పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, జులై 2012, మంగళవారం

కాశీరాజు || A GRAND WELCOME ||

పుష్పకవిమానం దిగిన దేవేంద్రున్ని సూసినట్టు
బస్సు దిగ్గానే నన్ను సూస్తూ తన రెండు చక్రాలరదానికి స్టాండేసాడు మా నాన్న.
బుజాన వేలాడుతున్న బ్యాగ్ తీసి సైకిల్ మీద పెట్టుకుంటూ
పయానం బాగాసాగిందా?
రైల్లో సీటు కుదిరిందా లేదా?
సరిగా తినడంలేదేటి సిక్కిపోయావ్? అడుగుతూనే ఉన్నాడు
ప్రశ్నలు పూర్తికాకుండానే
సమాదానాల సర్వీస్ ప్యాక్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాను నేను
ఇన్స్టాలేషన్ ఎర్రర్ లాగ ఎవడో ఎనకాల టింగు టింగుమని బెల్లు మోగిస్తున్నాడు
ఇక్కడేఉండరా ఇంటికెల్లి ఈ పిండిమూట,నీ బేగ్గు పడేసి మల్లొచ్చి తీసుకెల్తానని ఎల్లాడు
సరేనని పెత్తాతకొట్టుకాడ ఓ సల్లని సోడాతాగి,సెక్క బల్లపై కుచ్చున్నాను
ఇంటికెల్లిన పెద్ద మనిసి అరగంటైనా తిరిగిరాట్లేదు.
ఇకనేనె మెల్లగా నడిసెల్లిపోదామని,కాలవగట్టమ్మటా నడకలంకించుకున్నాను
పక్కన కొత్తనీట్లో తేలుతున్న అంటిబొందమీద
తలకాయూపుతూ బురదపామొకటి నాలుకబయటకు తీసి నన్నెక్కిరిస్తుంది.
ఇంకోపక్క దమ్ముసేల్లోన్ని అమ్మలంతా
కచ్చాపేసుకుని క్రమశిక్షణేదో నాటుతున్నారు
ఎలా సూసిందో ఓ సక్కనమ్మ
ఏరా అల్లుడా బోగున్నావా?
ఇదేనా రాడాం? బాగా సిక్కిపోయావేట్రా? ఆగడంలేదింక.
బాగున్నను బాప్ప! మాయెలా వున్నాడు? తప్పదన్నట్టడిగాను
అంతాబోగున్నార్రా! సరేలే ఇంటికెల్లు!
నిన్న నువ్వు రైలెక్కావని తెలిసాక
మీ అమ్మకల్లు ఈ కాలవగట్టునే సూత్తునాయ్ రా!
ఆమె అనడం,నేను వినడం పూర్తికాకుండానే నాన్నొచ్చేసాడు!.......
కొద్దిదూరమేకదా నడిసొస్తాలే నాన్న! నువ్వెల్లు అన్నాను!
వద్దులే అమ్మెదురుసూత్తంది సైకులెక్కమని ఆర్డరు!
కిట్టమాయ,సాయిబుతాత అందరిప్రశ్నలకూ నాన్నేసమాదానం,
దిగరా అని సెప్పేదాకా ఇల్లొచ్చిందని తెలీలేదు.
అమ్మొచ్చి
నీల్లిచ్చి
నాకేసి సూత్తా ఏరా బాగున్నావా అని అందర్లా అడగడం మానేసి
ప్రేమ నిండిన కల్లతో ఏడుస్తుంటే
నా కల్లలో్ కూడా కన్నీళ్ళొచ్చి
అటునుంచటే ఎటో వెల్లిపోయాయ్!
*31-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి