పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, అక్టోబర్ 2013, బుధవారం

కవిత్వంతో ఏడడుగులు


ఆక్టేవియో పాజ్ రాసిన ఈ కవిత నిజంగా కనువిప్పు కలిగించే కవిత. స్త్రీలలో అందాన్నీ, ప్రేమనీ కవులు ఏ కోణంలో చూడాలో చూపించిన కవిత. శారీరిక సౌందర్యాన్ని మాత్రమే పొగిడేది అన్నిటిలోకీ దిగువస్థాయి కవిత. అందుకే అరిగిపోయిన పదబంధాలు వొద్దు అన్నాడు. దీనిబట్టి అర్థం అవుతున్నదేమంటే, ప్రతి భాషలోనూ ఈ అరిగిపోయిన పదబంధాల బాధ ఉందన్న మాట.
స్త్రీలో శారీరక సౌందర్యం కాక మానసిక సౌందర్యాన్ని చూడగలిగినపుడూ, భావనా శక్తి, మానసిక పరిణతి చూడగలిగినపుడూ, వ్యక్తి గౌరవం పట్ల మనకి అచంచలమైన విశ్వాశం ఉన్నప్పుడూ మాత్రమే స్త్రీని మనం గౌరవించగలం. కవులకే భావనాపరమైన పరిణతిలేనపుడు సామాన్యులనుండి ఏమి ఆశించగలం? వాళ్ళు సమాజానికి చెప్పే హితబోధలకి ప్రామాణికత, విలువ ఎక్కడనుండి వస్తాయి? కవులు ఈ ప్రేమ గురించిన పడికట్టు మాటలూ, అరిగిపోయిన పదాలూ, అరిగిపోయిన ఊహలూ చెప్పినవే చెప్పడం మానేసి, స్త్రీని స్నేహితురాలిగా మన్నించడం, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడి శ్రేయస్సును కోరుకుని, ఏ ప్రతిఫలాపేక్షాలేకుండా ప్రోత్సహించిన రీతిలో ప్రోత్సహిస్తూ, ఆ స్నేహం వల్ల తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే ప్రయత్నం చెయ్యాలి. అటువంటి స్నేహాన్ని వ్యాప్తి చెయ్యాలి; ఆ వ్యక్తి స్వాతంత్ర్యాన్ని మన్నించడం తమ రచనలద్వారా పాదుకొల్పాలి.


ఇక అరిగిపోయిన పదబంధాలొద్దు ... ఆక్టేవియో పాజ్

.
చంద్రముఖీ!
పొద్దుతిరుగుడుపువ్వు సూర్యుడివైపు తన దళాలు తిప్పినట్లు,
నేను పేజీ తిప్పినడల్లా
నీ ముఖారవిందాన్ని నా కభిముఖంగా తిప్పుతావు
.

సుహాసినీ!
పత్రికలోని అందాల సుందరాంగీ!
ఏ మగాడైనా
నిన్ను చూడగానే మంత్రముగ్ఢుడౌతాడు
.
నీ మీద ఎన్ని కవితలు రాసి ఉంటారు?
ఓ బియాట్రిస్!
నీకెంతమంది డాంటేలు ప్రేమలేఖలు వ్రాసి ఉంటారు
నీ భ్రాంతిమదాకారానికి?
కల్పిత భావ వివశత్వానికి?
***
కానీ, ఈ రోజు
నేను మరొకసారి అరిగిపోయిన మాటలనే వాడి
నీ మీద కవిత వ్రాయదలుచుకో లేదు.
చాలు, చాలు!
ఇక ఈ రొడ్డకొట్టుడు పదప్రయోగాలు.
.
ఎవరి సౌందర్యం తెచ్చిపెట్టుకున్నదిగాక,
వాళ్ళ స్వయం ఆకర్షణ శక్తిలో ఉంటుందో,
వాళ్ళ తెలివితేటలలో ఉంటుందో,
వాళ్ళ సహజసిధ్ధమైన నడవడిలో ఉంటుందో
అటువంటి స్త్రీలకి
నేనీ కవితని అంకితం ఇస్తాను
.
ఈ కవిత షహజాదేలా
ప్రతిరోజూ ఒక కొత్త కథని చెప్పడానికి మేల్కొనే స్త్రీలకోసం,
కొత్తదనాన్ని ఆలపించే కథలు...
యుధ్ధాలని ఆహ్వానించే కథలు...
పెనవెసుకునే హృదయాల ప్రేమకై యుధ్ధం...
ప్రతి దినమూ మనసులో రగిల్చే వినూత్న రాగాలకై యుధ్ధం...
ఉపేక్షించబడ్డ హక్కులకై యుధ్ధం...
లేదా, మరొక్క రాత్రి బ్రతికి బయటపడడానికి సలిపే యుధ్ధం.
.
అవును, బాధామయజగత్తులోని స్త్రీలు మీకందరికీ,
సతతవ్యయశీలమైన ఈ విశ్వంలో ప్రకాశించే నక్షత్రాలవంటి మీకు,
వెయ్యిన్నొక్కరాత్రులు పోరు సల్పిన నీకు,
నా ఆప్తస్నేహితురాలివైన నీకు.
.
ఇక నుండీ,
అందాన్ని చూడడానికి నేను పత్రికలలో వెతకను...
దానికి బదులు
రాత్రినీ,
వినీలాకాశం లోని మెరిసే తారకల్నీ ఊహిస్తాను.
చాలు!
ఇక అరిగిపోయిన పదబంధాలొద్దు.
.
(షహజాదే : వెయ్యిన్నొక్క రాత్రులనబడే అరేబియన్ నైట్స్ కథల్లో, తెల్లవారేదాకా రోజుకొక కథ చెబుతూ, కథలోని ఉత్సుకత నిలబెడుతూ తనజీవితాన్ని మరొక్కరోజు పొడిగించుకుంటూ అతి చతురతతో తన లక్ష్యాన్ని నిర్వహించిన కథానాయిక)
.
ఆక్టేవియో పాజ్
.
No More Clichés
.
Beautiful face
That like a daisy opens its petals to the sun
So do you
Open your face to me as I turn the page.
Enchanting smile
Any man would be under your spell,
Oh, beauty of a magazine.
How many poems have been written to you?
How many Dantes have written to you, Beatrice?
To your obsessive illusion
To your manufactured fantasy.
But today I won't make one more Cliché
And write this poem to you.
No, no more clichés.
This poem is dedicated to those women
Whose beauty is in their charm,
In their intelligence,
In their character,
Not on their fabricated looks.
This poem is to you women,
That like a Shahrazade wake up
Everyday with a new story to tell,
A story that sings for change
That hopes for battles:
Battles for the love of the united flesh
Battles for passions aroused by a new day
Battles for the neglected rights
Or just battles to survive one more night.
Yes, to you women in a world of pain
To you, bright star in this ever-spending universe
To you, fighter of a thousand-and-one fights
To you, friend of my heart.
From now on, my head won't look down to a magazine
Rather, it will contemplate the night
And its bright stars,
And so, no more clichés.


 Octavio Paz

                                                                                                                         ______నౌడూరి మూర్తి    

కవిత్వంతో ఏడడుగులు


 


వర్ణన ... షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి

.

జార్జి “దేముడు పొట్టిగా లావుగా ఉంటాడు,” అన్నాడు.

నిక్ “లేదు, సన్నగా పొడవుగా ఉంటాడు,” అన్నాడు.

“అతనికి తెల్లని పొడవాటి గడ్డం ఉంటుంది,” అని లెన్ అంటే

“లేదు, అతను నున్నగా గడ్డం గీసుకుని ఉంటాడు,” అన్నాడు జాన్.

విల్ “అతను నల్లని వాడు,” అంటే, “కాదు, తెల్లని వాడు” అన్నాడు బాబ్.

రోండా రోజ్ అంది: “దేముడు పురుషుడు కాదు, స్త్రీ.”

నాలో నేను నవ్వుకున్నాను గాని, దేముడు స్వయంగా సంతకం చేసి

నాకు పంపిన ఫోటోని వాళ్ళకెవ్వరికీ చూపించలేదు.

.

షెల్ సిల్వర్ స్టీన్

(September 25, 1930 – May 10, 1999)

అమెరికను కవి


ఈ చిన్న కవితలో మంచి చమత్కారం చూపించేడు కవి. కవిత్వాన్ని వివరించమంటే ఎవరికి ఏది అవగాహన అయితే అదే కవిత్వం అని నిర్వచిస్తారు చాలమంది. సత్యం ఒక చేపలాంటిది. ఎంత చిక్కని చిక్కం వేసినా అందులోంచి జారిపోగల ప్రతిభ దానికి ఉంది. కవులూ, శాస్త్రకారులూ చేసేది సత్యాన్వేషణే. అయితే, ప్రతి వ్యక్తీ తాను దర్శించిన సత్యాన్ని చెప్పడానికి భాషని ఒక వాహికగా వాడుకుంటాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయాలు రెండు ఉన్నాయి. మొదటిది మనం ఉపయోగించే భాషకి సత్యాన్ని పూర్తిగా ఆవిష్కరించగలగడం విషయంలో కొన్ని పరిమితులున్నాయి (అది వ్యక్తికున్న భాషా పరిజ్ఞాకి మించి ఉపయోగించే భాషకీ, శబ్దాలకీ ఉన్న పరిమితులవల్ల); రెండవది , ఈ భాషా పరిమితులుదాటి ఎంత స్పష్టంగా సత్యాన్ని ఆవిష్కరించగలిగినా, ఆ ఆవిష్కరించబడిన సత్యం రచయిత/ కవి/ శాస్త్రకారుడు వైయక్తికంగా దర్శించినదే తప్ప, అదే సత్యం అవవలసిన పనిలేదు. అంటే Even in the best of expressions surpassing the limitations of language, a truth unveiled through the language is still a subjective truth, and need not be the truth itself.

ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, మనకి రాసిన మాట మీద ఉండవలసిన నమ్మకం కంటే ఎక్కువ నమ్మకం , విశ్వాసం ఉండడం వల్ల. కారణం చాలమంది పరిశోధకులు చరిత్రకీ, సాహిత్యానికీ ఇచ్చే వ్యాఖ్యానాలలో తాము చూసిన సత్యాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తారు. సంస్కారవంతుడైన చదువరిగా ఆ ఆవిష్కరించబడిన సత్యపు పరిమితులని మనం సదా గుర్తుంచుకోవాలి. గుడ్డివాళ్ళు ఏనుగును వర్ణించిన రీతిలో, మనం అందరం మనకున్న భాషాభావపరిమితులకు లోబడి మనం దర్శించిన సత్యాన్ని ఆవిష్కరించగలుగుతాం అన్న ఎరుక మనకి ఉండాలి. మనం చెప్పినదే సత్యం అన్న మమకారం ఉండకూడదు. Written or Spoken Word మీద అచంచలమైన విశ్వాసం మనల్ని సరియైన తోవలో నడిపించదు.

ఈ విషయాన్ని కవి చాలా సున్నితంగా చెప్పాడు ఈ కవితలో.
.

Description

.


George said, “God is short and fat.”

Nick said, “No, He’s tall and lean.”

Len said, “With a long white beard.”

“No,” said John, “He’s shaven clean.”

Will said, “He’s black,” Bob said, “He’s white.”

Rhonda Rose said, “He’s a She.”

I smiled but never showed ‘em all

The autographed photograph God sent to me.
Shel Silverstein

(September 25, 1930 – May 10, 1999)

American poet, singer-songwriter, cartoonist, screenwriter, and author of children’s books.

                                                                                                   


                                                                                                                       ______నౌడూరి మూర్తి    
                                                                                                                            October 27/2013  

కవిత్వంతో ఏడడుగులు 

మనం ఒక మొక్కని నాటుతున్నామంటే ...

మనం ఒక మొక్కని నాటుతున్నామంటే ఏమిటి నాటుతున్నాం?
మనం సంద్రాలు అవలీలగా దాటగల ఓడని నాటుతున్నాం,
దాని తెరచాపలు ఎగరేసే నిలువెత్తు వాడస్థంభాన్ని నాటుతున్నాం;
తుఫానులను ఎదుర్కోగల చెక్కలని నాటుతున్నాం,
దాని వెన్నుని, దూలాల్ని, లో దూలాల్ని, కీళ్ళని,
మనం ఒక మొక్కని నాటుతున్నామంటే ఒక ఓడని నాటుతున్నాం.

మనం ఒక మొక్కని నాటుతున్నామంటే ఏమిటి నాటుతున్నాం?
నువ్వూ నేనూ ఉండడానికి ఒక ఇల్లుని నాటుతున్నాం,
ఇంటివాసాల్ని, పట్టీల్ని, మిద్దెల్ని, నాటుతున్నాం,
గుబ్బమేకుల్ని, పెండెబద్దల్ని, తలుపుల్ని నాటుతున్నాం,
దూలాల్ని, ద్వారబంధాల్ని, ఎన్ని అవసరాలో అన్నిటినీని
మనం ఒక మొక్క నాటుతున్నామంటే ఒక ఇంటిని నాటుతున్నాం.

మనం ఒక మొక్క నాటుతున్నామంటే ఏమిటి నాటుతున్నాం?
మనం రోజూ చూసే వేలరకాల వస్తువుల్ని;
మన గోపురాలని తలదన్నే మెట్లని నాటుతున్నాం,
మన దేశపతాకాన్ని ఎగరేసే జండాకొయ్యని నాటుతున్నాం,
ఎండనుండి రక్షించే ఒక ఒక నీడని నాటుతున్నాం
మనం ఒక మొక్కనాటుతూ ఇవన్నీ నాటుతున్నాం.
.

హెన్రీ ఏబీ
జులై 11, 1842 - జూన్ 7, 1911
అమెరికను కవి.

సాహిత్యంలో ఒకే ఒక్క కవితతో అజరామరమైన కీర్తి సంపాదించిన వాళ్ళు చాలా తక్కువ. అటువంటి అతితక్కువమంది కవుల్లో హెన్రీ ఏబీ ఒకడు.

మనకి తెలిసిన విషయాలే అవొచ్చు. కానీ, చెప్పే విధానంలోనే తేడా. చిత్రకారులందరికీ అవే కుంచెలు, అవే రంగులు; ఒక భాషకి చెందిన కవులందరికీ అదే వర్ణమాల, అవే పదాలూ అవే ప్రయోగాలూ. కానీ జాషువాలూ, కరుణశ్రీలూ, రవివర్మలూ, వడ్డాది పాపయ్యలూ, బాపూలు వందలకొద్దీ పుట్టుకురారేమి? జాషువా, కరుణశ్రీ పద్యాలు చదువుతుంటే మనకి బుర్రకొట్టుకున్నా పలకని శబ్దాలు, వాళ్ళకేమిటి, అడుగులకి మడుగులొత్తుతూ పడుతున్నాయా అనిపిస్తుంది. రవి వర్మదో, వ.పా. దో, బాపూదో బొమ్మ చూస్తుంటే వీళ్ళ కళ్ళకీ, వేళ్ళకీ మధ్య ఏదో తెలియని పురాకృత సంబంధం ఉందేమోననిపిస్తుంది.

కొన్ని కవితలు పైన చెప్పిన ఏ సొగసులూ లేకపోయినా, వాటిలోని అంతర్లీనమైన సౌందర్యానికి, తాత్త్విక భావనకి, అభివ్యక్తి వెనక ఉన్న ఉదాత్తమైన పరిశీలనకి, దానికి మనం ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించదలుచుకుంటే, అన్నిరకాలుగా వ్యాఖ్యానించడానికి అనువుగా ఉంటూనే, ప్రతి వ్యాఖ్యానమూ మనోరంజకంగా ఉండడంలోనే వాటి నిరాడంబర సౌందర్యం ఉంటుంది. అదిగో సరిగ్గా అలాంటి కవితే ఇది. ఇక్కడ ఉపమలూ, ఉత్ప్రేక్షలూ, రూపకాలూ మొదలైన ఏ అలంకారాలూ లేవు; గంభీరమైన పదప్రయోగాలూ లేవు; కవి చాలా ప్రశాంతంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేడు. కేవలం సహజోక్తి. అరే. సహజోక్తిలో ఇంత ప్రభావం ఉంటుందా అని ఆశ్చర్యపోయేట్టు చేశాడు కవి.

దీన్నిప్పుడు కవిత్వానికి అన్వయించి చూడండి.

మీరు కవితని నాటుతున్నారంటే ఏమిటి నాటుతున్నారు? మీ సున్నితమైన స్పందనలని నాటుతున్నారు, మీ కన్నీళ్ళని నాటుతున్నారు. మీ బాధల్ని నాటుతున్నారు. మీ విరహాల్ని నాటుతున్నారు. మీ ఆనందాల్ని, మీ సంతోషాల్ని, మీ సమస్యలని, మీ అవగాహనని, మీ వైరుధ్యాల్ని, మీ వైషమ్యాల్ని, మీ సంస్కారాన్ని... మీరొక వ్యక్తిత్వాన్ని నాటుతున్నారు.

మీరు ఒక కవితని నాటుతున్నారంటే ఏమిటి నాటుతున్నారు? మీ స్మృతిపథంలో బంధించిన ఒక కాలరేఖని నాటుతున్నారు. మీరు చేదుకున్న అనుభవాన్ని నాటుతున్నారు. ఒక జాతి సంస్కృతిని నాటుతున్నారు. మీ వారసత్వాన్ని నాటుతున్నారు. మీరు దర్శించిన ప్రకృతిని నాటుతున్నారు. మీ వివేచనని, మీ కల్పనని, మీ అధ్యయనాన్ని, మీ ఊహా చిత్రాల్ని, మానవాళి మహోన్నత ఆశయాల్ని, మీరు కంటున్న అపూర్వమైన కలని నాటుతున్నారు. మీరొక పరిణతి చెందిన మనీషిని, విశ్వనరుడ్ని నాటుతున్నారు.

సాహిత్య ప్రక్రియ ఏది కానీండి, ఇది గుర్తుంచుకుంటే, మన సమిష్ఠి కృషి, చేతన అయిన సాహిత్యం మానవకళ్యాణానికి ఉపకరించే దిశలో వెళుతుందని నా ప్రగాఢమైన విశ్వాసం.
.

What Do We Plant...

.

What do we plant when we plant a tree?
We plant the ship, which will cross the sea
We plant the mast to carry the sails;
We plant the plank to withstand the gales,
The keel, kalson, and beam and knee;
We plant the ship when we plant the tree.

What do we plant when we plant the tree?
We plant the houses for you and me,
We plant the rafters, the shingles, the floors,
We plant the studding, the lath, and the doors,
The beams and sidings, all parts that be;
We plant the house when we plant the tree.

What do we plant when we plant the tree?
A thousand things that we daily see;
We plant the spire that out towers the crag,
We plant the staff for our countries’ flag,
We plant the shade, from the hot sun free;
We plant all these when we plant the tree.

Henry Abbey


July 11, 1842 – June 7, 1911
American Poet


              
                                                                                                                          ______నౌడూరి మూర్తి                                                                                                      

కవిత్వంతో ఏడడుగులు

హొరేస్ హోలీ అన్న అమెరికను కవి కవితాసంకలనం "Divinations and Creation" లోనిది ఈ కవిత. ఇందులో మనం గమనించవలసిన చాలా విషయాలు ఉన్నై. ప్లేటో చెప్పిన "Poetry is Divine Madness" అన్నదే ఇక్కడ కవి చెబుతున్నాడు. అంటే పరోక్షంగా, కవి అటువంటి భావావేశంలోనే కవిత రాయాలి.... అలవాటుగానూ అలవోకగానూ రాసిపారేసి అది కవిత్వం అనేకంటే. తిలక్ చెప్పిన " ఏది చెప్పినా అది నీలోంచి రావాలి, చించుకుని రావాలి" అన్నభావన తాత్పర్యమూ ఇదే. ఆ ఆర్తిలోనే కవిత రావాలి. "కవి ఒక సృష్టికర్త కాదు. ఒక సాధనం. ఒక మీడియం. ఒక వాహిక," అని కవి భావము.

ఆ భవ్యకవితావేశంలో మనమాటలు మనకే కొత్తగానూ చిత్రంగానూ ఉంటాయి. నిజానికి మనకే ఆశ్చర్యం వేస్తుంది నేనేనా ఈ మాటలు రాసింది అని. అవి అప్పుడే ఎందుకు చెప్పాలి అన్నదానికి కూడా కవి సంజాయిషీ ఇస్తున్నాడు. ఈ మృత్తికతో కలిసి పాడవకముందే... అని. అంటే కవిత్వాన్ని edit చేసుకోవద్దని కాదు. కవిత్వం అలౌకిక మని కవిభావన. అంటే ఎప్పుడైతే లౌకిక భావన దానికి చేరువౌతుందో, దానిలోని నిర్భీతి, దాని అలౌకికత్వమూ పోతాయి. అక్కడ కవి చెప్పదలచుకున్నదానికంటే, మెప్పించదలుచుకున్నదానికి ప్రాధాన్యత వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా చెడిపోతుంది. ఇక్కడ ఒక చక్కని ఉపమ వాడేడు కవి. "రేపటిలా" అని. ఇది కాలానికి ప్రతీక. కాలం అన్నిటినీ చదునుచేసేస్తుంది. రేపుమనముందుకి వచ్చి కనిపించేవి ఎప్పుడూ, కాలం చదునుచెయ్యగా మిగిలినవే.

అలాగే చివరి చరణంలో ఒక చక్కని మాట చెప్పేడు. మనం రాసిన కవిత్వంలో సరుకు ఉంటే అది నిలబడుతుంది. కీర్తింపబడుతుంది. లేకపోతే పోతుంది. నేను మాత్రం "ఒక ప్రశాంతమైన కొలనులో విప్పారిన కలువలా నిద్రలోకి జారుకుంటాను" అంటున్నాడు. అంటే, కవిత్వం అనుభూతిచెందినప్పుడు, అదిరాసినప్పుడు వచ్చిన ఆనందమే దాని ప్రతిఫలం. అది ఉంటుందో లేదో మన బాధ్యత కాదు. దాన్ని నిలబెట్టవలసిన అవసరమూ లేదు. మాహాకవుల కృతులే కొన్ని కాలం ధాటికి నిలబడలేనప్పుడు అల్పులం మనమనగా ఎంత? ఆ ఎరుక మనల్ని కవిత్వానికి నిబద్ధులుగా చేస్తుంది. మన కృతులపట్లా, కృషిపట్లా అలవిమాలిన మమకారం నుండి దూరం చేస్తుంది. ఒక రకంగా పిల్లలకి ఆస్తిపాస్తులు సంపాదించిపెట్టలని తాపత్రయపడే తల్లిదండ్రుల మనోవేదనలాంటిదే మనకవిత్వంకూడా కాలానికి నిలబడాలని పడే తాపత్రయం. మనిషిని ప్రశాంతంగా చావనివ్వదు.

Foreword

“O That I be
As Oak to the carver’s knife, or tougher stone,
A moveless monolith,
Scored deep with secret hieroglyphs
Whence men will slowly, letter by letter, spell
Enduring exultation for their lives!
For I am a witness to a miracle
That opens a new mad mouth
Quick with astonishment of ardent words
Not mine but prophets to this wonder
That must be testified all new and strange
And ere it stale be kneaded in our clay,
Since memory would betray what must remain
Ever before us like tomorrow.
Of myself
I should not otherwise heap words
Upon the garbage of our daily gossip
But let you pass unhailed
Myself preferring to slip within a dream
Like a stretched lily in its quiet pool.”
.
    By Horace Holly

Divinations and Creation
Link: (http://archive.org/stream/divinationscreat00holl#page/1/mode/1up)


తొలిపలుకు
.

ఆహ్! నేనొక నిపుణుడైన పనివాడి కత్తికింది
ఒదిగే మెత్తని ఓక్ చెట్టు మానునో,
రహస్యచిత్రలిపిలో లోతుగా చెక్కబడిన
చెదరని ఏకశిలనో అయితే బాగుణ్ణు.
అప్పుడు అక్షరం అక్షరం నెమ్మదిగా చదువుకుంటూ
ప్రజలు జీవితకాలం ఆనందంగా ఉండగలుగుతారు.

ఎందుకంటే నేనొక చోద్యానికి ప్రత్యక్ష సాక్షిని
ఆ ఆశ్చర్యంలో ప్రవక్తల నోట వచ్చే భవిష్యవాణిలా
నాది కాని ఒక ఉద్వేగమైన భాష వెలువడుతోంది
అది చాలా కొత్తగానూ, చిత్రంగానూ ఉందని చెప్పక తప్పదు.
అది ఈ మృత్తికతో కలిసి పాడవకముందే ప్రకటించాలి
ఎందుకంటే, జ్ఞాపకం ఎప్పుడూ మోసం చేస్తుంది
నిత్యం మనముందు కనిపించే రేపు లా
ఏది మిగలాలో దాన్ని నిర్దేశిస్తూ.

నా గురించి
నేను గొప్పగా చెప్పుకోకూడదు
రొజూ మాటాడుకునే పోచికోలు కబుర్లు మినహాయించి .
ఓ నా కవితా! నిన్నెవ్వరూ అభినందించకపోతే పోనీ;
నేను మాత్రం నిద్రలోకి జారుకుంటాను
ఒకప్రశాంతమైన కొలనులో విప్పారిన కలువలా.
.

హొరేస్ హోలీ,
(April 7, 1887 - July 12, 1960)
అమెరికను కవి


                                                                                                              ______నౌడూరి మూర్తి

కవిత్వంతో ఏడడుగులు


ప్రతి కవికీ తనకు తానో, ఇతరులకో సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్థితి లేక సందర్భం వస్తుంది అసలు తన కవిత్వ కృషి ఎందుకో. (ఇప్పుడే కాదు ఇకముందెప్పుడు కవి అని వాడినా,అందులో కవయిత్రులు కూడా ఉన్నారని మనవి. ఆమాటంలో లింగ వివక్ష లేదు.)

ఈ కవిత్వంతో ప్రయాణం ప్రారంభించే ముందే మన ప్రయత్నం అసలెందుకో చెప్పుకుంటే బాగుంటుందని అనిపించింది. అందుకు డిలన్ థామస్ కవిత మీ ముందుంచుతున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. దీన్ని Disclaimerగా తీసుకోవచ్చు. ఇక్కడ చెప్పేవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు. వాటికి ఏ ప్రామాణికతా విలువా లేవు. నేను చదువుకున్నవీ, విన్నవీ, నా ఊహకి తట్టినవీ ఇక్కడ విన్నవించుకుంటున్నాను. సాధ్యమైనంతవరకు మూలాన్ని ప్రస్తావించడానికి ప్రయత్నిస్తాను. అంతమాత్రంచేత దానికి సాధికారత సిద్ధించదు. కారణం ఇందులో ఏ పరిశోధనా లేదు.

కవిత్వం ఒక ఆవేశం. ఒక రకంగా చెప్పాలంటే Aberration of Emotion. మనుషులందరికీ నచ్చినవి కవికి నచ్చకపోవచ్చు. ఎవరూ పెద్దగా పట్టించుకోని విషయాలని, పనికిమాలినవిగా వదిలేసినవి చిన్నపిల్లాడిలా కవి పట్టించుకోవచ్చు. అసలు కవిత్వం మనలో ఎప్పుడు ఎలా ప్రవేశిస్తుందోకూడా తెలీదు. అదొక వైరస్ లాంటిది. అదిపట్టిందంటే అమ్మవారు పూనినట్టుంటుంది. అది వదుల్చుకునేదాకా, కాగితమ్మీద ఆ కవితావేశాన్ని ఒలికించేదాకా ఈతరానివాడు ఒక సుడిగుండంలో చిక్కుకుని బయటపడడానికి చేసే ప్రయత్నంలా ఉంటుంది. ఇది సహజ స్థితి. కాని కొంత అలవాటైన తర్వాత, ఈతవచ్చినవాడు నూతిలోనో, చెరువులోనో చేసే విన్యాసంలా ఉంటుంది కవిత్వం. అంటే కేవల ఆవేశం నుండి కొంత సమర్థతలోకి వస్తుంది. ఇరవై ఏళ్ళవయసు వచ్చిన తర్వాత జీవితానికి అర్థం ఏమిటి? అన్న ప్రశ్న ఉదయించినట్టు, ఇప్పుడు ఈ కవిత్వం ఎందుకు రాస్తున్నట్టు అని కవికి అనిపించవచ్చు. (ఈ సందర్భం వారి వారి వ్యక్తిగత సంస్కారాన్ని బట్టీ, పరిస్థితుల అనుకూనలతనుబట్టి మారుతుంటుంది).

ఒక రకంగా కవిత్వం ఎందుకు రాస్తున్నట్టు అన్నదానికి సమాధానమే కవి మేనిఫెస్టో. మన సానుభూతిని బట్టి మనకు కొందరు కవులు నచ్చుతారు కొందరు నచ్చరు. కాని, మనం అలవరచుకోవలసినది, మన ఇష్టాయిస్టాలతో సంబంధంలేకుండా, ఎక్కడ కవిత్వాంశ ఉందో దాన్ని పట్టుకోవడం. అంటే వోల్టేర్ చెప్పినట్టు " I do not agree with what you say, but I defend to death that you have every right to say it అన్న Democratic స్ఫూర్తి అలవరచుకోవడం. పంకంలోంచి పంకజం వచ్చినట్టు వ్యక్తిత్వంలేని కవిలోంచికూడా మంచికవిత్వం రావొచ్చు అన్నసత్యం మనం గుర్తుంచుకోవాలి. కవీ కవిత్వమూ ఒకటిగా జీవిస్తే, జీవించగలిగితే అది ఆదర్శం. అవి చాలా అరుదైన వస్తువులు.

అలాంటి ఒక పంకజం ఈ Dylan Thomas కవిత.

In my craft or sullen art
.
In my craft or sullen art
Exercised in the still night
When only the moon rages
And the lovers lie abed
With all their griefs in their arms,
I labour by singing light
Not for ambition or bread
Or the strut and trade of charms
On the ivory stages
But for the common wages
Of their most secret heart.

Not for the proud man apart
From the raging moon I write
On these spindrift pages
Not for the towering dead
With their nightingales and psalms
But for the lovers, their arms
Round the griefs of the ages,
Who pay no praise or wages
Nor heed my craft or art.
.
Dylan Thomas
(27 October 1914 – 9 November 1953)
Welsh Poet

నా నైపుణి లేక కళ...
.
ఈ నిశ్శబ్ద నిశీధిని, ప్రేమికులు
తమ దుఃఖాలని కాగలించుకు నిద్రించేవేళ
బయట స్వచ్ఛంగా వెన్నెల విరజిమ్ముతుంటే
లోపల రెపరెపలాడుతున్న దీపం ప్రక్కన
నేను సాధనచేస్తున్న ఈ నైపుణ్యమూ,ఈ కళా
పేరుప్రఖ్యాతులకోసమో, జీవికకో
బ్రహ్మాండమైన వేదికలపై వాటిని
దర్పంతో ప్రదర్శించడానికో కాదు;
వాటి అంతరాంతర రహస్యాలు ఇచ్చే
అతి సహజమైన ఆనందంకోసం.

గాలికి రెపరెపలాడుతున్న కాగితాలపై
అందమైన వెన్నెలనుండి దూరంగా బ్రతికే
అహంభావి మనిషికోసం కాదు నేను రాస్తున్నది;
వాళ్ళ కోయిలలతోనూ, వాళ్ల స్తుతిగీతాలతోనూ
అమరులైన కవిశ్రేష్ఠులకోసమూ కాదు;
ఏ ప్రశంసలూ, ఏ పారితోషికాలూ ఇవ్వలేక
అసలు నా కౌశలంతో, కళతో నిమిత్తంలేకుండా
అనాదిగా వస్తున్న బాధల భుజాలపై
చెయ్యివేసి నడిచే కవిత్వ ప్రేమికులకి.

డిలన్ థామస్
(27 October 1914 – 9 November 1953)
వెల్ష్ కవి


                                                                                                                      ______నౌడూరి మూర్తి

కవిత్వంతో ఏడడుగులు
కవిసంగమం మిత్రులకి,


కవిత్వం ఒక మహాప్రవాహం. ప్రతి నాగరికతా నీటిప్రవాహాన్ని ఆనుకునే విలసిల్లినట్టు, ఈ కవిత్వం చెమ్మ ఎండిపోకుండా ఎవరు పదిలంగా ఉంచుకుంటారో వారిదగ్గర తప్పకుండా సంస్కారానికి ఆశ్రయం దొరుకుతుందని నా నమ్మకం. అసలు ఏ కవిత్వపు గాలీసోకకుండా మనిషిజీవితము ఉండదంటే అతిశయోక్తి కాదు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసః ఫణిః లో సంగీతానికి ఆసరాగా ఉన్నది ఈ కవిత్వమే. అది అందీ అందకుండా గొంతులోకొట్టాడుతుంటుంది. దొరికినట్టు దొరికి తప్పించుకుంటుంది. అది అనుభూతికి చిక్కినంతగా పాఠకుడి మాటకి చిక్కదు. ఒక్కోసారి కవికే చిక్కదు. ప్రతి కవితా క్రికెట్ ఆటలో ఇన్నింగ్స్ లాంటిది. స్కోరు ఎప్పుడూ సున్నాతోనే ప్రారంభం అవుతుంది... అంతకుముందు ఎన్ని సెంచరీలు చేసినా. ప్రతి కవీ ప్రతి సారీ తన కవితతో మెప్పించాలి తప్ప అంతకుముందు మంచికవితలు రాసినంత మాత్రంచేత తర్వాత రాసేవన్నీ మంచికవితలే రాస్తాడని హామీలేదు. అది షేక్స్పియర్ అయినా కాళిదాసయినా, మరో యువకవి అయినా ఒక్కటే. అలాగే మనం చేసే విమర్శలుకూడా మాటాడుకుంటున్న కవితకే పరిమితం తప్ప కవివ్యక్తిత్వంతోగాని, గత చరిత్రతోగాని ఏ రకమైన అనుబంధము లేకుండా చెయ్యాలి.

ఈ సందర్భంలో నాకు గుర్తొచ్చింది "సాప్తపదీనం సఖ్యం" అన్న పెద్దల మాట. ఏడడుగులు నడిస్తే స్నేహం ప్రారంభమవుతుందట. అలాగ వివిధ దేశాల కవులతో, వారి కవిత్వంతో చెయ్యబోయే స్నేహం ఈ శీర్షిక. మన ముందు తరాలలో వచ్చిన కవిత్వం మనకు తెలియడం వల్ల ఒకటి కవిత్వం దేన్నంటారో నిర్వచనం ఇచ్చేకంటే ఉదాహరణ ద్వారా చూపడం సులువవుతుంది; రెండవది మనకు ఎంత మంచి వారసత్వం ఉందో తెలుస్తుంది. ఇక్కడ 'మన ' అంటే విశ్వనరులుగా 'మన ' అనే అర్థం. మన మాతృభాష, దేశభాషలు కాదు. యావత్ మానవజాతి సాహిత్యం అంతా మనదే. మనం తెలుసుకోవలసినదే. లాభం పొందవలసినదే. నాకున్న భాషాపరమైన పరిమితులమేరకు, అవగాహనమేరకు ఈ నడక ప్రారంభిస్తున్నాను. ఇది ఒక వీక్లీ వాక్. ఒక్కడే నడిస్తే త్రోవ కష్టంగా ఉంటుంది. తోడుంటే ఎంతదూరమైనా అలసటలేకుండా ప్రయాణించొచ్చు.. కనుక తోడురావలసిందిగా మిత్రులందరికీ వినయపూర్వక ఆహ్వానం.


                                                                                                                         ______నౌడూరి మూర్తి

ఉర్దూ కవిత్వ నజరానా

    
ఉర్దూ కవిత్వ నజరానా. పేరు బాగుంది. కాని, ఏం రాయాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నాకు అన్నయ్య లాంటి యాకూబ్ నా మీద నమ్మకంతో రాయమన్నప్పటి నుంచి ఈ ప్రశ్నలు నిద్రపోనీయలేదు. కవితా విమర్శ జోలికి పోయే కన్నా, ఉర్దూ కవులను వారి కవితలను పరిచయం చేయడం మంచిదని భావించాను. కవితా విమర్శ చేయగల స్థాయి నాకు లేదు. ఉర్దూ కవుల్లో ఎవరి నుంచి మొదలుపెట్టాలి? గాలిబ్, జౌఖ్, మీర్, ఇక్బాల్... మహామహుల్లాంటి కవులు ... కవిసంగమంలో ఎవరి కవిత్వాన్ని ముందుగా పరిచయం చేయాలి? ఉర్దూ కవిత్వ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవితలే నా కళ్ళ ముందు కనబడతాయి. అవిభక్త భారతదేశంలో ప్రగతిశీల రచయితల సంఘం (తరఖ్ఖీ పసంద్ ముసన్నఫీన్)కు చెందిన కవిగా ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఉర్దూ సాహిత్య పుటలపై తనదైన ముద్రవేశారు.
ఫైజ్ అహ్మద్ ఫైజ్ తో ప్రారంభించాలనే నిర్ణయించుకున్నాను. ప్రతి శుక్రవారం ఫైజ్ కవితలను, వాటి అనువాదాన్ని, వివరణను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. వరుసగా ఉర్దూ కవుల కవితా కుసుమాలు కవిసంగమంలో విరబూయించడానికి చేసే కృషిలో ఏవయినా పొరబాట్లు దొర్లితే, కవిసంగమంలో పిల్లకాకి లాంటి వాడిని కాబట్టి క్షమించాలి. ఇక ఉపోద్ఘాతం చాలించి, విషయానికి వచ్చేద్దాం. ఫైజ్ కవితలు పరిచయం చేసే ముందు క్లుప్తంగా ఫైజ్ గురించి నాలుగు ముక్కలు మాట్లాడుకుని, ఆ తర్వాత ఆయన కవితలు చూద్దాం. ఫైజ్ అహ్మద్ ఫైజ్ 1911లో పాకిస్తాన్లో ఉన్న సియాల్ కోట్ లో జన్మించారు. ఉన్నతి విద్యాభ్యాసం తర్వాత కొంతకాలం లెక్చరర్ గా పనిచేసి 1942లో సైన్యంలో కెప్టెన్ గా చేరారు. 1951లో రావల్పిండి కుట్ర కేసులో పాకిస్తాన్ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది. 1955లో విడుదలయ్యారు. 1984 నవంబర్లో లాహోర్ లో మరణించిన ఫైజ్ అహ్మద్ ఫైజ్ తన జీవితకాలంలో రెండు ప్రపంచయుద్ధాలు చూశారు, అవిభక్త భారతదేశంలో రాజకీయాలను, దేశవిభజనను, బంగ్లాదేశ్ ఏర్పాటును చూశారు. ఎలాంటి నిరాశాజనక వాతావరణంలోనైనా ఆశాదీపాన్ని వెలిగించే ఫైజ్ కవితల్లో... ఆయన జైల్లో ఉన్నప్పడు రాసిన – జైలులొ ఒక రాత్రి- ఇప్పుడు చూద్దాం.
జైలులో ఒక రాత్రి
చీకటి పొదల్లో నక్షత్రాల దారుల్లో దట్టమైన రాత్రి నెమ్మదిగా దిగుతోంది పిల్లతెమ్మెర నన్నుతాకి వెళుతోంది ప్రేమపలుకేదో గుసగుసగా చెబుతోంది ఖైదు పెరట్లో దేశబహిష్కృత వృక్షాలు ఆకాశం చీరకు నగిషీలు అద్దుతున్నాయి గగన గవాక్షంలో ఉదారంగా ప్రకాశిస్తంది వెన్నెల సుందరహస్తం తారామండల వెలుగురవ్వలు ధూళిలో కరిగిపోయాయి ఆకాశం నీలి రంగు తేజస్సులో కలిసిపోయింది గుండెలో ప్రేయసి వేర్పాటు బాధా కెరటాల్లా పచ్చని మూలల్లో దట్టమైన నీడలు రెపరెపలాడుతున్నాయి మనసులో నిరంతరం ఒకే భావం కదలాడుతోంది ఈ క్షణం జీవితం ఎంత తీయగా ఉంది దౌర్జన్య విషాన్ని కలిపేవారు నేడు సఫలం కావచ్చు, రేపు కాదు. సమాగమ మందిరంలో దీపాలను వారు ఆర్పేసినా చంద్రుడిని ఆర్పగలరా?
ఈ కవిత ఫైజ్ అహ్మద్ ఫైజ్ జైల్లో ఉన్నప్పడు, కమ్యునిస్టు అనబడే ప్రతి ఒక్కడిని కుట్ర కేసులో ప్రభుత్వం అరెస్టు చేసి నిర్బంధించిన పరిస్థితిలో రాశారు. దుర్భరమైన అణిచివేతను ఎదుర్కుంటూ కూడా మొక్కువోని ఆత్మధైర్యాన్ని, ఆశాభావాన్ని ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఉర్దూ కవితను తెలుగులో రాయమని చాలా మంది మిత్రులు అడిగారు. వారి కోరిక ప్రకారం ఉర్దూ కవితను కూడా ఇక్కడ ఇస్తున్నాను.
షామ్ కే బీచో ఖమ్ సితారోం సే జీనా జీనా ఉతర్ రహీ హై రాత్ యుం సబా పాస్ సే గుజర్ తీ హై జైసే కహ్ దీ కిసీ నే ప్యార్ కీ బాత్ సహన్ జందా కే బేవతన్ అష్ జార్ సరంగోం మహూ హైం బనానే మేం దామనె ఆస్మాం పే నక్షో నిఖార్ షానె బామ్ పర్ దమక్ తా హై మహర్బాం చాందినీ కా దస్తె జమీల్ ఖాక్ మేం ఘుల్ గయీ హై ఆబె నుజూమ్ నూర్ మేం ఘుల్ గయా హై అర్ష్ కా నీల్ సబ్జ్ కోషోం మేం నీల్గోం సాయే లహ్ లహాతే హైం జిస్ తరా దిల్ మేం మోజె దర్దె ఫరాఖ్ యార్ ఆయే దిల్ సే పైహమ్ ఖయాల్ కహతా హై ఇతనీ షీరీన్ హై జిందగీ ఇస్ పల్ జుల్మ్ కా జహర్ ఘోల్ నే వాలే కామ్రాం హో సకేంగే ఆజ్ నా కల్ జల్వా గాయే విసాల్ కి షమేం ఓ బుఝా భీ చుకే అగర్ తో క్యా చాంద్ కో గుల్ కరేం తో హమ్ జానేం
ఈ కవితలో – మహర్బాం చాందినీ కా దస్తే జమీల్ – అన్న పంక్తి చాలా గొప్పగా రాశారు. మహర్ అన్న పదానికి చంద్రుడు అన్న అర్ధం కూడా ఉంది. మహర్బాం అంటే దయచూపినవారని అర్ధం. మహర్బాం చాందినీ అనడంలో ఉదారుడైన చంద్రుడి వెన్నెల అన్న భావం స్ఫురిస్తుంది. భాషపై తిరుగులేని ఆధిపత్యం, పదునైన ఊహాశక్తి ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు సాధ్యం.

                                                                                                                                                           అబ్దుల్ వాహెద్ 

ఉర్దూ కవిత్వ నజరానామళ్ళీ శుక్రవారం పరుగెత్తుకుంటూ వచ్చేసింది. ఈ సారి నేను కూడా ఎదురుచూస్తూనే ఉన్నాను. ఈ వారం ఎవరి గురించి రాస్తున్నావని ఒక మిత్రుడు అడిగారు. ఫైజ్ గురించే రాస్తాను, ఈ వారమే కాదు మరి కొన్ని వారాలు కూడా ఆయన గురించే రాస్తానన్నాను. దీనికి కారణం లేకపోలేదు. తెలుగు వారికి తెలిసిన ఉర్దూ కవులు తక్కువ. గజల్ పట్ల అభిమానం ఉన్న వారు తప్ప మిగిలిన తెలుగు పాఠకులకు ఉర్దూ కవుల గురించి పెద్దగా తెలియదు. తెలిసిన పేర్లలో కూడా గాలిబ్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. ఉమర్ ఖయాం పేరు కూడా వినబడుతుంది,కాని నిజానికి ఆయన ఉర్దూ కవి కాదు. ఆయన కవిత్వం ఉర్దూలో తర్జుమా అయ్యింది. తెలుగు వారికి చాలా తక్కువ తెలిసిన పేరు ఫైజ్, భారత ఉపఖండం రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న కాలంలో గొప్ప కవిత్వం రాసిన కవి ఆయన. ఈ వారం ఫైజ్ గురించి మరి కొన్ని వివరాలు అందించి, వచ్చే వారం నుంచి ఆయన కవితలు మరి కొన్ని ఎక్కువగా పోస్ట్ చేయాలనుకుంటున్నాను.


ఫైజ్ అహ్మద్ ఫైజ్ ప్రతి సందర్భంలోను కవిత రాశారు. చాలా ఎక్కువగా రాశారు. ఏడు కవితా సంపుటాలు ఆయన పేరున ఉన్నాయి. ఆయన కేవలం ఒక కవి మాత్రమే కాదు. రాజకీయాల పట్ల లోతయిన అవగాహన ఉన్న వ్యక్తి. గతవారం చెప్పుకున్నట్లు ట్రేడ్ యూనియన్లలో ఉన్నరు. సామ్యవాద భావాల పట్ల ప్రభావితులయ్యారు. ప్రగతిశీల రచయితల వేదిక అప్పట్లో సామాజిక అంశాలన్నింటిపై ప్రతిస్పందించేది. అందులో అత్యంత చురుకైన వ్యక్తి ఫైజ్.
ఫైజ్ రాసిన కవితా సంపుటాల్లో మొదటిది నక్ష్ ఫరియాది (ఫిర్యాదు చేస్తున్న చిత్రం). నిజానికి ఇది గాలిబ్ కవితలోని ఒక పంక్తిలోని పదబంధం. దాన్నే ఫైజ్ తన కవితకు వాడుకున్నారు. ఆ కవితా సంపుటం అదే పేరుతో వచ్చింది. అమృతసర్ లోని ఎం.ఏ.ఓ. కళాశాలలో అధ్యాపకుడిగా చేరిన కొత్తలో రాసిన కవితలివి. 1941లో ఈ సంపుటం అచ్చయ్యింది. సాధారణంగా కవులందరి మాదిరిగానే ప్రారంభంలో రాసిన కవితలు ప్రేమ కవితలే. కాని ఈ సంపుటంలో తర్వాత తర్వాత రాసిన కవితల్లో ప్రేమ, విప్లవ భావాలు కలగలిసి కనబడతాయి. ప్రేమ విరహ బాధలే కాదు ప్రపంచ బాధలు కూడా పంక్తుల్లో ఉన్నాయి. ప్రారంభంలో రాసిన కవితలు ఒకవిధమైన స్వాప్నిక ఊహలను ప్రతిబింబిస్తాయి. మేరే నదీమ్, హుస్న్ ఔర్ మౌత్, ఆజ్ కీ రాత్ ఇలాంటి కవితలే. ఫైజ్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న కళాశాల వైస్ ప్రిన్సిపల్ మహ్ముదుజ్జఫర్, ఆయన భార్య రాషిదా జహాన్ ఇద్దరు కమ్యునిస్టు పార్టీలో క్రియాశీల సభ్యులుగా ఉండేవారు. వారిద్దరి ప్రభావం వల్ల ఫైజ్ సామ్యవాద సిద్దాంతాల పట్ల ఆకర్షితుడయ్యాడు. సామ్యవాద ప్రభావం ఆయన రాసిన కవిత – ముజ్ సే పహలీ సీ ముహబ్బత్ మేరే మహ్ బూబ్ నా మాంగ్ (ప్రియా, మునుపటి ప్రేమను ఇప్పుడు కోరవద్దు)లో స్పష్టంగా కనబడుతుంది. తన ప్రేయసి అద్భుత సౌందర్యంతో కళ్ళు తిప్పుకోలేక పోతున్నప్పటికీ, తాను ప్రపంచంలోని కష్టాలను కూడా చూడక తప్పదని అంటాడు. ఈ కవితా సంపుటిలోని ఇతర కవితలు తర్వాత అనేక ఉద్యమాల్లో ప్రేరణ గీతాలయ్యాయి. సంకెళ్ళు, శృంఖలాలు, నిర్బంధాలు ఉన్నప్పటికీ గొంతెత్తాలని నినదించిన కవిత .. బోల్ కె లబ్ అజాద్ హైం తేరే, బోల్ జుబాన్ అబ్ తక్ తేరీ హై (చెప్పు, నీ పెదాలు స్వేచ్ఛగానే ఉన్నాయి, చెప్పు, నీ నాలుక ఇంకా నీదే)లో రాసిన పదాలు భారత పాకిస్తాన్ లలో అనేక నిరసర ఉద్యమాల్లో ప్రతిధ్వనించాయి.
మోజూయె సుఖన్ కవితలో ఒక కవి ఆలోచించవలసిన విషయాలేమిటో ముక్కుసూటిగా చెప్పేశాడు. ప్రేయసి కురుల మృదుత్వం, గోరింటాకు చేతుల లాలిత్యం గురించి ఆలోచించాలా లేక ఆదమ్ ఈవ్ సంతానం (మానవాళి) ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కుంటున్న కష్టాలు కడగండ్ల గురించి ఆలోచించాలా అని ప్రశ్నించాడు. అంతేకాదు, ప్రపంచంలో ఉన్న ఆకలి, దారిద్ర్యం, దౌర్భాగ్యాలను ప్రశ్నించడం కవుల పని కాదా అని నిలదీశాడు.
ఫైజ్ కవిత్వం ఉద్యమాల ఉప్పెన. ఆయన జీవితం కూడా ఉద్యమాలలోనే గడిచింది. ప్రేయసి చుట్టు తిరిగే కవిత్వాన్ని మనిషి చుట్టు తిప్పిన కవి ఫైజ్.. అందుకే ఫైజ్ గురించి మరి కొన్ని వారాలు కొనసాగిద్దాం..
ఇప్పుడు ఫైజ్ రాసిన ఒక కవిత చూద్దాం.

ప్రియా, మనుపటి ప్రేమను నా నుంచి కొరవద్దు
నీవుంటే జీవితం శాశ్వతంగా ప్రకాశిస్తుందని
ఎల్లప్పుడు అనుకున్నా
ప్రేమబాధ నాదే అయినప్పడు, ప్రపంచబాధ గొడవెక్కడ
నీ నగుమోము ప్రపంచంలో వసంతాన్ని విరజిమ్ముతుంది
నీ కళ్ళు తప్ప ప్రపంచంలో ఇంకేముందని?
నీవు దొరికితే అదృష్టం నా అడుగులకు మడుగులొత్తుతుంది

కాని అలా కాదు, అలా కావాలని అనుకున్నానంతే...
ప్రపంచంలో ప్రేమే కాదు, ఇంకా దు:ఖాలున్నాయి
ప్రేమికుల కలయికే కాదు, ఇంకా సంతోషాలున్నాయి
శతాబ్ధాలుగా విస్తరిస్తున్న నల్ల మంత్రజాలం
సిల్కు, శాటిన్, బంగారు దారాలతో అల్లుకుంటోంది


                                                                                                                                                       అబ్దుల్ వాహెద్ 

                                                                                                                                                  October 25/2013

ఉర్దూ కవిత్వ నజరానా


బక్రీద్ పండుగ హడావుడి ముగిసింది. ఈద్ ముబారక్ చెప్పుకోవడమూ, ముబారక్ లు స్వీకరించడంలోనే రెండు రోజులు గడిచిపోయాయి. అఫ్ కోర్స్ బిరియానీ ఉండనే ఉందనుకోండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది బిరియానీలో ఉగాది పచ్చడి కలుపుకు తింటే ఎలా ఉంటుందా అని, అలాంటి ఆలోచనలతో భుక్తాయాసం తీర్చుకోక ముందే తలుపు మీద టక టకా మని శుక్రవారం కొడుతుంది. ఆ వెనుకే ఫైజ్ గారు పాస్ రహో అంటున్నాడు. కవిసంగమం మిత్రులు ఎదురు చూస్తుంటామన్నారు కాబట్టి ఆయాసాలు, ఆలోచనలు పక్కన పెట్టి కంప్యూటర్ కీబోర్డు చేతిలోకి తీసుకున్నాను.

గత శుక్రవారం ఫైజ్ మీద రాసిన పంక్తులకు నేను ఊహించని స్పందన వచ్చింది. కవులను గండపెండేరాలతో ఘనంగా సన్మానించిన తెలుగు నేల మనదిరా అంటూ మనసు ఒక మొట్టికాయ వేసింది. ముఖపుస్తకంలో పరిచయమైన మిత్రుడు కృష్ణమోహన్ మోచర్ల గారు ఫైజ్ గురించి కొంత సమాచారం పంపించారు. నా కోసం శ్రమకోర్చి ఆయన సమాచారం సేకరించడం కొంత ఆశ్చర్యమూ ఆనందమూ కలిగాయి. ఇలాంటి మిత్రులు లభించినందుకు గర్వంగాను ఉంది.
ఇక అసలు విషయానికి వస్తే, ఫైజ్ గురించి ఫైజ్ ఏమన్నారన్నది ఆసక్తికరమైన విషయం. తన గురించి ఆయన ఇలా చెప్పుకున్నాడు :
’’1920 నుంచి 1930 మధ్య కాలం సాహిత్యంలో అనేక జాతీయ, రాజకీయ ఉద్యమాల కాలం. కేవలం సీరియస్ సాహిత్యమే కాదు, సరదాగా నడిచే రచనలు కూడా వచ్చేవి. హస్రత్ మోహానీ, జోష్, హాఫీజ్ జలంధరీ, అక్తర్ షీరానీల పేర్లు కవిత్వంలో బలంగా వినిపించేవి. ఈ వాతావరణంలో నక్ష్ ఫరియాదీలోని కవితలు కొన్ని రాశాను.
1934లో కాలేజీ విడిచిపెట్టాను. 1935లో అమృతసర్ లోని ఎం.ఏ.ఓ. కాలేజీలో లెక్చరర్గా చేరాను. ఇక్కడే నాకు నా సమకాలీనుల్లో చాలా మందికి మానసికంగాను, భావావేశపరంగాను పరిణతి లభించింది. ఈ కాలంలోనే మేము సాహిబ్జాదా మహమూదుజ్జఫర్ ను ఆయన శ్రీమతి రాషిదా జీహాన్ ను కలిశాము. ఆ తర్వాత ప్రగతిశీల రచయితల ఉద్యమం మొదలైంది. దాంతో పాటే శ్రామిక ఉద్యమాలు కూడాను. ఈ క్రమంలో అనేక దృక్పథాల వేదికలు ఏర్పడ్డాయి. ఇక్కడ మేము నేర్చుకున్నదేమిటంటే ప్రపంచానికి దూరంగా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఎందుకంటే మన చుట్టు ఉన్న వాతావరణం మనపై ఖచ్చితంగా ప్రభావం వేస్తుంది. వ్యక్తిగతంగా మనిషి అతనికి ఉన్న ప్రేమలు, సంతోషాలు, కష్టాలు, బాధలు వగైరా ఎన్ని ఉన్నా కాని, వ్యక్తిగతంగా మనిషి ఈ పూర్తి చట్రంలో చాలా చిన్నవాడు. జీవితం ఈ విశ్వమంత విస్తారమైనది. కాబట్టి ప్రేమబాధ, ప్రాపంచిక బాధ ఈ రెండు ఒకే అనుభవానికి చెందిన రెండు పార్శ్వాలు. ఈ భావం మనసులో చోటు చేసుకున్న తర్వాత రాసిన పద్యమే – మునుపటి ప్రేమను అడగవద్దు ప్రియా – అన్న కవిత. పూర్తి ప్రపంచంలోని దు:ఖం గురించి ఆలోచించవలసి ఉంది. ఆ తర్వాత కొంత కాలం సైన్యంలోను, జర్నలిజమ్ లోను, శ్రామిక సంఘాల్లోను గడిపిన తర్వాత నాలుగేళ్ళు జైలులో గడపవలసి వచ్చింది. దస్త్ సబా, జిందాన్ నామా కవితా సంకలనాలు జైలు అనుభవాల రికార్డులే. ప్రేమలానే జైలు జీవితం కూడా ఒక మౌలికమైన అనుభవం. ఈ అనుభవం కొత్త ఆలోచనలకు తలుపులు తెరుస్తుంది. తొలి ప్రేమ ఉదయించినప్పుడు ఉండే భావావేశాలు మళ్లీ మొగ్గ తొడిగాయి. ఉదయాస్తమయాల్లోని సౌందర్యం, ఆకాశంలోని నీలిమ, చిరుగాలి స్పర్శ అన్నీ జైలులోను అనుభూతికి వచ్చాయి. మరో విషయమేమంటే, బయటి ప్రపంచానికి సంబంధించిన కాలం దూరం అనేవి జైలులో ఉండవు. దూరం దగ్గర అనేది ఇక్కడ లేదు. ఒక్క క్షణం కూడా శతాబ్ధాల కాలంగా ఉండవచ్చు లేదా శతాబ్ధాలు కూడా నిన్నటి రోజులా కనిపించవచ్చు. మూడో ముఖ్యమైన విషయమేమంటే, అందరితోను వేరుపడిన భావం. ఒంటరితనం. ఇక్కడ చదవడానికి, ఆలోచించడానికి, సృజనాత్మక వధువును సింగారించడానికి కావలసిన సమయం ఉంటుంది.‘‘
ఫైజ్ తన గురించి తాను ఎక్కువగా చెప్పేవారు కాదు.. ఈ సంభాషణ అర్థాంతరంగానే ఆపేశారు.
భారత ఉపఖండం తీవ్రమైన మార్పులకు గురవుతున్న కాలంలో ఫైజ్ రాసిన పంక్తులు ఈ మార్పులపై తమ ప్రభావాన్ని వేశాయి. ఆయన కేవలం ఒక కవి మాత్రమే కాదు. ఒక విప్లవకారుడు, ఉద్యమకారుడు. కేవలం కవితలు మాత్రమే రాయలేదు. పత్రికల్లో సంపాదకీయాలు, వ్యాసాలు, రాసేవారు. అనేక విషయాలపై ఆయన ఇంటర్వ్యులు చదివితే ఆనాటి రాజకీయ పరిస్థితులపై లోతయిన అవగాహన కలిగిన వ్యక్తిని చూస్తాం. భారత ఉపఖండంలో నేటికి ప్రజలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలకు ఆయన అభిప్రాయాల్లో జవాబులు దొరుకుతాయంటే అతిశయోక్తి కాదు.
అణిచివేతలు, అన్యాయాలపై గళమెత్తిన కవి ఫైజ్. పాస్ రహో అంటూ ఆయన రాసిన కవిత ఈ వారం చూద్దాం:

పక్కనే ఉండు
నా హంతకీ, నా ప్రేయసి
పక్కనే ఉండు

రాత్రి నడుస్తున్నప్పుడు
ఆకాశంలో నెత్తురు తాగి రాత్రి నడుస్తున్నప్పుడు
కస్తూరీ లేపనం చేతబట్టి వజ్ర ఖడ్గం నడుస్తున్నప్పుడు
పాడుతూ నవ్వుతూ ఆర్తనాదాలు చేస్తూ నడుస్తున్నప్పడు
బాధల నీలిమువ్వలు అడుగడుగున మోగిస్తూ నడుస్తున్నప్పుడు

రొమ్ములో మునుగుతున్న గుండె
చొక్కా చేతుల్లో ముడచుకుంటున్న హస్తాలను చూస్తూ
ఆశ పడుతున్నప్పుడు

శిశువు రోదనలా మద్యం గలగలలు
ఎంత సముదాయించినా వ్యర్థమైనప్పుడు
అనుకున్నది ఏదీ జరగనప్పుడు
ఏదీ పనికిరానప్పుడు
రాత్రి నడుస్తున్నప్పుడు
విషాదం తొడుక్కుని నిర్మానుష్య రాత్రి నడుస్తున్నప్పుడు
పక్కనే ఉండు
నా హంతకి నా ప్రేయసి నా పక్కనే ఉండు
ఫైజ్ ఉర్దూలో రాసిన పంక్తులు ఇవి.

పాస్ రహో
మేరే ఖాతిల్ మేరే దిల్ దార్ మేరే పాస్ రహో
జిస్ ఘడీ రాత్ చలే

ఆస్మానోం కా లహూ పీకర్ సయా రాత్ చలే
మర్ హమ్ ముష్ఖ్ లియే నష్తర్ అల్మాస్ చలే
బైన్ కర్తీ హుయీ హస్తీ హుయీ గాతీ నికలే
దర్ద్ కా కాస్నీ పాజేబ్ బజాతీ నికలే

జిస్ ఘడీ సీనోం మేం డూబతే హువే దిల్
ఆస్తినోం మే నిహాం హాథోం కే రాహ్ తక్నే లగేం
ఆస్ లియే

ఔర్ బచ్చోంకే బిలఖ్నేకీ తరాహ్ ఖుల్ ఖులె మై
బహరె నాసూదగీ మచలే తో మనాయే నా మనే
జబ్ కోయీ బాత్ బనాయే నా బనే
జబ్ న కోయీ బాత్ చలే
జిస్ ఘడీ రాత్ చలే
జిస్ ఘడీ మాతమీ సున్ సాన్ సియా రాత్ చలే
పాస్ రహో
మేరే ఖాతిల్ మేరే దిల్ దార్ మేరే పాస్ రహో


                                                                                                       అబ్దుల్ వాహెద్ 

                                                                                                                                         October 18 

ఉర్దూ కవిత్వ నజరానా

శుక్రవారం మరీ ఇలా పరుగెత్తుకు వచ్చేయాలా? మొన్ననే కదా వెళ్ళింది. మరీ అంత తొందరేం వచ్చిందని ఉరుకులు పరుగుల మీద రావడం...అనుకుంటూ మొదలు పెట్టాను ఈ పంక్తులు. అసలు ఈ వారం రోజులు ఎలా గడిచాయో, ఎప్పుడు గడిచాయో తెలియడం లేదు. దానిక్కారణమేమిటంటే, పాతకోటలోకి సరదాగా వెళితే చేతికి వజ్రాల లంకెబిందెలు దొరికినట్లు, నేనేదో ఉర్దూ కవితలు నాలుగు పరిచయం చేద్దామని రాసిన రాతలకు వజ్రవైఢూర్యాలను మించిన ప్రశంసలు దొరికాయి. కామెంట్లు భుజం మీద చరుస్తుంటే నా మనసు సప్తాకాశాలు దాటేసి విహరించడం మొదలెట్టింది. నన్ను నేనే మరిచిపోయిన స్థితిలో వారం రోజులేంటి, ఏళ్ళు గడిచినా తెలుస్తుందా? ఈ ప్రోత్సాహానికి నేను అర్హుణ్ణి అవునో కాదో తెలియదు కానీ ఆ అర్హత సంపాదించడానికి తప్పకుండా కష్టపడతాను. ఇంతగా అభిమానిస్తూ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతఙ్ఙతలు 

ఇక అసలు విషయానికి వచ్చేద్దాం

మొన్న శుక్రవారం ఫైజ్ గురించి నాలుగు ముచ్చట్లు చెప్పుకున్నాం. ఈ రోజు మరో రెండు ముచ్చట్లు చెప్పుకుని మరో కవిత చదువుకుందాం.

చాలా మంది కవుల్లాగే ఫైజ్ కూడా ప్రేమకవితలతోనే మొదలెట్టాడు. నెమ్మదిగా సామ్యవాదం వైపు మొగ్గు చూపడంతో ఫైజ్ లోని ప్రగతిశీల భావాలు ఆయన కవితల్లోను ప్రతిఫలించడం మొదలయ్యింది. ఒక విప్లవకవిగా ఆయన ఉర్దూ సాహిత్యంలో పేరు సంపాదించుకున్నాడు. ఇరవయ్యో శతాబ్ధంలో ముఖ్యమైన కవుల్లో ఒకడిగా ప్రసిద్ధి చెందాడు. ఫైజ్ కవితల్లో ఒక అసమ్మతి స్వరం బలంగా వినిపిస్తుంది. ఆయనకు సంతృప్తి ఎన్నడూ లేదు. ప్రేమ కవితల్లో కూడా ఈ అసంతృప్తి కనిపిస్తుంది. ఒక ప్రేమకవితలో – పూలలో రంగులు నింపేద్దాం, వసంత గాలి వీస్తుంది. రారాదూ ఉద్యానవనానికి పనిలేదు, స్తబ్ధత వదిలింది, పదండి గాలితో మాట్లాడదాం, ఎక్కడో ఒక చోట ప్రేయసి కబుర్ల చెప్పుకుందాం.. అంటూ కొనసాగే కవిత చివర – ఐతే ప్రేయసి ఇంట్లో లేదా ఉరికంబం పైన తప్ప మధ్యదారిలో తానెక్కడా ఉండేది లేదంటాడు.
నా చేతిలో పెన్ను, ఇంకు లాక్కుంటే లాక్కోనీ... నా గుండె నెత్తుటిలో వేళ్ళు ఎప్పుడో ముంచాను- అని రాశాడు మరో చోట.

1951లో కుట్ర కేసులో జైలుకెళ్ళినప్పడు ఫైజ్ తన బ్రిటీషు భార్య అలీస్ కు అనేక ఉత్తరాలు రాశాడు. తర్వాత ఆ ఉత్తరాలను ప్రచురించాలని కొందరు మిత్రులు ఆయన్ను కోరారు. తన భార్యకు ఇంగ్లీషులో రాసిన ఉత్తరాలన్నీ స్వయంగా ఫైజ్ తిరిగి ఉర్దూలోకి అనువదించాడు. ఆ పుస్తకానికి పరిచయ వాక్యాలు రాస్తూ, ఈ ఉత్తరాలు వ్యక్తిగతమైనవే అయినా, వీటిని ప్రచురించడం వల్ల రాజకీయ ఖైదీల మనోస్థితి, ముఖ్యంగా సామ్యవాద సిద్దాంతాల కోసం పోరాడేవారు జైళ్ళలో ఉన్నప్పుడు ఎంత మానసిక సంఘర్షణకు గురవుతారో తెలుసుకోవాలనుకునే వారికి ఉపయోగపడతాయని, అందుకే ప్రచురిస్తున్నానని చెప్పాడు.

ఫైజ్ ఉత్తరాల గురించి, ఫైజ్ జీవితం గురించి వచ్చేవారం మరికొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఇప్పడు ఫైజ్ రాసిన – ఇంకా కొన్ని రోజులు మాత్రమే, ప్రియా (చంద్ రోజ్ ఔర్ మేరీ జాన్) కవిత చూద్దాం:

కొన్ని రోజులు మాత్రమే, ప్రియా, కేవలం గుప్పెడు రోజులు మాత్రమే
దౌర్జన్యం నీడలో ఊపిరి పీల్చే నిస్పహాయత ఇంకొన్ని రోజులే...
ఇంకాస్త సమయం ఈ వేధింపులు సహిద్దాం, అలమటిద్దాం, రోదిద్దాం...

ఇది మన పూర్వికుల వారసత్వం ... మన అంగవైకల్యం...
శరీరానికి ఖైదు, భావావేశాలకు సంకెళ్ళున్నాయి
ఆలోచనలకు దాస్యబంధాలు, మాటలపై కట్టడులు
అయినా ధైర్యంగా బతుకుతూ పోతున్నాం

జీవితం, బిచ్చగాడి చిరుగుల పంచేనా
ప్రతిక్షణం దానిపై బాధల మాసికలు పడుతుండాలా
ఫర్వాలేదు, దౌర్జన్యం కొన్ని రోజులు మాత్రమే
కాస్త ఓపికపట్టు, అణిచివేతల రోజులు కొన్నే

ఈ నిర్జన, ఎడారి, బీడు లోకంలో
మనం ఉండాలి, కాని ఇలాగే ఉండడం కాదు.
అపరిచిత హస్తాల అనామక వేధింపుల భారం
నేడు భరించాలి, ఎల్లప్పుడు కాదు...

నీ అందాన్ని కప్పేస్తున్న అమానుషాల ధూళి
మన మూన్నాళ్ళ యవ్వనంలోని నిరాశలతో సమానం
వెన్నెల రాత్రుల్లో వ్యర్థంగా ప్రజ్వరిల్లే బాధ
ఆలకించబడని గుండె నిట్టూర్పులు, వినబడలేని శరీర ఆర్తనాదాలు
కొన్ని రోజులే, ప్రియా, కొన్ని రోజులు మాత్రమే...

ఉర్దూలో ఫైజ్ భావాలను సాధ్యమైనంత వరకు తెలుగులో తీసుకువచ్చే ప్రయత్నం చేశాను. కవిత చివరి పంక్తులు – చాందినీ రాతోంకా బేకార్ దహకతా హువా దర్ద్... భావాన్ని తెలుగులో రాసినా.... ఆ అనుభూతిని రాయడం కష్టమే. అలాగే – జిందగీ క్యా కిసీ ముఫ్ లిస్ కీ ఖబా హై జిస్ మేం, హర్ ఘడీ దర్ద్ కే పైవంద్ లగే జాతే హైం – అన్న పంక్తుల్లోధ్వనించే బలమైన నిరసన, ఆగ్రహం, ఆవేదన, తిరుగుబాటు తదితర భావాలు తెలుగులో వచ్చాయా? అనుమానమే... ఉర్దూలో కవిత మీరే చదవండి. నా అనువాదం అసలు కవితకు ఒక ఆమడ దూరంలో ఉందని చెప్పినా, ఫర్వాలేదు కనీసం ఆమడ దూరం వరకు వచ్చాను కదా?

చంద్ రోజ్ ఔర్ మేరీ జాన్, ఫక్త్ చంద్ హీ రోజ్,
జుల్మ్ కీ ఛావూం మేం దమ్ లేనే పర్ మజబూర్ హై హమ్
ఔర్ కుఛ్ దేర్ సితమ్ సహ్ లేం, తడప్ లేం, రో లేం,

అప్నే అజ్ దాబ్ కీ మీరాస్ హై, మాజూర్ హైం హమ్
జిస్మ్ పర్ ఖైద్ హై, జజ్బాత్ పే జంజీరేం హైం
ఫిక్ర్ మహ్బూస్ హై, గుఫ్తార్ పే తాజీరేం హైం
అప్నీ హిమ్మత్ హై కే హమ్ ఫిర్ భీ జియే జాతే హైం

జిందగీ క్యా కిసీ ముఫ్ లిస్ కి ఖబా హై జిస్ మేం
హర్ ఘడీ దర్ద్ కే పైవంద్ లగే జాతే హైం
లేకిన్ అబ్ జుల్మ్ కీ మాయాద్ కే దిన్ థోడే హైం
ఇక్ జరా సబ్ర్, కే ఫరియాద్ కే దిన్ థోడే హైం

అర్స యే దహ్ర్ కీ ఝుల్సీ హుయీ వీరానీ మేం
హమ్ కో రహ్నా హై, పర్ యుం హీ తో నహీ రహ్నా
అజ్నబీ హాతోంకే బేనామ్ గారన్ బార్ సితమ్
ఆజ్ సహ్నా హై, హమేషాతో నహీ సహ్నా హై

యహ్ తేరే హుస్న్ సే లిపటీ హుయీ ఆలమ్ కీ గర్ద్
అప్నీ దో రోజా జవానీ కీ షికస్తోం కా షుమార్
చాందినీ రాతోంకా బేకార్ దహక్తా హువా దర్ద్
దిల్ కీ బేసూద్ తడప్, జిస్మ్ కీ మాయూస్ పుకార్
చంద్ రోజ్ ఔర్, మేరీ జాన్, ఫకత్ చంద్ హీ రోజ్ ....

మళ్లీ శుక్రవారం కలుద్దాం.. అంత వరకు సెలవు..


అక్టోబర్ 10, 2013