పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, జులై 2012, మంగళవారం

బివివి ప్రసాద్ || గంధర్వుడు ఒకడు ||

గంధర్వుడు ఒకడు వచ్చి వెళతాడు
మన చుట్టూవున్న శూన్యంలోని మనమెరుగని రహస్యలోకాల నుండి
మెరిసే జీవులలో ఒకడు మనకోసం వచ్చివెళతాడు

అతనిని భూమి గుర్తించదు
భూమి మేలుకొంటున్నపుడు పరివ్యాప్తమయే పరిమళం గుర్తిస్తుంది
అగ్ని గుర్తించదు
అగ్నిలోకం నుండి రెక్కలు విప్పుకొంటున్న రంగులు గుర్తిస్తాయి
అతనిని అక్షరాలు గుర్తించవు
అక్షరాలపై అదృశ్య సంచారం చేసే ఊహలు గుర్తిస్తాయి

చీకటి గుహలలో, గుహలలో, గుహలలో నిదురిస్తూ నడుస్తున్న మనం
అతనిని చూసి 'ఇతను మనలాంటి వాడే కదా
మన వలే భయ, కాంక్షా, వ్యాకులతలు చుట్టుకొన్న వాడే కదా ' అనుకొంటున్నపుడు
చెట్లు నిదానం గా కలగంటున్న పచ్చదనమూ,
పక్షుల రెక్కలపై వాలి కేరింతలు కొడుతున్న స్వేచ్ఛా కాంక్షా
మనని చూసి జాలి పడతాయి
'ఇతని భయ, కాంక్షా, వ్యాకులతల వెనుక
పారాడే దయ ఏనాటికి మీకు తెలుస్తుంద ' ని తలుస్తాయి

అతను నవ్వినపుడూ, మాట్లాడినపుడూ, పాడినపుడూ, కవిత్వం చెప్పినపుడూ
తలుపుల వెనుక, తలుపుల వెనుక, తలుపుల వెనుక
ఉన్న మనపైన ప్రేమ కలిగి
సుతారంగా మన తలుపులన్నిటినీ తడతాడు
చిరుగాలైనా వీయలేదే ఈ సడి ఎక్కడిదని కొందరైనా గుర్తించేలోపు
బంగారు కిరణమొకటి మరలినట్లు నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు

అతను వచ్చి వెళ్ళాడని
మనకి తెలియదు కాని, మన హృదయాలకి తెలుస్తుంది
మనలో జీవితేచ్ఛలా అణగారి వెలుగుతున్న మన అంతరాత్మకి తెలుస్తుంది
తలుపులు మూసిన గదిలోకి చలిగాలి తెర ఒకటి ప్రవేశించినట్లు
అతను సరాసరి మనలోపలికి ప్రవేశిస్తాడు
మన అంతరాత్మతో సంభాషిస్తాడు
మన అనుమతి లేకుండా మనలో కొంత వెలుతురు ప్రవేశపెట్టి చూస్తాడు
అతను ఏదో చేసాడని, ఏదో మాట్లాడాడని గుర్తించగలము కాని
ఏమి చేసాడో, మాట్లాడాడో ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోతుంది

మన చుట్టూ ఉన్న ఆకాశం లోపల వెలిగే రహస్యదేశాల జీవి ఒకడు
మన మధ్యకు వచ్చి వెళిపోతాడు
కాసిని రంగుల్నో, స్వరాల్నో, అక్షరాల్నో ఉపయోగించి
తాను నివసించే వెలుతురులోకం చిరునామా మనకు చెప్పబోతాడు

మనకు సంతోషపు మైకం కమ్మేవాటికి అతను దు:ఖిస్తాడు
మనం దు:ఖించేవాటికి, అతను చిరునవ్వు నవ్వుతాడు
అతను ఉత్సాహం పట్టలేక 'అదిగో చూడు ' అన్నపుడు
అతని వేలికొన చూపించే వెలుతురులోకాన్ని ఎంతకీ మనం చూడలేకపోతాము
మన కళ్ళని మూసిన మన అరిచేతుల చీకటిని అతను విదిలించలేకపోతాడు

పొరలోపల, పొరలోపల, పొరలోపల దాగిన ఉల్లిరసం ఘాటులాంటి
మన 'నేనే, నేనే, నేనే ' లను చూసి
దు:ఖంతో, జాలితో
చల్లటి వానాకాలపు జల్లులాంటి నవ్వుల్నీ, చూపుల్నీ మనపై కురిపిస్తూ
వచ్చినచోటికి మరలా తరలిపోతాడు
వాన తరువాత వ్యాపించే నిర్మల ప్రశాంత నిశ్శబ్దం వెంట
అతను తన లోకాన్ని చేరుకొంటాడు

గంధర్వుడు ఒకడు వస్తాడు, వెళతాడు
మనకు ఎప్పటిలా సూర్యాస్తమయమౌతుంది
దిగులుపాటల్ని మోసుకొంటూ పిట్టలు చీకటిలో కరిగిపోతాయి
చీకటికోసం రోదసినిండా వేచివున్న ఏవో శక్తులు
యధావిధిగా మనతో చేయి కలిపి
చిరంతన సంభాషణలో తరువాతి భాగం కొనసాగిస్తాయి
వాటిని హత్తుకొని మనం మరొకసారి
స్వప్న లోకాలు దాటి
నిదురలోకి, నిదురలోకి, నిదురలోకి జారిపోతాము

గంధర్వుడొకడు వచ్చివెళ్ళిన జాడలేవో
మనని కోమలంగా తడుతూ ఉంటాయి
మనలోలోపలి స్వప్నాలను పొదువుకొని కాపాడుతుంటాయి.

*30-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి