పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, ఆగస్టు 2012, శనివారం

శ్రీ || గీతలు ||


నాజీవితంల
నాకు ఎరుకైనవి రెండే గీతలు.
పనిముట్టు చేసిన రాపిడికి
అరిగిపోయిన నా చేతి గీతలు,
చేతిల అరిగి పోయిన గీతల్ని
చెమటతో నా నుదుటిపై
గీసుకున్న శ్రమ గీతలు

గిప్పుడు గీడెవడో
మాంటెక్ సింగో.. మాయల ఫకీరో
ఎవడైతేనేం లే
ఇద్దరూ చేసేది కనికట్టేగా.
వీడు మాయాజాలంలో
బ్రహ్మ దేవుణ్ణే మించినోడు
నా నుదుటి మీద
బ్రహ్మ గీసిన దరిద్రపు
గీతల్ని చెరపనీకొచ్చిండట.

ిఅంటే ఇప్పుడు రోజూ రాత్రి
మా పొయ్యిల పిల్లి పండుకోదా?
మా పోరలు కూడా
బడికి పోతరా?
మా ఇంట్ల ఇగ నుంచి
వాన నీళ్లు గుంతల్జెయ్యవా?
రోగమొస్తె మాగ్గూడ
సూది మందులిత్తరా?
గీ మాత్రం గాకుండ
మా దరిద్రమెట్ల పోతది?

దరిద్రమంత బోగొడతనంటే
అబ్బో మా దొడ్డ మనిషినుకున్న.
వీనింట్ల పీనుగెల్ల
పెతోనికి పేదోడంటే
అలుసైపోయింది.
పేదోడి ఆశతోని, ఆకలితోని
ఆడుకునుడు అలవాటైపోతంది.
ఇంతకి వీని ఘనకార్యం జెప్పలే కదా
ఆడికే వత్తన్న...

నాగ్గూడ దెల్వదు గానీ
ఇన్నాళ్లూ గా దరిద్ర గీత
నా నెత్తి మీదుండెనట.
అది మీదున్నదో, నేను కిందున్ననో
నాకైతే దెల్వదు.
గిప్పుడా గీతని
గీ మొగోడొచ్చి నా కాళ్ల కింద గీసిండట.
గీత కిందికొస్తే దరిద్రమెట్ల బోతదో
నాకైతే సమజైత లేదు.
నా కాళ్లకి సెప్పులైన లేకపాయె..
కొడుకు దవడ పగలగొడుదును.

వీని కథలు ఇంకా ఐపోలే
అంబానీ గాని ఆస్తుల్ని
అందర్తోని భాగించి అభివృద్దంటండు.
ఉచ్చ తొట్లకి ముప్పై లక్షలు బెట్టినోడే,
రోజుకి 26 రూపాయలు
సంపాయిస్తే పేదోడు గాదంటండు.
వీడు గీసిన గీత
దరిద్రం పోగొట్టేది కాదు
దరిద్రులని మట్టుబెట్టేది.
వాని గీతలు
చుక్క నెత్తురు కారకుండా
పేదోళ్ల కుత్తుకలు కోసే కత్తులు.

గిదంత ఎందుగ్గానీ..,
ఒక్కటైతే జరూరుగ ఖరారైంది.
పేదోనికి ఆశపడే అర్హత లేదని.
అరిగిపోయిన అరచేతులతో
నుదుటి మీది ముడతల్ని
తడుముకుని మురుసుకునుడు తప్ప
పేదోనికి మిగిలేదేముండదని


*11-08-2012

జుగాష్ విలి || మాకు మా ఊరే కావాలి ||

ఎక్కడ మా శిరస్సులు నేలరాలాయో
అక్కడే మా తలలు తలలెగరేయాలి

ఎక్కడ మా నెత్తురు ఏ మట్టిలో యింకిందో
అక్కడే మా జీవితాలు పుష్పించి పరిమళిoచాలి

ఎక్కడ మా కనుగుడ్లు పెకిలించబడ్డాయో
అక్కడే మా క్రొన్నెత్తుటి క్రోధం పొటెత్తాలి

మా ఆత్మగౌరవాన్ని పరిహసించేవి ఏవీ
మాకు సుఖాలనూ ఆనందాలనూ యివ్వలేవు

మేం ఓడిపోయి మా ఊరు విడిచి
ఎక్కడికో వలసవాసులుగా పోలేం
కాలనీ కంచెల మధ్య పరాయి కాలేం

మా భూములకు మా బతుకులకు సోకిన
కులాధీనా వర్గ పురుగుల్ని హతమార్చే
క్రిమి సంహారక మందు ఏదో యిప్పుడు అన్వేషించాలి

క్రూర మృగాలు లేని చోటులేదు
వాటిని వేటాడే పరికరాలు ఏవో మాకు కావాలి
మాకు మా ఊరే కావాలి

* * *

ప్రభుత్వామోదిత పరిధి దాటని ఉద్యమాలొకవైపు
పెకిలించి పెనుకంపన పుట్టించాలానే ఉద్యమాలొకవైపు

ఇప్పుడు
నేను
ఈ సందిగ్ధ ఉద్రిక్త చౌరస్తాలో నిలబడి
ఈ మాటలు మాట్లాడుతున్నాను
నిన్నటి క్రూర విషాద వాంగ్మూలాన్ని
నేటి ఆచరణాత్మక సాదృశ్యాన్ని
నేను
లక్షింపేటను మాట్లాడుతున్నాను.


*11-08-2012

పద్మా శ్రీరామ్ ||నాన్నగారూ మీరు రారా మరోమారూ....||


ఆడపిల్లనైనా పెళ్ళయ్యేవరకూ
ప్రతీదానికీ నాన్నగారి వద్దకే చేరాను

పెళ్ళయ్యాకా మాత్రం అన్నిటికీ అమ్మే...
అవునేమో... మిమ్మల్ని పక్కకి పెట్టానేమో...

అయితే మాత్రం నాన్నగారూ నాపై అలిగారా
అమ్మతో పాటే అనంతలోకాలకెళ్ళిపోయారు

అనారోగ్యంలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టి
నా అత్తింటి బాధ్యతలకై పరుగులెత్తానని నాపై కోపమా

ఇంకా కొన్నాళ్ళుంటానన్నావ్ కదమ్మా .....
అని అడిగిన మీ ప్రశ్న గుండెలో గునపంలా గుచ్చుకున్నా

అత్తగారి అనారోగ్యంలో నే పక్కనుండకపోతే
లోకం నన్ను, మీ పెంపకాన్ని దుమ్మెత్తిపోయదా

నాన్నగారూ అని అప్పుడు నే మిమ్మల్ని అడగలేదు...
కారణం మీకూ తెలుసు నేను "ఆడపిల్ల" ను

పుట్టింటి పాశం గుండె కోసే బంధమైతే...
అత్తింటి బంధం...బాధ్యతల "అణు" బంధం

మీరు నిద్రపోతున్నారని హాల్లోకి వెళ్ళి కూర్చుంటే
నే ఇక్కడుంటే నువ్వక్కడ కూర్చున్నావేమిటమ్మా అని
మీరడిగిన ప్రశ్న ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది

దేవుడు ఒక్క వసంతం కాలాన్ని వెనక్కి మరల్చితే
నాకీ సంసారం అత్తమామల బాధ్యతలూ ఏవీ వద్దంటాను నాన్నగారూ

మీ సేద తీరా మీతో ఉంటాను...కూతుళ్ళకోసం తపించిపోయే
సకల తండ్రులకు ప్రతిరూపమైన మీ ప్రేమ కోసం

మీ మమతానురాగాల క్షణాలను గుండెగదిలో
పదిలంగా దాచుకోవడం కోసం....

కానీ ఆ దేవుడికి ఆడపిల్లలు లేరేమో నాన్నగారూ
నా మొరనూ వినడు మిమ్మల్ని మాతోనూ ఉంచడు

జన్మజన్మలకూ ఆడపిల్ల గా పుట్టాలని కోరుకునే నేను
ఇప్పుడు బాధ పడుతున్నా నాన్నగారూ "ఆడ" పిల్లగానే మిగిలినందుకు....
నాన్నగారూ రారా నా కోసం మరోమారూ....


*11-08-2012

జగతి జగద్దాత్రి || వాసన ||


ప్రతిదేహనికీ ఓ పరిమళముంటుంది
అది ప్రత్యేకంగా ఎవరికీ వారికే
పరిమితంగా ఉంటుంది
నవ్వోస్తోందేమో నా మాటలకు
కానీ అనుభవమిది
కొన్ని దేహాలు మృగాల వాసన వేస్తాయి
కొన్ని ఆకలి వాసన వేస్తాయి
కొన్ని పురుష దేహాలు వాంఛ సుగంధం చల్లుతాయి
మరి కొన్నిఉన్మత్తతను పెంచుతాయి
కొన్ని స్త్రీ దేహాలు ఆర్తి పరిమళం వెద జల్లుతాయి
మరి కొందరు నిరాశ నిస్పృహల వాసన వేస్తారు
కన్నీటి ఉప్పదనపు వాసనేస్తారు కొందరు
మరి కొందరు చెమట ఉప్పదనంగా
మరి కొందరు నెత్తుటి ఉప్పదనంగా
అన్నీ ఉప్పనే అయినా వాటి మధ్య తేడాలుంటాయి
ద్రోహపు వాసనేసేవారు కొందరైతే
వలపు వాసనా వేస్తారు కొందరు
అమాయకపు అసహాయపు వ్యధా భరిత౦గా
అహంకారపు ఆభి జాత్యాల పూరితంగా
కొందరు చంటి బిడ్డలా౦టి పురిటివాసన వేస్తారు
మరి కొందరు మోసపు గబ్బు కొడతారు
కొందరు శ్రమ పరిమళమౌతారు
అబ్బో చెప్పకేం... కొందరు డబ్బు కంపు కొడతారు
పిచ్చి వాళ్ళు నయం దుర్వాసన వేయరు
వాళ్ళకే తెలియని పిచ్చి పువ్వుల్లాంటి
ఒక పిచ్చి వాసన వేస్తారు
కొందరు నిజాయితీ సువసనేస్తారు
చెప్పాగా ప్రతి దేహానికీ
తనది మాత్రమే అయిన
ఓ ప్రత్యెక పరిమళ మో , గబ్బో , సుగంధమో , సువాసనో
ఉండి తీరుతుంది
ఎటొచ్చీ అందరినీ అన్నిటి నీ
గుర్తుపట్టలేము
పసిగట్టలేము
పసిగట్టే నా లాంటి వాళ్ళకు
నిజానికి సుఖ ముండదు
నేను అనుమానపు పసిగట్టే వాసన వేస్తానేమో
మరి నన్నెరిగిన వారు ప్రేమ సువాసన వేస్తానంటారు
ఏది ఏమైనప్పటికీ...
నాకు తెలిసి వచ్చిన నిజం మాత్రం ఇదీ..
పరిమళాల దేహాల్ని ప్రేమించగలం
వాంచా పూరిత దేహాల్ని
అర్ధం చేసుకోగలం
వంచన నిండిన దేహాలను
భరించలేము...
అన్నిటికంటే దుఖం ...
వాటిని పసిగట్టీ తెలిసీ
వాటితోనే బ్రతకాల్సి రావడం...
అప్పుడు నేను దుఖపు వాసనేస్తాను కాబోలు.....


*11-08-2012

జిలుకర శ్రీనివాస్ కవిత


చల్ పొ! దేహాలు మాత్రమే వున్న చోట
కేవలం జంతువుల్లాంటి రెండు కాళ్ళు మాత్రమె నడిచే చోట
ఒక్క కాంతి పుంజమైనా వెలుగులివ్వని చోట
ఎన్ని గ్నాన గింజలు నాటినా సూర్యుడు మొలవడు

యెహే! నీ తలలో ఎర్రగుడ్డ అది మా ముసల్ది విసిరేసిన ముట్టుగుడ్డ
నీ ఎద మీద వేలాడే తుపాకీ అది మా తాత విసిరేసిన వెదురు బొంగు
నెత్తురు గురించో రాలిన వెన్నెల కన్నుల గురించో చెప్పకు మాకు
అడవి ఒంటినిండా మొలిచిన వాళ్ళం మేము
మనువును వెలేసి వాడి నీడ కూడా పడకూడదని చిక్కటి అరణ్యాలను అల్లుకుంటే
ఎర్రమనువు ఎగేసుకొంటూ రానే వచ్చాడు
ఎవడి చేతిల గన్నుందో ఎవడి చేతిలో పెన్నందో ఎవడు వెచ్చని కరస్పర్శ కోసం ఎవడిని అమ్ముకున్నాడో విరసానికి తెలుసు అరసానికి తెలుసు కరపత్రాలకేం తెలుసు అక్షరాలను మనువుకెప్పుడో అంకితమిచ్చారని

దెహె పో!
ఎంతగనం వినాలి మీ సోది మాటలు మీ బుదగరింపులు
రాక్షస గుళ్ళను తవ్వుతున్న దెవరు? కలకత్తా కాళికి పూజలు చేసిందెవరు? హౌరా బ్రిడ్జి మీద వేలాడుతున్న ఫ్లెక్షీ పై ఏ దీదీ మొకం ఉంది? అన్ని హక్కులిచ్చిన మా అయ్యను పట్టుకొని లిబరల్ బూర్జువా అన్నదెవడు? మనిషి హోదా ఇవ్వని మనువును కాలికింద తొక్కిపెట్టి నీకు పౌరుని స్థాయినిచ్చిందే మనీషి? భీమా కొరెగావ్ సమరం లో తెగిన తలలెవ్వరివి? గెలిచిన నా తాతలెందుకు బానిసలయ్యారు? ఓడిన నీ పూర్వీకులెలా రాచరికం ఎలగబెట్టారు చరిత్ర నీ ముడ్డి కింది కుర్చీ కాదు మీ తెల్ల పర్వతాలను కూల్చే అగ్నిపర్వతమది!
చత్ పో! మాది లొంగని మా తాతల నెత్తురు సాహూ మహారాజ్ కోరమీసం కొనసాగింపు మేము నువ్వు ఎవడి పాదాలు కడిగినా నాకినా మాకు సంవందం లేదు ఈ తరం తోనే తేలిపోవాలి రాజ్యం అశోకుడు ఏలాల్సిందే!
*11-08-2012

రత్నశ్రీ ‎// హఠ్ సాలా//

సామూహిక మానభంగం
ఆరున్నర దశాబ్దాల వసంతం
అర్ధరాత్రి
కూకటివేళ్లతో పెకిలిపోయింది
సూర్యుడు తెల్లారి భళ్లున నవ్వాడు
నెత్తుటి పుష్పంమీద ఫోటో ఫ్లాష్‌
సిరామిక్‌ నునుపులో ఎర్ర కలువలు
దండకారణ్యంలో శోకవచనం
ఎవడో పాటకట్టి లూప్‌లో పెట్టాడు
ఏకాకి కీచురాయి భీతావహ స్వప్నం
దయచేసి అందరూ వెళ్లిపోండి
కాసేపట్లో ఇక్కడ
ఎన్‌కౌంటర్‌ జరగబోతోంది
హఠ్‌.. సాలా!!
*11-08-2012

భవాని ఫణి || మార్పు ||


అప్పుడు నక్షత్రాల మద్య
ఉండేది నా నివాసం
తారలన్నీ తళుకు మంటూ
నన్ను పలకరించేవి

అప్పుడు ఆకాశం పైన
ఉండేది నా అంతరంగం
ఊహలన్నీ విశ్వంలోనే
విహరించేవి

అప్పటి నా నవ్వులకి
పువ్వులు విరగ బూసేవి
అంతరాంతరాల్లోంచి
ఆవిర్భావించేది ఆనందం

అప్పటి నా మనసుపొరల్లో
కన్నీటి జల లుండేవి
ఉద్వేగభరితమైన
ప్రతి దృశ్యము కదిపి కదిలించేది

అప్పుడు కోపంతో కందిన నా వదనంలో
సూర్యోదయపు అరుణిమ లుండేవి
"నేను" అన్న అహం
అణువణువునా నిండిఉండేది

అప్పటి నా ప్రేమప్రవాహానికి
ఆనకట్టలు తెగి పడేవి
ఉప్పెనలా పొంగుతూ
ఉక్కిరిబిక్కిరి చేసేది

ఇప్పుడూ నివసిస్తున్నాను
ట్యూబ్ లైట్ ల కృత్రిమ కాంతిలో

ఇప్పుడూ ఆలోచిస్తున్నాను
దూరంగా నిలబడి ప్రపంచం పోకడలు చూస్తూ

ఇప్పుడూ నవ్వుతున్నాను
సభ్యతా సంస్కారాల పెదవుల మద్య నుండి

ఇప్పుడు కూడా ఏడుస్తున్నాను
విషాదాన్ని ఆర్ధం చేసుకుంటూ, ఆరిందానయిపోతూ

ఇప్పుడూ ఆవేశపడుతున్నాను
అనువైన చోటా కాదా అని అంచనా వేసుకుంటూ

ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను
ప్రేమతత్వపు విశ్వ రూపాన్ని అణువంతయినా అర్ధంచేసుకోవాలని ఆశపడుతూ !!


*11-08-2012

సాయి పద్మ || ఈద్ ముబారక్ ||

అందరికీ రంజాన్ ముబారక్..
మళ్ళా మీకు సమజ్ కాదేమోనని
హకీకత్ చెప్తున్నా..ఇప్పుడైతేనే వింటారని
బిగవట్టిన సాంస్ చుడాయించినట్టు
జర్రంత దిల్ బెట్టి ఇనండి

చార్ బజే కి లేచినా...
అంతంత రొట్టెలు ..మాంసం కూర చేసిన..
రోజా లో ఉన్నడు గందా మియా అందుకు
ఉమ్ము మింగరు, ఎంత మంచిగా జేస్తరో ఉపవాసం
తిట్లు కూడా గట్లనే మింగుతరు..
నెలంత అయిన౦క ఉయ్యాలి కదా..
ద్రాక్షలు, కర్జూరాలు తిని పిక్కల లెక్క ...

ఏనాడు కిక్కిరిసిన గదిలో..
అత్తరు వాసన మధ్య "కబూల్ హై" అన్నానో..
ఆ దినంలె నా కబ్ర్ నేనే తవ్వినట్టే
మూడోసారి నా కబూల్ వినే ఫుర్సత్ ఎవరికీ లేదు..
బాకీ జిందగీ నా చేతిలో లేదు..
అంతా ఖైరియత్ గనె ఉందంటారు అబ్బా, అమ్మీ
నాది ఖుష్ నసీబని దువా జేస్తరు మా వాళ్ళు
ఏమో నాకైతే ఎహ్సాస్ గాలే మరి....
ఖుషి అంటే ఏందో ?

షాదీఖానా నుండి దవాఖానకే
సీదా నడిచింది జిందగీ..
నా దిల్ దిమాగ్ ఫికర్ లేకుండా టుక్డా టుక్డా చేసి
కాళ్ళ మధ్య జన్నత్ చూపిస్తాననేవాడు నా మియా..
ఏమో నాకైతే నా బచ్చాల ఏడుపులే ఇనిపిస్తాయి
దెబ్బల వాతల మేహందీలకు తోడు..
ఖూబ్సూరత్ బీవీ లాయె౦గె అని దమ్కాయింపు
పోయినోళ్ళు పోగా బతికిన పోరగాండ్ల
బీమార్లు.. గోలీ సూదులతో చేశా దోస్తీ..

కభి కభి దావత్ల బిరియాని..
మరీ ఖుషి ఎక్కువైతే అత్తరు సీసా..
దేశాన పనికి పోతే...కొత్త సల్వారు..
రాత్రయినంక... మంచం ఒక కనబడని తల్వారు..
ఎన్ని రాత్రిల్లు పరేశానైనానో
ఆ పర్వర్దిగార్కే ఎరుక

సర్లే ..ఈ అఫ్సానా అంత మీకెందుకులే గాని..
మీ అందరికీ మల్ల రంజాన్ ముబారక్..
ఇఫ్తార్ల వక్త్ లోనన్న .. దఫ్తర్ల గోలల్లో నన్నా
పవిత్ర మాసాల్లోనన్న ..ఉమ్ర్ భర్
మీ గలీజంత భరిస్తున్న మీ బీవీల గురించి
మీ బేరెహెం పాదాల కింద నలిగే
చమన్ల గూర్చి , జర సోచాయించండ్రి
మల్ల ఏదో మంచి దినాన్న ఫుర్సతుంటే కలుస్త
మోజు తీరిందని నాకు ఖఫన్ కప్పకుంటే ...!!
ఖుదా హాఫీజ్!!!

--సాయి పద్మ

(ఎన్నో పవిత్ర దినాలు ..ఎంతో అపవిత్రమైన పరుష పద జాలాల్లో గడుపుతున్న బీవీలకు అంకితం.. )*11-08-2012

మోహన తులసి || ఎక్కడిదో మరి ఆ గ్రీష్మరాగం ||


కొన్ని ఏమీ కాని క్షణాల్లోంచి
ఎలా వచ్చి వాలాయో తెలియని ఏకాంతాల్లోంచి
ఎంత విదిల్చుకున్నా బయటపడలేనితనంలోంచి
ఓ జ్ఞాపకాన్ని పాటగా చేసిపోయారు

రాసుకుంటూ వెళ్ళిపోయే ఎక్కడో గాలిపాటని
అర్ధాన్ని వెతుక్కోమనే ఒక మధ్యాహ్నపు నీడని
ఆగి ఆగి వినిపిస్తున్న క్రితం నవ్వుల చప్పుడుని
ఎవరో చుట్టేసుకుని వెళ్ళిపోయినట్టున్నారు

అన్నీ నింపుకున్న ఖాళీ క్షణాల్లోంచి
ఎలాగోలా వచ్చి చేరే సన్నటి చిరునవ్వుని
అరమోడ్పు కన్నుల కింద కలల మధువుని
చెప్పా పెట్టకుండా దోచుకెళ్ళిపోయారు

ఎక్కడిదో మరి ఆ గ్రీష్మరాగం
ఎటో వలస పోతూ ఇటు విడిది చేసింది!


*11-08-2012

శ్రీకాంత్ కె || collage poems* 1 ||


ప్రేమ శరీరంలో ప్రాచీన కరుణ. నెమ్మదిగా
ఈ కాగితం నల్లబడుతుంది.

అంతే నెమ్మదిగా ఒక
వినాశాపు రహస్య లిపి ఆరంబం అవుతుంది

నేను దోషిని కాదు

అవే, అవే నేను చెప్పలేని విషయాలే
నాకు ఈ మాటల్ని ఇచ్చాయి

సాయంత్రపు సూర్యుడితో ఆటలాడే
ఆ వనకన్య నా సంతోషపు రూపం

నిండు చంద్రుడితో నడుస్తుంది
మనస్సు చీకట్లో వెలిగే ప్రపంచాన్ని పుచ్చుకుని
పరిమళాల శరీర అరణ్యంలోకి=

నడుచుకుంటూ వెళ్ళిపోతుంది
తామర కొలనులోకి
వలలో చిక్కుకున్న నన్ను వొదిలివేసి

పరమ రమ్యంగా ప్రకాశిస్తూ
నల్లటి నీడల ప్రతిబింబాలలోకి
చక్కగా సాగిపోతుంది

నేను ఇక ఈ పూదోటను
పరిత్యజిస్తాను=
***
______________________________________________________________________
పై కవిత మొత్తం పూర్తిగా స్మైల్ పుస్తకం ఖాళీసీసాలు నుంచి కూర్చబడినది.
______________________________________________________________________

*collage poetry: a work assembled wholly or partly from fragments of other writings, incorporating allusions, quotations, and foreign phrases.

The word collage comes from the French verb coller and refers literally to “pasting, sticking, or gluing,” as in the application of wallpaper. In French, collage is also idiomatic for an “illicit” sexual union, two unrelated “items,” being pasted or stuck together.

more information can be obtained at http://marjorieperloff.com/articles/collage-poetry/

http://www.snarke.com/2009/05/sylvia-plaths-cubist-collage-poetry.html(quite an interesting article)

http://www.facebook.com/topic.php?uid=49736712045&topic=6446*11-08-2012

మెర్సీ మార్గరెట్ || నాకు నేను సశేషం .. ||

చీకటిని ఈదాలని
ఏకాకి ప్రయత్నం
నలుపునే ఒంటికి పులుముతుంటే
చీకటికి
దేహాన్ని అప్పగించుకుని
కళ్ళు మూసుకున్న క్షణం
నేనే
నాకు
మరో మనిషినైనట్టు
మరో లోకానికి మారుతూ
నన్ను మరిచిపోతునట్టు

నురగలు నురగలుగా
చీకటి
వలయాలు వలయాలుగా
నను చుట్టుకుంటుంటే
రూపు మారుతున్న
పదార్ధంలా
అణువులోంచి
విస్పోటనం చెందబోతున్నాను
శకలాలుగా పడిన
ఆలోచనల్ని ఏరుకుంటున్నాను

ఒక్కో ప్రశ్న
ఇటుకల్లా పేరుస్తూ
నాకోసం ఈ రాతిరి
ఇల్లు కట్టుకుని
ప్రతి గోడపై
లెక్కలు చేసుకుంటూ
సమాధానం వెతుకుంటున్నాను
సమాధైన నిజాలని
త్రవ్వుకుంటున్నాను

ఒంటరిని
ఓటమి గెలుపులని
ఈ రాతిరి
నాతో నేనే పంచుకొని
రేపటికి
మిగులు లెక్కల్ని
చూసుకుంటున్నాను

నాకు నేను
సశేషమై మిగులుతున్నాను.*11-08-2012

రాఖీ || తెర పడని నాటకం ||


నా జీవిత నాటకం ఆగితే బాగుణ్ణు
ఈ విషమ రంగం మారితే బాగుణ్ణు

అసలే నాది అంధుని పాత్ర
అందులోను అమావాస్య రేయిలో
లైటారిపోయినప్పటి సీను

నిజంగానే తడుము కోవాల్సిన పరిస్థితిలో
అప్పుడు నేను జీవిస్తున్నానని ఎరుగని ఆడియన్స్
నా నటన చూసి ఎన్నెన్ని కామెంట్స్

వాళ్ళకెలా చెప్పాలి అది నాటకమని
నా పాత్రే ఒక బూటకమని
నా నాటకానికి తెర తీసారే గాని
వేయడం మానేసారు
ఇదేం రక్తి కడుతుందని ఇంకా
ఇలాగే చూస్తున్నారు

నా జీవిత నాటకం ఆగితే బాగుణ్ణు
ఈ విషమ రంగం మారితే బాగుణ్ణు

తెరవెనక్కి పారిపోతే పిరికి వాడని అంటారు
రంగాన్నంతాపీకి పోతే పిచ్చివాడని అంటారు
ఇంకా అలాగే నిలబడితే చచ్చిపోడేమని అంటారు

రావడమైతే రంగం మీదికొచ్చాను గాని
మధ్యలో డైలాగ్స్ అన్నీ మరచిపోయాను
నోటికొచ్చింది పేలుతున్నానే గాని
’అసలు యాక్షన్’ చేయడం మానేసాను

కప్పగంతులు వేస్తున్నాను
కుప్పిగెంతులు వేస్తున్నాను
నవ్వుతున్నారు లెమ్మని
ఇంకా నవ్వుకొమ్మని
నీతులు మాట్లాడ్డం మానేసి బూతులనే మాట్లాడుతున్నాను
కాళ్ళతో నడవడం వదిలేసి చేతులతో నడుస్తున్నాను

నువ్ బఫూన్ వి కావని డైరక్టర్ చెప్పడు
నువ్వే హీరోవని ప్రామ్టరూ చెప్పడు
వాళ్ళకు మాట పడిపోయింది కామోసు
మరి నాకే చెవుడొచ్చింది కావచ్చు

ప్చ్! నా జీవిత నాటకం ఆగితే బాగుణ్ణు
హుమ్!!ఈ విషమ రంగం మారితే బాగుణ్ణు

నాలోని మరోమనిషికి ఇవ్వేం పట్టవ్
ఆ’మరమనిషికి’ నావేం గిట్టవ్
“ ఒరే నువ్వున్నది అథః పాతాళం
చేరాలనుకునేది గగనాంతరాళం

ఎందుకురా ఎప్పుడూ అదే ధ్యాస
ఎందుకురా ఈ వృధా ప్రయాస

తెల్ల కాగితాన్ని పిచ్చిగీతలతో ఎందుకురా పాడుచేస్తావ్
ఎవరూ అర్థం చేసుకోని భాషలో ఎందుకురా నీ గోడు రాస్తావ్
నువ్వనుకుంటున్నావ్ అది కళాఖండమని
నువ్వనుకుంటున్నావ్ అది ఘనకార్యమని

అసలూ ఎందుకు నటిస్తావ్ “ అని నేనంటే
“అయినా ఏం సాధిస్తావ్ “అని నే అన్నది వింటే

నాలోని మరో వాడు పరమ కౄరుడు-
“నటించడం నా జన్మ హక్కు” అంటాడు
“అయినా నటిస్తే ఏం తప్పు” అంటాడు
“ నీతిగా బ్రతికితే గోతిలోకి తోస్తారా”
చిరు నవ్వు నవ్వితే ఉరిశిక్ష వేస్తారా “
అనేదే వాడి వాదన-ఆవేదన

“ నటించు కాకపోతే నగ్నంగా నర్తించు
ఇదే పాత్రలో ఇదే స్టేజీపై ఈ ప్రేక్షకులముందే ఎందుకు నటిస్తావ్
నీ నటనకి ఆస్కార్ అవార్డ్ రావాలని వెర్రిగా ఎందుకు ఆశిస్తావ్-“

నేనంటే పడని అసమర్థుడు నా మాటే వినని దరిద్రుడు అన్నాడూ-
“ ఏంచేస్తాం నా ఖర్మ ఇలాగే కాలిపోయింది
దొరక్కదొరక్క నాకిదే దాపురించింది
ఏది ఏమన్నా నా నటన దీనికే అంకితమైంది

ఐనా
“తప్పుని తప్పు “ అన్నవాడిని తప్పుగా అనడమేగాని”
’ఒప్పుని ఒప్పు’అని ఒప్పుకున్న వాడేడిరా “అని

వాడి మాటలూ కొంత సబబు అనిపించాయి
వాడి బాధలో కొత్త సత్యాలు తోచాయి

“ ఎవరి కోసం నటిస్తున్నావో గాని
చూడాల్సిన వాళ్ళు చూసి హర్షిస్తున్నారో లేదో గాని
గోటితో పోయేదానికి గొడ్దలి ఉపయోగించడం తో
మాటతో పోయేదానికి మనిషిని బలిచేయడం తో
నడమంత్రపువాళ్ళవల్ల నగుబాటు కావాల్సి వచ్చింది
చేయని నేరానికి శిక్షపొందల్సి వచ్చింది

అయినా ఎందుకురా అందని దానికోసం అర్రులు చాస్తావ్
ఎందుకురా ఆకాశానికి నిచ్చెన వేస్తావ్
ఇవతలి వాళ్ల ప్రణాలు అనవసరంగా ఎందుకు తీస్తావ్
అనుక్షణం అవమానంతో కుమిలి కుమిలి ఎందుకు ఛస్తావ్

అసలు ఎందుకీ అనర్థపు తపన
అవును ఎందుకీ అనవసరపు మదన
ఒరే ఎందుకీ అంతర్గత రోదన
ఇంకా ఎందుకీ అనంత కాల వేదన “”

అప్పుడన్నాడు ఏమి తెయని మా మూఢుడు
ఒప్పుకున్నాడు అన్ని తెలిసిన ఈ మూర్ఖుడు
“ ఎలా బయట పడాలిరా ఎరక్క వచ్చి ఇరుక్కున్నాను
ఏలా ఏడవాలిరా నే ఎక్కిన కొమ్మనే నరుక్కున్నాను
ఇప్పుడేంచేయాలిరా నా నాలుక నేనే కొరుక్కున్నాను

ఆడే వాణ్ణి ఓడి పోయాను
ఆడించేవాడూ వీడి పోయాడు
అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకోలేం
అవును పునాది కూలాక మేడలు కట్టుకోలేం

కాని ఈ ప్రేక్షకులకు
చక్షువు నోరుతో వీక్షణ కోరతో
దృశ్యాన్ని తాగుతూ పైశాచికానందం పొందే భక్షకులకు
ఇదంతా చూసి విసుగు రావడం లేదూ
ఇందులో ఏదో గందరగోళం జరిగిందని తోచడం లేదూ...

అందుకా మాటల రాళ్ళు రువ్వుతున్నారు
అందుకే చూపుల బాకులు దువ్వుతున్నారు

నా నటన చూసి హా హా కారాలు
నన్ను చూసి హుంకారాలు ఛీత్కారాలు

నా నాటకం పేరే “ ఓటమి “ కదూ
దాని రచయిత మాత్రం రాముడో కృష్ణుడో కాదు
వాడు అసలైన అసమర్థుడు వ్యర్థుడు

ప్రియమైన ప్రేక్షకులారా ఇంత తెలిసాక
ఎందుకు మీరు వెళ్ళడం లేదు
నరమాంస భక్షకులారా వాన కురిసాక
ఎందుకు తెర వెయ్యడం లేదు

ఓ సూత్రధారీ ! నువ్వైనా చెప్పేడు
ఈ రంగానికి మలుపు ఎప్పుడు?
నా నాటకానికి ముగింపు ఎన్నడు???

*11-08-2012

భమిడిపాటి || మిత్రుడు ||


మంచి మిత్రుడు
ఒక్కడు చాలు

నాలోని ఒంటరి తనాన్ని
పోగొట్టటానికి

మూలకూర్చున్న ఆత్మా విశ్వాసాన్ని
తట్టి లేపడానికి

నన్ను నేను
గెలవడానికి

నే ఓడిన ప్రతిసారి
గెలుపు చేయి అందించటానికి

ఈ ప్రపంచాని
జయించడానికి

జీవితపు వీలునామాలో చివరి సంతకం
మిత్రుడని చెప్పడానికి

నా స్నేహాన్ని ఆస్తిగా ఇవ్వడానికి
*11-08-2012

కె క్యూబ్ వర్మ కవిత


ఈ తెల్లవారే సూరీడు
ముఖాన మీ నెత్తురి మరక...

గాయపడ్డ అడవి
గర్భశోకంతో నెత్తురు మడుగైంది...

ఒక్కొక్కరు ఒకే కలను కంటూ
ఒరిగి పోతూ పిడికిలెత్తుతూ...

చుట్టూరా కమ్ముకున్న వేట గాళ్ళ
మధ్య పోరాడుతూ మందుగుండవుతూ...

వారి కలలను చిదిమేయాలని
గుండెలపైనే కాదు మెదళ్ళనూ చీలుస్తూ గుళ్ళ వర్షం...

నవ్వుతూ వాడి ఓటమిని
చూస్తూ ఎరుపెక్కిన తూరుపు తీరం...

ఆశయాలను అంతం చేయాలన్న
వాడి కలను చిద్రం చేస్తూ తూటా దెబ్బతిన్న లేగ దూడ రంకెవేస్తూ....

దేహమంతా కప్పుకున్న నెత్తుటి వస్త్రాన్ని
జెండాగా ఎగురవేస్తూ అడవి తల్లి దిక్కులు పిక్కటిల్లెలా నినదిస్తూ...

(1998 ఆగస్టు 9 న ఒరిస్సా రాష్ట్రంలోని కోపర్ డంగ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులలో్ అమరులైన 13 మంది ప్రజావీరుల స్మృతిలో. తొలిసారిగా రాజ్యం హెలికాప్టర్ నుండి కాల్పులు జరిపిన దారుణ సంఘటన.)*09-08-2012

హెచ్చర్కే || అవసరం ||

తలుపులు మూయడం, గడియ పెట్టడం,


పని అయిపోయిన వెంటనే దీపాలార్పడం,
అన్నీ జాగర్తగా గుర్తు పెట్టుకుని వెళ్లి
అంగట్లో సామాన్లు కొనడం, ఇంటికొచ్చాక
పావు కిలో వంకాయల ధరలు గుర్తుంచుకోవడం,
ఎప్పటికప్పుడు లెక్కలు రాసుకోవడం
నిద్ర లేచాక, నిద్ర పోయే ముందు, నిద్దట్లో
శ్రద్ధగా పద్దులు చూసుకోవడం


చాల చాల చాల అవసరం


అనుమతి అడక్కుండా లోనికి రాబోయి
మూసిన తలుపులకు, బిగిసిన గడియలకు,
వెలగని దీపాలకు తలలు బాదుకుని
ఎన్ని కలలు భళ్లున పగిలితేనేమి,
పెంకులు గుచ్చుకుని, సెఫ్టిక్‍ అయి
ఒక్కొక్క అవయవం ఊడిపోతేనేమి,
బతకడమంటే ఇది కాదు కాదు కాదని
రెప్పల కింది తడి ఇసుక గోల పెడితేనేమి


బతకడం చాల చాల అవసరం


దినకరుని వీడ్కోలు సంబరంగా సాగాల్సిన
సాయంత్రాన్నంతా పర్సులోంచి పోసి తెచ్చిన
వాటిలోని రెండు పుచ్చు వంకాయల మీద
చిరు మంటగా కదిలిన ఒక పేచీ సాగి సాగి,
నాని నాని, చివికి చివికి, చిత్తడికి చేరిన క్రిములు
బిగిసిన గడియల, మూసిన తలుపుల, ఆరిన దీపాల
ఇంటిని తమ సొంతం చేసుకుని; నువ్వూ నేనూ
లెక్కల, పద్దుల, పేచీల్లోనికి బహిష్కృతులమై

బతకడం ...
* 9-8-2012

అవ్వారి నాగరాజు || కవిత్వం ||


ఎగిరే సీతా కోక చిలుకల రెక్కల చప్పుడు

ఏకాంతం

దిగంతాలకు విస్తరించిన కనుదోయి చూపు

పాట

చెట్లు గుబురులెత్తే కాలంలో గాలిలో కలగలసిన సుతిమెత్తని ఆకుపచ్చ పరిమళం

ఊహ

అనంత దూరాల యానంలో నిరంతరమూ సాగే కాంతి వేగాల జలపాత ఉరవడి

కవిత

రాలి పడిన పూవుల దుఃఖాన్ని వేలి కొసలకెత్తి దేహానికలుముకునే గంథలేపనం

మనిషి

*09-08-2012

క్రాంతి శ్రీనివాసరావు || సూర్యుణ్ణి పొయ్యులో పెడదాం ||


ఒరేయ్
నాలుగు నిప్పులు పోయండ్రా
సూర్యుని నెత్తిమీద

వాడికేమొచ్చిందో
పొడ అగ్గి రూపంలో
కొంపలో జొరబడి
వున్న కాస్త చాటును
చెరుకు గడలా నమిలేస్తున్నాడు

వెళ్ళిపో పొద్దికవద్దన్నా వినకుండా
ఎండాకాలం ఎక్కువసేపుంటుంటుంటాడు
వడ దెబ్బలు కొట్టి మరీ
పెడబొబ్బలు పెట్టిస్తుంటాడు
అందుకే నాలుగు నిప్పులు
పొయ్యండిరా వాడి నెత్తిమీదా

శీతాకాలా మొచ్చినప్పుడు
శీఘ్రంగా వెళ్ళిపోతుంటాడు
నిశి ని మరికొంచెం సాగదీసి
నిశ్సిగ్గుగా చలి కౌగిట్లోకి
నన్ను నెట్టి పక్కకు తప్పుకొంటున్నడు

వర్షాకాలమొచ్చినప్పుడు
ఎటొచ్చీ బయటకురామని తెలిసి
పడుతున్న చినుకుల మద్య
వయ్యరంగా నడుస్తూ
వర్ణమాలేసుకొని
వూరేగుతున్నాడు

నిప్పుల కొలిమయున సూర్యూడు
నీళ్ళ తర్పణం ఇస్తుంటే చూసి
ఆర్పటానికొస్తున్నామనుకొన్నడేమో
తప్పుడుపనులన్నీ చేస్తున్నాడు
అందుకే నాలుగు నిప్పులు పొయ్యండి వాని నెత్తిమీద

*09-08-2012

శ్రీకాంత్ కె || నల్ల చేపపిల్ల ||


తెలుసా? తుంపరే మేలి ముసుగు నీకు-

అయినా ఎలా దాచగలవు నువ్వు
పచ్చిక మాటున దాగి నక్కి నక్కి
చూసే తెల్లటి కుందేలుని? దానిని

నేను జాబిలి అనే
నీ చల్లటి ముఖం
అనే పిలుస్తాను నిస్సిగ్గుగా, నిర్భీతిగా - చూడూ

నా వేళ్ళ అంచులతో
నీ శిరోజాలపై రాలిన
మంచుపూలను తొలగించిననాడు, చుట్టూతా
లేత పుదీనా వనాల
పురాస్మృతుల పొగ
ఎలా కమ్మగా కమ్ముకుందో! అయినా తప్పేముంది?

అలాంటి వలయ ధూప శిఖరాలని నేను
నీ తనువు అనే నీ వక్షోజాలనే పిలుస్తాను
ఈ ఆలయ ప్రాంగణంలో అ/పవిత్రుడనై- చూడూ

యిక అప్పటికీ, ఇప్పటికీ ఈ నా ఛాతిలో
ఒక నల్ల చేప పిల్ల మెసులుతూనే ఉంది
నువ్వు వొద్దనుకున్న
ఆ తూనీగ రెక్కలతో.
చెప్పు ఏం చేద్దామిక

ఈ సరస్సుల ఒడ్డున కూర్చుని
వల వేసి ఆగి ఉన్న దాగి ఉన్న
సన్నటి ఈల పాటతో వాన సాంద్రతనీ సూర్యకాంతినీ కొలుస్తున్న
ఒంటరి బాహువుల రాతి పూవుల ఆదిమ బహిష్కృతుడినీ ఒక
పసి పెదాల రోదనై వేచి ఉన్న కవినీ?

*09-08-2012

మెర్సి మార్గరెట్ ॥ చీకటి దండెం పై ..॥

చీకటి దండెం మీద
ఎవరో
జ్ఞాపకాలు ఆరేసుకున్నారు
ఎక్కడెక్కడ తిరిగి
తడిసి వచ్చాయో

చూడు
ఏ మట్టిలొ ఆడివచ్చిందో
ఈ జ్ఞాపకం
సైకిల్ టైరుతో తొక్కించుకుని
గుబ్బ కాయల ముళ్ళు తగిలించుకొని
గోలికాయలు ఎవో రెండు
ఇంకా
దాని జేబులోనె దాచుకుని

ఈ జ్ఞాపకం
రంగు వెలిసి
ఎలా చూస్తుందో చూడు
ఒక్కొక్క వరుసని దాటి
అనుభవాల కుదింపుల్లో
ఎన్ని మనసులని
గెలిచి ఓడి
అలసిపొయిందో

చినిగి పోయినా
ఆ చినుగుల్లోంచి అటువైపు
శూన్యాన్ని చూపిస్తూ
ఈ జ్ఞాపకానికి ఇంకా తను
పసుపు అద్దడం
మానలేదెందుకో

ఎటూ కదలక
బుద్దిగా అలాగే
చీకటినే
అంటిపెట్టుకున్న
ఈ జ్ఞాపకానికి చూడు
అంటుకుని విడిపోని సన్నజాజులు
రాలిపొకుండా పట్టుకుని వేలాడే
తల వెంట్రుక నవ్వులు
ఎక్కిరిస్తూ గిచ్చుతున్నట్టు
గుస గుస శబ్దాలు చెస్తూ
నిట్టూరుస్తున్నాయెందుకో


ఆ జ్ఞాపకంపై
చూడు
శుభ్రం చేసినా పోని
రక్తపు మరకలు
ఎవరు ఎక్కడ పొడిచారో
ముద్దగా మారిన గుండెను
మూటకట్టుకుని ఆ
రక్తపు చుక్కల వెనక ఎడుస్తూ

అక్కడక్కడే తిరుగుతూ
తను
పచ్చిగా ఉన్న వాటిని
పట్టుకొని చూస్తూ
ఆ చీకటి దండాన్ని
కుదరక పోయినా
లాగి కట్టి
మిగిలిపొయిన
జ్ఞాపకాలని ఆరేయాలని
ప్రయత్నిస్తున్నాడు

కళ్ళను పొడిచే నిద్రతో
జ్ఞాపకాలు ఎగిరిపోకుండా
హుక్కులు పెడుతూ ...

*09-08-2012

జాన్ హైడ్ కనుమూరి || ఆసుపత్రి అనుభవం - 1 ||

నియమితమైన పడక

లేచి తిరగడానికి కొన్ని ఆంక్షలు

ఏదీ చదవటానికి లేదు

ఏదీ రాయటానికి తట్టదు


నిద్రకోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నట్టు

బాల్యంలో రాని పద్యాన్ని వల్లెవేస్తున్నట్టు

కళ్ళలోనో, జ్ఞాపకంలోనో

ఒక అంసంపూర్ణ కవిత్వానికి చివరివాక్యాన్ని ఎక్కడో పారేసుకున్నట్టు

ఇక్కడైనా దొరుకుతుందంటావా?


సమయాన్ని నేను కోస్తున్నానా?

సమయం నన్ను కోస్తుందా??


నాతోపాటు కొందరు

ఎవరిదేహం పడ్తున్న అవస్థ వారిదే

కొన్ని ఆర్తనాదాలు, కొన్ని మూల్గులు

వినటంతప్ప ఏమీచేయలేని స్థితి


ఒంటరితనం ప్రక్కనచేరి

వూసులాడాలని విఫలయత్నం


శరీరానికి గ్రుచ్చుతున్న సూదులు

గుండెచప్పుళ్ళను కొలమానాల్తో కొలిచి

దారితప్పిన నాడీమండలవ్యవస్థను సరిచెయ్యాలని

ఆత్రంగానో కర్తవ్యంగానో పరుగులు తీసే నర్సులు


నిద్రపట్టని సమయంతో ఇటు అటూ వత్తిగిల్లి

ఒంటరితనాన్ని దగ్గరకు పిలిస్తే

అన్నీ నిరాశా పర్వాలు తెరిచి చదువుతుంది

ఒక్కసారి వూకొట్టడం మొదలుపెడితే

దారితెలియని ఏ సొరంగ మార్గంలోనో వదిలివేస్తుంది

ఈ ఒంటరితనంతో జాగ్రత్తగానే వుండాలిసుమా!


నియమితమైన పడక

లేచి తిరగడానికి కొన్ని ఆంక్షలు


ఏదీ చదవటానికి లేదు

ఏదీ రాయటానికి తట్టదు


(ఆసుపత్రి అనుభవంనుంచి)
*09-08-2012

రత్నశ్రీ || జ్వరం తగ్గేటట్టు లేదు ||


కాలం గావుకేక పెట్టింది
వాన వెలసి నీరెండలో చిమ్మచీకటి
దగ్దమైన హృదయాన్ని ఆర్పే
ఒక్క బాష్పబిందువూ లేదు
తేజో వలయాలన్నీ
విద్యుదాఘాతానికి గురై
కాలిపోతూ వాలిపోతూ
సంజకెంజాయ రంగులన్నీ
కంటిపాప చుట్టూ దుఃఖఛాయలై:
కాలం ఈసారి చావుకేక పెట్టింది
చీకటి వొడిలో వెలుతురు గాఢనిద్ర
అంతర్‌ బహిర్‌ వేదనలు
ఒట్టిపోయిన రిజర్వాయర్‌లో
రెండు ఎండిపోయిన కన్నీటి చారికలు
ఒకటి నాది
ఒకటి ఆమెది
చెడిపోయిన గడియారం ముల్లుకు
గుచ్చుకున్న కాయితప్పడవ
క్షార జలధుల్ని తోడుతోంది
అసంబద్ధ కలల్ని పొడుచుకుతిన్న తీతువు పిట్ట
వేకువ జామునే ఎగిరిపోయింది
ఒత్తిగిలి పడుకున్నా
వెన్నులో నాటుకున్న తుమ్మముల్లు
ఇంకా బయటకి రాలేదు
సారూ.. లో జ్వరం
కాలం ఈసారి సుప్తచేతనావస్థలో పడివుంది
బిచ్చగాడి చేతిలో ఏక్‌తార
వంద సంపుటాల దుఃఖం
దమ్మిడీ రాలేదు రొఖ్ఖం
కాలం క్రమంగా నేలమాళిగలోకి జారుకుంది
తవ్వుతున్న శిలల్లో
ఖండిత మాంసపు ముద్దలు
మృత్యుపరాగ రేణువుల్లో
ఏనాటిదో మోహపు దుర్వాసన
యుద్ధంలో అలసిపోయిన ఖడ్గాలన్నీ
ఆశ్రమగీతాలు పాడుకుంటున్నాయి
ఎక్కాల్సిన రైలు వెళ్లిపోయిందని
ఫ్లాట్‌ఫారం మీద
బక్కచిక్కిన అస్తిపంజరం
కుప్పకూలిపోయింది
మూలుగులోంచి మూలుగు
సారూ.. ఈ జ్వరం తగ్గేటట్టు లేదు
కాలం మళ్లీ గాడిన పడేదెన్నడో!


*09-08-2012

రియాజ్......|| Missing ||


అద్దం బాగానె ఉంది
అందులోని ముఖమే నాలా లేదు..
ఏం కోల్పోయాను?
......
ఆమె ఆమెలా లేదు
ఓ సంక్లిష్ట దృశ్యం
అస్పష్ట భావం
ముఖం దేహం నిండా
అరువు తెచ్చుకున్న బుల్లితెర reflections
కమర్షియల్ ఎమోషన్స్
ఆమె ఏం కోల్పోయిందో???

వాడు మనిషిలాగే ఉన్నాడు
నలుగురిని ఏమాత్రం వదలలేదు
ఇక కనిపించలేదు వాడు
అందరి గుండెల్లో అభద్రతై కూర్చున్నాడు
ఇంకెంతమంది ప్రాణాలు కావాలో !!
ఇంతకీ వాడు కోల్పోయిందేమిటో????

*****

పచ్చని దేహం చుట్టూ ఫెన్సింగ్ ముళ్ళు
రైతు గుండెలో పవర్ కట్
మూటసర్దుకున్న
కూలిమనసు
ఆ పల్లె
ఏం కోల్పోయింది???

నగరవీధులలో లక్షల యువ కిరణాలు
కడుపు భగ్గు భగ్గుమంటూ వెలుగుతూ..

గృహప్రవేశంలోపే
నెర్రులుబారి
నేలకొరిగే
ఇందిరమ్మ ఇళ్ళు

అడవిచీకట్లో మిణుగురుల్లా
ఏనాటికో కురిసిన వానచినుకుల్లా విచ్చేసిన
సినీతారల ఆగమనం ఎగబడే దేశభవితా డొక్కునరాలు
తళుకుబెళుకులను తమ కన్నుల పెన్నులతో బంధించేందుకు
పోటీపడుతున్న నాలుగో స్తంభంగాళ్ళు !!!

రోడ్లెక్కిన మురికికాలువల ఖాళీబిందెల
ఆసుపత్రుల బెడ్డులలలో మూలుగుల నినాదాలతో
ఏం కోల్పోయాయి ఈ మునిసిపాలిటీ కార్పొరేషన్ పట్టణాలు????

అక్కడ నాలుగు స్తంభాలను పాతివెళ్ళారు
కంచె అనుకున్నారు పాపం వారు..అప్పుడు!
పంచభూతాల్లా రక్షించేవని అనుకున్నారు
అవే తమపాలిట పాడి అంటున్నారు
ఆ నాలుగు తమను భక్షించేందుకే అంటున్నారు..ఇప్పుడు !!
ఏం కోల్పోయారు వారు?????


*10-08-2012

అవ్వారి నాగరాజు || పిల్లలు ||


పిల్లలు భలే తమాషా అయిన వాళ్ళు

పాపం వాళ్ళు
లోకం లోని పువ్వుల మాదిరి పిట్టల మాదిరి
అపురూపమైన దాన్నేదో
తలపై నెమలి పించంలా ఆరోపించుకొని
మన కళ్ళ ముందర బుడి బుడి అడుగులతో తిరుగుతుంటారు

ఈ లోకానికి వచ్చింది మొదలు
చుట్టూ ఉన్న మకిలిలో పడి మాయమయ్యే వరకూ
మనం పోగొట్టుకుంటున్న దానికి
ఒక పూరకంగా నిలబడి తమకు తెలియకుండానే మనకొక ఆశ్వాసననిస్తారు

కాసేపు కవిత్వమవుతారు

మరి కాసేపు ఒక కలలా తమ సుతారపు రెక్కలను విదిల్చి ఎవరికి వారు పాడుకునే
మహేంద్ర్రజాలపు మాయా వేణుగానమవుతారు

కాలానికి ఒక కొసన మనలను నిలుచుండబెట్టి
తామే ఒక మహాద్భుత ఆలంబనమై
పారాడే ప్రతి శిశువూ భూగోళాన్ని తమ నును లేత పిరుదులపై నిలుచుండబెడతారు

ఎవడైనా ఒక కవి అర్భకంగా తమవైపు నోరు తెరచి చూసినపుడు
పురా కాలపు స్వప్నాన్నొకదాన్ని తమపైకి నెట్టి బతికే
మనుషుల మాయను జాలిగా క్షమించి
బోసిగా నవ్వుతూ చెక్కిళ్ళ వెంట కారే అమృతంతో
బతుకుపోండ్రా అని మనలని దీవిస్తారు.
*10-08-2012

జయశ్రీ నాయుడు || నిలవని నీడలే..||

నా కలనుంచి నిన్ను వెలి వేస్తున్నా
వెలుగును చీకటికి అంకితమిస్తున్నా

ఉలకని పలకని వూరింపుల మధ్య
గడవని రోజులెన్నని గుర్తు పెట్టుకోనూ...

ఆశ నిరాశ ల కత్తిపోట్లకు
ఎన్ని గులాబీ రెక్కలు రాలాయని లెక్కించను..

నిద్రలేని రాత్రుల నిముషాల మధ్యన
గంటల్ని లెక్కించింది ఎన్నని చెప్పను..

నిట్టూర్పుల ఉలి చెలిగా కన్నీటి శిల్పాల
ఆరామం లో ఇంక సేద తీరలేను

కలవని ఘడియల్లొ కలవేమో
కలిసిన వేళల్లొ కధవేగా..

కధైనా కలైనా
కరిగే క్షణాల్లా
నిలవని నీడలే..


*10-08-2012

శ్రీనివాస్ ఈడూరి ||నా రుబాయి||

ఈ మధ్య సామల సదాశివ మాస్టారు గురించి తెలుసుకున్నప్పుడు రుబాయిల గురించి కూడా తెలిసింది. చిన్న ప్రయత్నం చేశాను. పెద్దలు చదివి సలహాలు ఇవ్వగలరు

చెలి పాద సవ్వడి అదిగో గుండె లయ సరిచూసుకో
రస రాణి నవ్వింది కసిగా వలపు వీణ శ్రుతిచేసుకో
తనతో గడిపిన అనుక్షణం ఒక సుందర కావ్యం
అపురూప మానస చిత్రం కుంచెతో నీ మదిగీసుకో
ఈడూరీ మరణంలోనూ ప్రేయసిని పెనవేసుకో.


*10-08-2012

డాక్టర్ వేంపల్లి గంగాధర్ //నాలుగు చరిత్ర ఇతి వృత్తాలు //


1
వంద యుద్ధాలను
నిర్విరామంగా చేసిన
వీర ఖడ్గం వొకటి
ఇవాళ
మ్యూజియం అద్దాల పేటికలో
గాఢo గా నిద్రపోతోంది !

2

రాజ ప్రాసాదం లో
మీసాలు పురితిప్పి
రొమ్ము విర్చుకొని రాజస దర్పం తో
విర్ర వీగుతూ నిల్చున్న నిలువెత్తు వర్ణ చిత్రం
ఇవాళ రంగు వెలసి
పొడి పొడిగా పెచ్చు లూడి దీనంగా
రాలిపడుతోంది !

3

ఎదురు లేని పోరాటం చేసి
రాజు పాదాల వద్దకు శరణు కోరే శిరస్సులను
తరుముకొచ్చిన
' ఫిరంగి 'యంత్రం
ఇవాళ గాంధీ పార్క్ లో
పిల్లలు గుర్రమాట
ఆడుకునే అట వస్తువు !

4

దళాల పద ఘట్టనలతో ప్రతిద్వ్హ్హనిoచిన
రాతి కోట గోడలన్నీ
శిథిలమై శిలలు ద్రవించి ఏడ్చుచుండగా
నేడు అక్కడే
గబ్బిలాల గుంపులు
రింగులు రింగులుగా గిరికీలు కొడ్తూ
కనువిందు చేస్తున్నాయి !

( ప్రజల 'నెత్తురు' తమకు 'అత్తరు' అని భావించిన వారి చరిత్ర ఇలాగే ముగుస్తుంది . ఇది చరిత్ర చెప్పిన సత్యం. )*10-08-2012

నవుడూరి మూర్తి // విశాఖ నగర ప్రబంధం //


ఛందో బధ్ధ కవిత్వంలా ఉన్నాయి– ఇళ్ళూ, వాకిళ్ళు,

దుష్ట సమాసాల్లా — అక్కడక్కడ భవంతుల ప్రక్కన పూరిళ్ళు

సుదీర్ఘ సమాసంలా ఉంది - రాచబాట (National Highway)

ద్విపదలా సాగుతోంది స్టేషన్ నుండి బీచి దాకా ఉన్న రోడ్డు

ఛేకానుప్రాసల్లా ఒకటి విడిచి ఒకటి వెలుగుతున్నాయి సోడియం దీపాలు

రోడ్డుకి రెండు వైపులా- మార్జిను గీసినంత అందంగా కాలిబాటలు

దానిమీద రాసుకున్న ‘నోట్సు ‘లా చెట్లూ, చిల్లర దుకాణాలూ,

ఆశ్వాస విభజన చేసుకుంది- ఆశీలుమెట్ట జంక్షన్

శబ్దాలంకారాలులా మ్రోగుతున్నాయి 'ట్రాఫిక్ జాం'లో వాహనాలు

ఆధునిక కవిత్వానికి ఆవగింజంతైనా విలువివ్వని

పూర్వసువాసిని కవిలా బోడిగా కంచరపాలెం కొండ

తలపులు బోడులు కావని సూచిస్తూ

అక్కడక్కడ విచ్చుకున్న పచ్చని పొదలు

ద్వంద్వ సమాసాల్లా సినిమాహాళ్ళు,

'విగ్రహవాక్యం' లా కనకమహలక్ష్మి అమ్మవారి గుడి,

మారుతీ కారులో దూసుకుపోతున్నదొక బహువ్రీః

కొండమీది పార్కు వసంత ఋతు వర్ణన చేస్తుంటే,

విరహోత్కంఠితయై తిరుగుతోంది 'లైటు హౌసు'

ఉత్ప్రేక్షలా చంద్రుడికేసి ఉరుకుతోంది సముద్రం.

ఆర్ద్రతలోపించిన కావ్యంలా ఉక్కతో అసహనంగా ఉన్న నగరానికి

ఆతిధ్యమిచ్చే అన్నపూర్ణలా వచ్చిందో మేఘ మల్హార్

శ్రోతదొరికిన కవిలా, వస్తూనే కావ్యనివేదన ప్రారంభించింది…

మధ్య మధ్యలో గొంతు సవరించుకుంటూ, ధారా శుధ్ధి ప్రకటిస్తూ,

కవిత్వంలో మెరుపులు ఎత్తిచూపిస్తూ మరీ.

రసలుబ్దుడైన కవికంటే, సామాన్యుడే మెరుగన్నట్లు,

అంతో ఇంతో ఆస్వాదించిన చెట్లు ఓహో అని తలలూపుతుంటే,

ఉండీ ఉడిగీ కిటికీలు చప్పట్లు కొడుతున్నాయి.

చెవిటివాడిముందు శంఖారావంలా,

ఇంతటి రసావిష్కరణా సముద్రంపాలవడంచూసి

అలిగి వెళ్ళిపోయింది అన్నపూర్ణ.

ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలా

దివ్వు దివ్వు మంటూ మిగిలిపోయింది

పాపం! నా నగరం.*10-08-2012

జగతి జగద్దాత్రి || ధ్యానం ||


ఒంటరిగా ఉండాలని ఉంది
నిశ్సబ్దంగా ....
గుండె సడి కూడా వినిపించనంత
మౌనంగా .....
మాటలాడుతున్నా ..
మనసు మాత్రం ఎక్కడో
దూర తీరలలోకి
చూపు సారిస్తూ ....ఏదో ఏమిటో వెతుక్కుంటోంది ...
అన్వేషణ దేని కోసమని చెప్పలేను
......................................

మాటాడాలనీ ఉంది....
అందరిలా నేనూ ఎందుకు ఉండలేకపోతున్నా
అనుకునేదాన్ని
ఏమో ఈ ఆత్మ తెరుచుకుని
అంతర్ముఖమైన శోధనకి
ప్రేరేపించ బాడ్డానేమో..అతి త్వరగా
ఏమో ఎందుకు, నిజమే ఇది
అనుభవైక వేద్యాన్ని కాదనరాదు కదా
ఎన్నెన్ని ఛిద్రాలో ఈ చిన్ని గుండెకి
మొదటిలో ఎన్నెన్ని ప్రకంపనలో
ఇప్పుడు అలవాటయి పోయాయి ...
ఇక ఇప్పుడు చివికి పోతున్న
దేహంతో ....ఇంకా ఎవరి కోసం
దేని కోసమీ తపన
ఈ తిరుగు బాటు
ఈ ప్రయత్నం ...
నాకోసం అవును .....నాకోసమే
అందరికీ కావాల్సిన నేను నాకు
ఎందుకక్కర్లేకుండా పోయాను
ఈ దేహాన్నీ...
మానసాన్నీ .....ఎంత క్షోభ పెట్టాను
ఎందరి కోసం ...ఎందుకు
ప్రేమ కోసం ....నాకు అందని ప్రేమ
మరొకరికి చెందకుండా పోతుందేమో అని
మెప్పు కోసమూ కాదు
కానీ ప్రేమ తప్పు కాదు అని
చెప్తో .....నాలాగా
అవసాన దశలో
కళ్ళు తెరిచినా ప్రయోజనం ఉండదు సుమా
అంటూ చెప్తూ.....
ఆలస్యం అమృతము కాదు
భయం బాధాకరమైన విషం
కోరుకున్న ...మనసు పూజించే
అనురాగానికి అన్యాయం చెయ్యద్దని ....
ప్రతి హృదయాన్నీ వేడు కుంటూ .......*10-08-2012

వొరప్రసాద్‌ || క'మాల్‌' ||


అబ్బుర పరిచే
సొగసైన భవనం
ఆధునిక పరిజ్ఞానమంతా
రంగరించి పోతపోసిన
సాంకేతిక సౌందర్యం
కాంతి చిమ్ముతూ
రమ్మని కవ్విస్తుంటుంది
విస్తుగొలిపే వస్తుసంపదతో
స్వాగతం పలుకుతుంటుంది

నవ్యచలువరాతి మేడలో
ఆకర్షణీయంగా అమర్చబడిన
నిత్యావసర సరుకులన్నీ
ఫైవ్‌స్టార్‌ హోదాలో వెలిగిపోతుంటాయి
పప్పులూ ఉప్పులూ
బంగారం షాపులోని
అభరణాలకన్నా అందంగా
అలంకరించబడి ధీమాగా చూస్తుంటాయి.
కొత్తహోదాలో కూరగాయలన్నీ
ప్యాకింగ్‌ హంగులతో
తళతళ మెరుస్తుంటాయి
రూపం మార్చుకున్న
హైటెక్కు వంటింటి
సామాను వెర్రెక్కిస్తుంది

వాటిని అనుభవించలేని
జీవితం వ్యర్థం అన్న భావన
ఒక్కసారిగా ఉద్రేకపరుస్తుంది
నిగ్రహం కోల్పోయి
సందర్శ సామాన్యుడు
వస్తువును ముట్టుకుంటాడు
దాన్ని సొంతం చేసుకుంటే
వచ్చే సౌఖ్యాన్ని
అందంగా ఊహించుకోబోయి
అసాధ్యమైన పనని
సందేహంలో పడతాడు

బహిరంగంగా వేలాడుతున్న
ధరల ట్యాగ్‌ను
తాకలేక దానివైపు
దొంగచూపులు
చూస్తాడు
అద్దాల మేడ ఆర్భాటాలన్నీ
చెమటలు పట్టిస్తాయి
కింద తనకు అందుబాటులో
ఉండాల్సిన నిత్యావసరాలన్నీ
అందనంత ఎత్తునుండి
తనను గేలిచేస్తుంటే
ఏం చేయాలో తెలియక
మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తాడు

కొనలేని నిస్సహాయతను
ఏమార్చడానికి ప్రయత్నిస్తాడు
ఆధునాతన మ్యూజియాన్ని
సందర్శించినట్లుగా భావించి
కనీసం సందర్శనా భాగ్యం
కల్గించినందుకు ప్రజాస్వామ్య
ఔదార్యానికి ఓ నమస్కారం పెడతాడు

శక్తికి మించి ఎక్కడ
ఉద్రేకపడతానో అనుకుంటూ
కలవరపాటుతో
తక్షణం బయటపడతాడు

వస్తువులను
వంటికి హత్తుకున్న మాల్‌ను
వాటిని అందకుండా చేస్తున్న
కమాల్‌ సంగతిని ఆలోచిస్తూ
పరాకుగా ఆ సామాన్యుడు
ఇంటికి చేరుకుంటాడు.


*10-08-2012

నంద కిశోర్ || సం-దేహం ||


నత్తల్ని,నావల్ని నడిపి
తీరానికి,దూరానికి తేడాలేదనీ
నవ్వుల్ని,నాణాల్ని తడిమి
ఈ రోజు,రేపు ఒకటికాదనీ

నదుల్ని,నాడుల్ని అడిగి
ఎంతపారినా ఎందుకో ఎండిపోతామనీ,
నక్షత్రాల్ని,నాగరికతల్ని చదివి
ఎంత వెలిగినా ఎప్పటికీ మిగల్లేమనీ

తమ్ముడు!ఒరేయ్!

సంపాదించిన జ్ఞానమంతా
ఎక్కడ పారేసుకున్నావ్?
ఏ మోహంతో, ఏ దేహంలో
తచ్చాడుతున్నావ్?

ప్రాణం ఇంకా మిగిలేఉన్నట్టు,
ప్రాప్తం ఏదో దొరుకునన్నట్టు,
కలల్తోటి,కధల్తోటి
కాలం జరుపుతూ

తమ్ముడు!ఒరేయ్!

ధమనులన్నీ మూసుకున్నాక,
తపనలన్నీ దారితప్పాక,
ఏ సిరలతో రక్తం తెస్తావ్?
ఏ సిరాతో కవితలు రాస్తావ్?*10-08-2012

జాన్ హైడ్ కనుమూరి || ఎక్కడికి పోతాయి ||


ఎక్కడికి పోతాయి
ఆ పాదాలు
ఇక్కడే తచ్చడుతుంటాయి
రంగులు మారుతున్న లోకంలో
మనసున కమ్మిన ఆత్రాల మద్య
పాదాలను గుర్తించడం కష్టమై పోవచ్చు

యశోద మనసుతో
మొలకు నీవుకట్టిన తాడుముడి విడిపోయిందనుకుంటావు
గోరుముద్దలు వెన్నముద్దలు
పాలమీగడలు
దాచివుంచావని తెయదంటావా?

నీవిచ్చిన ముద్దులతో
ఆ దేహం ఎంతగా వన్నెదేరిందో
వలచిన కన్నెల నడుగు

బుడి బుడి అడుగుల్లో మువ్వల చప్పుళ్ళు
ఇంకా ధ్వనిస్తూనే వున్నాయి

లాలిపాటల మాధుర్యాన్ని విని
నిదురించిన కనులు
ఇక్కడే చూపు నిలుపుతాయి

ఇన్ని విడిచి
ఎక్కడికి పోతాయి
ఆ పాదాలు
ఇక్కడే తచ్చడుతుంటాయి


*10-08-2012

కెక్యూబ్ వర్మ || ఎడారితనం ||


రాయలేక పోవడం కూడా
అక్షరాల ఆత్మీయతను తెలుపుతుంది...

ఆకు రాలిన కాలంలో
పచ్చదనం గొప్పదనంలా...

గొంతెండిన వేళ
నీటి చుక్క దొరకనితనంలా...

చెప్పుల్లేని ఎండాకాలంలో
తారంటుతున్న పాదం మంటలా...

దుప్పటి దొరకని
చలిరాత్రి నిప్పు రాజేయలేనితనంలా...

కాలుతున్న కడుపులో
ఓ ముద్ద వేయలేనితనంలా...

చుట్టూ అక్షరాలన్నీ ఒక్కోటీ
వెక్కిరిస్తూ ఉలికి అందని శిలలా....

కుంచెకంటని రంగు
కాగితంపై అటూ ఇటూ అలుక్కుపోయినట్టుగా...

గొంతు దాటని రాగం
లోలోన సుళ్ళు తిరుగుతూ ఊపిరాడనితనంలా....

ఏదీ రాయలేనితనం పాడలేనితనం
దృశ్యీకరించలేనితనం ఎడారితనం కదా...


*10-08-2012

ఛంద్రశేఖర్ వేములపల్లి || నన్నొదిలెళ్ళకు!?||

మబ్బులు రాసుకున్న మెరుపు
ఉరుమై,
... హృదయం
బ్రద్దలైన శబ్దం
భరించలేని నొప్పి ... కన్నీరై,
గొంతు గద్గదమయ్యింది.

మొదటి మేఘ మదనం
తొలిప్రేమ
మహా మాయ
జల్లై కురుస్తున్నప్పుడు,
ఒణికాను, తడబడ్డాను.
కానీ ... అనుకోలేకపోయాను.
ఎడబాటు ఇంత కష్టంగా ఉంటుందని,

భయం నన్నల్లుకుపోయి
సముద్రంలో అల్పపీడనంలా
వెంటాడుతుంది!
ఆశించాను, ప్రార్ధించాను.
ఇంత రాపిడి తగదని, ఒత్తిడి తట్టుకోలేనని,
నీవు నాతోనే ఉంటేనే బావ్యమని,

మళ్ళీ కరుణిస్తానని, కురుస్తానని,
తిరిగొస్తానని,
ఇంద్రదనస్సై అలరిస్తానని
మాటిస్తున్నావు! ... నిజమా!
నా కెలా తెలుస్తుంది.
ఎక్కడ, ఎలా, ఏక్షణంలోనో అని,

చీకటి ఊహల్లో,
భయం, అనుమానాల్లో వదిలెయ్యకు ... నన్ను!
తొలకరిచినుకు
నీ సాహచర్యపు మధురిమ
మరిచిపోలేని పుట్టుమచ్చ
అనుక్షణమూ ... కళ్ళముందే కదులుతుంటే ...


*10-08-2012

క్రాంతి శ్రీనివాసరావు || పిశాచి మింగిన స్నేహం ||

దయ్యమై ఎప్పుడోస్తావురా దోస్తూ
నేనింకా వెతుకుతూనే వున్నా
వూగుతున్న చెట్లల్లో
రాత్రి పూట నడుస్తున్న నీడల్లో

చీకటి యెన్నెల కన్నులేసుకున్న రోజు
మూలబజారు సెంటరులో మోరీపై అంటుకొన్న మన స్నేహం
అప్పుడే మర్చిపోయావా
నీవు నేర్పిన ఉప్పెనగుండ్లాట
చిర్రగుండాట నేనింకా మరువలేదు

ఎంటీయొడి సినిమా కథ
రాకాసోడి మాయలు
రాజకుమారి రహశ్యం
నాకెవరు చెబుతారు నేస్తం

సందాకాడ కలిసి చెవిలో చెప్పింది నాకింకా గుర్తే
యెన్నెలాటలకు రావేంట్రా అంటే
కొత్త ఆటలు మొదలెట్టా చీకటే ఇప్పుడు తియ్యగా వుందన్నావు

మా తాత గూడులొంచి గుంజిచ్చిన
కంకులు నలిపి రామ్మూర్తి కొట్టులో
రూపాయుగా మార్చి
తిరువూరు హాల్లో చూసిన
ఎంటీయోడి సినిమా కంటే బాగుంటదా అంటే
చిన్నోడివి నీ కిప్పుడు అర్దం కాదన్నావు

మీ చుట్టపోళ్ళంతా మా పటేల్ తాత దగ్గర
చెప్పుకొంటే తెలిసింది
పల్లగొర్రు తోలు తున్నప్పుడు పాము కరిచి చచ్చిపోయావని

బాబూ అది అబద్దీకం
దొరసానమ్మ మా పోరగాణ్ణి తగులుకొంటే
కొట్టి చంపేసినారు బాబూఅని మీ అయ్య ఎడుస్తూ
గడ్డాము చాటున నాతో అన్న దాకా తెలియదు
నీకెందుకు చికటి తియ్యగుందో

నన్నే తాకొద్దు మీ తాత చంపుతాడు అని
దాన్నెందుకు తాకావురా
దయ్యమై అన్నా రారా
బతికున్న దెయ్యాల గొంతుకొరికేద్దాం
*10-08-2012

సైదులు ఐనాల.||కవిత ||

అక్షరమై మొలుద్దాం
తరగతి
ఆలోచనల
సంఘర్షణా నిలయమయినప్పుడు
భాల్యం

ఓ సున్నిత కుసుమం
మెత్తని ఇనుము
పారే శలయేరు
నిత్య నూతన పరిశోధన
తలుక్ల్కున మెరిసే మెరుపు
మానశికానందపు మనోవిజ్ఞాన దీపిక
కిండర్ గార్డెన్ లో తిరగాడే
ఓ సీతాకో చిలుక
-0-0-0-
తరగతి గది
వస్తు కర్మాగారమయినప్పుడు
బాల్యం
భారమైన భవిశ్యత్ చిత్రం
స్వేచ్చ గా గెంతే
లేగమెడలో గుదిబండ
గడ్డకట్టిన మంచుదిబ్బ
ఓ బ్యాంకు ట్రాన్ జాంక్షన్ కాగితం
అదీ కాక పోతే
ఓ నిపుణుడి చేతిలో తయారయ్యే
మానవబాంబు
-0-0-0-
ప్రియమైన
నా
పంతుల్లారా
తరగతిగది
దేశ భవిశ్యత్తును ప్రసవిస్తుంది
పురిటి నొప్పుల వేదననంతరం
మురిసిపోయే తల్లులమవుదాం
ఈ ప్రపంచం లో
ఎవ్వరూ చేయలేనిది
మనం మాత్రమే చేయగలిగేది
పలకల్ని పట్టుకున్న
చేతుల్ని ప్రేమించడం
ఆ చేతుల్లో
ఒద్దికగా అక్షరమై మొలుద్దాంరండి

'అక్షరం'
వెయ్యిమెదళ్ళకు
పదును..

*11-08-2012

శాంతిశ్రీ || చెక్కుచెదరదు.||

నా తలపుల్లో ఉండి

నీ తలపులు నా మనస్సులో
ఓ తరంగణిలా ప్రవహిస్తుంటే
ఎన్ని రోజులు గడిచినా
నీ కోసం నా మనస్సులో
నీ స్థానం అలాగే ఉంటుంది
నువ్వు దూరంగా ఉన్నా
నీవిచ్చే స్ఫూర్తి ఎంత మహత్తరంగా
ఉంటుందో నాకు అనుభవమే
మరణించే వరకూ నీ ఆకర్షణలో
ఉండటమే నిజమైన ప్రేమ
నా ప్రియుని ప్రేమ మరణించేవరకూ
చెక్కుచెదరక అలాగే ఉంటుంది

*11-08-2012

పెరుగు రామకృష్ణ //లోహలయ //

సమ్మెట సమ్మెటలుగా
నిగిడిన కండరాల బిగువంతా
ఇనుము పొగరుని

చపటగా చితక్కొట్టి
కొడవల్ని ప్రసవిస్తుంది
నాగేటి కర్రుని నిర్మిస్తుంది
చెట్టుని కూల్చే గొడ్డలి
మోటకు వేలాడే సంకెల
ఒక సుత్తె,ఒక గునపం
దైహిక శ్రమనంతా పిండి పిండి
ఇనుప ముద్డ ముక్కు పిండి
పనిముట్లకు ప్రాణం పోసిన
మొరటు విదాతై పోతుంది
నిప్పుల కొలిమిలో
రగిలిన లోహమే కనిపిస్తుంది
కరిగిన కండ కనిపించదు
నిప్పుల కావిడైన దేహం దృష్టి న్చాడు
కూలిన చెట్లు తప్ప
కూల్చిన గొడ్డలి ఊసే లేనట్టు
కోత కోసిన పైరు కుప్పలు తప్ప
కొడవలి జాడైనా లేనట్టు
ఇప్పుడు కమ్మరి ఇంటి నిండా
కన్నీళ్లు కారుస్తున్న ఆకలి
ఫ్యాక్టరీ చిమ్నీల కంటే పెద్దగా
కేకలు పెడుతోంది దీనంగా..!

(కను మరుగై పోతున్న కమ్మరి కోసం..)

*10-08-2012

క్రాంతి శ్రీనివాసరావు ||ఓ జెండర్ లెస్ నుడికారం ||

1
ఆడా మగా వొక్కటే అయితే ఎంతబావుంటుందో కదా
సృష్టి మనిషిని రెండు చేసింది

ఎప్పుడూ లొంగుండాలనేమో
లింగ భేదం విధించింది
ఒకటిగా వుంచకుండా
2
ఆడ మగలుగా తుంచి
ప్రేమదారాలిచ్చి
కలిపి కుట్టేసుకో మంటుంది
రాగద్వేషా లిచ్చి
రగడ పెట్టేసుకో మంటుంది.

తన్నుకు చస్తూనేవున్నాం అప్పటి నించీ
మనిషంటే తనేనని మగస్వామ్యం అంటే
మనిషంటే మనసని
అది తన వెంటే వుందని
నీ పుట్టుక నేనేనని ఆమెతనం అంటూనే వుంది.

3

ప్రకృతికి ఆడతనం ముసుగేసి
మము సృస్టించిన నీవు ఎవరితో రమించావని
ప్రశ్నల దాడులు చేస్తున్నాడు,
మనిషికి కోపం వచ్చి--

దైవాన్ని అడా మగగా చీల్చి
మొగుడూ పెళ్ళాలుగా మార్చి
తల్లీ కొడుకులుగా చేర్చి
తండ్రీ తనయులుగా పేర్చి
మూడు కోట్లకి చేర్చి
దైవత్వాన్ని చించి పంచేశాడు.
కుటుంబాల కుమ్ములాటల కాపురాల కడగండ్ల
తోరణాలు కట్టి
సంసారపు సంగీతం నైవేద్యంగా పెట్టి
అనుభవించినాకన్నా ఆదరించమన్నాడు.
4
అందుకే ఓ శాస్త్ర వేత్తలారా
ఎర్థువాములుగా మారి పోదాం మనం
ఆడా మగా మనమే అవుదాం
అమ్మగ నాన్నగ మనమే వుందాం.
అప్పుడప్పుడూ
ఆడదానిగా రమిద్దాం
మగవాడిగా సుఖిద్దాం
అందరం మనుషుల్లాగే వుందాం.

5
అప్పుడిక గృహింసా చట్టాల గొడవుండదు
సమాన హక్కుల సమ్మెలుండవు
సతీ సహగమనాల చావులుండవు
మగాధిపత్యమూ వుండదు.
మహిళా సాధికారికతా చెదరదు.

అప్పుడు మనిషి
సంసారపు సుడిగుండం దాటుకొని
పుట్టుక పూర్యం ఎంటో
మరణం తరువాతేంటో
ఈ మాయల మర్మం ఎంటో
సృష్టికి మూలం ఎంటో
గుట్టును విప్పే వాడు ఎప్పుడో

6

నిజానికి
ప్రకృతి ముడివేసి వుంచినా విడిపోయింది మనమే కదా!
ఎప్పటికయినా
అడా మగా వొక్కటే అయితే ఎంతబావుంటుందో కదా!

*11-08-2012

శ్రీకాంత్ కె||ఇరువురు||

నీకు ఇరువైపులా ఇద్దరు: నీకు నువ్వే-
మెడ చుట్టూ చేతులు వేసి ఒకరు, అరచేతిని పుచ్చుకుని లాగుతూ మరొకరు


ఇరువైపులకూ లాగుతూ ఇద్దరు: నీకు నువ్వే-
అంతం వైపుకు ఒకరూ, మొదలు వరకు ఒకరూ, మధ్యలో మరొకరూ: అదీ నువ్వే.

నీటి చెలమ చుట్టూ మొలచిన గడ్డిరెమ్మలు
రాత్రి కాంతికీ, వెన్నెల తాకిడికీ కదులుతాయి: ఎటువైపో, ఎందుకో నీకు తెలియదు
చీకటి చెట్లలో జలదరించిన గాలి, వెనుదిరిగి
కన్నుల తడినీ వొలికిపోయిన అరచేతులనీ ఇస్తుంది: ఇరువురిలో ఎవరికో నీకు తెలియదు

రెండుగా అయిన కలనీ, రెండుగా మారిన శరీరాన్నీ
ఈ భూమి నిండుగా కౌగలించుకుని ముద్దుపెట్టుకుంటుంది. ముద్దు ఒకటే, పెదాలే రెండు:
మూడుగా అయిన కాలాన్నీ, ఏడుగా అయిన విశ్వాన్నీ
నీ చేతులే దరి తీసుకుని దారీ తీరం చూపిస్తాయి. ప్రమిదె ఒక్కటే, కాంతి ఒక్కటే
మృత్యువు రాకుండా కాపాడే అరచేతులే రెండు

నువ్వు ఎదురుచూసే వర్షం ఒక్కటే, చినుకులే రెండు, మూడు...
నువ్వు నాటే విత్తనం ఒక్కటే, మొలకెత్తే ఆకులే రెండు మూడు...
నువ్వు నవ్వే నవ్వు ఒక్కటే , ప్రతిధ్వనే రెండు మూడు నాలుగు..
నువ్వు కావలించుకునే శరీరం ఒక్కటే, తిరిగ పలికే పలుకులే అయిదు ఆరు ఏడు...
నువ్వు ప్రేమించే ప్రేమ ఒక్కటే, జననించే కారుణ్యం తొమ్మిదీ, ఎనిమిదీ ఏడు...
నువ్వు మరణించే మృత్యువు ఒక్కటే, కన్నీళ్లు కారే కన్నులే ఒకటీ రెండూ మూడు...

నీకు ఇరువైపులా, నీకు నీకులా, నీకే నీకు ఇరువురూ:
గుండెలో దాగుని, ఒడిలో చేరి

నీ మైదానాలలో కురిసే దుమ్ము వర్షాలలో గెంతే పిల్లలే ఇరువురు
నీ ముంగిట వాలి నీ ముందు పూవుల్లా మారే సీతాకోకచిలుకలే ఆ ఇరువురు
నీకు ఇరువైపులా, నీ ముందూ వెనుకా, నీ చుట్టూతా
నువ్వు ఒదులుకోలేని, నువ్వు కోరుకోలేని ఇరువురు: నువ్వైన, నీ ఇరువురు!

ఇక నీకు బ్రతకడమెలాగో మరొకరు చెప్పాల్సిన పనేముంది?

*10-08-2012

కట్టా శ్రీనివాస్ || ద్వీప సమూహం ||

1
ప్రతి మనిషీ
ఒక దీవి
లోని ప్రత్యేకతల తోనూ
బయటి ప్రత్యక్షతల లోనూ
తానోక దీవే

2
కలుస్తూ, కదులుతూ
పరిస్థితుల గాలిలో
దోబూచులాడే దీవులు.

3
ఒక్కోసారి గంభీరంగా
మరోసారి గుంభనంగా
ఇంకోసారి బేలతనంగా
వూగిసలాడే దీవులు.

4
అంతు చిక్కని శూన్యంలో ఊగుతూ
ఒక్కోసారి పైనున్నానని,
మరోసారి పడిపోయాననీ వగచే దీవులు.

5
ఒక్కొక్కటి కాదు కాలభైరవా,
నిన్ను వంద సడిగుండాలు ఒకేసారి చుట్టుముడతాయిరా ఒక్కోసారి.
నలుగుర్ని వడిలేసిన ఏకాంతమో
అందరూ వదిలేసిన ఒంటరి తనమో
ఎప్పుడూ నీతోనే మిగుల్చుకుంటే
నీవెంత సుడిగాడివైనా
ప్రతి సుడిగుండమూ, ఓ గండమై
గడగడ లాడిస్తుంది.

6
నలుగురితో జతపడాలంటే పిల్లోడా
మాటల వంతెన వాడాల్సిందేరా బుల్లోడా.

7
రాజమహల్
మాటల గదికి
నాగభందం పడిపోయిందా ?
లక లక లక...
కలివిడితనంతో బద్దలు కోట్టు
పిరికితనం జరజరా పారిపోతుంది.

8
నీకు నువ్వే
అపరిచితుడవు ఎన్నోసార్లు
రామానివో, రెమోవో, రాక్షసుడివో
వేళ్ళైనా విడివిడిగా వదలకు
వడిసి పడితేనే పిడికిలౌతుంది.
మనసు ముద్దను ద్వైతాల నుండీ
కలిపి చుడితేనే తళుకులీనుతుంది.

9
నిన్ను నీవే ఆవిష్కరించుకోకుంటే,
ప్రపంచం తన నిశ్శబ్దంతో బహిష్కరిస్తుంది.
ఎందుకంటే
అసలే నీవోక దీవివి.

*10-08-2012