పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, సెప్టెంబర్ 2012, శనివారం

Srinivas Yellapragada ‎"మనవాడే"


అలా అనకండి..అతడూ మనవాడే
సరిగ్గా చూడండి..మనలోని వాడే

కాకుంటే..
మనం ఏడిస్తే అతడు నవ్వడు
మన ఏడుపు మానిపే ప్రయత్నం చేస్తాడు
అతడూ మనవాడే

కాకుంటే..
మనం నవ్వినపుడు అతడు ఏడ్వడు
మన నవ్వులో నవ్వవుతాడు
అతడూ మన వాడే

కాకుంటే..
మనం పడితే అతడు మాటల కారం జల్లడు
అతడి చేతితో ఉపశమన లేపనం పూస్తాడు
అతడూ మనవాడే

కాకుంటే
అతడు ప్రేమించమనడు
అడక్కుండానే అందరినీ ప్రేమిస్తాడు
అతడూ మనవాడే

కాకుంటే..
మనలోనే కలిసి తిరుగుతున్నాడు
అయిన విడిగా గుర్తించబడే వ్యక్తిత్వం కలవాడు
అతడూ మనవాడే

కాకుంటే..
అతడిలోనూ అతడున్నాడు
అందర్లో కూడా అతడున్నాడు
అతడూ మనవాడే

కాకుంటే..
బతకడం కోసం జీవించడు
జీవించడం కోసం బతుకుతాడు
అతడూ మనవాడే

కాకుంటే
అతడు మనిషి అంతే
అతడు మనీషి అంతే !! 20SEP12

క్రాంతి శ్రీనివాసరావు || ఆకుపచ్చ కన్నీరు ||


నదిలో నీటి నాట్యం
మట్టి పాదాల
మెట్టెల సవ్వడి
గాలి ఈల పాట
అంబర సంబరం
నీళ్ళ అక్షింతలు
సంక్రాంతి చలి మంటలు
గతించిన సంగతులు

నది నీళ్ళ కాళ్ళకు
సంకెలలు పడ్డాయు
నూపురాలు వూపిరులు
పోగొట్టుకొన్నాయు

మట్టి పాదాల
మడిమలు పగుళ్ళేసి
రక్తం కారుతున్నాయు

గాలి రక్త కణాల
శాతాలు మారి
నవరంద్రాల వేణువులో
అపస్వరాలు దొర్లుతున్నాయు

ఆకాశం
ఓజోను వలువ వూడి
విలపిస్తూ వుంది

ఋతురాగం ఆగిపోయు
బతుకంతా ఆగమయ్యు
నీళ్ళ అక్షింతలు
ఆకాన్క్షలయ్యాయు

ఆకలి మంటల నార్పే
ఫైర్ స్టేషన్లు
చితి మంటలు పండిస్తున్నాయు

ఉత్తరాయణ దక్షిణాయణ
పట్టింపులులేవిప్పుడు
అంతా రసాయనమే

పంచ భూతాలూ
కాలుశ్య భూతం చేతుల్లో చిక్కి
వెక్కి వెక్కి ఏడుస్తూ
ఆకుపచ్చ కన్నీరు కారుస్తున్నాయు

YagnapalRaju **పట్టెమంచం**

కిర్రుకిర్రుమంటుంటే
వయసైపోయిందేమిటే
అని అడిగాను
నాకు వయసైపోలేదురా
మీ వయసుజోరే పెరిగిందంటూ
నాతో సరసాలాడింది

ఎన్ని జంటలను మోసావో
నీకు ఓపికెక్కువే అని అంటే
మొదట్లో ఇబ్బందిగానే ఉండేది
తర్వాత అలవాటైపోయిందిరా అబ్బాయ్
అంటూ వేదాంతం మాట్లాడింది

పరుపులు, దిండ్లు, దుప్పట్లు మారాయి కానీ
నేను మారలేదంటూ
పైపై సొబగులెన్నున్నా
అంతఃసౌందర్యమే ముఖ్యమంటూ
ఆత్మ తత్వాన్ని
అవలీలగా బోధించేసింది
అనుభవం రంగరించిన
పండు ముత్తైదువ లాంటి
మా పట్టెమంచం

18/09/2012

కాశి రాజు || అంకెలు ||

0.శూన్యంతో మొదలై
శూన్యంతోముగిస్తే
ఆ లెక్క లెక్కలోకి రాదు

1.ఒకరు,ఒకరితో
ఒక్కటైనపుడు కూడా
ఒంటరితనం ఉండనే ఉంటుంది

2.రెండు శరీరాలు,
రెండు మనసుల కోరికేమిటో
రెండో ఎక్కం రానివాడు కూడా చెప్పగలడు

3.మూడుముళ్ల ముచ్చటలో కూడా
మూతిముడుచుక్కూచున్న రూపం
మాతృమూర్తై పోతుంది

4.నాలుగుచేతులే
నాలుగు వైపులా చేరి
నిన్నూ ,నన్నూ అక్కడిదాకా సాగనంపుతాయ్

5.అయిదొందలు
అప్పడగాడానికి
ఆత్మాభిమానాన్ని
అవతలోడికి అమ్మేయాల్సుంటుంది

6.ఆరు పువ్వులు
మూడు కాయలు కాస్తే
ఆదునికలోకం పొదుపు అంటుంది

7.ఎడడుగులూ
ఎవరితో
ఎప్పుడెయ్యాలనేది
ఎప్పుడో రాసేవుంటుంది

8.ఎనిమిది దిక్కులున్నా
నువ్వే మాకుదిక్కని కొలిచే నీ ప్రపంచం నీకుంది

9.తొమ్మిదో ఏట తీరని కోరిక
తొంబయ్యోయేటదాక తరుముకొచ్చి
ఆత్మను హత్యకు గురిచేసి
శరీరాన్ని సంపుకు తింటుంది
చచ్చేటప్పుడు చావమని

చంద్రశేఖర్ వేములపల్లి || భూమి బంధం ||


ఈ భూమి నీదే!
ఎవరూ ఆశించడం లేదు!
ఇక్కడ,
చెట్లపై నివసిస్తున్న ... ఆ పక్షులు,
చెరువుల కుంటల్లో ... ఆ చేపలు,
చిగురు పసికరి మేస్తున్న ... ఆ పసువులు,
నీ భూమిని ...
కుదువపెట్టము ... అన్నాయి!
నీ పొరుగు ఆసామికి, అవినీతి పరుడికి ...
అనుబంధం ... వారసత్వమే కానక్కర్లేదు!

2012, సెప్టెంబర్ 19, బుదవారం ఉదయం 9.10

నా సెలయేరు హృదయం .....22


బంగారం నిగ నిగలు
మట్టి ధరించిన ఉనికి ధగ ధగలే

సీతమ్మ నగలు
శ్రీరాముని ముత్యాలు ఉండే ఉంటాయి

భూమి నింపుకున్న కెంపులు
మనుషుల చేతులు మారాయి

ఈ మసక లోకానికి
నవరత్నాలు తమవే ననే భ్రమ పోదు
ఆనందుడా...!
ఒక్క గుంజెత్తు ఎవడైనా తీసుకెల్లాడా?

వంశీ // ది లాస్ట్ సప్పర్ //


వాసన్ ఫోన్,
సరుకొచ్చిందట, పదివేలు,
జేబులో పదివేళ్ళుంచి వొళ్ళువిరుస్తూ,
అనాఘ్రాణ పుష్పలావికా కేసర సంపర్క సంవర్తుడనై,
సంసృతం బూతుకి బట్టలేస్తూ,

"ఏంరా, అడ్వాన్స్ జనమ్ దిన్ ముబారక్.
మరేంలేదా రాత్రికి"
చేత్తో అత్యద్భుతంగా ఛండాలపు సంఙ్న సృష్టిస్తూ,
ఇరవైఏళ్ళుగా నా స్నేహితుడైన సన్నీ..

వాడి అర్ధవంతమైన అమాయకపు
ఆవేశపు ఆక్రోశం నన్నుకదిల్చి,
పైసలకు ఎవడిగొలుసమ్మాలో అని లెక్కలేస్తూ మేము,

వ్యర్ధాల్లోంచి వందలుపుట్టించే
వీర్యనిధులుండాల్సింది ప్రతూర్లో,
ఎంతదృష్టమో మగవ్యభిచారులది
సంపాదనా సంతోషమూ సమ్మిళితమై,
గొప్పోళ్ళ సమాజంలో వివాహేతరబంధాలూ ఖరీదే ,
లక్షాదికారినైదునీపాటికే,
దరిద్రుడా. దేవనాగరి మళ్ళీ వాడాల్సొస్తూ,
"పాణీ దా" విక్కీడోనర్ పాట ఫోన్ రింగ్ టోనై..
వాసన్గాడే, ధూల్ పేటకి రమ్మని,

అత్యంత అసహజపు నవ్వొకటి నా మీద విదిల్చి
మెళ్ళో గొలుసు తెంచుకుని
యమహా ని కిరాతకంగా హింసించి
ధూలి లేపి పేటకెళుతూ, మై బిలవ్డ్ ఫ్రెండ్
సన్నీ ఉరఫ్ సంధ్యావందనం సూర్యనారాయణ

చీకటితో పాటే చేరిన నా అసురసంధ్య,
మై వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్,
ఒక చేత్తో చిరపరిచితమైన గాజుసీసాడు రంగుద్రావకమూ
పపావరమ్ సోమ్నిఫెరమ్ వృక్షపు ఎండిన ఆకులు
ఏదో పక్షిజాతికి చెందిన వేయించిన కండరాలు,
మరో చేత్తో మేలిముసుగు ధరించిన పదివేలని
ఆబగా లెక్కిస్తూ అపరిచిత పరిచితుడు, అప్పటికే తూగుతూ,
ద్రావకపుసీసా శూన్యానిక్కారణం అర్ధమై..

అటకమీది శ్రీ శ్రీ కి మత్తుని పరిషేచించి స్వీకరించి
చాపకింది ఫ్రాయిడ్కి పత్రహరితపు దిష్టితీసి ధూపమేసి
ట్రాన్స్ సంగీతం కర్ణభేరి భేధించేట్టు పుట్టిన క్షణాన
తొలిగిన మేలిముసుగుకి విస్ఫోటించిన భూనభోంతరాళాలు..

జా..న..కి,
రెండేళ్లక్రితం నేనుప్రేమించిన ఓ అందం
అపుడు నన్ను దౌర్భాగ్యుణ్ణి చేసి,
ఇపుడు సంధ్యావందనానికి అర్ఘ్యమౌతూ,

సన్నగా కంపిస్తూ కాళ్ళు, వేళ్ళు నేలనాసరా అడుగుతూ,
సర్వనాడులూ ఒక్కసారిగా పన్జేయడం మాని కళ్ళు మసకలై,
ఎపుడో పారేసుకున్న నాతో, వాడు రమిస్తున్నట్టు..
ఆపరా, ర్, ర్ర్, ర్రేయ్, స్టాప్ దట్,
యూ సన్ ఆఫ్ ఎ %# ...
అయోమయంగా వాడు,
ఆశ్చర్యంగా జా..న..కి..
అనాఛ్చాదిత మూలాల్ని సహస్రబాహువుల్తో కప్పేసి
నన్ను గుర్తించే ప్రయత్నం చేస్తూ..

"రేయ్, ఎందుకాపమన్నవ్ బే,
పన్నెండు కానీకింకా పావుగంటుంది,
నువ్వింకా పుట్టలేరా నా కొడకా, పో, పో,"
తిరిగి తనకి నగ్నత్వాన్నాపాదిస్తూ
తీరని దాహం తీర్చుకోడానికి ద్రావకాన్నొంపుకుంటూ.. సూరిగాడు,

దిండుకింద నిద్రిస్తున్న భగవద్గీత
అకస్మాత్తుగా మేలుకుని నా చేతులతో వాడి మెడ విరిచి
పారవశ్యోద్రేకాల నడుమ సందిగ్ధావస్థలో అచేతనంగా తెగిన జంఝం
కళ్ళు తెరిచి నన్నలాగే చూస్తూ,
ఎవరికోసం ఏం చేసావో తెలుస్తుందా అనడుగుతూ

కాలాన్నిచుట్టిన నిశ్శబ్దంలోంచి
జానకి నన్నొదిలి పోయిందా,
నా ఉన్మాదానికి పారి పోయిందా,
రేయ్, సూరిగా, లేరా, పన్నెండైంద్రా..
నటించింది చాలు,
రేయ్, సంధ్యావందనం, నేన్రా, నీ..

కళ్ళు పగిలి రక్తం గడ్డం మీదుగా గొంతులో దిగుతూ,
గదిగోడలు కూలి శబ్ధించి అతిభయంకరమౌనాన్ని కూల్చి
నా పుట్టుక నాకే వినిపిస్తూ,
పైకప్పుకంటించిన డావిన్సీ లాస్ట్ సప్పర్
ఇవే నా ఆఖరి నూకలని సంకేతమందిస్తూ..

18.9.12

కెక్యూబ్ వర్మ ॥వాడు॥


వాడు నవ్వడు
జనం నవ్వును హరిస్తాడు...

వాడు ఏడ్వడు
జనమందరి ఏడుపును మీసం కప్పిన పెదవెనకాల చప్పరిస్తాడు...

వాడు కదలబారే ఓ వానపాములా కనిపించే అనకొండ....

వాడి గాజు కళ్ళ చాటున
ఓ మహా విస్ఫోటనం దాగుంది...

వాడు కోట్లాది ప్రజల
ఆకలి మంటల మూలవిరాట్టు....

వాడికొక్కటే కోరిక
ఈ గొంతులన్నిటిపై డేగ కాళ్ళను గుచ్చాలని....

వాడికొకటే ధ్యాస
ఇక్కడి అమ్మ పాలను సంతలో అమ్మేయాలని....

వాడికి వున్నదొకటే లేపన శక్తి
పడిపోయిన మార్కెట్ మాయా రేఖల పురోగమనం....

వాడి మొఖాన అంటిన బొగ్గు మసిని
అందరి జీవితాలపై మండించి ఆనందించే కౄర రక్కసి వాడు...

వాడొక నిశ్శభ్ద డ్రాక్యులా
జనం మూలుగులను నొప్పి తెలీకుండా పీల్చేసే జలగ సిరంజీవాడు....

వాడు అమ్మ గర్భంలో దాగిన పిండాన్ని
నోట కరచుకు పోయే తోడేళ్ళ గుంపు నాయకుడు

వాడు రణస్థలం నుండి కూడంకుళం దాకా అణు విస్ఫోటణం
చేయ చూస్తున్న రాకాసి డేగ ముక్కున వేలాడే శవం....

వాడొక ప్రేతాత్మ
వాడి అంత్యక్రియలనాడే ఈ దేశానికి కళ్యాణం....
(తే19-09-2012)

జగద్ధాత్రి ||విచిత్రం ||


నా తెల్లని హృదయ కాన్వాసు పై
నీ భావనల రంగులన్నీ ఒకేసారి చిమ్మావు
నీ కోప తాపాల, ఉద్వేగాల, ఉద్విగ్నతల
ఆశ నిరాశల, అస నిపాతల, అహంకారాల
నీ వేదనల, శోధనల , అంతర్యపు వర్ణాలెన్నో
అన్నిటినీ ఒకేసారి దోసిలి నిండా తీసుకుని
ఒక్కసారిగా విసిరేవు ...
అన్ని ఛాయలు కలగలిసిన నీ హృదయాన్ని
అదాటుగా ఆవిష్కరించేవు
నీలోని అన్ని రంగులను ఒకేసారి చూసిన నా మది
నిశ్చేష్ట అయి పోయింది

చిత్రమైన నీ భావాల వైచిత్రికి
నా హృది మూగబోయింది
సప్త వర్ణాలు కలగలిసిన విన్నూత్న వర్ణమేదో
గజిబిజి గా నన్ను కంగారు పెట్టింది

ధవళ వర్ణం తప్ప ఎరుగని నా ఎద
ఇన్ని రంగుల కల బోతకు బిత్తరపోయింది
నీవు విసిరిన పలు రంగులను కన్నీటితో కడిగి చూసుకున్నాను
నీ వలపు వర్ణం ఉందా లేదా అని

సప్త వర్ణాల కలబోత
నీ భావాల కుంచెలోంచి
స్పష్టా స్పష్ట కలనేత నీ చిత్రాల చిత్రం
నీ హృదిని ఆవిష్కరించింది

అన్ని వర్ణాలలోనూ
నా కనులకు , మనసుకు
స్పష్టంగా అగుపించింది
నీ అనురాగ రంజిత సువర్ణం
ఈ లోక పు కుడ్యం పై ఎప్పటికీ
వన్నె తరగని ప్రేమ తైల వర్ణ చిత్రం

ప్రియతమా! బహు చిత్రమైన చిత్రకారుడివి నీవు
అంతరంగాన్ని అన్ని రంగుల మిశ్రమం లోనూ
మమతల మధురిమను దర్శింప జేశావు
మాటల్లో చెప్పవు కానీ నీ చిత్రాలలో
పటం కట్టుకున్నది మాత్రం ప్రేమానురాగాలేనని
అవగతమైంది నాకు ....ఇప్పుడు నీ చిత్రాలు
చిత్రం కావు నాకు ... నవీన రీతులలో తీరిన
నీ ఊహల , ఆశల ,ఆంతర్య అద్వితీయ హర్మ్యాలు !!!

........................................................................ప్రేమతో జగతి 6.09am .18th Sept Tuesday 2012

చింతం ప్రవీణ్ | | మొఖం లేనోడు||


వాడికీ
హృదయముంటుంది
దానికి స్పందన ఉండదు
అది స్పర్శించదు_

వాడెప్పుడూ
అవసరాల అక్కసుల నడుమ
అనుబందాల సాలెగూడు అల్లుతుంటడు

అప్పుడప్పుడు_
వాడి మాట వినపడుతుంది
వాని చేతలు కనపడుతాయ్
కనిపించనిదల్లా
వాని మొఖమే

నిజానికి
వాడెప్పుడో కాటకల్సిండు
మంచితనం నుండి
మనిషితనం నుండి

వాడెప్పుడూ
కారణాలు వెతుకుతుంటడు
ద్వేషించటానికి_
ఊరు వాణ్ణి ప్రేమించటానికి లాగా_

గడిచిన ప్రతీ నిమిషం
పలికిన ప్రతీ మాట
ఎదురుతిరిగి ప్రశ్నిస్తున్నా_

నడిచిన ప్రతీ దారి
విడిచిన ప్రతీ అడుగు
రెప్పపాటు దూరంలో వెంబడిస్తున్నా_

కాంక్రీట్ పై చరిస్తున్నవాడు
హృదయాన్ని కాంక్రీట్ లాగా మార్చుకుంటడు
నాగరికత నీళ్ళు తాగి బండబారిపోతాడు

ఊరిడ్సిన వాడు
ఊరును విడిచేస్తడు

(ఊరుతొ పాటు ఊరుపై మమకారాన్ని వదిలేసినోళ్ళ కోసం)

18.09.2012

క్రాంతి శ్రినివాసరావు || చీకటి దీపం ||


ఆకాశం చీకటి దీపం ముట్టించి
వెలుగును వెళ్ళగొట్టేదాకా
వేయుకళ్ళతో వేచిచూసి

వంటినిండా
కప్పుకున్న
సిగ్గును బిడియాన్ని
కొద్ది కొద్దిగా
వొలుచుకొంటూ

చీకటి పరదాలను
చుట్టూతా కట్టుకొని
చెవులను కాపలాగా పెట్టి
శబ్దాల దూరాలను
కొలుచుకొంటూ

తొట్టి పక్క బండపై
తొట్రుపాటుతో కూర్చొని
చప్పుడు దగ్గరయునప్పుడల్లా
చప్పున చీరను
వంటినిండా పోసుకొంటూ

భయం భయం గా
నీరును చీరను
మార్చి మార్చిచల్లుకొంటూ

దేవుళ్ళకు మొక్కుకొంటూ
దేహాన్ని తడుపుకొనే తల్లులు
దేశం నిండా వున్నారు

ద్యానం లా చెయ్యాల్సిన స్నానం
మానం కాపాడుకొంటూ ముగిస్తున్నారు

కాస్తంత చాటును ఇవ్వలేం కానీ
ఆకాశం లో సగం చోటిస్తామంటాం

కర్లపాలెం హనుమంత రావు॥కొన్ని ఆలోచనా శకలాలు॥


1
ఈ చినుకు
ఏ సముద్ర
ఆనందబాష్పమో!

2
ఎవరన్నారు
కాలం గుప్పిట్లో చిక్కదని?
నాన్న ఫొటో!

3
కుట్టకుండా వదిలేసింది
గండు చీమ
ఎంత విశాల హృదయమో!

4
కంటికీ చేతులుంటే
ఎంత బాగుణ్ణో
కదా ఊహాప్రేయసీ!

5
ఎక్కినా
దిగినా
అవే మెట్లు

6
నలుపు తెలుపుల్లో
ఎన్ని రంగులో
పాత మిత్రుల గ్రూప్ ఫోటో!

7
మాయాలోక విహారం
పుస్తకం
కీలుగుర్రం

8
కోయిల కూస్తోంది
మావి చిగురు
మిగిలుందని!

9
మింటి మీదా
వంటి మీదా అర్థచంద్రులు
రాత్రి సార్థకం

10
తట్టి
తడిపింది
హైకూ

11
ఫొటోలోని బాబుకి తెలుసా
తనలాంటితనే తనను చూస్తాడని
నా పాతఫోటొ మాబాబు చేతుల్లో!

నరేష్ కుమార్ //దేశభక్తి//


దేశభక్తి కీ
కొలమానముందిప్పుడు
పాకిస్తానోన్ని
తెగ తిట్టెయ్యి
పాక్ ఆక్రమిత
కాశ్మీర్ ని
దేశపటపు
కాగితంపై
ముద్రించుకొని
నిన్ను నువ్వె
వంచించుకో

అంగట్లో
మన తాతలు రత్నాలమ్మారుగా
నీమూతి
నేతి వాసన
కంపు
పీల్చుకొని
సంబరాలు చేసుకో

బోఫోర్సుల
దగ్గర నుండీ
బొగ్గు కుప్పలదాకా.....
కరెన్సీ కాగితాలకు
నల్ల రంగుపూసి
తెల్లోడి
గూట్లో దాచేసుకున్నాక
అవినీతి
జాగిలపు వాలానికి
దారాలుకట్టే వాడే
మన నాయకుడిప్పుడు

దేశభక్తి
సంవత్సరానికి
రెండురోజుల
రేషన్లోకి
కుదించ బడింది

తెగిపోయిన
సైనికుడి
మొండాలను దాచే
శవపేటికల్లో కుడా
డబ్బుని
పుట్టించుకున్న
నిక్రుష్టపు
పుత్రులున్నారిక్కడ

చచ్చిన
నీ శరీరం
నీకె
కంపు కొట్టక ముందే
కాస్త ఓ గొయ్యి తవ్వుకో....
ఏంటీ....!?
వల్లకాడు
పైన
మంత్రి గాడెవడో
విల్లా కట్టాడా....?
ఆమాట
గట్టిగా అరవకు
రాజద్రొహ చట్టపు
ఉరితాడు వింటే
నీశవాన్ని
మళ్ళీ ఉరితీస్తుంది
తప్పించుకునేందుకు
నువ్వు కనీసం
పట్టుబడ్డ
టెర్రరిస్టువి
కూడాకాదు.....19/09/12

బెడిదె నరేందర్ || రాళ్ళు


గుళ్ళో దేవుడు
గుడి చుట్టూ బిచ్చగాళ్ళు
భక్తులే రాళ్ళు

చెట్టు కాయని
దాచుకోదు
ఎందుకీ రాళ్ళు

పిచ్చోడు
యేరుకోని రాళ్ళు
మంచోళ్ళ దేవుళ్ళు

తాజ్ మహల్ రాళ్ళు
మర్చిపోలేదు చరిత్రలా
కూలీల పేర్లు

వైట్ హౌస్
గోడల్లో రాళ్ళు
గుండెల్లో రాళ్ళు

రాళ్ళు విసిరే
వాళ్ళూ
ఇంకొకరి చేతిలో రాళ్ళే

అసెంబ్లీలో
మైకులు
మాజీ రాళ్ళు

దొరలకు
కొండలు గుట్టలు
తవ్వేవాడికి నాలుగు రాళ్ళు

నాలుగువేల కులాలు
నాలుగైదు మతాలు
అనేక రాళ్ళు

వజ్రం రాయే
రాళ్ళు పనికిరావు
అది రాజేసే యుధ్ధాల్లో

రాళ్ళు స్త్రీలవొచ్చు
మంటల్లో దూకొచ్చు
రాళ్ళు దేవుళ్ళైతే

తలంబ్రాలు విధవరాళ్ళు
మధ్యలో కాపురాలు
తలొంచుకుంటే యెన్ని రాళ్ళు

20/9/2012

మోహన్ రుషి // ఔర్ ఏక్ నక్క! //


గీ ఎక్కిరిచ్చుడు ఇయ్యాల్టిది కాదు
నీతోటే అయిపొయ్యేటిదీ కాదు!

ఎవసాయం తెల్వనోళ్ళై
భాష రానోళ్ళై
బఫూన్లయ్యీ, బక్రా రౌడీలయ్యీ...
ఒకటా, రెండా..?!
నీ బట్టెబాజ్ తనం ల ఏం కాకుండ మిగిల్నం?!

గిప్పుడు కొత్తగ అయ్యిందేం లేదు
నీ జాతిల నువ్వు ఇంకోసారి విలీనమై
ఇర్గబడి నవ్వినవు తప్ప ఇంకొకటి కాదు!

లేని సెజ్జులు తేబడ్తివి
సూడని ఫ్లై ఓవర్లు కట్టబడ్తివి
స్వర్ణమంటివి, హరితమంటివి...
రాష్ట్రమంటె ఇదేనంటివి-
ఎన్నడు లేంది కొత్తగ అధికారిక ఉత్సవాలు ఎందుకని
గా గలీజ్ నోరుతోనె వొర్లబడ్తివి!

ఆరోవేలు సంగతి విన్నం
ఆత్మగౌరవ కథలు చూసినం
మొఖాలు ఎక్కడ పెట్టుకోవల్నో తెల్వక కెర్లినం
పచ్చెలు బాసిన ప్రజాస్వామ్యం సాక్షిగ
ఇప్పుడు బాజాప్త ఒక్కమాట-
యుద్ధం షురువైనంక
బాయిల దుంకుడు కాదు,
నువ్వు గా బంగాళాఖాతం లనే మునగాల్సొస్తది!

20.9.12

కర్లపాలెం హనుమంత రావు॥థింక్ ట్వైస్ బిఫోర్ యూ సింక్॥


1
రోమియోకి రోడ్ మ్యాపు లేదు
జ్యూలియట్ హృదయాన్ని చేరడానికి
కొట్టినపిండనుకున్న పారూ మనసుకి
దారెటో తెలీక దేవదాసు తడబడ్డాడు
ప్రేమయనగా రొండు హృదయములు ఒకే పన్ థాన నడుచుట
ము.వెం.ర కథలో హిందీ చిత్ర దుబాసీ అనువాదం
ఆ పన్ థా ఏమిటొ అంతుబట్టకే కదా ఇంత కథా!
2
ఈ రాణీ ప్రేమ పురాణం ఇది కాదోయ్ చరిత్ర సారం
ఓకేనండీ మహాకవి శ్రీ శ్రీ గారూ
మరి క్లియోపాట్రా కొటేరుముక్కు నెక్కడ పాతేస్తారూ!
సమాధికైనా బెదరని అమరప్రేమ కదరా అనార్కలిది
సమాసాలు తింటూ తాగే మొగలయీ చాయా అది!
తాజ్ మహల్ తాజాదనం రహస్యమంతా
ముంతాజ్ మేలిముసుగు అనురాగంలోనే ఉంది
భాగ్యమో అభాగ్యమో
భాగమతీమోహంలో పడి మతంటూ పోయాక
కులీ బాదుషా కానీ కూలీ పుల్లయ్యే కానీ
అందరిదీ ఒకే మాదిరి హమ్ దర్ద్ లేరా జానీ
జయదేవుడి వనమాలి జానకి స్వయంవర మాలిక
కలువుల కొలువులు, కడలుల అలజడులు
సమయం దొరికిన కవులల్లిన సుందర కవిసమయాలు


ఆరు పదులు ఈదిన అనుభవంతో చెబుతున్నా
వలపంటే వడ్డూ లోతూ తెలియని ఓ గడ్డు అగాథంరా తండ్రీ!
యథాతథానికి అదొక ఆతిశయాలంకారం
పరమపథ సోపానపటంలో పాము పక్క నిచ్చెన మీదారోహణం
అందితే చింత
అందనంత కాలమే గుప్పెట్లో వింత
బైటపడే దారి లేని పద్మవ్యూహంరా అభిమన్యూ
మయసభామధ్యంలో అభిమాన సుయోధనుని
అయోమయం అంతకన్న సుఖం
దేహాత్మల మొత్తాన్ని
ఒక సందేహాల డోలికగా మార్చే మంత్రగత్తె కదారా కాదల్!
ఆదిలోనే పడిందా హంసపాదు
అదృష్టవంతుడివి
హింస తప్పిందని వెంకయ్యకు ఓ టెంకాయ కొట్టూరుకో!

4
ఇంత చెప్పినా
కాదు..పిల్ల గాలి తగిలిందంటావా
హతోస్మి…
గాండ్రించే పులివి
ఇహ తలపుల తలుపుల దగ్గరే తచ్చాడే కాలుగాలిన పిల్లివి
పాస్ వర్డ్ మర్చిన సాఫ్ట్ వేర్ ఎనలిస్టువి
ఏక్సెస్ డినైడ్-విండో కనపడ్డా సాండోలానే ఉండాలి మరి!
సిస్టం క్రాషయినా నో ప్రాబ్లం అనుకుంటే ఓకే ..నీ ఇష్టం
'లౌ'ప్రోగ్రామ్ లోకి లాగిన్ ఐపో మరి
నీ ఆఠీన్ రాణీని ఎలౌ చేసేయి..hurry
కాఠిన్యమో..కారుణ్యమో రన్ చేస్తేనే గదా ఫేట్ తెలిసేది!
ఆఖరుగా ఒక మాట
అపరిచితం టు సుపరిచితం రూటు పూలదారి కాదు
రోదసీ వ్యోమగామి కొత్త గ్రహం కక్ష్య కుదుపు అదుపు
ఇంతకన్నా కొన్ని కోట్లలక్షల రెట్లు సులువు
కిక్ కోసమే ఈ బొకే ఎఫైర్ అంటావా
థింక్ ట్వైస్..బిఫోర్ యు సింక్ ఇన్ ది లవ్ బకెట్ !
గుడ్ లక్!

వంశీ // సగం మిగిలిన సంభాషణ //


ఆపావేం
అనుభవాల అసంపూర్ణ పార్శ్వాల ఖాళీల్ని
మర్చిపోయిన ఙ్నాపకాలతోనో
మరలిరాని కాలంతోనో పూరించు,
ఓపికకీ కోపమొచ్చి ఇన్నాళ్ళ నిరీక్షణకి...
వినిపిస్తుందా
కన్ను జారనీని నీలం కనిపిస్తుందా.

పెరుగుతున్న వయసుని వీపున మోస్తూ
పారుతున్న వేదనల్ని ఒంటరై దాస్తూ
నిన్నింకా అన్వేషిస్తూ
చిన్నప్పటి దొంగా పోలీస్ ఆటలాగా,

నీతో మాట్లాడుతుంటే
అమ్మ కడుపులో ఊయలూగినట్టనిపిస్తూ
నమ్మవా
పోల్చడానికి అమ్మ తప్ప వేరే దేవత తెలీదే,
నవ్వావా
ఎక్కడో తెగిన నిమిషాలు అతుక్కుంటున్నాయ్,
అర్ధంకాలేదా
నన్ను కవిత్వీకరించుకోవడం తప్ప సంభాషించడం రాదే,
మెదడ్లో ఊరే మాటల్తో మాలేయాలనుకుంటే
నీకు నచ్చని మౌనాన్ని తర్జుమా చేయలేని
నిస్సహాయతలో నేనే మునుగుతూ,
నొచ్చుకోకు నొప్పి నాకు తెలుస్తుంది
తట్టుకో నా అఙ్నానాన్ని కాసేపు..

నిన్ను వర్షాన తడపాలని
నేనేడ్చి కురిపించిన నా కన్నీటి కోసమో,
వందేళ్ళకోసారి నేలరాలే ఉల్కని పట్టి
నీ గదికి వేలాడదీసిన పిచ్చితనంకోసమో
నీ మాటలు వినాలనుకోవడం లేదు,
అంతా నువ్వే కనిపించే నా గతానికోసారి
ప్రయాణించి నన్ను నాతో పోల్చుకుని
కొన్ని అపరిపక్వ ఫలాల్నీ, అనాఛ్చాదిత మూలాల్నీ
నాలోకి పిలుచుకుని
ఓడిన ఆటల్ని, తోడవని బాటల్ని
వీడిన చోటుల్ని నీడైన శూన్యాన్ని
ఒక్కసారి పలకరించి కలవరించడానికి
ఒక్క మారైనా ఒక్క మాటైనా
పలవరించవూ..

సంశయమా
తెంచుకోలేని బంధాల్లో చిక్కుకున్నామని
తెరుచుకోని ద్వారాల ఆవల చీకటుందేమో అని,
సాధ్యమా
తనువు ఆత్మ వేరై బ్రతకడం
స్థాణువై ఆలోచనల పరుగాపి నడవడం..

ఎవరూ లేని ఏకాంతంలో
సూక్ష్మ ప్రపంచాన గమించి హృదిభ్రమించి పరిభ్రమిస్తుంటా,
నేనే పరీక్షలు దాటేదాకా,
నీతో సగం మిగిలిన సంభాషణ కొనసాగేదాకా..

20.9.12

బాటసారి ** ఏమండోయ్ శ్రీవారు**


ఏమండోయ్ శ్రీవారు
మాపటి వేళకు కొంచం తొందరగా రారు
మాట ఇచ్చి ఇది మూడోసారి
ఏవో కుంటిసాకుతూ వాయిదా వేస్తున్నారు ప్రతీసారి

నా కోసం కాకున్నా
కనీసం మీ గారాల పట్టికోసమైనా !
నాన్న ఆచ్చి అని అది పదే పదే అడుగుతుంటే
వీది గుమ్మం కేసి చూసి నా కళ్ళు అలసి పోతుంటే

ప్రేమగా అడిగితే సారి టైం లేదంటారు
కొంచం అలిగితే కసిరి కొడతారు
వీకెండ్ మీ పార్టీలకు మాత్రం మిస్ కారు
నాలుగు గోడల మధ్య ప్రపంచాన్ని ఎంతకాలం చూడమంటారు

మీ కోరిక కాదనలేక
పిల్లలంటే ఇష్టమన్న ఆ ఒక్కమాటకు అడ్డు చెప్పక
ఉద్యోగం చెయ్యాలనే ఆశ పక్కకు నెట్టి
మీ భార్యగా, బిడ్డకు తల్లిగా జీతంలేని ఇల్లాలినయ్యాను

నాకు నచ్చిన ప్రపంచాన్ని
మీ కళ్ళలో చూస్తూ , అదే అంతా అనుకుంటూ
సహనాన్ని నవ్వుగా చేసి ,
మీ అసహనాన్ని నా కన్నిటిగా మార్చి

ఎదురు చూస్తున్నా ఆశల వాకిట
మా చిన్ని కోరికలు ఉంచాం మీ ముంగిట
పసిదాని కళ్ళల్లో ఆనందాన్ని , మీ నవ్వులో చూడాలనే
ఆశతోనే శ్రీవారు , ఇప్పటికైనా అర్థంచేసుకోరు ...! 20-09-12

రావి రంగారావు ( గుండె రాయి )


పొలం గట్టు గుండె
ఎలా కొట్టుకుంటుందో తెలుసా...
కన్న నేలను
ముక్కలుముక్కలుగా విడగొట్టుకుంటున్నానని !

కుండ గుండె
ఎలా కొట్టుకుంటుందో తెలుసా...
జీవన మృత్యు సారం సారాను
ఒళ్ళంతా నింపుకోవాల్సివస్తుందని...

కుండీ గుండె
ఎలా కొట్టుకుంటుందో తెలుసా...
పంటలు పండించలేని పచ్చదనాన్ని
నెత్తిలో దించుకొని మోయాల్సివస్తుందని...

తుపాకీ గుండు గుండె
ఎలా కొట్టుకుంటుందో తెలుసా...
ఎప్పుడు ఏ అమాయకుడి దేహవనంలో
మత్తగజంలా పడి ధ్వంసం చేయాల్సొస్తుందని...

“జెండా” సీత గుండె
ఎలా కొట్టుకుంటుందో తెలుసా...
ఎపుడు ఏ వేషంలో వచ్చి
ఏ రావణ హస్తం తనను అవిష్కరిస్తుందని...

ప్రపంచాని కంతా గుండె కొట్టుకుంటోంది-
“గుండె” ఉన్న ఈ మనిషికి తప్ప !

‎"నీ" ||"చూపునా,హ్రుదయాన్నా..???||

"నను చేరగానే...
పెదాలపై పూసిన నవ్వుల్ని
ముని పంటితో నొక్కి పడుతుంది..!

నే చూడగానే నాపై
వాలీవాలని చూపుల్ని తడుముకుంటుంది"

ప్రియా...

నానుంచి వెళుతూ వెనుతిరిగి
నువ్వొదిలేసింది వీడ్కోలుచూపునా
"నీ" హృదయాన్నా...?

నువ్వు మొహం చాటేస్తే
ప్రకృతి ప్రతి అణువులో
నీ ప్రతిరూపం కనపడదా !

మూతిముడుచుకుంటే...
అప్రయత్నంగా నైనా
పెదాలతో ముచ్చట ప్రారంభమవదా !

పెదాలు విప్పకపోతే
కనుపాప మాట్లాడక పొదా !
చూపుల్ని తిప్పుకుంటే....

"సరా సరి హృదయ సంభాషనే
మొదలవుతుంది కదా " !

................... "నీ"

ప్రేయసికి వీడ్కోలు

ఇదే నీకు నా వీడ్కోలు
నీకేమి కాను నేను

వేసవిలో వికసిస్తుంది క్లే కుసుమం
హేమంతం లో పడుతుంది చల్లని మంచు
మళ్లీ అప్పుడు వస్తాను నేను

మనం అక్కడకి వెళ్ళాం ఎన్నో సార్లు
ఆ విషయాన్ని గుర్తుంచుకున్నాయి
అక్కడి పర్వతాలు లోయలు

నీ అందమే నన్ను
ఎన్నో ఆశలతో దింపింది
ప్రేమలోకి

ఏ పొద దగ్గరైతే మనం ఎన్నో సార్లు కూర్చున్నామో
అక్కడి సెలయేరు తన ప్రవాహ వీణ పై
గానం చేస్తోంది మన కలయికని

ఎంతో అభిమానంతో మనం
ఎదలో ఎద పొదుగుకున్నాం
అది మర్చిపోయావా నువ్వు?!?

ఈ లోకంలో
అమ్మాయిలు, డబ్బు
ఇలాగే తమ ప్రియుల్ని
కాలదన్నుకుంటారు

20-9-2012

జర్మన్ మూలం: తెలియదు (Anonymous)
అనువాదం: డా. వారణాసి రామబ్రహ్మం

కాంటేకార్ శ్రీకాంత్ // ఇప్పుడు //

ఇప్పుడు
కన్నీళ్లలో ఉప్పదనం తగ్గిపోయింది
ప్రేమలో చిక్కదనం తగ్గిపోయింది
బంధాలలో గట్టిదనం తగ్గిపోయింది
వ్యవస్థలో గొప్పదనం తగ్గిపోయింది
చివరాఖరుకు.. మానవత్వానికి విలువ తగ్గిపోయింది

అందుకే ఈ ఇప్పుడు నాకు అనవసరం
అసంగతి, నచ్చని వ్యవహారం

olden days are golden days
అవును, పాత రోజులు, పాత మనుషులు,
పాత కాలం.. అవే ఆ పాత మధురాలు
గడిచిన స్మృతి అంతా గొప్పదిగా నిలిచిపోతుంది
ఆ రోజుల్లో అని చెప్పుకుంటే
గొప్ప భావాలు పొంగుకొస్తున్నాయి
నడుస్తున్న కాలం తన విలువను కోల్పోయి
నిస్సారంగా మారుతోంది
ఈ రోజుల గురించి మాట్లాడటానికి మనసొప్పడం లేదు
మాటలూ రావడం లేదు

ఎందుకు,
తోటి మనిషిని చూసి
ఆత్మీయంగా పలకరించి
కొన్ని ఊసులాడేందుకు నీకు సమయం లేదు
కాంక్రీట్ జంగల్లో.. మహా విశాలమైన అపార్ట్ మెంట్లలో
నీదొక ఇరుకు బతుకు
ఇరుగుపొరుగు సంబంధం లేని బతుకు
పక్క ఇంటి కష్టనష్టాలు, సుఖదుఃఖాలు
నీ చెవికి సొకవు.. నీకు ఆసక్తి రేపవు
నీ పొరుగువారితో ముఖ పరిచయమూ ఉండదు
ఈ జనారణ్యంలో తెలిసిన ముఖాలే కనిపించవు
సాయం చేయాలన్నా తలంపూ రాదు
వచ్చినా అందరూ పరాయివాళ్లే..
నీకు చేతులు రాని పరిస్థితి
నువ్వు నాకు ఎంత దూరమో..నేను నీకు అంతేదూరం
కనుక నీకు-నాకు ఎప్పుడు పొత్తే కుదరదు
మాట కలవదు.. ముచ్చటకు సమయం దొరకదు
పక్కపక్కనే ఉన్నా రైలు పట్టాలలాగా ఎప్పుడూ కలవకుండా
జీవన ప్రవాహంలో కొట్టుకుపోతాం
ఎంత విచిత్రం, నిత్యం కిటకిటలాడుతూ
కాలు పెట్టడానికి సందు దొరికని మహా నగరంలో
మనుషుల మధ్య ఎంతో దూరం

ఇక ప్రస్తుత విలువలు, మానవతా దృక్పథం, రాజకీయాల గురించి
తక్కువే మాట్లాడుకోవాలి మిత్రమా
బురదలో రాయి వేయడం వల్ల మనకూ అడుసు అంటకపోదు
ఈ వ్యవస్థతో రాసుకుపూసుకు తిరుగుతున్నవారమే కదా
ప్రస్తుతం ప్రబలుతున్న అనాగరిక, ఆధునిక బతుకులో
మనకు లేశమాత్రమైనా పాత్ర ఉంది కదా
కనుక ఈ ఇప్పుడు గురించి నేనేమీ చెప్పలేను
నిన్నమొన్నటి.. ఆ పాత రోజుల గురించి అడుగు
నా కవిత్వం, నా భావాలు వెల్లువెత్తుతాయి.. కీర్తిస్తాయి

క్రాంతి శ్రీనివాసరావు || సిరాపాల అమ్మ ||

నిన్నటి దాకా నాన్ననే నేను- -
ఈమధ్య అమ్మను కూడా అయ్యాను

ఎత్తుల్లోకి లోతుల్లోకి
మూలల్లోకి మూలాల్లోకి
తొలుచుకు పోయున చూపులు
వొలుచుకు వచ్చిన పచ్చినిజాలతో

బాల్యం లోకి
భవిశ్యత్తులోకి
బతుకు చక్రం లోకి
వెలుగు దివ్వెల్లోకి
కలుగు చీకట్లోకి
కటికి దారిద్యం లోకి
కలుపు మొక్కల్లోకి
గెలుపు చుక్కల్లోకి
తలపు తలుపులు తెరిచి

రమించి కట్టిన మాటలు
మెదడు కడుపులో మోసి
ప్రసవ వేదనల రోదనలతో
పురుటించి
నెల తక్కువయునా
నలుపెక్కువయునా
సిరా పాలుపట్టి
శిరసును ముద్దాడి
తల్లి తనపు తన్మయత్వంతో తరించి
చెమ్మగిల్లిన కన్నులతో అమ్మనయ్యాను
మాటలు నేర్చిన బిడ్డలను కంటూ
మురిసిపోతూనేవున్నాను

పిల్లల కోడి కెందుకంత పౌరుషమో
పామెందుకు ఆకలితో మండిపోతుందో
జగత్తులో తల్లు లెందుకంతగా
తల్లడిల్లుతారో తెలిసిందిప్పుడు
అమ్మా నీకో వందనం

మెర్సి మార్గరెట్ ll నిద్ర లేపే వారు వస్తారా ? ll

ఆలోచన మంచంపై
లక్ష్యం ముడుచుకొని
పడుకుంది
కళ్లు మూతలు పడి
నిద్రలోకి జారుకొని
ఎన్ని రోజులయ్యిందో ?

ఆ మంచం ఏమని బుజ్జగిస్తుందో
ఏ ఏ కధల్ని , కలల్ని
తన కళ్ళలోకి జోప్పిస్తూ
తనని తానూ మర్చి పోయేలా
చేస్తుందో ?

తను పుట్టింది మొదలు
కాళ్ళు నడవడం నేర్చుకున్నప్పుడు
వద్దన్నా వినకుండా పరుగెత్తి
పడుతూ లేస్తూ
విజయాన్నే ఏడ్పించేది
ఒకప్పుడు ..
పరుగెత్తడం మొదలుపెడితే
ఎన్నో సార్లు మాటే వినలేదు
విజయాన్ని ముద్దాడే వరకు

మరి ఇప్పుడు
ఏమయ్యిందో
నిద్రావస్తాలోకి వెళ్లిందంటే
మెలకువకొచ్చే స్థితే కనిపించట్లేదు

ఆ మధ్య
ఎవరో ప్రేమ దెబ్బ కొట్టారట
అప్పట్నుంచి ఇంతే
ఇక ఇప్పుడైనా మేల్కొనక పోతే
లెక్కలోంచే తీసేసాలా ఉంది'
లోకం ..

చూడు
కన్నీళ్లు పెట్టుకుంటుంది విజయం
ఎలా చేస్తుందో చూడు
ఓటమి తనని అపహాస్యం
ఇకనైనా దాన్ని నిద్ర లేపే వారు
వస్తారా ?
వస్తారనే చిన్న ఆశని రెట్టింపు చేసుకుంటూ
అయోమయంలో ప్రశ్నార్ధకంగా
మిగిలిన- "నేను "
---------------(19/9/2012)---

అఫ్సర్ ||An Empty Episode-5 :రెండు అరచేతులూ వొక వరదగుడి ||


అయిదో సన్నివేశం: ఏదో వొక వాన ఎక్కడిదో వొక వాన ఎప్పటిదో వొక వాన ఎందుకో వొకందుకు కురవనీ, నువ్వొక చిన్ని ఆకువై, తడి నేలవై, తేమ గాలివై మిగిలేలా! సందర్భాలు ఎప్పుడూ రావు. సన్నివేశాలు ఎప్పుడూ కురవ్వు. నువ్వే వొక సందర్భమైపో..నువ్వే వొక సన్నివేశమై కురిసిపో. దుఃఖపు ఆఖరి అంకంలో నువ్వొక నవ్వుని మెరిపించి వెళ్లిపో.

1

నా ఎడమ చెయ్యి నీ కుడి చేతిలోకో
నీ కుడి చెయ్యి నా ఎడమ చేతిలోకో ప్రవహిస్తున్నప్పుడు
ఆ రెండుచేతుల వొకే స్పర్శ మీద
నాలుగు వాన చినుకులూ వొక నీరెండా సంగమిస్తాయి.

వాటి అరచేతుల మీద వొక వరద గుడి
వాటి వేలి కొసల మీద సీతాకోకల అలసట లేని సంచారం.

ఆ ఏడు రంగులూ అలానే వుండనీ కలిసీ కలవక.
ఆ నాలుగు చినుకులూ ఆ నీరెండా అలానే వుండనీ కరిగీ కరగక.

2

నిజానికి ఎవరు ఎవరిలోకీ కరిగిపోం
ఎవరిలోపల వాళ్ళే వుండిపోతాం
వొక్కటయ్యే కలని శాశ్వతంగా మోస్తూ.

అనేకాటల పాటల సంభాషణల కలివిడి రాగంలో
నువ్వు నువ్వే, నేను నేనే.
నువ్వు నాలోకీ, నేను నీలోకీ ప్రవహిస్తున్నప్పుడు కూడా
నేను నేనే, నువ్వు నువ్వే.

నేను నీలోకీ, నువ్వు నాలోకీ వొరిగిపోనీ,
ఆ రెండీటినీ చెరపకుండానే
మనిద్దరి నీడలూ చెరగకుండానే.

3

దుఃఖాన్ని ఎటూ దిగమింగుకోలేనప్పుడు చుక్కలా రాలిపడుతుంది వాన. ఇక ఆ తరవాత నీలోపలి ఎడారిని పీల్చి తనలోపలికి ఇంకించుకుంటుంది ఆ వాన చుక్క. మన రెండు అరచేతులు గట్టిగా వొక దాన్ని ఇంకోటి అదుముకుంటాయి కచ్చితంగా రెండు శరీరాల్లా- వాటి మధ్య ఇక వొక సముద్రం కూడా ఇరుకయిపోతుంది. గాలి గిరికీలు కొట్టుకుంటూ వెళ్ళి ఆకాశాన్ని కిందికి దిగి రమ్మని సతాయించేస్తుంది. ఆహా...ఇంకేం కావాలి? ఈ సముద్రానికీ, ఆ ఆకాశానికీ మధ్య వొక గీత గీస్తూ రివ్వున దూసుకుపోతాయి పక్షులు కొన్ని, నీరెండ స్నానానికి రెక్కల్ని దువ్వుకుంటూ.

4

ఈ రెండు దేహాల మధ్య వాంఛ లేదని కాదు,
మరీ ఈ వాన
ఏక వానగా పడుతున్నప్పుడు
నీటి దుప్పటి కింద రెండు అలల సంభాషణ అందంగానే వుంటుంది.
ఏ ఆచ్ఛాదనలూ లేని నగ్న భాష వినాలనే వుంటుంది.

5

కానీ
అంతకు మించి ఇంకేదో ఇద్దరి మధ్యా!

చంద్రశేఖర్ వేములపల్లి || శీలం లేని రాజకీయం ||


అథిదిలా వచ్చావు
రా దొరా అన్నా! ... మాలో ఒకడ్నన్నావు
ప్రేమిస్తున్నా అన్నావు
మాతో కలిసి గంజి తాగుతా ... అన్నావు
గతం అణిగిపోయున్న అభిమానాన్ని కోపాన్ని అణిచేసా ...
మా దొడ్డదొరనుకున్నా!

పక్క వీదిలో కెళ్ళావు
జాతి బేదం ఉపన్యాసాలు ... నీ రంగు చూసా
నీ కడుపులో ఉందేదో అర్ధం అయ్యింది
నీ ప్రేమ నాటకం
నా గుడిసెలో తాగి పక్కవీదిలో కక్కేసిన గంజి
నీ స్నేహం ... ఎలా నమ్మమంటావు దొరా!

బెడిదె నరేందర్ || నడిచే బాంబు


నీ కోసం
యేడు సముద్రాలు రోజూ యీది
సూర్యుడయ్యాడు
మనిషికీ ప్రేమకీ మధ్య
ఇంత దూరమెందుకని
ప్రపంచమంత మనసయ్యాడు
నీ అమావాస్య దుఖం చూసి
చీకటి చిక్కినప్పుడల్లా
చంద్రున్ని వెలిగిస్తున్నాడు
మూడు కోట్ల దేవుళ్ళూ
మూఢులకీ మూటలకీ అమ్ముడుపోతే
ప్రతి కణంలో కరుణగా నిండి
నీ చుట్టూ
నిండు ప్రకృతయ్యాడు
మనిషయ్యాడు
అందరి దృష్టిలో
నడిచే బాంబయ్యాడు

17/9/2012

మురళి // అమెరికా వాడి 'అమ్మపాలు' ఐస్ క్రీం పార్లర్//అమెరికా వాడు అమ్మ పాలు తాగితే కదా
వాడికి అమ్మ పాల రుచేమిటో తెలిసేది.
డబ్బుంది కదాని డబ్బాలే కొంటాడు.
డబ్బా పాలే అమృతం అనుకుంటాడు.

వాడి అమ్మ చైల్డ్ కేర్ సెంటర్లో పెడితే
వీడేమో అమ్మని ఓల్దేజ్ హోం లో ఉంచుతాడు
ధన సంపాదనే లక్ష్యం గా బ్రతికే వారికి
అమ్మ పాల కమ్మదనం ఏమి తెలుస్తుందిలే

అనురాగం అన్నది ఒకటుందని వాడికేమి తెలుసు
అది ఎంతకి దొరుకుతుంది? కొంటానంటాడు.
మమకారం అంటేమిటో వాడికేమి తెలుసు?
అది ఎక్కడ దొరుకుతుంది? అడుగుతాడు వాడు
(భాస్కర్ II అమ్మ పాలు అమృతం II కవితకు స్పందన గా)

పరమేశ్వరి. //హైకు//


రోడ్లు
అందంగా ముస్తబై
సమిష్టి చెమట గంధంతో

గడియారం
గుండె ఆగింది
భూకంపానికి

గంపెడు సంతోశాన్ని
పండించింది
మొలకెత్తిన విత్తనం

చిన్నారి
చిలిపి గీతలే
అమ్మకవి అద్భుతాలు

.......16/9/12

కర్లపాలెం హనుమంత రావు॥గాడ్ ప్రామిస్॥


1
మాటల పెట్టుబడితో కట్టిన మైత్రీకోటలన్నీ చీమల చిటుక్కుకే కుప్పకూల్తున్నాయి
సునామీ భయంతో స్వర్గం లోనూ క్షణం ఓ యుగం
బీమా ఏజెంటులా స్నేహంపాలసీలకోసం
ఎన్ని గుండె గడపలు ఎక్కి దిగానూ!
ప్రీమియం దండగే గానీ
జీవితకాలం నిలబడుంటుందన్న ధీమా లేదు
నాకో డైరీ లాంటి మిత్రుడు కావాలి

2
కొట్టుకొచ్చిన జాంకాయలో కాకెంగిలి చేసి పెట్టిన కాలీషా కహాఁ హైఁ రే తూ!
నెమ్ము చేస్తుందని తెలిసీ నా కొసం
వానావానా వల్లప్పలయిన శేషూ శ్రీలక్ష్ములిప్పుడు ఎక్కడున్నారో!
నా నిద్ర తాను కాసి తెల్లార్లూ బుల్లి స్లిప్పులు రాసిచ్చిన జాను పీనుగ్గాడు
దొంగ లెక్కన నా కోసం గోడలెగబాకి చావు దెబ్బలు తిన్న సుబ్బారాయుడు
ఏ ఏట్లో చచ్చార్రా మీరంతా ఇప్పుడూ!

3
నీతులు సూక్తులు నియమాలు నిబంధనలు
మంచితనం మర్యాదా మంటిగడ్డలు …బాబోయ్
బతుకు ఫుల్లుగా గాలి కొట్టిన కాలిబంతయిపోయిందిరా తండ్రీ!
సేఫ్టీ వాల్వులా సీమన్నారాయణా
మళ్ళా నువ్వొచ్హి కాస్త గాలి తీస్తేగాని
ఊపిరాడేటట్టు లేదురా!

4
అమ్మ నిచ్చావ్ నాన్న నిచ్చావ్ అన్నదమ్ములు అక్కచెల్లెళ్లందర్నిఇచ్చావ్
అడక్కుండానే అన్నీ అమర్చే పెట్టే అతిమంచి ఆలినీ,
కడిగి ఆరబోసిన ముత్యాల్లాంటి పిడుగుల్నీ అచ్చంగాఇచ్చావ్..థేంక్స్!
అడుగులకు మడుగులొత్తే వందిమాగధుల్ని సరే
అస్తమానం పీక్కుతినే యములాడినీ దయచేసావ్
అన్నీ ఇచ్చి ఒక్క మా కేడీ దుర్గాగాడిలాంటి మంచి మిత్రుణ్ని
ఇవ్వడం మాత్రం మర్చిపొయావా!
నువ్వు దేవుడివా …మా చెండామార్కు చెన్నకేశవ సారు మాష్టారువా!
కన్నీరు లేక పోతే మానె
కాసింత నెత్తిమీది కడవబరువును మోసే మా మోసెస్ చేతులు మళ్లా కావాలి
చక్కిలిగింతలు దొంగలెత్తుకు పోనీ
చుక్కల్లో చక్కర్లు కొట్టేవేళ
పడకుండా పట్టుకునే మా పిచ్చయ్య పక్క భరోసా కావాలి
నాగేశం గాడిలాగా 'నాకేంటీ' అనాలోచించకుండా నవ్వులు వెదజల్లి పెట్టేవాణ్ని
దుర్గాగాడిలా సునామీనైనా ధైర్యంగా ఢీకొట్టే మొనగాణ్ని
ఒక్క మిత్రుణ్ని
బదులుగా ప్రసాదిస్తావా దయచేసి...నీ వరాలన్నీ నీకు తిరిగిచ్చేస్తా
వచ్చే జన్మంటూ..అహ.. ఉంటే…గింటే
మా మనోహరుగాడిలాగా పుట్టి నీ మైత్రీరుణం తీర్చుకుంటా!
గాడ్ ప్రామిస్!

కె.కె.//నిశ్చల ప్రకృతి //


**************
రోజూ కొండల్ని చూసి
జాలిపడేవాడిని,
మనలాగా కాళ్ళూ,చేతులూ
యదేచ్చగా తిరగాలని
వాటికుండదా అని.

ఆశ్చర్యపడేవాడిని,
మనతోపాటే పుట్టిన జీవనదులతో
కరచాలనం చెయ్యాలని
అనిపించదా అని.

వెక్కిరించేవాడిని,
కనీసం మా చుట్టూ ఉన్న
మొక్కలు,చెట్లు గాలి సాయంతో
తలలాడిస్తాయి. ఆమాత్రం
చలన తృప్తి కూడా లేదే అని.
************************
నేను స్వాప్నికావస్థలో ఉండగా
కొండలు తమ అంతర్వాణిని
నా ముందు ఆవిష్కరించాయి.

ఓరి వెర్రి మనిషి!!!
మాకూ మీలాగే తిరగాలని ఉంటుంది.
మా మొదళ్ళు పెరికేసుకుని
విహరించాలనీ ఉంటుంది.

కానీ మేము చలిస్తే,సృష్టి
తలకిందులవుతుంది.
మా అడుగులకు మీ పుడమి
రొమ్ము చితికిపోతుంది.
ప్రాణులు గగ్గోలు పెడతారు.
మీకు రక్షణ కరువవుతుంది.

మేము మీ దుఃఖానికి హేతువు
కాకూడదనే కదలడం లేదు.
యుగ,యుగాలుగా ఉన్నచోటే
నిశ్చలంగా ఉండిపోయాం.
ఇది ఎవరి ఆజ్ఞ కాదు.
మీకోసం మేము తీసుకున్న
సామూహిక కఠిన నిర్ణయం.
************************
ప్రకృతి అంటే అందాన్ని,
అహ్లాదాన్ని పంచేవే కాదు.
రక్షణని కల్పించేవి కూడా
అని అర్ధం అయ్యింది.
క్షణ,క్షణం చపలచిత్తమైన
మనిషికి కొండలిచ్చిన సమాధానం
ఒక గుణపాఠం.
కాదంటారా???
======================
తేది: 14.09.2012

కర్లపాలెం హనుమంత రావు॥ఇంకొన్ని చురకలు॥


1
ఎన్నెన్ని పంచవర్ష ప్రణాళికలూ!
వర్షం పడితే పంచ కురవడం మానదు
-నా దేశం
***

2
మంత్రిగారొస్తేనే షోకు
మహా కంతిరిది
మా మురికూరు.
***


కూటి కోసం జనం
పట్నంబాట
ఓటు కోసం సియం
పల్లెబాట!
***

4
మూడు 'పూవులు'
ఆరు 'కాయలు'
శివారు పబ్బులు

5
గజకరువు
గజం జాగా కరువు
శ్మశానంలో

6
లేడిపిల్లలకేనా
అభయారణ్యం
ఆడపిల్లలకో!

7
పాడుబడ్డ గుడిసెలో
పాత బడని సాలెగూడు
కరువుకింకా
కరువు తీరలేదు!

8
అలారం వింటే గానీ
కోడీ కూయడం లేదు
మరీ విడ్డూరం
యంత్ర యుగం!

9
నిద్ర
మనసు మేలుకుని కనే
కల

10
కుడి ఎడమయితే పొరపాటు లేదా
గ్యాసుపొయ్యి నాబ్
తిప్పి చూడు దేవదా!

11
పురుగుమందు డబ్బా మీది
పుర్రెమార్కుగుర్తు
రైతుకు జాగ్రత్తా!
భవిష్యత్తా!

12
ఉప్పు తింటే మర్చిపోరుట
డబ్బు
ఎంత ఉప్పనో!

13
క్విడ్ ప్రో కో
గడించారా లక్షలకోట్లు-సార్లు
శిక్షగా రాయించు
క్విడ్ ప్రో కో
కోటీ లక్షల సార్లు

14
ఆనకట్టలు
ఆధునిక దేవాలయాలు
డబ్బుకట్టలు
అందులో ధూప దీప నైవేద్యాలు

శైలజామిత్ర :ఉదయ స్వరం..


తలుపు తెరవగానే
గ్రీటింగ్ కార్డ్ లా చెట్టు
ఆహ్వానం పలికింది!
పూలన్నీ అక్షరాల్లా
ఉదయానికి ఆహ్వానం చెబుతున్నాయి!

ఉదయం ప్రతిరోజు
కొత్త ఉహల్ని జతచేసుకుని
పాత రూపాన్ని
మనకు జ్ఞాపకంగా ఇస్తూ వస్తుంది

కొత్త అద్దంలా ఆకాశం
మెరిసిపోతూ
తన చుక్కల చీరను మార్చుకుంటూ
సూర్యుని రాకకై
ఎదురు చూస్తుంటుంది..

శూన్యంలో తిరుగాడే గ్రహాలు
పాతవే అయినా
ఏరోజుకారోజు
కొత్త అర్థాల నగిషీలను
అలంకరించుకుంటుంది

కాలానికి, కలానికీ
సోదర సంభంధం ఉంది
నదికి రెండు తీరాల్లా
ప్రకృతి దృశ్యం, సమాజ చైతన్యం
జత పడి
మనిషి కొత్త కలలకు
అందమయిన రుపాన్నిస్తుంది

జీవిత పుస్తకంలో
రోజూ వారీ రహస్యాలు
కొండరాళ్ళ మధ్య దాగిన జలాల్లా
గుండె గొంతులోని స్వరాల్లా
సమయం చూసుకుని
బయటకు వస్తాయి.
గట్టును దాటలేని ఆశలు మాత్రం
ఆలోచనల నదిలోనే కొట్టుమిట్టాడుతుంటాయి..

భోధనలేందుకు?
త్యాగం చాలు కదా అనుకుంటూ
ఎవరు ఏమి కోరకుండానే మేఘం
అందరికీ ఆనందాన్ని ఇస్తుంది

రవి చంద్రులు
రాత్రి కవాటాల్ని తెరుస్తూ
కిరణాల అశ్వాన్ని అధిరోహించి
కవితగా మారి
కవి హృదయంలోకి చేరిపోతుంది

గాలి ప్రశ్నిస్తుంది
ప్రవాహ రూపం నిలదీస్తుంది
మానవీయ ముద్రతో
అతి సున్నితమయిన
క్షణాల్ని తట్టి లేపితే
ఈ దిశ అయినా సరే
ప్రకృతిలో ఏకమవుతుంది..

17 -09 -2012

రావి రంగారావు ( విశ్వరూపం )


అవును, ప్రస్తుతం మేం
మీ కాళ్ళ కింద నలుగుతూన్న చలిచీమలమే,
రేపు ధనగర్వ సర్పాన్ని పట్టి పల్లార్చే
సాముహిక శక్తి మేమే...

అవును, ప్రస్తుతం మేం
అక్కడక్కడా పడివున్న గడ్డిపోచలమే,
రేపు అధికార మత్తగజం పెడరెక్కలు విరిచికట్టే
వెంటిమి మేమే...

అవును, ప్రస్తుతం మేం
చెల్లాచెదురుగా ఉన్న చిన్న చిన్న నక్షత్రాలమే,
రేపు చీకటి వ్యవస్థను సమూలంగా పెళ్ళగించే
సమైక్య సూర్యబింబం మేమే...

ఇదంతా పాత కథ గానే ఉంది నిజమే
ఓ కొత్త నిజం కూడా తెలుసుకో,

మీరు విసిరే వడగాడ్పులలో మా ఆలోచనల బీజాలు
గాలిలో కొట్టుకుపోతున్న మాట నిజమే ,
అనుకూల వర్షాలు వస్తాయ్...
రేపు భూమ్మీద ఎక్కడ చూచినా మా మొలకల ములుకులే...

క్రాంతి శ్రీనివాసరావు || దేహ మాళిగలు ||


అనంత పద్మనాభస్వామి
దేవాలయం అడుగున
ఆరు గదులే

దేహ దేవాలయం లో
అనంతమయున
గదులు

దేహం గదుల
తాళం చెవులు
మనసు లోతుల్లో
పడిపోయాయు

కాపలా కాస్తున్న
వెన్నుపాము
మనసు
పడగ విప్పి

గదుల మధ్య
గోడల చెవుల్లో
గుస గుసలు
బుసగా వినిపిస్తూ
భయపెడుతూనే వుంది

అన్నీ
తొమ్మిది కిటికీల గదులే
ద్వారాలే మూతబడి వున్నాయు

సాలె గూళ్ళూ
బొద్దింకలు
ఎలుకలూ
పందికొక్కులూ
గబ్బిళాలూ
కాపురాలు వెలగబెడుతున్నాయు

గదుల్లో బందించబడ్డ చీకటి
ఆత్మహత్య చేసుకోడం
చేతకాక
కిటికీలు తెరవబడ్డప్పుడల్లా
వెలుగును తాగి
మత్తుగా నిద్దుర పోతుంది

గదులను తెరిచే
రహశ్యం వున్న గది
ద్వారాలు తెరుచుకోనే వుంది
ఆ గది ఆచూకీ
ఓ పెద్ద రహశ్యం

ఆ రహశ్యం తెలిసిన వాడు
మోదట తెరిచిన గదిలోనే
జీవితం సరిపోక
అందులో జ్నానం తోనే
వెలిగి వెలుగులిస్తుంటాడూ

ఏగది
మొదట
ఎవడు తెరుస్తాడో ?
ఏ దేహం లో
ఏగది తెరుచుకొంటుందో ?


గదులు తెరుచుకొంటున్న శబ్దాలు
జ్నానాన్ని వేల రెట్ల వేగం తో
వీచేలా చేస్తున్నాయు

దేహం గదిలో దాచిన విశ్య రహశ్యం
నేడో రేపో విడుదల అవ్వవచ్చు

కా
నీ
విశ్వబజారులో
నిలుచున్న మనిషి
వుండేందుకు
ఏ ఒక్క గదీ లేదు !

గదిలోపల గదులు
విశ్వం వెలుపల విశ్వాలు
ఎదురెదురుగా వున్న
దర్పణాల్లో దృశ్యాలుగా
అందని అంతుబట్టని తనాన్ని
మొహం మీద చల్లి
మళ్ళీ వెతుకులాటకు
శ్రీకారం చుడుతూనే వున్నాయు

Yagnapal Raju II సంచలన II


నేనొక రేణువును
అణువులు కలిసిన
అతి చిన్న రేణువును
సంచలన రేణువును

ఉదయకాంత
విశాల ఫాలంపై విరిసే
ఎరుపు రేణువును

కిందకురికే చినుకులోని
వేగాన్ని పుణికి పుచ్చుకున్న
చన్నీటి రేణువును

చిరు మొగ్గలోనుంచీ
కొత్త పుట్టుక పరిమళించే
బతుకు రేణువును

స్వేచ్చను నింపుకున్న
విహంగాల కువకువల్లో
అవిశ్రాంత విహార రేణువును

లేతాకుపచ్చ చిగురుటధరాల
ముద్దు పొదిగిన రేణువును

బారులు తీరిన
అమ్మ చెట్ల వేర్ల తడిలోని
ప్రేమ రేణువును

గిరగిరా తెరిగే గాలిలోని
ప్రాణవాయువు హృదయ
స్పందనా రేణువును

నివురుగప్పిన అగ్నిపర్వతాల
అంతరాళ నరాల్లో ప్రవహించే
శిలాద్రవ రేణువును

ఉవ్వెత్తున ఎగసే
ఉత్తుంగ తరంగాన
ఉరకలు వేసే ఉత్సాహ రేణువును

అంతుచిక్కని కడలి
అంతర్గర్భాన
అలసి నిద్రించే
పసి రేణువును

భరించే పుడమితల్లి
శిరసున భాసించే
సహన రేణువును

పరవళ్ళ పరుగులెత్తే
నదీ నాదాలలోనూ
జలపాతాల ఇంద్రజాలంలోనూ
జోరుతగ్గని వేగ రేణువును

జీవితాలను వికసింపజేసే
దినకరుని కిరణా రసాల
సరస్సులో స్నానమాడే
వెలుగు రేణువును

అంతర్మధనపు దుఃఖాన్ని
అంతూపొంతూ లేని సుఖాల్ని, విశ్రాంతిని
తనలో దాచుకున్న రాత్రి
వెదజల్లే చీకటి రేణువును

సమస్త జీవజాలాన
ప్రకటితమవుతున్న
ప్రాణ రేణువును

అడవి అతివ విరబోసిన
అనంత వర్ణ విన్యాసాల
కురుల ఛాయా రేణువును

వనకన్యక కలికి కులుకులో
కలగలిసిన
వలపు రేణువును

తన గొంతు గానాల
గమకాల హారాన
శబ్ద రేణువును

తన కంటి మిసిమి చూపులో
కురిసే కరుణా రేణువును

కోటానుకోట్ల రేణువుల్లో
నేనొక రేణువును

ప్రకృతి రేణువును
సంచలన రేణువును

http://www.facebook.com/groups/kavisangamam/permalink/446299985422759/
17.09.2012

నా సెలయేటి హృదయం.....21


ఒకే రకంగా ఎలా పరవశిస్తాము ?
ఒకే సందర్భాన్ని

ఒకేలా భరించలేము కూడా
కాలుతున్న కాలాన్ని

వేరు వేరుగానే మనసుస్పర్శ
మురిపిస్తుంది

ఈ మసక లోకానికి
ఇది తెలిపేదేలా?
ప్రియురాలా...!
ఈ జ్ఞానాన్ని వదిలి వెళ్ళకు.

.....
http://www.facebook.com/groups/kavisangamam/permalink/446292165423541/

కాశి రాజు || ప్రకృతి కాంతకు


ప్రకృతి కాంత కై పరితపిస్తూ
నేను తనని ప్రేమిస్తాను
తనూ అంతే
నిన్ను ప్రేమిస్తున్నానని నాతో ఎప్పుడూ చెప్పదు.
నాలాగే నన్ను ప్రేమిస్తుంది ..
నేనూ అంతే ...

నన్ను ఉదయించడం నుండి
నేను అస్తమించేవరకూ అన్ని పనులూ
ఆమె అందంగా చేస్తుంది

ఉదయంపూట చల్లగా మంచుచూపులు చూస్తుంది
చూసి చూసి మద్య్హానానికి వేడెక్కిస్తుంది
సాయంత్రానికి స్లబరుస్తానని చెప్పి
రాత్రిలోనికి రమ్మని పిలుస్తుంది

తనెంత పనిగత్తో
అంత ప్రేమగత్తే కూడా

తనని పదే పదే ప్రేమిస్తున్నానని చెప్పలేక
ప్రాణమున్న పదాలేవో
పనిగట్టుకుని తెచ్చి
కవితని కనే ప్రయత్నం చేస్తాను నేను
ప్రకృతి కాంతకై పరితపిస్తూ నేను

కట్లా శ్రీనివాస్ || దీపం వెనుక చీకటి


ఎందుకలా ఒక్కోసారి
పెంచుదామనుకున్న మొక్కను
కుండీతోసహా బద్దలుకొట్టేద్దామనిపిస్తుంది.

నాటుకోబోతున్నవేళ్ళను పేర్చిన కట్టెలపై కాల్చేస్తే
నీడను కోరుకున్న జీవులేవైనా వుంటే నిరాశేగా మిగిలేది.

అద్దాన్ని తుడుస్తుండగానే
బళ్ళున బద్దలై విక్రుతంగా నవ్వుతుందెందుకో.

ఏదో రాలేదనీ, మరేదో పోయిందనీ
చిరాకుల పరాకు చిరిగి చాటంతై
అమూల్యమైన దానినే అర్పించమనేంత
అవ్యవస్తకు లోనవుతుందెందుకో.

పరుగులో వెనకున్నందుకో
పరువులో శూన్యతావరించినందుకో
పనిలో మెరుగులేనందుకో
ఆవరించిన వలయం వదలనందుకో
ఎవరో ఏదో ఇవ్వనందుకో

నిప్పుల గుండంలో సమిధగా కాలితే
చివరికి మిగిలేది గుప్పెడు బూడిదే.
భూమిపోరల్ని కప్పుకుంటూ నిశ్శబ్దాన్ని వెతకాలా.
మనసు తలుపుల గుండా తలపులు తెరుస్తే చాలదా?.
వెలుతురదిగో కనిపిస్తోంది.

http://antharlochana.blogspot.in/2012/09/blog-post_17.html

మెర్సి మార్గరెట్ ll మీ సంస్కారం జాగ్రత్త ll


ఎన్ని ప్రశ్నలో ఆ వృక్షానికి
ఆకుల శబ్దంలో కలిసి
తన చెవులు కొరుకుతూ

అదేదో దారిలో
ఓ మూలాన తనను
అనాధగా దురదృష్టానికి
అమ్మేసి వెళ్ళిన జీవితాన్ని
నిందిస్తూ
జాలి చూపులు, గోడు వింటూ
ఉన్నంతలో నీడ నివ్వడం తప్ప
ఏమి చేయలేక

ప్రేమ బిక్షమెత్తుతూ వచ్చి
ఈ చెట్టు దగ్గరే ఆగిపోయి
హృదయానికి ,మనసుకి
కాళ్ళు పోగొట్టుకొని
సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న
తనను రోజూ రాలుతున్న ఆకులతో
పలకరిస్తూ

పిచ్సిదన్నారు,పొగరన్నారు
అభాగ్యురాలని దొంగ జాలి నటించారు
మరి కొందరు
బలుపన్నారు మధంఎక్కిందన్నారు కొందరు
కాని ఏవి వినే ఓపిక లేక ..

ఎండకు ఎండి
వర్షానికి తడిసి
ఆ చెట్టు కిందే ఇలా అన్నీ కోల్పోయి
ఇంకా నిజమైన ప్రేమ
ఎవరో ఒకరు
భిక్షంగా వేయక పోరు
అని ఎదురు చూస్తున్న
ఆమె

-" ప్రేమ భిక్షగత్తే "

మీకు కాని కనిపిస్తే
చీత్కరించకండి
బిక్షమేయక పోయినా పర్లేదు
ఎక్కిలి నవ్వులు నవ్వకండి
జాలి చూపే మనసు లేక పోయినా
పర్లేదు
మాటల్ని ఖర్చు చేసుకోకుండా
పక్కగా వెళ్ళండి
మళ్ళీ మీ సంస్కారం మైలపడొచ్చు
-----------------------------( 16/9/2012 )

భాస్కర్ II పాట మిగిలే ఉంది II


"..నువ్వు లేవు
నీ పాట మిగిలే ఉంది
అది గుండెల్లో రక్తమై మీటుతోంది
ఊపిరి తీసుకోకుండా చేస్తోంది
అప్పుడెప్పుడో అడవిలో
సంచారం చేస్తున్నప్పుడు
గువ్వ పిట్టల కువకువలు
పక్షుల అలికిడులు
అన్నీ ఒకే రాగమై
మనసు తెర మీద
వెచ్చని పాటలను చల్లుతోంది
రణగొణ ధ్వనుల మధ్యకంటే
వనాల వెంట సహచరితో
కలిసి నడవడం..
మరింత హాయినిస్తోంది
ఓ వైపు బందూకుల సందడి
మరో వైపు ఖాకీల హల్ చల్
అయినా ..ఈ ప్రయాణం
మరిచిపోలేని ..మరువలేని
అనుభవాలను మిగిల్చింది
ఓ వైపు చిమ్మ చీకటి
పండు వెన్నెల అడవిని ముద్దాడి
నదిని ఒడిలోకి తీసుకున్నట్టు
లోకానికి అవతల..
మనుషుల సమూహంతో
మాట్లాడుకోవటం ..
ఇంద్రధనస్సును చేతుల్లోకి
తీసుకున్నట్టు అనిపించింది
ఎన్ని మైళ్ళు నడిచినా
ఇంకా ఏదో ఉన్నట్టు ..అందుకే
అడవి అంటే పూల వనమే కాదు
జీవితాన్ని వెలిగించే దీపం .."

యాకూబ్ ॥ ప్రేమ ఒక ఉనికి

పూలతోటలోంచి పువ్వు కళ్లు విప్పార్చి నవ్వుతున్నట్లు ఆమె నవ్వుతుంది.గలగల పారే సెలయేటి మధ్య సుడులు తిరుగుతున్న నీళ్ళలా ఆమె నవ్వుతుంది.
మిట్టమధ్యాహ్నం నీడల్లోకి ప్రయాణం కట్టిన తెల్లటిమేఘంలా ఆమె నవ్వుతుంది.నవ్వుకు నవ్వులనడకలు నేర్పుతూ అలిసినట్లు అపుడపుడూ కునుకుకూడా తీస్తుంది.

నిద్రపోతున్న ఆ కళ్ళవెనుక కదులుతున్న దృశ్యాల్లో బహుశా ఎవరో దాగిఉన్నారు
.
దాగిన దృశ్యాలకు,దాగని అర్ధాలకు నడుమ చేతనంగా కదులుతున్న భావాలేవో తచ్హాడుతుంటాయి.

పాటలగుంపులు ఆత్మమీదుగా బారులు తీరుతుంటాయి.
అందులోంచి తప్పుకుని కొంగలాంటి పాట. తెలతెల్లని సంతోషం లాంటి పాట. ప్రేమకు ప్రతిరూపం లాంటి పాట.
'కలవరమాయె మదిలో..నా మదిలో' ను హమ్మింగ్ చేస్తో పలవరిస్తూ ఆమెలా రూపుకడుతుంది.
కలలపైన కదిలే నావలా తేలియాడుతుంది.నావలో చరిస్తూ,సంచలిస్తూ ఆమె పాటను వెంటపెట్టుకుని ఎటో వెళ్ళిపోతుంది.

ప్రేమిస్తూనే ఉండిపోవాలి తెల్లటి మేఘాల్లాంటి ఊహల్ని ఆత్మపైన పయనింపచేస్తూ ఆమె గమనాన్ని,గమకాల్ని గమనిస్తూ..
ఆమెలోంచి నేనూ,నాలోంచి ఆమే
పయనిస్తూ అలిసిపోని ప్రయాణీకుల్లా సాగిపోతుంటాం.
మెలకువలోంచి , ఉనికిలోంచి
ఊపిరిలోంచి ,హృదయపుస్పందనలోంచి ఎదురుపడే
సుపరిచితమైన పాటవంటిదేనేమో ప్రేమ.

వింటున్నాను.
కలగంటున్నాను.
ప్రేమను ఒక ఉనికిగా అనువదించుకుంటున్నాను.

*20.9.2012