పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, ఏప్రిల్ 2014, గురువారం

Phanindrarao Konakalla కవిత

ఫణీంద్ర// ఉదయం.. కవి హృదయం //17.04.2014 నడుస్తున్నా.. పొద్దుపొడవని ఉదయాన, ఊహలు నిండిన హృదయంతో, ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ, నన్ను నేను మరచి.. నడుస్తున్నా! మంచువానలో స్నానమాడి, తడిచెదరని ఒంటిపై, అక్కడక్కడా నీటిముత్యాలద్దుకొని, చెమ్మ వాసనలని అందిస్తూ, కనులవిందు చేస్తోంది..దారికి ఇరువైపులా.. ఒత్తుగా పెరిగిన పచ్చిక. పచ్చ చీరపై తెల్లటి చుక్కలద్దినట్ల్లు, చిన్ని చిన్ని గడ్డిపూలు, చిరుగాలికి తలలూపుతూ.. చిత్రంగాకదులుతున్నాయి! ఈ అందాలని,మరింత అందంగా చూపగల మంచి ఛాయాగ్రాహకుడిని కాకపోతినే! ఎత్తుగా దట్టంగా పెరిగిన చెట్లు..చిక్కగా అల్లుకున్న పొదలు, పొదలపై అటూ ఇటూ చిందులువేస్తున్న పక్షుల కుహు కుహులు.. ప్రతి కుహు కుహులోనూ పలుకు తోందో రాగం మరి ఈరాగాల పరవశంలో ప్రతిస్పందించి, సుమధుర రాగాలు సృస్టించడానికి నేనో సంగీత సామ్రాట్టుని కాకపోతినే! దూరాన ఎత్తయిన కొండలు.. కొండలమీంచి దుముకుతున్న జలపాతాలు పొగమంచు పరదాలమాటున దూరంగా విసిరేసినట్లు, అక్కడక్కడా రెల్లిపొదరిళ్ళు చూడటానికి మనోహర దృశ్యకావ్యం! ఈ ప్రకృతి అందాలను చిత్రించగల ప్రతిభే ఉంటే అదో కళాఖండం కాదా మరి? అయ్యో అంత ప్రతిభగల చిత్రకారుణ్ణి కాకపోతినే! నడుస్తున్నా.. ప్రతి ఉదయం నడుస్తూనే వున్నా.. చూస్తున్నా.. ప్రతి రోజూ చూస్తూనేవున్నా.. ఈ ప్రకృతి సౌందర్యాలు! ఈ అందాలని అనుభవిస్తూ..చిత్రమైన భావోద్వేగంతో.. ఈ అనుభూతులను కవితాక్షర ముత్యాలుగా పేర్చి, ఓ కవితకి రూపమిచ్చి,ఆనందించే.. ఓ చిన్ని కవిని మాత్రమే ! .......17.04.2014

by Phanindrarao Konakalla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qM9yew

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి