పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, అక్టోబర్ 2012, సోమవారం

కాసుల లింగారెడ్డి||వెన్నెలా! వెన్నెలా! ||

వెన్నెలా!
నా కనుకొలనుల కోనల్లో స్నానమాడుతున్న వెన్నెలా!

నా రక్తపంకిల పాదాలకు వెన్నెల మెట్లేసిన వెన్నెలా!
నా మాటనీ, పాటనీ నీలో పారించుకొని
నను నిర్వీర్యం చేసివెళ్ళిన నా వెన్నెలా!
వెన్నెలా!వెన్నెలా!
ఎక్కడున్నావమ్మా?

నా నిశీధసౌధంలోకి నీవుగా నడిచివచ్చి
వెలుగు సౌరభాల వెదజల్లిన వెన్నెలా!
నాకు ఆశల జీవం పోసి,జీవన గమనాల్ని నిర్దేశించి
రేపటి ప్రొద్దుకోసం నన్ను ఒడిచేర్చుకున్న వెన్నెలా!
ప్రభాత వాకిట నన్ను అర్ధాంతరంగా పారేసి వెళ్ళిన వెన్నెలా!
వెన్నెలా!వెన్నెలా!
దోషం నీదని నేనెట్లా దూషించనమ్మా?

ఎక్కడో ఓ స్థలాన్ని కౌగలించుకుంటున్నప్పుడో
ఏ పరిచయాన్నో పరోక్షంగా స్పర్శిస్తున్నప్పుడో
మరుపు మేఘాలు విడిపోతుంటాయి
వెన్నెలా!వెన్నెలా!
నువ్వు మబ్బుల మాటునుంచి గెండెల్లో గుచ్చుకుంటావు

నీ అడుగుల కింద చీకటి మబ్బులు నలుగుతున్న సవ్వడి వింటూనో
గోడచాటు చేసుకొని రాత్రి వెక్కిళ్లు పెడ్తున్న దృశ్యం చూస్తూనో
హృదయ కెరటాలు నిన్ను చేరుకోవాలని ఎగిసెగసి పడ్తుంటాయి
తీరానికేసి తలబాదుకొని జాలిగా రోదిస్తుంటాయి
వెన్నెలా!వెన్నెలా!
నువ్వు అమావాస్య తోబుట్టువని మరిచితి కదమ్మా!

కె.కె.//ఆనందం//


సృష్టిలో నిర్వచనాల్లేని పదాలున్నాయ్,
కొలమానం లేని ప్రమాణాలున్నాయ్,
అవధుల్లేని అనుభూతులున్నాయ్,

అందులోని ఆనందం ఒకటి.

ఎవడిపిచ్చి వాడికానందం,
అన్నాడొక మహా పిచ్చోడు.
కాని అది పరమ సత్యం.
నిజంగా ఎవడి ఆనందానికి వాడే కర్త.

మునిపంటితో గాటు చేస్తూ,
చనుబాలుని తాగుతుంటే,తల్లి పడే ఆనందం.
తప్పటడుగులేస్తూ తానొస్తుంటే,
వినిపించే చప్పెట్లమోతకి,బిడ్డపడే ఆనందం.
చెమటోడ్చి పెంచిన కొడుకు,
తోడొచ్చి కాసేటప్పుడు,రెక్కలొంగిన తండ్రి పడే ఆనందం.
మనసిచ్చిన లలనామణి,
మురిపిస్తూ చెంతచేరితే,ఆ ప్రియుడి ఆనందం.
పుట్టినరోజుకి,పట్టుచీరతో
అభినందిస్తే,భార్యపడే ఆనందం.

అలుపులేని శోధనతో,
అంతుచిక్కని రహస్యమేదో భేదించిన,శాస్త్రవేత్త ఆనందం.
ఏడాది కష్టం,ఏపుగా పెరిగి,
గాలికి తలలూపుతుంటే,రైతుపడే ఆనందం.
కలెక్టరైన కుర్రోడు,కాళ్ళకు దండంపెట్టి
మీ ఓనమాల భిక్షే అంటే,మాస్టారి ఆనందం.

ఎన్నో ఆనందాలు,ఎన్నెన్నో ఆనందాలు...
ఆనందానికి కొలమానం మరో ఆనందమే.

Date:14/10/2012

కెక్యూబ్ వర్మ ॥ నిర్జన వంతెన ॥

ఈ నిర్జన వంతెన అంచున
ఒక్కో దారప్పోగునూ పేనుతూ
అక్షరాల అల్లికలల్లుతూ

పదాల మధ్య బందపు కండెను జార్చుతూ
ఒలికి పోకుండా పట్టుకొనే ఒడుపు కోసం నిలబడి వున్నా....

ఏదీ అంటనితనమేదో యిలా ఒంటరిగా
మిగిల్చి పాదాలను రాతి తాళ్ళతో బంధించి
దేహాన్ని ఇలా వదిలేసి పోయింది....

మనసు మూగతనాన్ని నింపుకొని
గ్లాసు నిండుగా ఒంపినా గొంతుదిగని మత్తు....

యుద్ధానంతర నిశ్శబ్ధపు నీరవం
చుట్టూరా పొగల సుళ్ళుగా అల్లుకొని
అస్తమయ వెలుగులో కాసింత రంగునిచ్చి
కనులలోయలో ఒరిగిపోతు....

దూరంగా జరుగుతున్న మేఘాల రాపిడికి
అక్కడక్కడా మెరుస్తూ ఓ వాన చినుకు
కన్రెప్పపై జారిపడి వెచ్చగా గొంతులో దిగుతూ
గుండె మూలల ఖాళీని కాసింత కప్పే కఫనవుతూ....

దేనికదే ఒక అసంపూర్ణత్వం కలగలిసి
నలుపు తెలుపుల చిత్రంగా గోడనతుక్కొని
కలవని గీతల వలయంలా మారుతూ
వెక్కిరిస్తూ ఎదురుగా అలా నిలబడుతూ....

ఎక్కడో ఓ సన్నని నాదం విరిగిన వెదురు పొద మీంచి
గాలిని కోస్తూ శబ్ధావరణాన్ని సృష్టిస్తూన్న
వాతావరణంలో గాయాన్ని సలపరమెట్టిస్తూ.....
(18-10-2012)

నరేష్ కుమార్ //ఎక్కడని బందించ గలరు నిన్ను//

ఎందుకా వెర్రి ప్రేమ కామ్రేడ్
సాటి మనిషిమీద నీకు

స్వేచ్చ ని
బందించటం
మనకి కొత్త
కాదు కదా...!
ఐనా...
కాళ్ళూ చేతులు
కట్టేసుకొని
చేవ చచ్చిన
మాలాగా
ఇంట్లో కూర్చోక
మనిషి కోసం
గొంతుని నినాదంగా
మడిచి
గాళ్ళొకి విసిరావ్
వినిపించినంతమేరా
సామాన్యుడి
గుండెలో
ధైర్యమై నిలబడిందిప్పుడు

కుహనా ప్రజాస్వామ్యపు పునాదులు
యూరిక్ ఆసిడ్ తో నిండిపోయాయ్

కామ్రేడ్...!కామ్రేడ్...!
ఎక్కడని బందించ గలరు నిన్ను
ఇపుడెవడూ
పగిలిన వ్రణాలై
కన్నీటి రసి ని
స్రవిస్తూ
ఎవడి శిలువని వాడే మోసుకుంటూ
తిర్గటం లేదు....
అంకుల్ శాం గాడి .....కొడుకులంతా
విరగ బడి నవ్వే
నవ్వుల్నీ
ఉరితీసెందుకు
ఊపిరి
దారాలతో ఉరితాళ్ళు
పేనుతున్నారు

నిన్ను బంధించిన
చేతుల్ని
తెగ నరికేందుకు
ఒక్కొక్కడూ
ఒక్కో నినాదమై
పేలుతున్నాడు.......

పీచు శ్రీనివాస్ రెడ్డి || ప్రవాహం ||


మెదడు మొద్దు నిద్దుర పోతే 
మనసు మౌనంగా ఉంటే
మనిషి ప్రవహించడు

బురద గుంటగా మారతాడు
పరాన్న జీవులకు ఆశ్రయమిచ్చి తను ప్రశ్నార్థకం అవుతాడు

కదిలే ప్రవాహంలో కాలుష్యం బ్రతుకుతుందా
ఇసుక రాళ్ళు కొరికి చంపేస్తాయి
సర్వ సన్నిద్దుడై శ్రమిస్తే అపజయము౦టుందా

మెదడులో
ఆలోచనల విత్తనాలు చల్లి చూడు
మనసుకు
చీకటిని ప్రశ్నించే అక్షర గళాన్ని తొడిగి చూడు

నిశ్శబ్దపు బెదిరింపులకు
అబద్ధపు ఉరుములకు
నిజం భయపడదెప్పుడు
కపటపు రంగుల ముసుగును కడిగేస్తుంది
తన జడి వానలో

నువ్వు లేని నాడు
కనిపించగలిగితే
నువ్వు లేని నాడు
వినిపించగలిగితే
నువ్వొక ప్రవాహమే

పారే ప్రవాహం పచ్చదనానికి విత్తనాలు నాటుతుంది
జీవాన్ని సర్వ వ్యాప్తం చేస్తుంది

మనిషి ప్రవాహమౌతే
మౌనాన్ని చీల్చే పోరాటం అవుతాడు
చీకటిని కాల్చే వెల్గుల రాజవుతాడు










09-10-2012

కిరణ్ గాలి || భ్రష్టమేవ జయతే ||

1) లేదు లేదు!
ఆశయాలు అవినీతిగా ఫొర్జరి చెయ్యబడలేదు
అనుమతులకు అధికారికంగా సర్జరి చెయ్యబడలేదు

శిక్షలేనిచోట అసలు నేరమనే పదానికి ఆస్కారమే లేదు...

నిజం నిజం!

నిధులు నజరానాలుగ నేతల ఖజానాలకు తరలలేదు
నిస్సందేహంగా అవి వికలాంగులకే చేరాయి
అవిటి చట్టాన్ని "విచారించమని" ఆదేశించనవసరం లేదు

తప్పు తప్పు!
కోట్లుమింగే కొలువులో వున్నవాడు
లక్షలకు సొంగ కార్చాడంటే నమ్మరాదు

***

2)

అవును అవును!
నిటారుగ నిలబడ్డ నిజాయితి వెన్ను విరవడం
అంత సులభం కాదు.
నిజాన్ని చాటుగ మరొక చోటుకు బదిలి చేసెయ్యి


భలె భలే!

మామిడి రసం పీల్చి
టెంకె మిగిల్చే గారడి తెలిసిన వాడు
అరటిపండును ఘన-తంత్రంతో వలిచి
పండు తనకి తొక్క ప్రజలకి పంచుతున్నాడు

చూడు చూడు !
వేటకుక్కలు తోడెల్ల గుంపుకు తోడుగా ఊలవేస్తున్నాయి
లేళ్ళూ, కుందేళ్ళు తిరగబడకుందా కాపలా కాస్తున్నాయి

***

3)

తప్పు తప్పు!

ఆడవారిదే అంతా తప్పు
మగవాడికంట పడడమే అసలు తప్పు
గడప దాటితే ఇంకెముంది చెప్పు


భేష్ భేష్!

చెరచ బడ్డ అసహాయతపై నింద వేసి
నిజాన్ని నిర్భయంగా బలాత్కరిస్తున్నారు
బాల్య వివాహాలె పరిష్కారమంటు
బహిరంగంగానే ఉపన్యాసాలతో ఉపదేశిస్తున్నారు

***

విను వినూ! బాగా వినూ!

కలంతొ శాసనాలను రాయడమే కాదు
కత్తులతో నెత్తురుని చిందించగలమూ ఖబర్దార్ అంటున్నారు

లేదు లేదు! మనకిక దిగులు లేదు

దేశంలో ధర్మమేకాదు
న్యాయమూ నాలుగు పాదాలా నడుస్తున్నది.
దాని మెడకు కట్టిన గొలుసు వాళ్ళ చేతిలో
మరింతగా బిగుసుకుని ఒరుసుకుంటుంది...

సత్యం స్వఛ్ఛందంగానే ఉరి పోసుకుంటుంది

Date: 20-10-2012

ప్రవీణ కొల్లి ||స్థితి ||

ఆనందమూ కాదు, విషాదమూ కాదు
అదో స్థితి
మాటలన్నీ మూటకట్టుకుని పారిపోతే

ఎద మొత్తం మౌనంలో ఒదిగిపోతే
ఆ నిశ్శబ్దపు ఒడిలో ఏర్పడే స్థితి.....స్తబ్దత!
శూన్యత కాదు స్తబ్దత!

ఈ స్తబ్దతలో
శ్వాసే ప్రశ్నలను సంధిస్తుంది..
సమాధానాల అన్వేషణలో
మనసును తవ్వి
పొరలను చీల్చుతూ
హృదయాంతరాలకు చేరాక
అక్కడ
ఎన్నాళ్ళుగానో నిక్షిప్తమైన మణులు
వెలికి వచ్చి నిలదీస్తాయి !
ఆ మాణిక్యాలలో ఏమి వుండదు ....ఒక్క స్వచ్ఛత తప్ప!

ఒక్కోసారి
ఈ ఏకాంతపు నదిలో ఈదటం
ఈ ఒంటరితనపు వారధిలో నడవటం
అత్యవసరం...
18. Oct. 2012

కర్లపాలెం హనుమంత రావు॥అలోచనా శకలాలు॥


1
కోకిల పాట
ఎంత కమ్మన

కాకెంగిలి కదా!

2
ముసురు మేలిముసుగు నుంచీ
ఆకాశం మిసిమిసి నవ్వు
-మెరుపు

3
అడుక్కుంటూ గ్యాపులో
ఆడుకునే వీధిబాలలు
-ఆర్టాఫ్ లివింగ్

4
మెలికలు తిరగడంలేదే పాపం
ఆరొగ్యంగా ఉందా
పాము!

5
ఈ గొంగళి పురుగేనా
రేపటి రంగుల సీతాకోకచిలుక!
కాలం గొప్ప కాస్త్యూమ్ డిజైనర్

6
నరపురుగు లేదు
అడవికెంతానందమో!

7
మనసుతో నడివకే
బతుక్కు
అలసట

8
ఎంత ప్రశాంతంగా ఉందీ!
గుండె
శవాసనమేసినట్లుంది

9
స్నేహం
మనిషి
-మనిషివ్యసనం

10
పొగడ్త అగడ్త
దూకడం తేలిక
తేలేది లేదిక

11
ఎప్పుడు వెలిగించిందో
వెలుగులు విరజిమ్ముతోంది
-గీత

12
రెండో తరగతి రైలు బోగీ
చదివేవాడికి అదే
కదిలే తరగతి గది









20-10-2012

క్రాంతి శ్రీనివాసరావు ||నేటి నిజం ||

రాజకీయ రాకాసి బల్లులు
పుడమి తల్లి గర్భం చీల్చి
రక్త మాంసాలు తోడుకుంటుంటే


సమస్త సహజ వనరులూ
వట్టిపోయు
ఉడిగిపోతున్నాయు

యు
నా
అసలైన సహజవనరు
ఏ దేశానికయునా,
వారి పిల్లల మెదళ్ళేకదా
కా
నీ
కార్పోరేటు కాలేజీల
కాలుష్యం పీల్చలేక
చదువులమ్మ
పలాయన మయ్యుంది

ఎదురీది
చదువబ్బిన విద్యార్ధులంతా
జారుతున్న
రూపాయు విలువ చూసి
వలసపక్షులై ఎగిరిపోతున్నారు

వేల పని గంటలు
ద్వంసం చేసే నీరోలయ్యారు
మూడు గంటల
సినిమా హీరోలు

చిట్లిన పాళీ తో
రాస్తున్న రెండర్దాల
సినిమా పాటలు వింటూ

జీవన ఎడారుల్లో
సంచరిస్తున్న
జనాల బొమ్మలు
బారుల గోడలపై
సేదదీరిస్తూ

హీరోల్లా వుండాల్సిన యువకులు
వట్టి జీరోలుగా మిగిలిపోతున్నారు

కుహనా మేధావులు
ప్రపంచ గాలి దుమ్ముకు
అనుకూలంగా
తలుపులు బార్లా తెరవాలని
తీర్మానాలు చేస్తూనే వున్నారు

పొద్దున్నే సూరీడు మాత్రం
ఎప్పటిలానే
ఎర్రదారులెంటే
వస్తున్నాడు




14-10-2012

పీచు శ్రీనివాస్ రెడ్డి || నా కలం ||


నేను 
ఎన్ని అక్షరాల ఇటుకలను పేర్చాలో
ఎన్ని అక్షరాల సుమాలను అల్లాలో

ఎన్ని ఘటనల భావాన్ని పంచాలో
ఎన్ని టన్నుల భారాన్ని మోయాలో
ఓ కవితని రాయాలంటే

నన్ను తనలో నింపుకున్న ' నా కలానికి ' ఎంత ఆరాటమో
దానికెప్పుడు అక్షరాల ఆకలే
దానికెప్పుడు కవితా దాహమే
దాని ఆకలి , ఆకలి తీర్చడమే
దాని దాహం , దాహం తీర్చడమే

ఊహా లోకంలో విహరిస్తుంటే ఎదుటే వచ్చి వాలుతుంది
ఎన్నో బ్రతుకుల ఆరాటాలు
ఎలా శ్వాసిస్తున్నాయో చూడమంటోంది
ఎన్నో బ్రతుకుల పోరాటాలు
ఎలా గాయ పడ్డాయో రాయమంటోంది

అక్షరాలకు తను ప్రాణం పోస్తుందట
భావం నన్ను పంచమంది










16-10-2012

క్రాంతి శ్రీనివాసరావు ||జారిపోయున క్షణాలు ||

వికృత రూపాలయునా
సరే

వేల సంఖ్య లో
ఒకే దగ్గరున్నప్పుడు
కళ్ళకు అందాన్ని
ఆనందాన్నిఅద్దుతుంటాయు

సమూహ శక్తి కున్న
సమ్మోహనరూపం
చెరిపేసుకొని
వేరు పడ్డ
ఒంటరి పక్షుల్లా
వైరాగ్యం ముసుగేసుకొని
బతికేస్తున్నాం

కురుస్తున్న క్షణాల్లొ
తడవకుండా తప్పుకొని

ప్రవహించే నదిలో నీళ్ళలా
కాల ప్రవాహం లో
జరిగిపోయునవి
తిరిగిరావని తెలిసినా
మనసుకు కాళ్ళు తొడిగి
వెనక్కి పరుగెత్తిస్తూనే వుంటాం

ముందున్న కళ్ళను
వెనుకవైపు
అతికించుకోవాలిప్పుడు
అప్పుడన్నా
ముందుచూపులు
మొలుస్తాయేమొ

సతీష్ చందర్ ||నిద్దురే నిజం||

(అవును. నాకు నేనే దొరకను. నాలాగా వున్ననేనుతో నాకు పనివుండదు. ఉత్తినే వానలో తడవాలనీ,

ఇసుకలో ఆడాలనీ, దొంగచాటుగా చెట్టునుంచి పచ్చి మామిడికాయ కొట్టుకొచ్చి, పచ్చికారం, ఉప్పూ కలుపుకుని
తినాలనీ ఉంటుందా? సరిగా అప్పడే, మెక్ డొనాల్డ్స్ల్ లో దూరి బర్గర్ తిని, నేను కాని నేనుగా తిరిగి వస్తా. ఎవర్నయినా
గాఢంగా కౌగలించుకోవాలని, కేవలం కరచాలనంతో తిరిగి వచ్చినప్పడు, నా ముఖం నాకే నచ్చదు. మీకేం చూపను? )




ఊయల్లాంటి పడవా,

ఊపే నదీ,

పిట్టల జోలా-

చాలవూ ..

నిద్దుర వంకతో

నిజమైన మెలకువలోకి వెళ్ళటానికి!?

నేనెప్పుడో కానీ దొరకను.

నీక్కావలసింది నా వంటి నేను కదా!

అందుకే మరి..

నన్ను కలలోనికి వెళ్ళ నివ్వు.

నన్ను నన్నుగా రానివ్వు.

మనం అవసరాలతో కాకుండా,

ఆప్యాయతలతో మాట్లాడుకునేది

కేవలం స్వప్నంలోనే కదా!!

వాసుదేవ్ II కన్ఫెషన్స్-1 II

రాత్రిపై నుంచి నడిచొచ్చానా
గుప్పెడంత చీకటినీ తెచ్చుకోలేకపోయాను!
కళ్ళకింద కలలన్నీ కన్నీళ్ళలో

కదులుతూ
కథలుగా మారలేకపోయాయి

ఓ అక్షరంలో కూర్చుని మరొకదాంతో
చెప్పుకుంటూ ఉంటాను
ప్రతీపదం ఓ కన్ఫెషన్ బాక్స్ మరి...

దొర్లుకొస్తున్న ఖాళీ సీసాల్లా కొన్ని జ్ఞాపకాలు
ఖాళీలకి ఫ్రేముకట్టి మరీ మోస్తాయి..
సమాధికాబడని జ్ఞాపకాలు కొన్ని!
తడిసిన కాగితంలోని అలుక్కుపోయిన అక్షరాల్లా
ఈ జ్ఞాపకాలు....

అర్ధంకాని బంధాలేవో
పేపర్ వెయిట్‌‌లా జీవితావేశాన్ని
అదిమిపెడుతుంటాయి
తేమకీ, తడికీ తేడాతెల్సెదెప్పుడు
ఆర్ద్రతెప్పుడో ఆవిరై ఆరిపోయిందిలె

సమాధిలో శవానికి మిత్రుల్లేరన్న
'గాలి' ఊళల్లోని మాటలు కొన్ని చెవిదాటిపోవు
అవును
పిరమిడ్లలోని రాళ్ళేవీ
జీవితతంలోని డొల్లతనాన్నీ నింపలేవు
నా దృష్టినీ అడ్డుపెట్టలేవు
అయినా ఏం చూస్తున్నానని?

రాత్రికట్టుకున్న నల్లచీరలాంటి చీకటీ
సంద్రాన్నంతా కప్పేసుకున్న అలలనురగల్లోని తెలుపూ
రంగులన్నింటినీ తమలోకి లాగేసుకుంటే
ఇక నాకేం మిగిలిందని....?
కన్నీటి రంగుతప్ప!

అరువుతెచ్చుకున్న మేధోతనమేదీ నిలబడదు
చిన్న ఒంటికి పెద్ద అంగీలా
అసహజంగా, అసమానంగా....

అటో ఇటో ఎటో
ఎటూకానీ అవస్థాంతరం
ఈ నడివయసు!
విస్తరించుకుంటున్న శూన్యత
ఆఖరికి ఈ పాపనివేదన గదిలోనూ...