకుంటోంది.

--డ--
నా పక్కన రైలింజన్‌ గురక
బస్సులా అప్పుడప్పుడు కుదుపుతూ
నన్ను మరీ లోతుల్లోకి జారకుండా పట్టుకుంటోంది.




*************************************************************************

5


జిలుకర  శ్రీనివాస్ కవిత


పరుసవేదివి నువ్వు

ఉన్నట్టుండి ఒక్క సారిగా
ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది నిన్ను
చుడిదారు చివర నీ వేలాడుతూ నీ వెంటే తిరగాలనిపిస్తుంది
రాస్తూ రాస్తూ నీ చేతి వేళ్ళ నడుముల్లో తిప్పే కళం కావాలనిపిస్తుంది

రోజూ రాస్తూనే ఉంటానా!
సముద్రమంత మిగిలిపోతుంది రాయాల్సింది
అక్షరాలను ఎన్ని సార్లు కూర్చినా కొత్త అర్థాలనిచ్చినట్టే
నిన్ను ఎన్ని సార్లు పేర్చుకున్నా ఎప్పుడూ కొత్త లోకాన్నే చూస్తాను

నడుస్తూనే మాట్లాడుతావా రోజూ
నీ పాదాల కింద మొలిచే వెలుగులు దూరంగా ఉన్న నా దేహం మీద మెరుస్తుంటాయి
ఒక్క క్షణం ఆగమని ఆదేశిస్తావా
మిణుగురు కాంతులన్నీ నీ కళ్ళ నవ్వుల ముందు సిగ్గుతో తల దిన్చుకుంటాయి

రాత్రి నదిలో ఒంటరి పడవలా నేను కొట్టుక పోతూ ఉంటానా
దేహపు లంగరుతో కాపాడుతావు నువ్వు
పలవరిస్తూ కలవరిస్తూ నిద్దట్లో బోరున విలపిస్తూ దొర్లుతూ ఉంటానా
నులి వెచ్చని స్పర్శతో పిల్లాడిని నిద్ర పుచ్చినట్టు జోకోడుతావు నువ్వు

ఓడిపోవాలని మోకరిల్లుతానా నీ ముందు
కాంతి పుంజాలను కప్పుకొని చిరు నవ్వుతో గెలిపిస్తావు నువ్వు
నిన్నే గెలిపించాలని కొంచే తప్పుకుంటానా
దయతో నా తల నిమిరి ప్రేమగా ఓటమిని చేతుల్లోకి తీసుకుంటావు నువ్వు

మునుపెన్నడూ చూడని గొప్ప ఆకాశానివి నువ్వు
నా జీవితాన్ని రగిలించి రంగరించి రచించిన పరుసవేదివి నువ్వు

 


****************************************************************
6

వంశీధర్ రెడ్డి కవిత

* నో స్మోకింగ్ *
 

రొజూ రెండు పాక్స్ 555,
విస్కీ నైన్టీ,
శ్రీరంగమే ఇన్స్పిరేషనప్పట్లో,
ధూమం ఉఛ్చ్వసిస్తూ,
దగ్గు ఎక్స్ పైర్ చేస్తూ,
అలా కవితల్రాయకున్నా,
గాలి తిరిగిన పండితుణ్ణై
ధూమ సోమ సేవనాల్లో,

ముప్పై ఏళ్ళుగా
నికొటిన్ని రక్తంలో కరిగిస్తూ,
నాడీ మండలానికి బాహ్యోత్ప్రేరకమిస్తూ
కణజాలాలకు ఆక్సీజన్ తగ్గించి నెక్రోస్ చేసుకుంటూ,
కాళ్ళకి ఆయువందక గాంగ్రీన్లతో
మోడర్న్ ఆర్ట్ రూపాలేస్తూ,
ఊపిరితిత్తుల్లో కర్బనపు రాళ్ళు చెక్కుకుని,
ఖళ్ ఖళ్ దగ్గుగా సంగీతీకరిస్తూ,

"త్రాంబో ఆంజైటిస్ ఆబ్లిటెరాన్స్" ఉరఫ్, "బర్జెర్స్ డిసీస్"
మోకాళ్ళవరకు పుచ్చి,
ఆంప్యుటేషనే గతట, హమ్మయ్య,
చేతులుంటాయిగా,దమ్మేయడానికి,

"నికొటిన్ రిసెప్టార్స్ ఇన్ ద బాడీ
ఆర్ హైలీ అఫ్ఫెక్షనేట్ టు స్మోక్,
రాదర్ ఉమెన్స్ టచ్"
నిజమేనేమో,
ఇప్పటికొకే సారోడా ప్రేమలో,
పొగతో రోజూ ఓడిగెలుస్తూ,

అవిటోణ్ణయ్యాక
సిగ్నల్ దగ్గర పోస్టర్లుంటాయేమో,
బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని,
అసల్నేనెందుకు మాన్లేదిన్నాళ్ళు,
నాకు నేనిష్టంలేక,
నన్ను నేనే కృశించుకుంటే,
నన్నొదిలెల్లినోళ్ళు బాధపడ్డం,
నాకానందమేమో

ఆమ్ ఐ ఎ పర్వర్ట్??
ఆనందాన్నాస్వాదించే ప్రతోడూ పర్వర్టే,

నాశనమయ్యానెలాగూ,
మానడమెందుకింకా,
గోల్డ్ ఫ్లేక్ కింగ్స్, గోల్డ్ కలర్ వ్రాప్పర్లో,
ఇంజ్యూరియస్ టు హెల్త్,
బట్ మై, నెర్వ్స్ అడ్డిక్టెడ్ టు ఇట్,
వొద్దొద్దు, నేను గెలవాలీసారి,
ఒక్కసారి, చివర్సారిదే,

ఫిల్టర్ని పడుచు నడుమంత నాజూగ్గా పట్టి,
లేదు లేదు చివర్సారిదే,
కూరిన పొగాకు నాసికలాఘ్రాణిస్తుంటే, వాహ్,
ఇంకాపేస్తా, ష్యూర్,

మళ్ళీ ఓడిపోతానన్నాకూ తెల్సు, కానీ,
గెలవక"పోతానా" ఒక్కసారైనా,
అరె, ఐపోయిందప్పుడే,
నిజంగా ఇదే చివర్సారిక, ప్లీజ్,
అద్దంలో నన్ను నేను బ్రతిమిలాడుతూ,
మరోసారి
వొణికే వేళ్ళతో,
నా నేస్తాన్ని నోటికందిస్తూ...




************************************************************* 

7

ఇంటి బెంగ
-----------

ఏ అలజడీ లేనపుడు
అలలన్నీ కొలనులో దాగివుండి
నీటిలో నీరు పొందికగా సర్దుకొంది.

ఏ వెలుతురూ లేనపుడు
నీడలన్నీ రాత్రిలో దాగివుండి
చీకటిలో చీకటి హాయిగా విశ్రమించింది.

ఏ కదలికా లేనపుడు
శబ్దాలన్నీ నిశ్శబ్దంలో దాగివుండి
ప్రశాంతత ప్రశాంతంగా విస్తరిస్తోంది.

అయితే
ఏ పుట్టుకా లేనపుడు
అందరం ఎక్కడ దాగివున్నాం.
సృష్టి ఏమై వుంటుంది.

కొలనులో రాయి వేసాక
నీటి వలయాలు బయట పడినట్లు
ఈ ప్రశ్నలు వేసుకొన్నాక
ఏవో దిగులు వలయాలు బయట పడుతున్నాయి.

బయలుదేరిన చోటికి, త్వరగా తిరిగి వెళ్ళాలనే బెంగ ఏదో
ఈ శీతాకాలపు పొగమంచుతోపాటు
గాలి నిండా, ఆకాశంనిండా పరివ్యాప్తమౌతోంది

 

***********************************************************
8

???


అలా కూచున్న చోటనే
చెదలు పడుతున్నా కదలనితనం...

నిప్పులు కురిపిస్తున్న ఎండ పట్టినా
దాటు దాటనితనం...

కుంభవృష్టిగా వాన కురిసినా
చెక్కు చెదరనితనం....

గడ్డ కట్టుతున్న చలిపులి వణికిస్తున్నా
కాలు కదపనితనం...

మనసంతా అలికిడిలేనితనం
ఏదో వెంటాడుతూ...

నన్ను నేను ఆవిష్కరించుకోలేక
మూగబట్టినతనం...

అవును ఇది
గుండె అంచుల కరకుదనం...

మైలు రాయి విరిగిన చోట
ఆగిన పయనం...

ఈ నాచు పట్టినదనం
విదిల్చే నీటి బిందువుపై
ఓ నీరెండ ప్రతిఫలిస్తే???





***************************************************************

9
 
స్వాతి శ్రీపాద
-------------


మాటలే కావాలా?

ఓటమి ప్రకటనకు మాటలే కావాలా?
ఒక నిశ్శబ్దపు తునక పెదవి విరుపు
కనిపించని ఆయుధంలా మారి అనుక్షణం
అదృశ్యంగా వెంటాడి వేటాడి
చీకటి వలయాల్లోకి తోసెయ్యడం అనుభవమేగా?
ఇద్దరి ఆలోచనల మధ్య
ఓ సన్నని ఉలిపిరి కాగితం
ఉండీ లేదనిపించే ఒక ఒక ఉప్పెన
రంగుల గాలిపటంగా మారి ఇంద్రధనుసు ముఖద్వారం నడినెత్తిన కాస్సేపు
సరదా ఏమి తోచని అల్లరి పిల్లలా
పిల్లి మొగ్గలు వేసి
అంతలోనే
ఎడారి ఎండమావి సూదంటురాయి కోరల్లో చిక్కి
చిరిగి పీలికలై అలసిన అస్థిపంజరం
సొమ్మసిలేందుకు
ఓటమి ప్రకటనే కావాలా?
వీపంతా గతం సూదులు వెన్నాడి వెన్నాడి చేసిన గాయాలు
ఎదుట బాటేదో ముళ్ళేవో తెలియని
అయోమయపు ఆదుర్దా
వెనక్కు తిరిగే సమయం లేదు
ముందుకు సాగితే
గెలుపో ఓటమో మాటలెందుకు?




*************************************************************

10
 

వాడ్రేవు చినవీరభద్రుడు కవిత

---------------------------------

ఈ కథ అంతగా ప్రసిద్ధం కాదనుకుంటాను, ఒకప్పుడు
హాఫిజ్ ఇండియా రావాలనుకున్న సంగతి. పర్షియన్
అఖాతం దగ్గర ఓడకోసం నిల్చున్నప్పుడు అకస్మాత్తుగా
గాలివాన చెలరేగింది, సముద్రం తీవ్రంగా ఘూర్ణిల్లింది.

కళ్ళల్లో పడుతున్న దుమ్ముకు చేతులడ్డుపెట్టుకుంటూ
ఆలోచనలో పడ్డాడతడు. మనిషికి నిజంగా కావలసిందేది?
సముద్రాలకవతల సన్మానాలకన్నాషిరాజ్ నగరపు దుమ్ము
మేలనుకున్నాడు,వెనక్కి పోయి ఒక గజల్ పాడుకున్నాడు

ఎదురుచూస్తున్నాను నేనట్లాంటి గాలివానకోసం, దుమ్మురేగి
దారులన్నీ మూతపడే వేళలకోసం, ప్రలోభనీయసామగ్రిమీద
చీకటి పరదా పడితే తప్ప, ప్రపంచంనుంచి ఒక వైఫల్యం
పక్క్కు నెడితే తప్ప, నేను నా ఇంటికి పోననుకుంటాను.

ప్రాపంచిక పరాజయం ఒక సౌభాగ్యం, ఒకసారంటూ అది
ప్రాప్తించాక,అప్పుడు నీ చుట్టూ తొలివానచినుకుల
గ్రీష్మకాంతి తొణికిసలాడుతుంది,తేమగా తడిసిన జాబిల్లితో
ఆషాడమేఘం ఆడుకుంటుంది, కొత్త గులాబి కళ్ళువిప్పుతుంది






***************************************************************

11 



???

వెంటపడుతున్నది...

స్పష్టమైనది ఏదీ
కానరావటం లేదు
విప్పుకున్నట్లుగా ఏదీ
ఒప్పుకోవటం లేదు

ఎక్కడ నడిచినా
కాళ్ళ ఉపయోగమే తప్పనట్టుంది
ఆలోచనని ఇంకే
అవయవమూ పంచుకో
అర్హత కలిగి లేనట్టుంది

నేనే విశ్వవ్యాప్తమై
అన్నింట్లో హతమౌతున్నాను
నేను గాలం వేయక ముందే
బల్లి నోట్లో చిక్కి
రెక్కలు కొట్టుకుంటున్నాను

అడపా దడపా పూల వాసనలు
చూచినంత మాత్రాన
మకరందం దోచుకున్నట్టా?
ప్రసాదం చప్పరించినంత మాత్రాన
దేవుడు వశమైనట్టా?

నివాస యోగ్యత ఎక్కడా ఉన్నట్టు లేదు
మనసు పారదర్శకత
కాపాడు కునేటట్టు లేదు

ఎన్ని విషాదాలు
ఇంకా వెంటాడతాయో!
ఎన్ని అసత్యాలు ఇంకా
తూటాలౌతాయో!

రక్షక పత్రాలు ఉన్నట్టులేవు
లోహపు అవయవాలు లేవు
మనసు గుండెని చుట్టి
దుర్భేధ్య కట్టడాలు లేవు

ఎవరి మాటలకి భస్మ మౌతామో
ఎవరు పాదం మోపితే నలుగుతామో
ఎవరి చప్పట్ల మధ్యన చిట్లుతామో
హఠాత్తుగా
ఎవరు మూసిన పుస్తకంలో అనిగిపోతామో





***********************************************************

12
 

???


పసిపాపల నా ముందు మోకరిల్లింది
తను చేయని తప్పుకు
భరిస్తున్న శిక్షను తీసివేయమని

మనసుకు మానసిక రోగమేదో సోకి
మతి తనకు మైమరపు పరదా వేసి
ఒంటికంటుకున్ననా ప్రేమ లతలన్నీ
ఒక్కొక్కటిగా తొలగిస్తున్నప్పుడు
నేను గుర్తురాకుండా
కాలం ఏదో మాయే చేసిందని
వాపోతుంటే చూడలేక చూస్తూ

దొంగ స్నేహాల వలలో తెలియక చిక్కుకున్నా
జారిపడే బండ మీద నడవద్దని చెప్పినా
వినకుండా
ఎక్కడెక్కడ ఎవరి వెనకో ఎగిరెగిరి వచ్చిన
తూనిగలా
దొంగల చేతిలో చిక్కి సర్వం కోల్పోయిన
బాటసారిలా
ఇంతకాలం తెలియని నా విలువ
ఇప్పుడే తెలిసోచ్చిందట

ఒప్పుకోనా ఒద్దా ?
ఎంగిలి తేనె స్వీకరించే
సహృదయం ఉందని, మహాత్ముడనీ పేరొద్దు !!
తనపై ప్రేమకు తన దేహం కన్నా ..
మలినంకాని మనసునే ఇమ్మని
దేవుణ్ణి కాలేను !!
ఎం చేయను ?
మామూలు మనిషినే ?





****************************************************************

13 


 
???



ప్రేమలోంచి జీవితంలోకి

నేను మగవాడనే లేత నీలి భావాన్ని
నీవు స్త్రీవనే స్వచ్ఛ ధవళ భావానికి పూర్తిగా సమర్పించాను
గరుకు చీకటి గర్భంలో ఒంటరి విత్తనంలా ముడుచుకొన్న నేను
నీ కోమల స్నేహ పరిమళం లోకి పూవులా వికసించాను

అంతులేని దయతో మనని ఒకరినొకరికి చూపిన కాలం
నాకు అర్ధం కాని వాత్సల్యంతో వేరు చేసినపుడు
పూవును మరలా విత్తనంలా మారమన్నాను
కానీ వేరు తొలగించిన బాధ ఏదో పీడకలలా ముసురుకొంది

నువ్వు రాకముందు నుండీ నాలో ఉన్న చీకటిని
నువ్వు వచ్చి వెళ్ళాక గమనించి భయపడ్డాను

పాతాళం నుండి ఎగసివచ్చిన పవిత్ర జలధార వంటి దు:ఖంలో
పసివాడిలా నేను పదేపదే స్నానం చేసినా
నీలో కరిగిన నా నీలి ఛాయ తిరిగి నన్ను చేరటానికి నిరాకరించింది
. . .
కాలం నిజంగా కరుణామయి
నా లోపలి చీకటిలో నేనెవరినో, ఎక్కడ వున్నానో
తెలియని నిద్రా గర్భావాసంలో మునిగిన రోజులలో
సన్నని కిరణం లాంటి, కొన ఊపిరి లాంటి జీవన కాంక్షని
కాలం ప్రభాత పవనంలా, అమ్మలా, మానవ హృదయాలలోని దయలా కాపాడింది

నెలల తరబడి నక్షత్రాలు నేను పలకరించకుండా తరలిపోయాక
క్రమంగా సూర్యోదయంలా, మృదువుగా జీవన స్పృహ మేలుకొంది

ఇప్పుడు చూస్తున్న జీవితం గత జీవితం కాదు
తన బూడిద లోంచి పునరుత్థానం పొందే ఏదో పురాణ పక్షిలా
నా కలల, భయాల భస్మం లోంచి పునరుత్థానం పొందిన సరిక్రొత్త జీవితం

తన మరణాన్ని నవ్వుతూ పలకరించి వచ్చినవాడిలా
క్షణ క్షణమూ సాహసంతో, ఉత్సాహంతో పరవళ్ళు త్రొక్కే జీవితం

ఇప్పుడు నేను పురుషుడిని కాదు, స్త్రీనీ కాదు
నేను మానవుడినీ, మరే ప్రాణినీ కాదు
ఎ భావాల మేఘాలూ లేని స్వచ్ఛ వినీల గగనాన్ని, నేను స్వచ్ఛమైన జీవితాన్ని
. . .
నువ్వు వెళ్ళేటపుడు నీ నన్ను జాగ్రత్తగా గుర్తుంచుకొమ్మని
పసివాడిలా పదే పదే చెప్పానని జ్ఞాపకం
నీ జ్ఞాపకాలు నా ముందు నిలిచినపుడు నా పెదాలపై దయగా చిరునవ్వు మెరుస్తుంది

ఇప్పుడు నువ్వు నాకు దూరంగా లేవు
నువ్వు దగ్గర ఉన్న రోజుల్లో మన మధ్య తెలియని దూరం ఉండేది
ఇప్పుడు మన మధ్య తెలియని సాన్నిహిత్యం కనిపిస్తోంది

మన జీవితాలు ఒకటి కాలేదు కానీ మనం ఒకటే జీవితం అని తెలిసింది
అన్ని జీవితాలూ కలిసి ఒకటే జీవితమని అర్ధమైంది

ఏ బంధంలేని, ఈ అంతం లేని జీవన మైదానం లోకి
నిన్ను తీసుకు రాలేకపోయానని ఎపుడైనా అనిపించటం మినహా
నేస్తం, నేను బాగున్నాను. జీవితమంత నిండుగా, నదిలా ఉన్నాను
 
*****************************************************
 
14
 

రియాజ్ కవిత
---------------
 
 ఎగిరిపోయింది

క్షణంక్రితం ఓ కవిత మెరిసింది
తక్షణమే పదాలతో బంధించాలనుకున్నా!

ఏమయిందో ఏమో ఎటో ఎగిరిపోయింది
తక్షణమే చూశా ఎదుట నువ్వున్నావ్!!

బహుశా.. ఆకవిత నీవేనేమో?
నీకోసమే రాయాలనుకున్నానేమో??
దానికర్ధం నువ్వేనేమో?? -
 
******************************************************* 

15 
బివివి ప్రసాద్ కవిత

ఆకాశం

ఇపుడు ఆకాశం తరచూ కవిత్వమవుతోంది
సారం కనరాని ఆకాశం రసార్ణవమెలా అయిందని అతనాలోచించాడు
ఆకాశం తన ఆకాంక్షల ప్రతీకలా వుంది, తన లక్ష్యంలా వుంది

అంతస్సారానికి చెందిన అనేక భావాలకి ఆకాశం ప్రతీక
ఉద్వేగాలతో కలుషితంకాని మనస్సుకీ
అనుభవాలతో కలత చెందని మెలకువకీ
ఆలోచనల ఆటంకంలేని స్ఫురణకీ
కోరికల వెలితిలేని ఆనందానికీ
ఏ బంధం ఆపలేని స్వేచ్ఛకీ
సరిహద్దులు తెలీని విశాలత్వానికీ ప్రతీక ఆకాశం

సృష్టికి తానే కారణమై ఏమీ ఎరగనట్లుండే స్వచ్ఛతకీ
అన్నిటినీ తనలో పొదువుకొని, అన్నిటిలో ఒదిగి
ఏదీ తనది కానట్లుండే నిర్మలప్రేమకీ
ఉండీలేనట్లుండే ఉదాత్త స్వభావానికీ ఆకాశం ప్రతీక

మనం ఆకాశం పిల్లలమనీ, చిన్నచిన్న ఆకాశాలమనీ
మనని ఎప్పుడూ వదలని అమ్మలాంటి ఆకాశాన్ని
మనమే తప్పించుకొని, తప్పిపోయామనుకొని
సదా వెదుకుతూ తిరుగుతున్నామని అతను గమనించాడు

సదా మనని కలగంటుంది అమ్మ ఆకాశం
అమ్మ ముఖంలోకి చూడటంకన్నా ఆనందం ఏముందని
తన తల్లిని తనలో కనుగొనటంకన్నా అందమైన పని ఏమిటని

అతను తనలోకి తిరిగి, తన ఆకాశం కనుగొని
తన ఆకాశంలో బహుజన్మల దు:ఖంనుండి విశ్రాంతిపొంది
ఆకాశంనుండి అపుడే పుట్టిన ఆకాశంలా మళ్ళీ మనని పలకరిస్తాడు
మనలోపలి ఆకాశానికి అద్దమై మనముందు నిలుస్తాడు
 
******************************************************
 
16
 
???
 
అంతం ఎటు చివర?


1

కొన్నాళ్ళే ఇక్కడ
సాయంత్రం పుట్టే చంద్రకాంత పువ్వులా

ఇది తాత్కాలిక భూమి
ఆ తొమ్మిది నెలల తర్వాత
అంతా మనది కానిదే

మనుషులందరితో కాసేపు
తిరుపతి కొండ మీద కలిసిన యాత్రికునిలా

ఖరీదైన బంగారపు ఉంగరాలు
గింగారపు సోయగాలు
ఆనందింప చేసే అంగవస్త్రాలు
కొంతకాలమే ......బాల్యంలా
కలకాలం పొందడానికి
చంద్రున్ని కల్గిన భూమి కాదు మనం
దాని మీది పురుగులం

యవ్వనంగా
మబ్బులు పట్టిన సాయంత్రం చినుకులా
నీ నవ్వుతో
నడిచొచ్చి ఆక్రమించాక
మొత్తం బరువంతా తెల్లారినట్లు అనిపించినా
అదీ కొన్నాళ్ళే
కొంతసేపే .....

సౌందర్యం శాశ్వతమైనదేమో !...కానీ
నేను?

తడుము కుంటున్నంత సేపే స్పర్శ
ఆతర్వాతంతా ....ఊహ ,లేదంటే
ధ్యానం .

2

శరీరం లోని రసాయన పదార్థాలన్నీ చలించి
ఒక చోట కేంద్రీకృతమై
ద్రవింప చేసిన నీ
కనుచూపునొకదాన్ని గురించి
మరిగి ఆవిరౌతుంటుంది
నా శరీరానికి దూరంగా నిలబడి చూస్తూ ఉంటాను
ఐనా ఎంత సేపు ?

నా కను తెరల మీద
నిద్రపోయిన వాంఛల్ని
పిట్టల్లా లేపుతావు
కొంత తాండవం తర్వాత
మళ్లీ నా చెట్టు మీద వాలుతూనే ...

వేల నరాల నాడులు దాడులు
కొన్ని లీటర్ల ప్రేమ
విసర్జిత వాంఛలు ..ఏవైనా
పడమటి దిశకు వాలిపోతూ
ప్రశ్నిస్తాయి.

అసహ్యాన్ని కూడా కొన్ని సెకన్లు
ప్రేమించగలం ,లేదా
దుఃఖించగలం

ఉత్తేజిత కండరాల్లోని వీరత్వం కూడా
మెరుపు లాంటిదే

గమ్యమనే ఓ ప్రదేశం ఉంటుందా
దేనికైనా?

*************************************************
 
17
 
???

మిగిలి లేము!

లేచీ లేవగానే
రాత్రి బతికిన దారుల్లో
వెతుక్కుంటూ వెళ్ళా-

జీవితాన్ని వెక్కిరించే వేదాంతం
వైఫల్యాల గెలుపు విశ్లేషణలూ
పరస్పర నిందారోపణల కొసన
విరబూసిన నవ్వులూ
అప్పుడు మాత్రమే విప్పగలిగే
చీకటి హృదయపు ముడులూ-

బాధాసప్తశతుల్ని బండకేసి బాదిన గుర్తులూ
ఏదేమైనా మనమే విజేతలమని
మనకు మనమే ప్రకటించుకున్న క్షణాలూ-

తమ్ముడూ...ఏం చేశాం మనం?
అత్యంత ప్రేమాస్పద వాతావరణంలో
సమస్త ప్రపంచాన్నీ చాప చుట్టి
బంగాళాఖాతంలో విసిరేశాం-

కానీ,
పొద్దున్నే మాత్రం ఇదిగో ఇలా
శతాబ్దాలుగా మోస్తున్న
దీనపు మొహాల్తోనే మిగిలాం!
****************************************************
18

వంశీధర్ రెడ్డి కవిత
 
* ఫింగర్ ప్రింట్స్ *

రాత్రొచ్చావా,
కల్లో కరీనాని కామిస్తుండగా,
గదిలో, మదిలో
నీ వేలిముద్రల వేడిముద్దులొదిలెళ్ళావ్ గా,

లూప్స్ ఎక్కువ, వోర్ల్స్ కంటే,
కవలలకూ ఉండవొకేముద్రలు,
యువర్ ప్రింట్స్ ఆర్ యూనిక్ ఫర్ యూ,
రాత్రి గుర్తుల్ని గుర్తుపట్టానందుకే,
రామాపితికస్ నుండి, మెట్రోసెక్సువల్ దాకా,
ఎన్ని సహస్ర సహస్ర కోట్ల గుర్తులో.

ఐతే,
వేర్వేరు ప్రింట్సేగా దశావతారాలకూ,
అందుకేనా,
చేతుల్తోనే అనుగ్రహాలు, ఆశీర్వాదాలూ,
యురేకా,
పేటెంట్ తీస్కోవాల్తొందరగా,
తెల్లారుస్తాడే తెల్లోడో లేపోతే,
సబ్ కా మాలిక్ ఏక్ కాదని,
దేవుడ్ని ఐడెంటిఫై చేస్తే నోబెలిస్తారా,
గాంధీకెందుకు రాలేదో,
సైంటిఫిక్ పోలిటిక్సా....

మానవ చరిత్రంతా వేలిముద్రల
మలుపుల వృత్తాల అవృతాల్లో నిక్షిప్తమై,
ఒక్కో మలుపు,
గతకాలపు దారిలా,
జాడ తెలీని పిచ్చాలోచన్ల ప్రతీకలుగా,

చూపుల ముద్రలుంటే బావుండు,
విషపు దృక్కులు తెలిసేట్టు,
నా వేలిముద్రలెన్నెన్ని చోట్ల ప్రభవించాయో,
దరిద్రుడా, రవికాంచని చోటూనా,
హి హి హి,
వేళ్ళు మంటల్లో తగలెడ్తూ,
సాక్షాలు చెరుపుతూ
నాలో మనిషి !
 
********************************************************
19

???




ద విల్లేజ్ పేరడైజ్ ‘ లాస్ట్ '
------------------------

అలసి సొలసిన రేయి కునుకుదీద్దామంటె 
జడి వాన సడి వోలె జ్ఞాపకపు తెరలు

ఆ గాలి, ఆ గడ్డి, ఆ మట్టి వాసనలు
ఆ పైరు పాయల్లో కాలువల గల గలలు

పేరు పేరున పిలుచే ఊర పిచ్చుక జతలు
అరచేతిలో జారె ఆరుద్ర పురుగులు

కళ్ళు మూసుకుంటె కదలాడె ఒయ్యారి
వడ్రంగి బ్రహ్మయ్య చేత చెక్కిన బొమ్మ

బొండు మల్లెల తోట గండు కోయిల పాట
జాబిల్లి వెలుగుల్లో శివుని గుడి కోనేరు

స్నేహితుల ముచ్చట్లు, కొంటె వేషాలు
అమ్మ చేతి వంట, ఆ గడ్డ పెరుగు

ఆగవీ తలపులు గడి లేని తలుపులు
పిండేసినట్టయ్యె నా బేల గుండె

పారేసుకుంటినా చే జారి పోయెనా
జన్మభూమి లోని స్వర్గంపు బతుకు

-ఆర్. ఆర్. కే. మూర్తి, 
 
 
****************************************************************
 
20
 
కట్టా శ్రీనివాస్

ఆఖరి వాక్యం!
-------------

మిగల్లేదు
ఏ ఒక్క ఆశా..!

హృదయం లయ తప్పడం
ఇక్కడొక శాపం-
తీపి కలలకు వశమవ్వడం
నిజంగానే నేరం-
అశ్రువొక్కటి రాల్చడం
చెలామణిలో ఉన్న చేతకానితం-

ఇక నువ్వు ఏ ధైర్యంతో బతుకుతావు?!
ఏ నమ్మకంతో నడుస్తావు?!
ఏ దేహంతో? ఏ దాహంతో?
విరిగిన ఏ మనసు ముక్కతో?!

చావుకీ, బతుక్కీ పెద్దగా తేడా తెలీని
సందిగ్ధ సందర్భాలను మోసుకుంటూ
ఇక నువ్వు ఎటువేపుగా ప్రయాణిస్తావ్?!
 
*************************************************************
 

21
 
???

రిపేర్
------

ముందు చేయగలవా లేదా
చూడు ...

అక్కడ విచ్ఛిన్నమైనవో
శిధిలమైనవో
పెచ్చులుగా రాలినవో
తనంత తానుగా వదిలి వెల్లిపోయినవో
ఎవరైనా తగిలి కూలి పోయినవో
మాటకు మసిబారినవో
నడుస్తూ నడుస్తూ విడిపోయినవో
చూపులతో సగం కాలినవో...

ఇంకా...ఇంకా...
నమ్మకం రాలిపోయినవో
ఇచ్ఛ వాలిపోయినవో ఉంటాయి .

ఎలా చేస్తావో
ఎలా కలుపుతావో
కలిసే గుణమే లేని ఛిద్రాలని
ఎలా పూరిస్తావో...

మళ్లీ అందులోంచి ఒక వసంతం చూడాలి
బాల్యపు దూది చంద్రున్ని చూడాలి
ఒక యవ్వనపు చిగుళ్ళు చూడాలి
ఓ కసితనపు కాంక్ష చూడాలి
నునుపు వాంఛల్ని చూడాలి

ఎలా కూడ బెడతావో
ఎలా అతుకుబెడతావో
మళ్లీ దాంట్లోంచి వశం కాని ప్రేమని చూడాలి
దూప తీర్చే ఆలింగనం పొందాలి
నిలువెల్లా వెలిగించే జ్వాల కావాలి
ఎలా...ఎలా...

నిజంగా
దాని కిచ కిచలు మళ్లీ వినిపించగలవా
మళ్లీ దాని రాగాలతో కడిగేయగలవా
మళ్లీ ఈ ప్రపంచాన్ని అనుభవం గల
గాయపడ్డ కాన్దిశీకునిగా దర్శించగలనా
మళ్లీ ప్రసాదానికి లైన్లో నిలబెట్ట గలవా

అసలు వీలౌతుందా
సూచాయగా ఓ నిర్ధారనకు రా
కొంచేమేమైనా తెలుస్తుందా...
చేయగలవా...
గలవా...

చేస్తూ చేస్తూ
నువు కూలిపోగలవేమో
చూడు .


******************************************************* 
 
22
 
???
 
ఆ జ్ఞాపకాలు
___________

ఊగిసలాడుతున్న ఆ జ్ఞాపకాలు
ఊడిపడిపోతే ఎంత బాగుండు!

రెప్పల్లో ఇరుక్కున్న ఆ నలుసు
ఒకేసారి
కన్నీటిలో కొట్టుకుపోతే ఎంత బాగుండు!

ఎన్నిసార్లు అనుకుంటామో,
ఆ క్షణాలు తిరిగి రాయగలిగితే చాలని!
ఆ అనుభవాల శకలాలు అసలేం మిగలనట్టు
శిధిలమయితే చాలని!

తడమకపోయినా తట్టిలేపుతున్న ఆ తలంపులు
పాతుకుపోయిన ఆ గురుతులు
వెంటాడుతూనే ఉంటాయి...
 
***************************************************
 
23 
 
???

ఏదైతే దృఢంగా భావిస్తామో ,కలగంటామో
దాని లోపల వాస్తవం మిణుకే అయినప్పుడు

మానవత్వం పెచ్చులు పెచ్చులుగా
ముసురులో తడిసిన మట్టిల్లై
సారం లేని భవంతులై
విలువలు కరిగి పోయే అలజడి

కరచాలనాల మధ్య కనుమరుగౌతున్న స్పర్శ
అప్పటికి అనుబంధం నటిస్తే చాలు

నిరాశ వెనుక వ్యామోహం ఓ మెట్టు పైన
వెలితి వెనుక నిరూపణకు రాని ప్రేమ

ముసుగుల కిందే సర్వ కలాపాలు
కోల్పోతున్న విలువ గురించి కలవరం
నిర్భంద సంబంధాల వెనుక నీడ
మనుషుల మధ్య గల పరస్పర హింస
 
********************************************************* 

24
 
పి.రామకృష్ణ
 
పారంపర్యం
_______

తన చుట్టూ
మూగిన మనవళ్ళతో-
ఓ ముసలవ్వ ఇలా అంది.
ఇవ్వడానికి ఇంకా మిగిలేం వుంది నాదగ్గర?
అంతా రాసిచ్చేసాను కదా..??

వాళ్ళన్నారు

నువ్వు పడుకున్న మంచం వుంది.
ఖాళీ చేసావంటే-
నాన్న గారిని పడుకోబెట్టాలి కదా..?!!


*************************************************

25
 
???

ఒక చిన్ని హృదయంతో..!
_________________

నువు వస్తే మంచిది;
రాకపోయినా పర్లేదు-
సమస్యల్లా ఏదీ తేల్చకపోవడంతోనే!

వస్తే ఏం చేస్తావని అడుగుతావు
ప్రశ్న చిన్నదే;
ప్రహేళిక నా జీవితానికి-

చెట్టులెక్కడం
చిటారు కొమ్మన మిఠాయి పొట్లాలు
తేవడం చేతకాదు నిజమే-
మాయలేడిని వొడిసిపట్టే ధీరోదాత్తత
మచ్చుకైనా లేకపోవడం విషాదమే-

ఏం చేస్తాన్నేను..?!

ఏడుస్తానేమో నువు కనిపించిన ఆనందంలో-
చేష్టలుడిగిపోయి కుప్పకూలుతానేమో సంతోషంలో-
విస్మయ విభ్రాంతిలో మూర్చనలు పోతానేమో-
అవును...
మోక్షం దొరికిన మోదంతో
మెల్లగా నీవేపు అడుగులు వేయడం తప్ప
ఏం చేయగలన్నేను?!
 
**************************************************** 

26


???

‎* అసలు విష(య)0 *
-----------------------

"ఏమైందే, గట్ల దగ్గవడ్తివి,
రెణ్ణెల్ల మాపు
పట్నమోల్లొచ్చిన్నప్పటిసంది" మల్లవ్వ, కూతుర్తో,

-"ఆల్లు మందుల కంపెనోల్లంటనే,
పైసలిస్తం,పరీక్షలకు రక్తమీమంటే ఇచ్చినం,
మస్తు మంది ఇచ్చిన్రు,అందర్కి నాలెక్కనే అవవట్టె,
మాపటికి రాజి గాడు రక్తం సుత కక్కుకున్నాడు,
గాభరై చెప్పకున్నడు నీకు"

"పాణం మీద్కి తెచ్చుకున్నారే,పైసలాశకు
డాక్టర్ కాడ్కిపోదాం పా,
ఏమైతదో ఏమో, రామ శంకరా,
గాశారం బాలేక గట్క తిని బతికిటోల్లమైతిమి"

" ఫికర్ చేయక్ మల్లవ్వా,
మేమ్ లేమా ఏమన్నైతే,
జెర్రంత పెయ్యి గరమైంది, సలిజ్వరమోలే,
గీ మందులేపియ్యి,మల్లొచ్చే బేస్తారం రాండ్రి,
తగ్గకపోతే రక్తపరిక్ష చేద్దాం" ఊరంతటికీ ఒకే డాక్టర్

గట్లనే,నీ కాల్మొక్త బిడ్డా,
సల్లగుండు, పొయ్యొత్తునా నేను,

"నమస్తే సార్,
పన్జేస్తుంది మనమెక్కించిన వైరస్,
ఇమ్మనట్టే మీ కంపెనీ మందులిచ్చినా,
వారమాగి చెప్తా రిసల్ట్,
మరి, నేనడిగింది...."

"నువ్వేంటి చెప్పేది,
వాళ్ళు చస్తే మందు పనిచేయనట్టే,
పనయ్యాకే నువ్వడిగిందీ" ఫార్మా కంపెనీ సి.ఇ.ఓ,

"ఓరి యాది,నర్సి, మల్లేశూ
డాక్టర్ సాబ్ మందులిత్తాండు రోగానికి,
తెచ్చుకోపోర్రి, పైలముల్లో"
డాక్టర్ని దేవుడనుకునే దరిద్రలక్ష్మి.....
 
******************************************************* 

27
 
 
???
 
లేవండిక
మరీ ఇంత మొద్దునిద్రా..!
మొసలి పట్టిన ఏనుగుకోసం
చటాలున పరుగిత్తుకొచ్చినాయన
స్వంత భార్య భూమిలోకి ఇంకిపోతుంటే
చేష్టలుడిగి చూసినట్లు

నిద్రలో వున్నారా ?
అసలు స్ప్రహలోనే లేరా
లేవండి స్వామీ ఇకనేనా..!

రోజుకొక్క ప్రాణిని ఆహారంగా కోరిన
బకాసురినిలా
కొండచిలువ నోటితో
చీకటి పొట్టను తెరిచిపెట్టుకుని
ఊపిరాడనివ్వ కుండా మింగేస్తుంటే.
తల్లుల కన్నీటి వరద తల పక్కగా
తగలటం లేదా..

అయ్యో...
మత్తుగుళికేమైనా మింగారా ఏమిటి ?

ఆడే పాడే ప్రాణాల్ని
గుటుక్కున మింగుతోంది మహి.
నాళాల నాలుకతో
పనివాళ్ళను సైతం చప్పరిస్తోంది.
నగరం నీటిమడుగైనప్పుడు
అడుగడుగు మందుపాతరలా
మొసలి నోటి నవీన తరం
గజేంద్రపాదాలను పట్టేందుకు
వేచివున్నాయి.

మగత నిద్రలో
మొసలి కన్నీరు అక్కర్లేదు కానీ
కళ్లునులుముకుని లెగరా నాయనా.
 
************************************************** 

28
 
 
???


ఆకాశపు గదిలో ఆమె,
నేలంతా పరుచుకుని అతను,
కలవరపెట్టే ఖాలీల్లోకి వ్యాపించుకుంటు
రాత్రంతా ఏదో ప్రయత్నిస్తున్నారు.

కాంతిప్రవాహాలు ఆగిన కళ్ళతో ఆమె
రాగవాహినులు ఎండిన గొంతుతో అతను
రహస్యంగా,నిశ్శబ్ధంగా,నిరాశగా
రాత్రంతా ఏదో మాట్లాడుకుంటున్నారు.

మధురోహల్లో బోల్తాపడ్డ ప్రాణం ఒకటి
మత్తులోంచి,నొప్పితో నిదురలేసి
అమ్మ అని పిలుస్తు,అస్పష్టంగా ఏడుస్తు
మళ్ళీ మత్తులోకి జారుకుంది.

పసితనపు పరిమళాలు నింపుకున్న చీకటి
ప్రపంచాన్ని,పరిసరాల్ని అల్లుకుపోయింది.
కని,పెంచి, కౌగించుకోలేని మమకారం
దీపాన్ని చూస్తూ,కోపంగా నిదురపోయింది.

అది అనుభవాన్ని పరిహసించే జ్ఞానమని,
నన్నే నాకు కొత్తగా చూపిస్తోందని,
ఆ రాత్రంతా నాకు నిదురపట్టలేదని,
వేరే చెప్పడం అవసరమంటావా?
 
***********************************************************************
 
 29
 
 

నంద కిషోర్ కవిత

 

 

మోడువారేకంటే ఒక్క క్షణం ముందు

 

 

 

ఇక -బతుకులో మిగిలిన ఆఖరిఘడియల్లోపే
తమ్ములకు ఓసారి పిలుపునివ్వాలి.
తలవంచి తల్లులని వేడుకోవాలి.
స్వరాజ్యం ముచ్చట్ల ఊసులడగాలి.
స్వతంత్రం ఎందుకో చెప్పుకోవాలి.

ప్రశ్నకై దొరికిన ఆఖరి అవకాశంలో
అన్నలని ఒకసారి కలుసుకోవాలి.
విప్లవం ఎందుకో తెలుసుకోవాలి.
సమాధానంకోసం వేచిచూడాలి.
రాకుంటే తప్పులని ఒప్పుకోవాలి.

ఇక-ఎడారులై పారు చివరినిమిషం ముందు
గోదాట్ని కళ్ళారా చూసుకోవాలి.
కన్నీట్తో కొంతైనా నింపుకోవాలి.
కృష్ణలో ఒకసారి తానమాడాలి.
దేహాన్ని నునుపుగా చేసుకోవాలి.

వాగునై వలపోవు తడిలేని వర్షంలో
నెర్రెలకి నిండుగా ముద్దుపెట్టాలి.
పెదాల్తో కొద్దిగా అదును చేయాలి.
చెలకల్ని ఒకసారి దున్ని చూడాలి.
మొలక ఎందుకురాదో అడిగి చూడాలి.

ఇక-మోడువారేకంటే ఒక్క క్షణం ముందు
మేఘాన్ని వేళ్ళతో తాకి మురవాలి
చినుకుల్ని ఓ సారి పలకరించాలి.
నిండుగా రైతుల్ని తడిమి చూడాలి
ఎండల్ని వానల్ని ఒకటి చేయాలి.

ఆకుల రాలేటి చివరి శిశిరంలోన
గొంతెత్తి ఒకసారి పాటపాడాలి
గువ్వలా ఒకసారి ఎగిరిచూడాలి.
గుండెలో బాధల్ని చంపిచూడాలి.
 
******************************************************************* 
 
30 

నంద కిషోర్ కవిత

నా పేరు తెలంగాన

నా పేరు తెలంగాన
నా ఇల్లు బందిఖాన
ఎన్నేండ్లనుండో నేను
బానిసగ బతుకుతున్న.
విడిపోకపోతే నేనుఇక విడుదలెప్పుడయితా?
బలిదానాలను చూస్తు
బతుకెట్ల సాగదీస్త?
కండ్లల్ల కరీంనగరు
రాజన్న కోడె పొగరు
ఆంధ్రోడు దుమ్ము కొడితె
నే కండ్లు మూసుకున్న
మానేరులోన మునిగి
మనసంత తేటజేసి
తిరగబడకపోతే
రేపనేదెట్లసూస్త?

భుజాల రంగరెడ్డి
శ్రమజీవి బతుకు నాది
రాయంటి నేలలోన
రతనాల పంట నేను.
పరాయి ప్రాంతపోడు
కిరాయికంటు వచ్చి
నా నెత్తిమీదికెక్కి
నా మెదడె తింటుండు.
మెడలాగ భాగ్యనగరి
కుతికంత వలసవాదం
ఆ పరమశివుడు దాచె
నా కర్మమేమొ మింగె
అభివృద్ది పేరుజెపుతు
అడ్డుతగిలెటోడు
అసలేది నీది లేదు
ఇది నాదే అంటుండు.

చెంపల్ల పాలమూరు
క్రిష్ణమ్మ జాలువారు
ఎగసెగసె క్రిష్ణ ఉన్న
నేనెండిపోత ఉన్న
నా అన్నదమ్ములంత
దుబాయి వలసబోతె
నెర్రెల్ల నడుసుకుంట
నే పగిలిపోతు ఉన్న.
చేతుల్లో మెతుకు దుర్గం
చేనంత ఎండిపాయె
చేవెంత ఉంటె ఏంది
బీళ్ళన్ని నోళ్ళు తెరిచె
ఆడీడ అగ్గిపెడుతు
ఆడీడు చితిని పేర్చి
ఓదార్పు నటిస్తుంటే
నే మండిపోతు ఉన్న.

నడుమంత నల్లగొండ
ఎన్నెన్నొ గిరులు సిరులు
ఫ్లోరైడు నీళ్ళు తాగి
నా నడుం బొక్కలిరిగె
యీపంత ఇంద్రవెల్లి
ఇంకెందుకురా లొల్లి
అద్దొద్ధు అంటు ఉన్న
బరువేస్తే మీద ఎట్ల?
కడుపంత అదిలబాదు
ఊకునుట వల్లకాదు
అడివంత నాకు ఎరుకె
అది దోచినోడు ఎరుకె
ఆ సదువులమ్మ సాక్షి
గోదారి తల్లి సాక్షి
ఆ బొగ్గుబాయికాడ
వానిబొంద నేనుదీస్తా..

గుండెల్లో ఓరుగల్లు
రకతంల విప్లవాలు
ఉరికురికె రక్తమున్న
ఇన్నేండ్లు ఊరుకున్న..
మురికంత నాకు ఎక్కి
పాణాలుదీస్త ఉంటె
సమ్మక్క మీద ఆన
సావైన లెక్కజెయ్య
అడవుల్ల నడుస్తుంటె
కాళ్ళల్ల ఖమ్మముండె
అడుగేసి కదులుతుంటే
పులకింత కలుగుతుండె
ఆ రోజులిప్పుడేవి?
ఆ గానమిప్పుడేది?
నా ఎర్ర జెండ ఏది?
నా కర్ర తుపాకేది?
కుడిపక్క ఆంధ్ర మేకు
అరికాళ్ళ గుచ్చెనాకు..
రామయ్య నడిచెనిచట
రాయయ్యి సూడడేమి?

నా పేరు తెలంగాన
నా ఇల్లు బందిఖాన
ఎన్నేండ్లనుండో నేను
బానిసగ బతుకుతున్న.
విడిపోకపోతే నేను
ఇక విడుదలెప్పుడయితా?
బలిదానాలను చూస్తు..
బతుకెట్ల సాగదీస్త?

(మరోసారి తెలంగాన వ్యతిరేఖగానం వినిపిస్తున్న నేపధ్యంలో..

*బాధలో,కోపంలో సమూహ నామం వాడడం తెలంగానలో కనిపిస్తుంది.ఆంధ్రోడు అన్నది పెత్తందార్లని ఉద్దేశ్యించినదేగాని,ప్రజలందరినీగాదు.)