పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

ప్రసాద్ తుమ్మా || అంతరంగం||


మొదటి మాటల్లోనే
మునిగి తేలిపోవడం
ప్రేమ!
మరికొందరంటారు
మనసులోని సదభిప్రాయమే
ప్రేమ!!
మరణం!!
నేనేం కోరుకుంటానో నాకే తెలియదు
అది ఎన్నాళ్ళు గుర్తుంచుకోను
నా జీవిత కాలంలో
నీడనే చూస్తాను
ఆశ్చర్యకరంగా ఆరాట పడుతుంటాను
దేని కొరకు
దేనిని ఆహ్వనించాలి
జీవితపు చివరి మజిలి
చీకటి అలల అంచు
మరణం!
మరికొందరంటారు
ముసుగులోని ముద్దాయి
ప్రేమా ? మరణమా ?
మరణించిన మరణాన్నా?
ఆరాధకుల ప్రేమనా ?
దేనిని దేనిని
నా హృదయంపై ఆరాధకుల
ప్రేమ పాదముద్ర పడింది
నా వెన్నుపై మరచిన పూర్వీకుల
మరనారణ్యం మొలిచింది.
dt. 2sept 2012

చింతం ప్రవీణ్ || నాన్న||


విరామమెరుగక
నిరంతరం ప్రవహించే
జీవన నది నాన్న

విషాదాలను మోస్తూ
సంతోషాలకై అన్వేషిష్తున్న
బాటసారి నాన్న

కుండపోత వరదలా దుఃఖం ముంచెత్తి
గుండె రేవును గండికొడుతున్నా
చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం నాన్న
గుండెనిబ్బరానికి నిలువెత్తు చిరునామ నాన్న

నాన్న ప్రతీక్షణం
కష్టాలను కౌగిలించుకుంటడు
కన్నీళ్ళతో కరచాలనం చేస్తడు

నిజంగా
నాన్నకు కన్నీళ్ళొచ్చినా
నాన్న ఏడ్వలేడు
నాన్న ఏడిస్తే
ఇల్లు ఇల్లంతా కన్నీటిసంద్రమే

జీవన గమనంలో అలసిపోయిన బిడ్డలకు
నాన్నిచ్చే దైర్యం
ముందుకెళ్ళడానికి ఓ కాన్ఫిడెన్స్

నడవడం నేర్చిన బిడ్డలకు
నడిపించే దారౌతడు నాన్న

ఓటమితో అనుక్షణం పోరాడుతు
గెలుపునే పంచే నాన్నే
ప్రతీ బిడ్డకి మొదటి హీరో

సంతోషాలను సంపదను వాటాలేసే
నాన్న గుండెలోతుల్లో దాగున్న
కన్నీటి దొంతరలను
గుర్తించేదెవ్వరు

నాన్న బతుకంతా
మన జీవితమే కదా

ఎన్నని చెప్తం_
ఏమని చెప్తం_
సముద్రమంత ప్రశాంతం
అంతర్గత బడబాగ్ని నాన్న

నాన్నైతేనే తెలుస్తది
నాన్నంటే

31.08.2102

రావి రంగారావు || నిద్రపోతున్న ప్రభంజనం ||


కుక్క వెంట మనిషి చేతులు కట్టుకు నిలుచున్నాడు
కుక్క మెడలో డబ్బు సంచి వేలాడుతోందని...
ఎలుకను చూచి ఏనుగు వంగి వంగి దణ్ణం పెడుతోంది
ఎలుక కుర్చీ మీద కులుకుతోందని...

గుండెలు బండలుగా మార్చుకొన్న కొండలు
కొత్తగా మొలిపించుకున్న రెక్కలు- డబ్బూ అధికారం
ఏ కోట కైనా ఎగిరెళ్ళ గలవు
ఏ తోట నైనా గాయపరచ గలవు...

ఇంకా మీసం కూడా మొలవని ఓ బక్క చిక్కిన గోగుపుల్ల
కర్ర పట్టుకొని వీధిలో నిలబడితే
గజం గజం పొడుగున్న వందలాది మీసాలు
ఇళ్ళలోకి దూరి బిగించుకుంటున్నాయి తలుపులు,

దేశం పూలచెట్టు తల్లివేరును తినేస్తున్నాయి దర్జాగా
తెల్ల చొక్కాలు తొడిగిన వేరుపురుగులు

ఎవరో విసురుతున్న ఎముకల ముక్కలకు
ఎగబడి పోతున్న ఏనుగులారా,
మన ఆకలి తీర్చవు ఎముకల ముక్కలు
మనల్ని నిద్రలో ముంచటానికి పంచే మత్తు బిళ్ళలు...
వాళ్ళు మన పొట్టల్ని తడిమేది ప్రేమతో కాదు-
మన డొక్కల్లో నేరాలు దాచటానికి ఆడే నాటకాలు...

గుంటనక్కలు
కుందేళ్ళ గొంతులు తడిగుడ్డతో కోస్తున్నాయి,
పులులు
లేళ్ళను తరిమి తరిమి చంపుతున్నాయి,
విభజించి పాలిస్తున్న సింహాలు
అనేకానేక వృషభాలను ఆనందంగా ఆరగిస్తున్నాయి...

పనికిరాని మిణుగురులకోసం
మనలో మనం చెండాడుకోవటం ఘోరం,
మన చేతు లన్నీ కలిపి ధ్వజ మెత్తితే
అదే దేశమాతకు కొత్త సూర్య హారం.

సాంబశివరావు కాకాని || సద్దుచేయకండి. ||

‎_.....___ ఇష్........ఇష్....
సద్దుచేయకండి .... మాట్లాడకండి....
మౌనం.... దయచేసి మౌనంగా వుండండి.
ఇక్కడ
మా అన్న నిద్రోతున్నాడు.
దయచేసి
ఏడుపు మోఖాలతో, ఏదో పోగొట్టుకున్నట్టు
ఇక్కడ
నిలబడకండి
నిజానికి మాయన్న
ముఖం చిరునవ్వుతోవుంది ....
దయచేసి
పువ్వులతోనూ, పూదండలతోనూ
మా అన్నను
నింపకండి
నిజానికి మా అన్నే
మేర్ గోల్డ్ పువ్వులా
మెరిసి పోతున్నాడు
లిల్లీ పువ్వులా
పరిమళిస్తున్నాడు
మరలా ఆ పూలను
వ్యర్ధ పరచడం
ఎందుకు?
అయితే
ఒకటి చేయండి
మా అన్నను
దయచేసి
ఎక్కడా ఖననం చేయకండి
మీ గుండెల్లో
పదిలపరచుకోండి
తూరుపు దిక్కు
తెల తెల వారకమునుపే
మిమ్ములను
మా అన్న
కిల కిలారావాలతో
నిద్ర లేపుతాడు
కర్తవ్యానికి మిమ్ములను
కార్యోన్ముఖులను
చేస్తాడు మా అన్న
నిద్రాణమయిన మీ మీ శక్తిని
చైతన్యం చేస్తాడు
ఆ చైతన్యం తో మనలను
స్వేచ్చా రాజ్యానికి చేరుస్తాడు.

ఉమ|| అన్వేషణ||


గాన౦ కోరుతు౦ది ఒక తపస్సు
కవిత ఛేదిస్తు౦ది తమస్సు
వాద౦ జనిస్తు౦ది ఒక ఉషస్సు
మోద౦ చి౦దిస్తు౦ది ఒక హవిస్సు
నాద౦ వెల్లివిరుస్తు౦ది మహస్సు

సూర్య కిరణ౦లో ఉద్భవి౦చు
అరుణకా౦తుల శ్వేత రేఖలు
ఆగని శ్రమజీవుల నిర్వేద
స్వేద బి౦దువులలో ప్రతిబి౦బి౦చు
తేజ౦ ఆ శక్తిలో అగ్నిరేఖలు విరాజిల్లు
సా౦కేతిక జ్ఞాన౦ విలసిల్లు
భువన౦ అనుభవజ్ఞాన౦తో ప్రభవిల్లు
కానీ అ౦దుబాటులో ఈడేరవు ఆశలు
దొరుకుతు౦ది కొ౦దరికే ఆ అగ్నిపూవు

ఊహలలో విరుస్తు౦ది భావన
భావనలో రగుల్తు౦ది రాగాలాపన
ప్రజ్వలిస్తు౦దొక చైతన్య నర్తన
మారుస్తు౦దొక పరిరక్షి౦చాల్సిన
పాలన విశృ౦ఖల పీడన

వస్తు౦దొక సమాజ పరివర్తన
తెస్తు౦దొక సరికొత్త పరిష్కరణ
విజృ౦భిస్తు౦ది అణగార్చిన
బ్రతుకుల ఆర్తిలోని ఆవేదన
కలుస్తు౦దొక కాల౦ కల్కితురాయి సమ్మేళన
కాలుస్తు౦ది పలువురి హృదయాల్లో స౦ఘర్షణ
భావనలో విరుస్తు౦ది భార౦ త్రు౦చే ప్రతిఘటన..
లే! నిదురలే! సాధి౦చు నీ తపన
జారిపోనీయకు నీలోని హృదయాన్వేషణ!

డా.పులిపాటి గురుస్వామి || దరి దాపు మనమధ్య ||


ఒక నది వెంట నడుస్తున్నపుడు
వయ్యారపు చిలిపి చిన్ని అలలు
నిన్నే గుర్తుకు తెస్తాయి

నీతో మాట్లాడిన వన్నీ
ఆ నీటి గాలుల పరవశంతో
చెప్పుకొని తడిసిపోతాను

పరవళ్ళు తనకు తెలిసినంతగా
మనకు తెలియవు తెలుసా

నీతో ఒంటరి సంభాషణల వెంట
నడుస్తున్నపుడు నది వాసన నిండిపోతుంది
ప్రవాహం ప్రయాణం ప్రణయం
ఎలా వెంబడిస్తాయో !

ఒక నిశ్శబ్ధం లాంటి శబ్ధం
మన చుట్టూ పచ్చికలా పరుచుకుంటుంది
ఎగిరిపోయే పక్షులు కూడా
నీటి గల గల లతో కలిసి కచేరీ చేస్తాయి

ఆలాపనకి స్వేచ్ఛ కావాలి , ఈ నది లాగే
నిర్భందం లో జీవితం
సరాగాలు పాడలేనిది
ఒంపు దగ్గర ఓ కొత్త రాగం అందుకోవాలి

కొంచెం సర్దుకోవాలి ,స్వచ్ఛ పడాలి
సూర్యుడికి చంద్రుడికి తడవాలి,మెరవాలి
ఒక మబ్బుల రాశికి
అద్దమవ్వాలి
శబ్దాల ఘర్జనకి కొద్దిగా జడవాలి

ఐనా...

పారాలి

నీ కాటన్ అలల తాకిడి
నీ తగిలీ తగలని స్పర్శ
ఒడ్డున ఇసుక తిన్నెల తడి ముద్రలతో
జీవితపు అందాల జలపాతం దాకా....

.....
2-9-2012.

అరుణాంక్.ఎలుకటూరి | | నెత్తుటి బాకీ | |


పచ్చ పచ్చని మైదానాల్లో
ఆకుపచ్చ వానల్లో
నాగేటి సాలల్లో
నువ్ పారించిన నేత్తుటేరులను
నేను మర్చిపోలేదు
తెలంగాణ అన్నందుకు నువ్ పొట్టనబెట్టుకున్న
కనకచారి అమరత్వాన్ని మర్చిపోలేదు
భూమి లేని వాళ్ళు భూమి అడిగినందుకు
నువ్ ముదిగొండలో కాల్పించిన ఉద్యమకారులను మర్చిపోలేదు
విప్లవోద్యమాన్ని అణచేందుకు
నువ్ వేసిన ఎత్తుగడలు మర్చిపోలేదు
రియాజ్ ఎన్ కౌంటర్ నుండి మొదలైన
నీ హత్యాకాండల పరంపరను మర్చిపోలేదు
మానాల,నల్లమలలో నువ్ చేసిన
కోవర్టు ఆపరేషన్ లను మర్చిపోలేదు
వరంగల్ లో సూర్యం చిందించిన
నెత్తుటి తడి ఆరకముందే
నల్లమలలో నువ్ మాంసపు ముద్దలయ్యావు
ఎక్కడైతే మాధవ్ శరీరాన్ని కుళ్ళిపోయేలా చేసావో
అక్కడే నీ శవం గుర్తుపట్టడానికి వీల్లేకుండా ముక్కలైంది
ఏ నల్లమలనైతే నెత్తుటి మడుగు చేసావో
అ నల్లమలలోనే నువ్ అంతమయ్యావ్
నువ్ అణచేసిన తెలంగాణ నినాదం
నేడు దిక్కులు పిక్కటిల్లేలా మార్మోగుతుంది
నువ్ పొట్టనబెట్టుకున్న అమరుల నెత్తురు
నేడు కొత్త చరిత్రను లిఖిస్తుంది
నల్లమల మల్లి వసంత మేఘగర్జనను వినిపించేందుకు సిద్దమైంది.
నల్లమల తీర్చుకున్న నెత్తుటి బాకీని నేనెన్నడు మర్చిపోను....

(నేడు నల్లమలలో నెత్తుటేరులు పారించిన రాజశేఖర్ రెడ్డి అదే నల్లమలలో నేలకూలిన రోజు)
(02/09/2012)

బాలు|| అవును నేను ఆత్మహత్య చేసుకున్నాను ||


అవును నేను ఆత్మహత్య చేసుకున్నాను
నా తల్లి, నేల తల్లి,
తెలంగాణా కోసం
అన్నాతమ్ముల్లా ఉండేవాళ్ళే
వెన్ను పోటు పొడిస్తే
నా తల్లిని
చూడలేక
ఆత్మహత్య చేసుకున్నాను

అవును నేను ఆత్మహత్య చేసుకున్నాను
ఒకసారి మా నేలకు
వచ్చి చూడండి
మా కష్టాలు తెలుస్తాయి
రబ్బరు బులెట్స్
మాకోసమే తయారు చేస్తారు అనుకుంట
విద్యార్దులు తిరగాల్సిన
ఓ.యు లో
పోలీసులో తిరుగుతున్నారు

అవును నేను ఆత్మహత్య చేసుకున్నాను
పోలీసు అన్నలారా
మీకు తల్లి మీద కంటే
డ్యుటి మీదే
ఎక్కువ మమకారం
అవునులే మరి
ప్రామోషన్లు
ఆదాయం కావలిగా.

అవును నేను ఆత్మహత్య చేసుకున్నాను
నేను పిరికి వాడినే
మీరు దైర్య వంతులు కదా!
మీరు వుండి
ఏం పీకుతున్నారు?
కాలం కదులుతున్నది
తెలంగాణన అంశం
కదలటం లేదు

అవును నేను ఆత్మహత్య చేసుకున్నాను
రబ్బరు బులెట్స్
తగిలితే నా శరీరం
తట్టుకుంటుంది
ఈ బడా రాజకీయ నాయకులూ
చేసే కుట్రలు తట్టుకోలేక
తెలంగాణా తల్లి కోసం
ఆత్మహత్య చేసుకున్నాను
అవును నేను ఆత్మహత్య చేసుకున్నాను

తెలంగాణా పోరాటనికి ప్రాణాలు అర్పించిన వారిని తక్కువ చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేక రాసాను.

బాలు*31-08-2012*

రవి వీరెల్లి // కొసమెరుపు //

అంతుచిక్కని చిక్కు ప్రశ్నేదో
ఆకాశమంతా పరుచుకుంది.
పేనుకుంటున్న దారాన్ని అక్కడే వదిలేసి
చీకటి కంట్లోకి బయల్దేరా.

వెలుగులోకి నడిచినంత ధైర్యంగా
చీకట్లోకి చొచ్చుకు పోలేం కదా!
అయితేనేం
కంటికేదీ కనిపించదని తేలిపోయాక
మనసు కొత్త రెక్కలు తొడుక్కుంటుంది
వొళ్ళు వాయులీనమై
కనపడని దారుల్ని శృతిచేసుకుంటుంది.

గుప్పిట
పిగిలిపోయేన్ని ఆలోచనలను పట్టి
అలా కళ్ళకద్దుకున్నానో లేదో
కడతేరని నడకకి కొత్త కాళ్ళు పుట్టాయి.
ఇక
ఎదురుచూపంతా
ఎప్పుడో రాలే ఆ ఒక్క చుక్క కోసం.

ఎక్కడున్నానో తెలీదు

కలల గాయాలు కార్చిన కన్నీళ్లు తుడుస్తూ
ఎరుపెక్కిన దూదిపింజలా
జీవితాంతం తిరగరాసినా పురిపడని పద్యం
వింతవెలుగై పురివిప్పినట్టు
వదిలేసిన కవిత్వపు దారం కొసన
కొసమెరుపై
అదిగో
ఆ రాలిపడ్డ రక్తపు చుక్క నేనేనా?

*

అనుకుంటాం గానీ
చీకట్లోకి నడిచినంత స్వేచ్ఛగా వెలుగులోకి వెళ్ళలేం
...నగ్నంగా!

09.01.2012

భాస్కర్ II అనుభవం II


"..మండుతున్న గుండెకు
కన్నీళ్ళతో స్నానం
చేస్తున్న హృదయానికి
ప్రేమ నిండిన నీ కమ్మని కళ్ళు
సాంత్వన కలుగ చేస్తాయి
ఎన్నేళ్ళ నిరీక్షణ ఇది
బహుశా కాలం అంచు మీద
మన పరిచయం ..సంతకమై
నీ పెదవుల మీద సంతకం చేస్తోంది
నీ గుండెల్లో బంధమై వాలిపోతుంది
దూరం ఎక్కువైన సమయంలో
మనమిద్దరం ఒకరి కళ్ళలోకి
ఒకరం చూసుకుంటూ ..
ప్రవహించటం ఎంత
బావుంటుందో కదూ
ఏ దేవుడి తోటలో
ఎదిగిన పువ్వువో తెలీదు
కానీ నీవు అలవోకగా
నడిచి వస్తుంటే మాత్రం
నింగి నేలను కౌగిట్లోకి
తీసుకున్నట్టు ..
నుదుటి మీద సింధూరమై
వాలి పోయినట్టు
మంగళ సూత్రమై హత్తుకున్నట్టు
అనిపిస్తూ ఉంటుంది..
తెరుచుకోని కలల్లో నువ్వే
మూసుకున్న రెప్పల వెనుకా నువ్వే
ఈ బంధం శరీరాలకంటే అతీతమైనది
అది..రెండు మనసులకు మాత్రమే
తెలిసినది..
ప్రేమంటే చూసుకోవటమా
కానే కాదు
నువ్వు నేను ఒక్కటేనని
చెప్పటం ..అంతే .."
తేది: 02 .09 .2012

సైదులు ఐనాల // నాలో నేను //

బయట వర్షం
ఎప్పుడెప్పుడాని
మాబ్బాయి చూపు
వాడి చూపులో
ముప్పై ఏల్లనాటి
నా బింబం
తలుక్కున మెరిసి నా కళ్ళ లోకి ఒలికింది
ఇప్పుడు నేను నాలుగేళ్ళ పసివాడ్ని
పీజ్ నాన్నేవ్వరూ వద్దనకండి
నే బయటకు పోతా....

- 2/9/2012.

నరేష్ కుమార్ // దా..తమ్మీ...! //

దా..తమ్మీ...!
కొన్ని రాలిపోఇన
కన్నీళ్ళేరుకుందాం...
గవ్వెగద
మనకిప్పుడు
మస్తుగున్నై....

ఏం ఆరాం
దింటున్నవ్...!
గాడెవడో
మన తమ్ముడెనాట
అచ్చిండు

మనకు
శాతగాని
పండ్లన్ని జేశింది
గాడెనటా.....

రజాకార్ల
కండ్లల్ల మనం గొట్టంగ
మిగిలిన
కారం
గిప్పుడు
చరిత్ర కండ్లళ్ళ
వోత్తుండు
గా కితావ్ల
ఒక్క కమ్మల్నన్న
దాశివెడుదాం
నాలుగు కాన్నీటి
సుక్కలు

నాలుగువందల
ఏండ్లకింద
మనం పీకంది
నల్బై ఏండ్లల్ల
ఉక్డాఇంచిండాట...

మన శాతవహనునికేమెర్క
నాగరికత....?
గీ మొగోడచ్చే దాక

పోరాటమంటె నీకేమెర్క నాకేమెర్క
సమ్మక్క
అడివిల
జరుగుబాటు లేక
జంగు జెశిన
తిరుగుబాటు తప్ప....

ఔరా....!
కళలంటే
నీకెం ఎరకరా ఫాల్తూ..!?
రామప్ప
నాగిని నడుం తప్ప..

అసల్కు
నీదేం భాషరా...?
నాలుగు
పద్యాల పోతయ్య
రాశిన
మూడు ముక్కలు తప్ప

థూ....!
మనదేం బతుకురా
కాలవడ్డ బస్సు
ఏడ్తుందాట...!
అరవై ఏండ్ల
మన కన్నీళ్ళెవడు
జూశిండు.....?
(evarinee kincha pariche uddesham to kaadu )

కపిల రాం కుమార్//అల్పకల్పిత స్వల్ప కవితలు//


నోటితో అవునను
నొసటితో కాదు అను!
నిప్పు లేకుండా పొగ రాజుకున్నట్లే!

ఉత్తర చూసి ఎత్తిన గంప
స్వాతిజల్లుకు ముత్యంకాక
జొన్న చేను యీటుపోయింది!

రోట్లో దంచిన వడ్లు
పురిట్లో సంధికొ్ట్టినట్లు
ఊక పోగయిందేతప్ప గంజితాగనీకి మెతుకులేదు!

పాడిపంటలు నిండుకున్నాయి
ఓటికుండలు భగ్గుమన్నాయి,
పండుటాకులు రాలిపోతే పండువెన్నెల ఎవరికోసం!

కంటి్రెప్పలనాట్యమాగిన
దండవేసే చిత్రమగును
కంటిపాపలా ఆదుకున్న దండ వేసే చిత్రమగును!

అరాచకనిష్ణాతులు
అంత(హంత)రంగ దిగ్గజాలు
రాచకీయభారతాన కీచకులా ఈ సచివులు?
22-8-2012

ఆర్.దమయంతి || తెలుసుకున్న నిజాలు. ||


1. తేడా!
*
తప్పటడుగుల నడకే
పసితనాన అందం.
తప్పుటడుగులే ఐతే
జీవితానికే అంతం.
***

2. తెల్సుకుంటే ఇంతే!
*
ఇవాళ గడిచిందని ఆనందమేస్తుంది.
కానీ..
ఓ అడుగు - సమాధికి దగ్గరయ్యిందని తెలిస్తే
దుఖమేస్తుంది.
***

3. దృష్టి లోపం!
*

ఇతరులలో అన్నీ దోషాలే క ని పిస్తాయి.
ఎందుకో కానీ,
ఎంత తరచి చూసినా..
తనలో.. తనకొక్క దోషమూ కనిపించదు.
**
4. ఇది నిజం.!
*
ఆడవాళ్ళు మారితే తప్ప
ఆడవాళ్ళకి
సుఖం వుండదు.

- ఆర్.దమయంతి.

Date: 2.09.2012.

ఆదూరి ఇన్నా రెడ్డి || జ్ఞాపకాలను చిత్తుకాగితాలు చేశావు ||


ఏకాంత సాయింకాలపు పలుచని వెలుతురులో
హృదయంలో విరిసిన సన్నజాజుల గానంలా
ఓ జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.

గుప్పిట రహస్యాలను విప్పిన నూత్న యవ్వన వనాల
పరిమళాలు విరజిమ్మే శీతాకాల రాత్రులలో
నీ సాంగత్యపు కొలిమిలో నన్ను నేను
కొలిమిలో కాలిపోయి, కరిగించుకొని మరిగించుకొనే క్షణాన
వర్షించిన సౌందర్యానందం నిన్నూ నన్నూ
ఆకాశపుటంచుల వరకూ విసిరికొట్టిన
జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.
కాని ప్రియా ఆజ్ఞాపకం... నిర్జీవంచేశావు..
నిర్దయగా నా జ్ఞాపకాలను చిత్తుకాగితాలు చేసి
నాహృదయాన్ని దోచి..వలచి వచ్చిన నన్ను.
నిన్ను నిలదీసి అడుగలేని నా నిరాశక్తత తెల్సునీకు
నా వల్ల నీవు క్షనకాలం కూడా భాద పడకూడాదు
నేను జీవితకాలం అయినా ఆ భాదను బరిస్తాను ప్రియా
ఊరడించి మోసం చేసి ఓడించి ఒంటరినిచేశావు ప్రియా..
నేనోడి పోయాను ప్రియా గెలుస్తాను అన్న నమ్మకంలేదు
నీవు వోడించావు.. అందుకే గెలవాలన్న ఆశే నన్ను గేలి చేస్తుంది ప్రియా

వాసుదేవ్ II రాస్తూఉండాలి..వీటన్నింటికోసం II


అక్షరాల్లో ఒదిగిపోయి
పదాలు ప్రసవిస్తూ
వాక్యాల్లో విశ్రమిస్తుంటాను
ఓ అలజడి తట్టిలేపకపోదు
మరో భావసంఘర్షణ సునామీ సృష్టించకామానదు
అప్పుడైనా రాయాలి

గొంతులో పూడిక తీస్కుని
గుండెలో చేరినతడి అప్పు పుచ్చుకుని
రాస్తూనే ఉంటాను
అదేంటో నిశ్శబ్దం మాట్లాడినన్ని మాటలు
ఏ వాక్యమూ చెప్పదు
మౌనం పాడినన్ని పాటలూ
ఏ గీతం ఒలికించదు
మౌనానికి మాటకీ ఎగుడుదిగుడు ఘర్షణే
కాలంవిడిచిన కుబుసంపైనా
కాలానికతుక్కున్న జ్ఞాపకాలపైనా
రాస్తాను...రాస్తూనే ఉండాలి

ఆకాశానికివడ్డాణంలా హరివిల్లూ
రాత్రికొంగు పట్టుకుని వచ్చే సూర్యుడూ
గుండె చీల్చుకున్న అక్షరమూ
రాయమంటుంది..

కన్ను మిటకరిస్తూ, గుండె కొట్టుకుంటూ
కన్నీళ్ళని ఒంపేసె కొవ్వొత్తీ,
వెన్నెలంతా పోగుచేసి కట్టిన ముడుపూ
వర్షాన్నంతా దోసిలితో పట్టి కట్టుకున్న
ట్రాన్స్‌‌పరెంట్ పొదరిల్లూ ఊర్కోవు రాసేదాకా....

రెప్పలనంటిన కలలకీ బాకీ
కళ్ళకంటిన బాసలకీ బాకీ
ఈ బాకీలన్నీ తీరుస్తూ ఓ వీలునామా
రాయాలి..ఓ మంచిమాట ఆస్తిగా ఇస్తూ...

ఒదిగుండలేక వర్షిస్తున్న మేఘాలపైనా
కురిసీ కురిసీ అలసిపోయిన వర్షంపైనా
రాయాలి..రాస్తూనే ఉండాలి....

మనసెక్కడో అలిగినప్పుడో
మమతెప్పుడో చిరునామా అడిగినప్పుడో
ఓ మాట రాకమానదు..అది కవితేమో ఇలా
గుండెలోతుల్నుంచి వచ్చేదే ఓదార్పు
మనసు పగిలినప్పుడు విన్పించేదే కవిత!

ఓ పదివేల మాటల్లో ఓ నిశ్శబ్ద వాక్యం
ప్రతీ కవితా ఓ కన్నీటి చుక్క
అక్షరాల పోర్ట్రైట్.....

(01.సెప్టెంబర్.2012.)

బివివి ప్రసాద్ || విహంగ దర్శనం ||


1.

జీవితం ఒక మహా విహంగం

దాని రెక్కలు

విప్పినపుడు అది పగలు

మూసినపుడు అది రాత్రి

ఆ పక్షిని నేను దర్శిస్తున్నపుడు

నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియకుండా ఉంది

నేను ఉన్న ఈ సృష్టి ఎక్కడ ఉంది

నా ఊహకి అందని ఈ విహంగం నా ద్వారా శ్వాసిస్తోంది

నా కనుల ద్వారా అది చూస్తోంది

నేను నిదురించినపుడు అది విశ్రాంతి పొందుతోంది

2.

నేను పొదుపుగా దాచుకొంటున్న నా ఊహలన్నీ

ఎండమావులే అని గమనించాక తెలుస్తోంది

నేను నేను కాననీ జీవితాన్ననీ స్పష్టంగా తెలుస్తోంది

ఇపుడు నేనొక మహా విహంగం

వెలుతురు నా కల, చీకటి నా విశ్రాంతి

నేను ఎక్కడ ఉన్నానో,

ఎపుడు మొదటిసారి నా రెక్కలు విప్పానో

నేను ఎందుకు, ఎక్కడికి వెళుతున్నానో

ఎప్పటికీ రహస్యం

3.

రహస్యం నా నివాస స్థలం

నేను మహా విహంగాన్ని, నేను జీవితాన్ని

2.9.2012

పీచు శ్రీనివాస్ రెడ్డి !! మట్టి , సంతకం చేసిన మనిషిని !!

చీకట్లో
ఆకాశం వెలిగించిన తారా దీపాలను
లెక్క పెడుతూ నేను .

వ్రేళ్ళు మాత్రం ఏదో రాస్తున్నాయి మట్టిలో ..
" నీ మీద ఒట్టు నేను నీ వాణ్ణే " నని
స్పష్టంగా కనిపించింది
మిణుగురు పురుగులు చల్లిన వెలుగుల్లో
అది నా మనసు చెప్పిన మాట

నాలో ఉన్న నీవు , అదీ నేనే
మట్టి కూడా ఒట్టేసింది
పచ్చని మొక్కల సాక్షిగా
నిన్ను నన్ను కలిసే బ్రతకమని

మట్టి నవ్వుతుంది ఊ .. గే .. పువ్వులా
పచ్చదనంలో ప్రవహించే రక్తం మట్టే

కలిసొచ్చే కాలం మోసుకొచ్చిన బరువు బాధ్యతలన్నీ
మట్టిపైనే ..
మట్టికి మమకారం మనిషిపైనే ..

పసితనంలోనే
గోళ్ళలో మట్టి మరకలు
నోట్లో మట్టి ముద్దలు
అప్పుడే , తెంచుకోలేని బంధం
మేనులో చేరింది
పేగులో కరిగింది
గుండెలో మిగిలింది

మనసుతో గమనించు
నిలువెత్తు మనిషిలో మట్టి వాసనే వస్తుంది
అంతే మరి ,
పేగును విడిచి మొదలైన తనువు
తుదకు మట్టితోనే ముడి వేసుకుంటుంది

మట్టి, సంతకం చేసిన మనిషిని
కడవరకైనా నేను
ఖచ్చితంగా చేరుకునే పుట్టినిల్లు మట్టే

01-09-2012

మాదాల వేణు || ఈ ఉదయం||


అరుణ కిరణ ఉదయంతో నా రుదిరకాంతి మెరవాలి
నా ఉహల విరితోటలో వర్షధార కురవాలి
సకల కళా సమ్మేళన భూతల వేదికపై శాంతి కోరు వైతాళిక గేయం నే కావాలి
నా జాతి పదిలపరుచుకున్న అజరామర పీఠికలో
ఆది పలుకులన్నీ నా ఘంటమే రాయాలి
శ్రవణమాస మయురమై నా అమ్మ ప్రేమ మురవాలి
అంబారానికేగసే నా ఆశల రెక్కలకు ఆ సాంతం సహకారం ఈ ఉదయం కావాలి.....
1.09.12

కర్లపాలెం హనుమంత రావు ॥ దిగులేస్తోంది! ॥


1
కాలం గాయం చేసినప్పుడు
ముల్లు విరిగిన కాలు నిప్పుకొండలా సలుపుతుంది
కాలం ఊహల ఉయ్యాలలూపుతున్నప్పుడు
నక్షత్రమండలాన్నైనా సబ్బుబుడగల్లా ఊదిపారేయచ్చనిపిసుంది
సమయం గడుసుది సుమా!
మంటలు చుట్టూ మండుతున్నా
మనసుకి మిణుగురుపురుగుల రెక్కలు తొడిగి
మల్లెపందిరి కింద బబ్బోపెడుతుంది
కాగితంపూలవాసనకే మత్తెక్కిపోయి మనీప్లాంట్ కి పర్యాయపదమే లేదని పలవరింతలు మొదలయ్యాయి నీకప్పుడు
కంటిముందరి స్వర్గమంతా తెరముందాడే నాటకంరా నాయనా!
పేరుతో ప్రేమగా పిలిచినట్లే ఉంటుంది
కాలం మెదడులో సర్వనామంగానైనా నువ్వు మిగిలి ఉన్నావా?

2
మనిషి గోరటి ఎంకన్నగొంతులో జీరయి కరిగిపోతున్నాడురా తండ్రీ!
అంతరించిపోతున్న లోకంలో మిగిలున్నఆ ఒక్క వ్యవహర్తా కూలిపోతున్నఆర్తనాదమవుతున్నా ఆ చప్పుడు నీకు వినిపించడం లేదా!
మూతబడే కంటిరెప్పల్లో కరిగిపోయే విశ్వం నీదేరా కొడకా!
ఒక నమ్మకం చెరిగిపోతే ఒక లోకం చిరిగినట్లే!
ప్రశ్నల్ని అడవులకి తరిమేసి చెప్పుల్ని చేత్తో మోసుకుంటో గమ్మత్తైన పోటీలో నువ్ బిజీ బిజీ ఉన్నావ్
చర్మం వల్చుకుపోతున్నా చమ్మగానే అనిపిస్తుందొరేయ్ నీకీ మత్తులో!


వాక్యంలా ప్రవహించడం మానేసి ఎంత కాలమయింది?
సుందరయ్యా!..సుందరాకాండా!
జెపీనా!…జైరామ్ రమేషా!
కనీసం ప్రశ్నల్నన్నా కనాలనిపిస్తున్నదా నీకు!
పోరు ఊరేగింపులో ఊగటం మానేసి పోలేరమ్మ జాతరలో తూలటం మొదలెట్టావు
నల్లమందు నినాదాలు మింగి రాజీజెండా భుజాన మోసుకుంటో
ఒక్క పూటైనా గట్టిగా నిలబడని ఏ వెలుక్కురా నువ్ దివిటీ పట్టుకుని చిందులేసేది!

4
రేపటి మీద ఆశతో పరుగులు పెట్టే నీ పసిపిల్లలకేం చెపుతావ్ ఇప్పుడు?
ఏ వీధి చివర చెట్టు మిగిలుంటుందని పచ్చనాకు కోసుకురమ్మంటావ్ రేపు?
ఆఖరి మెతుక్కూడా అయిపోయిందాకా చేతిలో ఉన్నది అక్షయ పాత్రేనని నమ్మిస్తావా నాయనా!
నువ్వు చదివిన మాట నువ్వు పాడిన పాట
నువ్వు నిప్పు రవ్వలు చల్లుకుంటూ నడిచి వచ్చిన బాట
అంతా వెండిమబ్బుల చందమేనా!
అధర్మ రథయాత్రలో ఆఖరికిలా ఆర్భాట భటుడుగా మిగిలిపోవడం ఎంత విషాదం!
కూలిపోయే మహావృక్షం చివరి చిగురువునువ్వే అవుతావని ఎన్ని కలలు కన్నాను!
రేపటి విషపుమొక్కకు మొదటి వేరుగా మొలిచే నిన్నిలా చూడటం…!


01-09-2012