పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, సెప్టెంబర్ 2012, ఆదివారం

నరేష్ కుమార్ || నేను, కొన్ని శవాలు

నాలుగు
మందుపాతరలని
మనసులో
పాతేసుకొని
నలిగిపొయిన
దారిలో
కొన్ని కపాలాల మీది
తలరాతలని
చదువుకుంటూ
ఒక పయనం.....

గమ్యాన్ని
కొనుక్కోవటానికి
ఙ్ఞానిని కాలేదింకా

కబ్జా చేసిన
స్మశానం లోనుండి
వెలివెయించుకున్న
శవాలు కొన్ని
నా ఆలోచనలని
చప్పరిస్తూ
నాతోనే
బయల్దేరాయి
కొన్ని
ప్రశ్నలని
పీక్కు తింటూ..
నడుస్తున్నాం....

సమాజపు
అంచుల్లో
కొన ఊపిరితో
కొట్టుకు లాడే
మానవత్వాన్ని
మాలో నింపుకొని
గమ్యాన్ని
వెతుకుతూ
తిరుగుతూనే
ఉన్నాం....... 14/09/12

‎ బూర్ల వెంకటేశ్వర్లు || నాయీ బ్రాహ్మణుడు


ఒక చేత్తో కత్తెర
మరో చేత్తో దువ్వెనపట్టి
ముందునుండి, వెనుకనుండి, పక్కనుండి
ఏ వైపుచూసినా
నా మొఖాన్నినాకు కొత్తగా పరిచయం చేస్తాడు
నల్లజింకల మీద దాడిచేసినట్టుగా
తెల్లదువ్వెన పరుగెత్తించి
జుట్టును కత్తెరతో వేటాడుతాడు
అడ్డంగా పెరిగిన గడ్డం గడ్డిని
నురగలెత్తించి అలలా తోసుకెళ్తాడు
తాటికాయల్లాంటి తలల్ని చందమామల్ని చేసి
మేనమామై సంస్కరిస్తాడు
దారికిరువైపులా చెట్లతలల్ని సమానం చేసినట్టు
అతడొక్కడే నిల్చొని
అసమానత్వం మీద యుద్దం చేస్తాడు

బొడ్డుకోసి,వసపోసి, మైలతీసి, గుండుగీసి
మానవజీవితం చుట్టూ
సీతాకోకచిలుకలా పరిభ్రమిస్తుంటాడు
అతడు వాలినచోటల్లా
అందం తలెత్తుకు తిరుగుతుంది

కంఠంమీద కత్తి అంచునడిపించగల
కళావిలాసమతని సొంతం
కాలిగోళ్ళనుంచి తలచివరి వెంట్రుకదాకా
తళుకులీనజేయగల సునిశితత్వం
అతని హస్తాక్రాంతం
అందుకే,
ఎవరికీ తలవంచని నేను
నా తరాలన్నిటి తరపునా
కృతజ్ఞతలతో శిరసువంచుతున్నా!