పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, జులై 2012, మంగళవారం

భవానీ ఫణి కవిత

ఆత్మబంధువుకి ఆత్మీయ కవితా లేఖ
ప్రియమైన సంతోష్ దీదీ ...

ఇక్కడే కోనసీమ లో నేను,
ఎక్కడో కాశ్మీరం లో మీరు .
అందమైన గోదారి గట్టున నేను,
అంతే చక్కని తవి ఒడ్డున మీరు..
ఎవరికి ఎవరో తెలియకుండా
వేరువేరు ప్రాణాల్లో రూపాలు దిద్దుకున్నాం!!

కొబ్బరాకుల కొంటె నవ్వుల మధ్య నేను,
కుంకుమ పూలతో కబుర్లాడుతూ మీరు.
ఒకరికి ఒకరు తెలియనంత
సుదూర తీరాల్లో పెరిగాం !!

అక్కడా ఇక్కడా మనల్ని చూసిన
చందమామ మాత్రం
చిలిపిగా నవ్వుకున్నాడేమో అప్పుడు!!

పల్లె దాటి ఎరుగని నా అమాయకత్వాన్ని ...
అల్లరి విధి మీ చెంతకి చేర్చింది !!
ప్రపంచపు కల్మషాన్ని చూసి భయపడుతున్న నాకు...
మీ రూపంలో మరో కొత్త లోకాన్ని చూపించింది !!

కోపం తన సహజ గుణాన్ని మరిచిపోతుంది ..
మీ పక్కన నిలబడితే !!
ఆత్మీయత కొత్త పాఠాలు నేర్చుకుంటుంది..
మీ మనసు చదవగలిగితే !!
సంతోషం ఎంతొ సంతోషిస్తుంది ...
తను మీ పేరైందని తెలిస్తే!!
శాంతం సిగ్గుతో తలదించుకుంటుంది ...
మీతో పోటీపడితే!!
అసూయ ఆనందంగా ఓడిపోతుంది....
మీలో చేరాలని తలపెడితే!!
కొన్నివేల పనికిరాని పదాలు కనుమరుగవుతాయి
మీరే గనుక భావాలకి నిఘంటువుగా మారితే!!

మీరు కురిపించిన అభిమానపు జల్లుల్లో
తడిసి తడిసి ముద్దయిన నేను...
మీకు దూరమైనా మీతోనే ఉండిపోయాను !!
మిమ్మల్ని తలవని తరుణం లేదు...
మిమ్మల్ని మరిచిన క్షణం లేదు !!

ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ మిమ్మల్ని
కలసిన సమయాన ....
నాలో కలిగిన భావోద్వేగాల్ని
వర్ణించాలంటే కొత్త పదాలు కనిపెట్టాలి !!
మీపైన నాకున్న గౌరవాన్ని
కొలవాలంటే కొత్త పరికరాలు సృష్టించాలి !!

మీకర్ధ మయ్యే భాషలో నాకు ప్రావీణ్యం లేదు...
నే చెప్పగలిగే తెలుగు మీకర్ధం కాదు !!
అయినా మాటలు చేర్చలేని ఎన్నో సందేశాలని ..
మన మనసులు గ్రహించగలవని నాకు తెలుసు!!

మీలాంటి అద్భుతమైన వ్యక్తిని
కలవడమే అదృష్ట మనుకుంటే...
మీ అభిమానాన్ని పొందగలగడాన్ని
ఏమని పిలవాలో తెలీడం లేదు !!!

మీతో పాటుగా మనల్ని కలిపిన
ఆ మంచి విధికి కూడా
ఎన్నెన్నో కృతఙ్ఞతలు !!!
*31-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి