పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, ఆగస్టు 2012, బుధవారం

కట్టా శ్రీనివాస్ || హరియాలీ సలాం ||

నీవోక పచ్చని చెట్టయిన రోజు
పిట్టలు అవే వచ్చివాలితే.
పుట్టింటి బిడ్డల స్పర్శకు పులకింతలతో పరవశించావు.

నీపై పువ్వులు విరబూసి నవ్వినపుడు
మధుపాలు ఆశగా మదువుని గ్రోలి గోలచేస్తే.
మనువళ్ల అల్లరికి ముద్దోచ్చి మురిసిపోయావు.

తొలిపిందెల రుచి చూస్తూ
కసరుగాయల పసచాలక కసిరింతలు కావలించుకుంటే.
కడుపున పుట్టిన వాళ్ల తప్పును వెనకేసుకొచ్చేతల్లిలా నిలబడ్డావు.

ఒక్కోపండూ తయారై తలలూపుతుంటే.
అదేమిటో రాళ్లిలా వచ్చిపడుతున్నాయి.
గాయం బాధకన్నా రాలే పండ్లను చూస్తే
నీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.

నీవోక పచ్చని చెట్టువు కాబట్టే
నీలో పచ్చదనం వుండబట్టే
ప్రపంచం నీవైపు చూస్తోంది
మంచో చెడో మాట్లాడుతోంది.

*28-08-2012
http://antharlochana.blogspot.in/2012/08/blog-post_28.html

ఎ.నాగరాజు || చంద్రునికొక పూల తావి ||


ఆ పాపకు తన స్నేహితురాలెవరో
ఒక రహస్య సందేశాన్నందించినట్టుగా
మిన్నల్ అంటే చందమామ మరియూ పువ్వు అని రాసి అతి జాగ్రత్తగా మడత పెట్టి నెమలి కన్నును ఉంచే చోట కాగితం పుటలలో దాచి ఇచ్చింది.

బడి భారాన్ని భుజాల నుండి పక్కకు నెట్టి
కాసేపు టీవీ చానెళ్ళను టకటకా తిప్పేసి
ఏదో గుర్తుకు వొచ్చిన దానిలాగా తనకు ఆ రోజుటికి వీడ్కోలుగా అందిన ఆ చీటీని ఆత్రంగా బయటకు తీసి
పసి బిడ్డలకు మాత్రమే చేతనయిన ఇంకా వొక పద్ధతికంటూ అలవాటు పడని అక్షరాల పేర్పును కాసేపు తదేకంగా తల పంకించి చదువుకొని
ఆ పాప తిరుగు జవాబుగా ఏదో రాయడం మొదలు పెట్టింది.

కొన్ని స్థితులలో చాపల్యం మాదిరిగా
ఒక్కొక్క పూవునూ జాగ్రతగా ఎంచి ఏరి తీసినట్టుగా పిల్లలకు పేర్లు పెట్టగలం గానీ
అ ఆపురూపమైనదేదో సదా తలదాల్చలేని శాపగ్రస్తులం కదా మనం
ఊహకు ఆవల నిలుచున్న బంధీలం కదా మనం
గీతల నడుమ వొదిగి తల వొంచి అనేకసార్లు గిడస బారిన గూనితో వొదిగిన అక్షరాలుగా పలకరించుకునే మనుషులం కదా మనం

బహుశా తన లేత వేళ్ళతో
తన స్నేహితురాలిలాగే ఇంకా వొదిగీ వొదగని అక్షర పంక్తుల పేర్పుతో తిరిగి ఆ పాప ఇచ్చే జవాబును మనం వొక నాటికైనా ఊహించగలమా
కనీసం ఊహగానైనా

28ఆగష్టు2012

పీచు శ్రీనివాస్ రెడ్డి !! చరిత్ర వాన్ని మరిచిపోయింది !!


అనాది నుండి
'నాది' అని ఏదీ లేని పేదవాడు
చరిత్ర పుస్తకం వదిలి
ఎప్పుడో పారిపోయాడు.

అయిన వాని కథ
రాతి పలకలపై నిలిచి శాసించింది
కడవాని వ్యధ
కడలి తీరంలో ఇసుక తెన్నులపై రోదించింది

చెమటోడ్చిన బ్రతుకుల రాతలన్నీ
సంద్రంలో కలిసాయి
ఎన్ని బ్రతుకులో ...
నీళ్లన్నీ ఉప్పగా .

అక్షర రాశికి వాసి పూసి
నిజానికి మసి పూసి
రాసిన రాతల్లో
పేదోడి కన్నీటి ధారలకన్న
పెద్దోడి కిరీటాల ధగ ధగలే ఎక్కువ

ఆ చరిత్ర
వరహాలు ముద్దాడిన అక్షరాల సమూహం కావచ్చు
రసిక సిఖామనుల రాజభోగాలను నెత్తిన ఎత్తుకొని
దరిద్రుడి దిన చర్యను వెక్కిరించాయి

మబ్బును చేరిన నీరు కొత్తగా కురిసినా
గతమంతా మరిచినా
గాలికి తెలుసు సంగతులన్నీ
గురుతుకొచ్చినప్పుడల్లా అరుస్తుంది

ఆ సాక్షినే వెంటబెట్టుకొని నిలదీద్దాం
నఖిలీ నవ్వులు నవ్వుతున్న' అక్షర గణాన్ని'
నింగిలో తారలని తుంచి
ప్రియురాలి సిగ లో పెట్టిన
వర్ణనా పైత్యాన్ని

28-08-2012

పద్మజా రాచమల్లు కవిత


తను తనలా లేడు
తన మనసులో నేను లేను!!

అయినా..
నా మీద ఎంత ప్రేమా!!
నా కళ్ళు నగ్నంగా ఉన్నాయి అని
తన మాటల తూటాలతో
కన్నీటి తెర కప్పుతాడు

జయశ్రీ నాయుడు //నిరంతర చెలిమి//


డైరీ లో పేజీలు తిప్పి చూసుకుంటే
నాలో నడిచి వచ్చిన అనుభవాలు
ఎన్నో మనసుల పాత్ర వుంది
అనుభవాల ఉలి దెబ్బలున్నాయి..
ఎన్నొ హృదయాల ఓదార్పు వుంది!
ఈత నేర్పిన కాల ప్రవాహం వుంది

నమ్మకం అపనమ్మకాల పగుళ్ళలొ
ఇరుక్కున్న విశ్వాసపు పందిరికి
ఆత్మని పూయించాలని ఒక్కో
కొమ్మకూ కాలపు చిగురు అతికిస్తూ
ఆలోచనల వర్షం కురిపిస్తూ
ఆకాశంలా సాక్షీ భూత స్థితికి
ఒక్కో మెట్టూ లెక్కిస్తూ నేను

అంతరంగం అన్నిటికన్నా లోతైన పసిఫిక్
ముందువెనుక వూగిసలాటల చేపలు
తలపులై మింగేసే అజ్ఞాన తిమింగలాలు
గమ్యాలుగా బయలుదేరిన చిట్టి పడవలూ
ఎంత కొలాహల హాలాహల సముద్రమిది

లయం కావాలి
ఆలయం కావాలి
భావనలన్నీ లయించే తీరం లో
ఇసుకరేణువులూ కానని సముద్రం అవ్వాలి

చుక్కల వెలుగు పోగు చేసి
పాలపుంతే కళ్ళు చేసుకుని
విప్పార్చి చూస్తున్నా
అఖండంగా వెలుగుతున్నావు
నావెలుగూ నీ పులుగే కదా

ప్రయాణం ఆగదు జీవన వినోదం మారదు
మోద ఖేదాలు గుండె చప్పుళ్ళే
ఆశల అలలు దాటిన సముద్రం
కన్నీళ్ళు లేని కళ్ళు మెరిసే ప్రయాణం
నేనే నా నౌక - విశ్వాసమే నా తెరచాప
నన్ను నేను సిద్ధపరుచుకుంటున్నా
నీతో నిరంతర చెలిమికి అవకాశంగా మలుచుకుంటున్నా!

28-08-2012

కర్లపాలెం హనుమంత రావు॥భావ శకలాలు-౩॥




1

వాత కోత మూత

మూడు ముక్కల్లో

కరెంటు కత

2

మృగం

మనిషి గతమే నా..!

అంతరంగం కూడా

3

అసాంజే

అందరిలో ఉంటాడు

అతగాడి పేరు

అంతరాత్మ

4

అంగారకమూ ధరకు అందింది

బంగారం ధరే

అందకుండా ఉంది

5

స్వర్గానికి సగం దారి

వరదగుడి

మిగతా సగం

గుండెగుడి

6

There is not an object

which do not have some purpose

నెల న్యూస్ పేపర్స్

నెలాఖరు కాపర్స్

7

లోకం ఒక త్రివేణీసంగమం

కొందరు గంగ యమున వాహినులు

కొందరు కనిపించకుండా పారే సరస్వతులు

8

మంచి చేసి పోతే

నీ తలవెంట్రుక్కూ విలువుంటుంది

చెడ్డ చేసి పోతే

నీకు తలవెంట్రుకంత విలువుంటుంది

9

పనితనం-వెనక కళాయిది

పేరు షోకు-ముందు అద్దానికి

-లోకం

10

గీత

దాటి – సీత

దాటక -విజేత

11

ఆకాశం ఏడ్చి

భూమిగుండెబరువు దించింది

12

కలిస్తేనే అర్థం

అక్షరాలకైనా

హస్తాలకైనా

13

కోరి పుట్టలేదు మనిషి

ఐనా

కోరికల పుట్ట.




ఆగష్టు 28, 2012

కెక్యూబ్ వర్మ ॥మట్టి తత్వం...॥


రా...
నడుస్తూ గుండె తలుపులు తెరుస్తూ
మనుషుల మధ్యకు రా...

మట్టి వాసనను ముక్కు పుటాలనిండా పీల్చు
నీ ఆదిమతనం బయల్పడుతుంది...

మట్టి చేతిని ఆత్మీయంగా తాకి చూడు
నీ రాతితనం బద్ధలవుతుంది....

భుజం భుజం కలిపి భారాన్ని పంచుకో
నవమాసాల బరువు గుర్తుకొస్తుంది...

గొంతు విప్పి బిగ్గరగా మాట కలుపు
హృదయాంతరాళంలోని గాయం సలుపుతుంది...

మట్టి మనుషులతో నడయాడు
ఒంటరితనపు ఎడారి దూరమై నది నీ కాళ్ళను స్పృశిస్తుంది...

రంగులన్నీ పారబోసి మట్టి తనాన్ని అద్దుకో
మనిషితనం వెలుగు నింపుతుంది...

దేహమంతా చేయి చేసి చాపు
కోట్ల చేతులు మనిషితనాన్ని నిద్దురలేపుతాయి....
( 28-08-2012)

జాన్ హైడ్ కనుమూరి ||ఇంటికొచ్చాక - పలకరింపుల పర్వం||

ఆసుపత
్రిలో రానివ్వలేదని
ఆత్రంగా పలకరింపుకోసం
రెక్కలు కట్టుకుని వాలినట్టు కొన్ని అనుబంధాలు

కొన్ని పెదాలు
ఇష్టంగానో అయిష్టంగానో పలకరిస్తాయి

దేహంతోనో, ఆత్మతోనో
స్నేహించిన పెదాలు
రెప్పలమధ్య ఒలకనివ్వని బిందువుల్తో స్పృశిస్తారు
ఆ స్పర్శ ఎంత ఊతమిస్తాయో ఏ పదాల్తో తెలపాలి
గుండెలోకి గుటకవేయడం తప్ప

దూరాలనుంచి రాలేక
ఆత్రాన్ని అణుచుకోలేక
గద్గద స్వరాలై
సెల్‌పోనుల్లో దుఃఖాన్ని కుమ్మరిస్తాయి

* * *

ఎక్కడో ఎప్పుడో గూడుకట్టుకున్న అనుబంధం
పలకరింపై కప్పేయాలని ఎదురుచూస్తుంటాను
వచ్చినవాళ్ళే మనవాళ్ళు
రానివాళ్ళకోసం ఆ దుఃఖపొర ఎందుకని
ఆరోప్రాణం హెచ్చరిస్తూవుంటుంది
ఒక్కోసారి ఆ దుఃఖపొర
దిగులు కంబళ్ళై కప్పేసి
ఇంకా అనారోగ్యంలోకి నెట్టేస్తుంది

* * *

జాగ్రత్తల ఆంక్షలు మొదలౌతాయి
చదవొద్దని
ఎక్కువ మాట్లాడొద్దని
ఎక్కువ నిద్రపొమ్మని
సమయానికి తినమని
సమయానికి మందులేసుకొమ్మని

* * *

ఇక దేహానికి మరోరకమైన పరీక్ష
అప్పటివరకు నరాల్లోకి చేరిన మందుల ప్రభావం
సమతుల్యానికి అడుగులేస్తుంటాయి
దేహం విశ్రాంతికి కోరుకుంటుంది

ఆనారోగ్యపు ప్రారంభ మూలాలకోసం చర్చమొదలౌతుంది
తాగునీరో, తిన్న ఆహారమో
వేసుకున్న మందులో
అనారోగ్యన్ని ఆలస్యంగా గుర్తించకపోవడమో
ఇదిమిత్తంగా నిర్ణయించలేక చర్చముగుస్తుంది

* * *

ఆర్థిక వనరులకోసం
ఎవరి తలుపో తట్టాలని చూస్తుంటాను
తవని తలుపులవైపు చూపులుచరిస్తాయి

ఎవ్వరోవచ్చి భుజంతట్టి జేబునింపాక
దేవుడు తనదైన ద్వారాలు తెరుస్తాడని
ఎవరినైనా పంపుతాడని గుర్తుకొస్తుంది
ఆ అశ్చర్యాన్ని నెమరేస్తుంటే
దేహానికి కొత్త రెక్కలొస్తాయి

***

నీవాక్యము నన్ను బ్రతికించి యున్నది
నా బాధలలో నెమ్మది కలిగించుచున్నది


14.8.2012