పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, జులై 2012, ఆదివారం

మెర్సీ మార్గరెట్ కవిత


మనసు మగ్గం
మొరాయించలేదెందుకో
ఈ రోజు

నీ జ్ఞాపకాలు నా కాళ్ళకి
చుట్టుకుని
అడుగు ముందుకేయకుండా
చేస్తుంటే

అక్షరాలన్నీ కలిపి
కవిత నేస్తూ
ఒడుకుతున్నా
మాటలన్నీ
దారాలుగా కలిపి చేర్చుతూ

పోగు పోగుకూ
ప్రేమ రంగులద్దుతూ
నాకు నేనే
మనసు మగ్గంపై పరుచుకుంటూ

నిన్ను కప్పబోతున్నానని
అందమైన వస్త్రంలా
హౄదయాన్ని హత్తుకుని
అలా నీతో ఉండి పోనా?
కవితలా ..!?
*28-07-2012

సత్య శ్రీనివాస్ || నడిచే వర్షం ||

పెదవుల
కొంగు
కొస నుండి
జారుతున్న...
వాన
చుక్క
మధువు.
వెలిసిన వర్షం
నాలో మధుశాల.
*28-07-2012

వేంపల్లి గంగాధర్ || వాడొక వ్యాసం .... ||

వాడు
మీకు బాగా పరిచయం
వాడి ముఖం
మీకు ప్రతి చోటా ఎదురు పడుతుంటుంది ...

ఒక్కో సారి వాడు
ఎదురు గాలి కి ఎగిరే
రంగు వెలసిన చిత్తు కాగితం ...
నడి రోడ్డు మధ్య విసిరేసిన
చివరాఖరి సిగరెట్ తుంట ముక్క ...
రైలు ఇనుప కమ్మి ఫై
నలిగి రూపం కోల్పోయిన రూపాయినాణెం....
తోకకు రాయి కట్టిన తూనీగా....
అగ్గి పెట్టె లోని జిరంగి.....
వీధి మలుపులో
కాళ్ళకు అడ్డం పడుతూ
దుక్కం నిండిన చేతులు
వ్యవస్థ ను ఆవిష్కరించే సూచిక !

బాలల దినం నాడు
నీ పత్రిక లో వాడొక వ్యాసం ....
ఒక ఇటుక రాయి మోస్తూ ...కంకర రాయి కొడుతూ ..ఫోటో !
హోటల్ లో ఒక పగిలిన టీ గాజు గ్లాసు ....
రంగు రంగుల ముఖ చిత్రం!

సగం పడిపోయిన గోడ చివర
చినిగిన బట్టలతో
ఆడుకునే గోలీ కాయ...!
వాడు కూడా అవతార మూర్తి…..


ప్రతి ఉదయం తప్పని ప్రయాణం
కొండ దారి లో
పశువుల వెనుక పశువు గా ..
గొర్రెల వెనుక గొర్రె గా ...
బతుకు పోరాటం లో బలి పశువు!

ఇలా
ప్రతి సారీ వాడు
ఎదురు గాలి కి ఎగిరే గాలిపటం !
*28-07-2012

www.vempalligangadhar.com

పులిపాటి గురుస్వామి || చెదల బతుకు ||

చిగుళ్ళు తొడుక్కుంటున్నవెన్నెల్లో
చీకటి కుప్ప తొ మాటలు

నీ ఎముకల మీది
కండరాలేవీ?

నిస్సారమైన నవ్వు
తేమే లేని చూపుల మధ్య
మాంసపు గోడలు
కూలుతున్న చప్పుడు

నీ దాహం తీరుతుందా?

పురుడు పోసుకుంటున్న కొమ్మల
తెగులు పట్టిన కుళ్ళు
నెర్రెలు పారిన నాలుక బయట పెట్టిన
దూపసంజ్ఞ
నదులకు
ఉరితాళ్ళు పన్నిన స్పృహ

కాసేపటి దుర్వాసన విరామం

ఏమైనా చేస్తున్నావా?

ఉమ్మిన పీక్కుతినే చీమల ఆవరణ
భుజమ్మీడుగా జారిన అవయవాలు
కుమ్మిన ఉడికిన మాంసపు కుడుము
నిశ్శబ్దం ముందరి శబ్దం
మూలుగు జవాబు

బతికే వున్నావు
ఇంకా నువు
బతికే వున్నావు

మృత్యువును ప్రేమించు
ధ్యానించు

*28-07-2012

భమిడిపాటి ఫణి కుమార్ శర్మ || నువ్వే నేను ......||

నువ్వు నేను
నా నువ్వుగా
నీ నేనుగా
ఇద్దరి మనసులు ఒకటిగా....

నీ మాటల్లో
నా మౌనం
నా కోపంలో నీ కన్నీళ్ళ
ఓదార్పుల వెచ్చతనం ...

కలనైనా నీ ఎడబాటు
తెచ్చే కలను కనలేను
ఘడిఐనా భారంగా
నీ దూరాన్ని భరించలేను

నీవు లేవన్న ఆ క్షణం
నిన్ను దాటి నన్ను
ఒంటరిని చేసే మరుక్షణం
నేను లేనన్నది అంతే నిజం.
*28-07-2012

రావి రంగారావు || రెండు రకాలు ||

భామయినా

దోమయినా

కోరిక రేగుతుంది

చీకటిలో...



గాయకుడయినా

నాయకుడయినా

జనాన్ని ముంచుతాడు

మత్తులో...



చీకటయినా

మత్తయినా

రెండు రకాలు,

ఒకటి

సుఖంలో తేల్చేది...

రెండోది

రక్తాన్ని పీల్చేది...
*27-07-2012