పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జులై 2012, శనివారం

స్వాతి శ్రీపాద- కవిత

ఎలా?

ఇక్కడ ఇప్పుడు
ఓ తడిసిన ఉప్పు బస్తాలా
కనిపించకుండా కరిగిపోతూ
చెమ్మగిలిన కళ్ళతో పడిఉన్నట్టున్నానా?
మీ కేం తెలుసు
లోలోపలి మాగాణీ లో
ఎన్ని పూల వనాలను సాగుచేస్తున్నానో
ఎన్ని రంగుల పరిమళాలను కలగలిపి
అనుభూతుల ఆవిష్కరణకు
అగరొత్తుల పొగలా రూపాలు మార్చుకుంటున్నానో
పెదవుల మధ్యన పుట్టే కొత్త నక్షత్రాల గుత్తులకు
వెలుగు వెల్లువ నవుతున్నానో......
స్థంభించిన చీకటి ముద్దలా
నిస్తేజపు చూపులను గుమ్మరిస్తున్న నా కళ్ళ ప్రపంచాల్లో మీరేం చూడగలరు?

సుదూర తీరాలనించి మోసుకు వస్తున్న
కలల బిందెలోంచి తొణికిన అమృతపు చుక్కలను
నాలుక కొనతో అందుకోవాలన్న తపన
బ్రతుకు బ్రతుకంతా తడిపేస్తున్న తొలకరి జల్లుల
తొలి గుసగుసల చిరు మువ్వల రాగాన్ని
మళ్ళీ మళ్ళీ నినదించే వెలుగుల సడి
అణువు అణువునా అలదుకున్న
ఊహల సొగసులు
మీకేం తెలుసు 

తెర మీది భాగోతలకే వివరణలు కుదరవు మీకు
నా స్పష్టాస్పష్టపు రూపదృశ్యానికి వెనక
ఏ కొత్త ప్రపంచం ఉద్భవిస్తోందో
నాకే తెలియదు .... మీ మరుగుజ్జు ఊహకెలా అందుతుంది.
*3.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి