పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, సెప్టెంబర్ 2012, శనివారం

కట్టా శ్రీనివాస్ || గజ్జెల సవ్వడి

వ్యాసమయితే ఓ పట్టున వండొచ్చేమో ఇక సిరి.
కవితైతే కష్టపడి పండించాల్సిందేరా సిరి

వేదికైతే వీరనటన చెయ్యొచ్చేమో మరి
వాస్తవాన ఎవడికైన జీవించటమే తప్పనిసరి

మోహపు జవనాశ్వాలు ఉరుకుతుంటే మరిమరి
మొహంపైన రంగులేవి నిలువవురా ఓ సిరి.

దు:ఖపు తడి చారికకే భయపడి
నవ్వుల నాడా దింపకు మేకులతో పడిపడి.

ఊహలకే సౌదాలను వడ్డిస్తావా కొసరి.
వాస్తవాల వర్షంలో కరిగి పోతాయిరా సిరి.

రాళ్ళబండి కవితా ప్రసాద్ || నేను నాకు తెలుసా!


ఎక్కడో ఒకడు కవిత్వం రాసి
నోబెల్ ప్రైజు తెచ్చుకుంటాడు,
అది చదివి ఇంకొకడు
గుండె పగిలి చచ్చి పోతాడు,
అక్షరాలకి
ఈ రెండు సంఘటనలు తెలియవు!

ఒకతెను చూసి
ఇంకొకడు ప్రేమిస్తాడు.
ఆమె ఇంకొకడితో లేచి పోతుంది,
ప్రేమకు
ఈ రెండు విషయాలు తెలియవు!

నువ్వు నన్ను తిడుతూ ఉంటావు,
నేనునిన్ను పొగుడుతూ ఉంటాను,
తిట్లకు,పొగడ్తలకు ,
మనమెవరో తెలియదు !

సూరీడు ఉదయిస్తున్నట్లు తూర్పుకు తెలియదు
అస్తమిస్తున్నట్లు పడమరకు తెలియదు
ఇంద్రధనుస్సు పుడుతుందని చినుకుకు తెలియదు
మేఘం గా మారినట్లు అలకు తెలియదు
తుపానొస్తుందని సముద్రానికి ,
భూకంపమొస్తుందని నేలకు,
అందంగా ఉన్నానని వెన్నెలకు ,
అలాలేనని చీకటికి ,
తెలియదు.
మరి , నేను నాకు ఎలా తెలుస్తాను !?!?!?

ప్రసాద్ తుమ్మా || నా తెలంగాణ ||

ఒక్కసారి పురాణాలను చూడు
కన్నులుంది చూడలేని అంధ దేశం నీది
తేనెలొలుకు తెలుగుదనం గల
తెలంగాణ నాది
చిన్నప్పుడు ఆడుకొనేతోల్లం
గద్దోచ్చే కోడి పిల్ల కియ్యం కియ్యం ప్ర
గట్లనేతోడు లేకపాయే
మా కొలువులు , భూములు తన్నుకుపాయే
వున్నది ఘాడంధకారమైనప్పుడు
వెలుగై పోరాడక తప్పదు
సూర్యిడిలా నిప్పులు కురిపించక తప్పదు
దిగిరమ్మనే నీ ఆరాటానికి
పై కేగిరి చూపిస్తా నా పోరాటం
వలసవాదం పేరుతో రాజ్యాలను కబలించకు
చరిత్ర పునరావృతం చేయకు
భాష పేరుతో లేని బంధాన్ని చేర్చి చిచ్చు పెట్టకు
* * *

మా ఇంటిని ప్రేమ శాంతితో నింపటానికి
ఆకాశ హద్దుల వరకు నా తెలంగాణాను రక్షిస్తూనే వుంటాను
ప్రతి హృదయ స్పందనలో
ప్రేమ పూర్వక తెలంగాణా మధురాన్ని నింపుతా

మా హక్కులకై మేం ప్రతిఒక్కరమ్ పోరాడుతూనే వుంటాం
నాలుగుకోట్ల మంది బతుకు సాకారానికై
బలిపీథాలపై బలిదానాలవుతూనే వుంటాం
ఎంతగా అణచితే అంతగా వసూవియస్లా లేస్తాం
ఉస్మానియా యోదులారా, ఆశయ సాధన అమరులారా
మీ వెంటే మేం వున్నాం, తెలంగాణ వెంటే వున్నాం
***

నా సహోదరుడు కాలయముడై కాటేస్తే
నా చేతులు, కాళ్ళు, తల అన్నీపోగొట్టుకున్నాను
రుధిరదారలై నా వీణను సరిచేసుకుంటూ
మా రక్తపు దోశిలితో పట్టాభిషేకం చేయుంచుకున్నావ్
నా కోటి రతనాల వీణకై
రక్త నాళాల గోడలు పగిల్చి
రుధిరదారలై మరో లాంగ్ మార్చ్ కై టాంక్ బండ్ ల మవుతాం
పరమానువులోనైనా ప్రాణ వాయువునవుతా
ఆరు దశాబ్దాల అబద్ధపు ప్రచారాలకి
మనోవేదన చెందుతున్న తల్లికి
నా ఎండిన పెదాలే సాక్షిగా
పగతో రగులుతున్న నా స్వర శబ్దాలే
త్యాగాలకు బాటలు వేస్తుంది.

date 13-09-12

ఎ.నాగరాజు || వ్యాఖ్యానం ||


మరణం ముంగిటి దుఃఖంలో తడిచి ఉబికిన
దూదిపింజల కన్నుల ముందర నిలుచున్నాను

ముట్టుకున్నపుడు
మాటలు రాని వెల్లువ ఒక్కటే కనుకొసలలో
భాషగా పెల్లుబికినప్పుడు అతనితో కలసి వొక మహాప్రవాహపు సుడిలో
అల్పపు గడ్డి పోచగా మునిగి తలకిందులయ్యాను

ఎవరో ఏదో మాటాడినపుడు
జీవితానికీ మరణానికీ వ్యాఖ్యానపు తొడుగును ధరింపజేస్తున్నపుడు
పరిపరివిధాలుగా మరింత సన్నని తీగపై హద్దులను చెరిపి సరిచేస్తున్నపుడు
కాసేపు అన్నింటినీ పక్కన పెట్టి మోముపై భయ విస్మయ రేఖనయ్యాను

మరణాన్ని
ఒక చివరకు చేరి తీరవలసిన తార్కిక సరిహద్ధుగా ఎవరో ఖండితస్వరంతో పరిచయం చేసినపుడు
సర్వమూ ఖాళీ అయిపోయిన అనుభూతిగా
కొయ్యబారి ఎవరైనా వొక మాటతో వొక నమ్మకంతో
భుజాన చేయి వేసి ఊరడిల్లజేస్తారని ఎదురు చూసాను

ఎన్నింటినో విని కేవలం మాటలలో మాత్రమే మునిగి తడిసిన ఊహలను దాటి
అనే్క చావులకు చిరునామాగా మిగిలిన దారులలో తిరుగుతూ
వేసిన ఒక్కో అడుగుకూ అంటిన నెత్తుటి శ్వాస పాదాలలో గడ్ద కట్టుకపోయి కాలాన్ని మృత్యు కరస్పర్శగా పరిచయం చేస్తున్నపుడు
ఆ ఎరుకలో తిరిగి తిరిగి రూపొందుతున్నదేమిటో తరచి చూసాను

పండిన వొక ఆకు
గాలిలో సుడులు చుడుతూ నెమ్మదిగా మట్టి తాకిన తన్మయత్మం
వొక పువ్వు ఫలించి నేలకు రాలి ఇంకో జీవితానికి వాగ్ధానమవ్వడము కాక

నిజంగా బతకడం అర్థాంతరంగా ముగిసిపోయే వాక్యశకలమని
ఒక చేయి మరొక చేతితో కలిసే లోగా స్థంభించి పోయే భీతావహ దృశ్యమని సరిపోల్చుకున్నాను

కాంటేకార్ శ్రీకాంత్ // పొక్కిలైన నేల //


తెలంగాణలాగే
నాదీ ఒక ఒడవని సంభాషణ
ఏమని మొదలుపెట్టను
ఎక్కడి నుంచి చెప్పుకురాను
తొలి పోరాటంలో అసువులు బాసిన
370 మంది వీరుల త్యాగాలను కీర్తించనా!
మలి పోరాటంలో
నిప్పుకు మలమల మాడిన
ఉరితాడుకు బిగిసిన
850 మంది అమరుల ఆకాంక్ష గురించి చెప్పనా!
ఏది చెప్పినా ఆగని దుఃఖమే
నా మాటల కన్నా
జలజలరాలే నా కన్నీళ్లు ఎక్కువగా చెబుతయి
తెలంగాణల ఆవరించిన వేదనాభరిత జీవితం గురించి
ఎదిగివచ్చిన కన్నబిడ్డలు దూరమైన
అమ్మల దుఃఖాన్ని వివరించనా?
ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి
అంధకారం అలుముకున్న
కుటుంబాల శోకాన్ని వర్ణించనా?
శ్రీకాంతచారి, యాదయ్య, ఇషాన్ రెడ్డి, యాదిరెడ్డి
ఇలా ఒక్కరా.. ఇద్దరా.. ఎందరెందరో
ఒకే ఒక ఆకాంక్ష కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు
మా చావుతోనైనా పాలకులు కళ్లు తెరుస్తారేమో!
అనైతిక ద్వంద్వ నీతిని వీడి ధర్మపక్షమైన
తెలంగాణకు సై అంటారెమో!
మా మరణంతోనైనా రాజకీయ నాయకులు ఒక్కతాటిపైకి వస్తారెమో!
తెలంగాణ కోసం ఒక్క అడుగైనా పడుతుందేమో!
అన్న ఆశతో 850కి పైగామంది అమరుల జాబితాలో చేరారు
త్యాగాల దారిలో పొద్దుపొడుపులయ్యారు

ఏం జరిగింది
త్యాగాల బలిపీటం
తెలంగాణ యదపై ఆరని నిప్పుల కుంపటిగా ఎందుకు మారింది
ముక్కు పచ్చాలారని విద్యార్థులు,
యువకుల ప్రాణాలను ఎందుకు హరిస్తోంది
యదనిండా గాయాలతో తెలంగాణ
పొక్కిలైన వాకిలిలా ఎందుకు వలపోస్తోంది

కారణం తెలుసా?
ఒక ఘనమైన ప్రజాస్వామ్యం
ఒక ఘనమైన పార్లమెంటు
ఒక ఘనమైన కాంగ్రెస్ ప్రభుత్వం
ఒక ఘనమైన సోనియా పుట్టిన రోజు
ఒక ఘనమైన డిసెంబర్ 9 ప్రకటన

అంతకన్నా ఘనమైన బూటకపు నీతి
ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని నిలువెత్తు దౌర్భాగ్యం
ప్రజా ఆకాంక్షను నిలబెట్టలేని నీచమైన రాజకీయ వ్యవస్థ
పెట్టుబడిదారులు, మాటమార్చే దగాకోరు రాజకీయ నేతలకు
వంగి వంగి సలాం కొడుతూ
గులాములైన పాలకులు, నాయకులు

తెలంగాణ ఎన్నిసార్లు తర్కించుకొని ఉంటుంది
ఎన్నిమార్లు ఆవేదన చెంది ఉంటుంది
ఘనమైన పార్లమెంటు ముందు
ఘనంగా చేసిన ప్రకటనను కూడా నిలబెట్టుకోరా?
అప్పటిలాగే ఇప్పుడు ఎప్పుడూ
మా పట్ల ద్రోహమే మీ పాలకుల నీతా?
ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని
ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వం, ఈ నాయకులు
చీము, నెత్తురు లేకుండా
సిగ్గు, శరం లేకుండా
అవే తలలతో ఎలా తిరుగుతున్నారు?
అమ్మా, అయ్యకు పుట్టలేదా?

తెలంగాణకు వెలుగు పంచాల్సిన
ఎన్ని చిరుదివ్వెలు చీతాభస్మాలవుతున్నా
తెలంగాణ ఇంకా ఒక నెరవేరని స్వప్నమే!
త్యాగాల సాలులో రాజకీయ మోసాల జిల్లేళ్లు మొలుస్తున్నాయి
ఢిల్లీ పాలకుల్లో ఉలుకూపలుకూ లేదు
ఇచ్చిన తెలంగాణ తెచ్చుకోవడంలో ఇక్కడి నాయకుల్లో చలనం సచ్చిపోయింది
మళ్లీ పోరాటమే శరణ్యం
కలెబడి, తెగబడి కదం తొక్కితేనా తెలంగాణ
ఇంట్లో గూకుంటే రాదు

పి.రామకృష్ణ // పాటకు జే జే //

నీ పెదాల మీద వాలాకే,
బహుశా
గాలికి గుర్తొచ్చి వుంటుంది-
తనూ పాటననే సంగతి.

వెదురుకి వెంటిలేటర్ లాంటి
నీ నిచ్వాస.
వెదురు వేణువయ్యాక,
నీ పాటే కదా వుచ్వాస.?

పల్లవీ, చరణానికి మధ్య
సమయాన్ని, సంగీతానికి వదిలేసి,
మౌనంగా మిగిలిపోయే నువ్వు-
ఎంత ముచ్చటేస్తావో మరి.

నీ అధరాల పై నడిచొచ్చిన-
పదాల్ని-
పదే పదే నా పెదాలమీద-
తడి చేసుకుంటుంటాను.
ఎంత అందమైన ముద్దో కదా అది?

తాధ్యాత్మికతతో నువ్వూ,
తన్మయత్నం లో నేనూ

కళ్ళు మూసుకుని

పాడే నువ్వు,
పాటే నేను.

నీ పెదాల మీద వాలాకే,
బహుశా-
గాలి గమనించి వుంటుంది.
పాటా, ప్రాణమూ తానేనని.
___________________

13-09-2012

( జోహెన్స్ బర్గ్ వెళ్ళిపోతున్న స్నేహితురాలు జ్యోతిర్మయికి. )

కెక్యూబ్ వర్మ ॥ నిశ్శబ్ధాలాపన ॥


ఒక్కో అక్షరమూ దేనికదే విడివడి
అంటిన రక్తపు మరకల జిగురును వదిలించుకుంటుంటే...

మగ్గంపై నేస్తున్న నార వస్త్రంలా
ఒక్కో దారప్పోగూ దేనికదే చిక్కుముడిలా...

అద్దుతున్న ఏ రంగూ
కుంచెనుండి కాగితంపై ఒలకక....

ఒడ్డున కాలికంటుతున్న ఇసుక రేణువుల్లా
దేనికదే శిలలా కరగనితనంతో...

దోసిలి సందులలోంచి ఒక్కో నీటి బొట్టూ
జారిపోతూ తడి ఇరిగిపోతూ....

గాలి వీయనితనమేదో
గుండె అరలలో ఉక్కపోతను ఆరబెడుతూ...

మూగబోయిన గొంతు నుండి సన్నని జీరలా
ఓ రాగం తనలో తానే ఇంకిపోతూ నిశ్శబ్ధాన్ని ఆలపిస్తూ...

భమిడిపాటి || నీ మనసే కవిత

నిద్ర రానంటోందా
రెప్పల మాటున దాగి
కనురెప్పలు మూయనంటోందా
మోరాఇస్తున్నదా ..!

పదాలు దొరక్క పెదాలు
అలసిపోతే
నీ కవితను చూడాలనే ఆశతో
నీ కనురెప్పలు విచ్చుకుంటున్నాయా ..!

పోనీ
పెదాలు అలసి పోనీ
మనసుమాత్రం ఊరుకోదు
ఊపిరిని కలంగా మార్చి నీ మనసునే కవిత చేస్తుంది ...

అప్పుడేం చేస్తావ్ ..? 09/14

మోహన్ రుషి //లోపలి బాల్కనీ!//

చెప్పడానికేమీ ఉండదు కొన్నిసార్లు
మాట్లాడ్డానికి అసలే ఉండదు
అకారణ అశాంతి కదా, ఏం చెయ్యలేం-
అస్పష్టమైన అలజడిని భాషలోకి అనువదించలేం!

మనుషులా, మానని గాయాలా,
మర్చిపోలేని ఘటనలా, మననం చేసుకున్న నటనలా?
ఏ ఒక్కదాన్నీ వేలెత్తి చూపలేం
ఏ చీకట్లో కాటు కలిసామో
ఎంతకీ తేల్చుకోలేం!

మోస్తూనే నడుస్తాం
మౌనంగా అరుస్తాం
అనంతమైన ఆలోచనల్లోంచి
అసలెప్పటికైనా బయట పడ్తామా అని భయపడ్తాం!

ఆశల గడ్డిపోచలకోసం
అవని అంతా కలియదిరిగి
దిగులు రాగాలు ఆలపిస్తాం
ఆవలి తీరంపై మోహం తప్ప
జీవితానికి పెద్దగా అర్థం లేదనే
తక్షణ సమాధానాల్ని రక్షణగా నిర్మించుకుంటాం
నిర్లిప్తతలోంచి నిర్లిప్తతలోకి నిశ్శబ్దంగా జారుకుంటాం!

13. 9. 2012

క్రాంతి శ్రీనివాసరావు || చందమామా చందమామా ||

చందమామా చందమామా
ఎండ పొడను ఇంట్లోకి కొట్టే
మా చిన్నోడి చేతిలో అద్దానికీ
నీకూ పెద్ద తేడా ఎముందో

అవునులే
అమృతానికి ముందు పుట్టి
సూర్యరశ్మిని సగం తాగి
ఎంగిలి చల్లదనం అంటించి
చల్లుతున్నవుగా
ఆమాత్రం తియ్యదనం వుంటుందిలే

చీకటి చారిత్రాత్మక తప్పిదం
ఏదో చేసినట్లుంది
అందుకేనేమో
చారెడులేని నీవు
చీకటి కన్నులలో
వెన్నెల కన్నీళ్ళ వరదలను
పారిస్తున్నావు

అవునూ
చల్లముంతలో
మా అమ్మ చేసిన వెన్న ముద్దకూ
ఆకాశం లో వెన్నెల ముద్దకూ
తేడా ఏమిటో

ఒక వైపు రాక్షసులూ
మరోవైపు దేవతలూ
చిలికితే పుట్టింది వెన్నెల ముద్ద

రెండు వైపులా
మాఅమ్మ చల్లని చేతులు
చిలికితే పుట్టింది వెన్న ముద్ద

ఎటొచ్చీవెన్నెలా వెన్నల మధ్య
పాలు మజ్జిగ తేడానే

బ్రహ్మకు పౌ్త్రుడవు
మహావిష్ణువు బావమరిదివి
శంకరుని తోడల్లునివి
నీకేమయ్యా
అధిస్టానమంతా అండగా వున్నప్పుడు
కలువలకు కన్ను గీటుతూ
చుక్కల పక్కలో పడుకొని
చక్కదనాలు పోతున్నావు

చందమామా చందమామా
నీ గుట్టు తెలిసిందిలే ఇప్పుడు
పురాణాల జమానాలు పోయాయు
నీ వెంత కమ్మని వెన్నెల కార్చుతున్నా
మనుషుల కన్నులు ఏమార్చలేవిప్పుడు
మట్టి బొంగరాని వని మాకందరికీ తెలిసిపోయుంది

అందుకే
కొలత గొలుసు లేసుకొని వస్తున్నాం
నిన్ను ప్లాట్లూ ప్లాట్లు గా చింపి
తలా ఒకటీ పంచుకొని
వెన్నెల మట్టి వేళ్ళతో కలసి
వేరు కాపురం పెడతాం

రాళ్ళబండి కవితా ప్రసాద్ || ఆకాశం లో దేవుడి జోలెకు ||

చిల్లి పడింది.
చెల్లాచెదరు గా
నక్షత్రాలు!
....
భక్తుల కోరికల ధూళి తో
గర్భాలయం
నిండిపోయింది.
దేవుడు
బయటికెళ్ళి పోయాడు!
....

ఉల్క

నక్షత్రపు
కన్నీటి చుక్క?!
....
చెరువునిండా
కలువపూల సమూహం
ప్రతి పూవుది
ఒక ఏకాంతం!
.....
.....
చిటారు కొమ్మకు
చేరేదాకా
చెట్టంతా
చేదని తెలియదు
దిగిపోయే ఓపిక లేదు
పైకి దారీ లేదు

పులిపాటి గురుస్వామి || నా సెలయేరు హృదయం ||


అనేక మంది రాజులు
గుర్రాల మీదుగా జారి పడ్డారు

అనేక మంది రాణులు
ఉద్యాన తోటల్లో కాలు జారారు

అనేక రాజ్యాలు సుందర మైనవి
మోచేతుల గుండా జారి పోయాయి

ఈ మసక లోకం లో
శాశ్వతానికి చిరునామా లేదు
ప్రియురాలా...!
ఈ రాత్రిని బెదరనివ్వకు.

.....
DR GURUSWAMY PULIPATI

యాకూబ్ ॥అయితే ఇలా...

అపుడపుడూ
పువ్వులమధ్య,పరిమళం మధ్య నిద్రపోవాలి
చెంగుచెంగున ఎగిరే చేపపిల్లల్లా తుళ్ళాలి

అలజడిని హాయిగా
గుండెలకు హత్తుకునే మంత్రమేదో నేర్చుకోవాలి

ఒక క్షణమైనా ఒంటరితనాల వనాలపైన వానలా కురవాలి
ఒక నీటిచుక్కలానో,ఒక అల్లరల్లరి పాటలానో
అక్షరంలోకి ఒదగని
ఒకానొక ఏకాంతక్షణంలానో మెరవాలి

బలవంతంగా కాక
ఇష్టంగా బతకాలి...!

యాకూబ్ ॥ ఆమె తలపులు


అనాదినుండి ఆమె నాకు తెలుసు
నేను బంధింపబడి ఉన్నాను

ఆమె కోసం నేనేమి చేయగలను?

అనుభవాలు,ఘట్టాలు
ఆమె నుండి నాలోకి ప్రసరిస్తాయి
నా లోపల విసురుగా కొట్టుకునే తలుపులు
=ఆమె తలపులు

కాలపు దాగుడుమూతల్లో
ఆమెకు నేను; నాకు ఆమే దొరకబోం !

ఆమె నన్ను
ప్రతి తోవమలుపు దగ్గర
గోముగా చూస్తూనే ఉంది
నాలోని వాంఛల్ని నిందిస్తూనో,ధిక్కరిస్తూనో
అన్యాపదేశంగా మాట్లాడుతూనే ఉంది

చిన్నతనంలో,యవ్వనంలో,వృద్దాప్యంలో
వేర్వేరు రూపాలుగా తటస్థపడుతూనే ఉన్నాం

*
బంధింపబడి ఉన్నాను
ఈ బంధనాలు తెంచుకోనూ లేను.

--------------------------
*పాతవాచకం,12.9.2012