పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, జులై 2012, మంగళవారం

రామ కృష్ణ || నిత్య ప్రయాణీకుడు ||

కవి నిరంతర ప్రయాణీకుడుకావాలి
ఒక చొటునుంచి మరో చోటుకో
ఒక ఊరునుంచి మరోఊరుకో
ఒక కాలం నుంచి మరోకాలానికో
ఒక భావనలోంచి మరో ఉత్కృష్ఠ భావననకో
నిరంతరం ప్రయాణిస్తూ ఉండాలి

కవిని చూస్తే నది గుర్తుకు రావాలి
తెల్లని, తంబురాకు కట్టినతీగేదో
మదిలో మెదలాలి

కవిత్వమంటే జలమే కదా
నిన్ను నువ్వు నిష్కల్మషంగా కడుక్కోవటానికి
నీ లోపలిశరీరం స్నానం చేయటానికి
నీ అంతర్ముఖ సౌందర్యాన్ని పెంపొందించు కోవడానికి
కవిత్వాన్ని మించిన సాధనమేముంటుంది

కవి నడిచినంత మేరా
పచ్చదనం పరిఢవిల్లాలి
పూల ముఖాలనుంచి ఆనందం పుప్పొడిలా రాలి పడాలి

పారే నది ఏం చేస్తుంది
తను నడిచినంతమేరా
నేలను పదును చేస్తుంది

తనలోమునిగిన కడవల తో పాటు
రెండు వాక్యాలై వాళ్ళ యిల్లకు చేరుతుంది

కవిని మీటితే
నిండుగ నది ప్రవహిస్తున్నట్టు
తుమ్మెద ఝాంకారమేదొ వినపడాలి
పంచమ స్వరం మనసుల్లో ప్రతిధ్వనించాలి

కవి చుట్టూ ఉన్నవాళ్ళెపుడూ
కవిత్వ మహార్ణవం లో మునిగి తేలాలి
సముద్రంలో మునిగిన వాని శరీరం నిండా
ఉప్పు పేలినట్లు
కవిత్వం లో మునిగిన వాని శరీరం, నిండా పులకించి
చర్మము పై ఆనందం మొగ్గలు తొడగాలి
కవిత్వపు తడి మేను నిండా జాలువారాలి
అక్కడ గాలంతా కవిత్వమై వ్యాపించాలి

కవిత్వమే తప్ప కవి లేని చోట!
అతడు కథలు కథలు గా వినపడాలి.

*30-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి