పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

క్రాంతి శ్రీనివాసరావు || సొంత ఇంట్లో పరాయు ||


నా మనవడు
మమ్మీ డాడీ అంటుంటే

ఇంటి ముందు దండెం పై
ఆమె మౌనం ఆరేసిందిప్పుడే

చూపుల చివర్లకు చక్రాలు తొడిగితే
ఇటు వైపే పరుగెత్తుతున్నాయు

ఆశల ఆవిరులు గాలి వీలులో వదిలి
దరిచేరేలా సరిచూసు కొంటూనే వుంది

నిశబ్దానికి గాలి పలకపై
మాటలు నేర్పుతూనేవుంది

సకల నృత్యరీతులూ కలిపి
అక్షర శరీరంతో
సంకేత భాషలో లేఖలు రాస్తూనేవుంది

వాకిలి అవతలే వుండి
లోపలికి రాలేక యాతన పడుతూనే వుంది

యాభై ఆరు కాళ్ళు లక్షణంగానే వున్నా
ఇంగ్లీషు మాటలను అరువడు క్కొని
భారంగా భావాలను మోస్తూ నడచిపోతుంది


పాత పదాలు కుబుసాల్లా విడిచి
పరాయు భాషా పదాలకు
డు ము వు లూ కట్టి
తెలుగు బిడ్డలకోసం తంటాలు పడుతూనేవుంది

ప్రాచీన భాష హోదా నిచ్చి
వృద్దాశ్రమం లో చేరుస్తారేమోనని
తెగ కంగారు పడుతూనే వుంది

నందకిషోర్ ||పునర్విమర్శ అభ్యాసం-4||


మరి-
ప్రేమసంగతో బుల్‌బుల్?
అదెందుకు దాస్తావ్?

పక్షిలా పాడగలిగినందుకు
పాడుతూ అరవగలిగినందుకు
ప్రేమించబడ్తావ్.

పువ్వుల్ని ఊహించనందుకు
వెన్నెల్ని మోహించనందుకు
ప్రేమించబడ్తావ్.

పొద్దుటి అడవిపిట్ట మొదలు
రాతిరి పెద్దపిట్టదాక
-నువ్వు ప్రేమించబడని
క్షణమంటూ ఉండదు

మాపటి కొంగలు మొదలు
చీకటి చకోరంవరకి
-మాట్లాడుకోని
సమయాలూ ఉండవు.

ఎందుకని ఎన్నడూ ఆలోచించవ్.
చెప్పేంత పిచ్చితనం దానికీ ఉండదు.
కొన్నిరోజులు బాగానే గడుస్తాయ్.
భారంగా మరికొన్ని-

ఎటెల్లేది, ఎందుకనేది
ఆలోచించని మత్తులో
పూలగాలికి తేలిపోతు
ఇంకొన్ని..

***

అప్పటివరకి అంతా మంచే-
అనుకోకుండ ఏదో చిక్కొచ్చి పడుతుంది.

ఋతువెలా మారేది తెలీదు!

ఎన్నోరోజుల ఏకాంతాన్ని
కాలరాసిన నీకు
శిక్షపడే కాలమొకటిరానేవస్తుంది.

వసంతపుకోయిల,వర్షపు చక్రవాకం
నీ గుండెలమీదుగా ఎగిరెళ్ళిపోతాయ్.
వగపు కోరికలు,వయసు నెమళ్ళు
దేహంనిండా పురివిప్పుతాయ్.

పూలగాలికి తేలిపోయిన నువ్వు
ఒక్కసారిగా- నేలకూలుతావ్.
వెన్నెల సిద్దాంతాలు రాసిపోసిన నువ్వు
చీకటి చివరంచుకి విసిరేయబడ్తావ్.

పొద్దుతిరుగుళ్ళ ప్రేమ
ఇదంతా పట్టనట్టే కనిపిస్తుంది.
కానీ,కాలానుగుణంగా చలించడం
దానికీ తప్పదని తెలుసు నీకు!

***

తర్వాతేమవుతుందో తెలుసుగా?

పక్కనే ఉండలేనందుకు
గూటిలో జాగలేనందుకు
ద్వేషించబడ్తావ్.

పువ్వుల్ని తెంపనందుకు,
వెన్నెల్ని తాకనందుకు,
ద్వేషించబడ్తావ్.

ఉన్నొక్క యవ్వనం తీరకముందే
తేలిగ్గా నీ కధ
చివరి మలుపు తిరుగుతుంది.

రెక్క పొడుగనో,ముక్కు పదుననో
కాళ్ళు కదల్లేదనో,గోర్లు పెరగలేదనో
కారణాలేవైతేనేం?

నువ్వు ద్వేషించబడ్తావ్.
నిర్ధయగా వెలివేయబడ్తావ్.

కధ ముగిసిపోతుంది!

***

బుల్‌బుల్-ఆగిపోకు..
విను..
కధలో చివరి సందేశాలు
విచిత్రంగా ఉంటాయ్.

మూడు కాలాల్ని విరిచి,
మూడు చావులకి ముద్దుపెట్టి,
మూడుముళ్ళు వద్దని,
ముసుగేసి పడుకున్న నిన్ను-

పాలపిట్ట రంగనీ,జిట్టంగి చూపనీ,
వడ్రంగి పట్టనీ,నిద్రలేపిన తను-

పగల్ని,రాత్రిని
వెన్నెల్ని,చీకటిని
నిర్లిప్తంగా నిర్ధారించి
నిశ్శేషంగా విభాగించి

వెన్నెల రహస్యం వెన్నెలకి,
చీకటి రహస్యం చీకటికి,
నిశ్శబ్ధంగా,నిజాయితీగా
నిష్కామంగా పంచమంటుంది.

ఇంకా..

నీరెండకు దాగిపోవడం పిరికితనమని
నిప్పులగాలికి ఎదురుపోవడం మగతనమని

చిరుజల్లుతో సర్దుకుంటే పాపమని
జడివానకి తడిసిపోవడం మోక్షమని

చలిగాలికి వణికిపోతే ఓటమని
చచ్చైనా గడ్డకట్టడం గెలుపని
నేర్చుకొమ్మంటుంది.

ఇంకా ఇంకా-

ఏం కావాలి నీకు?
గూడుకట్టే తెలివిలేక పదేపదే
ఎగిరిపోయే నీకు?
మోసపోయే నీ బతుక్కి?

అనుభవించు!

chintam praveen ||కాకతీయ కీర్తితోరణం||

తలెత్తకుండా ఉండలేం
తలేత్తితేగాని చూడలేం

ఆత్మగౌరవానికి వెయ్యేండ్ల సజీవసాక్ష్యం
ఈ మట్టి పోరాటానికి శిలారూపం
కాకతీయ కీర్తితోరణం

రాజులు రాజ్యాలు
మట్టిపొరల్లో సమాధి చేయబడ్డా
తలొంచుకున్నోడికి
తలెత్తడం నేర్పే గంభీరత్వం తాను

ఒక్కరా ఇద్దరా
వేలమంది నియంతలు మతోన్మాదులు
వీరచరిత్రను కాలగర్భంలో కలిపేయాలని కలలుగన్నరు
ఒక్కడైనా మిగిలిండా
కాకతీయ కీర్తితోరణం తప్ప

నిలువెత్తు రాజ్యాన్ని కబలించాలనీ
ఎంతమంది
దండయాత్రల దండుతో మీసం దువ్వారో_

తీరా నిన్నుచూసాకా_

ఎంతమందికి వెన్నులో వణుకు పుట్టిందో
ఇంకెంతమంది నిలువెళ్ళా కంపించిపోయారో
రొమ్మువిరిచి నిలిచిన నీ రాజసాన్ని చూసి_

వంగీ సాగిలపడీ మోకరిల్లీ శరణుజొచ్చారే గాని
సవాల్ విసిరి నిన్నుదాటిన శత్రువొక్కడు లేడు

మహోజ్వల సామ్రాజ్యానికి శిలాఫలక
ఓరుగల్లు కీర్తిపతాక

ఉద్యమకారులకు పిడికిలెత్తడం నేర్పింది
వీరులెందరికో పౌరుషాన్ని పురుడు పోసింది
నువ్వే కదా_

ఇప్పటికి నీవు మాకు పిడికిలిబిగి భరోసావే!
మానుకోట రాళ్ళు
రాయినిగూడెం మట్టీ
నువ్విచ్చిన ఆయుదాలే కదా

కాకతీయ కీర్తితోరణం
పోరుగల్లు కీర్తిశిఖరం

12.09.2012

ఆర్. ఆర్. కే. మూర్తి ll కళ్ళు ll


ఆ కళ్ళు తెరుచుకు
వత్తులు వేసుకు
చూస్తూనే ఉన్నాయ్
ఇంకేదో చేస్తావని

నీ బాన పొట్ట
పెరుగుతూనే ఉంది
నీ పాపాల చిట్టాలాగ

ఇవి నోళ్ళు మూసుక్కూర్చున్న
ఆ తరం కళ్ళు కావు
ఇవి అయిదేళ్ళూ నిద్ర పొయే
ఆకళ్ళు కావు
నీవు చిమ్మిన
ఏ దుమ్ముకూ మూయని
ఎరుపు జీరల ఎరుక కళ్ళు

ఈ కళ్ళలో చిరునవ్వు
తన పసి కూన కోసం మాటేసిన
హైనాను చూసి నవ్వే
ఛిరుత దరహాసం

ఆ కళ్ళనుండి
నిన్నే చంచల్ గూడా లూ తీహార్లూ
రక్షించలేవు

ఆ కళ్ళు
అసీం త్రివేది కార్టూన్లు
తెహల్కా కెమెరాలు

అవి చేసే వర్చువల్ యుద్దానికి
నీ బలుపంతా బలవ్వాల్సిందే
నీ పరువంతా నీకక్కుర్తిలో కలిసి
నివ్వు నడి రొడ్డున పడాల్సిందే

అయితె ఆ కళ్ళకు ఇది కూడా తెల్సు
" నీది సిగ్గులేని జన్మ" ని !

----Dt: 12-09-2012:
Please have sense of communication while making suggestions on 'how to post in kavi sangamam'; don't allow your over enthusiasm kill the interest of poets to post..

Ro Hith / కొన్ని అకవితలు /


1

ఎన్నో సార్లు కష్టబడి నిద్ర లేచాను పొద్దున
ఇది అయ్యే పని కాదని, ఈ సారి కలలో నిద్ర లేచాను ఎంచెక్క!

2

ఏం వెతుకుతున్నానో మరచి ఏదో ఏదేదో వెతుకుతూ ఉంటాను
చివరికి ఏమి దొరకదు, నాకు నేను తప్ప!

3

పోద్దుననుంచి ఇది రెండో సారి నా మీద కాకి రెట్ట వెయ్యటం
తిట్టేద్దాం అంటే కాకి కి తెలుగు రాదే!

4

ఆకాశం కవిత్వం లాగ ఉందన్నాడు స్నేహితుడు
నీది "లవ్ ఫైల్యూర్ ఆ?" వెంటనే అడిగాన్ నేను

5

ఈ పిల్లి పూర్వజన్మ లో బుద్ధుని గర్ల్ ఫ్రెండ్ అయ్యుంటుంది
యెంత అరిచిన అస్సలు పట్టించుకోదే!

6

గోడ వెనకాల ఎవరో మాట్లాడుతుంటారు
అప్పుడప్పుడు నా పేరు పలికిన శబ్దం వినపడుతుంటుంది

7

నిన్న సాయంత్రం గురించా? ఫోను రింగ్ అవ్వని నిశబ్ధం,
కొన్ని రాలిన ఆకులు ...తప్ప ఏమి చెప్పుకోదగ్గ విషయాలు లేవు

8

సీతాకోకచిలక నా గది లోంచి బయటకి ఎగిరిపోయింది
నేను ఒంటరిని అయిపోయ్యానే!

9

వాకిలేసుకొని మహా ప్రస్తానం గెట్టిగా చదువుతుంటే
వింతగా చూస్తోంది గోడ మీద బల్లి

10

ఎందుకో ఈ మధ్య రాత్రి పుట అస్సలు నిద్ర రావటం లేదు
కళ్ళు మూస్తె చాలు చదవాల్సిన కాగితాల రెపరెపలు వినిపిస్తున్నాయ్!

____________________

అకవిత్వం అనేది నాకు అనిపించినా అ-కవితలు మాత్రమె కాని...దీనికి Anti -Poetry theory కి పెద్ద సమ్మందం లేదు.

సురేష్ వంగూరీ || కులం ||


1
కులం
వాడి నోట్ పుస్తకాలపై
ఇంతింత అక్షరాలతో
ఇంటిపేరుగా ఇకిలిస్తోంది

2
కులం
వాడి బైక్ వెనక
స్టిక్కరై మెరుస్తోంది

3
కాలేజ్ టాయ్లెట్ గోడల మీద
తరగతి గదుల్లో బెంచీల మీద
వాడు కులాన్నే కెలుకుతున్నాడు

4
వాడు తన ఫోన్ బుక్ నిండా
కులాన్నే పలురకాల పేర్లతో
సేవ్ చేసుకున్నాడు

5
ఎవరిని స్నేహించాలో
ఏ లెక్చరర్ పాఠం వినాలో
ఏ హీరోని అభిమానించాలో
ఎవరికి వోటెయ్యాలో
అన్నీ కులాన్ని సంప్రదించే
నిర్ణయాలు తీసుకుంటాడు

6
వాడు
కులానికే తాళి కడతాడు
కులాన్నే కంటాడు
మళ్లీ కులాన్నే నామకరణం చేస్తాడు

7
కులాన్ని శ్వాసించటం అలవాటయ్యాక
కులం వాడి అస్తిత్వమయ్యాక
ఇప్పుడు
వాడికి తెలియకుండానే వాడు
చూపుల్లో పుసులు కడుతూ
మాటల్లో చొంగ పడుతూ
మనసంతా కుళ్ళిపొయి దుర్గంధిస్తూ
మనిషితనమంతా పుళ్ళుపడి రసులు కారుతూ
జీవితపు రోడ్లెంట
స్కిజొఫ్రినియా వచ్చిన గజ్జి కుక్కలా బతికేస్తూ
తన వాంతిని తనే గతికేస్తూ...

12.9.2012

మెర్సి మార్గరెట్ ll నల్ల మల్లెలు ll


ఇప్పుడే
విచ్చుకుంటున్న
నల్ల మల్లెలు

****
అస్తమిస్తున్న సూర్యుడు
ఆడుకోడానికొచ్చే
రేరాజుకు
సమయాన్ని
చేబదులిస్తున్నట్టు

కొండల్లోంచి
బురదమడుగుల్లోంచి
దారితప్పిన
రాణి వాసాల్లోంచి
రోడ్డు ప్రక్కన ఎవరో
నాటిన
అనామకంగా సంకరించిన
తీగల నుంచి

మొగ్గళ్ళా ఉన్నప్పుడే
ఎవరో తెంపి
నలిగిపోడానికే
కామపు దారంతో
అల్లినట్టు

వెలుగులో దాక్కుని
చీకటిలో
కనిపించే కళ్ళకు
అనేకానేక చంద్రుళ్ళకు
ఒక్క పూటైనా
హృదయంలో
వసంతం పూయించడానికి
వాడిపోతూ
సుఖానికి కాటుక గుర్తవడానికి
ఇచ్చి పుచ్చుకునే
తాంబులమవుతూ

ఒక్కోరెమ్మగా దేహంతో
దూరమవుతున్న ఆత్మను
అనంత విశ్వంలోని
అద్వితీయ శక్తికి రాలిపొతూనే
అసహాయంగా
మొరపెడుతూ

మళ్ళీ జన్మంటూ ఉంటే
తెల్ల మల్లెల్లుగా
పుట్టించాలని
ప్రార్దిస్తూ
చేతి మణికట్టుకూ
మంచంపై
మలిన ముచ్చట్లకు
ఆ చంద్రుళ్ళ
చేతులలో
వేడిపోతల మధ్య
వాడి పోతూ

రోజూ
కడుపు రెండు నిమిషాలు
నవ్వడం కోసం
చివరి శ్వాసకి
వైద్యం చేసుకుంటూ

చస్తూ
బ్రతుకుతున్నాయి
కూతలు వాతలు తప్ప
పాపమో పుణ్యమో
లెక్కలెరుగని
నల్ల మల్లెలు
................. ( 12 -sep -2012 )

అనిల్ డానీ కవిత


గూడెమంతా సందడి
పండగేం గాదు
పతంగులు ఎగరలేదు
సాయిబులు పీర్లు ఎత్తలేదు
గాని అంతా వూదుకడ్డీల వాసన

కిర్రుచెప్పుల సవ్వడి
గుళ్ళో చదివే వేదాలు
భజన కీర్తనలు,తాళాల చప్పుడు
గాలి మోసుకొచ్చింది చెవుల్దాకా

పూల పల్లకీలో దేముడు
మా అంటరాని పేటలో
ఎప్పుడో జమానా నుంచి
ముంతా తాటాకు కట్టి
విసిరేసిన గూడేనికి
హవ్వ ! ఏంటి విచిత్రం

అరవై ఏళ్లనుంచి నంజుకు తినబడుతున్న
నాల్గో జాతి వీధిలోకి నరసింహ సాములోరు
ఉరేగి పోయినాడు
కళ్ళారా చూద్దామంటే ఆపిన నాథుడే లేదు
పాపం పూలని మాత్రం చంపారు దేవుడి పేరు జెప్పి

ఊరికి కరువొచ్చినట్టు
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు
పౌర్ణమి రోజున వెన్నెల కాసినట్టు
ఒక్కసారే వస్తాడంట దేముడు మా గూడేనికి

నల్ల దొరల రాజ్యం ఆర్తిగా పిల్చినా
ఆలకించడేమి దేవుడు
చిక్కుకున్నడా దేవుడుకూడా మీ
కబందహస్తాల్లో మా జీవితంలానే

దేవుడు ని మా గూడేనికి తేవడం కాదు
మమ్మల్ని తీసుకుపోండి
మీ గుడిలోకి బడిలోకి మీ ఇళ్ళకి
మీ మనసుల్లోకి
కడుక్కోండి మీ మసులని
మానవత్వపు జలం తో

కుదిరిందా సరే సరి
లేకుంటే ఈ సారి మీరు తెస్తే వచ్చేది
ఒట్టి విగ్రహమే దేవుడు కాదు
పైవాడికి తెలీదా మీ కులం
రంగేసుకున్న నాటకాలు (12sep2012)