పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, జులై 2012, సోమవారం

రక్షిత సుమ || నేడో రేపో ||

ప్రతి చినుకూ ముత్యం కాక పోవచ్చు
ప్రతి అడుగూ గమ్యాన్ని అందుకోక పోవచ్చు,
కానీప్రతి మంచి పనికీ ఓ మంచి ఫలితం
ఎదురు చూస్తూనే వుంటుంది.
*16-07-2012

భమిడిపాటి ఫణి కుమార్ శర్మ కవిత

అడుగులు తడబడుతున్నాయి
గమ్యం లేని దారి
మసక బారిన కళ్ళకు
రెండుగా చీలి వెక్కిరిస్తూ

ఎండిన డొక్కకు
పట్టెడు మెతుకులు
అలసిన గుండెకు జాగా లేదంటూ
నీ వచ్చిన చోటికే పోమ్మంటూ.....

ఎచటికి పోతావ్ ఓ రైతన్న .............

పంచె కట్టిన చోట రాళ్ళెత్తలేవు.
ఎండిన భూమిని చూస్తూ బ్రతుకలేవ్
కుటుంబ భారాన్ని మోయలేవ్
నీ వాళ్ళను పస్తులున్చలేవ్....

నీ తల్లి భూమిలో నీరులేదు
సర్కారీ విత్తనాల్లో సత్తాలేదు
అప్పులోల్లు ఒంట్లో చుక్క రక్తం మిగల్చలేదు
ఓదార్పుల ప్రభుత్వంతో ఒరిగేదేమీలేదు.
*16-07-2012

రియాజ్ || విజయోద్వేగం ||

పిడికెడు గుండె పట్టలేని అనందం
అనియంత్రితం ఈ ఉద్విగ్న క్షణం!!

ఇన్నాళ్ళ శ్రమ ఇన్నేళ్ళ సహనం
గెలిచానన్న వాస్తవాన్ని కళ్ళార్పక చూస్తుండగా..

గతం అంతర్గతం నిర్ఘాంతం
కండల నరాలలో బిగువందుకున్న క్షణం
సుధీర్ఘ సాధనకు తలవంచిన మనోక్షేత్రం
అనియంత్రిత వేగంతో వచ్చిన
అస్థిత్వం కెరటమొకటి అంతులేని ఉత్సాహమున
కనులువిడిచి స్వేచ్చగా వెడలె కన్నీటి ధార
కనులుమూసినా శూన్య దర్శనం
స్వేదసువాసన గాఢంగా శ్వాసించిన క్షణం
మరిగిన రక్తపు ఆవిరులు చుట్టుముట్టగ
సుదీర్ఘ నిట్టూర్పు విడుదల

కష్టమే దాచడం ఆపుకోవడం !

ఎందుకంటే..
అది విజయోద్వేగం !!
అది విజయోత్సాహం.
*16-07-2012

పి.రామకృష్ణ || విషాదం అను నాటిక..||

ముసుగేసిన రంగుని
తుడిచేసుకున్నా..
మారని ముఖభావం.

** ** **

గ్లిజరిన్ అవసరం లేని
కళ్ళు-
తెర దించేవరకూ
శోకిస్తూనే చివరి దాకా.

** ** **

అనుభవం అక్కర్లేని
అభినయం.

అనుకరిస్తే చాలు
ప్రతి జీవితమూ-
ప్రాంప్టేషన్.

*16-07-2012

జ్యోతిర్మయి మళ్ళ || నాలోని నువ్వు ||
కనుచూపు మేరంతా నువ్వే కనిపిస్తున్నావు
నా కంటిపాప లో కొలువున్నావా?

గుండె భారంగా ఉంది
నువ్వు మరీ ఇంత బరువా?

నాలుక ఏం పలికినా నీపేరే వస్తోంది బయటికి
స్వరపేటికను స్వాధీన పరుచుకున్నావా?

ఏ వైపూ దారి లేదు మనసు గదికి
ఎలా చొరబడ్డావు దొంగవా?

నా ప్రతి కదలికనూ శాసిస్తున్నావు
కండరనరాలన్నిటినీ ఆక్రమించావా?

నీతలపు తప్ప మరేం చేయనని మొరాయిస్తోంది మెదడు
ఏకచత్రాధిపత్యం సాగిస్తున్నావా?

ఇదేం చిత్రం, నా అద్దం నిన్ను చూపిస్తోంది
నేనే నువ్వయిపోయావా?
*16-07-2012

Rakshita Suma || New Extension of Twinkle twinkle little star ||

Twinkle twinkle little star,
How i wonder what you are?
Up about the world so high,
Like a Diamond in the sky.


Dimple shinning little Moon,
Have you got the own shine?
No no children not my own,
I have brought it from the sun!

when the sun is getting down,
we all come to your town!
Twinkle twinkle all the night,
Dimple shinning all so bright.
*16-07-2012

బివివి ప్రసాద్ || దిగులు గీతం ||1దిగులు గాలిపటం ఎక్కడో ఎగురుతూ ఉంది ఈ విరామసమయంలో


2


వాన కురుస్తుంటే లోలోపల దాగిన తాపమేదో తగ్గి చల్లబడాలి కదా


కానీ ఈ దిగులేమిటి


దారిలో తగులుకొన్న కుక్కపిల్లలా నాతోనే తిరుగుతోంది


3


ఎందుకని ఆకాశమా ఏడవకమ్మా అనాలనిపిస్తోంది


మననెవరూ ఓదార్చనపుడు, మనకెవరినైనా ఓదార్చాలనిపిస్తుందనుకొంటా


4


విరామమెంత బరువుగా వుంటుంది


ఈ ఖాళీ సమయాన్ని తెల్లకాగితంలా మడిచి దాచుకొని


వత్తిడుల మధ్య వాడుకోగలిగితే బాగుండును


5


ఏదో ఒకటి చేయాలి


నన్ను నేను తప్పించుకోవాలి


కురిసే, కురిసే వానని ఊహతో ఆపగలనేమో ప్రయత్నించాలి


6


సంగీతమో, స్మృతులో, కవిత్వమో


దేనికైనా ఈ దిగులు సరైన సమయం


కానీ, అన్నిటినీ విడిచి,


ఈ సారైనా దిగులు గర్భంలోకి సరాసరి దూకాలని ఉంది


ఏ సృష్ట్యాది కాలపు వెలుతురులు అక్కడ దాగివున్నాయో చూడాలి


ఏమీ లేకపోవటమైనా అక్కడ ఉండకపోతుందా


అంతూ, దరీ లేని స్వేచ్ఛ నన్ను ముంచేయకపోతుందా


నిజమైన వాన ఏదో నన్నొక చినుకుని చేసి ఎటైనా విసిరేయకపోతుందా


*15-07-2012