పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, ఆగస్టు 2012, శనివారం

యజ్ఞపాల్ రాజు || నేను ||

నిశ్శబ్దం అలలు అలలుగా పొంగే ఏకాంతంలో
ఒక్కోసారి హఠాత్తుగా నువు నా పక్కన లేవని గుర్తొస్తుంది
అంతవరకు నను మరిపించిన రంగుల కలలు అంతర్థానమై

అంతులేని నైరాశ్యపు చీకటి నా మనసును కమ్మేస్తుంది
నాలోని అనంత వర్ణాల ఆశలు నల్లదనం పులుముకుంటాయి
అంతదాకా నన్ను కవ్వించిన చిలిపి చల్లదనం
నేనంటే అస్సలు ఇష్టం లేదన్నట్టు ఒళ్ళంతా కరుస్తుంది
అంతలోనే నాకు “నేను” గుర్తొస్తాను
నువ్వు నిలువెల్లా నిడిపోయిన “నేను”
నేనున్నంత కాలం నాలో నాతో నువ్వూ ఉంటావుగా
నువ్వు నాలోనే ఉన్నావనే భావన కలగగానే
నిబ్బరాల మబ్బులు నీ కౌగిలిలాంటి వెచ్చని వానను నాపై కురిపిస్తాయి
ఎండిపోయిన నా పెదాల పొలంలో చిరునవ్వుల పూలు పూస్తాయి
ఇంతకన్నా నాకింకేం కావాలి.

*04-08-2012

కర్లపాలెం హనుమంతరావు॥దివాలా॥


 కలలో
నాకెవరో
ఒక 'పావలా' ఇచ్చి
"కావాల్సినవేవైనా కొనుక్కోరా!" అన్నారు.
మెలుకువలో మహా హుషారుగా
బజారుకు పోయి
మబ్బులు,
వాటిని కడిగే సబ్బులు,
చెట్లు,
వాటినెక్కేందుకు మెట్లు,
పడుక్కునేందుకు పొడువాటి రోడ్లు,
నడిచేందుకు సన్నని, నున్నని కాలువలు...
ఇంకా ఎన్నో...ఎన్నో...
అన్నీ కొన్నాను-
వాటినన్నింటినీ వీపుమీదంటించుకుని
నా వాకిలి తలుపులు తడుదును కదా...
అక్కడొక పొడుగాటి మనిషి
చక్కగా గోడమీద పడుకున్న పడుకున్నవాడు
నవ్వుతూ
నిటారుగా లేచి నిలబడుతూ
"అప్పుడే వచ్చావా? నీ కోసమే
కాసుక్కూర్చున్నా నా పావలా
నాకిచ్చేయ్!" అన్నాడు.
"ఏం పావలా అంటే
పాతాళం జేబులోనుండి
కాతా పుస్తకం తీసి
కాకుల్ని బాతులుగా చూపించాడు.
చేసేది లేక చేబదులు తీర్చేద్దామని
జేబులో చేయి పెడితే
పావలా ఏదీ! ?
"నీ పావలా నా దగ్గర లేదు
మళ్ళీ రా
నీ(ము)పళ్ళన్నీ నీ కిచ్చేస్తా!"అంటే
వాడు వికృతంగా నవ్వి
"మళ్ళీ మళ్ళీ ఎక్కడొస్తానూ,
నాకు బోలెడన్నిపనులున్నాయి
(ఎన్నో కాకుల్ని బాతుల్ని చేయద్దూ)
పోనీ
నీ దగ్గరున్న మబ్బులు, చెట్లు,రోడ్లు, కాలువలు,
కాసిని కోసుకెళతా…వప్పుకుంటావా"అని వీపు తడిమి
చక్కాపోయాడు.

నేను

నవ్వుకుంటూ
నట్టింట్లోకి నడిచి
నా లాభాల మూటనుమూలకు సర్ది
అందంగా నవ్వుకుందామని అద్దం ముందు నిలబడితే
అరె!.....నేనేదీ!!!???
ఇంకేం నువ్వు?
వాడిచ్చిన పావలా కెప్పుడో 'దివాలా' తీసావు
అంటో అద్దం నవ్వు!
(అద్దం అబద్ధం చెప్తుందా!)


(ఆ చక్రవర్తిని నేనే. ఈ కవిత ప్రచురణ కాలం 23-08-1975. ఆంధ్రజ్యోతి వార పత్రికలొ(పురాణం సుబ్రహ్మణ్యం గారు సంపాదకులు) అప్పట్లో "కొత్త కలాలు" పేరుతో వారం వారం ఒకటొ, రెండో కవితలు ప్రచురించే వారు.అంధ్రజ్యోతిలో కవిత రావడం అప్పట్లో చాలామంది చిన్న కవుల కల.ఆ శీర్షికలో ఇప్పటి ప్రముఖులు చాలామంది కనపడుతుండే వారు.(పాపినేని శివశంకర్ పేరు గుర్తు నాకు).ఈ కవిత రాసే కాలం నాటికి నా వయసు 23. తిలక్, ఆరుద్ర, శ్రీశ్రీ, గజ్జెల మల్లారెడ్డి వంటి వాళ్ళ కవిత్వం ఇష్టంగా చదువుకుంటుండేవాణ్ణి.ఎలా పడిందొ నా దృష్టిలో సర్రియలిజం మీది శ్రీశ్రీనో, ఆరుద్రో రాసిన కవిత్వం…దాని ప్రభావంతో రాసిన కవిత ఇది. కవిత్వం అంటే ముందు నుంచీ అమిత ఇష్టం.ఆ అతి ప్రేమ వల్ల అతి భయంతో కవులు రాసినవి చదివి విశ్లేషించుకునెవాడినే కాని ధైర్యం చేసి రాసింది తక్కువే.
పాత కాగితాలు తిరగేస్తుంటే…ఈ కవిత కనపడింది ఇవాళ. ఇప్పటి సెజ్జుల కాలంలో బక్క మనిషి చిరు ఆశకు ఈ కవిత ప్రతిబింబం అనిపించింది.అందుకే మళ్ళా ఇప్పుడు ఇక్కడ ఇలా…)
*4.8.2012

పెరుగు రామకృష్ణ||హిమ శిల్పాలు..!||


గాడితప్పిన
జీవితానికి నిబద్దత తెలీదు
నిన్ను నీవు హత్య చేసుకుంటున్నట్లు
దోసిలితో విషం పట్టుకు తాగేస్తున్నట్లుంది
నీ చుట్టూ పరిబ్రమిస్తున్న
ఒక్కొక్క హిమ శిల్పమూ
నిన్ను అసహ్యించుకుంటున్నా కూడా
అధికారం నీ అరచేతిలో బొంగరంలా తిరుగుతుంది..
చిరిగి పోయిన దేహాల్ని చూసినప్పుడల్లా
నిన్ను నీవు అంగార తల్పం మీద నెట్టుకుంటూన్నట్టు
నీవెప్పుడూ అనుకొనేలేదు
ఒక వెర్రి ఆనంద మేదో నిన్ను స్వస్థత పరుస్తుంది
నిర్మలమైనది
నిజాయితీది
పరిసుద్దమైనది
ఏదీ లేనట్లు ఆత్మ ఇప్పుడు అల్లాడి పోతుంది
ఇదంతా నీకు అర్థం కాక పోవచ్చు
స్వార్థం నీ కోటు గుండీకి అందంగా గుచ్చిన పువ్వుకదా?
అవినీతి నీ కలం పోటులోని పాసుపతాస్త్రం కదా ?
వేల ముఖాల కన్నీళ్లు కూడా
ఒక్కసారైనా నీ ప్రతిబింబం చూసుకునేప్పుడు
వెక్కిరించడం లేదు ..
ఆత్మ ఏమిటీ?
పరమాత్మ ఏమిటీ..?
ధర్మాధర్మాలు రెండుపడవలు కాదు కదా
అవిప్పుడు నీ చేతిలోని త్రాసు మాత్రమేగా
ధనం మూలం ఇదం జగత్..
అనంతంగా సుఖించి ,
అంతరించి పోవాలి
విలాసాల ఊయల లూగాలి
మొదలు ,చివర లేని బతుకులు కదా
అధికార దుప్పటి కింద చేతులు చాపాల్సిందే
ఆశ్రిత బందు ప్రీతితో మగ్గి మాసిన మరకవ్వాల్సిందే
నిజాయితీగా ఒక నిజం చెపుతున్నా ..
శిక్షించడానికి ఎవరూ లేరిక్కడ
ఏ అనుభవం లేని పసి దేహంతో నీవు నిలబడ్డప్పుడు
నైతిక విలువలు తప్పోద్దంటూ
నీ తండ్రి మాత్రమే నిన్ను శిక్షించే వాడు
సుఖనిద్రల దేవులాటలో పయనిస్తున్నప్పుడు
పసుపు రాసిన చెర్నాకోలతో కొట్టి
పవిత్రంగా నిన్ను మేల్కొల్పడానికి
ఇప్పుడెవరూ లేరు..
చీకటి పల్లకీలలో ఊరేగుతున్నావు
కాగడాలు కాకపోయినా
కొవ్వొత్తులు వెలిగించే చేతులే కరువు ..
కోట్ల కుంభకోణాల వెలుగు వాకిట్లోకి వచ్చేలోపు
సుఖదుఖాల అసలు జాడ తెల్సుకో..?

*4.8.2012

కిరణ్ గాలి॥A ఫర్ Apple॥


కాశ్మిరీ కన్నెపిల్ల బుగ్గల్లా మెరుస్తుంటే
కసుక్కున కొరికితిన్నాడు వాడు
తీపి మనసంతా పరుచుకుంది
హాయి వొళ్ళంతా నిమురుకుంది

(....)

భుమి పైని ఆకర్షణ Newton కి
Eve లోని ఆకర్షణ Adam కి
తెలిసింది ఆపిల్ తొనేనట!!!
అందుకనే అతడిపై ఆకర్షణ కలిగించే
ఆ"పిల్"ని ఆమె కొసం కొన్నాడట

(...)

పసిపిల్లాడికెం తెలుసు
దాని విలువ మన దేశపు దారిద్య రేఖ
దాటిందని
పేదరికం ఆకలి కవల పిల్లలని
ఇంకా ఆశగానె చుస్తున్నాడు దాని వంక
అటుగవెల్తు ఆగిన ఒక మానవత్వం...

(...)

నిన్న రాత్రి దళితపేట దుర్మార్గంలొ
కులంకత్తికి తెగి పడిన శిశువుల అశువులు

పాలిట్బ్యురో మీటింగ్ టేబులుపై
నెత్తురోడుతున్న గుండెకాయల్లా

వాటిపై ఇంకా తడారని
కన్నపేగు అశౄవులను
చూసి ఎరుపెక్కిన వాడి కళ్ళు

(...)

ఎండిన బొడ్డుపై
కుళ్ళిన ఆపిల్ పండు
తెరపై క్లొజప్లో
చొంగ కారుస్తు
చూస్తున్నాడు ప్రేక్షకుడు

(...)

మరణం అనివార్యమని తెలిసినా
తుది శ్వాసవరకు
మానవాళి జీవ(న)నాడితొ ముడిపడిన
అనేకనేక
సాంకేతిక సౌలభ్యాలందించిన
యోధుడి విజయ చిహ్నమది

(...)

పచ్చటి దే(శ)హంలో
చొచ్చిన రక్కసి పురుగులు
ముంబైలొ, పునెలో,
డిల్లిలో, గల్లిలో
తెగిన అంగాలు
కాలిన అవయవాలు
నుజ్జయిన ఆయువులు
గుజ్జయిన ఆత్మియులు

(...)

అక్కడ తుఫాను వెలిసిన ప్రశాంతత
వైతరణి తీరం నుండి వెనక్కి వచ్చాడు మరి
అవిడ చేతిలొ ప్రేమగ నిమరబడుతు
యుధ్ధభుమిలొ శ్వేతకపొతాలు

(...)

ఆపిలుపై నవరసాలను
పండించడమా...
నిజంగ సాదించగలిగితే

(...)
 
*4.8.2012

కె.కె॥కనిపించే నరకాలేమో???॥


వైరాగ్యం అనుభవిస్తోంది
నిశ్శబ్దంగా నగరం,
చీకటితో జతకట్టేసింది
చింతలేని మహాపట్నం,

తన నీడని చూసి తనే
ఉలిక్కిపడింది దీపస్థంభం,
తన చప్పుడికి తనే
తత్తరపడుతోందీ నాచేతి గడియారం,

చీకటికి పహారా కాస్తోంది కీచురాయి,
ఒళ్ళు మరచింది పేవ్మెంట్ పై
బిచ్చగాళ్ళ బృందం నిద్దరోయి,
పరవశిస్తోంది అమ్మకౌగిలిని చంటిపాపాయి,
కలవరిస్తోంది పచ్చిక .. ప్రకృతిలోని హాయి,

కునికిపాట్లు పడుతూ నేనింకా కంప్యూటర్ ముందే,
కార్పొరేట్ ఆఫీసులంటే కనిపించే నరకాలేమో???
 
*4.8.2012

భవాని ఫణి॥తొలిపొద్దు॥

తొలిపొద్దు సుప్రభాతం పాడింది
తెలిమంచు వీడ్కోలు చెప్పింది

ఆవలి గట్టుని వెతుక్కుంటూ
వెన్నెల ప్రవాహం వెళ్ళిపోయింది

తూరుపు తీరాన్ని
వెలుగు కెరటం తాకింది

నక్షత్రాల నావలు
నిన్నతో కలిసి వెళ్ళిపోయాయి

కాంతి కిరణాలు వచ్చి
ఆకాశపు ఒడ్డుతో ఆటలాడుతున్నాయి

నిద్రమత్తులో చందమామ
ఏ చీకటి మూలనో జోగుతోంది

అదను చూసిన సూరీడు
అంతటా ఆక్రమించాడు

అలలు అలలు గా
తేజస్సు పంపి అల్లరి చేసాడు

ఆ కెరటాల తాకిడి తగిలి
ఊహల ఉషోదయం జరిగింది

మనసంతా మౌనంగా
నవచైతన్యం నిండుకుంది !!!
 
*4.8.2012

వంశీధర్ రెడ్డి॥క్రాస్ రోడ్స్॥


దార్లెక్కువున్నా కష్టమే
ఏ దారో వెతుక్కోడానికి,
గమ్యం కనపడ్తున్నా నష్టమే
తొందరేముందని, అడుగేయడానికి,

ఎం.టెక్ చేసి. లక్షలు సంపాదించినంత కాలం,
నేనేం చేసినా ఓ అద్భుతం,
నేనేం రాసినా, అపూర్వం,
నాలో కవికి కళ్ళాపి జల్లి. ముగ్గులేసారు,
నా ఆలోచనని, కళ్ళాపి చూసి మూగపోయారు,

ఎక్కడో మంచు దేశం, జలుబొచ్చి తుమ్మితే,
మన దేశంలో బలుపొచ్చి కమ్మితే,
ఉద్యోగానికి రెక్కలు,
ఇంటికి అప్పులూ మిగిలి

ఆశ్చర్యం,
ఇప్పుడు నేనేం రాసినా, దండగట,
నేనేం చూసినా ఎందుకట,
కవిగాడిక్కాళ్ళిరగ్గొట్టి మూలన్తోసి,
ఆలోచనల్ని ఆ లోచనాల్లోనే మూతేసి,

"ఐనా,
సంపాదన్లేనోడికి సాహిత్యమెందుకోయ్,
నువ్ లేకపోతే సారస్వతమేం చావదు,
తెలుగు పుస్తకాలింకా చదువుతున్నారా,
ఇంగ్లీషోడి స్థాయినెలాగూ అందుకోలేవ్,
జేమ్స్ జాయిస్ "యులిసిస్" లాంటిదొక్కడ్రాసాడా,
జేమ్స్ బాండ్ స్థాయున్న ఒక్క పాత్రైనా మనకుందా,
చేతిరాతలన్నం పెట్టవోయ్,
నీ తలరాతకి తగ్గట్టు మారాలంతే,
ఎంతసేపింకా క్రాస్ రోడ్స్ లో
నువ్వెక్కాల్సిన బస్సెప్పుడూ నీకోసమాగదు,
చూడాల్సిన ఉషస్సూ, రాక ఆగదు,
ఎవరిమీదా కోపం, ఎందుకా ఏడుపు"
అంతర్వాణికీ అలుసైపోయి..

అన్నీ పోయాక ఏముంది కోల్పోడానికి,
కన్నేమూసాక ఎదురేముంది భయపడ్డానికి,
ఏళ్ళుగా కూరుకున్న బావి నిండినట్టై
చాన్నాళ్ళుగా పేరుకున్న భావాలు పండినట్టై,
రాస్తున్నానీ చివరి రాతలు,
చెదిరిస్తున్నా చెదల ఛాయలు,
చిదిమేస్తున్నా చీడల నీడలు,
చిగురించే రేపటి నిజాలుగా
మారడానికి,
చూడడానికి..
 
*4.8.2012

డా . సింహాచలం లక్ష్మణ్ స్వామి||అడవిలో వాన ||

 
ఒకటే వర్షం
వనకన్య తడిసి ముద్దయ్యింది..
ముద్దబంతి పూవయ్యింది...
కొండగోగు పూల పెదాల చు౦భించే వాన

యదలోతుల లోతయిన లోయల్లోకి

అలవోకగా జాలు వారుతూ
పచ్చని కోకని పరుచుకుంటూ
ఎన్నెన్ని కళల కల్లళ్ళో నెమలి కన్నులై
మైదానాల్లో విచ్చుకున్నాయి ...

మోదుగుపూలని పొగమంచు ఘాడ౦గా
కౌగిలించుకుందేమో 'లక్క ' పొంగుకొచ్చింది ...

మయూరాల వయారాల్తో
కొండ కోనంతా పండుగే

గూడు తడిచిన గువ్వలు
గుహల్లోకి చేరి
వెచ్చని కౌగిళ్ళ స్వప్నాల్ని కంటూ...

వానకెంత ముద్దో వనమంటే....!?

వనాలనుండి సేకరించిన
వాన పూల వరదను కని
చెరువులన్నీ అచ్చెరువొ౦ది 'పొంగు'తున్నాయి !!

తడితడి నేలనుండి
చడిచేయకుండా
అమ్మవారి కుంకుమతో
ఆరుద్రలు బయలుదేరాయి ..!!

దాహార్తితో బక్కచిక్కి
బిక్కచచ్చిన పొలాలన్నీ
వర్శామృతౌషదాలతో
పునరుజ్జీవనమై
పసిడి పంటలతో కళ కళలాడుతూ ఉంటే
ఆహ్హనం రాకున్నా అరుదెంచిన ధాన్య లక్ష్ములు...!!!

చరా చరాన్ని జాగృతం చేసే వరుణా...!!
నిను వర్ణించ తరమా ..!!??
నీ రాక
నా ఎడారి హృదయాన
పూల గోదారుల్ని పొంగిస్తూ ..!

ఉప్పొంగే గంగా తరంగానివై
నా కలంలో అవ్యక్తానంద
భావాక్షర కెరటాల్ని సృష్టిస్తూ ...

*4.8.2012

క్రాంతి శ్రీనివాసరావు॥దయ్యాల మాణిక్యమ్మ॥


ఎదుళ్ళ చెరువువాయలో
కొరవిదెయ్యం లాంతర్లు పట్టుకుతిరుగుతుందట 


వూళ్ళోవాళ్ళ నోళ్ళళ్ళో నిత్యం నానుతూనే వుంది

పుకారని కొందరు లేదు చూసామని కొందరు
చేతిలొ ఒకత్తె, చంకలో ఒకడు, కడుపులో ఒకదాన్ని పెట్టి
అంత చిన్నవయసులోనే పుస్తెలతాడు పెరిగిపోతే
అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా
సంసారభారంతోపాటూ పారాపలుగు బుజానెట్టుకొని
ఎనభై ఏళ్ళనాడే ఏ భయమూ దరి రానీయకుండా
మడికి నీళ్ళెట్టేందుకు కాలువ మడవపై
కాచుకు కూర్చున్న రైతు- మాణిక్యం

మా నాయన అమ్మ మా నాయనమ్మ
ఆనాడే స్వతంత్రించిన నాయనమ్మకు
వూరంతా కలసి పెట్టిన ముద్దుపేరు  'దయ్యాల మాణిక్యమ్మ'
ఎవడేమంటేనేం 
అమ్మతనానికి తరతరాలకు సరిపోయే నమ్మకం సమకూర్చి
తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళిన ముగ్గురమ్మల మించిన అమ్మ
అమ్మలందరిలో మేలిమిమాణిక్యం -మా మాణిక్యమ్మ

ఆమిచ్చిన ప్రేమను పలువురుకు పంచుతూ 
కృతజ్ఞతతో తలవంచుతూ బ్రతకడం తప్ప
ఏమివ్వగలను నేనిప్పుడు???
*4.8.2012

ఆదూరి ఇన్నారెడ్డి॥ప్రియా-2||

ప్రియా 

ముత్యాల వాన జల్లులకోసం ఎదురుచూసే ధాత్రిలా
నీరాకకై శూన్యంలోకి చూస్తూ కూర్చునాను


నా మది పావురంలా రెక్కలుసాచి
ఆ పచ్చటి నేలలను నీలిమబ్బులను దాటి
అనంతమైన ఈ ప్రేమతాలూకు
శూన్యంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది


నాలో తడసి
ముద్దయిపోయిన ఈ ఆలోచనా తరంగాలను ఆపలేక
చీకటిదారులలో మగ్గిపోతున్న ఈ ఒంటరి నావని చూసి
ప్రియా
సీతాకోకచిలుకలాంటి నా ఆలోచనల్ని పరిహసిస్తూ
తన గర్భాన్ని చీల్చుకుని
చొచ్చుకు వచ్చిన జలతరంగాలతోపద్మవ్యూహాన్ని పన్ని 
నన్ను తన గర్భంలోకి తీసుకుపోతోంది

ప్రియా- నా చుట్టూ వ్యాపించిన 
ఈ జలనిశీధిలో అంతర్దానమౌతున్న నాకు
నీ స్మృతుల తరంగగోష తప్ప 
మరొకటి వినిపించడం లేదు
అనంతమైన ఆ సముద్రగర్భంలోకి చొచ్చుకుపోతున్నా ...
నీ జ్ఞాపకాలతో తడసి పులకించాలని 
మది ఆరాటపడుతోంది ప్రియా!!!
 
*4.8.2012

పులిపాటి గురుస్వామి॥కవులు పాడే కాలం॥


పండగ
ఆనందం పండగ
సొగసు రంగుల అక్షరాలు

కలిసి కురిసే రమణీయ వాన

పూలు కలుసుకునే చోటు ,
రంగుల పేర్లు ఎన్నని చెప్పేది
వికసించిన వాసనల తోట సౌరభం
అనేక వర్ణాలు ,అనేక మధురాలు
అనేక జ్ఞానాలు,అనేక మధువుల తేనెతుట్టె
అనేక రసాల కవిత్వపు పాలపుంత

పరిశుభ్రమైన చూపును
సీతాకోక చిలుకల మీద విసరండి
చిలక పచ్చని శ్వాస తో
గడ్డి పూల నవ్వుల్నీబంధించుకోవచ్చు

ప్రేమల్ని పూసిన కవుల జాతరని
కాలం చేసుకునే పండగ

ఆత్మను పెనవేసుకున్న భాషా చిలుకలు
మౌనం పొడుచుకొని బయటకొచ్చిన
పచ్చిక మెదళ్లు
రాత్రులకు పగల్లకు
సౌందర్యమద్దిన రింగన్నలు
వ్య్ధధలకు వెన్నెల నద్దిన దివ్యపురుషులు

సూర్యుడికి ఉదయం సాయంత్రం
కలువల దండ సిద్ధం చేసే దండు
అక్షరాలే జీవద్రవమైన
మాదకాలంకార ప్రియులు

నడిచొచ్చే సుతిమెత్తని ముళ్ళ పొదలు
గాయాల రూపాయి బిళ్ళలు
రాజుల పక్కటెముకల కింద మొలిచే
పగిలిపోయే గడ్డలు
దడదడ గుండెల్ని ఉరికించిన
పిడికిలి పాళీలు

రహస్యం లో చుట్ట చుట్టుకొని
శ్వాసలని సాగ దీసే మెదడు పురుగులు
విజ్ఞాన శిఖలు ,
సొంత తలకి కొరివి పెట్టుకోగల
రహస్య హస్తధరులు

దుఃఖంతో రమించగల రసికులు
ఆకలికి గుండె పెండేరం తొడిగే రసరాజులు
భూమి మీద పూసిన నక్షత్రాలు
చరిత్రలోకి నడక చూపిన చూపుడు వేల్లు

సొగసు వీచిన గంధర్వ వృక్షాలు
ఆత్మీయ వర్ణమాలలు ధరించిన
వెలుతురు పిట్టలు
ఎగిరొచ్చి ఎగిరొచ్చి వాలతాయి
కమ్మని కోయిలల శబ్ద ధ్వనులకు
వసంతం తొంగి చూస్తుంది
నా అనాది పూర్వ కవుల ఆత్మలు
పండగ చేసుకుంటాయి

ఒక దీపం వెలిగిద్దాం
అది అక్షరం పుట్టిన నాటిది
నాడులలో ,నరాలలో
పాకిన వెలుతురు ఊరికే ఉండదు...

ప్రకాశంతో భూమ్మీద కాగడాలు మొలకెత్తుతాయి
ముందు తరాల జన్యువులు
కవిత్వపు క్రోమోజోములు కలిగి పుడతాయి 
 
*4.8.2012

శ్రీనివాస్ వాసుదేవ్॥నాన్నగారూ క్షమించండి॥


కంద సీస పద్యాల్లో ఉండేవారెప్పుడూ
నేను నేర్చుకున్నది తక్కువని చెప్పనా
చెప్పి మిమ్మల్ని తక్కువ చెయ్యనా?


నేను రాసిందంతా కవిత్వానికి
తక్కువనీ, ఆవేశానికి ఎక్కువనీ
మీరన్నప్పుడల్లా తలగోక్కుని
తప్పుకున్నాను

ఆ కవిత్వమేదో చెప్తున్నప్పుడు
తలదించుకున్నాను...అలా రాయలేక
అకవిత్వాన్ని చూపలేక
మీ ముఖం చూడలేక...నా కవిత్వాన్ని చూపలేక

నా మొదటి పాఠకుడు మీరే అయినప్పుడు
నా సంతసానికి అవధుల్లేవు
కానీ నాకవితని పక్కన పడేసినప్పుడు
నా బాధకీ నిర్వచనాల్లేవు....మీరెప్పుడూ అంతే
కొడుక్కీ, కవిత్వానికీ లొంగరు

జీవితంలో ఎప్పుడైనా
మిమ్మల్ని మెప్పించే కవిత రాస్తానేమో
ఆ రోజు మీరు మందులేవీ అఖ్ఖర్లేదనుకుని
వొస్తారా? నన్ను ఆశీర్వదిస్తారా?

నాన్నగారూ నాకింకా అవకాశం ఉంది
నేనింకా కవిత్వమనుకున్నదేదో రాస్తున్నాను
చేతకాక, చేవలేక....మీలా రాయలేక

ఈ జన్మలో క్షమించేయండి
వొచ్చే జన్మలో మీకు నచ్చినట్టుగా రాస్తానేమొ
అసలు సిసలు కవిత్వం రాస్తానేమో!
ఒక్కసారి నా కవిత బావుందని అనరూ
నాన్నా! ఇంకెమీ అడిగే అవకాశం లేదు నాకు
(మరణశయ్యపై జీవితంతో...కాదు మరణంతో పోరాడుతున్న నాన్నగారికి అంకితం...ఈ అకవిత్వం)
 
*4.8.2012

మెర్సీ మార్గరెట్॥ఒంటరితనం॥

ఎక్కడ్నుంచి వస్తుందో ఒంటరితనం
నన్ను సంచిలో వేసుకొని
మూటకట్టి తీసుకెళ్తూ

అక్కడక్కడ మిగిలిపోయి వ్రేలాడుతున్న

జ్ఞాపకల పీలికల్ని నా నోట
అరవకుండా కుక్కుతూ

శూన్యంలో వేలాడుతున్న
ఆలోచనల్ని
నా మీద వేసి అదుముతూ
నాకు నేనే కదలలేని విదుల్చుకోలేని
బరువుతూ
చుట్టుకుని ముడుచుకుపోయి
మూల్గుతుంటే

భరించలేక కాలుతో నన్ను తన్ని
నేల మీద ఈడ్చుకు వెడుతూ
కన్నీటి చుక్కల్ని పిండి
ఆ చీకటితో కలిపి చిక్కగా
నా చుట్టూ తన సంచి గోడలకు
అలుకుతూ

ఆ సంచి గొంతుని బిగదీసి కట్టి
ఊపిరాడని శ్వాసలు గుండెపై
ఒత్తిడి పెంచుతూ
రాక్షస నృత్యం చేస్తున్నట్లు
పెద్ద పెద్ద జ్ఞాపకాల వృక్షాలున్న
గతమనే అరణ్యంలో
విసిరేసింది

ఆ స్వరం నీదేనేమో
చీకటి చీల్చి
నా పెదవులపై చెమ్మగా మారి
గుండెకు నీరందించి
శ్వాసకి శ్వాసనిచ్చి
ఒంటరి మూటనుంచి నన్ను బయటపడేస్తే

ఇలా
ప్రాకుతూ ప్రాకుతూ
ఇక్కడి వరకు వచ్చా ..

కొన ఊపిరి భవిష్యత్ కోసం
వెలగా చెల్లిస్తా
నన్ను నాకు తిరిగి వెతికి పెడతావా ?
ఒంటరి తనం నన్ను ఎక్కడెక్కడ
విసిరేసిందో ?
 
*4.8.2012

హెచ్హార్కె॥ఏముంది విశాఖలో॥


ఎప్పుడైనా తను జ్ఙాపకం వస్తుంది
జీడిమామిడి చెట్ల మెత్తని నీడల్లో
మొదటి సూర్య స్పర్శ కోసం, తన కోసం
పొంచి వున్న నేను జ్ఙాపకం వస్తాను

ఏముంటాయి క్లాసురూంలో
అదే నన్నయ లేదా భట్టుమూర్తి
తువ్వాలు దుశ్శాలువా సవరించి
మహాప్రస్థానం పద్యాల్లో గర్జించే పదాలకు
నింపాదిగా‍ అర్థాలు చెప్పే మాష్టార్లు, బయట
నల్లగా మెలికలు తిరిగి, పాం పడగల్లా లేచి,
నిట్టనిలువుగా పడిపోయే రోడ్లు... అంతే,
ఏమీ ఉండవు:

చిరాగ్గా తల తిప్పి, అటు వైపు చూస్తే
నునుపు రాతి మీద కదిలే అద్దపు సెల పాటలా
... పగలు కదా, వెన్నెలకు బదులుగా...
ఒక చెంప మీదుగా జారే సూర్యుడు,  
పగటి కాంతిని మెత్త బరిచే మత్తు మగత,
వస్తువులు ఉండీ లేకుండే అంతర్మధ్యం

రామకృష్ణా బీచ్‍లో కూడా ఏమీ ఉండదు
జిగురు సాయంత్రపు బొటన వేళ్లతో
ఇసుకను దున్నుతున్న కొన్ని దిగుళ్లు
ఎప్పుడు ఏ తప్పు చేసిందో, రాతి ఒంటిని వంచి,
ముక్కు నీటికి రాస్తున్న ఆకుపచ్చ డాల్ఫిన్,
దూరంగా, ఘీంకార స్వరంతో మూలుగుతూ
కదిలే కొండలా ఇంకొక ఓడ... అంతే,
ఏమీ వుండవు:

ఇసుకలో ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచేలోగా ఒక చోట
నీరెండ జలతారు పరుచుకుని కూర్చున్న సముద్ర దేవత
ఆ తరువాత చీకటి ముసిరినా, అప్పుడు చీకటి ముసిరిందని
కొన్ని యుగాల తరువాత గాని రెండు బుర్రలకు తట్టనివ్వని
ఒక దినకర చంద్రుడు

ఎంత పని వడినా విశాఖ వెళ్లాలని అనిపించదు

ఏముంది? ఏమీ ఉండదు ఇప్పుడు, విశాఖలో ... 
                               
*3-8-2012

ఉషారాణి కందాళ ॥నేనొస్తున్నా॥

నిత్యప్రభాతం నేనుగా! నీరవ నిశీధి చీల్చుకుని
నేనొస్తున్నా రేపు ను గా! నేనొస్తున్నా ఊపిరిగా!
ఆర్ద్ర్ర నయనాల నీలినీడలో హాసరేఖనే నేనుగా!
నేనొస్తున్న మృత్యువులో! నేనొస్తున్నా జన్మలలో!

హృదయకుహరాన ఊర్పులలో ఓదార్పు పలుకుల పల్లవితో
నేనొస్తున్నా వేదనలో! నేనొస్తున్నా రోదనలో!

ఒంటరి బ్రతుకుల పోరాటంలో సమస్తసైన్యం నేనుగా
నేనొస్తున్నా ఆయుధమై! నేనొస్తున్నా ఆలంబననై!
చిమ్మచీకటి నిండిన వేళల పున్నమి రేకుల వెన్నెలలో
నేనొస్తున్నా ప్రేమలలో! నేనొస్తున్నా నైరాశ్యంలో!
ఊహ ఊహకూ జీవం అద్దే భావసంద్రపు అలల కదలికై
నేనొస్తున్నా కవుల కలాలకు! నేనొస్తున్న కళల కలలకు!

చెమ్మగిల్లిన చింతల వంతల పొగిలే జీవన ఛిద్ర్రచిత్తాలకు
నేనొస్తున్నా అన్నీ వేళలా! నేనొస్తున్నా అమ్మ జోలనై!
మానవ హృదయాకాశం లో రవిశశి సాక్షిగ వెలిగే ఆశ గా
నేనొస్తున్నా! నేనే నేస్తం! మీలో వెలిగే అఖండదీపం!!

నారాకకు గుండెను పరచు! నే తోడుగ నువ్వే నడచు!
శ్వాస శ్వాసలో నన్నాశించు!ఆశే బాసట గా జీవించు!
*4.8.2012

జగద్ధాత్రి॥తను - నేను॥


తాను అంటున్న మాటలన్నీ
ఎక్కడో ఎప్పుడో
విన్నట్టుగానే
తెలిసినట్టుగానే

అనిపిస్తున్నాయి
తనతో నాకు
పరిచయమే లేదు అయినా ...
తన మాటలు జన్మజన్మాలనుండి
ప్రతి రోజు వింటున్న ఓ తియ్యని అనుభూతి
పలకరింపులు, నవ్వులు ..దుఖం, అలక .....ఎందుకో మరి...
తన ప్రేమ, ఆవేశం, నివేదన
అన్నీ ఏనాటినుంచో ఎరిగున్న భావన
అవును ఆలోచిస్తే
అర్ధమౌతోంది
ఇవన్నీ నేను విన్న మాటలే
నా జీవన సహచర్యంలో ......
అంతే కాదు అన్నీ నేనూ అన్న మాటలే
వలపు మధురిమలో
పులకరించిన
పలవరింతలే
తన మెత్తని ముని వేళ్ళ పై
నే మీటిన అనురాగ స్వరాలే
అందుకేనేమో తన
మాటల్లో ఏదో తెలిసినతనం
పరిచయమైన ప్రేమ తత్త్వం
జీవన సంధ్యా సమయంలో
జీవితమొక తీరుగా
నడుస్తోన్న వేళలో
ఇన్నేళ్ళ ప్రేమ సహచర్యంలో
వింతగా కొత్తగా
అనిపిస్తోన్న పాత మాటలు
ఆకులు రాల్చి చెట్టు మళ్ళీ
చివురులు వేస్తున్న వైనం
ప్రేమకి పాతదనం ఉందా అసలు
లేదు కానీ...
తన పలుకులు సన్నజాజి మొగ్గల్లా
సున్నితంగా
మొగలిరేకుల్లా తియ్యగా
గుచ్చుకుంటున్నాయి
ఎక్కడో దశాబ్దాల క్రితం
హృదయంలో పటం కట్టిన తొలి వలపు
మళ్ళీ జీవం పోసుకుని
ఉలిక్కి పడి...
ఉక్కిరిబిక్కిరై...
గుండె ఝల్లు మనిపించేలా ....
తన ప్రతి చర్య నన్ను
ఇప్పటి 'నా'నుండి
ఎప్పటి 'నేను'నో
తలపిస్తోంటే...
జీవన గమనంలో పడి
"తనని" తలపులనుండి
నేట్టేద్దామనుకుంటా....
నిర్మల తటాకంలాంటి
నా హృదిలోకి
సూటిగా చొచ్చుకుపోయే
తన విశ్వమంత
నిర్మల అనురాగ ఝరిలో
నాకు తెలియకుండానే
నన్ను నేను మరిచి
కరిగి పోతూ ....
మనసు నిలవరించుకోలేక
తనతో మాట కలుపుతూ
ఉంటా.......
దీన్నేమంటారో మరి......నాకే తెలియడంలేదు
"తనకు ' తెలుసునేమో అడగాలి......!!!
*3.8.2012

సురేష్ వంగూరి॥గజల్॥

చిరునవ్వై నడుస్తుంటే చుట్టుమూగి చూడాలి
పాటై రవళిస్తుంటే చేతలుడిగి చూడాలి

అలల తలలు అణచుకుంటూ ఈదడానికేముంది
తీరమెంట నడుస్తుంటే సంద్రమాగి చూడాలి

ఉన్నతాలు ఎగబ్రాకే గెలుపులోన ఏముంది
నేలపైన మెరుస్తుంటే శిఖరమొంగి చూడాలి

సంతృప్తే మకుటంరా స్నేహితులే స్వాస్థ్యమ్ రా
సిరులు కోరి వస్తుంటే దూరమరిగి చూడాలి

బితుకు బితుకుమంటూనే బతకాలా వంగూరీ
మరణం దరికొస్తుంటే ఎదురుకేగి చూడాలి
 
*3.8.2012

బాబీ నీ॥విరహానిది ఒక తరహా ఓటమి...!॥


మాటకు మాటకు మధ్య
ఎన్ని మట్టికట్టలేసినా ఆగవు
మౌనం ఒక విఫలయత్నం..!


హ్రుదయానికి - హ్రుదయానికి మధ్య
దూరాలేవైనా కరిగిపోతాయ్
విరహం ఒకతరహా ఓటమి..!

నువ్వక్కడే నిలబడ్డచోట..
నేనిక్కడ కూలబడ్డాక..
ఒంటికి ఒంటరితనం అల్లుకున్నాక
ఒక ఇద్దరి మరణం
కొనసాగుతోంది అదేపనిగా...!

ఒక పాట కట్టుకోవాలి
అంతరాంతరాల్లో పాడుకొవాలి
మనిద్దరం ధ్వంసం అయ్యేదాకా..!

మాటకు మాటకు మధ్య
ఎన్ని మట్టికట్టలేసినా ఆగవు
మౌనం ఒక విఫలయత్నం..!
*3.8.2012

పెరుగు రామకృష్ణ॥గ్రీస్ మేడం॥

 గంధర్వ కన్య లా
ఆమె నడిచినంత మేర
వెన్నెల పరుచుకుంది..
"కల్లిమెర"(శుభోదయం) అంటూ నేను
కరచాలనమైనప్పుడు
దూరంగానో
దగ్గరగానో ...
ఒక అమృత హస్తం
నన్ను కాపు కాస్తున్నట్లుంది ..

నాకు తెలిసినంతవరకు
మగాణ్ని
ఆమెలాంటి
ఆత్మ వలయమేదో
కాపాడుతున్నట్లుంది..

ఆమెని చూసాక
స్త్రీ లేకపోతే ...
స్త్రీ సముద్రతీర లాంతరుగా మారక పోతే..
జీవనసాగరంలో మగాడు
జాడ తెలీని ఓడ అవుతాడేమో..?

నేను దగ్ద మౌతున్న ఎర్రని రాత్రి
ఆశల్ని వెలిగించు కుంటున్నప్పుడు
మస్తిష్కాన్ని పడమటివైపు మళ్ళిస్తున్నప్పుడు
కూలుతున్న దేహపు గోడల్ని సరిచేసు కుంటున్నప్పుడు ...

ఆమె స్నేహం
మధ్య ధరా సముద్రపు నీలి కెరటంగా
రోజూ నా హృదయ తీరాన్ని తాకుతూంది
ధ్యానంలో ఉన్న ఒలింపస్ పర్వతంలా
భావ ప్రవాహమైన పీనస్ నదిలా...

దృశ్యం మీద రెప్పల దుప్పటి కప్పుకున్నాక
"కల్లి నిక్ష్ ట "(శుభ రాత్రి)చెప్పి
ఆమె
బుగ్గపై అద్దిన ముద్దు ముద్రలా
పొడవాటి స్వప్న మేదో
ఆత్మరేఖగా దుప్పటిని చీలుస్తుంది ..

ప్రపంచం ఇప్పుడే మొదలైందో
ముగింపు కొచ్చిందో తెలీదు కానీ
మనిషి పుట్టినప్పటి నుండి
స్త్రీ.. ప్రేమించడం మాత్రమే చేస్తుంది

అనంతమైన అవని మీద
ఆ ఒడ్డయినా
ఈ ఒడ్డయినా
ఆమె కు
లాలించి పాలించడమే తెలిసింది ..
కన్నబిడ్డ జైలు కెళ్ళినప్పుడు
కరపత్రమైన గోర్కీ అమ్మలా...

శోక శిఖరాలు
ఎక్కినా
దిగినా...
మగాడ్ని ఆనంద డోలికల్లో ఊగించే
ఆరోహణ
అవరోహణ...
క్రమం తెలిసింది మాత్రం
ఆమె
ఒక్క దానికే..!
*3.8.2012

శ్రీనివాస్ ఐదూరి॥మరణం తరువాత॥


చూడాలని ఉంది నాకు చందమామ వెనుక కూడా
చేరాలని ఉంది నాకు దిగంతాల ఆవల కూడా

ఉరకలేసే లేత మనసు అణిగి మణిగి ఉండలేదు
ఆడాలని ఉంది నాకు బాల్యం తరువాత కూడా

మనసు తోడు రాకుంటే విజయానికి విలువెక్కడిది
గెలవాలని ఉంది నాకు ఓటమి తరువాత కూడా

ప్రేమ అమరమనుకుంటే అంతమన్న మాటెందుకు
రమించాలనుంది నాకు ప్రణయం తరువాత కూడా

కానరాని లోకాలపై మమకారం నాకెందుకు
బతకాలని ఉంది నాకు మరణం తరువాత కూడా
*3.8.2012

కెక్యూబ్ వర్మ॥స్వప్నానికావల..॥

ఆది అంతం మధ్య
ఊగిసలాట నా హృదయ విలాసం...

అక్షరాలన్నీ అనుభూతుల దారంతో కుట్టుకుంటూ
ఓ వీలునామా నా కవిత్వం...

ఆ మధ్యన ఓ చిగురాకు నునులేతదనాన్నిఅద్ది
ఇంత లేలేత వర్ణాన్ని పొదిగి
అప్పుడే అరవిచ్చుకున్న శిశువు కనుదోయిలా
కాగితంపై ఒలికిపోతూ...

పంచుకున్నది విషాదమైనా ఆనందార్ణవమైనా
ఓ నిటారు కొమ్మలా స్వేచ్చగా
లేలేత సూర్య కిరణంలా
ఓ గాలి తిమ్మెరలా
కొండరాతిమీంచి జారిపడే జలపాతంలా
సహజంగా సహానుభూతిగా
ఓ మెత్తని ముఖమల్ స్పర్శలాంటి కరచాలనంలా
హృదయాన్ని తాకాలన్నదే నా స్వప్నం...
3.8.2012

గరిమెళ్ళ నాగేశ్వరరావు||హార్ధిక మాంద్యం||


కందిపప్పుకీ…పందికొక్కుకీ మధ్యన
జీవితం ఒక ప్రణాళిక.
ఆత్మహత్యకీ…అతివ హత్యకి మధ్యన
బ్రతకడం ఇక ప్రహేళిక.
నమ్మకానికీ…అమ్మకానికీ మధ్యన
సమాజం నిత్య పరీక్ష నాళిక.

కాలం కూలిపోతున్న కలల వంతెన
లోకం కాలిపోతున్న విలువల చితన.
ఇటు చూస్తే క్షామం…అటు చూస్తే కామం.
సంక్షోభమంలో మన సంక్షేమం.
మనస్సులో ప్రియురాలు
మంచంమీద ఇల్లాలు
కాపురం ఒక కాప్రమైజ్.
కొడుకు ఒక మార్కుల యంత్రం
కూతురి పుట్టుక మీద యుద్ధ తంత్రం.
వృద్ధుల చుట్టూ ముసిరే నిర్దయ...
ముఖాలు దాచుకు సుఖాలు వెదికే మనుష్యులు
దగాపడిన వైద్యం…కుదేలైన సేద్యం..
మత్తెక్కి ఊగేదొక్కటే…మద్యం
బీటీ వంకాయలా భయపెడుతోంది
కదూ…భవితవ్యం?!
***
కృష్ణుడు అలసిపోతున్నా…దుశ్శాశనుడు
ద్రౌపది చీరను లాగుతూనే ఉన్నాడు ఇప్పటికీ..
చీరను క్రింద పడేసి గీతోపదేశమ్ చేయాలి కృష్ణుడా!
అర్జునుడికిచ్చినట్లే..
ఆమెకో ఆయుధాన్నివ్వాలి అర్జంటుగా.

రాజభవనాలలో తిరిగే కీచకులు
మీడియా వేషంలో భీముడు...
హస్తినాపురం హడలిపోయింది కదా?

కంసుడూ..ఇంకా ధ్వంసం కాలేదు
ఆస్తికోసం పసిపిల్లలను మసి చేస్తున్నాడట.

పూతన వేషాన్ని మార్చి
బోరుబావుల్లో దూరుతోన్నట్టుంది
గోపాలురకి ఊపిరాగక ముందే
అప్రమత్తత బాణంతో…దానిని హరించు.

రూపాయి చుట్టూ తిరిగి అరిగిన మనిషి
పాపాల గుట్టలా పెరిగే వికృత రూపాన్ని చూస్తే
ఎవడి ముఖం మీద వాడే ఏసిడ్ చల్లుకున్నట్టుంది
ఎవడి సమాధికి వాడే ఇటుకలు పేర్చుతున్నట్టుంది.

గుప్పెడంత గుండె ఇప్పుడు…
హార్ధిక మాంద్యపు ఉప్పెనలో చిక్కుకుంది.
మానవత్వపు మందేయకపోతే...
ముప్పు తప్పనట్టే…ఉంది!!
*3.8.2012

వర్ణలేఖ కవిత

శాటల శెనిగెలువోశి
శెరుగుతుంటే
శకుంతల
శేరు బియ్యం
బదులడగవట్టె

పోరలకి
గంజినీళ్ళక్కూడ
దిక్కులేదనే
పొద్దున
శెనిగశేను
ఏరవోయిన

రెండు శేర్ల
శెనిగలిచ్చిర్రు
షావుకార్కాడికివొయ్యి
బియ్యంబెట్టమన్న
ఊరంత శెనిగలే ఇత్తే
నేనేంజేసుకోననే

ఇయ్యాల
పిల్లలాకలి
మాయంజేయనీకె
శెనిగలేంచి
పెడదామని
శెరుగుతున్న

అడిగినోళ్ళకి
లేదనేశెయ్యిగాకపాయే
దాని బిడ్డల
ఆకలిజూశి
శెరిన్ని శెనిగెలే
పంచుకున్నం
శకుంతల నేను.
*3.8.2012