పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, ఆగస్టు 2012, శనివారం

శ్రీ ||అందరం రోగులమే ||

అందరం రోగులమే
కొందరు మనోవైకల్యంతో మరి కొందరు అంగవైకల్యంతో,
వచ్చిన దాంతో సంతౄప్తి పడక కొందరు,ఏది రాక మరి కొందరు,
తినడానికి తిండి లేక మరి కొందరు, తిన్న తిండి అరక్క మరి కొందరు,
దోచుకుంటూ కొందరు , కడుపు కట్టుకుని మరీ దాచుకునేది కొందరు,
గొప్పల కోసం అప్పులు చేసి తిప్పలు కొని తెచ్చుకునేది కొందరు,
దేశాన్నే కొనేసేంతున్నా చిల్లిగవ్వ కూడ లేదు అనేది మరి కొందరు,
ప్రేమను యేసిడ్లు కత్తులతో చంపేసేది కొందరు, ప్రేమే సర్వస్వం అనుకుని ఆత్మాహుతి చేసుకునేది కొందరు,
పుట్టుకతోనే అనాదలై కొందరు, చుట్టూ ఎందరున్నా ఆత్మీయతను పంచివ్వలేక కొందరు,
ద్వేషంతోనే దాహాన్ని తీర్చుకునేది కొందరు, అనురాగంతోనే ఆకలి తీర్చుకునేది కొందరు,
జీవచ్చవంలా బ్రతికేస్తూ కొందరు, వేరొకడి జీవితాన్ని రూపు మాపి తన జీవితాన్ని అందంగా అలంకరించుకునే వారు మరి కొందరు,
సోమరిపోతులు కొందరు , పని పని పని అంటూ పావు వంతు సంతోషం కూడ లేకుండా గొడ్డుల్లా కష్టపడే వాళ్ళు కొందరు,
పగటి కలలను కంటూ రాత్రికి రాత్రే ఏలేద్దం యేదైనా అనుకునేది కొందరు,
బుర్రలో పాదరసం వంటి తెలివుండి కూడ అవకాశాన్ని అందిపుచ్చుకోలేక మరి కొందరు,
అందరూ రోగులమే కొందరు మనోవైకల్యంతో మరి కొందరు అంగ వైకల్యంతో....


*24-08-2012

పెరుగు సుజన రామం // కార్పోరేట్ కొమ్మల పై ..//.

బహుళ జాతి కార్పోరేట్ కొమ్మలపై
వాలాక వారికి తల్లి తండ్రులు పెట్టిన పేర్లు వలస పోయి
ఐ.బి ఏం,టి.సి.ఎస్,విప్రో,సి.టీ.ఎస్,ఇంటెల్ ,
ఇలా యాక్స్సేస్ కార్డులుగా మిగిలారు..

తరాల నటి ఇంటిపెర్లన్నీ
ఈ మెయిల్లో కుదురుకున్నాక
మనిషేమో పేస్ బుక్ వంశ వృక్షపు
సభ్యు లైనందుకే సంబర పడి పోతున్నారు ..

సమూహంలో ఒంటరిగా
కనిపించని స్నేహాలతో కరచాలనాలుగా
మనిషి తనపు ఆనవాల్లన్నీకోల్పోయి
ఆ నలుగురినీ కనీసం మిగుల్చు కోలేకున్నారు ..

మృగ త్రుష్ణల వెంట పరిగెడుతూ
బతుకు దాహం తీర్చు కోవాలని ఆశ పడ్తూ
ప్లాస్టిక్ కార్డుల సంపద మెట్లెక్కి
శిఖరం చేరాలను కుంటున్నా రు ....

నేల విడిచి చేసిన సాము
మూలాలు మరిచి ఎదిగిన జీవితం
విజయాలుగా నమోదయిన
చరిత్ర లేదని తెలియని అమాయకులు ..!!

*23-08-2012

‎Mercy Margaret ll జనాభా లెక్కలో ఒక దాన్నిll

నేను పుట్టినప్పుడు
తలితండ్రుల మొహాల్లొ
సంతోషం గురించి
వాళ్ళు చెప్పేప్పుడు వింటుంటే
నా కళ్ళలో ఏవో దీపాలు వెలిగిపొతాయి

సంవత్సరం సంవత్సరం
మారి పోతున్న
నా గురించి నేను ఆలోచిస్తుంటే
ఇసుక లొతుళ్ళోకి కాలు దిగబడి
మళ్ళీ పైకి తీసినట్టు
ప్రాణం ఎవో ఒత్తిళ్ళకి లోనై
వెంటనే
కొద్ది సేపు శ్వాస తీసుకున్నట్టు
అనిపిస్తుంది

జీవితాన్ని సముద్రం చేసుకొని
తీరంలో పసిపాపలా
ఒళ్ళో ఇసుక నింపుకుని పిచ్చుక గూళ్ళు కడుతూ
ఒక్కో గూడుతో ఒక్కో సంబంధం పెంచుకొని
ఏ విధి కాళ్ళకిందో
ఎపుడో అపుడు అవి కూలిపోతుంటే
పసిపాపాలా నా ఏడుపు సముద్రపు ఘోషలో
కలిపి

నిశబ్దపు స్నేహం నించి చీకటిని చీల్చి
వెలుతురు ధారలతో లోలోతుల మనసు నేలని తాకి
నాకు నేను ఒక సాహసం
నాకు నేను ఒక పోరాటం
నాకు నేను నిరంతర పునరావృత ఉషోదయమై
కనిపిస్తుంటా

వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు అమ్మ కొంగు ఓదార్పు
నాన్న భుజాలపై ఎక్కి
అటక పై పడ్డ బంతి దొరికే వరకు
వదలక సాదించుకున్న మంకు ఏడుపు
అబద్దం ఆడినప్పుడల్లా భయపడి
చర్చి కిటికిలోంచి
గుస గుసగా సారీ దేవా అని చెప్పిన సమయాలు
కేకు కోసేవరకు అన్నం తినక
పుట్టిన రోజు పండుగకై
నెల ముందు నుంచే ఎదురు చూపులు
అమ్మ అని రాయడం మొదలు
చదువయిపోయేంత వరకు
నమ్మడం నేర్పిన స్నేహాలు
నమ్మి మోసపోవడం నేర్పిన నేస్తాలు

ఒక్కొక్కటిగా ఏవేవో విత్తనాలు
ఎక్కడెక్కడి నదులో
పచ్చదనం చూసొచ్చే పక్షుల్ని
నేను అనే అరణ్యం లోకి
అనుమతిస్తూ
గాయపడి పాఠం నేర్చుకుంటూ
భంగపడి ప్రతిఘటించి ధైర్యాన్ని
చెంతనే ఆయుధంగా పెట్టుకుంటూ

ఇప్పటి వరకు ఇలా వ్యాపించా
నా స్థలం ఎంత మేరని
నిర్దేశించాడో దైవం
అంత వరకు నేనే నాకు
నా భావాలతో నా ఊహలతో
రమిస్తూ
పచ్చదనం తగ్గనివ్వక
నన్ను నేను
నాకోసం నా లో నాకైన వాళ్ళ కోసం
అడుగులలో అడుగు వెసుకుంటూ
పుప్పొడి వాసన రాసుకొని
సీతకోక చిలుకల గుంపులతో
పరవళ్ళు తొక్కే నదుల పలకరింపుల ముచ్చట్లతో
సాగిపొతున్నా
నాకు నేనే
*23-08-2012

కరణం లుగేంద్ర పిళ్ళై //కఠిన శిల//

నీ మౌనానికి
భాష లేదోమో కాని
భావం పలకడం లో
దానికి సాటి లేదు
కాని అర్థమయ్యి కానట్టు
ఒకటే తిక మక నాకు

నీ అలకను కొలిచే
పరికరం లేదేమో
గుండెను ధ్వంసం చేసే
తీవ్రతకు సాటి ఏముంది..
నీవు దూరమవుతుంటే
రేగే అలజడి చాలదా..

నీడలా వెంటాడే
నీ జ్ఞాపకాలు చాలవా
స్వప్న జగతి నుండి
మేల్కోలిపి
తడి ఆరనీ కన్నీటి
చారికలు తుడవడానికి

ఒక్కమాటయినా బదులివ్వని
నిన్ను ప్రశ్నలా వెంటాడి ఓడిపోయాను..
ఒక్క నవ్వయినా బహుమతివ్వని
నీ వెంటపడి అలసి పోయాను..

*23-08-2012

జయశ్రీ నాయుడు ||నా అనంతం||

మొదలెప్పుడు.. అక్కడే ఆగిపోతుంది..
సాగుతున్న కాలం కొత్త రంగులు ఇస్తుంది

అక్కడిలా ఇక్కడుండదు
ఇక్కడున్నది అప్పుడు అక్కడ లేదు..

యేది నిజం
యేది మర్మం

గుండె సడిలో తెలియని గాయం
యే ద్రవంలో కరిగించను
నన్ను నేను తేలిక పరచను

నువ్వు చూపిన నక్షత్రాల్లోనే చూపులు చిక్కుకుపోయాయి
మరో గెలాక్సీకి వలస వెళ్ళిపోయావు
ఈ కాంతి వలయాల్లో ఈదుతున్నా

చిక్కని కాలానికి గేలం వేస్తూ
నా అనంతం సృష్టిస్తున్నా

*23-08-2012