పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

కర్లపాలెం హనుమంత రావు॥చురకలు॥


1
అగ్రరాజ్యమా అమెరికా!
అక్కడ తెల్లారేది
మనకు పదిగంటల వెనక!

2
విండోస్ కిటకిట
మైన్ డోర్ మూతట
-యువత

3
ఉమ్మేయడానికున్న స్వేచ్చ
విమర్శించడానికుండదుట
అభిమానులున్నారు హాల్లో
తస్మాత్ జాగ్రత్త!

4
ప్రేయసితొ ప్రైవసీనా
పార్కులు పార్కింగులు డేంజరు
వర్కింగ్ డే సర్కారు ఆఫీసే సేఫ్
లంచవరు దాకా ఎవరూ ఉండరు

5
తాతల నాటివి నోటి లెక్కలు
మనవలనాటికి నోట్ల లెక్కలు
తరంలో ఎంత అంతరం!

6
టీవీక్షణం
సింగిల్ విండో
సిండ్రోం లక్షణం

7
అమెరికా వీసాల్లోనూ తెలుగు
ఆంధ్రా కాన్వెంట్లకు
జ్ఞానోదయం ఎప్పుడు కలుగు!

8
'సత్యానందం' చిత్రం
పెద్దలకు మాత్రమే
విచిత్రం!

9
సోనియా ఫోనుకి రిసీవరుండదు
సింగు గారి ఫోనుకి స్పీకరుండదు

కొనకంచి // అమ్మ //


ఒంటరి రాత్రి
కంటి నుంచి జారిపోయే
కన్నీటి చుక్క..
ఎకాంతం అల్లుతున్న
నైలాన్ సాలెగూడు..
కాలం కురులను
ఆర్ద్రంగా దువ్వే
చల్ల గాలి..
గది చెక్కిలి పై
చిరునవ్వుల్ని వొంపుతున్న
మొనాలిసా..
అన్నీ అంతర్వలయాల్లొ
కందకాలు తవ్వుతున్నట్లు
చేతులు చాస్తాయి.

స్తబ్దంగ కదలని కాలంలో
చికటి నవ్వినట్లు
నాకేమీ తోచని అర్ద రాత్రి
తెల్లని మంచు ముద్ద కప్పేసినట్లు
భయం.. భయం.!
ఎడర్ల కావల
నదుల కావల నా చిన్ని పారదర్శకపు నోరు తెరిచి
నీ ఊపిరిని
ఉగ్గులొ కలిపి తాగించావు .

దీప శిఖల్లా.
అక్షరల్ని దిద్దించి
ఏకంత సరస్సులో తేలిన
ఎర్ర కలువను చేసావు.

పిడికెడు మూగ గుందెమీద
పికాసో చెయ్యి గీసినట్లు
బాల్యం నిండా అన్నీ చిత్రలే!
అలసిపోయిన హ్రుదయం
పట్టు తప్పి
ఆకాశంలోంచి జారి పడ్డట్టు
దీప స్థంభం కింద
పొంచి ఉన్న చీకటి
ఆవలిస్తూ వెక్కిరిస్తుంది .

స్మృతుల సర్పాలు క్రూరంగా
కాళ్ళకు చుట్టుకొని
ఊపిరి తీసుకోనియకుండా
బుసకొట్టి భయపెడతాయి .
ఎంత బలంగా మూసినా
జ్ఞాపకాలు మాత్రం
కిటికీలు తెరుచుకొనొచ్చి
తేనెటీగల్లా ముసురుకుంటాయి
పొలిమెరల్లొ నిలబడి
సౌందర్యం
నా కొసం ఆప్యాయంగా
ఎంత ఎదురుచూసినా
డియర్ మమ్మీ...
దీపావళికి ముందు రోజున
మొదటిసారి నేను
బాంబు కాల్చినప్పుడు
నీ కల్లలో మెరిసిన ఆనందార్ద్రత
నిప్పు నలుసులా
నాకింకా గుర్తుంది .

ఊపిరాడని రాత్రి
రంగేసుకున్న మృత్యువు
నన్ను రకరకాలుగా వేధిస్తున్నప్పుడు
కన్నీళ్ళతో నీవు
ఆసుపత్రిలో చేసిన యుద్దం
అకాల మరణం పొందని
ఈ అదౄష్టవంతుడికింకా
గుర్తుంది .

ఇంటి ముందు వేపచెట్టుకింద
గుండెల్ని వణికించే
సంక్రాంతి చలిలో
నువ్వు తలంటుతుంటే పడ్డ
కుంకుడు రసం మంట
ఎదార్ల కీవల
నదుల కీవల
నాకింకా గుర్తుంది.

భవిష్యత్తును కట్టేసి
నగరం రాక్షసిగా నన్ను
అడుగడుక్కి భయపెట్టినా
నీ,
ఆశీర్వాద బలంతో
రగుల్కొంటున్న జీవకణంలా నేను.

చీకటి కాగితం మీద
మెరిసే రేడియం అక్షరంలా
నీ అమృత హస్తాలతో
దేశం బుగ్గ మీద
పెళ్ళిబొట్టు పెట్టినట్లు
నీ వారసునిగా నేన్నేను.

జగద్ధాత్రి || ఆట విడుపు ||


అవును నిజమే
అప్పుడప్పుడూ అట విడుపు కావాలి
అహరహమూ ఆడుతోన్న
అవిశ్రాంత జీవితపు ఆటనుండి ఆట విడుపు కావాలి
ఆట తప్పని సరైనా
ఆట విడుపు లేకుంటే
అలసిపోతాము....
ప్రతిరోజూ ఓ పరికరంలా
పని చేసే దేహాన్ని
అనుక్షణం ఆలోచనలతో
వేడెక్కిన మేధో కర్మాగారాన్ని
మనకోసం సాగించే
మర లాంటి మనుగడనీ
అప్పుడప్పుడూ విశ్రమించనియ్యాలి
అనుదిన ఆర్భాటాలనుండి
స్వార్ధపు సుఖాల నుండి
ఓ అడుగు పక్కకు వేసి
మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా గమనించాలి...

అప్పుడే...
అనంత మైన ఈ భూగోళంలో
మనమెంత అణువులమో తెలుస్తుంది
మన సంకుచిత పరిధులు దాటి
మనకూ ఓ బాధ్యత ఉందన్న
ఎరుక కలుగుతుంది
మనదైన ఒక ముద్ర
చరిత్ర లో మిగాల్చాలన్న
స్పృహ కలుగుతుంది

అప్పుడు.....
ఆలోగోరే ఘోషిస్తోన్న
గ్లోబల్ వార్మింగ్ గురించి
ఏమి చెయ్యాలో ఆలోచిస్తావు
పాలస్తీనా లోని పాలుగారే పసిపాపల
బుగ్గల కన్నీటి చారికలు
నిన్ను నిలువునా కదిలిస్తాయి
అంటార్క్టిక లో కరుగుతోన్న
మంచు పర్వత శ్రేణులు
నీకు పర్యావరణ పరిరక్షణ
కర్తవ్యాన్ని బోధిస్తాయి
భవిష్యత్ నిర్మాతలు కావాల్సిన భావి పౌరులు
ఆటవికతకు ఆనవాళ్ళుగా
ఎలా విజ్రుంభిస్తున్నారో
అవలోకిస్తావు
గుజరాత్ గుండెల్లో
ఆరని గోద్రా మంటలు
నందీగ్రాం, ముది గొండ ప్రేలుళ్ళతో
ప్రతిధ్వనించే తూటాల శబ్దాలు

నీ చుట్టూ విలయ తాండవం చేస్తోన్న
సమస్యలేమైనా ............
అకాలంగా రాలుతోన్న
శవాల వర్షాలు
సమాధానాలే లేని ఇరుగు పొరుగు దేశాల
పీటముడి ప్రశ్నలు
నీదైన మాటను
నమోదు చేయమంటాయి
నీదైన ప్రతిస్పందనను కోరుతాయి
ఆటవిడుపు అంటే విశ్రాంతి కాదు
ఆత్మావలోకనం

నీ జీవితపు ఆట నుండి
ఒకింత బయట పడి
నిస్వార్ధంతో
నీ కింకర్తవ్యాన్ని
చేపట్టగలగడానికి
సమాలోచన చెయ్యగలిగే
సంసిద్ధతా ప్రయత్నం
ఎంత గొప్పగా ఆడినా
బతుకాటలో వృద్ధాశ్రమం
నీ చివరి పెవీలియన్
ఒంటరితనం మాత్రమే
నువ్వు సాధించుకునే
అక్కరకు రాని నీ "లైఫ్ ట్రోఫి "

జీవితం ముఖ్యమే
కానీ అయువుతో ఉన్న నలుగు ఘడియలు
సమసమాజ నిర్మాణంలో
నీవు కూడా ఓ ఇటుక వైతే
సామాజిక సమస్యా పూరణంలో
నీవూ ఓ కరబంధమైతే
జన్మ సార్ధకతను పొంది
మనిషిగా మనుషుల
మనసులలో మరుసటి
తరాలకు నిలుస్తావు !!

ఆట విడుపు అంటే విరామం కాదు
విశ్వ శాంతి ప్రపంచ కప్ సాధించడానికి
మానవత్వపు జట్టు
ఆటగాళ్లుగా మన మందరం
తర్ఫీదు పొందే
సార్ధక సమయం....!!!

బాటసారి **నువ్వొస్తావని**


నువ్వొస్తావని
కాలానికి గాలం వేసి

ఆరు ఋతువుల్ని ఏకంచేసి
ప్రతి మాసంతో సావాసం చేసి
......
వసంతంలో చిగురులా
మాఘమాసంలో నవ వధువులా

సంక్రాంతి వాకిట ముగ్గులా
గ్రీష్మాన్ని ముద్దాడే వానచినుకులా

వేచివున్నా నీ తలపుల వాకిట
అలుపెరగని కడలి అలలా ....08-09-2012

ప్రసాద్ తుమ్మా || సమాధుల నడుమ ఓ పూట ||


ఇక్కడే!
ఈ సమాదులలోనే
ఏ గులాబి తన సౌరభాన్ని వెదజల్లుతుందో
ఏ ముత్యం తన మెరుపును మెరిపిస్తుందో
కానరాని అందాలు
అందుకోలేని ఎత్తులు
నా హృదయ స్పందన లాగే,

కదలాడే క్రీనీడలు
నిర్మలమైన హృదయాలు
అవకాశం లేక కాలేని మేధావులు
ఎన్ని రాజ్యాలు ఎలేవారో
మానవాళికి ఎంతగా కృషి చేసేవారో,
ఈ మానవాళి గురించి తెలియక'
ప్రశాంతంగా భూమాత వొడిలో
జాలిగా జోలలో...

ఎక్కడో ఓ తీతువు కూత
ఆగి ఆగి అరుస్తున్న గుడ్లగూబ
ప్రశాంతత చెదిరిన వాతావరణం
భయంకరమైన నిశబ్ధం
ఇవేవి పట్టని
సమాదులలోని జీవులు
బయటకు వచ్చాయంటే
నీడలు....
భయాలు.....
ప్రళయాలు..........
నూతన సృష్టికి
మరో ఆరంభాలు .
తేది .08-09-12

పులిపాటి గురుస్వామి || క్వార్టర్ ప్రేమ ||


బలవంతంగా కోరికను విరిచి
ఆఘమేఘాల మీద ఏర్పాటు సిద్ధం చేసిన
ఆనందం ముఖం లో

సేవలందించడానికి రెండు గ్లాసులు
వేపుడు అటుకుల పప్పు
రెండు స్పూనుల కరుణ

ఉల్లిపాయల వాసన
నిమ్మ రసం లో తడిసి
చల్లని పులుపు శ్వాస గొంతులో

అరచేతిలో అడుగు భాగం హత్తుకొని
ఎక్కువ తక్కువ తూకం ఒక్కో చుక్కతో సరిపోల్చి పోసి
బుస్సు బుస్సు సోడా నీళ్ళతో నింపిన మహాద్రవం

తనివి తీరా గర్వం తడిసి పోయి
ఆనందం బుడగలు బుడగలు గా కిందికి మీదికి
ఇక ఇద్దరి చేతుల్లోడీ కొట్టిన గ్లాసుల శబ్ధం జారిపడి

మౌనంగా మొదటి గుటక
నాలుకకు తెలిసిన తిమ్మిరి తడి
మత్తు చుక్కల జారుడు బండ గొంతుక

కొన్ని కరకర లు ,సోడా బుడగల్ ఈదులాట
మత్తులోకి జారుకుంటున్న గాలి
వాడి ముఖం నిండా రక్తం పొంగిన ఆనందం

రెండవ సారి నింపుతూ 'మాట్లాడు బావా' అన్నాడు
'జీవితమంటే ఏంట్రా 'అడిగాను
క్వార్టర్ అహం,క్వార్టర్ స్వార్ధం,క్వార్టర్ మోసం ...
మిగిలింది ....క్వార్టర్ ప్రేమ బావా!

మత్తు దిగింది వెంటనే
మాటలు వెంట వచ్చాయి .

ఈడూరి శ్రీనివాస్ //కొత్త కవి//


ఏంటోయ్ కొత్త కవీ
రాస్తున్నావ్ అవీ ఇవీ
నీ రాతలు ప్రవహించాలి
యువరక్తం వుడికించాలి

శ్రీశ్రీని బట్టీ పట్టినా
సినారేని చుట్టుముట్టినా
అక్షరం అందలమెక్కదు
నీ లక్ష్యం నిదురలేవదు

బూతు బొమ్మకు చొంగ కార్చే
యూతు నడక మార్చాలి
పబ్బుల్లో పడి తాగిన
పది బీర్లూ కక్కించాలి

హాబీగా ప్రేమించే
బేబీలను మార్చాలి
బాయిఫ్రెండు కల్చరెంత
బ్యాడు ట్రెండో తెలపాలి

అడ్డంగా దండుకున్న
ఉద్దండుల తల వంచాలి
గలీజు గనుల గజనీలను
వురికంబం ఎక్కించాలి

నీ కలం నినదించాలి
వ్యవస్తను ఎదిరించాలి
యువతను రగిలించాలి
భవితను బతికించాలి

08/09/12

Srinivas Yellapragada ‎ // "కలం ఏడ్చింది" //


నన్ను నింపావు నీలంగా
నాతో నిన్ను రాసేందుకు..
మదిలో పొంగిన భావాన్ని
మెదడు నరాల్లోకి లాగి
మనసు భావాన్ని
మనుషభాషకు తర్జుమా చేసి
చెయ్యి కదిపావనుకున్నా
నా నాల్క తెల్లటి నేలపై
నీలం ముత్యాలు రాల్చింది
నీకు ఆనందం..నాకు పరమానందం
నీకు నేనుపయోగపడుతున్న విధం

నీలో ఆశచావలేదనుకున్నా
నీ తీరు మారలేదనుకున్నా
ఇంకొన్ని పొంగిన భావాలు
నానుండి జాలువారిన ముత్యాలు

నీవు నింపుతున్నావు
నేను కక్కుతున్నాను
అదే పనిగా..అదే తీరుగా
నువ్వు ఙ్ఞానివనుకున్నా
మనసులో నీకు కోటి దండాలన్నా

కాలం కదిలింది వేగంగా
నీ చెయ్యి కన్నా కొంచెం వడిగా
నాకు వీలు దొరికింది
నీ లోకం పోకడ చూసే విధంగా

నీకు తెలియలేదు కానీ
నా ఆనందం ఆవిరయ్యింది
నా మనసు బడబాగ్ని మధ్య
నేరాల్చిన అక్షరాలు నవ్వాయి
నా కన్నీళ్ళ మధ్య

నీ ప్రపంచం ఇదా?
నీ అసలు తీరిదా?

రాల్చేందుకే కానీ
అవి నీ మదినుండి కాదని
నీ చెయ్యి రాసేందుకే కానీ
చేసేందుకు కాదనీ

తనివితీరా ఏడ్వాలనుంది
మళ్ళీ కలాన్నై పుట్టరాదని
ఉరేసుకోవాలనుంది
నాతో ఓ సూడో ప్రపంచాన్ని సృష్టిస్తున్నానని!! 08SEP12

మోహన్ రుషి // మేడ్ ఇన్ మిర్యాలగూడ! //


వికృత ఆలోచనల విషం పీలుస్తూ
సద్భావనా సదస్సులు నిర్వహించలేను!

కక్షగట్టి గాయాలు చేసే నిపుణత కనబరుస్తూనే
కపట నాటక కన్నీళ్ళు కురిపించలేను!

గుండెల్నిండా ద్వేషాగ్నులతో చలిస్తూ
పెదవి అంచు ప్రేమరాగంతో సమ్మోహపర్చలెను!

అంబరమంత అవిశ్వాసాన్ని దేహమంతా పులుముకుని
నయగారాల నమ్మకాల నగారా మోగించలేను!

అంతరంగమంతా అక్కసుని పరచుకుని
అవ్యాజమైన అనురాగాన్ని ప్రదర్శించలేను!

కనబడని కరవాలాల్తో కలియదిరుగుతూ
సుభాషితాలు వల్లించలేను!

జేబుల్నిండా రాళ్ళు నింపుకుని
పూల గురించి మాట్లాడలేను!

నిజం చెప్తున్నా...
రెండుగా ఉండలేకే ఇప్పటికీ ఇలా రేయిలోనే మిగిలిపోయాను!

8.9.12

కిరణ్ గాలి || కాల జ్ఞానం ||


వస్తుంది

నాగుపాములను నీటి కప్పలు నోట కరిచే రోజు
గద్దలను కోడిపిల్లలు పొడిచి చంపే రోజు
తోడేల్లని కుందేల్లు చుట్టు ముట్టే రోజు
వేటగాళ్ళ తలలను జింకలు చెట్లకి కట్టే రోజు
వస్తుంది

ఏం నమ్మ లేవా?

అణువులో అనంతాన్ని
పుక్కిటి పురాణాలను
సనాతన అధర్మాలను
ముక్కోటి అసత్యాలను
నమ్మ గలిగిన వాడివి

క్రూరమ్రుగాలను
సాధుజంతువులు
ముట్టడించే రోజొకటి
నిజంగా వస్తుందంటే నమ్మవేం?

పోనీ
మనువు మర్మాంగాలు తెగి పడి
శవమయ్యే రోజు వస్తుందని

మనిషి ముందు మోకరిల్లి
దేవుడు కన్నీళ్ళతో
తన తప్పులను
మన్నించమనే రోజు
వస్తుందని చెప్తే
నమ్ముతావా?

నమ్మవు కదూ?
నమ్మలేవు కదూ?

***

మనువుని ఎవరన్నా దూషిస్తే
నీలో మతోన్మాదం క్షణకాలం రెప రెపలాడినా

అంటరాని తనాన్ని అమ్మనా బుతులు తిట్టినప్పుడు
నీలొ అట్టడుగుని అగ్రవర్ణం ఆవగింజంతైన అలిగినా

కులకుక్కలను గుడ్డలూడదీసి కొట్టండని వాడంటే
నీలో ఏ రకమైనా "తామరిక"మైన లిప్త పాటు జివ్వుమన్నా

నీ ఆత్మలొ ఇంకా అశుద్దం వున్నట్టే

పో దాన్ని తులసి తీర్దంతోనో
నీ బుజంపై పట్టు కండువాతోనొ
నా గోచి గుడ్డతోనొ
మొలరా పరిశుభ్రం చేసుకోని
మలినాలన్నిటిని వదిలి
మనిషిగా తిరిగి రా

***

అప్పుడు

వివేకం అనేకం అయి

మతం గతానికి గొయ్యి తీసి కప్పెట్టే రోజు
కులం మూలాలకు కొరివితో నిప్పేట్టే రోజు
అంతరాలు అంతమయి వివక్ష అస్పృష్య్యత అయ్యే రోజు

వస్తుందని నమ్ముతావు

***

(నేను ఇతిహాసాలలో, ఉపనిషత్తుల్లో ప్రస్తావించబడిన
మనువును చూడలేదు, వినలేదు, చదవ లేదు.
నాకు తెలుసుకోవాలని కుడా లేదు.

నాకు తెలిసిన మనువు వ్యక్తి కాదు,
వాడు ఒక వ్యాఘ్ర వర్ణ వ్యవస్త.
ఆ వ్యవస్త బతికున్నంత కాలం
మనువు బతికే వుంటాడు మానవత్వాన్ని చంపుతాడు.

***

నాకు తెలిసిన ఒకే ఒక నిజం

రక్తం ఏ వర్ణంలో నైన ఎర్రగానే వుంటుందని
స్వేదం ఏ శరిరాని దైనా శ్రమిస్తెనే వస్తుందని
కన్నీరు ఏ కంటి దైనా కల్మషం లేకుండ కారుతుందని
మరణం ఏ ఇంటి దైనా దాన్ని ముక్కలుగ చేస్తుందని)

క్రాంతి శ్రీనివాసరావు ||1975..ఓ పోరాటగాధ ||


మా వూరి మర్రి చెట్టుపై
అర్ధ రాత్రి
మందారం పూసిందని
కాఖీలు కాలువల్లా ప్రవహించాయు

తుపాకీ గొట్టాలు
తూరుపు మొక్కలను
పసిగట్టాయు

తెల్లవార్లూ
లాఠీలూ ఎముకలూ
మాట్లాడు కొంటూనే వున్నాయు

సగం వూరు
నిద్రపోకుండా
ఆ పైశాచిక భాషను
అనువదిస్తూనే వుంది

తల్లి పేగును మాత్రం
తప్పుడు తర్జమాలతో
వోదారుస్తూనే వుంది

సూరీడు పదోసారి
పరామర్శిస్తున్నప్పుడు

వూరంతా కలసి
ధర్మంగా వేసిన
చర్మం మూటలను
వేడి కన్నీళ్ళతో
కాపడం పెట్టుకుని
కాపాడుకుంది

రోజంతా పారే
చీకటి వరదల్లో
కన్నుల్లో నిద్రంతా
కొట్టుకుపోతూనే వుంది

ఎవడో చేసే
వీరణం మోతలకు
మరెవడిదో
వీపు వాతలుతేలుతూనే వుంది

పోలీసు పాలనలో
వూరు పొలిమెర మరచి
చానా కాలమయ్యుంది

జతగాని కోసం
రోజూ ఎదురు చూపులే
మిగులుతున్నాయు
నా లేగ కళ్ళకు

ఆ రోజు నే నెప్పటికీ మరచిపోలేను
హటాత్తుగా ఎదురయున
భయ్యా బియ్యాబాని
సకల జీవులను
తాకి పలకరిస్తూ
షిరిడీ సాయులా

కాలం దింపిన మేకులతో
శిలువ వేసిన ఏసుక్రీస్తులా

అందరిలానే నన్నూ చూసి
నేనెవరో తెలియనట్లు తప్పుకొని
చుట్టూమూగిన చిన్నపిల్లలతో
సమావేశం పెట్టి
చిట్టీలు పంచుకొంటున్నాడు

ఎమర్జెంసీ
మావూరి కిచ్చిన బహుమతి
బియ్యబాని సాక్షిగా
ఇప్పుడు మావూరినిండా
మందారాలు విరబూస్తున్నాయు

శ్రీ|| స్పూర్తి కాగడా||


ఇంతకు ముందెన్ని
పిరికి ప్రాణాలు
ఉరితాడుకుయ్యాలలూగడం చూళ్ళేదు?
ఎన్ని
నిస్సహాయ బతుకులు,
నిర్వేదపు జీవితాలు,
మృత్యు కౌగిలిలో శాశ్వతంగా
ఒదిగిపోవడం చూళ్ళేదు?

అప్పుడెప్పుడూ ఇన్ని
ప్రశ్నార్దకాల కంచెలు లేవు
మనసులో ఇన్ని సందేహపు
వలయాలు లేవు.
సన్నని సూదులతో
గుండె అడుగున పొడుస్తున్న
బాదా లేదు

కానీ ఇప్పుడు
ఉవ్వెత్తున యెగసిన
ఒక ఉద్యమ కెరటం
ఉరేసుకుంది

నక్సల్బరి లో
అడవితల్లి కి పురుడు పోసి
ఉద్యమానికి ఊపిరులద్దిన
ఒక ప్రచండ ఝుంఝూ
చైతన్యమారుతం
ఉరేసుకుంది.

దారితప్పి చీకటిలో
అస్తవ్యస్తమైన ఉద్యమమానికి
అస్తమించే వయసులో
వెలుగునివ్వలేక
ఆ ఘడియ రాకమునుపే
కొత్త వెలుగుల
విప్లవోదయాల కోసం
కడలిలో దూకిన సూర్యుడల్లే
అగుపిస్తున్నవ్ 'కానూదా'

ఇన్నాళ్ళూ నువ్వు నడిపిన ఉద్యమం
ఇవ్వాళ నిన్ను నడపాల్సొచ్చిందని
బాదతోనేగా నీ మరణాన్ని కూడా
స్పూర్తి కాగడాగా వెలిగించి
నిష్క్రమించావ్!

కానూదా
నీ త్యాగం వ్యర్దం కాదులే
నీ ఆదర్శాలనర్దం చేసుకోలేని
'వాళ్ళ' వంకెందుకు చూస్తావ్
వక్రమార్గం పట్టిన
ఉద్యమకారులను కూడా చూడకు
వాళ్ళూ వీళ్ళూ కాక లోకంలో
నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు లే
నీ ఆదర్శాల వెలుగుల్లో
ఉద్యమ పాఠాలు నేర్చుకుంటున్న వాళ్ళం
నువ్ వెలిగించిన కాగడా మోయాలనుకుంటున్న వాళ్ళం

--శ్రీ(కామ్రేడ్ 'కానూ సన్యాల్ ' కి విప్లవ జోహార్లు) 26.03.10

డా. రావి రంగారావు || జీవ లక్షణం ||


ఒరే, సుఖా లన్నీ అనుభవిస్తూ
కష్టాలు తప్ప లేదనే వాడా!
గాలుల సుడిగుండాలకు చిక్కినా
పచ్చగానే నవ్వుతూనే వుంటుంది చెట్టని,
గొడ్డళ్ళ గూండాలు గాయపరుస్తున్నా
కొత్త చిగుళ్ళ ఆయుధాలతో తలెత్తుకొని ఎదిరించేది చెట్టని
తెలుసా నీకు ?

ఒరే, చెట్టు గర్భస్థ పిండాల్ని
ముక్కలుగా కోసుకొని తినేవాడా!
నీ కోసం జీవితాంతం
కడుపు పండించుకుంటూనే వుంటుంది చెట్టని,
తన ఆహారాన్ని
ఎవడినీ అడుక్కోదు చెట్టని
తెలుసా నీకు ?

ఒరే, చెట్టుకు చలనం లేదని వాగే
ఎదుగుదల ఆగిపోయిన వాడా!
పండ్లల్లో పువ్వుల్లో
కూరల్లో ధాన్యాల్లో
గింజల్లో పప్పుల్లో
చెట్టు కెంత చలనం వుందో
తెలుసా నీకు ?
చలనం లేదనిపించే భూమి
ఎంత వేగంతో సంచలిస్తుందో, సంచరిస్తుందో
తెలుసా నీకు ?

సరసరా పొలం దున్నుతున్న నాగలిలో
చెట్టు చలనం చూడు !
చీకటిని చీల్చుకుని సాగే దీపం వత్తిలో
చెట్టు సంచలనం చూడు !
చెట్టు విశ్వ ప్రయాణం తెలియాలంటే
చెట్టంత మనసు పెంచుకో ముందు !

కదులుతున్న చెట్టు కదలనట్లుగా
ఎందుకు నిలబడి వుందో తెలుసా !
ఆకలితో అలమటించి చస్తావని
నీ ఎదురుగానే వుంటుంది చెట్టు,
వద్దని గెంటుతున్నా వెళ్ళని
విశ్వాసం ఉన్న కుక్కలా
నీ ఇంటి ముందే నిలుచుంటుంది చెట్టు,
నీ ప్రాణాల్ని నిరంతరం కాపలా కాస్తుంది చెట్టు,
నీకు ఇల్లు కట్టిపెడుతోంది చెట్టు,
నీకు బట్ట చుట్టిపెడుతోంది చెట్టు,
నీకు దీపమై దారిచూపుతోంది చెట్టు,
కుర్చీయై నిన్ను అందాలా న్నెక్కిస్తోంది చెట్టు,
నువ్వు చచ్చాక కూడా
నీ తలదగ్గర వెలుగై
నిన్ను తగలేసేది కూడా చెట్టు...

ఒరే, చైతన్యహీనుడా !
నా దృష్టిలో
చెట్టు...సజీవి,
నీవు నిర్జీవి...

ఒరే, రెండు చేతుల యంత్రమా !
ఇకనైనా చెట్టును కొట్టకురా !

పీచు శ్రీనివాస్ రెడ్డి || నేను నా ప్రియురాలు ||


ఒంటరితనం
నాకీ మధ్య పరిచయమైన కొత్త ప్రియురాలు
ఒంటరిదైపోయిందో ఏమో
నా నుండి వెలివేద్దామనుకున్న ప్రతీ సారి
ఆమె నాతో మాట కలుపుతూనే ఉంది
మంతనాలు జరుపూతూనే ఉంది

జన కాలుష్యాన్ని వదిలి
ప్రకృతి ఒడిలోకి చేరుకొని
గరిక పోసతో
గడ్డి పువ్వుతో
నేను మాట్లాడుతుంటే
గమనించనే లేదు
ఆమె నా ప్రక్కనే ఉంది

ఎవరు లేని నిర్జనారణ్యంలో
వెలుతురే లేని చీకటి సందర్భంలో
భుజం తట్టింది ఆమే.
భయం పొరల తెరలను చించి
ఆమె నా ప్రక్కనే
నేనున్నానంటూ

ఆమె
నా తనువునుండి మనసును వేరుచేసి
దానికెన్ని ముచ్చట్లు చెప్పుతుందో
ఉలుకు పలుకు లేని నేను
నా ప్రియురాలిని నా మనసుని
కళ్ళప్పగించి చూస్తూనే ఉండిపోయాను
యుగాలు గడుస్తున్నాయి వాళ్ళ ఊసుల్లో
నాకు మాత్రం నెత్తి పైన ఎండ నెత్తి పైనే ఉంది
నేనక్కడ మూడో మనిషిని

విసుగొచ్చి వచ్చేసాను
మనసుని నా ప్రియురాలికి అప్పజెప్పి
మళ్ళీ జనారణ్యంలోకి నేను .

జనంలోనే నాకు బలం .

08-09-2012

కపిల రాం కుమార్ // బడుగుల సవాల్//

మా తాతల్ కాలం - బహు గడ్డు కాలమనే చెప్పాలి!
పెద్దింటోళ్ళమనే పేరేకాని అది.. అంటరాని జాతిని అంటరానోళ్ళు పెట్టినదె!
యెన్ని పాబందీలు - యెన్ని అడ్డంకులు
తలచుకుంటేనే - అగ్ర వర్ణాల మీద అసహ్యం వేస్తోంది.

ఈ బామ్మర్లికి యాగ హవిస్సుకై అర్పించిన గోమాంసం కోసం
మా మాదిగోళ్ళతో పోటీపడ్డప్పుడు తగిలిన పిడిగుద్దులు యాదిలేదనుకుంటాను!
బసివిగ, మాతంగిగా, పార్వతిగా చేసి దేవుడికి పెళ్ళిచేసి
అచ్చోసినట్లు ఊరుమ్మడిగ అనిభవించి,
సామూహికంగా దోచుకున్న రోజులు గుర్తున్నాయి!

ఇప్పుడు అప్రస్తుతమైన గతచరిత్రైనా,
గతితార్కిక సూత్రాలు దీనికి వర్తిస్తాయి!
మృతకళేబరాలను వూరికి దూరంగా లాక్కెళ్ళి, చర్మం వొలిచి
తొట్టెల్లో వూరేసి, పసుపు, ఉప్పుల్తో శుభ్రపరచి
ఎండకు ఆరేసి, ఘూటంతో చదునుచేసి
చెప్పులుగానో, మోటబావి బొక్కెనకు తొండంగనో,
సవారీబండికి చర్నాకోలగానో నగిషీగ అల్లిస్తే వాడుకున్నారు!
సాలుకు యీనాంగ కంబళీ, ఓ తూముడొడ్లు, కళ్ళంలో
పరిగలేరుకొని తృప్ఫి పడినవాళ్ళం !!

వేలుముద్ర వేసేవరకు పెత్తందార్ల చెప్పుచేతల్లో నలిగినవాళ్ళం /మెలిగిన వాళ్ళం!
వేట్టోళ్ళంకద్ద భూమి శిస్తు వస్సూళ్ళకు
ఎవరిమొత్తకెళ్ళినా పరువు తక్కువ అనుకొని వెన్నులో వనుకు పుట్టెది వారికి!
కాని...
మా అవసరాల్కి గడీలముందుకెళ్ళి దొరముందు చేచాచాలంటే మాకు వనుకుట్టేది.
అది వృత్తికి, ప్రవృత్తికి వున్న తేడా!

వారు మోయమన్నజెండాల్ను మోసి,
ఎదిరివాళ్ళతో దెబ్బలు తిని
రక్తాలు చిందించి పానాలిచ్చిన వాళ్ళం!
సారాచుక్కకు, మాంసం ముక్కకు కక్కుర్తిపడి కొన్నేళ్ళుగ బానిసలైనోళ్ళం!
ఓటును రూపాయి నోటుకు తాకట్టు పెట్టం కాబట్టె - యిన్నాళ్ళు మా బతికులిట్టా తగలడ్డయి!

మాల సోదరులు నేసిం పంచెలచాపులు తేరగా దొబ్బి కులకటమే కాని,
వారిని ఆదుకున్నదిలేదు, పైపెచ్చు కరివేపాకులా వాడుకొని విసిరేసిన రోజులు,
వారి దాష్టీకాలు, గృహదహన్నలు, మానభంగాలు అన్నీయిన్ని కావు!
ఎన్నో యాదికున్నయి.!
గుళ్ళోకిరానివ్వకుండా నియంత్రించిన కార్పణ్యం యింకాగుర్తుంది!
ఆ కొట్లాటలోనే మా నాయన చచ్చింది యాదుంది!
మొసలి కన్నీళ్ళు కారుస్తూ సర్కారు చేసిన ప్రణాళికల్లో
వాడలు వేరుగా, బడులూ వేరుగ యేర్పాటుచేసినప్పుడే
వారి మనస్తత్వం, వర్గ స్వభావం విదితమయ్యింది!
ఉద్యమాల్ ఒరవడిలో కొందరు నేర్పిన చిలుక పలుకులే
అక్షర దీపం పుణ్యమా అని నేడు మా మహోన్నత ఉద్యమానికి బాటలు వేసింది!
మా లక్ష్యం యేమిటో, గమ్యం యేమిటో తెలిసింది!
యెల్లకాలం మమ్మల్ని మోసం చేయ్లేరు!
మా వాళ్ళను ఎన్నుకొని మీ చేత్తో పెత్తనం చేసే రోజులిక చెల్లవు!
బినామీ పరికరాలుగా వాడుకోటం యిక కుదరదు!
మా వాటా మాకు దక్కే వరకు, మా ఆత్మాభిమానం కాపాడుకునేందుకు
పోరుబాటలో విజయం సాధించితీరుతాం!
వర్ణవ్యవస్థ గొప్పతనం అర్థం కాని భాషలోచెప్పి ఊకదంపుడుపన్యాసాలు చెయ్యకండి!
ఎవరు ఏ పని చేస్తే వారిదాకులమని తెలుసుకోండి!
మాలో చదువుకుంటే బామ్మడు!
యుద్ధం చేస్తే క్షత్రియుడు!
వ్యాపారము, ఆర్థిక ఎదుగుదలచేస్తే వైశ్తులుగా
వ్య్వసాయము పశుపాలన చేసే శ్రామికులుగా మా జనం సర్వం సమిష్టిగా
పాటుపడితేనే సమసమాజం!
లేకుంటే వివాదమే!!
ఇక ఉదయించేది విప్లవమే!!

8/9/2012

స్వాతీ శ్రీపాద // నీ కెందుకు //


ముక్కలు ముక్కలుగచిదిమేసుకుంటూ
లిప్తలు లిప్తలుగా జీవితాన్ని కుదించుకుంటూ
ఊపిరిపీల్చే ప్రతిక్షణం అధినేతను నేనేననే
అహంకారపు పడగనీడకింద విశ్రమించి
విషపు కోరలూ ఉక్కుగోళ్ళూ పెంచుకుంటున్న
ఈ యుగపు ప్రతినిధివి.
నీ కెందుకీ చిరంజీవ శాతాయుష్షు ఆశీస్సులు

చీకటి రహస్యపుటరలను కత్తిరించుకుని
తగిలించుకున్న రెక్కల కింద
క్షణ క్షణం పొదుగుతున్న
అక్రమాల గొంగళి పురుగులకు
సీతాకోక చిలుకల ముసుగులు తగిలించి
హరిత వనాల భీభత్సాని విరచించే
నీ కెందుకీ అభినందనల పూలవానలు

గిరిగీసుకున్న అభిజాత్యం హద్దుల్లో
ఎంతసేపూ నేనూ నా ఔన్నత్యమనే
చికిత్సలేని జబ్బుసోకి
ఏకాంతపు ఒంటి స్థంభపు శిఢిల గృహ నిర్భంధంలో
గరళాన్ని ఉత్పత్తి చేసే నీకు ఇహ మనిషనే పేరెందుకు?
7-09-12

అలజంగి ఉదయ్ కుమార్ // కనబడని గమ్యం //


గమ్యం ఎదురుగా నీకు కనబడుతుందంటే
చిన్నా చితకా లక్ష్యంతోనే నీ జీవితాన్ని
సరిపుచ్చుకోడానికి నీవి సిద్ధపడుతున్నావన్నమాట
అలసి సొలసి పోతున్నా..
విసుకొచ్చి జీవితం పై
విరక్తి కలుగుతున్నా
వెనుతిరిగిపోదామనే
ఆలోచన వచ్చేలా
కళ్ళకు కాదు కదా
కనీసం కలలో కూడా
నీ గమ్యం నీకు అందనంతగా ఉండాలి
నీ ధ్యాసంతా నీ గమనం పైనే
వేయబోతున్న మలి అడుగు మీదనే
ఎదురుగా బయపెడుతూ
వెక్కిరింతలతో
స్వాగతమిస్తున్న
ఆటంకాల పైనే
అవరోధాల పైనే
వాటిని అధిరోహించేందుకు
అనుసరించాల్సిన నవీన వ్యూహాలపైనే
మన పరుగు ఎక్కడ మొదలైతేనేం
ఇప్పుడు అవసరమా?
గతాన్ని పదే పదే తలుచుకోవడం వలన
గొప్పగా అనిపించవచ్చునేమో గాని
పరుగు మందగించి
గమనం గతి తప్పవచ్చు
ఎంతదూరం వెళ్ళాలో
ఎప్పటి కల్లా చేరుకుంటావో
అంటూ రేపటి రోజు గురించి
ఆలోచనల్లో పడినా అంతే
అంత దూరమా అంటూ డీలా పడొచ్చు
ఎందుకొచ్చిన వృథా ప్రయాసలంటూ
నీ పరుగును నీవే ఆపుకోవచ్చు
అందుకే ఇప్పటికి పుఅయోగపడని
పనికిరాని ఆలోచనలు మాని
నీ వర్తమానం పై గురి పెట్టు
గమనం సరియైనదైతే గమ్యం అదే
నీ ఒళ్ళోకొచ్చి వాలుతుంది
తనను వరించే వరుడివి నీవే నని
విజయ వరమాలతో నీ తోడుగా నిలుస్తుంది

చైతన్య || అబద్దాల చిరునామా! ||


నా నమ్మకాన్ని అమ్ముకున్నావా!
.
.
.
.
ఆశలతో నిర్మించిన అందాల లోకాన్ని...
సుదూర ప్రేమ తీరానికావల విసిరేసి..
వాడిన నవ్వులతో నిత్యం పలకరించే..
నీ నవ్వు అబద్దం!
కనుల మాటున నిజాన్ని దాచి,
నన్ను మాయ చేసిన నీ చూపబద్దం!
నీవు చేసిందే నిజమని నమ్మించే ప్రయత్నం చేయకు.
నువ్వేది చెప్పినా నమ్మే మనసు,
నీ మాయలోంచి బయటపడి...
ఎడతెరిపిలేని కన్నీటి వర్షం లో తడుస్తున్నా...
పట్టించుకోని నువ్వబద్దం కాకింకేంటి???
08-09-12

కాంటేకార్ శ్రీకాంత్ // నీరు దాహం //


ఇప్పుడు చెప్పు
కొంటె గుట్టు కొంచెం కొంచెం విప్పు
ఎప్పుడూ మేల్కొని వుండే సమాజంపై పరదా కప్పు
నక్కినక్కి చూసే దొంగచూపుల రెప్పాలు దింపు
ఏవో రహస్యాలు వినేందుకు గోడలకున్న చెవులను మెలితిప్పు
తెచ్చుకో మరపు
లోకం పట్టని వెరపు
మన కలయికకు తెరలేపు
నీ హృదయ భావాలు నాలోకి వంపు
దాగిన నీ మనసును నాకు చూపు
అణచుకున్న కోరిక నాకు తెలుపు
మనిద్దరిది ఈ మాపు
నడచి రా నీకు నీవు విధించుకున్న సరిహద్దుల ఆవలి వైపు
రెక్కలు విచ్చుకున్న విహంగమై నీ కలల తీరం దరిదాపు
నేను నీరు
నీవు దాహం
నేను పవనం
నీవు పరిమళం
నేను వణికించే చలిని ి
నువ్వు భగభగలాడే సెగవు
ఐక్యమవుతున్న ఈ క్షణంఅమరతీరాన ఆనందనాట్యం

యాకూబ్ ॥ కంకుల పాలు ॥


ఏకాంతం
తలలో సుళ్ళుతిరిగే కల

తలలో వేళ్ళుజొనిపి,నిమిరి,లాలించి
గోముగా రససిద్ధిలోకి పయనించి
అర్థనిమీలిత శరీరశాంతి కాంతిలో
ఒక్కో క్షణాన్ని ఒడుపుగా శరీరీకరించి

ఒక గొప్ప
అద్భుత రసాంకిత అక్షరకణం స్పృశించి
జొన్నకంకుల కోసం వాలిన
గొరెంకల ముక్కుల్లో మిగిలే కంకులపాలుగా

మె
రి
సే

అ క్ష రా లు.!!

సమయం =
అదొక కవిసమయం.

చైతన్య...|| వింటున్నావా.... నా మాట! ||


"ఎన్నో ప్రత్యేకతలు నీ అడుగుల సవ్వడిలో,
మరెన్నో సందేహాలు నీ మౌనపు చూపులలో!
చురచుర చూపుల మాటున,
తెలియని కోపాలెన్నో!
తీయని నవ్వుల మాటున,
నా మనసెరిగిన మధురిమలెన్నో!
నే చూసిన కోణంలో నీ అందం అపురూపం!
నిదురించే వేళలలో మురిపించే అమాయకత్వం!
కవిలా నిను చేరుకొని,
కవితల్లే నిను శోధించనా!
శ్వాసై నీలో చేరి,
హృదయంలో కొలువుండనా!
ఆకలిదప్పులనెరుగని మంత్రము నాపై వేస్తే,
నిద్రలేని రాత్రులెన్నో నిటూరుస్తూ గడిపాను!
అలక మానేవేళ అచ్చెరువొందే రూపం!
చెంత చేరేవేళ పరిమళాల పన్నీటి వర్షం!
జీవితమంతా నీవై నావెంటే నువ్వుంటే,
నీది కాని మరోలోకం నాకెక్కడ వుంటుంది!"
9-9-12

కపిల రాంకుమార్ // పుస్తక మస్తిష్క వేదన //


ఊసులేవో చెప్పటానికి మనసు నీతో విప్పటానికి
చేరవచ్చే మంచి నేస్తం -చెలిమి కోరే పుస్తకం!

నాటి కతలు చెప్పగానునేటి వెతలు తీర్చగానూ
మేటి రేపటి బాటనీకు తేట తెల్లం చేయగానూ

కష్టసుఖములు పూలతోటలుప్రేమ ద్వేషపు పోటకత్తులు
గెలుపు ఓటమి బొమ్మ బొరుసులు పుస్త్కాలే పూలగుత్తులై

బతుకు సంద్రపు ఆటుపోటులు ్చెల్ల చెల్లచెదదు చేయవచ్చును
గతుకు దారుల అలుపు సొలుపు సేదతీర్చి బలము నిచ్చును!

ఎల్లకాలం వుండనీకి కల్ల బతుకు తొలగటానికి
వాటి చెలిమి ఎంతో బలిమి పరులు దోచని జ్నాన కలిమి

పుస్తకాల పురుగులంటే పాడుచేసే చెదలు కావు
బూజుపట్టిన యెదలు తుడిచి ఎదుగనిచ్చే మంచియెరువు!

మంచిమాటలు చెప్పవస్తె చెవులకింపుగ సోకబోద?
జ్ణానసంపద పంచవస్తే అందుకోను కదలిరావా!

కోకిలమ్మల పాటలెన్నో పైరగాలికి కదులుతున్నాయ్
దేవదూతల నాట్య కేళి కనుల ముంగిట మెదులుతున్నయ్!

రాక్షస రాజ్యపు కథలెన్నో రహస్య చేదన శాస్త్రాలెన్నో
విశాల్ లోకపు గుప్త నిధులు తమలో మనకై దాచుకున్నాయ్!

జ్నాన లోకపు మర్మమేదో పొందటానికి కదలిరావా?
చెప్పటానికి చెంతకొచ్చిన పుస్తకాల్ మాట వినవా?

9-9-2012
______________________________________________________
( ప్రజా కవి- ప్రజా కళాకారుడు కీ.శే. సఫ్దర్ హష్మీ రాసిం హిందీకవిత """ కితాబే కుచ్ కహనా చాహితీ హై""" కి తెలుగు అనుసరణ - నా నగారా కవిత సంపుటి నుండి)

పీచు శ్రీనివాస్ రెడ్డి || చావు లెక్కలు ||


దోచుకునేవాడు
దొడ్డి దారిలో వాని పని చేసుకుంటున్నాడు
దాపరికం లేకుండా!

చావు లెక్కలతో చావగొడుతుంటే
నువ్వు పాపపుణ్యాల లెక్కలేస్తున్నావా నేస్తం

వాడు పోతే కొందరేడ్చారని
వీడు పోతే కొందరు చచ్చారని
ఇక్కడ చావు లెక్కలూ..దొంగ లెక్కలే
ఇంటోడికి ఏమీ కాదు .
చంటోడిది చావులెక్కల సన్నాయి మేళం !
వీధి వీధి తిరిగి వాయిస్తున్నాడు , ఏ ఊరు వదలకుండా

వాళ్ళకి మరక కూడా మంచిదే
పబ్లిసిటీ పెరిగేందుకు
వాళ్ళకి చావు కూడా మంచిదే
రాజకీయంగా ఎదిగేందుకు

వాళ్ళు ఓట్ల దొంగలే
మనుషులను పంచుకుంటారు
వాళ్ళు నోట్ల దొంగలే
మనలను బికారీలను చేస్తారు
వాళ్ళు, కరువు లెక్కలు దాస్తున్నారు
వాళ్ళు, చావు లెక్కలు మోస్తున్నారు

సమాధి మీద పూచిందో శ్వేతా మందారం
తాజ్ మహల్ సింగారంలా
చావు పాటల పైనే పూస్తుంది యువ రాజకీయం
కీచక పర్వంలా

ఎవడు ఎవడికి పుట్టాడో
'లాబు'లిచ్చిన వారసత్వపు లెక్క పత్రం
రాజకీయానికి కొత్త రంగు తెస్తుందేమో!

చావు లెక్కలు చెప్పుతూ
చావు పాటలు పాడుతూ
యువరాజులు రేపటి రాజకీయాన్ని మింగకముందే
' దొంగల అడ్దాని ' శుద్ధి చేద్దాం ' ఓటు 'తో
09-09-2012

రావి రంగారావు // గుర్రాలను మోస్తున్న మనుషులు //


ఈ రోజు మనిషి
రోడ్డు మీద నడుస్తున్నా
ఏదో రూపాయల కట్ట దొరుకుతుందనే,
గునపంతో నేలను తవ్వినా
ఏదో లంకెల బిందెలు దొరుకుతాయనే,
ఆకాశంలో వెళ్తున్నా
ఏ కల్పతరువో అందుతుందనే,
మబ్బులు కమ్ముకువస్తుంటే
ఏవో బంగారం బిళ్ళలు కురుస్తాయనే ...
మనిషి కిప్పుడు వెయ్యి కళ్ళయినా చాలవు-
దేహకణా లన్నీ కళ్ళయితే ఎంత బాగుణ్ణు...

మనిషి మెదడు గురించి
పరిశోధిస్తున్న అమాయకులారా,
ఏ కణం వెతికినా
ఊడిపడేది సంపదల కోరికలే...

ఊళ్లో హత్యలు మానభంగాలు...
అందరూ నిద్రపోతున్నారు-
మేలుకొలపడం నా వల్ల కావడం లేదు-
ఇంతలో ఓ రూపాయి బిళ్ళ జారి కింద పడేసరికి
జనం లేచి ఒకటే వెతుకులాట...

మురికి నగర మైనా
విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నట్లు
ప్లాస్టిక్ బొమ్మలు కూడా
పచ్చనోట్ల వెలుతురు తగిలితే చాలు-
తుమ్మెద వరుడికి
అవే సౌగంధిక పుష్పాలు,
మధువు లేకపోయినా సరే,
పరిమళాలు పట్టుబడకపోయినా సరే...

డబ్బు చెట్ల నూడ్చి
కోసుకొచ్చుకొన్న రూపాయల “కొమ్మ”లతో
చక్కగా కాపురం చేయాల్సినవాళ్ళు
ఇంకా అధికఫలాలు కావాలని ముసలి చెట్లను వేధిస్తున్నారు,
గుడ్ల నీరు కుక్కుకుంటున్నాయి కాపు లేని చెట్లు,
ఉరితాటికి చిక్కుకుంటున్నాయి దిక్కు లేని కొమ్మలు...

సమాజం త్రాసులో
ఒక పల్ల్లెంలో సరస్వతిని
మరో పళ్ళెంలో పచ్చనోట్లు పెడితే
రూపాయల బరువే ఎక్కువని తేలిపోయింది,
సరస్వతిని నమ్ముకున్న సు”బుద్ధి”
రోడ్డుమీద దీనంగా పడిపోయింది...
సరస్వతి మెడకు తాడు కట్టి
పబ్లిగ్గా ఈడ్చుకుపోతున్న నోట్లకట్టలు,
దారి సుగమం చేస్తున్న పెద్దల పొట్టలు...

నిన్నటి దాకా సిగ్గుతో దూరంగా
ఎక్కడో పడివుండేది ఈ చీకటి కొండ,
ఇపు డీ కొండకు కాలం
డబ్బుతో పోసింది ప్రాణం,
ఏనుగులా లేచిన కొండ
దేశం మీద పడి దూకటం మొదలుపెట్టింది,
విద్యాలయాలను తొక్కుతోంది,
దేవాలయాలను గుద్దుతోంది,
మనిషికి మూడో కన్ను ప్రసాదించే
గ్రంథాలయాలను కుమ్ముతోంది...

డబ్బు గుర్రాన్ని ఎక్కి
విజయ విహారం చేయాల్సిన మానవుడా,
గుర్రాన్ని నీవే నెత్తి కెక్కించుకొని
మహానందంగా మోస్తున్నావా,
ఇప్పుడు కాకుంటే రేపటికైనా
ఆ గుర్రం తన్నక మానదు,
నీ తల పగలక తప్పదు.

కటుకోఝ్వల రమేష్//కవి కాలం//


రైతన్నకు నిత్యం
తీరని వేధన!
కరుణించని ప్రభువుకు
ఏందుకు నివేదన!!

భ్రష్టు పట్టిన పాలనలో
బతుకేంతో బరువు!
నలుగుతున్న జనంలో
సమస్యల దరువు!!

9-9-12

సాయి పద్మ || చెలిమి... ||


నాలో అహంకారం నశించేందుకు నమ్మకమైన నేస్తం..
నువ్వు..
మొత్తం నువ్వే నిండాక ఖాళీతనానికి ఖాళీ ఎక్కడిదని..
అందమైన అమ్మాయికి తను అందమైనదని తెలిస్తే..
అందంగా ఉండదు..
నాలో నిండుగా నువ్వే ఉన్నావని నువ్వు మురిస్తే
నాకీ గర్వం నిలవదు..
భలే విచిత్రం కదూ..
నువ్వు...నేను..
అస్తిత్వ శిఖరాలపై నువ్వు...
అక్షరాల నిచ్చేనలేసుకుంటూ...నేను

ఉదయాలూ.. సాయంత్రాలూ..
లేక్కపెట్టని రాత్రులూ..
అన్నీ తెలిసేసుకున్నాక...అంతా మాటాడేసుకున్నాక
నా పదాల్లో నువ్వు..
నీ నిశ్శబ్దంలో నేను..

ఎన్ని అకాల వత్సరాలు గడిపానో.... ఎదురు చూపుల్లోనే..
అకారణంగా మారాం చేస్తూ..
బురదలో పొర్లాడే పిల్లాడిలా..
నీ జాడ తెలిసాక.. జన సమ్మర్దంలో..
ఒక మనిషి నీడనైతే చాలదూ..
అనే ధీమా, నమ్మకం..

జీవితం ఎప్పుడూ బాగానే ఉంది..
నువ్వు అర్ధమయ్యాక హరివిల్లైంది.. అంతే..

అదేమంత గొప్ప విషయం కాదులే..
అని.. నువ్వన్నా..
నీ గుండె చప్పుళ్ళ రిథం
వేదంలా వినే నాకు..
ఆ పోకడలూ..నడకలూ తెలియకనా..

రాసేటంత గొప్ప విషయాలేం లేవు మన మధ్య..
నా అక్షరాలూ నచ్చలేదంటూ అలుగుతావు కూడా..
కానీ.. నేను రాసేనని.. నువ్వు చూసే చూపు నచ్చ్సుతుంది నాకు..
మరింక ఎవరి లెక్క నాకేం..?
నీ చూపే నా రాతలకి దిష్టి చుక్క..
అదీ అందమే.. ఎందుకంటె..ఆనందంలాంటి అవసరం కనుక..
--సాయి పద్మ

కాశి రాజు ||ఎంతదైర్యం తనకి||

ఎంత దైర్యం
ఒంటరిగా
ఒక్కతే
ఈ ఒంటిగాడి ముందు
వొయ్యారంగా నడుస్తాదా?
అసలే పడుచువయసు
ఆపై గడుచుగాలి సోకినట్టుంది
గుచ్చి గుచ్చి చూస్తుండమని
గుర్తుచేస్తునట్టు
గబుక్కున తిరిగిచూస్తాదెనక్కి !

నాలుగడుగులు ముందుకేసి
నేనూ కలుద్దామనుకుంటానా!
ఇంతలో నీడై నా వెనకాలకొచ్చేస్తుంది
నాతో ఆడుకుంటుంది

చూడ్డంతోనే సరిపోదు
రాసుకుని ,పూసుకుని
రాజువై తిరగమంటుంది

దైర్యం చేసి అడుగుతాను తనని
నువ్వంటే నాకిష్టం
నీవైపోదామనుందంటాను

నా సమస్యే తన సమాదానం
అన్నట్టు చెప్పి
కవిత్వాన్ని కట్టుకున్న నా కల
తన దేహం పై
దండయాత్రకు దిగమంటుంది నన్ను
కలిపేసుకోడానికీ,
నాలో కలిసిపోడానికి
తనకెంత దైర్యమో !

హైమా // ఓ వసంతమా! ఇటు రాకమ్మా! //


నా నిట్టుర్పే నను దహించివేస్తుంటే..........,
నా అశాంతే నను కబళించి మింగేస్తుంటే....

ఓ వసంతమా.........!
ఇటు రాకమ్మా! నను కాపాడే ప్రయత్నం చేయకుమా.!
నను అక్కున చేర్చుకునేందుకు సాహసించకుమా.....!

నా బాధలు బడబాగ్నులై నిను మండించి
నా గుండె మంటలను నీ గుప్పెట వుంచి,

గ్రీష్మంగా నిను మార్చేస్తే...........
కన్నీటిలో నీవు కూడా నాకు తోడవుతావు........!
కష్టాల ఊబిలో నాతో పాటు సమాధవుతావు......!

వద్దు....! అలా చేయొద్దు....!

కోకిలల రాగమాలికలను ఆస్వాదించలేవని
చెట్ల చిగుర్ల పచ్చదనంతో సంబంధం లేదని

పున్నాగ, పారిజాత,మాధవి లతల పరిమళాలు వలదని
తుమ్మెదల ఝుంకారాలు నిన్ను స్పందింపజేయలేవని

ఇలా నీవు కూడా నిరాసక్తతతో స్తంభించి పోతే
నా కోసం నిన్ను నీవు మాయం చేసుకుంటే

సృష్టి మనుగడ ప్రశ్నార్ధకమౌతుంది!
ఆ పాపమంతా తిరిగి నాదే అవుతుంది!

మెర్సి మార్గరెట్ ll మాదే కులం ? ll


1.
నాతో వస్తావా ?
ఒకసారి ఏదేను తోటకెల్దాం
మంచి చెడ్డల తెలివినిచ్చే
వృక్షాన్ని ప్రరీశీలించి
దాని మూలాల్లో
కులం ఉందో లేదో
చూద్దాం !

2.
ఒక్క మాటలో
భూమ్యాకాశాన్ని
సృజించిన నాడే
ఏ మట్టితో
మానవుని చేశాడో దేవుడు
ఆ నేలదే కులమో
పరిశీలించి వద్దాం

3.
ఆయన శ్వాసనే
మనలో
ఊదిన నాడు
ఆయన
ఊపిరిదేకులం ?

4.
ఆ చేతులు
మన్నును
ముట్టుకున్న నాడు
మన్ను అంటుకున్న వాని
చేతుల్లో
మనిషైన వాడిదే కులం ?

5.
నేను అనే మాట
దేవుని నుండి మనిషి వరకు
దారులేసుకొని
జారిపోయి వచ్చినపుడు
అస్తిత్వపు ఆస్థిగా
మనం అనే మాట నుండి
వేరు పడి
"నేను "-"నాది "అనే
వేర్పాటు
మాటదే కులం ?

6.
సిలువనెక్కి అభిషిక్తుడు
చిందించిన రక్తంలో
పాపమంటుకున్న దేహాలను
పరిశుద్ద పరిచే నెత్తురులో
పరిశీలించి చూడు
ఆ రక్తానిదే కులం ?

7.
ఆ రక్త ధారలో కడుగబడి
క్రైస్తవుడని
పిలిపించుకుంటూ
అవసరార్ధం
నీకెందుకు
గుర్తొస్తుందీ కులం ?

8.
నా హృదయం
అడిగిప్రశ్నల్ల్లో
నాలో జరిగిన మధనంలోంచి
తెలిసిందిదే
నాదే కులమో ?మాదే కులమో ?

9.
ఆయన శ్వాస నాలో ఉన్నందుకు
మాది " దైవ కులం "
ప్రేమ చూపి ప్రాణం పెట్టినందుకు
క్రీస్తు మాదిరి "ప్రేమ కులం "
నిజమైన నిబంధనలో
యేసు మార్గంలో
తనతో పాటు నడుస్తున్న
వారందరిది
"ప్రేమ కులం "- "సేవ కులం "

10.
అందుకే
దళితులని దూరం చేసినప్పుడు
వెలుగు వెత్తుక్కొని
సిలువనాశ్రయించాం
దాడులు చేస్తున్నా మౌనంగానే
క్రీస్తు ప్రేమ చాటుతున్నాం
BY-Mercy Margaret ( 9/9/2012)
( క్రై స్త వులను ,క్రై స్తవేతరులను ఉద్దేశించి రాసుకున్నదే ) —

క్రాంతి శ్రీనివాసరావు || నెలాఖరి రోజు ||


అపశకునాని వంటూ
అనంతకోటి
ధనుస్టంకారావాలు
అంతరంగాన్ని
అదేపనిగా
తరుముతున్నప్పుడు

జన తుఫానులో
వొంటరి చెట్టులా
తెగిన గట్టులా
కరిగిన పుట్టలా
విరిగిన నిచ్చెన మెట్టులా
విషాదం చుట్టుకొని
తన సగానికి అమ్మ
తనకు అత్తయు
మాటల కత్తులు
కోళ్ళ పైనో కుక్కల పైనో
విసిరేస్తూ
నొసలు చిట్లిస్తూ
అసలు వాడి తనాన్ని
తనపైకి సందిస్తున్నప్పుడు

చేయని తప్పుకు
అలుగుపడ్డ
అశృనయనాలతో
ఆశల శవాలను మోస్తూ
అర్హత అంతస్తుకు
దారులు వెతుకుతూ
అమ్మాయు
అమ్మవ్వాలని
నె
లా

రి
రోజు
కోసం
వేల ముడుపులతో
వేచివున్నప్పుడు

కడుపులో వున్న
అగ్నిపర్వతం బద్దలై
ఎర్రని లావా వెదజల్లినప్పుడు
శూన్యం విశ్వరూపాన్ని ప్రదర్శించి
భయంకర నిశ్సబ్ద యుద్దం ప్రకటించి
చీకటి శరాలు శరీరం నిండా నాటినా

వేల టన్నుల వత్తిడి మోస్తూ
మళ్ళీ నెలాఖరి రోజుకోసం
నిరీక్షిస్తూనే వుంటుంది ఆమె

తప్పు ఆమెది కాదని తెలిసినా
ఫస్టు తారీఖు ఫోజుతో
మీసాలు మెలేస్తూనే వుంటాడు వాడు

కర్లపాలెం హనుమంత రావు॥రీఫిల్ ప్యాక్ గామారాలి!॥


జీడీపీని రెండకెల్లోకి పీక్కురావడమే నాముందున్న లక్ష్యమంటాడు పిఎమ్
జీడి పిక్కలక్కూడా రెక్కలు మొలిచి ఎంత కాలమయిందో తెలుసా సర్కార్!
బంగారంధర ఇదిగిదిగొ దిగిరాబోతోంది
కొంగుపట్టుకుని రడీగా ఉండండుండండంటాడు ఢమఢమల ఎఫ్ఫెమ్ సారు
బంగళా దుంపలు సైతం…దాం దుంపతెగా
అంగారానికెగిరి సతాయిస్తున్నాయ్ తెలుసా దొరవారూ!
గ్యాస్ బండ మోసుకొచ్చే కుర్రాడి నసుగులొకూడా
రిలయన్స్ వాడి బుసే వినిపిస్తోంది..పాడు
పెట్రో కన్నా మెట్రో ముఖ్యమంట్రా సర్కారోడా నీకిప్పుడు!
మార్కెట్లో మన్నుతప్ప ప్రతి స్టాకూ నిల్లు
స్టాక్ మార్కెట్ క్రాషవుతుందని దిగులా నీకు!
నీ చట్టసభలు చట్టుబండలు కానూ
చట్టాలు చెయ్యడానికెప్పుడో సున్నా చుట్టేసావ్ గా!
చుట్టపు చానెళ్ళ కళ్ళకూ
డోళ్ళను, ఆడోళ్ళ వళ్ళనూ తప్ప
బక్కోళ్ళ కడగళ్ళను తడమడం దండగిప్పుడు
కామన్ మ్యాన్... కనబడుట లేదు
ఏ ఊర్లో వెతికినా మనిషి చడీచప్పుడు లేదు
ఏ మాయదారి మ్యాన్ హోల్లో కాల్జారి పడ్డాడో పాపం
దేవుడా! ఒకసారి సెల్ ఓపెన్ చేసి చూడు
కనిపించేవన్నీఖాళీ మనిషి మిస్ డ్ కాల్సే!
ప్రభువులు ఫెయిలయిన చోట దేవుడే దిక్కంటారు
దేవుడూ సెల్లు ఆఫ్ లో పెట్టుంటే ఏం చేయాలీ!
ఖాళీని మళ్ళీ ఒకసారి మనిషి తనతనంతో రీఫిల్ చేయాలి
యూజ్ అండ్ త్రో యూజ్లెస్ ఫెల్లోస్ ని పర్మినెంట్ గా సీల్ చేసెయ్యాలి!
09-09-2012

కెక్యూబ్ వర్మ ॥దేహపు విల్లు॥


తప్పొప్పుల తడిక చాటున దాగి
లోలోపల అగ్ని పర్వతాన్ని
ఉఫ్ మంటూ ఊదేసే వృధా ప్రయత్నమెందుకు....

మనసు నిండా నిండిన భావాన్ని
వ్యక్త పరచడానికి సాకులు వెతుక్కోక
మూసిన కున్రెప్పలను తెరచి చూడు
కనుల నిండా ఇంద్ర ధనస్సులే....

కలల్లో కలవరిస్తూ పలవరిస్తూ
మనసు ఐ మూలల దాగిన
కోరికల బుసలను తలపై మోదుతూ
చంపేయడమెందుకు??

రానీయనీ లోలోపలకి
ఎంత ఆస్వాదించ గలిగితే
అంత జీవితాన్ని ఆమూలాగ్రం
పిడికిట పట్టి గుండెల్లో పొదువుకోవాలి.....

నీ చూపు మేరా పరచుకున్న పచ్చదనాన్ని
వెచ్చని సూర్య కిరణాల ప్రతిఫలనంలో
మెరుస్తున్న ఆ లేలేత అందాలను
కంటి వెనకాల వెండి తెరపై బంధించి చూడు....

దేహాన్ని విల్లులా సారించి
నీ కోరికల బాణాన్ని సంధించు
అణువణువు ఆస్వాదించు
నేడున్న క్షణం మరుక్షణం మాయమవుతున్న
కాలబలం నిన్ను వెంటాడక ముందే....

కుళ్ళి కృశించి నశించే కంటే
అగ్నిశిఖలా కాలుతూ మెరుస్తూ
ఆకాశమంతా ప్రకాశిస్తూ
క్షణకాలమైనా బతికి చూడు....

గుండె నిండా ఊపిరి తీసుకొని
అడుగు వేయి
చీత్కరించిన లోకమే
నీకు దాసోహమవుతుంది....
(09-09-2012)

కాశి రాజు ||సరోగశీ||

ఏమేవ్!
ఇది ఇన్నావేటి?
ఇదేదో ఇన్విట్రో పెర్టిలైజేసనట 
ఇక్కడ ఏం చేత్తారంటే 
నిన్నూ, నన్నూ కలిపేసి ,మనల్ని చేసి 
గాజుబుడ్డిలో బందించి 
పేణాలు బయటేపోసి 
పిండాన్ని లోపలేడతారట తెలుసా
అదే అబివృద్దని అంటున్నారీళ్ళంతా !

ఇక్కడ ఇంకో ఇచ్చిత్రముండాది 
అమ్మవలేని అమ్మలకు అండగానిలిచే 
అద్దెతళ్ళులున్నారటిక్కడ
ఈళ్ళంతా అమ్మతనాన్ని అద్దెకు ఇస్తారట 

వీళ్ళని సరోగేట్ తల్లులంటారట
వీళ్ళమాతృత్వానికి కూడా సక్కని పేరెట్టారు “సరోగశీ” అని
ఈ అద్దె అమ్మలంతా అవసరాలనుండి పుట్టుకొచ్చారు తెలుసా 
తమ పిల్లల్ని పెంచడానికి 
మరెవరి పిండాన్నో నవమాసాలూ మోసీ ,కనిపెడతారట వీళ్ళు 

ఎంత అద్దె అమ్మలైతే మాత్రం 
అమ్మతనం వూరుకుంటుందా సెప్పు 
ఆడదాన్ని,అమ్మతనాన్ని నిలదీస్తుందట 
పుట్టినబిడ్డ నాదేనని ప్రేమకురిపించేలోపు 
పేగుబందాన్ని తెంచి 
పిల్లల్ని పార్సిల్ చేసేస్తారట 

అందించింది అందుకుని 
అవసరం ముందు మోకరిల్లి 
అద్దె అమ్మలోని ఆడతనం ఆత్మహత్య చేసుకుంటుందట 
ఈ విదీ 
విదానం 
ఏదైనా కానియ్యి 
అమ్మలెవరైనా అమ్మలేనని అర్దమవుతుంది నాకు

కపిల రాం కుమార్ // పిచ్చి తల్లి //


హోదాల్కు తగ్గట్టు పేదరాలు లేదని
ఇల్లాలి మోజులో తల్లినే మరిచావా!
ఎండిన రొమ్ముతో ఎముకలగూడని
పనికిరాని వస్తువులా కాల్దన్న చూస్తావా!

మంచులాంటి చల్లదనం మల్లెదనం
పొత్తిళ్ళవెచ్చదనం మరచుట మరిపాపం
బడినూండి వచ్చునపుడు బడలిక చెందావని
ఒక్కపూట పస్తులతో నీ పడుపు నింపినాది.

తోటివారి దెప్పులకు బిక్కమొగమేసినపుడు
చొక్కలాగు కొనటానికి రొక్కమేమి లేకపోతే
మారాము చేసి నీవు మట్టికుండ పగులకొట్ట
మారుమాటచెప్పకుండ సూత్రాల్ను ఆమ్మినాది!

చిన్నపుడే నాన్నలేడని నీకేమి లోటు తేక
గుట్టుగాపెంచినట్టి గురువులాంటి తల్లిరా!
నీ చదువు ఈ తిండి యీ ఇల్లు నీ హోదా
రక్తాన్ని ఖర్చుపెట్టినీ మీదే ఆశపడే!

కొడుకు మీద ప్రేమతో చీరి రోజు కోసము
నిప్పుపెట్టు చేతులకై అర్థించగ వచ్చినాది!
నీ ముంగిట వాలిందని చులకనగా చూడబోకు
ముగ్గుబుట్ట నేడో రేపో రాలిపోవు రామ చిలుక!

మొదటి ముద్ద గోటితో పేరుపేరునందించి
మాట నేర్పిన మహిళకు మంచినీరు పోయవేమి?
మనిషివైతే కదిలారా! మనసు తలుపు తెరువ రారా!
నీ ధర్మం నెరవేర్చగ ఆదరమూ చూప రావా??

10-9-2012

బాటసారి // నీ కనుల అందాన్ని//


లలితమైన నీ రూపాన్ని చూసి
తొలిసారి నే వ్రాసానో కవితని

కవితంటే రాసాను కాని
నీ కనుల అందాన్ని వర్ణించడం కాలేదు నావల్ల

భావానికి పదాలు దొరకవు
పదాలకి అక్షరాలు చిక్కవు , పోల్చడమేలా ?

అవి కలువ రేకులా
పారిజాత సుమదళాలా !

ఇసుక తిన్నెలపై పడ్డ
పున్నమి వెన్నల దారులా !

మంచు పుష్పాన్ని తాకిన
రవికిరణం లోని ధవళ కాంతులా !

కావు కానేరవు...!

పాలపుంతలన్ని పోగు చేసి
ఆ విధాతే నీ నయనాలుగా చేసేనేమో !

విశ్వం లోని రంగులన్నీ ఏకంచేసి
ఆ రవివర్మ కుంచెకు జతచేర్చి గీసెనేమో !

పున్నమి వెన్నెలలో
ఇంద్రధనుస్సు వస్తే నీ కనుల అందానికి సరితూగునేమో ! 09-09-2012