పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Usha Rani K కవిత

మరువం ఉష | మోక్షణము --------------------------- (This small write-up is dedicated to my Valentine, Karen) పక్కకి వత్తిగిల్లి- మనిషి పట్టేంత మనసు తో, బోలుగా, ప్రసరణ, ప్రకంపన, ప్రతిధ్వని తాకని దేహంతో- తను నన్ను చేరువగా రమ్మని సైగ చేసింది. ఆ మునివేళ్లలో సవ్వడి చేసే గాలి: మూసుకుంటున్న నా హృదయపు తలుపుల మీద తోసిపుచ్చలేని మాటలా బరువుగా వాలింది. విద్యుద్దీపపు కాంతులలో మెరిసే దుప్పటి మీద: సజ్జలో మిగిలి పోయి వడిలిన మందారం లా, శస్త్ర చికిత్స గురుతులతో ముడుచుకున్న ఆ వదనం. మదిలోని మాటకన్నా, వాయుకోశాల లోని వేడినే వెదజల్లుతున్న ఆ నోరు తెరుచుకున్న అగ్నిపర్వతం. కనుపలకల మీద తరుచుగా తారట్లాడే చీకటివెలుగుల మౌనం: నీలిరంగు తెరల బింబాలు, నీలి నీడలుగా. సమీపానే బిరాబిరా సాగుతున్న ప్రవాహం, మిడిసిపడుతున్న వినీలాకాశం కలిసికట్టుగా విశ్వపు గాథ ఆలపిస్తునట్లే- ఆ/మె జీవితకాల/దేహపు గాయాల చరిత్ర వినిపిస్తూ... ఓడిపోతున్నాయి అల్పమైన వేదనలు రాలిపడుతున్న నా అశ్రు కణాల రణంలో, వీగిపోతున్నాయి విలువ లేని శోధనలు కూడదీసుకుని తను విప్పుతున్నమానవతతో. మరణ స్పృహ తో కాంక్షా గ్రహణం విడిచిన చందమామ లోకపు మరకలు అంటని తెల్లని మమత చుడుతూ, మరుక్షణపు తీరు ఎరుగని పసితనపు దయ కురిపిస్తూ ముడుచుకున్న నా ఆత్మలోకి పయనిస్తోంది. పరాజయం పాలుచేస్తూనే ప్రక్షాళనం చేస్తుంది బెరడు చీల్చుకుని మోడులోని పచ్చదనమై మిగిలిన స్పర్శ రాతి పగుళ్ళలో మొలకెత్తిన అంకురమై తన స్ఫూర్తి. మలిగిపోతున్న దీపాన్నికాచే హస్తం, తన అమృత గుణం. ఆమె నన్ను బతుకు రాటకి బంధిస్తూనే, నుదుటి మీద స్మృతిగా వెలుగుతూ నా శవం నుంచి నన్ను విడుదల చేసింది శాశ్వత నిదురలోకి జారిపోతూ నన్ను మేలుకొలిపింది. ***** లేత ప్రేమికులకు/సున్నిత మనస్కులకు ఒక మనవి: -------------------------------------------------- ప్రేమ అన్నది ఖచ్చితంగా మనిషికి అపురూపమైన వరమే. కానీ, అందరూ సరైన పరిణితి కలిగి ఉండరు. అపాత్రదానం చెయ్యకండి. ముఖ్యం గా అక్షరాల్లో,మాటల్లో అంచనాలు కట్టిన వ్యక్తిత్వాన్ని అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఏ మనిషి స్వభావాన్నైనా మనకు తెలిపేవి అతను తన గురించి చెప్పుకునే మాటలు కాదుగా. చాలావరకూ అవి "అతను ఏంటో" చెప్పవు, "అతను ఎలా వుండాలనుకుంటున్నాడో" చెప్తాయి. ఏదో నిర్ణయాత్మక క్షణం వస్తుంది. అది చెప్తుంది వీడి స్వభావం ఇదీ, వాడి స్వభావం అదీ అని. కాబట్టి, ఈ సత్యాన్ని విస్మరించకండి. చేతల ద్వారా మనిషి స్పర్సించి చేరువకండి. ఇది సలహా కాదు, ఒకానొక అనుభవం తో నేర్చుకున్న గుణపాఠం. జీవించడమనే ఘర్షణలో జీవితం నాకిచ్చిన కానుక! దాదాపుగా మృత్యుఛాయలకి నేనూ వెళ్ళొచ్చాను. దీనివలన బ్రతకాలన్న ఆశకన్నా బ్రతకటం/బ్రతికి ఉండటం లోని విలువ ఇంకాస్త అవగాహనలోకి వచ్చింది. అలాటి పరిస్థితిలో కలిసిన ఒకరి జీవితం మరొక పాఠం. నాకు ఆమె ఆస్పత్రి లో పరిచయం. కారెన్ గూర్చిన వివరాలు వ్యాఖ్యగా కలిపాను... 2014 చూడనేమో అనుకున్న నాకు పునర్జన్మ నిచ్చిన విశ్వప్రేమిక ఆమె- "కారెన్" 02/14/2014

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cBMNkA

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి