పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఆగస్టు 2012, బుధవారం

నరేష్ కుమార్॥మనిద్దరం॥


అన్నా....!
మనిద్దరం
శత్రువులెప్పుడయ్యాం
నేను
ఆశయాన్ని
ధరించి నప్పుడా....?
నువ్వు
కర్తవ్యాన్ని పూసు కున్నప్పుడా....?

నెనెప్పుడు
నక్స లైటయ్యాను
నువ్
మనిషిగా చచ్చి నప్పుడా....?
నెను
మనిషి కోసం పుట్టినప్పుడా...?

ఇద్దరం
పరుగు తీస్తూనే ఉన్నాం
మరి
మనకు మృత్యు లక్ష్యాన్ని
నిర్దేశించినోడెవడు....?

అన్నా...!
మనిద్దరం
మనిషి విలువలు కాపడేందుకే....!
ఐతే
నువ్వు
నియమించ బడ్డావ్
నేను నిబద్దించ బడ్డాను..
నీది
కాపాడె ఉద్యోగం
నాది
రక్షించే ఉధ్యమం
అన్నో....!
నా ఆశయాల కుప్పల్లో
నీకూ ఓ విలువుంది
ఎందుకంటే
నీకు నెను నక్సలైటునే
నాకు మాత్రం
నువ్వో కార్మిక సోదరుడివి....!
 
*1.8.2012

భవాని ఫణి॥సరికొత్త కాంతి॥

అలా అలా మేఘాల చాటుకి
మనసు వెళ్ళిపోతోంది ......

నిశీధిలా నిరాశ దుప్పటి
పరుచుకుంటోంది ......

రెప్పలు కప్పుకుని
కన్నులు వర్షిస్తున్నాయి
ఎవరు చూడ లేరనుకుని !!

చీకటి ఆపలేని
గుండె చప్పుడు
రోదన లయలో
వినిపిస్తోంది ...

ఉండుండీ వెలుగుతున్న
విషాదపు మెరుపు
అసలు నిజాన్ని
నిర్భయంగా చూపిస్తోంది !!

మెల్లమెల్లగా తాకుతున్న
ఆశాకిరణం మాత్రం
కాళ రాత్రిని కరిగిస్తోంది

వెచ్చని తన వెలుగు చేతులతో
కలతల కన్నీటిని తొలగిస్తోంది

పట్టిన ముసురుని
తరిమికొట్టి
సరికొత్త కాంతితో
హృదయాకాశాన్ని మెరిపిస్తోంది!!!
 
*1.8.2012

ధనలక్ష్మి బూర్లగడ్డ॥కడసమయం॥

కాటికి కాళ్ళు చాపుకున్న కడసమయంలో
కాదంటూ కాలదన్నిన కన్నకొడుకులు
కష్టాలు కావలి కాస్తుంటే
కనబడలేదు కంటికి కరుణ

కర్మ అని అనుకోక
కాలానికి ఎదురొడ్డి
కడుపుకింత కూటి కోసం
కాయంలో బలం కూడగట్టుకొని
కష్టాన్ని కసిని కళ్ళల్లో నింపి
కర్మకాంఢలో వాడే కట్టెలమ్ముతూ
కాలాన్ని నెడుతున్నా

క్షణం మోస్తున్న కావిడిలోనివి కట్టెలే
కనుమూసిన క్షణంలో కౌగలించుకొనేవి కట్టెలే

కడకి "కూటి కోసం కోటి కట్టెలు" అయ్యింది నా ఈ జీవనం
 
*1.8.2012

యజ్ణపాల్ రాజు॥నీవు॥

నీ ఎదురుగా కూర్చుని నీ కళ్లలోకి చూస్తుంటే
ఏవో తెలియని అందమైన అగాధాలు నన్ను లోపలికి లాగేసుకుంటాయి

నీలోంచి పొంగే ప్రణయ గంగ నా జన్మాంతర పాపాల్ని కడిగేస్తుంటుంది
సడి చేసీ చెయ్యనట్టు ఉండే నీ చిరునవ్వు కోసం ఎన్ని యుగాలైనా వేచి ఉండాలనిపిస్తుంది. 

తళుక్కున మెరిసే నీ ముక్కుపుడక విరిసే వెలుగు పూవుల జడిలో
ఎన్నిసార్లు తడిసినా తనివి తీరదెందుకో!
*1.8.2012

జగద్ధాత్రి॥మాట్లాడి ఉంటే...॥

.
మాట్లాడుకోవాలి నిజమే దోస్త్ !
అనుభవపూర్వకంగా ఒప్పుకుంటున్నా 

నువ్వు చెప్పిన జీవిత సత్యాన్ని
సంభ్రమ,సందిగ్ధ లేబ్రాయంలో...పెదవులతో గాక మనసు విప్పి
మాట్లాడి ఉంటే.
జీవితం చేజారిన స్వప్నంయ్యేది కాదు
విశ్వవిద్యాలయ ఒడిలో చెట్లనీడన చేరి
హరిత పత్రాల్లా మనమంతా కళకళలాడినపుడు
తలనిండ పూదండ దాల్చి
మొలక నవ్వులతో మురిపించిన  మురళిగాడి రాణి పాటతో
మీ ప్రసాద ద్వయ హాస్యాన్ని చెట్టు కింద అవ్వ కొట్లో
టూబైత్రీ కాఫీలతో కలిపి ఆస్వాదించినపుడు
కలత కలలను నేను గానీ
కవిత కళలను నీవు గానీ ఎప్పుడూ ఆవిష్కరించనే లేదు
చలాన్ని చర్చించి, కిన్నెరసాని సౌందర్యాన్ని
చివరకు మిగిలిన నా కృష్ణ పక్షాలలో
మీ చెలిమి వెన్నెలతో నింపు కున్నప్పుడు
ఆర్ద్రతతో మాటరాలేదు
హిమంలో జ్వలించి, గీతాంజలిలో సేద తీరి
ఫైజ్ ఉద్విగ్నత, గాలిబ్ సాంద్రత,ఎమిలీ నిరాశా నిస్పృహల మధ్య
యులిసిస్ లా డోలాయ మానమౌతూ
ఇలియట్ వేదనా మయతలోకి జారిపోయనే గాని
మీలో ఎవ్వరితోనూ
ఒట్టు, నిజంగానే మాట్లాడలేకపోయాను

చిరు నవ్వుల ఆనంద భైరవితో మిమ్మల్ని అలరించి
అంతరంగాన్ని మాత్రం అపరిచితంగానే ఉంచాను
పెదవి విప్పి పలికే లోపు నాన్న ఇచ్చిన మాట కత్తితో
చదువులమ్మకు నాకు బొడ్డు తాడు కోయ బడ్డాక
దశాబ్దం పాటు నిశ్శబ్ద నయ్యాను కానీ
పెదవి మెదపలేదు

ఆటు పొట్ల కాలంతో కసరత్తు చేస్తూ
ఆపుకోలేని కన్నీటి మాటలను అప్పుడప్పుడూ మాటాడబోతే
మాట్లాడకూడని వాళ్ళతో మాట్లాడానని
మాట పడ్డాక తెలుసుకుని
మళ్ళీ మౌనాన్నే ఆశ్రయించాను
దశాబ్దాల నిరీక్షణకు ఆశీర్వాద ఫలంగా
తొలి స్వప్నాల మరు చంద్రోదయమైనప్పుడు
ధైర్యం చేసి మాటల పూవులను దోసిళ్ళతో నింపి పదాభిషేకం చేస్తూ
అక్షరాల వెల్లువనై నా హ్రుదయాన్తర్యామికి
పాదాక్రాంత మైపోయాను

నిజం నేస్తం! నువ్వు చెప్పింది
మాటల మంచి మాత్రమే
మనుషులను కలపగలదని దూరాల నుండి సాగి
నా చేతిలో ఒదిగి మాట్లాడిన
నీ ప్రాణ పదాలేగా నన్నిలా మాట్లాడిస్తున్నాయి
మనసుకు మాట అద్దం పట్టాలి

మాటలకు మనసునద్ది గుండె సవ్వడి ఆగిపోయేదాక
నిమ్మళంగా,నిర్మలంగా, మాట జారకుండా
మనమందరం మాట్లాడుకోవాలి
మనలా జీవితంలో తిరిగి
మాట కలుపుకునే యోగం అందరికీ దక్కదుగా మరి !

(చాల కాలం తర్వాత నన్ను మాట్లాడించిన నా స్నేహితుడు
డాక్టర్ ప్రసదముర్తి కవిత "మాట్లాడుకోవాలి" చదివి హృది కదిలి
మాటల్లో ఒలికి పోయాను. ఆ తర్వాత మా మిత్ర కూటమిలో "మురళీ నాదం" మా మిత్రుడు మురళి వెళ్ళిపోయాడు హటాత్తుగా , డాక్టర్ పిబిడి విప్రసాద్ ప్రకాశం జిల్లాలో నవోదయలో పనిచేస్తున్నాడు )
 
*1.8.2012

కెక్యూబ్ వర్మ॥గోడ॥

ఈ నాచు పట్టిన గోడ పక్కగా
తడిచిన పూలను కోసి గుత్తుగా
నీ చేతిలో వుంచి
కళ్ళలో వెలుగు చూసిన గురుతు...

ఆ తడి ఇంకా ఆరనే లేదు
ఈ గోడపై ఎండిన నాచు పెళ్ళలు పెళ్ళలుగా
రాలి ఏవో అస్పష్ట ఆకారాలు
నలుపు తెలుపుల రంగు మాధ్యమంలో...

ఆ వెలుగు జిలుగు
ఈ కంటి రెప్పలు దాటి బయట మెరియనే లేదు
సంధ్య కాంతిని పులుముకుంటూ
కొండ వాలులోకి జారిపోతూ....

ఆ చేతి మృధుత్వం
అలా నరనరాన ప్రవహిస్తూ వానలో కరిగిపోనూ లేదు
గోధూళిని దోసిలిలో నింపుతూ
మస్తిష్కంలో రంగుటద్దంపై అలికినట్టూ...

ఆ అడుగుల సవ్వడి
అలా అలల వెల్లువలా ఒడ్డుకు చేరనూ లేదు
రాళ్ళ గవ్వల ఒరిపిడిని రాగంజేస్తూ
మనసులో అసంపూర్ణ గేయమైనట్టూ...

ఆ గాయపు గురుతులేవో
కలల దేహంపై ఎర్రగా చారలుదేరుతూ
స్వేదమింకిన నేల బీటలు వారుతూ
కణకణ మండే ఉచ్వాశ నిశ్వాశలైనట్టూ....

చివరిగా ఆ గోడపై ఓ చిగురు తొడిగిన
మొక్క పచ్చగా పైకెగబాకుతూ
వేకువ వెలుగు రేఖల వెచ్చదనమౌతూ
గుండె అలికిడికి గురుతుగా పూస్తున్నట్టూ...
 
*1.8.2012

పులిపాటి గురుస్వామి॥నా సెలయేరు హృదయం -18॥


భూమి నుండి జల పైకి రాగల
ప్రేమ ఎంత స్వచ్ఛమైనది

ఆవిరి బిందువులన్నీ మళ్లీ
భూమిని చేరే ఆకర్షణ పవిత్రమైనది

మన మధ్య అటూ ఇటూ ప్రవహించే
అనుభందపు వ్యసనం అనంతమైనది

ఈ మసక లోకానికి
ఇది ఎట్లా తెలియటం
ఓ ప్రియురాలా...!
ఈ రాత్రిని వెళ్ళనీయకు .
 
*1.8.2012

వల్లూరి మురళి || పాపం కబోది ||

కళ్ళుండి చూడలేని కబోది
పైసలకి కక్కుర్తి పడి రిజర్వేషన్ భోగిలోకి
అనుమతించిన టి సి కళ్ళున్న కబోది


లంచం ఇస్తే గాని ఫైళ్లు చూడలేని
అవినీతి అధికారి కళ్ళున్న కబోది

కోట్ల టిప్ కి మొగమాట పడిన
న్యాయమూర్తి కళ్ళు మూసిన కబోది

అధికార పార్టి కనుసన్నల్లో మసలే
సి బి ఐ కళ్ళు తెరిచిన కబోది

డొక్కు బస్సులకు పర్మిట్లిచ్చే
ఆర్. టి. ఎ. అధికారి కళ్ళుగానని కబోది

రాష్ట్రం లో రోడ్ల దుస్థితి కనరాని
మంత్రులు, అధికార్లు కళ్ళు మూసుకున్న కబోదులు

అరకొర పాఠ్య పుస్తకాలతో,
నియామకాలు లేని ఉపాద్యాయులతో
ఉనిఫాం లేని విద్యార్ధులతో,
నాణ్యత లేని మద్యాహ్న భోజనాలతో

నీరులేని మరుగు దొడ్లతో,
వసతులేని హాస్టల్ లతో,
పట్టించుకోని వార్డన్లతో

పర్యవేక్షణ లేని విద్యాధికార్లతో
నడుస్తున్న పాఠశాలను పట్టించుకోని ప్రభుత్వం
కళ్ళుండి చూడలేని కబోది
*31-07-2012