పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, అక్టోబర్ 2012, శనివారం

బూర్ల వెంకటేశ్వర్లు//నాకొక మనిషి కావాలి//

నల్ల ఆకాశాన్ని చూసి
నల్ల రేగడిని వలచి
మనుషుల నోటి బువ్వ కోసమే కదా

నేను కారు నలుపయ్యింది

సాటి మనుషులనే కదా!
అడవి జంతువుల్లాంటి మీకు
జుట్లు కత్తిరించి, గడ్డాలు గీసి,
బట్టలునేసి, బట్టలుతికింది.

నోరెత్తని చెప్పునైనా
లబలబలాడే డప్పునైనా
నేపడ్డ తపనంతా
తోటి మనిషి కోసమే కదా!
నేనెప్పుడేపనిచేసినా
రక్తమాంసాలున్న సాటి మనిషి కోసమే కదా!

నన్ను చూసి బీళ్ళు భయపడ్డాయి
నా కండలకెదురై రాళ్ళుపగిలాయి
నన్ను చూసి మోళ్ళు నవ్వాయి
నా కాళ్ళకింద ముళ్ళు తలదాచుకున్నాయి

ఆదిమ యంత్ర నాగరికతకన్నా ముందట్నుంచి
నేను చూపిన పనితనం కదా
మిమ్మల్నిట్లా సౌధాల్లో నిలిపింది

మీ కుర్చీల్లో కులాసాల్లో
విల్లాల్లో విలాసాల్లో
నా జాతి శ్రమ చెమట నీరైతే కదా
మీరిట్లా ఉయ్యాలలూగుతున్నారు
నేను కర్రపెత్తనమిస్తే కదా!
మీరు నేడిట్లా రారాజులై ఊరేగుతున్నారు

నా పాదపూలు ముద్రించబడని నేల
నా వేలిముద్రలు లిఖించబడని వస్తువు
నా చెమట తడి అద్దని భోగం
మీలో ఈ నేలమీద ఒక్కటుందా!

ఎందుకురా మరి!
కులం గీతగీస్తారు, కులం కూత కూస్తారు.
అందుకే అంటున్నా!
నాకొక కులమంటని మనిషి కావాలి.
నాకొక మనిషి కావాలి
అచ్చమైన మనిషి
కులం పేరెత్తని స్వఛ్ఛమైన మనిషి కావాలి.
*19-10-2012