పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, నవంబర్ 2013, బుధవారం

తొవ్వ

 
 తొవ్వ పొంటి నడుస్తూ పోతాంటే మనసు వికసిస్తది .చిన్నప్పుడైతే సంకకు పుస్తకాల సంచి ఏసుకొని మా తాతిబోత్తల్ల పానాది నుంచి నడిచి బడికి పోయేది .అదే బాట పొంట ఎడ్లు మ్యాకలు ల్యగలు సుత పోయ్యేవి .వాటిని సూస్తుంటే మస్తు మంచిగనిపిచ్చేది.ఆ తొవ్వ కు అటు ఇటు తాళ్ళు వాయిల్లు శిల్పక్కలు ఉండేవి నడకంటేనే ముచ్చట. అయితే మనుషలతోని లేకుంటే చెట్లతోని .అదొక కమ్మని యాది .
ఈ కాలం రాయిమని యాకూబ్ భాయ్ 'తొవ్వ ' పేరు కరారు చేసినంక నా మవుజుల కెల్లి తొవ్వ తిరిగిన అక్షరాలే రాలుతన్నాయి .మక్కజొన్న చేను మద్యల కేళి తొవ్వ ఉంటది ,అందుల కెలి నడిచి పోయి చేను మధ్య మంచె మీద రాత్రి పండుకొన్న జ్ఞాపకం .పచ్చని మక్క చేనుల ఎల్లెలుకల పండి ఆకశంల సుక్కలు చందమామ గోరుకోయ్యలు మూలసుక్క సూస్తంటే మంచిగనిపిచ్చేది .మక్క పెరడు వొడ్ల మీద పొలం మడికట్లల్ల వొడ్లమీద నడుసుడు గమ్మతంటే గమ్మతి .ఇగ మా తాతతోని ఎడ్ల కావలి పోయినప్పుడు గుట్టలు బోర్లు కంచెలు పొల్లు పొల్లు పొద్దుందాక తిరిగేది గుత్తకు పసుల మేప ఎక్కుతాంటే కిందికి సూస్తే ఇండ్లన్నీ అగ్గిపెట్టేల్లెక్కనే అగుపిచ్చేవి .గుట్టకు సుత తోవ్వలుంటాయి .అసలు తొవ్వ లేని వూరు ఉండనే వుండది.పిల్ల తోవ్వలు ముండ్ల తోవ్వలు ఉంటయి.ఏ తొవ్వల నడిచినా హాయి హాయి ..ఇప్పుడయితే మట్టి దారులు పోయి సిమిటి రోడ్లు వచ్చినయి.
ఈ తొవ్వలన్ని వచ్చి కవిత్వంల సోర్రినయి.అసలు కవిత్వమే ఒక తొవ్వ .సాహిత్యం ఒక బాట .సంస్కృతి ఒక ఆట .కవికి చిన్నప్పుడు తిరిగిన మక్క పెరడు ,వరిపొలం ,బోజట్ల ఎడ్ల పెయ్యి కడుగుడు ,పెండకాలు తీసుడు పెంట జార కొట్టుడు ఇప్పుడు కవిత్వం కాకుంట పొతదా...ఇప్పుడు మా ఊల్లెకు పోతే పాత పానాదులన్ని కలే తిరిగి కవి సమయాలను ఎరుక వచ్చుకుంట .ఆడికి పోంగానే కవిత్వం పొంగుక వస్తది
అసలు ఈ తోవ్వలు ఎందుకు మాయమైనయి.నున్నటి రోడ్లు వచ్చి మనలను సంపటానికా..లేదు వాని సరుకులు అమ్ముకోవడానికా...మన వనరులను తరలించుకపోవదానికా...వద్దని మర్లపడితే పొలీసొల్ల ను పంపడానికా.....అదే అయ్యుంటది ...
తొవ్వ ఒక కవిత్వపు నడక ..అప్పుడు మనసు నిండేది ,ఇప్పుడు మనుసుకు పట్టనియ్యనిది .....మల్ల భుధవారం మాట్లాడుకుందాం ..........
                      
 
                                                                                                                                     
 
 
                                                                                                                                                                                                                                                               ----------అన్నవరం దేవేందర్