పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, మార్చి 2014, సోమవారం

Sravanthi Itharaju కవిత

స్రవంతి ఐతరాజు " సౌగంధిక జాజరలు" 24.03.14 "సూర్యపూజ" ( స్రీ వేదనరాయణ స్వామివారి సూర్యపూజ సందర్భంగా శ్రీవారికి కవితా సేవ) సప్తాశ్వారూఢుడు సప్త సప్తర్మరీచుడు హిరణ్య కిరణ సంభూతుడు ప్రభాకరుడు విభాకరుడు దివాకరుడు అనంత తేజుడు అరుణకిరణుడు తానే దిగి వచ్చు ముచ్చటగ మూడు దినములు మౌనియై మోకరిల్లగ కిరణోత్సాహియై భక్తిప్రపత్తుల మెండై వెలయగ తన సువర్ణ రేఖా వెలుగుల తమకమున ఆదిమత్స్యావతారు పాదాల సృజియింప మొదటినాడు శ్రీ లక్ష్మి స్థిర నివాసమౌ వేదవేద్యు హృదయ పీఠమలంకరింప మరునాడు శిరమునలంకరించి ఆ వేదనారాయణుని శ్రీ సూర్యనారాయణుని చేయుచూ మూడవ నాడు రాయల నిర్మితంబగు నాగులాపురమందు మూడుదినముల సూర్యపూజ నిజముగా.. ఆదిమత్స్యావతారుడు శ్రీ వేదనారాయణునకు ఆ ఆదిత్యుడొనరించు భక్తి పూజ గనరో జనులారా నయనానందకరముగ ఆ ద్వినారాయణుల దివ్యాశీస్సుల బడయగ!

by Sravanthi Itharajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/ORZsdS

Posted by Katta

Pusyami Sagar కవిత

!!నాతో నడిచిన లాంతరు !! _________పుష్యమి సాగర్ చీకటి ని కప్పుకొన్న రాత్రిళ్ళ ను చీల్చడానికి గుడ్డి లాంతరు పెనుగులాట లో ఏరుకున్న నాలుగు అక్షరం ముక్కలు ఇప్పటికి నా మెదడు లో పదిలమే...!!! కుదవ పెట్టిన వస్తువుల సాక్షి గా కిరసనాయలు జలపాతం లా నా కళ్ళలో కి ప్రవహిస్తూనే వున్నది నేను కరంటు స్తంబం లా ఎంత ఎత్తుకు ఎదిగిన సరే...!!! ఇప్పుడంటే నాగరికత ని నియాన్ లైట్ల లో నింపుకొని విర్రవీగుతున్నాను కాని, పలక బలపం పట్టిన రోజుల్లో, దీపం చుట్టూ తిరిగే పురుగు లా లాంతరు చెయ్యి పట్టుకొని ఎన్ని పరిక్షా నదులను దాటలేదు ..!!!! అవ్వ కడుపు నిండా బువ్వ పెట్టి చొక్కా కు పోత్తకాలు తగిలించి వెన్నల్లో విహరించు అన్నప్పుడు నేను లాంతరు ఎన్ని ఆటలు ఆడలేదు గాలి సవ్వడులతో ...!!!! పుస్తకం లో నెమలీక లా నా మనసు లో వెన్నల వెలుగు లని నింపుకొని నక్షత్రాలను లేక్కపెట్టుకొంటు రేపటి కోసం కల లు కనడం మరువగాలనా !!!! ప్రగతి చక్రం లో లాంతరు నింపిన స్ఫూర్తి ని వెంట బెట్టుకొని అవసాన దశ వరకు ఇలాగె నా తరువాతి తరానికి వాటిని పంచాలని వుంది నేను పోగేసుకున్న కొన్ని జీవిత సత్యాలను తెలపాలని వుంది ..!!! మార్చ్ 24, 2014

by Pusyami Sagarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rou1Hm

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/కొత్త రంగులు ---------------------------- మబ్బులు కొన్ని కాంతులు రాల్చడం కళ్ళలో కొవ్వుతుల వెలుగులు పుట్టడం ప్రతి రాత్రి కలలుగా కరుగుతూ గుండెల్లో పేరుకుపోయిన ఎడారి జీర ఒకటి పక్షుల రెక్కలపై వెలసిపోయిన నల్లటి రంగు పచ్చిక వివర్ణమైపోయిన ఒళ్ళు ఎండాకాలపు రుతువులో చిట్లుతూ పగిలిన గాజుముక్కలు ఎంతకి అతకని వెండిపాదాలు నిండుగా ముడుచుకొని కూర్చుంటూ ఓ దేహం ఒంటరి మట్టిని కౌగిలిస్తూ పెగలని మాటలు పగులుతూ కొన్ని పెదాలు మళ్ళా జలదరింపు నిశిరాతిరిలో సంకలన కెరటాలతో తోడవ్వని ఇంకో ఆకాశం మళ్ళా ఓసారి శ్వాసించాలి కొన్ని కొత్త రంగులను. తిలక్ బొమ్మరాజు 24.03.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jmIJNT

Posted by Katta

Abd Wahed కవిత

సాంప్రదాయికంగా గజల్ కు ఉన్న ’’ప్రేయసితో సంభాషణ‘‘ అన్నఅర్ధానికి అనుగుణంగా ఒకే రదీఫ్ ఖాఫియాలతో వీలయినన్ని షేర్లను, ఒక సుదీర్ఘ గజల్ గా తెలుగులో రాస్తే... ఈ ప్రయోగం ఎలా ఉందో పాఠకులే చెప్పాలి. మూడవ విడత ఐదు షేర్లను ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. మత్లాతో కలిపి చదివితేనే గజల్ అందం. కాబట్టి మొదటి షేర్ అంటే మత్లా కూడా మళ్ళీ పోస్టు చేస్తున్నాను. ఈ పోస్టులో రెండవ షేర్ లోనే తఖల్లుస్ తో మక్తా వచ్చింది. నిజానికి ఇది పూర్తి గజల్లో పదకొండవ షేర్. గజల్లో ప్రతి షేర్ దానికదే స్వతంత్రంగా ఉంటుంది, కాబట్టి ఇలా ఒక యాభై లేదా వంద వరకు షేర్లు రాయాలన్నది ఆలోచన. ఈ ప్రయత్నం ఎలా ఉందో చెప్పడం మరిచిపోవద్దు.. ఈ చీకటి రాత్రంతా సౌందర్యము లాగున్నది నీలికురుల సుతిమెత్తని లావణ్యము లాగున్నది నరనరాన మిణుగురులే ఈదుతున్న అనుభూతులు మరువలేదు దియా మేని సుగంధము లాగున్నది ఎడారిలో ఇసుకపైన మంచుతెరల మాదిరిగా పైటచెంగు నీడ ఏటి ప్రవాహము లాగున్నది అణువణువు మెరుస్తుంది నీటిలోని చేపల్లా చూపులదే చంద్రకాంతి ప్రకాశము లాగున్నది మబ్బుల్లో దినకరుడు దాగెనేల ఈరోజూ సూర్యముఖి చెక్కిలితో పరాభవము లాగున్నది ఈ వీధిన నేలంతా సుస్వరాల ప్రవాహమే కాలిమువ్వ జారిపడిన ప్రభావము లాగున్నది

by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oUrHpp

Posted by Katta

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||ఆమని || లోపలంతా గాలివీచినప్పుడు, ఉక్కపోసినప్పుడు అక్షరఆమని చిగురిస్తూనేవుంది లోపలంతా కురుస్తున్నప్పుడు,కూలిపడుతున్నప్పుడు అక్షర ఆమని చిగురిస్తూనేవుంది లోపలంతా మండిపోతున్నప్పుడు,తడిసి గండి పడుతున్నప్పుడు అక్షర ఆమని చిగురిస్తూనేవుంది లోపలంతా శూన్యమై నప్పుడూ ,సూదిమొనంత ఖాళీ లేనప్పుడూ అక్షర ఆమని చిగురిస్తూనే ఉంది లోపలికి ఏదిప్రవహించినా ....అక్షరమై బయటికినడచివస్తూనేవుంది మారే ప్రవాహ దిశల పౌనఃపున్యం నాలోపలి నన్ను దిశమొలతో నిలబెడుతూనేవుంది అక్షరమై అక్షర ఆమని చిగురిస్తూనేవుంది .........................

by Kranthi Srinivasa Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nTDIOP

Posted by Katta

కాశి రాజు కవిత

18 నోటిక్కరుచుకు తాగే కొబ్బరి బొండాన్ని జాగ్రత్తగా నీ చేతుల్లోకి తీసుకుని ఒక్కో గుటకా వేస్తుంటే కిందకీ, పైకీ కదిలే నీ స్వరపేటిక సంగీతాన్ని వినినందుకే నేను ఆ కొబ్బరినీరైపోయాను. పెదాల మీదనుంచి జారిన ఆ కంగారు నిండిన నీళ్ళు గొంతుక మీద గొలుసు దాటి పోతుంటే నేనూ ఒక్క గుటక వేసాను అది చూసినా ఏడాది దాకా ఏమీ మాటాడలేదు ఎందుకలా చూసావని ఎపుడైనా అడుగుతావని ఎన్నోసార్లు కొబ్బరి నీరయ్యాను నువ్వు లేవు నా దుఖం కొబ్బరి నీరు ఇదిగో గుర్తులతో తియ్యగా దుఖిస్తున్నాను

by కాశి రాజుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hfrEP9

Posted by Katta

Aruna Naradabhatla కవిత

మారుతున్న భారతం __________________అరుణ నారదభట్ల ఇవాళే మొదలైందా ఈ పోరాటం! నాడు ప్రపంచ దేశాల నడుమ అటుపై రాష్ట్రాల నడుమ ఇప్పుడు ప్రాంతాల నడుమ..! జీవుల పుట్టుక మొదలైనప్పుడే పోరాటమూ మొదలైంది! మీరట్లో ఆరంభించిన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది! ఉప్పు చేతబట్టి దీక్ష పూని డూ ఆర్ డై అంటూ కూడబెట్టిన స్వతంత్ర్యం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇప్పుడు ఈ రాజకీయ రాబందుల చాటున రూపాన్నే మార్చుంకుంది! పెద్దల సభ చిన్నల సభగా మారిపోయింది! నోళ్ళెత్తి తెచ్చుకున్న స్వేచ్చావృక్షం ప్రజాస్వామ్యం ధాటిలో పదాల పదనిసల్లో ఓటు బాంక్ రాజకీయంగా డబ్బే తమ జబ్బుగా... సంక్షేమం...స్వరాజ్యం చాపకింది మడతలే! న్యాయం కావాలనే వారి పాలిట అంతా ఆశల నీటి మూటలే! కలలు గన్న రాజ్యం కసాయీల చేతుల్లో ఇప్పుడు బలిపశువే!1 24-3-2014

by Aruna Naradabhatlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OQMTzJ

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//పిచ్చి సన్నాసి// దారంతో ముడిపడి బొత్తం ముందు వరసలో మిడిసిపడుతోంది నన్ను దాచానని పెదాలు బిగబట్టుకొని కాజా నవ్వుని పంటిబిగువున అదుముకుంది నిన్ను వదలనులే అంటూ చొక్కాకి చేతులతో పాటూ హృదయమూ ఉంది నచ్చిందన్నావు విప్పి ఇచ్చేసాను చొక్కా. .................. హృదయం అడగొచ్చు కదరా! 23.03.2014

by Nvmvarma Kalidindifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gstu44

Posted by Katta

Sri Venkatesh కవిత

***కులం*** ప్రస్తావన : నిన్న గుంటూరులో జరిగిన ఒక ఉదాంతం ఒక్క క్షణం విస్మయానికి గురి చేసింది, కులాంతర వివాహం చేసుకుందని కన్నవాల్లే కూతుర్ని హతమార్చారు, కులం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఒక చిన్న కవిత, ఇది కులం కవిత!!!!! ఆడ మగల సంగమం మనిషి జన్మం, పాశం ప్రాణం సంగమం మనిషి మరణం, నీ పుట్టుకలో లేదు కులం ప్రస్తవన, నీ చావులోను లేదు కులం ప్రస్తావన, మరింకెందుకు ఉన్నన్నాళ్ళు కులం కొంపలోనే కాపురం పెడుతున్నావ్??? కులం కులం కులం అంటూ కాకి అరుపులేలరా, కులమా నిన్ను కన్న అమ్మ? కులమా నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మ ? ఏ దేవుడు చెప్పాడు కులమే నేనని, ఏ గ్రంధం చెప్పింది కులమే నా అర్ధం అని, కులం తో కొనగలవా కాస్తైనా ప్రేమను, కులం తో తేగలవా పోయిన ఆయువును, ఏముంది ఆ పదంలో పట్టుకుని ప్రాకులాడేంతలా, ఏముంది ఆ మాటలో మమతను మర్చిపోయేంతలా, వదలండి ఆ వాయిద్యాన్ని అదే పనిగ వాయించక, వదలండి ఆ వాడుకను అదే పనిగ వాడక, కులం కాదు సమస్తం, కలిసుంటే కలదు సుఖం!!!! కన్నారు, పెంచారు, కులాంతర వివాహం చేస్కుందని చంపేసారు, మనుషులమని మర్చిపోయిన మనుషులు వీళ్ళు, కులానికి బానిసలు, ఎన్ని దేశాలు తిరగాలో ఈ రోగానికి మందు కోసం!!! Date : 24/03/2014

by Sri Venkateshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rlAEKI

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• సమంగా రెండు దార్లు •• దేహంపై కనికరంలా కొంచం వెలుగూ మరో కొంచం చీకటి- సమంగా ఆనవాళ్ళు కళ్ళు తెరుచుకును సమయం- పాత కలల పెట్టె యే ఆశ్చర్యం ముందుకు నెడుతుందో- సమంగా మన దార్లు యే సమాదివైపు నడకో- ••• సమంగా రెండే రెండు దార్లు సమానమే వెక్కిరింత- నువ్ వెలుగు నడకై నేను చీకటి నిద్ర- 24-03-14

by Vijay Kumar Svkfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rlAEKu

Posted by Katta

Chakra Pani Yadav కవిత

ఆటవెలది పద్యం ముద్దు ముద్దు నోట,ముత్యాల నోటెంట లయల హొయల భాష, లయము లేని తల్లి భాషలోన తగు లెస్స మాటాడి తేనె లొలుకు తెలుగు తీపి నెరుగు

by Chakra Pani Yadavfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pqXNHE

Posted by Katta

Maheswari Goldy కవిత

మహేశ్వరి గోల్డి || కాం తి రే ఖ లు || మౌన పంజరాన ఓ మంచుబొమ్మనయి నవీకరిస్తున్న మన జీవన ప్రణాళికలు...!! మధూధయా...!! నవమోహినీ దివి నుండి రాలిన నెలవంక నగవుల సారధ్యంలో...!! మంత్రించిన ప్రేమజల ప్రవాహమనే ధారల నుండి రాలిన సుహాసినీ లతల అంచుల విరిసిన సుమభాలల కాంతి రేఖలు...!! మంచు దుప్పటి కప్పుకుని రహస్య మమతల రాజ్యంలో దాగిన మధుభాలలు మౌనలేఖలపై మధుర సంతకాలుగా సంతరించుకుంటున్నవి శశిధరా...!! భువిలో భాగ్య రేఖలేమో ఊహల పల్లకిలో భావి తరంగాలుగా సుశోబితమవుతూ మన ఊసుల ఒరవడిలో రాలిన మలి సంధ్య మౌనాలను సాహితీవనమున క్షయమే కాని అక్షయ తారలుగా కవిత్వీకరించమని నా మనసుని మౌనంగా ఆదేశిస్తున్నవి నీ సమాగమపు ఆనవాళ్ళలో...!! కాని మనోహరా...!! నమ్మలేని రహస్య ఇంద్రజాలమేదో విరితేనే కొలనులో కలహంస కలువ రేఖలపై నన్నూహిస్తూ అందమయిన మన స్నేహాక్షరాలను ప్రేమాక్షరాలుగా విశదీకరిస్తూనే ఉన్నవి యుగయుగాల ఉషస్సులో అనురాగ మంత్రాలతో రాగ పుష్పాలంకృతల సాక్షిగా ప్రియధరా...!! 24/03/2014

by Maheswari Goldyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gZSm1H

Posted by Katta

Krishna Mani కవిత

అక్షర సమిధ ************* అక్షర సమిధను నే ఓటమి ఎరుగని ఆయుధాన్ని ఆకాశానికి భూమి పైన మెరిసే చుక్కను నిరంతరం జన ఘోషకు ప్రతిద్వనిని జన జాతరలో ఉద్యమ పాటను ! పగిలిన గుండెల రూపుకు ప్రతిరూపాన్ని కమ్మరి కొలిమిలో బొగ్గుల క్రింది గాలి తిత్తిని రాజ్యహింసను అనుచుటకు లేచిన ఉగ్రకెరటాన్ని జనుల కన్నీళ్ళ తుడువ మెత్తటి గుడ్డను చీకటి నడకల తెల్లటి చొక్కాలపై సిరా మరకను ! బలసిన దున్నల ఎటకారపు ఓరకంట చూపుకు వేటగాడి చేతిలో బాణాన్ని శూలంల గుచ్చుకుంటా ! నున్ను ఆర్పే సాహాసం చేసే రాజకీయ కీచకుల్లారా మీ ఊపిరితిత్తుల స్పంజులు పగులుతాయి జాగ్రత్తా ! మీ భోగం క్షణికం నా వెలుగు నిత్యం సత్యం అనంతం నిరంతరం మీ అంతం తప్పదు ! నా వెలుగు తాకని చీకేటి ఎక్కడా ? లోకం చూపును ఆపే బలమేక్కడ ? నేనొక అక్షర సమిధను ! కృష్ణ మణి I 24-03-2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jtAKKC

Posted by Katta

Srinivas Yellapragada కవిత

యల్లాప్రగడ రాజా రవి శ్రీనివాస్ ||వెతుకులాట|| అతడు తప్పిపోయాడో ఏమో ఈ మధ్య కనిపించట్లేదు అతడొక్కడు చాలు అన్నింటికీ సమాధానం చెప్పగలవాడు ఇంద్రధనస్సు సప్తవర్ణాలూ కలిసిన చోట తెల్లని తెలుపులో కలిసిపోయుంటాడు విభేదాల కార్బన్ డయాక్సైడ్ ఎక్కువయ్యి చీకటి కప్పేసిన చోట ఆదరువు ఆక్సిజన్ తక్కువై మిణుకు మిణుకుమంటున్న విలక్షణత దీపంతోతిరుగాడుతుండుంటాడు కులమతప్రాంతజాతి సరిహద్దుల్ని చిర్నవ్వుతో చేరిపేయగల సామర్ధ్యమున్నవాడు అజ్ఞానాంధకారంలోతడుముకోకుండా ఆశయజ్ఞానదీపం వెలిగించగల చాతుర్యమున్నవాడు మనసు నగ్నత్వాన్ని నటన వలువలతో కప్పుకోకుండా లోకంలో తిరుగాడే దమ్మున్నవాడు ఫేస్ బుక్ లో ప్రకటించండి ఇంటర్నెట్ లో చాటింపు వేయించండి ఎక్కడున్నా పట్టి తెమ్మని ఇంతకీ అతడెవరంటే అతడి పేరేంటబ్బా... ఆ( ఆ( అతడే మనిషి అవునవును మనిషి ఇప్పటికే సమయం మించిపోయిందో ఏమో అయినా మన ప్రయత్నం మనం చేద్దాం ఈ ఒక్కసారికీ ఆఖరిసారని బతిమాలి ఎలాగైనా తెప్పిద్దాం ... 24MAR14

by Srinivas Yellapragadafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jtAMCk

Posted by Katta

రంజిత్ రెడ్డి కర్ర కవితby రంజిత్ రెడ్డి కర్రfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gZtt6d

Posted by Katta

Chi Chi కవిత

_ మానసవీణ_ లయమంతా లాస్యమయం బంధంలో స్వేచ్చను బంధించని సమాహారమేదో భావనై ఆ భావానికి బంధీగా సాగే ఊహల కెరటమేదో ఎగసెగసి పోతుంటే అందుకోలేని మౌనరాగాలకు భావమేముంది!! చదవటమే నేర్వటమై , నేర్చినదే నేరమైతే తీరలేని భావతృష్ణ ఏ రాగమవుతుందో? మౌనం శోకం కాదని తెలిసి , శోకం భావ్యం కాదని తెలిసి అలపించలేని ఆర్తి మనసుకే అందకుంటే, ఆ ఉహల కలలొస్తే కలలోనే కలిసిపోతామని కలవరించకుండానే కునుకు మరచి కూర్చుంటే సమరమాగిపోతుంది..మనసు పారిపోతుంది!!_____(24/3/14)

by Chi Chifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jsSaqT

Posted by Katta

Swatee Sripada కవిత

|| ఆత్మవంచన హేల || స్వాతీ శ్రీపాద మసక వెలుతురు అసురసంధ్య వేళ పరిమళ భరితంగా కాస్త కాస్త విచ్చుకునె తెల్లని రెక్కల మధ్య జలపాతంలా కురిసే కావ్యఝరి కోసం ఆకలి గొన్న పసిపాపలా తడుముకు౦టు’న్న సమయాన బిగిదీసుకుపోయిన ఒక పాలరాతి బొమ్మను తునకలు తునకలుగా మార్చి విసిరేస్తున్నట్టుగా అక్షరాల శిధిలాలు అమలిన శృ౦గార తేరు మీద దిగంతాల వరకూ విహరించి వచ్చిన స్వప్నాలు బిత్తర పోయి నగ్నంగా వలువలు వలిచేస్తుంటే ఒళ్ళు దాచుకుంటూ తలదించుకు చేతులు జోడిస్తున్నా అశ్లీలపు పునాదుల మీద అస్తిత్వాన్ని చాటుకునే తపన వరదల్లో ఆడతనం మరచిపోయిన ఇజాల క్రౌర్యానికి గజగాజలాడుతూ ............... ఒక జుగుప్స ఒళ్లంతా గొంగళీ పురుగులా పాకి ఒళ్లంతా నాకుతున్న ఏహ్యత. బూతు కళ్ళద్దాలు తగిలించుకున్న కళ్ళకు జనన మరణాలూ బూతుగానే కనిపిస్తాయి. అందమైన అక్షరాలు చేతికి దొరికితే చాలు ఈకలుపీకి అలంకారాలు తెగ నరికి రక్త మాంసాల ముద్దలా మార్చడం అది వాళ్లకు పేరుతో పుట్టుకు వచ్చిన విద్య. ఏమీ తోచక ఏమీ చెయ్యలేక ఏమీ అనలేక కుళ్ళిపోయిన గతంలో మళ్ళీ మళ్ళీ లేచి వస్తున్న జీవచ్చవాల నీడల్లో తిరుగుతూనే ఉంటాయి ఒంటి కొమ్ము రాకాసుల్లా బరితెగించిన భావాలు అహం సైకత స్వరాలూ గుప్పిళ్ళ కొద్దీ విసురుతూ బ్రతుకు ముక్కలను అసహనం ఆమ్లంలో వేసి మరిగిస్తూనే పోతారు వాకిలి తలుపులు మూసేసుకున్నాక అప్పటి దాకా చుట్టుకున్న ఆధునికత వస్త్రాన్ని విప్పి సతీ సావిత్రుల శరీరాల్లోకి దూరిపోతారు మళ్ళీ నలుగురిలోకీ వచ్చేవరకూ పురాణ పఠనాలూ పూజలూ కొనసాగుతాయి తెల్లారి వెచ్చని వెలుగు సిద్ధమయాక ఒ౦కెకు మడిగుడ్డ తగిలించి మళ్ళీ మొదలు ఆత్మవంచన హేల 24/3/14

by Swatee Sripadafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oQeQoh

Posted by Katta

Kavi Yakoob కవిత

కవిసంగమం శీర్షికలు .............................. 1) ఆదివారం :: కవిత్వంతో ఏడడుగులు ► శ్రీ నౌడూరి మూర్తి 2) సోమవారం :: ???[త్వరలో సరికొత్త శీర్షిక ప్రారంభం] 3) మంగళవారం :: చదివిన కవిత్వ సంపుటి ► శ్రీ టి రాజారాం 4) బుధవారం :: విశ్లేషణ ► తొవ్వ -అన్నవరం దేవేందర్ & విశ్లేషణ -. కవిసంగమంలో ఎంపిక చేసుకున్న కవితలపై ఇతర కవుల విశ్లేషణ 5) గురువారం :: ??? [ఈ వారం నుండే సరికొత్త శీర్షిక ప్రారంభం] 6) శుక్రవారం :: ఉర్దూ కవిత్వ నజరానా ► శ్రీ వాహెద్ 7) శనివారం :: The Winged Word ►శ్రీ శ్రీనివాస్ వాసుదేవ్

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gqO70h

Posted by Katta

Naresh Kumar కవిత

నరేష్కుమార్ //మో(డీ)డు వారిన చిత్రం// అతనొకరోజు ఉదయాన్నే "రా నేను దేవుడి బొమ్మ గీస్తున్నా చూడు" ఓ పాత్రనిండా కాషాయ రంగు చిక్కటి తేనీరందిస్తూ అన్నాడు భయంగానే కప్పు చేతిలో పట్టుకొని గదిలొకి నడిచాన్నేను... అప్పటికే కొందరున్నారక్కడ ఎవరి తలని వారు చేతుల్లో పట్టుకొని నా మెడలో వేళ్ళాడే మెదడుని భయంగా చూశారు ఓ పిడి బాకుని తీస్కొని గెడ్డం గాడి గుండెలో ముంచి కాన్వాసెదురుగా నించొని తెల్లని జుత్తూ బట్టతలతో దేవుడి తలని చిత్రించి అన్నాడు "చూడూ ఎంత మా దేవుడికి ఆర్భాటాలు నచ్చవు అందుకే కిరీటం పెట్టుకోలేదు" అన్నాడు తలూపాను మెడలో మెదడు భయంగా గది పైకప్పుని చూస్తోంది.. "మా దేవుడు కరుణకి ప్రతి రూపం శాంతి స్తాపన కోసం ఎన్నో తలలని నరికాడు గోవులని చంపుకు తినే వాళ్ళనైతే లెక్కేలేదు గొప్ప వీరుడు" అంటూ బాకుతో ఆ దేవుడి చేతుల్లో గదనీ,శూలాన్నీ చిత్రించాడతను పక్కనే ఒక మొండెం లేని తల అరిచింది "వాడు నా మొండాన్ని తినేసాడు" అని వెంటనే ఆ చిత్ర కారుడు ఏయ్ నువ్వెప్పుడూ ఇంతే నీ తక్కువ తనాన్ని చూపించి మా అవకాశాన్ని లాక్కుంటావు" అంటూ చిత్రం లోని గద తో ఆ తలని చితక్కొట్టాడు మొకమ్మీద చిమ్మిన రక్తాన్ని తుడుచుకున్న నాతో "పేపర్లో ఇవన్నీ రాయలేవు" అంటూ నా కలాన్ని లాక్కుని చిత్రాన్ని గీస్తున్నాడు అప్రయత్నంగా వెనక్కి జరిగి గోడనానుకున్నాన్నేను అక్కడ వేళ్ళాడే దేశ పటం వణుకు స్పష్టంగా తెలుస్తోంది నాకు.. ఆ రాత్రంతా అతనా చిత్రాన్ని గీస్తూనే ఉన్నాడతను... చివరిగా "చూడు దేవుడి చిత్రం" అంటూ నా వైపు చూసాడు "అది అది మోడీ...! కాదు కాదు అదీ నువ్వే" అరిచాన్నేను వెంటనే అక్కడున్న వాళ్ళంతా చేతుల్లోని తమ తలల్ని ఓ మూలకు విసిరేసి నా వెంట పడ్డారు "ఏయ్ మా **మున్ని వ్యతిరేకిస్తావా" అరిచాడొకడు తన తోకని సవరించుకుంటూ భయంగా గది భయటికి పరుగు తీసాన్నేను అక్కడ వేలాది మందిని. నరికేస్తూ,యోనుల్లో త్రిశూలాలని దిపుతూ నవ్వుతున్నాడు వాడు వాడు...వాడు వాడే... *డీ...!? నిస్సహాయంగా నిలబడ్డానేను "మా ఇల్లు దర్మసత్రం కాదు" మెమంతా గంగా సింధూ బిందువులం" అరుచుకుంటూ పరుగు తీస్తున్నారు వాళ్ళు కుప్పలుగా పోగుపడ్డ మానవ మాంస ఖండాల మద్య భయంగా నిల్చుని ఉందో స్త్రీ మూర్తి ఆమేనే ఆకలిగా చూస్తూ కదిలాడు వాడు.. లేదు లేదూ... వద్దూ వాద్దూ... "జై భారత్ మాతా" అరుస్తూనే చేతికందిన బాలెట్ బాక్సు తో వాడి బట్ట తలపై కొట్టాన్నేను చచ్చాడు దేవుడు గాడు... 24/03/14

by Naresh Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oQeT3v

Posted by Katta

Katta Srinivas కవిత

పుస్తక ప్రచురణ : ప్రత్యామ్నాయ దృక్పదాలు ఆలోచనలను అక్షరాలుగా మార్చి తరాల అవతలి వరకూ సైతం బావాలను చేరవేసే సాధనాలుగా పుస్తకాలను అచ్చొత్తుకుంటున్నాం. కథలో, కవితలో,వ్యాసాలో మరోకటో మరోకటో పుస్తకంగా రావాలంటే వేలాది రూపాయలు మళ్ళీ పుస్తకం అచ్చొత్తుకున్నంత ఆవిష్కరణలూ, కొరియర్లూ, బుక్ పోస్టులూ సమీక్షకులను సంతృప్తి పరచే విధానాలూ ఇలా నానా తంటాలూ పడినా పాఠకుడికి ఎంతవరకూ చేరుతున్నామో అర్ధంకాని స్థితి. ► నిన్ననే Baskar Kodreddy గారు తన కవితలను వాక్యం పేరుతో తనే పుస్తకంగా తయారు చేసి పాఠకుడి చిత్రాన్నే తన కవర్ పేజీగా ఇస్తూ నాకొక కాపీ పంపారు. తనే వాక్యం మొదటి సంపుటిని కలర్ క్రేయాన్స్ తో డెకరేట్ చేసింది తయారు చేసారు. కవిత్వం పాఠకుడిని చేరటమే ముఖ్యం అయినపుడు కోకడాబుకే మరింత ప్రాధన్యత అవసరమేం లేదు అనే తన ఆలోచన నన్ను మరోసార వెనక్కి తిరిగి చూసుకునేలా చేసింది. ► కరీంనగర్లో సాహితీ సోపతి మిత్రులంతా నెలకోమాటు నెలనెలా వెన్నెల పేరుతో ఒకరి ఇంటిదగ్గర మామూలుగా నేలపై దీపం చుట్టూతా కూర్చుని వారు వెంటతెచ్చుకున్న కవిత్వాన్ని మిత్రులకు చదివి వినిపిస్తారు. అవే కవితలని హంగూ ఆర్భాటాల జోలికి పోకుండా వారికి అవసరమైనంత మేరకే పుస్తకాలుగా కేవలం బ్లాక్ అండ్ వైట్ లో తయారు చేసేసుకుని ‘‘ఎన్నీల ముచ్చట్లు’’ పేరుతో విడుదల చేస్తున్నారు. తమ కవిత్వం ఇలా పుస్తకంలా పదిల పరచడం ఎందరినో ఉత్తేజితం చేస్తోంది. ► యశస్వీ సతీష్ గారు తన మొదటి పుస్తకం ‘తెల్లకాగితం’ కానీ తరువాత మిత్రుల కవితత్వాలను గురించి రాసిన ‘ఒక్కమాట’ పుస్తకం కానీ ఆన్ లైన్లో ప్రభుత్వం వారిచే ఉచితంగా విడుదల చేసిన యూనికోడ్ అక్షరాలను, కేవలం వర్డ్ ఫైల్ లో మెర్జింగ్ విధానం ద్వారా అందంగా అమర్చుకోవడం ద్వారా ప్రింటుకు తీసుకుని వచ్చారు. ► కినిగే లాంటి ఆన్ లైన్ వెబ్ లలో మన పుస్తకాలను కేవలం సాఫ్ట్ కాపీలుగా విడుదల చేసుకునే అవకాశం పుష్కలంగా వుండి, కాంటెంట్ వుంటే కొనుగోళ్ళ వల్ల రచయిత డబ్బు సంపాదించుకునేంత అవకాశం కూడా వుంది. లేదంటే అనేక వెబ్ మ్యాగజైన్స్ పుస్తకాలను ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నాయి. ► మొత్తంగా మహా అయితే వెయ్యి కాపీలు వేసి అందులో సగమో ముప్పాతిక శాతమో పంచుకుంటే అందులో పదిశాతం మంది సరిగ్గా మనసుపెట్టి చదివితే ఎంతమందికి చేరుకుంటామో తెలియదు కానీ ఇప్పటికే వేలాది మంది కొని చదువుకునే పాఠకులున్న అచ్చులోని సాహితీ పత్రికలే కాకుండా ఉచితంగా అందుబాటులో వుండే ఆన్ లైన్ సాహిత్యా స్థావరాలలో నైనా అప్పుడొకటి అప్పుడొకటిగా వెళ్ళినా ఆలోచనల షేరింగ్ జరిగే అవకాశం వుంది. పుస్తకం డిటీపీ, కవర్ డిజైనింగ్, రంగుల అచ్చులూ, బోలెడంత ఖాళీలను అనవసరంగా వదిలేసే డిజైన్లూ, కృత్రిమ బూమింగ్ కోసం డబ్బుల బోగిమంటలతో చేసే అనవసరపు హడావిడీ ఇవ్వన్నీ తగ్గించుకునేందుకు మనం ఇంకా చెయ్యాల్సింది చాలా మిగిలే వున్నట్లుంది. తీరా తయారైన పుస్తకం సరిగా మండల స్థాయివరకూ కూడా కావాలనుకునే పాఠకుడికి సరిగా అందజేసేందుకు అమ్మిపెట్టే, అద్దెకిచ్చే,లేదా ఉచితంగా పంచగల సరైన యంత్రాంగాల అవసరం కూడా వుంది. అలాగని అత్యంత చీప్ ప్రింటింగ్ తో వచ్చేయాలనేది కూడా సమంజసం కాదేమో, ఒక ‘శివ ట్రయాలజీ’ లా పకడ్భందీ ప్రణాళికతో పాఠకుడికి మనమేం ఇవ్వబోతున్నామో తెలియజేయగలిగేంత నాణ్యత ప్రకటనలోనే కాదు. ముఖ చిత్రంలోనూ పుస్తకం ఆకారంలోనూ వుండాల్సిందే. చదువుకునేందుకు సౌకర్యంగా వుండేంత చక్కటి డిజైనింగ్, కాంటెంట్ కాలనుగుణ్యతను అనుసరించి అది వుండాల్సినంత కాలం వరకైనా పరిస్థితులను తట్టుకుని నిలబడేంత గట్టిదనం వుండాలేనేదీ నిజమే. అతి పొదుపు - అతి ఖర్చులను జాగ్రత్తగా బ్యాలన్స్ చేయడానికి కూడా మళ్ళీ పుస్తకం కోసం తెలుసుకున్నంత నేర్చుకోవలసిన విషయంలానే వుంది. ఆన్ లైన్ పుణ్యమా అని టైపింగ్ నుంచి డిజైనింగ్ దాటుకుని పబ్లిషింగ్ విషయంలోనూ రెక్కలు విప్పుకుంటున్న స్వతంత్రతకు వందనం.ఇది మరింతగా ప్రవర్ధమానమై నూరుపూలలా వికసించాలి, వేయి ఆలోచనలుగా వర్షించాలి, లక్షలాది బీజాలను మొలకెత్తించాలని కోరుకుందాం. జయహో అక్షరం....

by Katta Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jrr0Rd

Posted by Katta

విష్వక్సేనుడు వినోద్ కవిత

మనమిద్దరం !! ఏ సముద్ర కెరటమో వెన్నెల ప్రతిబింబాన్ని కదలాడే వెండి తివాచీలా పరిచినపుడు; ఏ తొలకరి మేఘమో చల్లని చిరు జల్లుల్ని వర్షించే నీటి వజ్రాల్లా కురిపించినపుడు; ఏ వేకువ కిరణమో బంగారు కాంతి రేఖల్ని విరాజిల్లే మేటి తేజస్సులా ప్రసరించినపుడు; పరిమళించే ప్రేమను మదినిండా మోసుకువచ్చిన నీవు..... ప్రతి నిమిషం ప్రయాసపడి నీ పిలుపుకై పరితపించేనేను..... ఎప్పటిలానే అప్పుడప్పుడూ ఎప్పుడూ కలుస్తూనే ఉంటాం!! ఎప్పుడు కలిసినా అప్పుడప్పుడే ఎప్పుడూ జన్మిస్తూనే ఉంటాం!! ప్రతి ఉదయం కొత్త జ్ఞాపకాల్ని పేరుస్తూ ప్రతి రేయీ పాత జ్ఞాపకాల్లో మరణిస్తూ ఎందుకో తెలియదు మళ్ళీ మళ్ళీ జన్మిస్తాం! అర్ధంతరంగా మౌనంతో ఇరువురం మరణిస్తాం !! 23/03/2014

by విష్వక్సేనుడు వినోద్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jrr0QY

Posted by Katta