పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, జూన్ 2012, ఆదివారం

కొన్ని కవితలు-5

డా. పులిపాటి గురుస్వామి కవిత
తెర్గాల లేసి .....


నేను నీ కోసం
అటూ ఇటూ వాక్యం లేని
ఓ ఖాళీ పొద్దునౌతా

ఇంకించుకునే మనసు కోసం
ఓ తెల్ల కాగితమై
పరుచుకుంటా

అనేక కువ కువల
కిచ కిచల,గల గలల
నిశ్శబ్దమౌతా

నైరాశ్యాన్నంతా
కళ్ళనుండి ఒంపుకునే
కట్టేసిన మూగప్రాణి నౌతా

(తెర్గాల=తెల్లారగట్ల )


       **************************************************************************
ప్రవీణ కవిత
అబ్సర్డ్ పైయింటింగ్


అబ్సర్డ్ పైయింటింగ్
మనసు పొరలలో నిక్షిప్తమైన బావాలు
కుంచె కొసలకు వేళాడి వేళాడి
ఏ కలనో జారిపడి
అలుక్కుపోయిన రంగుల కలబోత

వృత్తాల గర్భాల్లో అనంతాలు
వంకరటింకర గీతల్లో భావోద్వేగాలు
మోహమో, వ్యామోహమో
ప్రేమమయమో, ద్వేషపూరితమో
జీవమో, జీవచ్చవమో
ఏమో
ఏవేవో అర్థాలు
అంతులేని అయోమయాలు

హృదయాంతరాలలో ప్రకంపనల అలజడి లేపి లేపి
ఆలోచనల అలలు ఎగిసెగిసిపడి
చిక్కు ముడులలో బిగిసి బిగిసి
పాళీ కొనలకు అటు ఇటు ఊగిసలాడి
స్తబ్దత నిశ్శబ్దము నీడలో
చిత్రించబడిన ఆకారం
ఆ మోములో
ఆనందమో విషాదమో ఎవరికెరుక?
వీక్షించిన ఒక్కోమారు ఒక్కో బావం...

ఆచిత్రంలో
అన్నీ ఆద్యంతాలకు పరుగులు తీస్తున్న గీతలే
నా ఆలోచనల్లా
అన్నీ దిక్కులను వెతుకుతున్న రేఖలే
నా ఆశల్లా
అన్నీ శూన్యంలో అంతమవుతున్న ఆకృతులే
మనిషి మరణంలా

మా గోడకు వేలాడుతున్న అబ్సర్డ్ పైంటింగ్
అచ్చు గుద్దినట్టు నాలా.........        


*****************************************************************************


శ్రీనివాస్ వాసుదేవ్ కవిత
నువ్వెళ్ళిపోతావ్...(ఓ మాయమైన ఆలోచనకోసం)

నువ్వెళ్ళిపోతావ్......నా సంగీతాన్ని నాకొదిలి

పాళీ చివర్న అక్షరం మురిగిపోతుందన్నా
గొంతుమధ్యలో ఓ భావమేదో వెక్కిళ్ళలా
ఇరుక్కుందన్నా మాయమైతావు,
ఏ తియాన్మెన్ స్క్వేర్‌లోనో, బోగన్ విలియాల్లోనొ
వెతుక్కోమంటూ!

నిశ్శబ్దంలోపల తవ్వుకుంటున్న సమాధిలోనొ
క్రికెట్ పక్షి చెట్టుకు కొట్టుకుంటూ పిల్చిన పిలుపులోనొ
నువ్వు కన్పడతావనుకున్నా!

అనిద్రలో ఉన్న మందారం
నన్ను కాదని వెళ్ళిపోయిన నిట్టూర్పు
స్వేచ్చని రెక్కల్లో దాచుకున్న పక్షుల కువకువల్లో
నీకోసం వెతుకులాట.....

అసంబద్ధపు నీడల్లోనో , అసమంజసపు గుడ్డల్లోనో
ఇరుక్కుపోయింటుందని నిర్లజ్జగా చూస్తుంటా
నా మాయమైన ఆలోచనకోసం....
నానీడలాంటి ఆలోచనకోసం

ఏచీకటి రాత్రో వొచ్చిపోయిన మిణుగురుపురుగు సిగలో
చీకటితలుపుల్లోంచి తొంగి చూస్తున్న నైట్‌క్వీన్ నవ్వులో
నీ జాడలు వెతుకుతూ...వెతుకుతూ

గడ్డకట్టించే ఆలోచనకోసమొ
ఆకలికి, అసమానతలకి అడ్డంపడే
రక్తం చిందించని శిలువకోసమో!

నా నిరీక్షణ ఇలా
ఈ అస్తవ్యస్త అక్షరాలలో
నా ఆలోచనల వెతుకులాటలో....

           

****************************************************************************
 డా.వంశీధర్ రెడ్డి కవిత
 బాక్ టు ది పాస్ట్

ఆడం, ఈవ్ కిచ్చిన ఆపిల్ కొట్టేసి కొరికి,
మాతృస్వామ్యం లోంచి, పితృరాజ్యాలైన
గణాల లోగుట్టు కెలికి,
వేయించిన వేట, ఉప్పు, కారమేసుకు నమిలి,
సురాపానించి,
సూర్యుణ్ణారాధించి,

మాయన్ సివిలైజేషన్ రహస్యాల్ని,
అమెజాన్ మాన్ ఈటర్స్ ని తప్పించుకుని,
నేను సైతమంటూ పిరమిడ్ నిర్మాణానికి రాళ్ళెత్తి,
కుదిరితే క్లియోపాత్రాని మోహించి,
టైముంటే, ట్రోజన్ వార్ చెక్కగుర్రంలో,
ఎకిలిస్తో కరచాలించి,
హోమర్, ప్లేటో, అలెగ్జాండర్ ఆటోగ్రాఫులడుక్కుని,
అరిస్టోటిల్, సోక్రేట్స్, కన్ఫ్యూషియస్ల పాఠాలు నేర్చుకుని,
రోమన్లు సిలువేసిన క్రీస్తు రక్తమంటిన
"రోబ్" దాచుకుని,

బోధిచెట్టు రెండాకులు కౌటిల్యుడి అర్ధశాస్త్రాన భద్రపరిచి,
అశోకుడ్నాటించిన చెట్టు కింద
దాహంతో కాళిదాసు "అభిఙ్నాన శాకుంతలం" చదూతూ,

అప్పుడే పుడ్తున్న ఇస్లాం శాంతి స్థాపనని,
ప్రవక్తని, అధ్యయనంచేస్తూ,
క్రూసేడ్లన్జూస్తూ,
రామానుజుని అడుగులో అడుగేస్తూ,
దొరికితే చెంఘీజ్ ఖాన్, ఘజినిల
డీ.ఎన్.ఏ శాంపిల్ సంపాదించి,
అక్బర్, జోధా పెళ్ళి రెసెప్షన్కి,
తాన్సేన్ అర్కెస్ట్రా బరాత్ తీస్తూ,
తాజ్ మహల్ కాలశోధనకు కార్బన్ డేటింగ్ చేసి.

వేయి స్థంభాలగుడి అర్కిటెక్చర్ టెక్నిక్ స్కాన్ చేస్కుని,
విజయనగరపు అంగడిలో,
రాశుల వజ్రాల్ని దొంగజేబులో దూర్చుకుని
ధూర్జటి కాలహస్తీశ్వర పద్యాల్ని, మనసుకెక్కించి,
భువన విజయపు సారస్వత వల్లరికి మురిసి,
విజిలేసి,

వ్యాపారమన్న ఈస్టిండియా కంపెనీని అనుమానంగా చూసి,
బ్రహ్మంగారిని నోస్ట్రడామస్ ఆచూకీ అడిగి,
అలభ్యాలైన వేమనని, అన్నమయ్యనీ సెర్చ్ చేసి,
షేక్స్ పియర్ డైరెక్ట్ చేసిన్నాటకాన్ని,
కీట్స్ పడి చచ్చిన ఫానీ బ్రౌన్ని,
నూట నాలుగో సారి చూసి,
ఇండస్ట్రియలైజేషన్కి మార్క్స్, ఎంగెల్స్ ని కారణమడిగి.

సిపాయి తిరుగుబాట్లో ఝాన్సీ
విప్లవాన్ని ఇంట్రా వీనస్లీ ఇంజెక్ట్ చేస్కుని,
ఫ్రాయిడ్ కలల్నింటర్ప్రిట్ చేసి,
దాశరధితో రజాకార్ల మీద రాళ్ళేసి,

గాంధీ రాజాజీ బంధుత్వాన్ని,
జాతీయోద్యమంలో రాజకీయాల్ని,
బోస్ మరణాన్ని ఇన్వెస్టిగేట్ చేసి,
చలం రాజేశ్వరిని, క్రిష్ణ శాస్త్రి అత్తర్నీ,
శ్రీ శ్రీ తాగొదిలేసిన విస్కీ ని, ఒక్కసారి స్పృశించి,

యులిసిసేం అర్ధంకాలేదని జాయిస్కి లెటర్ రాసి,
రాహుల్ సాంకృత్యాయన్తో
వోల్గాన మునిగి, గంగలో తేలి,
సత్యజిత్ రే పక్కన పథేర్ పాంచాలి ప్రివ్యూచూసి,
సావిత్రి కళ్ళని కార్నియాలో బంధించి,
మార్లిన్ మన్రో, మార్లన్ బ్రాండోతో ఫోటో షూటేస్కుని,
తిలకింకొన్నాళ్ళు బతికితే కలిసి,

తెలుసవన్నీ అసాధ్యాలని,
కానీ,
కలకసాధ్యమేముంది,
మనసు దూరని కాలమేముంది....

     

***********************************************************************
నందకిషోర్ కవిత
గురుతు

అప్పుడు ఇలాగే ఎత్తుకున్న ప్రతీసారి
ఆనందంగా గుండెలమీద, మెత్తగా తన్నేవాడు.
ఏమో,వాడి అరికాళ్ళలో ఆ కోమలత్వం-
ఇపుడేమైపోయిందో పాలుపోవట్లేదు!

అప్పుడు ఇలాగే కొత్తమాటలు ఎన్నో నేర్చి
పదే పదే పలుకుతూ, మనసంతా నింపేవాడు.
ఏమో,వాడి పెదాల్లో ఆ మృదుత్వం-
ఇపుడెక్కడికెల్లిందో తెలియట్లేదు!

అప్పుడు ఇలాగే చిన్నతప్పులుచేసి
కొడతానని భయపడి,కనపడకుండా దాగేవాడు.
ఏమో,వాడి ఆలోచనలో ఆ సుకుమారం-
ఇపుడెందుకులేదో అర్ధంకావట్లేదు!

వాడినెలా పెంచానో గురుతుంది.
వాడెలా పెరిగాడో గుర్తురావట్లేదు.

   ***