పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, సెప్టెంబర్ 2012, బుధవారం

క్రాంతి శ్రీనివాసరావు ||వస్తు కవితలు ||



శ్రీక్రిష్ణ
దేవరాయలు
అస్ట దిగ్గజాలు
భువన విజయం లేకున్నా

వ్యాపారప్రపంచం
వీసాలిస్తుంటే
కవితా కన్నియలు
అస్టదిక్కులూ
పాలిస్తున్నాయు

వాడెవడో ఇప్పుడే
అద్భుత కవితా వాక్యాలను
మా ఇంటెనుక గోడపై
పారబోశాడు

ఇంకొకడు ఎత్తయున
సైను బోర్డ్ బోర్డర్లో
అందమయున అమ్మాయుకాళ్ళకు
కవితా పారాణి పూస్తున్నాడు

ఇళ్ళస్తలాలనమ్ముకొనే వాడూ
కవిత్వపు చిరునామాగా
మారిపోతున్నాడు

కవిత్వం తో తడిపిన
వస్తువులను
టీవీ తెరపై నిత్యం
ఆరబెడుతున్నారు

నేడు
సమస్త వస్తువులూ
కవితావస్తువులై
పస్తులువుండే వానితో సయుతం
ఓ వస్తువునన్నా కొనిపిస్తున్నాయు

అడ్వర్టైజింగ్ ఎజెన్సీలిప్పుడు
కవిత్వకర్మాగారాన్ని నడిపిస్తున్నాయు

మార్కెట్ చేతిలో మాసినకవితలను
పేదల కన్నీళ్ళతో కడిగి
ప్రగతి శీల ఉద్యమాలు
కవితా వస్తువులుగా
అక్షర సేనలు కదలాలిప్పుడు
చండ్ర నిప్పులు కురియాలెప్పుడూ

కె.కె.|| సారిచెప్తే పోయేదానికి ||


మూడు రోజుల వయసొచ్చింది
నా మౌన పోరాటానికి,
యుద్ధం గొప్పగా సాగిస్తున్నానని
నేను అనుకోవడమే తప్పా,
అబ్బే... మనసొప్పుకోవడం లేదు.

గడియారం,దాని అలారం
తొలికోడి కూత.
ముద్దుగా లేపడం,
ముద్దుల్తో లేవడం...హ్మ్...
అబ్బే...పొద్దు పొడిచింది.

కాఫీ,టిఫిన్లు అందుతున్నాయ్
గాజుల సందడే లేదు.
లాంచనంగా లంచ్ బాక్సూ అందుతోంది
కాని,కంచంలో చెయ్యే కదలడం లేదు.

ఆఫీసు అయిపోయినా
అలసట తగ్గట్లేదు ఎందుకో రోజూలాగ?
పరిచయమున్న ప్రతీవాడు హాయ్ అంటున్నాడు
ఖర్మ, హాయి ఎక్కడుంది?
చుట్టూ ఇంతమందున్నా ఈ ఒంటరితనమేమిటో?

కొప్పులోని మల్లెపూలు గుప్,గుప్ మంటున్నాయ్,
ఛేతికున్న మట్టిగాజులు ఘల్,ఘల్ మంటున్నాయ్.
కాళ్ళ గజ్జెలు రమ్మ్,రమ్మ్ మంటున్నాయ్.
గుండె ఝల్,ఝల్ మంటోంది,ఊహున్.. మండుతోంది.
ఆరున్నర అడుగుల మంచంలో,ఇద్దరికీ రెండున్నర సరిపోయేది.
ఇప్పుడు నాల్గున్నర ఉన్న ఒక్కడికే సరిపోవడంలేదు.

మనసు మూలుగుతోంది,
ఈ మూడు రోజుల మొదటి ఘడియనుంచి
అయినా వింటేనా...అహంకారం,
మొగుడనే అహంకారం,
మగాడనే అహంకారం,
పురుషాహంకారం.

తను నవ్వితే చాలు,
వల,వలా ఏడవాలనిపించేస్తొంది.
అయినా ఇవేమైనా గల్లీ యుద్ధలా???
గిల్లికజ్జాలు...వీటికి ఇంత బాధ అవసరమా???
ఈ నిశ్శబ్దం చేసే చప్పుడికి
నా కర్ణభేరి కమిలిపోయేటట్లుంది.

"ఐ యాం సారి, వెరి,వెరి సారి"
"నిన్ను చాలా బాధ పెట్టాను"
వెధవ ఈగో,నిజానికి బాధపడింది నేనే,
అంతే...మళ్ళా ఆనందం నా కౌగిట్లో,
ఒకసారి 'సారీ' అంటే సరిపోయేదానికి,
ఈ 'ఈగో'ల స్వారీ ఎందుకు?
ఎవరు గెలిచినా,గెలిచేది ఐ కాదు వుయ్.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
Date: 04.08.2012

వంశీ || నిరంతరం నీ ఊహల్లో ||


ఏవో కొన్ని అత్యద్భుత అమలిన క్షణాలు తప్ప
నేనెప్పుడూ నిన్ను ప్రేమించలేదు
చాలాసార్లు మోహించాను
ప్రతీసారీ కామించాను,
నిన్ను తాకినపుడు నేనెలాంటి
అభౌతికాలౌకికానందానికీ లోనవ్వలేదు,
బహుశా నీకనిపించిందేమో..

నువ్ నాలా కాదని నమ్మి,
నేన్నిన్నెపుడూ ప్రేమించలేదేమో..
నీ దూరమే నేర్పింది
ప్రాధాన్యతలూ, వస్తు విశేషాలూ
నిరంతరం రూపుమార్చుకుంటాయని,
కాసేపు నీ సమయాన్ని బుజ్జగించో బెదిరించో
నా స్థలానికి రా
నా కాలమాగి చాలా కాలమైంది,
నా చెంపనో గుండెనో గాయాల్తో సంగీతీకరించు కోపం తగ్గేదాకా,
ఇన్నాళ్ళ నా కన్నీటికి కారణం దొరుకుతుంది అపుడైనా..

వీలైతే
నేననుభూతించని అనుభవాల్ని దోసిళ్ళలో నింపుకురా,
తలంటుపోసుకుని ప్రాయశ్చిత్తుడనౌతా,
మరలిపోకు, నేన్నిన్ను గుర్తించలేకపోతే
అందని ఆకాశం అందుకున్నానన్న తృప్తి
మిగుల్చుకోడానికి నాకిదే చివరి అవకాశం,

గుర్తుందా, నువ్వనేదానివి,
"నేను మరణిస్తే ఏం చేస్తావ్" అని,
నవ్వొస్తోందిపుడు
సగం చచ్చిన నాకోసం నిన్ను రమ్మని అరుస్తుంటే,
శరీరమూ కంపిస్తుంది,నువ్ నిజంగా వొస్తే
నాలో నాకు తెలీని మార్పుల్ని నీ నవ్వులో వెతుక్కుంటూ
మళ్ళీ జన్మించేట్టు నిన్నోసారి కౌగిలించుకోకుండా ఉండగలనా,
అప్పటికీ నేన్నిన్ను ప్రేమించలేక కామిస్తూనే ఉంటే
నన్ను నేను చంపుకోక ఆగగలనా..

నిన్నటంత పవిత్రంగా నేడు చూడగలనా
వేరొకరు తలదాచుకుంటున్న
వేడిశ్వాసలొదిలే నీ ఊపిరుల్ని,
వొద్దొద్దు,
నేనెప్పటికీ నాలా చూడలేనిక,
నీలా ప్రేమించనూలేను..
వంతెనలేని శూన్యానికి అటు నువ్వు, ఇటు నేనై..

నీకూ నాలా అనిపించట్లేదూ,
ఎన్నడూ కనపడని పొరల్ని దాటి
నా అసలు నేను నీముందుకొస్తుంటే
కించిదనుమానమైనా కలగడంలేదూ..

మనమెన్నటికీ సమాంతర రేఖలమే
పరస్పరాలోచన్ల తిర్యగ్రేఖ దిగంతం దగ్గర
మనల్ని కలిపే సాహసం చేయనుందా,
బ్రతుకు బరువుకు పాతాళంలో పాతుకుపోయిన చూపుల్తో
రేపటి నిన్ను ఊహించుకుంటూ
విశృంఖల శృంఖలాల్లో పోగొట్టుకున్న రక్తస్పర్శల్ని
తిరిగి నావైపు మళ్ళించుకుంటూ,
అదిగో కనిపిస్తుందా అనంతం,
కలుద్దాం అక్కడే,
అప్పుడైనా నేన్నిన్ను కామించకుండా ప్రేమించగలనా..

4.9.12

పీచు శ్రీనివాస్ రెడ్డి || 'మనసు' కథ ||


ఏ ఎండకో ఇది నీడనిస్తుంది
ఏ వానకో ఇది గొడుగు పడుతుంది
ఆశల రెక్కలు రాలి నేల పాలైతే
ఆకాశానికేసి చూస్తూ అర్థిస్తుంది
రంగులు మార్చే కాలం ముందు
హంగులతో ముస్తాబవుతుంది

ఏదో వెలితి వెన్నంటే ఉంటుంది
పొద్దు పోనీయక
నిద్దుర రానీయక
సద్దు చేస్తూనే ఉంటుంది
ఆశను వెంట పెట్టుకుని , మనసును గాయం చేస్తూ
ప్రతి నిత్యం తొంగి చూస్తూనే ఉంటుంది

03-09-2012

బెడిదె నరేందర్ || అనర్థ శాస్త్రం||



పైసాలో
పదోవంతు
పదిలో ఐదుగురికి
పంచితే
వాళ్ళిళ్ళళ్ళో పస్తులు
పొలాల్లో ఆత్మహత్యలే
పండుతాయి

ఇద్దరే
యేడుపాళ్ళు
యేడురోజులూ తింటే
మిగతా ముగ్గురికి
వారానికి మూడు రోజులు
రెండు పూటలూ
యేడుపే

పైసాలో
ఇంత భారతముంటే
పార్లమెంటు
యిద్దరి సుఖం కోసం
పరిచిన
పరుపే అవుతుంది
పంచాయితీ పెట్టండి!

3/9/2012

వంశీ || పొక్కిలి ||


వాకిలంత దుబ్బ
పొద్మీకి సాన్పు సల్లి ఇల్లలికెగద
ఏం రోగం దీన్కి, కనవడ్తలే,
"ఓ ఈరముష్టోల్ల ఎంకటీ
మా లచ్చి కనవడ్డాదిర"
ఈన్కేమైంది శెప్పకుంట మర్లవట్టె
శేతులెందుకో వొన్కుతాన్నై,
సర్పంచెలక్షన్ల తక్లీఫ్ ఐతాని
ఎమ్మెల్యే గాడేమన్న ఇంట్ల సొచ్చెనా..

"నాయినా, అమ్మ మర్రిబాయి పొంటి ఉరుకుతాంది
బట్టలన్ని శినిగున్నై కంపలవడ్డట్టు"
బీడీల్చుట్టవోయిన మా బిడ్డె
గుడ్డేలుగు కండ్లవడ్డట్టు హైబతై,

ఉప్పరి పన్జేశిన కండలొక్కపారే ఉబ్బి
గడ్డపార దొర్కవట్టి,

-"లమ్డీకే,
దైర్నమేంద్రా ఎమ్మెల్యే ఇంటికి రానీకి,
ఇడువుర్రా కుక్కల,
మన్తోనే జగడం పెట్కుంటాడు, వీని జాతిన్.. "

సచ్చిన మా అవ్వ బొందను తవ్వినట్టైంది
సావుకున్న నా పెండ్లాం కడుప్మీద తన్నినట్టైంది,
దిమాగ్ తిరిగి, కోపం పెరిగి, గడ్డపార కుచ్చితె
మోరిల వడ్డ పందిలెక్క రక్తంవాగుల వాడు,
కుక్కలు పరార్, బైటికచ్చిన పేగుల్జూశి,

పెండ్లాం యాదికచ్చి బిరానింటికి పోంగ,
అలికినట్టు కొట్టె వాకిలంత
లచ్చి కండ్లు తెరవంగనె,

జెర్శేపటికె పోలీస్ బూట్లు
ఆకిలంత మల్ల పొక్కిలి జేస్కుంట,
శేత్ల గడ్డపార
పోలీసోల్లను అందాజ చూస్కుంట
ఎమ్మెల్యేగాని రక్తంతోని నడింట్ల ముగ్గుబొట్లు జారేస్కుంట...

3.9.12

Mercy Margaret ll నిష్కళంకమైన ప్రేమ||


1.
ఆమె
బండసందులో ఎగురు పావురం
పేట బీటల నాశ్రయించి
ఎప్పుడూ
తను వేసుకున్న కంచెలోనే
కట్టుకున్న ఒంటరి కోటలోనే
దాక్కునే పావురం

2.
అతడు
అడవి వృక్షములలో జల్దరు వృక్షం
కొండలమీద నుంచి ఎగసిదాటుతూ
మెట్టల మీద నుంచి
గంతులు వేస్తూ పరుగెత్తి వచ్చే
లేడి పిల్ల

3.

బండసందు దగ్గర నిల్చొని
ఆమెను
నా పావురమా
నీ స్వరం మధురం ,
నీ ముఖము మనోహరం
"నీ ప్రేమగా" మారాలని వచ్చానిఅని
పిలుస్తూ తను

4.
బెదురు చూపులతో
భంగపడి ,మోసపోయి
గుండె నిండా గాయాలతో
ఏడ్చి ఏడ్చి గుంతలు పడ్డ కళ్ళతో
బొంగురు పోయిన గొంతుతో
ఆ బండ సందులో
మూల్గుతూ ఆమె

5.
ఆ మాటకు
స్పందిస్తూ ఆశ్చర్యంగా
అతని కళ్ళలోకి చూసింది

6.
సప్త సముద్రాలకన్న
అనంతమైన ప్రేమ నిండి
తన కోసం ప్రాణం ఇవ్వగల భద్రత
ఆ బాహువుల్లో కనుగొని
తన మురికి గతాన్నంతా
మాటల హిస్సోపుతో ప్రేమగా పవిత్రం చేస్తూ
లోకపు దృష్టి ,చెవులు కాకుండా
దైవాత్మతో

7.
అతడు
ఆమె స్వరాన్ని పవిత్రమైన ఆలాపనగా
భీతిల్లి గాయపడ్డ ఆమె హృదయాన్ని
మనోహరమైన ముఖంగా
ఆప్యాయంగా
పిలుపుతోనే మాటల కౌగిలిస్తుంటే

8.
ఏం చేయగలదు
ఆ అద్వితీయ ప్రేమ కోసం
కళంకమైన తన ప్రేమను
నిష్కళంకమైనదిగా మార్చి
అపవిత్ర మడుగులు ,మేడలనుండి
పవిత్రమైన తన వక్షస్థలాన్ని ఆశ్రయంగా ఇస్తుంటే

9.
కృతజ్ఞత పూర్వకంగా
కన్నీటి నీరాజనాలు
రాలుస్తూ
అతని పాదాల దగ్గర వ్రాలింది

10.
ఇప్పుడు అతనే
బండ సందు
పేట బీటలు అని
హృదయాన్ని తనకు అర్పిస్తూ
ఆమె
నిత్యమైన ప్రేమను అనుభవించబోతూ ♥
-------------------------------------------------------------
by mercy margaret (27/8/2012)
(పరమగీతము 2:14-బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము. )

డా. రాళ్లబండి కవితాప్రసాద్ ||కొన్ని కవిత్వ క్షణాలు ||


పదాల మొగ్గలు
పూలు గా వికసిస్తే కవిత్వం.
వాక్యాల తీగలు
కొమ్మల కెగబాకితే కవిత్వం.
ఇప్పుడు కొన్నికవిత్వక్షణాలు!
... ... ...
ఆమె లో ఆడ తనం ధ్వనించినపుడు
ఒక పద్యానికి వళ్ళుజలదరిస్తుంది.
భావం రూపమైన సృష్టి తొలిక్షణాల లోని లాలిత్యం
రూపం భావంగా మారిపోయి కవిత్వమౌతుంది .
... ... ....
సౌందర్యం ఒక మెరుపు తీగ
దాన్ని అక్షరాలు గా మెలికలు తిప్పు
విషాదం గడ్డ కట్టిన కన్నీటి చుక్క !
దాన్నివాక్య ప్రవాహం చెయ్
నిరాశ ఒక అనంత మైన లోయ...
దాన్నికవిత్వశిఖరాలతో నింపెయ్
ఆశ జీవితపు జాతీయ పతాక
దాన్నికాలం కొండ మీద ఎగరెయ్..
..... ...... .......
అక్షరానికి ధ్వని ఉంది,
ధ్వనికి ప్రాణం ఉంది,
ప్రాణానికి జీవితముంది,
ఆ జీవితం నిండా
ఆశా సౌందర్యాలు,
నిరాశా విషాదాలు
వాటికి సమాంతరంగా
నిరంతరం కవిత్వక్షణాలు ...

కవితాచక్ర || తిరిగిరాని క్షణం||


స్థబ్దత నిండిన గుండెలో
చప్పుడు చేస్తూ
రివ్వున దొసుకొచ్చి,
గతాన్ని తాకిన స్మర శరం!
కాలాన్ని సాయమడిగి
ఆర్తిగా బంధించబోయాను...
కలకలం రేపడమే తప్ప,
కాలానికి ఎలా చిక్కగలనంటూ..
జాలిగా చూస్తూ..
హ్రుది వాకిలి
విడిచి వెళ్ళిపోయింది!

తడి ఆరని కన్నుల కలువల్లో
పుప్పొడి అద్దుతూ
తుషారస్నాత ప్రభాత స్వప్నపు
వెన్నెల మరక!
రెప్పల తలుపుల్లో లాలనగా
బంధించబోయాను...
అందమైన నలతనవుతానే తప్ప,
తలపుల తలుపుల్లో
బందీని ఎలా అవుతానంటూ
దైన్యంగా చూస్తూ
కళ్ళ లోగిళ్లు విడిచి వెళ్ళిపోయింది!

అంతరంగపు ఆకాశంలో
మిణుకు మిణుకుమంటూ
వెలిగే స్మ్రుతి నక్షత్రం!
ఆనందపు రెక్కలు కట్టుకుని,
ఆబగా అందుకోబోయాను...
అంధకారపు ఆశల వలయంలో
మిణుక్కుమంటానే తప్ప,
పట్టు చిక్కే వెలుగునెలా
అవుతానంటూ..
అమాయకత్వాన్ని వెక్కిరిస్తూ
మది చాటు మబ్బుల పరదా దాటి
మసకబారిపోయింది!

date: 02/08/2012

కరిముల్లా ఘంటసాల|| కన్న తల్లి!? ||


విమర్శకా!
కుక్కా అని పేరెట్టి మనిషిని కాల్చెయ్‌
బసుల్ని తగలెట్టిన పోరల్ని
ఉరేసి చంపెయ్‌
ఆకలిగొన్న తాచులాగ
ఈయమ్మ తన బిడ్డల్నే మింగేస్తోంది
గుడి కట్టి పూజలూ భజనలూ చేసెయ్‌!
కవీ!
బస్సు కళేబరంపై నువ్‌ కార్చిన కన్నీరు
తార్నాక రోడ్లను ముంచి ప్రవహిస్తోంది
నీ కవిత కాగితప్పడవలో పయనిస్తూ
ములిగేవు నువ్‌ జర భద్రం!
గ్లిజరిన్‌ కన్నీళ్ళు తాగి మత్తెక్కావ్‌
ఈలలూ చప్పట్లకు కొదవే లేదు
నాటకం రక్తి కడితేనేకదా
ఏడ్పుగొట్టు పాత్రలు ఆకట్టుకుంటాయ్‌!!
తల్లీ!
ముగ్గురు బిడ్డల యమ్మ మూలపుటమ్మ!
ముగ్గుర్నీ మూడ్రకాలుగా చూశావ్‌!
మనిషిని యాసతో, ఆహార్యంతో, బొందపెట్టే చోటుతో తూచావ్‌!
హస్తినలో అంగబలం, అసెంబ్లీ లో అంకెబలం ఉన్నవాడికీ,
హైదరాబాదును రింగురోడ్డై చుట్టినోడికీ,
అన్నీ అన్నీ ఉన్నోడికే
మిగతా అన్నీ దోచిపెట్టావ్‌!
' విగ్న్యానులనే అగ్న్యానుల్నీ'
' చదువుకుంటున్నామనుకుంటున్న మూర్ఖుల్నీ'
తొక్కుకుంటూ
పెంచుకున్న ఆశల్ని చిదిమేసి
ఆరు దశాబ్దాల్లో అరవై సార్లు
నువ్వే ఇచ్చిన మాటనీ, భరోసానీ
నువ్వే తుంచేసి
నమ్మకమనే పదాన్ని చరితలోంచే చెరిపేశావ్‌!
భవితపై ఆశను తుంచేశావ్‌!
అన్నీ కోల్పోయిన బిడ్డ
దిక్కులేని శవంగా మిగిలితే
' ఛ్ఛీ...ఛ్ఛా' అంటూ చావును వెటకారం చేశావ్‌!
తల్లీ!
నా తల్లీ!!
బస్సేగానీ మనిషి పట్టని తల్లి
డబ్బే గానీ ప్రాణానికి విలువివ్వని తల్లి
జీవితం కోసం పెనుగులాడే బిడ్డని
కష్టాల కడలిలో ఊపిరాడక కొట్టుకుంటున్న బిడ్డని
ఆ దారినే పోయే ప్రతివాడితో
రంకు కట్టే తల్లి
ఛీ నా తల్లీ!
థూ నా తల్లీ!!

03-09-2012