పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, జులై 2012, సోమవారం

రఘు మందాటి కవిత

మాటలను మూటగట్టుకొని నా కలం నిదోరుతున్నది.
మేలుకొలిపే దృశ్యమాలిక చీకటిని దిద్దుకున్నది.
విసురుమన్న చల్లని గాలి కిక్కురుమనక దుప్పటి కప్పుకున్నది.
మౌనం మనసుకా ? లేక నా ఊహకా ? ఏమో....
ఎదురుకున్న ఎన్నో అనుభవాలు నా వెంటే నడిచోస్తున్న
తీపి మాయల గిలిగింతలో పులకిస్తున్న.
అక్షరంలో బంధించలేని ఓ నిర్బాగ్యున్ని..
కాలం చెరసాలలో నా కలం బందీ ఆయినదా లేక బందీని చేసాన?
అక్షరం నాకు దొరక్కో లేక నేనే అక్షరానికి సరి తూగకనో
కలానికి నా మాట వినపదట్లేదో లేక నాలోని మాటే మూగాబోయినదో ఏమో..
మొత్తానికి నను నా లోకంలో ఒంటరిని చేసింది..
ఇంకా ఎంతకాలమో ఈ నిశ్శబ్ద యాతన.........

*29-07-2012

అవ్వారి నాగరాజు || విదళనం ||

చేతనలనన్నింటినీ
సుషుప్తిలోనికి జార్చి
రాసుకున్న ఒక్కో మాటనీ నిశ్శబ్ధంగా పలక చెరిపేసి
తన లోపల తనే ఎక్కడో మణిగి
ఉండీ ఉండీ విస్పోటనమయి

ఎవడి లోకం వాడిదయిన కాలాలకు కావిలికానిగా
ఒక్కడే తల వాకిటికావల
మట్టి కొట్టుకొని శిరస్సుపై ఖగోళ ధూళితో
విశ్వాంతర్గత రహస్య సంభాషణలకెక్కడో చెవినొగ్గి

తనే ఒక దారిగా విస్తరించి నడుచుక పోయే
మనుజుడొకడున్నాడు నాయనా
మనుజుడొకడున్నాడు

తలుపు తీయ్ కాసింత
అటునూ ఇటూనూ వేరు చేస్తూ పలుచని పొర ఎక్కడుందో వెతకాలి
పగిలిన ఒక్కో ముక్కా కలిపి ఎప్పటికైనా వీలవుతుందేమో అతకాలి

తలుపు తీయ్ నాయనా తలుపు తీయ్

*29-07-2012

అవ్వారి నాగరాజు || ఒకరోజు ||


పాపా నిన్ను చూసాను

నల్లని నీ కన్నుల ఆవరణంలో ప్రసరించే తడి వెలుగులో నిన్ను చూసాను

తేరిపారగ చూసే ఒక పువ్వు
తన లేలేత వేళ్ళతో ముట్టుకొన్నప్పుడు సుతారపు రేకులు రేకులుగా
విప్పారుతూ నిన్ను చూసాను

నీ స్పర్శల పులకింతలో మొలకలెత్తి మన్ను దోసిలి పొరల దాటుతూ నిన్ను చూసాను

వొడలని తేజమేదో నీ చుట్టూ పరిభ్రమిస్తుండగా
మనుషులు చేసే ప్రయాణాలలో తరుచూ ఎందుకంతగా చెరిగిపోతారో తెలియని
సంభ్రమంతో నిన్ను చూసాను

నీ తేజపు సౌందర్య దీప్తిలో
ఒక భాష్పపు దీపమై వెలుగుతూ చెంపల జారి నిన్ను చూసాను

పాపా నిన్ను చూసాను.

*29-07-2012

రామాచారి బంగారు || కవి(త)త్వం ||

ఏ కాలంలోనైన
కవి మదిగదిలోని
జనహిత లోచనాల
యోచన కవిత్వం
యేటిఒడ్డున ఇసుక
వూటలోని నీటిలాగా
ఎప్పటికప్పుడు
తోడబడుతుండాలి.

*29-07-2012

ధనలక్ష్మి బూర్లగడ్డ కవిత

నేను నాకే ఒక్కోసారి కొత్తగా ఉంటా
నేను నాకే ఒక్కోసారి వింతగా ఉంటా
నేను నాకు ఒక్కోసారి చెలాకిగా ఉంటా
నేను నాకే ఒక్కోసారి కష్టంగా ఉంటా
ఏదేమైనా నాలో నేనే అన్నీ దాచుకుంటా మౌనంగా
నా ప్రపంచమే వేరే
నాకు నేనే ప్రత్యేకం
నాకు నేనే అన్నీ ఆ ఒక్క క్షణంలో
నేను ఒక్క దాన్నే ఉండటమే నాకు ఇష్టం
నిరాశ నన్ను అల్లుతుంది ఒక్కో నిమిషం
కన్నీటి బొట్టే నాకు నేస్తం
మాట రాక మనసు కలవర పడితే
అప్పుడే కాగితం తోడయ్యి కాదన్నా
కవితలా మారి కలం నుండి కాగితంపైకి వచ్చేస్తుంది
నా కవితను చదవడమే నా మనసుకి ఒక ఓదార్పు
ఆ ఓదార్పుతోనే నిదుర ఆదరించి నన్ను హక్కునచేర్చుకుంది
కొత్త ఆశల వెల్లువను కలలుగా అందిస్తూ
మౌనాన్ని మెల్లగా పక్కకు నెట్టేస్తూ
మరో కొత్త ఉదయాన్ని ముద్దుగా ముందుకు తెస్తూ.
*29-07-2012

సురేష్ వంగురి కవిత

ఒక్కసారిగా గతం బతికినట్టుగా ఉంది
జ్ఞాపకాల శకలాలను అతికినట్టుగా ఉంది

ఆమె ఎదుట పడగానే ఎందుకింత అదురు నాలో
మానుతున్న గాయాన్ని రేపినట్టుగా ఉంది

ఇన్నాళ్లకు ఎదురైనా పలకరించదేమిటో
గొంతులోన శోకమొకటి కురిసినట్టుగా ఉంది

చూసి కూడా చూడనట్టు ఆమె దాటిపోతుంటే
కళ్ళలోన సంద్రమొకటి కదిలినట్టుగా ఉంది

ఈ అవస్థను ఏమనాలో చెబుతావా వంగూరీ
సరదాగా బ్రతికించి ఛంపినట్టుగా ఉంది.
*29-07-2012

కె. కె. || రాశి ||

మెరుపు మెరిసినంత మాత్రాన
వానచినుకు రాలదు
నిబ్బరంగా నిలబడ్డ
మేఘగర్బం మెలితిరిగితే తప్ప,

తలగోక్కున్నంత మాత్రాన
ఆలోచన తట్టదు
సమయస్పూర్తి, సంపూర్ణ ఆర్తితో
మేధకు పదునుపెడితే తప్ప,

నాట్లు వేసినంత మాత్రాన
పైరు ఏపుగా పెరగదు
కలుపు తీస్తూ, ఎరువులేస్తూ
పుడమితల్లిని లాలిస్తే తప్ప,

మీట నొక్కినంత మాత్రాన
వాహనం నడవదు
నిదానంగా, నిలకడగా
నియంత్రణతో నడిపితే తప్ప,

కలం పట్టినంత మాత్రాన
మంచికవిత జనియించదు
ఆవులిస్తున్న కలం ఒళ్ళువిదిల్చి
మనసుతో లోకాన్ని చూస్తే తప్ప,

రాసినదంతా రాశిగా పొయ్యి,
జల్లెడ కుదుపుకి ఆగినదిమాత్రమే జనానికి ఇయ్యి.

*29-07-2012

ఇస్మాయిల్ సుహైల్ పెనుకొండ || E=mc^2 ||


నీ కోసం

యుగాల్నే క్షణాలుగా మార్చి...
కాలాన్నే ఏమార్చి...
అనంతాల్ని చూసి...
దిగంతాల్ని దాటి...
కాంతి వేగంతో నే వస్తే...

నా ఆయాసాన్ని ఆక్రోశంగా మారుస్తూ
అప్పుడు తెలిసింది...
సమస్త విశ్వం తల్లకిందులయ్యే నిజం
కాలం స్తంభించిపోయిన ఆ క్షణం...
నీవు చెప్పిన ఒకే ఒక అబద్ధం.

ప్రకాష్ మల్లవోలు కవిత

సమాజపు కుళ్ళును ,
అసమానతలను అరికట్టేందుకు

అజ్ఞాన అంధకారానికి
అలవాటుపడ్డ కళ్ళకు జ్ఞానాన్నిచ్చేది
నేనున్నా అంటూ మెదిలేది

మేధలోంచి కలం ద్వారా పురుడోసుకుని
భావాలకు అక్షర రూపమిస్తూ

కళ్ళు తెరుచుకుని నిద్ర పోతున్న మెదళ్ళకు
విద్యుద్ఘాతం లా తాకి ,

బద్దకంలో వేళ్ళూనుకున్న మొదళ్ళను
కూకటి వేళ్ళతో పెకలిస్తూ,

ముందుకు నడిపించేది కవిత్వం
కదిలించేది కవిత్వం.

మేల్కొలిపేది , ఆలోచింపచేసేది కవిత్వం .

విజ్ఞతతో , విచక్షణతో
అలరారుతూ, భావంతో ప్రాభవాన్ని గడిస్తూ,
వైభవంగా వెలిగేది
కలకాలం మనసులో నిలిచేది కవిత్వం ....

ప్రాస ఉంటే చాలదు
పస ఉంటేనే అది కవిత్వం.

ప్రాసతో నిండి పస లేకు౦టే
అది కవిత్వమనిపిచ్చుకోదు

భావనలతో నిండి ఉంటే
చాలు అది భావుకత్వం...

(కాదిది ఎవరి నిర్వచనం
నా మనసులో మెదిలిన వచనం
తప్పైతే సరిదిద్దండి )
*29-07-2012

వంశీదర్ రెడ్డి || ‎‎* జీతగాడు *.||

"రేయ్, ఆనందం, యాడున్నవ్ రా,
గోదలకొట్టంల కుడిదిగోళం మీద
గిలాస తెచ్చుకో,
శాయ బొట్టు తాగి, బిరాన
చేన్ల కొర్రుకాడికి వోవాలె,
పటేల్కు జెప్పు, పొద్మీకి
పొలంల తాటికల్లు దింపియ్యమని,
మన్మడొస్తుండు పట్నంకెల్లి"

"చిన్న పటేలత్తాండా దొర్సానీ,
ముంజెలు, ఈతపండ్లు గుడ్క తెత్తునా",
తాగిన శా గిలాస కడిగి
అంగీకి తుడుసుకుంట ఆనందం,

* * * * * * * * * * * * * * * * * * * * *

"ఆనందం మంచిగున్నవ,
కొడుకెట్లుండు, ఇంటర్ కదా,
పుస్తకాలేమన్న అవసరముంటె జెప్పు, పంపుత,
ఇంట్లెవర్లేరయా, జెర్సేపు కూసో"
కుడి చేతిల పూరి తున్క,
పొద్దుగాల్ల సంపిన కోడి అంచుకువెట్కొని,
ఎడమ చేత్తోటి తాటికల్లు తాక్కుంట,
బేకోట్లు తీస్కుంట,
చిన్న పటేల్, పట్నంకెల్లొచ్చినట్టుండు..

"బాంచన్ పటేలా,
వానికి సదువెందుకు, కైకిలి పోతాండు,
వాగు మీద లారీలకు ఇశ్క ఎక్కియ్యనీకి",

"బాంచన్,బాంచన్ అనుకుంట
బానిసల్లెక్క బతుకుర్రి,
మా పట్నంల గివేమ్ నడువై, అందరొకటే,
ఎప్పుడు మార్తరయా ఇంకా"
పండ్లల్ల ఇరికిన కోడి బొక్క
గోళ్ళతోని తీస్కుంట చిన్న పటేల్,

"మారుడంటేంది దొరా,
తాత, పోతె, నాయిన, ఆయిన పోతె, మన్మని
కాడ పన్జేసుడేనా,
మా అయ్యను సంపిర్రు సర్పంచెలక్షన్ల పోటీ చేస్తే,
నా కొడుకు నాలిక కోశిర్రు, కాపోల్ల పొల్లతోని మాట్లాడ్తె,
మా ఇండ్లల్ల కూడ ఎవరొ
ఇద్దరు, ముగ్గురు సదూకొని,
సర్కార్ కొలువు చేయవట్టె పట్నంల,
వాడేదో ఆపతిల సోపతైతడనుకుంటే,
ఒక్కసారి ఆడికి పోయినోడు , మల్లీడికేమొస్తడు,
చౌరస్త కాడ, అంబేద్కర్,
మా ఇండ్లను జూస్కుంట,
ఊరిబైటికి వేళ్ళు సూపిస్తడు, ఏంటికో ఎరికేనా పటేలా,
"ఊర్లకు రాకుండ్రా, వొస్తె, సంపుతరు,
ఆడ్నె బతుకుర్రి" అని,

"ఏం రా వారి,
ఏం ముచ్చట్లు వెడ్తున్నవ్ మనుమని తోని,
గిలాస తెచ్చుకో పో, కల్లు పోస్తా" పెద్ద పటేల్,

గిలాస కడిగి,
గోసలెక్క కల్లులొట్టి కాడికి పోకుంట,
ఆనందం....

-29-07-2012

పెరుగు రామకృష్ణ || స్వార్ది.. ||

కొమ్మ చివురు తొడిగేందుకు
ఆనందంగా రాలిపోతుంది
పండుటాకు..

మనసు బరువు దించేందుకు
కన్నువీడి ధారగా జారి పోతుంది
కన్నీరు ..

ముత్యమై మెరిసి పోయేందుకు
ఆకాశాన్ని వొదిలేస్తుంది
చినుకు..

తన సుఖం కోసం
ఎదుటి మనిషి చిర్నవ్వులన్నీ
దోచేసుకుంటాడు
మనిషి..
-29-07-2012

రామ క్రుష్ణ రాఖి ధర్మపురి కవిత

“ఎక్స్ ప్లాయ్ టేషన్”
“ఎక్స్ ప్లాయ్ టేషన్”
సాకు- బాకు అవుతుంది నా దేశంలో...
బహీనత- వజ్రాయుధమవుతుంది నా దేశంలో-

మరణాలేవైనా మార్గం సులభతరం చేస్తాయి –మాకు ఉపకరణాలై...
ఆత్మహత్యలేవైనా మారిపోతాయి- మాకు తిరుగు లేని అస్త్రాలై...

కేజ్ లు..లింకేజ్ లు..పై పై మసాజ్ లు
మాఫీలు.. మద్దతులు..మడతపేచీలు కుచ్చు టోపీలు
కంటి తుడుపులన్నీ..కపట నీతులు..కుటిల గోతులు
మేమేం తక్కువ తిన్నమా.. మేం మాత్రం వెధవాయిలం అనుకొన్నావా
ఊరడింపుచర్యలు బ్లాక్ మెయిలింగ్ల్ లై రొమ్మువిరుచుకొంటాయి....
రాయితీలు తేఱగా దొరికే తాయిలాలుగా రూపు మార్చుకొంటాయి..
రిజర్వేషన్లు జన్మహక్కై రాజ్యమేలుతుంటాయి-
సబ్సిడీలు తాత సొమ్మై సోమరితనం పెంచుతుంటాయి..
ఓట్లు వక్రమార్గాల అక్రమాలు నేర్పుతుంటాయి
హక్కులు రెక్కలువిప్పుకొని విశృంఖలంగా సొమ్ముచేసుకొంటాయి

పురుషాధిక్యం
పేదరికం
నిరక్ష్యరాస్యత
వెనకబాటుతనం
కులాలు
మతాలు
అవకరాలు
అవలక్షణాలు
అజ్ఞానం
ఏదైనా కావచ్చు ప్రతిదీ ఓ చిచ్చు!!
అన్నీ అర్హతలే నాదేశంలో-“ఈజీ మనీ” కి
అన్నీ అవకాశాలే నాదేశంలో-“లేజీ మాన్ ”కి

ఇది విషవలయం-ఎవరిని ఎప్పుడు ముంచేస్తుందో
ఇది తేన తుట్టే-కదిపితే ఎవరిని కబళిస్తుందో
ఇది పులిపై స్వారీ- దిగితే ఎవరిని మ్రింగేస్తుందో
అందుకే వీటిని ఇలాగే ఉండనిస్తారు...
వీటిని ఇంకా ఇంకా పెంచి పోషిస్తారు..
రోగికోరేదీ కమ్మని తీయని మందే..! వైద్యుడు ఇచ్చేదీ జబ్బు మానని మందే..!!
ఉన్నతమైన స్వావలంబనకు ఎన్నడూ ఊతమీయరు..
ఉదాత్తమైన సాధికారతకు ఎప్పుడూ పట్టం కట్టరు...
వీటిని పెంచి పోషిస్తేనే- రాజకీయ మనుగడ !
కాదుపొమ్మంటే అమ్మో-నిత్యం రగడ !!
ఎవరిస్థాయిలో వాళ్ళు...
ఎవరికందినంత వాళ్ళు...
దోచుకున్న వాడికి దోచుకున్నంత మహదేవా
గుంజుకున్న వాడికి నంజుకుంన్నంత నారాయణా
నిస్సహాయంగా,అశక్తతతో,దీనంగా,బ్రతుకు దుర్భరమై
ప్రకృతి వైపరిత్యనికో విధి విలాసానికో ఎదురీదలేక
కొట్టుమిట్టాడే జీవికి తిరిగి నిలద్రొక్కు కోడానికి
అందించే చిరుసాయం-!
అదే అదనుగా,అదే ఆసరగా, అదే అవకాశంగా ఎగబడే
బాగా బలిసిన డేగలు,కందిరీగలు
రాబందులు,పందులు,
నక్కలు, పంది కొక్కులు,
గబ్బిలాలు ,గుడ్లగూబలు
నోటికాడి కూడు తన్నుకపోయే మాయోపాయం-!!
పథకాలకు తిలోదకాలు..
సిద్ధాంతాలకు పిండ ప్రదానాలు...
ప్రగతికి తగ్గని విరోచనాలు..!!!

29-07-2012

కట్టా శ్రీనివాస్ || డబ డబ సోడబ్బా ||

భజనలూ, భుజకీర్తులూ

భాగ్య సంపదై భాసించేందుకు

కప్పల తక్కెడ తోక్కిసలాటలో

గంపగుత్తగా ఇస్తున్నార్ట.చిడతలూ, బుర్రకధలూ

చెప్పుకుంటూ శోభిల్లేందుకు

తప్పని తిప్పల తాయిలాలతో

తయారుగానే వుంటుండాలట.వందిమాగదుల వందనాలకై

వందల వరదలు వదలాల్సిందేనట.

బట్రాజ, భజంత్రీలకై

భవధీయులై భజించాల్సిందేనట.ముంజేతి కంకణాలూ

ముంగిట్లో మంగళారతులు

ముందస్తుగా మాకనుకుంటేనే

మంది బలంతో మజా వస్తుందట.అంగట్లో నీ తూకం

వ్యర్దాలతో వేసుకుంటావా ?

ముంగిట్లో ఓ అర్ధం

సమర్ధతతో వెతుక్కుంటావా?తెలుసుకునేదీ, తేల్చుకునేదీ

నీలో నువ్వే

నీతో నువ్వే...

- సిరి.కట్టా
29-07-2012

రామ క్రుష్ణ రాఖి ధర్మపురి || జీవిత పరమార్థం ||


నేనే
అన్నిటికీ కారణం అనుకుంటే

ఈ క్షణం
నే అనుభవిస్తే

ఏదీ ఆశించకుంటే

ప్రతిదీ స్వీకరిస్తే

అంతా మంచికేనని భావిస్తే

జీవితంలో ఏదైనా భాగమే నని
ఇది ఇంతేనని, సహజమేనని తలపోస్తే

బ్రతికినంతకాలం అందరితో కలిసి మెలిసి
హాయిగా జీవిస్తే

ఆనందం!
బ్రహ్మానందం!!
పరమానందం!!!
29-07-2012

వేంపల్లి గంగాధర్ కవిత


రాక పోదు ... రాక పోదు ...
దిక్కులన్నీ మునిగేలా ఉప్పెనొకటి రాక పోదు ...

రాక పోదు ... రాక పోదు ...
ఆకాశం అదిరేలా గర్జనొకటి రాక పోదు....

నల్ల యుద్ద నౌక ఒకటి
నీ తీరం ముట్టడించి ...
నీ చరిత కు నిప్పు పెట్టి ...నీ బతుకు కు పాతరెట్టి....
నీ సౌధం కూలగొట్టి .... నిను తరిమి తరిమి వెళ్ళగొట్టు ....
రోజొక్కటి రాక పోదు ... రాక పోదు ...

దిక్కులన్నీ మునిగేలా ఉప్పెనొకటి రాక పోదు ...
ఆకాశం అదిరేలా గర్జనొకటి రాక పోదు....

రాక పోదు ... రాక పోదు ... !
29-07-2012

శాంతిశ్రీ శాంతి || అమ్మానాన్న..! ||

మొదటి స్పర్శ అమ్మ
ఆ స్పర్శకు ప్రతిస్పర్శ నాన్న
ఆరని దీపం అమ్మ
ఆగని ప్రవాహం నాన్న
అమ్మ లాలిస్తే
నాన్న ఆడిస్తాడు
అమ్మ ఒడే నేల
నాన్న భుజమే నింగి
వారి ప్రేమ పూదోటలో
వికసించే పుష్పాలం
అమ్మ జోల అమృతం
నాన్న ఆలన విజయం
మన ఆనందమే వారానందం
దెబ్బ తగలగానే అందరూ
అనేేది 'అమ్మా! అయ్యా!'
ఏమిచ్చినా తీర్చుకోలేని ఋణం
అంత్యదశలో వారికి అమ్మానాన్నలవడం మన ధర్మం
(అమ్మానాన్నలందరికీ అంకితం..)
-29-07-2012

పరమేశ్వరి పులిపాటి కవిత

నిజం
పక్షులన్ని ఒకలాగే...
పశువులన్ని ఒకలాగే...
తరులన్ని ఒకలాగే...
గిరులన్ని ఒకలాగే...

ఒక్క మనిషే.......

ఒకడేలుతూ..
ఒకడేడుస్తూ..

ఒకడనుభవిస్తూ..
ఒకడడుక్కొంటూ..

ఒకడు గెలుస్తూ..
ఒకడు ఓడుతూ..
*29-07-2012

ఉషారాణి కందాళ కవిత


నేనొక పూలవనం కావాలనుకుంటాను కనీసం గుడ్డిపువ్వును కాలేను! 
నేనొక వెన్నెల జలపాతం కావాలనుకుంటాను కనీసం చిన్ని దీపం కాలేను!
నేనొక అనంతాకాశం కావాలనుకుంటాను కానీ పిల్లమబ్బును కాలేను!
నేనొక శతఘ్నినై ప్రజ్వరిల్లలనుకుంటాను కానీ అగ్గిపుల్లైనా కాలేను!
నేనొక మాహా సముద్రమై ఉప్పొంగాలనుకుంటాను కానీ చిన్ని చెలిమను సైతం కాలేను!
నేనొక శిలావిగ్రహంలా స్థిరమై పోవాలనుకుంటాను, కనీసం చిరునామాకు సైతం నోచుకోను!
నేనొక బృహత్కావ్యాన్ని ఆవిష్కరించాలనుకుంటాను, కనీసం ఒక్క పదం పలకలేను!
నేనొక జీవనదినై ప్రవహించాలనుకుంటాను, కనీసం వీధికొళాయి కాలేను!
నేనొక మాహామనీషినై వెలగాలనుకుంటాను కానీ కనీసం మాములు మనిషిలా మసలలేను!
నేస్తం! ఏన్నెన్నో అనుకుంటూ ఏమీ చేయలేనంటూ తెలుసుకోగలిగినప్పుడు..
అలోచనలన్నీ కన్నీళ్ళు అవుతాయని భయపడ్డాను చిత్రంగా అవి అనుభవాలయ్యాయి.
* 29-07-2012