పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, ఏప్రిల్ 2014, గురువారం

Ravela Purushothama Rao కవిత

మౌన భంగం ----------------- రావెల పురుషోత్తమరావు మనసు పరి పరి విధాలా పరుగెడుతుంది దరిజేర్చుకుని ఓదార్చే మనుషుల్లేక గుండె గుప్పిట్లోకి జారి గోడాడుతూ ఘోషిస్తుంది తన అనే వాళ్ళు దొరక్క. మనసు మందిరంలా పవిత్రంగా ఉంచుకునే వాళ్ళతోనూ గుండెను గూడులా గుదిగుచ్చుకునేవాళ్ళతోనూ సమస్యలు తలెత్తవు. స్వార్ధం సంకుచితత్వం నింపుకునే మనీషుల అంతరంగాలనూ అన్వేషించాలన్న తపన బయలుదేరినప్పుడే తకరారు తన్నుకుంటూ బయటకొచ్చేది. గోముఖవ్యాఘ్రాల్లాగా కొందరు గోప్యంగా ముసుగులేసుకుని తిరుగుతారు. పయోముఖ విషకుంభాల్లా మరికొందరు జలదంబోధి పరీత భూ వలయాన్నంతటినీ జల్లెడపడుతున్నట్లు నటిస్తూ నయవంచన గావిస్తారు. చీకటిపడకుండానే వీళ్ళ ముఖాలు చిరుదివ్వెలను సైతం చిదిమేయాలనే యత్నిస్తూ ఉంటాయి. మానినీ మానభంగాలను మాయోపాయంతో జరిపేస్తూ ఉంటారు. సూర్యుడస్తమించకుండానేకొందరు శూన్య దృక్కులను వెంటేసుకుని అంగనల అంగాగసౌందర్యాన్ని అంగళ్ళలో అమ్మజూపుతూ సంచరిస్తూ ఉంటారు. దినకరుడు సైతం వీళ్ళ చర్యలతో దిగ్భ్రాంతి పడుతూ దిగ్గున చిరాకు పడుతుంటాడు. మనిషికీ మనసుకూ బేధాలున్నప్పుడే వాళ్ళలో దానవత్వం దయలేకుండా ప్రవర్తిస్తుంది. గుండెకూ గుణానికీ లింకు కుదరనప్పుడే గుహల్లో క్రూర మృగం లా కుటిలత్వంతో నర్తిస్తుంటుంది. అన్నింటినీ ఒకేగాటన కట్టేయలేని జగత్తు మౌనాన్ని మింగిన పాములా మూగయై రోదిస్తుంది. బెల్లంకొట్టిన రాయిలా జడరూపమై ఘనీభవించి స్థాణువై మిగిలిపోతుంది.17-4-14 ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ X

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qLEcVg

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి