పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, సెప్టెంబర్ 2012, శనివారం

వంశీ // సగం మిగిలిన సంభాషణ //


ఆపావేం
అనుభవాల అసంపూర్ణ పార్శ్వాల ఖాళీల్ని
మర్చిపోయిన ఙ్నాపకాలతోనో
మరలిరాని కాలంతోనో పూరించు,
ఓపికకీ కోపమొచ్చి ఇన్నాళ్ళ నిరీక్షణకి...
వినిపిస్తుందా
కన్ను జారనీని నీలం కనిపిస్తుందా.

పెరుగుతున్న వయసుని వీపున మోస్తూ
పారుతున్న వేదనల్ని ఒంటరై దాస్తూ
నిన్నింకా అన్వేషిస్తూ
చిన్నప్పటి దొంగా పోలీస్ ఆటలాగా,

నీతో మాట్లాడుతుంటే
అమ్మ కడుపులో ఊయలూగినట్టనిపిస్తూ
నమ్మవా
పోల్చడానికి అమ్మ తప్ప వేరే దేవత తెలీదే,
నవ్వావా
ఎక్కడో తెగిన నిమిషాలు అతుక్కుంటున్నాయ్,
అర్ధంకాలేదా
నన్ను కవిత్వీకరించుకోవడం తప్ప సంభాషించడం రాదే,
మెదడ్లో ఊరే మాటల్తో మాలేయాలనుకుంటే
నీకు నచ్చని మౌనాన్ని తర్జుమా చేయలేని
నిస్సహాయతలో నేనే మునుగుతూ,
నొచ్చుకోకు నొప్పి నాకు తెలుస్తుంది
తట్టుకో నా అఙ్నానాన్ని కాసేపు..

నిన్ను వర్షాన తడపాలని
నేనేడ్చి కురిపించిన నా కన్నీటి కోసమో,
వందేళ్ళకోసారి నేలరాలే ఉల్కని పట్టి
నీ గదికి వేలాడదీసిన పిచ్చితనంకోసమో
నీ మాటలు వినాలనుకోవడం లేదు,
అంతా నువ్వే కనిపించే నా గతానికోసారి
ప్రయాణించి నన్ను నాతో పోల్చుకుని
కొన్ని అపరిపక్వ ఫలాల్నీ, అనాఛ్చాదిత మూలాల్నీ
నాలోకి పిలుచుకుని
ఓడిన ఆటల్ని, తోడవని బాటల్ని
వీడిన చోటుల్ని నీడైన శూన్యాన్ని
ఒక్కసారి పలకరించి కలవరించడానికి
ఒక్క మారైనా ఒక్క మాటైనా
పలవరించవూ..

సంశయమా
తెంచుకోలేని బంధాల్లో చిక్కుకున్నామని
తెరుచుకోని ద్వారాల ఆవల చీకటుందేమో అని,
సాధ్యమా
తనువు ఆత్మ వేరై బ్రతకడం
స్థాణువై ఆలోచనల పరుగాపి నడవడం..

ఎవరూ లేని ఏకాంతంలో
సూక్ష్మ ప్రపంచాన గమించి హృదిభ్రమించి పరిభ్రమిస్తుంటా,
నేనే పరీక్షలు దాటేదాకా,
నీతో సగం మిగిలిన సంభాషణ కొనసాగేదాకా..

20.9.12

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి