పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, ఆగస్టు 2012, ఆదివారం

కిరణ్ గాలి || యువరానర్ ||


మి లార్డ్

అర్దనగ్న న్యాయదేవత
ఆఖరి అఛ్ఛాదనాన్ని తీసేసి
పలుకుబడి పక్కలొ దూరి
పచ్చిగా కులుకుతుంది
పతనానికి పరాకాష్ట లేదని
పక్కాగా రుజువయ్యింది

నల్ల గౌను, తెల్ల కోటు
ఎర్ర టోపి, గంజి ఖద్దరు
తక్కెటలో తీర్పుకి వెలకడుతున్నాయి
కోర్టులు వ్యభిచార గుహాలయ్యాయి

పచ్చ నోటు కనబడితె
న్యాయమిప్పుడు
పల్లికిలిస్తుంది
పెదవి కొరికి
పైట సవరిస్తుంది

***********************

అబ్జక్షన్ మి లార్డ్

నేరం నిర్లజ్జగా చేసె నైతిక హక్కుని
వ్యవస్తే మనకిచ్చింది
ఏ ఘొరం చేసినా శిక్ష పడని
స్వేచ్చను రాజకీయం తెచ్చింది

నిజానికిప్పుడు
అవిభాజ్య భారతావనిలో
వ్యాజ్యం వాణిజ్యమయ్యింది

అన్నీ మూసుకొని
నీతి
బల్లమీద కోతైనప్పుడు
ధర్మస్థానాలలో
న్యాయం స్థనాలతో
రమించినా
తప్పు లేదు

శిక్ష వున్నా, సాక్షం వుండదు
సాక్షమున్నా శిక్ష లేదు

(అబ్జక్షన్ సస్టైండ్)

***********************

కవీ,

ఈ దేశ న్యాయ వ్య(అ)వస్తని
చూసి విస్మయించకు
వివస్త్రని చేసినా సరె విమర్శించకు
కోర్టు దిక్కారణా నేరం అమలులో వుందని
విస్మరించకు

ప్రొసీడ్ ఫర్దర్

***********************

మిస్టర్ జస్టిస్

నింద పడ్డ నిజం తలదించుకొని
బోనులో నిలబడింది
బరితెగించిన అబద్దం
బల్ల గుద్ది మరీ వాదిస్తుంది
అసత్యమే సత్యమై ప్రతిధ్వనిస్తుంది

కోర్టు కోర్టుకి
న్యాయం నిర్వచనం మారుతుంది
నీతికి మూలశంకమై ముక్కుతుంది
అవినీతికి విరొచనమై అసహ్యాం కారుతుంది

***********************

అబ్జక్షన్ మి లార్డ్

నిజనిర్ధారణకాని నిందితులు
నిరీక్షించే బాధితులెందరుంటెనేం
వంద దోషులు తప్పించుకునెలా
ఒక్క నిర్దొషినీ పట్టకోండని
మన రాజ్యాంగమె చెప్పింది

ఆర్ధికనేరాలకేగాని
ఆకలి తప్పుకు ఇమ్మ్యూనిటీ లేదని
స్వరాజ్యం తేల్చి చూపింది

చుట్టాలకెగా చట్టంలో సవరణలు
తదనుగునంగ వివరణలు
పదవి విరమణలు
ఎఫైయార్ రాసెలోగ
బైల్ మంజురయ్యె
ముందొస్తు బందొబస్తులు

(అబ్జక్షన్ సస్టైండ్)

***********************
కవీ,

వ్యర్ధ వాదాలతొ
విలువైన పాఠకుల కాలాన్ని
వృధా చెయ్యకు

ప్లీజ్ కం టు ద పాయింట్
క్విక్లి

***********************
యువరానర్

కన్న కూతురి శీలాన్ని కాపాడక పోగా
పడుపు వృత్తిలోకి దింపిన
ఈ దేశాన్ని ఉరితీయండి

ఉరంటె అలాంటిలాంటి ఉరికాదు

ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై, ఉపిరితిత్తులు బద్దలయ్యెదాక
మెడ ఎముక విరిగి, మెదడు చిట్లె దాక
కనుగుడ్లు ఉబ్బి పగిలి, నాలుక బయట పడెదాక
కాళ్ళు గిలగిలా కొట్టుకొని కళేబరం అయ్యెదాక
ఉరితీయండి

దయచేసి
నిజాన్ని నిజంగా రక్షించండి

ప్లీజ్ యువరానర్
నా కన్నిళ్ళని చిలికి చిలికి
కవిత్వంగా
కాగితం మీదకు ఒలికించి
మరీ వేడుకుంటున్నాను

దేశాన్ని ఉరితీయండి
దాని శవంపై బట్టతొ
న్యాయం మానాన్ని కాపాడండి

***********************

ఆర్డర్ ఆర్డర్, వెర్డిక్ట్ మర్డర్
ధర్మాసనం శిర్షాసనం వేసింది

కేసు పుర్వాపరాలూ పరిశీలించిన పిమ్మట
SexSin 101, 420, 786 ల కింద

విక్టింస్ ఆర్ కన్విక్టెడ్, క్రిమినల్స్ అక్విటెడ్
లెట్ ట్రూత్ బి బూరిడ్ & జుస్టిస్ డేడ్

***********************

కవిగాడి మీద

సెడిషన్ చార్జెస్ ఫైల్ చెయ్యండి
ఎముకల్లొ సున్నంలేకుండ కొట్టండి
మళ్ళి న్యాయం ధర్మం అని అరవకుండా
వాడి కలంతోనె వాడి కంఠనరాలు తెంపండి

సత్యం వధ
ధర్మం చెర
సర్వే జనా సుఖినొభవంతు

కేస్ డిస్మిస్.


*12-08-2012

Prav Veen || ఏం దొంగిలించగలం ||


ఎవరి నుండి ఎవరు
ఏం దొంగిలించగలరు

ఎవరి హృదయంలోనైన దాగి వున్న
ఒక్క విషయమైనా
దొంగిలించగలిగామా
ఎప్పుడైనా

ఎవరి కన్నులనుంచైనా
కాస్తంత చల్లని చూపును
దొంగిలించగలిగామా
ఎప్పుడైనా

ఎవరి మాటలనుంచైనా
కాస్తంత మంచిని
దొంగిలించగలిగామా
ఎప్పుడైనా

లేదు
ఎవరి నుంచి ఎవరు
ఏది దొంగిలించలేరు
నిజంగా దొంగిలించబడ్డవన్ని
ఎదుటి వ్యక్తులు కోల్పొయినవి కావు


నిజంగా
దొంగిలించవలసివస్తే
హృదయాలను దొంగిలించాలి
కాస్తంత ప్రేమను
అందరికి పంచాలి


నిజంగా
దొంగిలించవలసివస్తే
ధాన్యపు రాసులను దొంగిలించాలి
అన్నార్థుల కడుపుకు పంచాలి


నిజంగా
దొంగిలించవలసివస్తే
కాసిన్ని రాళ్ళను దొంగిలించాలి
వాటితో
భూర్జువా కోటలను ధ్వంసంచేయాలి.
*12-08-2012

క్రాంతి శ్రీనివాసరావు || ఏడ్చిన నాన్న కళ్ళు ||


అమ్మా నాన్న వెక్కి వెక్కి ఎడుస్తున్నారు
వూళ్ళో జనమంతా ఎడ్లకొట్టం ముందు మూగి మాట్లాడుతుంది
పొద్దునార్పిన పొయ్యు మళ్ళీ వెలిగించలేదు

ఏడేళ్ళు పనిజేసి ఎత్తుబడి మెత్తబడ్డప్పుడు
నాన్న పెద్దెద్దును ప్రతిరోజు పొద్దిన్నే
కర్రలతో లేపి కడిగేవారు
గడ్డిని పేర్చి పక్కమార్చే వారు

ఎత్తుపీటేసుకొని ఎప్పుడూ పక్కనే కూర్చునేవాడు
కాకులకు కాపలా కాస్తూ
పుండు బడ్డచోట పొడుస్తాయేమోనని

ఎందరు పాలేర్లున్నా తన చేతుల్తో
తానే దానా తినిపించేవాడు

గంగడోలును గోకి
గంపెడు ప్రేమను పంచేవాడు

వలపటయునా దాపటయునా
ఒకేలా పనిచేస్తుందని
వచ్చే పోయేవాళ్ళకు
వాశ్చల్యంతో చెప్పే వాడు

నాన్న అమ్మా పొద్దున్నుంచ్చి ఎడుస్తూనే ఉన్నారు
పెద్దెద్దు చనిపోయుందని వోదార్చేవాళ్ళు వోదారుస్తూనే వున్నారు

నాగా పెట్టకుండా నాగలి దున్నిందని
నాతో సమానంగా నా సంసారం లాగిందని
తనమాట వినగానే తనంత తానే కాణీ మెడకెత్తుకొవటం
గుర్తు తెచ్చుకొని గొంతు పూడుకు పోతున్న నాన మాటలు వినిపిస్తూనే వున్నాయు


పసుపూ కుంకుమ చల్లి ఊరంతా ఊరేగించి
ఉప్పుపాతరేస్తున్నప్పుడు
ఏడ్చి ఏడ్చి చితనిప్పు లయున
నాన్న కళ్ళు నాకింకా గుర్తే

అనుబందాలు అరుదవుతున్న సందర్భంలో
ఏడ్చిన నాన్న కళ్ళు ఏకొందరికన్నా ఇంగిత మిస్తే బాగు*12-08-2012

పి.రామకృష్ణ || క్యూట్ రెసిపి ||


ముందుగా కాలాన్ని సెకన్లుగా
ముక్కలు చేసి పెట్టుకోండి.
చిలకపచ్చ రంగు ఆకుల్ని-
మెత్తగా రుబ్బుకుని,
చీరగా సిద్దం చేసుకున్నాం కదా?

మెమోరికార్డ్ లోని
మోహనం
మెరిసేదాకా డెవలపర్లో
ముంచి వుంచాలి.

ముఖం పైకి వెన్నెల వెనిగర్,
పెదాలపైకి చిర్నవ్వు షుగర్.

వుడుకుతున్న వయసుమీద
రుచి కోసం
కొద్దిగా
వసంతాన్ని చల్లుకోండి.

సోయగాల సూప్ కి
కాస్తంత సోయాసాస్.
కుందనాల బొమ్మకు
కుంకుమ పూలతో గార్నిష్.

కుక్కర్ కోయిల్లా
పిలిచేదాకా ఆగండి.

బ్యాక్ టు ఫ్యూచర్.
గడియారం పదేళ్ళు
వెనక్కు తిరిగేదాకా వేచి చూడండి.

పరువపు పళ్ళెంలోకి
వడ్డించుకున్న వేడి వేడి
క్యూట్ రెసిపి
రెడీ ఐంది.
కళ్ళారా ఆరగించండి.*12-08-2012

పులిపాటి గురుస్వామి || స్పర్శ కల్గించే ఈ ఉదయం ||


మనసు మీద
కురుస్తున్న వాసన

ఆ మెత్తెక్కిన గాలి పని అంతేగా
నిలవనియ్యదు
నీరసపడనియ్యదు

చెదలు పట్టిన కారణాలకిక ముఖం
లేదు

అచ్చం చీకటిని
అచ్చం వెలుతురును
భరించటం సాధ్యమయే పనేనా?

ముల్లుకు ప్రేమించే గుణం లేదని
ఎలా నిర్దారించగలరు ?

పండించుకోము
ఆనందాన్ని పంచుకోము
వీధుల్లో నిలబడి విషాదాన్ని కూడా
ధైర్యంగా ధరించలేము

మనుషుల చుట్టూ ఉండే
కాంపౌండ్ వాల్స్ దుర్భేధ్యాలనే
పునాదిలోని బాధ

పీడించేవి అదుపాజ్ఞలేనని
ఇప్పటికైనా తెలుసుకున్నాను

శాస్త్రం ప్రకారమో
సిద్ధాంతాల ప్రకారమో
కళ్ళల్లోకి చూసుకుని
రక్తం లో కలుస్తారా !నిజమేనా!

అనుభవం కల్గిన చూపుడువేలు
అవసరమే.*12-08-2012

గాజులపల్లి || చైతన్య కవనం ||


నిస్సత్తువగా దాక్కోకు
నిజాయితీగా ముందుకురా
నిర్మొహమాటం నీలోఉంటే
నింగికి ఎగసే అలవైరా
నిస్సహాయంగా నిలుచోకు
మబ్బును తరిమే ఉరుమైరా
నిబద్ధతంటూ నీలోఉంటే
నియంతలాగా నిలబడురా

చావు బ్రతుకులు రెండే రెండు
చస్తూ బ్రతుకడమెందుకురా
సవ్వాల్ చేసే సత్తా ఉంటే
విజేతలాగా ముందుకురా

సమరానికి తెరలను తీసేలోపే
సహనం కత్తులు దూసే లోపే
నీలో తెలివికి మెలుకువ తేరా
భారత జాతికి ఖ్యాతిని తేరా

కోపం నిద్దుర లేయకముందే
ద్వేషం హద్దులు దాటక ముందే
నిటలాక్షుడిలా తపస్సు చేసి
కరుణను చిలికే కవ్వం తేరా

తనకై తానుగా బ్రతికే జనాల
స్వార్ధ గుణాలను దహనం చెయ్ రా
మనలో మనమై మమతల వనమై
పెరిగే పచ్చని ఒరవడి తేరా

మేఘం ఎందుకు పరుగెడుతుందో
నింగికి కుడా తెలియదురా
నెలకి దాహం తీర్చడానికని
చివరకి చినుకే చెప్పెనురా

చూపుకు చుక్కలు రాలవని
రెప్పలు మూయడం ఎందుకు రా
అవి రేపటి ఆశల గుర్తులని
గుర్తు పెట్టుకుని అడుగెయ్ రా

ఎందుకు నిజమే నిలదీస్తుందో
నీలో నీతికి ఎరుకే రా
అందుకు బయపడి జడిసేవాడు
వానపాముకి సమానము రా

మతాలు లేని రాజ్యం మనదని
కులాలు లేని జనాలు మనమని
అనాధలంటూ ఎవరూ లేరని
నినాద ధ్వనిలా ధనించి రా రా*12-08-2012

పెరుగు రామకృష్ణ || లోలోపలికే... ||


ఎక్కడె క్కడని వెతుక్కోను
నా చిరునామాని నేను..?

ఏ తలుపు తట్టి చూసినా
గుప్పున పరాయి వాసనే

కునుకు నేను తీస్తాను
కలలు వాడు కంటాడు

పెదవి నేను విప్పితే
చిరునవ్వు మాత్రం వాడిదే

గిలకల బావిలో చేద నేను
దాహం వాడు తీర్చు కుంటాడు

చెమటలు నాకు పడుతుంటే
చిరుగాలి వాడి వైపు వీస్తుంది

తెడ్డు నేను వేస్తున్నాను
చుక్కాని వాడి చేతుల్లో వుంది

విత్తు నేను నాతుతున్నాను
ఫలాలు వాడు కోస్తున్నాడు

ప్రపంచీకరణ గొడుగు కింద
నా ఉనికి నేను కోల్పోయాక

ఇక అన్వేషణ
నా లోలోపలికే....!*12-08-2012

జగతి జగద్దాత్రి || వాన ... ||


రాత్రంతా వాన కురుస్తూనే ఉంది
గుండె ఆవరణ మంతా తడిసి ముద్దయ్యింది
కరుడు కట్టిన మేఘాలు కరిగి నీటి చుక్కలుగా కురిసాయి
ఘనీభవించిన హృది వేదన కరిగి కన్నీటి గా కురిసింది
రాత్రంతా వాన ఆగలేదు ...
అవనిని తడుపుతూనే ఉంది
కన్నీళ్ళూ ఆగలేదు చెక్కిళ్ళను తడి చేస్తూనే ఉన్నాయ్
ఒక్క చల్లని గాలి కెరటం ఎంతటి మేఘాన్నైనా కురిపిస్తుంది
ఒక్క చల్లని మాట మనసును రాగరంజితం చేస్తుంది
అయినా ఆ ఒక్క మాట కోసం ఓ మంచి మాట కోసం
ఎదురుచూస్తూనే జీవితం గడిచి పోతోంది
రాత్రంతా వాన తడుపుతూనే ఉంది
నేలని , మనసుని ...
అనునిత్యమూ ఆరాధించే ధరణి పై ఎంత కరుణ గగనానికి
అనవరతమూ అనురాగించే నా పై ఎంత కినుక ఆతనికి
అనురాగం అపహాస్యమేనా ??
రాగ సుధలు ఎండమావులేనా??
ఏమో .... ప్రేమించే మది మాత్రం తపం వీడదు
నిరీక్షించే ధాత్రి దీక్ష ఆగదు
రాత్రంతా ఆగకుండా కురుస్తూనే ఉంది వాన
పైనా ...లోనా ...ఆగలేదింకా ..*12-08-2012

శ్రీ కాంత్ కె || నీ ముఖం ||


శపిస్తున్నాను నీ ముఖాన్ని మొదటిసారిగా చూసిన ఆ క్షణాన్ని. శపిస్తున్నాను
నిన్ను చూసాక హృదయంపై ముద్రలా జ్వలిస్తూ దిగపడిన ఆ వదనాన్ని
ఇప్పటికీ తడిపివేసే ఆ చూపుల మంచుపూల శిలా రజస్సుని-

ఎందుకు చూసాను నిన్ను? చూసిన వాళ్ళని గాయపరిచే, స్మృతికి గురిచేసే నిన్ను
ఎందుకు చూసాను నిన్ను?

నిద్రిస్తున్నవాడిలోంచి ఆత్మని లాగి సర్వ ప్రపంచాలలోకి తీసుకువెళ్ళే
సర్వసుందర స్వప్నమూ నీ ముందు కొరగాదు. మెలకువలో
అలజడితో సంచరించేవాడిని దయగా పిలిచి అక్కున చేర్చుకునే
మధుజాలమూ నీ ముందు పనికి రాదు. విచ్చుకునే పూవూ, వీచే గాలీ
కమ్ముకునే కరిమబ్బూ దూసుకువచ్చే రాత్రుళ్ళూ పూలని తాకే వేళ్ళని
కొరికే ముళ్ళూ, ఇవేమీ- ఇవి ఏమీ సరి కాదు సరిపోవు నీ ముందు.

నయనాల జాలరివి నీవు. హృదయాల వేటగత్తెవి నీవు
నయనాలలోంచి శరీరాలలోకి జారి నిలువెల్లా కమ్ముకుని
సర్వ చర్యలని స్థంబింపజేసే మహా మంత్రగత్తెవి నీవు.
పరిమళాల వశీకరణం తెలిసిన మహాఅందగత్తెవు నీవు.
ఎవరిచ్చారు నీకు ఈ అ/విద్యను? నిన్ను చూసిన వాళ్ళను
అంధులను చేసే, వాళ్లకు మృత్యువును పరిచయం చేసే
మహా తాంత్రిక, ఇంద్రజాల విద్యను?

చూస్తున్నాను ఇన్నాళ్ళకు మళ్ళా, మరచిపోని మరచిపోలేని నీ ముఖాన్ని
ఈ నీరెండ గాలిలో, మత్తు కలిగించే సూర్యరశ్మిలో నిశ్శబ్ధమయ్యి
ఆకస్మికంగా మూగవాడినయ్యి, నీ వదన చేతబడికి వివశత్వానికి
లోనయ్యి చూస్తున్నాను ఇన్నాళ్ళకు మళ్ళా మరువరాని
మరుపేలేని నీ మాయా మహిమాన్విత వదన దర్పణాన్ని-

శీతాకాలపు గాలి. శీతాకాలపు రాత్రి.
సమాధుల వద్ద నీడలు వొణికి వొణికి
ప్రమిదె కాంతిని చీకటి అరచేతులతో
వేడుకుంటాయి, ప్రార్ధిస్తాయి తమని తుడిపివేయమని. యిక
.
ధూళిని రేపుకుంటూ తిరిగే గాలి, మృతుల కోరికలని
తీరని ఆశలని వారి గుసగుసలని వినిపిస్తుంది ఈవేళ:
రాలే రావి ఆకులు, తేలిపోతున్న మబ్బులు.

తీతువులా అవి? కీచురాళ్ళా అవి? హృదయంలో ధ్వనిస్తున్న
హృదయాన్ని మంచుముక్కగా మారుస్తున్న
కొమ్మల్లో కదులాడుతున్న నిశి ఆత్మలా అవి?
నేనా అది?చూడూ*12-08-2012
శపిస్తున్నాను నీ ముఖాన్ని మొదటిసారిగా చూసిన వరం అయిన ఆ క్షణాన్ని:
శపించుకుంటున్నాను నీ ముఖాన్ని మొదటిసారిగా చూసిన ఈ నయనాలని.

నిన్ను చూసాకా నిన్ను తాకాక మరణం వినా మరో మార్గం ఏముంది?

బాలు || సిటీ లైఫ్ ||

చెత్త కుప్పలను కాలుస్తుంటే
ఆ పోగలమద్య నల్లటి సూరీడు ఉదయిస్తున్నాడు
చెత్త కుప్పల దుర్గంద పరిమళాలు
కడుపులో మెలికలు పెడుతూ రోజు ప్రారంబం

బిజీబిజీ ట్రాఫిక్ మద్య
గజి బిజీ జీవితం మొదలు
చిరచిరకుగా ఆఫీసుకి అడుగులు
చిరు బుర్రులాడుతున్న పై ఆఫీసర్
బూతుల సుప్రభాతగీతాలు షురూ

గతి లేక తప్పదు అంటూ
రోజు చూసే అపరిచితులు
ఎవరికీ వారె ఒంటరై పని మొదలు

ఏకాకిలాగా మద్యన భోజనం
ఎంత మంచిగా తింటే ఏమలాభం
ఒంటరిగా తిన్న అన్నం ఒంటపట్టదు

ఐదు దాటాక
ఐదు నిముషాలు కూడా ఉండకుండా
తిరిగి సొంతగూటికి ప్రయాణం

పప్పు అన్నం వదిలి పబ్బుకి అడుగులు
చింపిరి జుట్టు
చిరిగ్గిన గ్గుడ ముక్కలు వేసుకొని
మత్తుగా, గమ్మత్తుగా, ఒళ్ళువేసే చిందులు

సూరీడు కింద జీవితం కంటే
చంద్రుడి కింద జీవితం బావుంది అంటూ
చంద్రుడికి టాటా చెపుతూ.......*12-08-2012

అవ్వారి నాగరాజు || జ్వరస్థితి ||


లోలోపల ఏమవుతుందో తెలియదు
కొన్నాళ్ళపాటా లేకుంటే కొన్ని రోజులా?

చేతనం సందిగ్ధమై ముందుకూపోకా వెనుకకూ రాకా
ఒక లోలోతులలో పొరలు పొరలుగా కాగే సన్నని మంట
దేహపు ఆవరణలో ఎవరో ఏదో వైనవైనాలుగా హడావిడీ పడుతున్నసవ్వడి

వినిపించీ వినిపించనట్టు ఒకమూల ఒక నేపథ్యానికి
ఒకింత ఓరిమితో ఒక అలవాటయిన స్థితిలో
కంగారూ కాకుండా నిర్లిప్తమూ కాకుండా
తెలియని సన్నద్ధత ఏదో కవచధారియైనిలుచునే వేళ

ఏకాంత దీపాల వెలుగులో
రణగొణ ధ్వనులను విడిచి కించిత్ కాలాతీతమై
రెండు చేతులనూ చాచీ అలసిన దేహంతో

నువు మూగన్నుగా పడుకొని
మెలకువకూ నిద్దురకూ నడుమ నేడూ రేపులలాగే
సన్నని కంచెను అల్లుతుంటావు


*12-08-2012

స్వాతీ శ్రీపాద || నిశ్శబ్దపు భ్రమ ||

ఈ నిశ్శబ్దపు భ్రమ సరిపోదు
గలగలమంటూ దొర్లిపడే
జలపాతపు మాటల ముత్యపు మూటలూ సరిపోవు
ఏమాత్రం సరిపోవు
తునకలు తునకలుగా పెళ్ళలై రాలిపడే
భావా వేశపు ముక్కలూ సరిపోవు

ఒకరి గుండె చప్పుడు మరొకరి మనసులో ప్రతిధ్వనించే
సమయాన తలవాల్చేందుకు నెలవైనవెచ్చటి అనునయం ఓదార్పు
హృదయం సౌకుమార్యంగా మారి హత్తుకునే
కౌగిలి
ఎన్ని శబ్దాలకు సాటి?
మంచు ముద్దైన శిశిరపు నడిరాతిరి
ఏకాంతపు చీకట్లలో కొంకర్లు బోయిన
సజీవత ముని వేళ్ళ సవర దీసుకుంటూ
గతాని కూర్చి పేర్చి
ఆలోచనల తాకిడి చిరు సెగలో
చలికాచుకుంటూ..
పెదవి కదలకున్నా
ఉధృతంగా పొంగి వచ్చే వరద భీబత్సపు
వెల్లువలో నిలువెల్లా మునిగి
వినిపించ్చని నిశ్శబ్ద గీతలకు
సరిగమలు కూర్చుకుంటూ...


*12-08-2012

అఫ్సర్ || An Empty Episode-2 ||

రెండో సన్నివేశం: నిశ్శబ్దాలు ఎలా పుట్టుకొస్తాయో ఎప్పుడూ పరీక్షించి చూసుకోలేదు, నువ్వు నిశ్శబ్దం అని గుండెకి అడ్డంగా చూపుడు వేలు వూపే దాకా! మౌనాన్ని క్షణాల్తో ఎందుకు కొలవకూడదో ఇప్పుడిప్పుడే కొంచెం తెలుస్తోంది, నువ్వు తెర వెనక నిస్సత్తువగా జారుకున్నాక. మౌనం సెలయేరు ఎందుకు కాదో కూడా కాస్త తెలుస్తోంది, దాని అశాంత నేత్రాల్లో నేను సమాధి అయ్యాక.

నీలోపల ఈదుతూ ఈదుతూ నేనెక్కడికి చేరానో ఇంకా చూసుకోలేదు గాని, నన్నూ నా వొంటిని నువ్వు వెయ్యి జలహస్తాల్తో చుట్టేశావని మాత్రం ఇప్పుడిప్పుడే ఇంకొంచెం తెలుస్తోంది.

1
అతి భారమయిన వొకే వొక్క వానచుక్కని మోస్తూ నీ ఆకుపచ్చ దేహం.
లోపలి దిగులు ఏదో మెరుస్తోంది దాని వొంటి మీద-నువ్వు చెప్పకపోయినా.

రాలిన ఆ క్షణాల అంచులలో
ఎన్ని మాటల ప్రవాహాల్ని నామీంచి పొంగించావో గుర్తే కానీ,
అవన్నీ కరిగిపోయాయ్ ఎటో
నాలో పరుచుకున్న ఎడారిలో -

ఈ మౌనం కాసేపే, తెలుసులే నాకు,

కానీ,
ఈ కాసేపటి మౌనాన్నే నేను మోయలేకపోయానే!?

2
ఏడుపునెవ్వరూ నయాగరాతో పోల్చలేదు, ఎందుకో?
కెరటకెరటాలుగా కేరింతలు కొట్టే దాని ముందు ప్రతిసారీ వోడిపోతాన్నేను.
అంతకంటే అమ్మ వొడి ఇంకేమీ లేదుగా!

ఈ క్షణాన కుండపోతగా కురవాలని వుంది
నువ్వు పంపిన కొన్ని మబ్బుల్ని నా తల చుట్టూ చుట్టుకొని-
వొక్క క్షణమైనా నిలిచి చూడు,
నీ చర్మం కిందనే నేనొక నెమ్మదించలేని తుపానుని.

కాసేపే అయినా నా హోరుని వినలేకపోయావే?

3
ఆ తరవాతనే కదా,
ఇద్దరి మధ్యా

4
ఈ నిశ్శబ్దం!


*12-08-2012