పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జులై 2012, శనివారం

ప్రవీణ కొల్లి- కవిత

నాలోని నా గుహ

నాకు నేనుగా
నా ఒడిలో నేను పాపగా
నా బడిలో నేను విద్యార్ధిగా
నాలో నేనుగా ఒదిగిపోయే నా స్థానం
అంతర్మధన సముద్రాన్నిఅంతరంగంలో ఇముడ్చుకున్న నా స్థలం
నాలోని నా గుహ…..నా అంతర్గుహ…

అటు ఇటు వీలుచూసుకుని
హటాత్తుగా తనలోకి లాగేసుకుంటుంది
ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు
సంఘర్షణల కొలిమిలో కాలిపోతునట్టు
గతమంతా ఓ ప్రశ్నగా నిలదీస్తున్నట్టు
సమాధానాల వెతుకులాటకు పొమ్మని
నిర్ధాక్ష్యణ్యంగా తనలో నుంచి నన్ను నెట్టివేస్తుంది

విజయాల చప్పట్ల మోత ఆగాక
ఆనందపు పరిసరాలు ఖాలీ అయ్యాక
తన కౌగిట్లో బంధించి
నుదుటన ముద్దిచ్చి
నా కష్టం తీరుస్తుంది

కన్నీటి పరామర్శలు అయ్యాక
సాధింపు ఎత్తిపొడుపులు వెళ్ళాక
తనలో నన్ను దాచుకుని
నా వెన్ను చరిచి
అనుభవాలసారంతో నా గొంతు తడుపుతుంది

ఆ గుహ ద్వారానికి
ఎన్నోసార్లు ఉరేసుకుని వేలాడాను
ఆ గుహ గర్భంలో
ఎన్నోసార్లు ప్రాణం పోసుకున్నాను
ఆ గుహ గోడలలో ప్రతిధ్వనించే శబ్దమే నాకు వేదం

అదే నాలోని నా గుహ…..నా అంతర్గుహ…
అంతర్మధన సముద్రాన్నిఅంతరంగంలో ఇముడ్చుకున్న నా గుహ…
* 3.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి