పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, జులై 2012, గురువారం

దాము || వొక ఖైదీ ప్రార్థన ||

ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడైన గొప్ప దేవా
నీ నామమును భయ భక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుడైన నా మొరను
చెవి యొగ్గి వినుము ఖిన్నుడనై వున్న నా యీ ప్రార్ధన నాలకింపుము




నేల మాళిగ వంటి వొక చెరసాలలో నా ప్రాణము బొందిలో నిమ్మళము లేక యున్న సంగతి నీకు నివేదింతును




మందలో కలవలేని అశక్త గొర్రెను. యెప్పుడూ నా నుంచి నేను తప్పిపోతాను. జీవితాన్ని జైలును చేసిన యెహోవా, జానెడు నేల కోసం, దోసెడు నీటి కోసం బంధింప పడ్డాను. నిన్ను శిలువ వేసిన వారి వారసులతో దేవా నేను మోదుకొంటినని నాకేమెరుక. మట్టికీ బతుకుకూ పేగు సంబంధాన్ని ముడిపెట్టితిననుకుంటిని. కానీ బంధనము బహుమానమగునని తలంచలేదు. నీ వాక్కుననుసరించి నా పొరుగు వారిని ధృడముగ ప్రేమించుటయే నేను చేసిన నేరము. యెహోవా, అబద్ధాములాడు కాలము నుండి, మోసకరమైన ప్రతి కొత్త వుదయము నుండి నన్ను విడిపింపుము. నీవు నీ జ్ఞానము చేత సృజియించిన భూమ్యాకాశములు నీవు సృజియించిన పాపులమైన మాకు చెందునట్లు చేయుము. పగలు యెండ దెబ్బ నుంచి, రాత్రి వెన్నెల దెబ్బ నుంచి కాపాడుతున్న దేవా, నా రాకపోకలందు వూపిరులొదులుతున్న వొక మహా యుద్దము నుండి నన్ను కాపాడుము. నిర్నిమిత్తముగ నన్ను ద్వేషించుచున్న యేలినవారిని కన్ను గీటనియ్యకుము.




అహంకారులైన దొరలు మా మీదికి లేచినపుడు మా చేతికొక ఆయుధమైనా నొసంగని వో దేవా నీ తల్లి వంటి నా తల్లి కన్యకయని అవహేళననొంది ఆత్మహత్యింపబడినది. ఆమె స్మృతులొరసుకొని నేనిక్కడ నది వొడ్డువలె కరగిపోవుచుంటిని. నా చీకటి ముఖమును కప్పుకొనుటకిక్కడ వొక నక్షత్రముయునూ లేదు. మంద నుండి నన్ను రక్షించుటకై యేకాంతమనెడి చల్లటి హస్తమును నా తలమీదుంచుము. వెంటాడుతున్న అపరిచిత ముఖము వంటి దుఃఖము నుండి నన్ను వుపశమింపచేయుము. నల్లని ద్రాక్ష గుత్తుల వంటి నా ప్రియురాలి రొమ్ముల రుచుల వంటి జ్ఞాపకములు నన్నిక్కడ వెంటబడి తరుముచున్నవి. నువ్వు పాయలుగా చీల్చిన యెర్ర సముద్రము అలలెత్తి నాలో ఘోషించుచున్నది. రాత్రి కురియు మంచుకు తడిచిన నా ప్రియురాలి నగ్న శరీర సౌందర్యము వంటి రహస్యమేదో నా చెవిలో హోరెత్తుతున్నది. ఆకాశమందు ఆసీనుడైన వాడా యెహోవా నీవు నీ గుప్పిలిని విప్పి పిడికెడు నక్షత్రములు నా నెత్తిమీదికి రాల్చి నన్ను ధన్యతనొందింపుము. నాకు నా ప్రియురాలి బలసూచకమైన మందహాసము నిమ్ము. ఆమె ప్రేమాతిశయ స్వరమును వినిపింపనిమ్ము.




గ్రీష్మము దాటిపోయెను. వర్షాకాలముయునూ గతించుచున్నది. దేశమంతా పువ్వులు పూసియున్నవట. సౌందర్యము విచ్చుకొనుచున్నదట. దర్శన భాగ్యము లేదు. భూదిగంతములనుండి ఆవిరిలేవజేయు వాడా, వాన కురియునట్లు మెరుపు పుట్టించు వాడా, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. కావలి వారు వుదయము కొరకు కనిపెట్టుకొనుటకంటే యెక్కువగా స్వేఛ్చ కొరకు నా ప్రాణము కనిపెట్టుచున్నది. నాకొక వేకువను ప్రసాదింపుము. ఆరు బయటి సముద్రము రెక్కలు కట్టుకొని నా చెంత వాలునట్లు చేయుము. తల్లివలె వేచి యున్న నా ప్రియురాలి వోర్మిని యింకనూ పరీక్షింపకుము. నా చేతులకున్న సంకెళ్లను త్రెంచివేయుటకై నేను నిన్ను పది తంత్రుల సితారతో కీర్తించెదను. నీ నామమును ఘనపరిచెదను.




అయ్యా! నా ప్రార్థననాలకించినందులకు నీకు స్తోత్రములు.....స్తోత్రములు.




వొకానొక సంవత్సరం


చిత్తూరు జైలు.
*12-07-2012

నంద కిశోర్ || గోడు ||

పోకెటోడు పోకకపోడు
గోకెటోడు గోకకపోడు
లైకినోడు లౌక్యుడు కాడు.
మెంటనోడు మెంటలుకాడు.
చూసుకుంటు చురుక్కుమంటు
దోచుకుంటు దూరంపోతూ
కనబడుతు వినబడుతూనే
కనుమరిగైపోవాలోయి.


మెచ్చుకోనివారేకాదోయ్
నొచ్చుకునేవారువుందురోయ్.
గోడంటే గోడేకాదోయ్
రంగసాని రంగుల మేడోయ్.!


తప్పురాస్తె కిమ్మునుండుట
రైటురైటు అంటు చెప్పుట
తప్పో రైటో తెలియని చర్చల
తప్పకుండా తలని దూర్చుట
ట్యాగుచేస్తే తీసివేయుట
మెసేజొస్తె చూడకుండుట
ఆఫులైన్ల లైనుకట్టుట
ఆనులైన్ల లైనువేయుట


తికమకలు మకతికలన్ని
చూచాయగ తెలిసుండాలోయ్
గోడంటే గోడే కాదోయ్
గోసాయిల బాలశిక్షరోయ్!


తెలవకుండ గ్రూపుల్లోకి
తెలిసితెలిసి ట్రూపుల్లోకి
పోతావో,పడిపోతావో
నీకైనా వివరము తెలియదు.
కనబడేది పుస్తకమనుకుని
కధలన్ని చదివేసావో
కళ్ళనిండ కంపరమొచ్చే
అవకాశము అసలే తప్పదు.


తెలివొక్కటి ఉంటే చాలదు.
తేరిపార చూస్తుండాలోయ్.
గోడంటే గోడేకాదోయ్
కనపడని కాలహంతకోయ్!


చాటులోన కనపడగానె
చాటుగ దాక్కునేటి కర్మము
మాటువేసి పోస్టుటచూసి
దాడిచేయు కనీస ధర్మము
థ్యాంక్యూలు,హౌవ్వార్యూలు
అచ్చోట ముగించే జ్ఞానము
కంప్లైంట్లు,కాంప్లిమెంట్లని
సమానముగ చూసే హృదయము


నెట్టొక్కటి ఉంటే చాలదు
నెట్టుకొచ్చె తెలివుండాలోయ్.
గోడంటే గోడే కాదోయ్
గొడవపడే చాన్సులుండునోయ్!
*12-07-2012

భవానీ ఫణి॥ ఎప్పటికైనా॥

అందమైన సీతాకోక చిలుకలనీ
అల్లిబిల్లి మేఘాలనీ
అక్షరాలుగా పేరుస్తూ
ఆనందిస్తున్నాను నేను ,
సరిపోదంటున్నారు...

హృదయాన్ని
మధించాలంటున్నారు
ఎన్నో చేదు నిజాల్ని మరచిపోవాలనుకునే
గరుకు ఘటనల్నీ సుదీర్ఘమైన ఎదురు చూపుల్నీ....
జ్ఞాపకాల అలల్లోంచి
అలవోకగా తియ్యాలంటున్నారు

జీవన ప్రవాహంలో ఆనందాల బిందువుల్ని
ఏరుకోవడం కాదు..
విషాదాన్నీ ఒడిసి పట్టాలంటున్నారు

దేవతల నిండా
దయ మాత్రమే ఉండదంటున్నారు
కొందరిలోని రాక్షసత్వానికి
కారణాలూ అన్వేషించ మంటున్నారు

ప్రపంచాన్ని కొత్త కోణంలోచూడమంటున్నారు
కవితా కన్యని పదాలతో కాదు ...
భావాలతో అలంకరించమంటున్నారు

ఎంత తోడినా తరగని మహా సముద్రాన్ని
అరిచేతిలో ఇముడ్చుకోమంటున్నారు
అర్ధం అయీ కానట్లు అంతరాల్ని
స్పృశించాలంటున్నారు

మనోనేత్రాన్ని తెరవాలంటున్నారు
గరళాన్ని మింగిన గొంతుల్ని కదిపి
గురుతుల్ని చూప మంటున్నారు

అప్పుడే మనసు
అమృత భాండాగారమై జీవిత సత్యాలని
స్రవిస్తుందంటున్నారు

ఎందరెందరో చేస్తున్న ఈ కవితా మధనాన్ని
ఓ మూల నిలబడి చూస్తున్నా
ఎప్పటికైనా నేనూ చెయ్యగలనా అని
అబ్బురపడుతూ !!!!


* 12-07-2012

శిలాలోలిత || గోరటెంకడి పాట ||

వాగ్గేయకారులెలా ఉంటారు !?
చింతాకంతే వుంటారు
చిరస్మరనీయులై నిలుస్తారు


ఒక క్షేత్రయ్య, ఒక అన్నమయ్య
ఒక త్యాగయ్య, ఒక మీరా
ఇదిగో ఇక్కడ
తెలంగాణా భూమిని తొలుచుకుని గోరటి వెంకన్న!


అతడి నోటినిండా పల్లెపదాలు
పాట ఎత్తుకుంటే పల్లె మన ముంగిట నిలుస్తుంది
పదబంధాలు,ప్రతీకలు బంతిపూలై నవ్వుతాయి.
కళ్ళు ఎగిసిన అలలై మెరుస్తాయి
ఊరుతల్లి ఇంటిముంగిట ముగ్గవుతుంది
చెట్టూ చేమా , కాయాకసరూ
ఉప్పూనిప్పూ కరువూ కష్టం
చేలెంబడి ,డొంకలెంబడి తిరుక్కుంటూ పాటల్లా నడుస్తాయి


ఊరోళ్ల ఊసులు సంతలకధలు వెతలు రాములయ్య బతుకుభాగోతాలు హరిశ్చంద్రుడి కాటికాపరి దుక్కం
కన్నీరొక చుక్కుండిన చాలునన్న వేదాంతాలు ఆలుమగల్ల రాద్దంతాలు సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మలు
డెంకదేడ్డెం 'అంటూ లేగాదూడలైన పిల్లకాయలు కనిపించని కుట్రల్లో పల్లెకన్నీరు పెడుతుందని దృశ్యమానం
చేసే పాటల మాటల ఊటల ఆవేదనార్తుల కలబోతల ఒక అనంత ప్రవాహం ఆతడి పాట.చదువుకున్నోళ్ళ
ఉన్నోళ్ళ ,ఉన్నున్నోళ్ళ నోటెంట పలికే గిలికే రాతలే నిజమంటున్న కాలంలో -బతుకుబండిలో పల్లెనేక్కించిన
జానపద సాహిత్య రారాజు అతడు.


అతడొక ఉద్యమం ,అతడొక ప్రవాహం ,పరీవాహకం
అతడి గుండె ఒలికిన పాట పోటెత్తిన అల
'వేమన'లా ప్రతీకలని చుట్టూ చూస్తూనే
ఒడిసిపట్టుకుని విత్తనాల్లా వెదజల్లుతాడు
చరణాల నాగటిచాల్లలో ఏం పోలిక రువ్వుతాడో తెలీదు
ఎవరి గుండె పిగులుతుందో తెలీదు
అతడినోట ప్రతి పాట ఓ బతుకుగుండం ,జీవన్మరణ పోరాటం
అంతర్గత సంక్షుభిత విలయనృత్యం


తెలంగాణ కన్నమట్టిబిడ్డ,మరో బిడ్డ
కన్నతల్లి కనుకొలకులలో మెరుపై నిలిచే నెత్తుటి గుండం!

*12-07-2012

రవి వీరెల్లి || పిల్లతెమ్మెరలా నువ్వొచ్చి పువ్వు తుంచుకెళ్ళవా?! ||



సుదీర్ఘమైన చర్చ వొక కొలిక్కి వచ్చేలోపే ముగిసినట్టు
చీకటి వెలుగుల్ని వొడుకుతున్న కాలం చేతుల్లో రంగు మారిన దారం.


వెన్నెలతో కచేరీ కోసం కాబోలు
వెలుగుతూ ఆరుతూ
చుక్కలు ఏదో రాగాన్ని ట్యూన్ చేసుకుంటున్నాయ్.


అలా వాకిట్లో మంచం వాల్చానో లేదో-
ఒక్కొక్కటిగా
నా జ్ఞాపకాలన్నీ పులుముకుంది
ఆకాశం.


ఎప్పట్లాగే
గతాన్ని వెలిగించి గట్టిగా పీల్చా.
వర్తమానం చురుక్కుమంది.


ఇక
ఈ రాత్రి కొమ్మకు పూసిన
దిగులు పువ్వు
ఇప్పుడప్పుడే రాలిపోయేట్టు లేదు.


*12-07-2012

కోడూరి విజయకుమార్॥సంజాయిషీ॥


                                                                                                           బొమ్మ: అక్బర్


నీ చుట్టూ పరచుకున్న బొమ్మల నడుమ
నన్నూ వొక బొమ్మని చేసి ఆడిస్తూ .. ఆడిస్తూ...
కల్మషమింకా అంటని నీ చూపుల్ని
క్షణకాలం నాకేసి విసిరి, చిట్టితల్లీ...!
క్లిష్టమైన వొక ప్రశ్నను నిలిపావు నా ముందు...
'నువ్వు అబ్బాయి పుట్టాలనుకున్నావా నాన్నా?' అని... 

ఏ రంగుల రాకాసి దృశ్యాలు
నీ అమాయక నేత్రాల్ని కలవరపరచి వుంటాయి?
ఏ మొరటు మనుషుల దయలేని మాటలు
ఎనిమిదేళ్ళ నీ పసి హృదయాన్ని గాయపరచి వుంటాయి?
గుండెను ఎవరో మెలిపెట్టినట్టు తల్లడిల్లిపోయానమ్మా...

నిజమే..కొన్ని బలహీన క్షణాలలో
నా అనాది మగ దురహంకారాల మైకంలో
అబ్బాయి పుట్టాలనే కోరుకున్నానేమో....

కానీ నా బంగారుతల్లీ...! నాలో జీవం నింపి..
నన్నొక మనిషిని చేసింది స్త్రీలేనని ఎలా మరిచిపోను?

జ్వరదేహంతో నేను దగ్ధమైన రోజుల్లో
మెలకువ చేతులతో నిద్రపుచ్చిన మా అమ్మ ....
బడికి వెళ్లనని మొండికేసిన తొలిరోజుల్లో
తాయిలం పెట్టి పంపించిన మా తాతమ్మ ...
రాకుమారి, మంత్రగాడు కథలతో
బాల్యపు రాత్రులకు రంగులద్దిన మా అమ్మమ్మ
ఎడారి పయనంలా సాగిన యవ్వన దినాలలో
వోరచూపుల, చిరునవ్వుల ఒయసిస్సులై
పలకరించిన సీతాకోక చిలుకలు .....
చివరికి..వొంటరి పక్షిలా గిరికీలు కొడుతున్నపుడు
నాకొక గూడుని సృష్టించిన నా సహచరి...
నా లోలోపలి లాలిత్యాన్ని రక్షించింది స్త్రీలేనమ్మా...

ఇప్పటికీ ఒక అపరాధ భావన నాలో...
నా తలిదండ్రులకు
నా చెల్లెళ్ళు పంచే ప్రేమ లోని మాధుర్యమేదో
నేను చూపించే ప్రేమలో లుప్తమయిందని...

కాకపోతే, నా చిట్టితల్లీ..!
చదువుల పట్టాలు ఎన్ని సాధించినా
కట్నాలతోనే విలువ కట్టే విపణి వీధులూ ...చివరికి
ఇంటికే పరిమితం చేసే మగ దుర్మార్గాలూ
అయిష్టాన్ని ప్రకటించిన అమ్మాయి ప్రేమను
'అమ్మాయి రంగు తెల్లన...హృదయం నల్లన'
అంటూ ఎగతాళి చేసే 'కోలవెర్రి' పాటలూ
అపుడపుడూ కళాశాలల గదుల్లో
నిర్లజ్జగా దొర్లే యాసిడ్ సీసాలూ ....
నన్ను భయపెడుతుంటాయి...

ఆ భయకంపిత క్షణాలలో మాత్రం
నిజంగానే...నిజంగానే అనుకుంటానమ్మా...
'నువ్వు అమ్మాయిగా పుట్టకపోతే బాగుండేది' అని...
రచనా కాలం: 06  డిసెంబర్ 2011
[ఆంధ్రజ్యోతి -నవ్య వీక్లీ 18-07-2012 సంచిక లో ప్రచురితం]
 *11.7.2012

నందకిషోర్॥అల్విదా-2580॥


ముల్లోకాలని గెలవలేక
ఒక చేతకాని నువ్వు
అదృశ్యంగా,నిశ్శబ్ధంగా
రెండుగా చీలిపోతున్నట్టు

ఆరుకాలాల్లోను
నలుగురితో పోటిపడలేక,పడలేక
అయిదు ప్రాణాల్ని అర్ధిస్తూ
పోపొమ్మన్నట్టు

తొమ్మిది గ్రహాల్లోంచి
ఏడుపువినపడుతుంటే
ఎనిమిది దిక్కులోకి దీనంగా
ఎతికెతికి చూస్తున్నట్టు

ఇంకా?
ఏం మిగిలింది?
ఊ..దాచుకోకు..
చెప్పు..

బూడిదవు కాలేక,
నక్షత్రంగా వెలగలేక
గుట్టుగా శూన్యంలో కలిసిపోతున్నట్టు

అచ్చు ఇలాగే అనిపిస్తుందికదా?
నీక్కూడా?
నిజంగా?

రోజోసారి ఆవేశం నింపుకొని,
వినలేక వినిపించలేక అవస్థపడుతూ,
ఎటు తిరిగినా వెంటే నడిచే బాధతో
సందేశాలపై సవారీ చేస్తూ,

గుండె మోగినప్పుడల్ల కలుక్కుమనే
ఓ సాధారణ జీవితం నీదనీ,
ఓ మధ్య తరగతి మనిషివి నువ్వనీ,
విముక్తిలేని ప్రాణివనీ..

ష్..

క్షమించాలి.
మీరు డయలు చేస్తున్న నంబరు
ప్రస్తుతము అందుబాటులో లేదు
కాసేపాగాక కూడా దయచేసి
మరలా ప్రయత్నించవద్దు!
*11.7.2012

శ్రీనాధ్ రాజు॥ఒకటే శక్తి॥

నన్ను నేను తెలుసుకోవాడానికే - నీవు
నిన్ను నీవు తెలుసుకోవాడానికే - నేను !

పలు నేనుల్లో పలు నీవుల్లో
పలు వాళ్ళల్లో
పలు వాటిల్లో పలు వేళల్లో
తనను తాను తెలుసుకుంటూ
అంతటా ఒకటే శక్తి !

తననుంచి తనే దాక్కుంటూ తనే వెతుక్కుంటూ
తనను తాను కలుసుకుంటూ తెలుసుకుంటూ
అంతటా ఒకటే శక్తి !

నన్ను నేను గ్రహించడానికే - నేను కానిదంతా
నిన్ను నీవు గ్రహించడానికే - నీవు కానిదంతా !!
*11.7.2012

నౌడూరి మూర్తి॥అక్ష రే లు॥


గాయాలు లేకుండా అక్షరాల్ని స్రవించకు నేస్తం!
"సెప్టిక్" అవుతుంది.
అక్షరాల్ని మూట కట్టకు
పదబంధాల జీర్ణవస్త్రంలోంచి భావం కారిపోతుంది.
ఆలోచనల దారాలతో అల్లని మాటలు చెల్లాచెదరైపోతాయి.

"మనసిత్వం" పోసి వెలిగించని అక్షరాలు
ఉల్కల్లా అరక్షణం వెలిగి ఆరిపోతాయి.
వివర్ణహృదయంతో పదచిత్రాలు గీయలేవు, నేస్తం!

అనుభూతుల వర్ణపటం నుండి రంగులు ఎరువుతెచ్చుకోవలసిందే.
స్వయంచాలితాలైన అక్ష"రే"లకు
అలంకారాల, సమాసాల అల్లెతాడు అవుసరం లేదు.
అనాదినుండీ భావాలకెప్పుడూ సుఖప్రసవం జరుగలేదు. నిజం.
అక్షరాలా--- అక్షరాల సిజేరియన్ చేయవలసిందే!
కానీ, పెన్సిలు ముల్లు చెక్కినట్లు అక్షరాలను చెక్కనక్కరలేదు.
అవి వజ్రకాఠిన్యాలేకాదు--- సునిసితాలు కూడా.
పద్యాల ఊయలలో మనల్ని లాలించినవీ,
బంధ, చిత్ర కవితలతో హింసించినవీ,
భావ కవిత్వంతో వినువీధులలో త్రిప్పినవీ,
జగన్నాధ రథ చక్రాలై --- నేల మీద నడిపించినవీ
ఈ అక్షరాలే!

అక్షరాలు వెన్నెట్లో ఆడుకునే ఆడపిల్లలే కాదు,**
నిక్షిప్తం చేసుకున్న విశ్వ రహస్యాలను
విపులీకరించడానికి Armstrong పాఠకులకై
అహరహమూ ఎదురుచూసే చంద్ర శిలలు కూడా.
రోజుకొక్క సూర్యోదయాన్ని ఆవిష్కరించేదీ,
కోకిలలనీ, వనాలనీ కొత్త ప్రతీకలుచేసి,
వ్యావహారపుకొలిమిలో పుటం వేసిన పుత్తడిలా
వింత వన్నెలు సంతరించుకునేదీ--- ఈ అక్షరాలే.
ప్రకృతికి శాస్త్రాల భాష్యం చెబుతున్న మనిషికి శబ్దమై హసించినవీ,
పదంగా ధ్వనిం చినవీ --- ఈ అక్షరాలే

అక్షరాలు జీవన్మరణ సూచికలు
కొందరు అక్షరాల్ని ఆలింగనం చేసుకుని సహగమనం చేస్తారు -- హష్మీలా,
కొందరు అక్షరాలను అడ్డువేసుకుని  వీర విహారం చేస్తారు --- అర్జునుడిలా.
అక్షరాలు అనుభవాల్ని మేసిన "అణు " భవాలు.

విస్ఫోటన- సంయోజనాల అదుపు తెలుసుకోక ప్రయోగించావో ---
అవి సమాజాన్ని సర్వసేనా మూర్చ లోనైనా ముంచేస్తాయి
లేదా
దాని గురుత్వాకర్షణ శక్తి నైనా లేపేస్తాయి.

(**with apologies to Tilak)
*11.7.2012

పి.రామకృష్ణ॥ఎదురింటి బాల్కెని॥


ఎప్పుడైనా ఓసారి
ఆ గోడల మీద
కాకులొచ్చి వాలేవి.

ఆవిడొచ్చి
రంగురంగు పావురాళ్ళను
మొక్కలకు పూయించింది.

చిట్టి చేతుల్తో తీగ పాదుల్ని
తట్టి లేపింది.

అంతా గుప్పెడు మట్టే.

పువ్వుగా ఎదిగే
విత్తనాన్ని
సుతిమెత్తగా
తడిమి చూసింది.

అభిమానం ఎరువుగా
చల్లుకుంటూ
వెళ్ళేదా..?

తిరిగొచ్చేసరికి,
తీగెలు పరిమళాణ్ణి
ప్రతిధ్వనించేవి.

ఎండిన ఆకు,
ఆమె కంట్లో
నీటి చుక్క
ఒకేసారి రాలి పడేవి.

ఆ కాస్త చోటే
అరోరా బొరియాలిస్
రెక్కలార్చుకునే
ఆకాశమైంది.

ఏమైందో ఏమో..?

మొన్నొచ్చిన
గాలి విసురుకు-
కూలిన మొక్కల సాక్ష్యంగా

తను కనిపించనే లేదు.
ఎప్పటికీ.

( ఇది నిజంగా నిజం )

*11.7.2012

కిరణ్ గాలి॥ROCK ON॥


శీలా ..శీలా కి జవాని
ఐయామ్ టూ సెక్సి ఫర్ యు ..మై తెరె హాత్ నా ఆని
టేక్ ఇట్ ఆఫ్, టేక్ ఇట్ ఆఫ్

నేను చూసాను
దేహాల మత్తులో చిత్తవుతున్న ఆత్మలను
మోహాల వత్తులు రగిలి కరుగుతున్న మైనపు విలువలను
తరుగుతున్న వలువలను

అర్ధ నగ్న అనుభందాల గాఢాలింగనాలని
అత్తరు అందాల విశ్రుంకల విన్యాసాలని
రెక్కలు తొడిగిన స్వేచ్చను
ముసుగులు తొలిగిన మ్రుగ కాంక్షలను

నిజం ..నేను చూసాను
రంగు రంగుల లెజర్ కాంతులలో అందంగా మెరుస్తున్న
కల్చర్ evolution & individual freedomla
సుతిమెత్తటి వంపులను సరికొత్త కోణాలను

ఇక్కడ చికటి పడితెకాని చిగురించదు చైతన్యం
వేకువజాము వరకు సాగుతాయి వేడుకలు
శబ్దం హోరెక్కే కొద్ది జొరెక్కుతుంది సాన్నిహిత్యం
మందు విందు పొందుల కాక్ టైల్ డీల్ ఇది
పల్చటి వెలుతురులో పరిచయాలు
చిక్కటి కలయికలుగ రిమిక్స్ అవుతాయి

ఉద్వేగం స్వేదమై కారుతుంటె
వివేకం మంచు ముక్కలై కరుగుతుంది
ఇక్కడ అహ్లాదానికి అశ్లీలానికి సరిహద్దు ఎవరికి వారే గీసుకుంటారు
సంగితం శ్రుతి తప్పినా, సంస్కారం జతి తప్పినా,
సంఘం గతి తప్పినా
మొరల్ పోలిసింగ్ చేసె హక్కు నీకు నాకు లేదు(ట)

చిత్రమేమిటంటే....

నేనిక్కడ
వినొదపు అంచుల మీద వీరంగాన్నే కాదు
నెత్తురు చిందని విషాద మాతంగాన్ని చూసాను
వాయిద్యాల ఘొషలో కుడా మౌనం శ్వాసను స్పష్టంగా విన్నాను
చిరునవ్వుల వెలుతురు మాటుని చితిమంటల వెలితిని చుసాను

టూట టూట ఏక్ పరిందా ఐసె టూట..కి ఫిర్ జుడ్ నా పాయ
లూట లూట కిస్నె ఉస్కొ ఐసె లూట...కి ఫిర్ ఉడ్ నా పాయ

నేను చుసాను...
ఒంటరితనం వెంటాడితే సముహాల్లొ తలదాచుకునె శరనార్దులను
ఓటమి వెక్కిరిస్తె ఓదార్పు కోసమై వ్యసనాల వేనుక నక్కిన "ఆ" సమర్ధులను

గాజు గుండె భల్లున పగిలి ఙ్నాపకాల ముక్కలు గుచ్చుకుంటె
బాధని "బ్లడిమేరి"గ గొంతులొకి దిగమింగే వాళ్ళని
వీళ్ళకి పగటి గాయం ఎంత గట్టిదైతె రాత్రి ఆట అంత రక్తి కడుతుంది

మున్ని బద్నామ్ హుయి, డార్లింగ్ తేరెలియె
మున్నికె గాల్ గులాబి, నైన్ శరాబి, చాల్ నవాబి రె..
లె జన్డు balm హుయి, డార్లింగ్ తెరెలియె

మెకానికల్ జీవితంలో
నైట్ లైఫ్ వెలుగు నిస్తుందో
మరింత చీకటిని నింపుతుందో...బ్రేక్ తర్వాత చూద్దాము
అంతవరకు... ROCK ON
*11.7.2012