పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, మార్చి 2014, శనివారం

Nirmalarani Thota కవిత

పూవు విరిసింది . . వెన్నెల కాసింది . . చినుకు కురిసింది . . హరివిల్లు వెలిసింది . . సృష్టిలో ప్రతీది స్త్రీ వాచకమే . . పకృతంతా స్త్రీ మయమే . . ! ఆకాశమై పరచుకునే మనసు మాదే . . నీరై కరిగి జాలువారే ప్రేమ మాదే . . అవని ఒడలంతా మోసే సహనమూ మాదే . . ఉచ్వాస నిశ్వాసాల గాలిలో ఊపిరి పోసేది మేమే . . దీపమై వెలుగు పంచే వంటచెరుకై కడుపు నింపే నిప్పు కణికలం మేమే . . పాతాళ గంగ మేమే . . హిమవన్నగ శిఖరం మేమే . . నింగి నేలా నీరూ నిప్పు గాలి పంచభూతాలు మా రూపాలే . . చైత్ర కోయిలలై చైతన్య గీతికలై జగతిని మేలుకొలిపే సుప్రభాత వీచికిలం . . జీవితమంతా పూలై, పండ్లై , నీడై , చివరికి వంట చెరుకై కాలిపోయే తరుణీ తరువులం . . ఎవడురా. . . ఆడది అబల అన్నది . . ? పురుటినొప్పులకోర్చి జన్మనూ తనవారి తప్పుల్ని కడుపులో దాచుకొని అడుగడుగునా ఆలంబనై జీవితాన్నిచ్చే సహన బలం మీకుందా . . ? పస్తులుండి కూడా రక్తాన్ని పాలుగా చెమట చుక్కల్ని పంచభక్షాలు చేసి తన వారి కడుపు నింపే మా త్యాగం బలం మీకుందా? కట్టుకున్నవాడు తరిమేసినా కసాయి సంఘం వెలివేసినా కాఠిన్యపు విధి కాటేసినా ముళ్ళ బాటన రక్తమోడుతూ కన్న పిల్లల్ని వెలుగు బాటన నడిపించే మా మనో బలం మీకుందా? కండబలం కాదురా . . గుండెబలం కావాలి . . ఆ కండల్ని పెంచింది మేమేననే బుద్ది బలం కావాలి . . కాసింత ప్రేమ చూపితే అల్లుకుపోయే గోరంత అత్మీయత పంచితే అంకితమైపొయే " ఆడ మనసును " అర్ధం లేని ఆంక్షలతో అంతం లేని కాంక్షలతో ఆధిక్యపు పురుషంకారంతో ఆత్మభిమానాన్ని కించ పరిచి పోరాట బాట పట్టించారు . . గదిలో బంధించి కొడితే పిల్లికూడా పులి అవుతుందే . . మరి తల్లి ఏమవుతుంది . . ? సహనాన్ని సౌహార్ద్రతనీ అసమర్ధతగా భావిస్తే సీతలు సత్య భామలై . . అనసూయలు అపరకాళికలై అంతు చూస్తారు . . మనసు కళ్ళు తెరిచి చూడండి . . ఇది . . మగాడితో చెలగాటం కాదు . . మనుగడ కోసం పోరాటం . . మోజుపడ్డ ఆధిపత్య పోరు కాదు . . గాయపడ్డ అస్థిత్వపు కడలి హోరు . . ఏదో ఒక రోజు తీరం దాటిన కెరటాలు ఉప్పెనై ముంచుకొస్తే . . మునిగిపోయేది మీరూ . . మేమూ . . ఇకనైనా మారండి . . ఆడదాన్ని అబలగా కాక ఆలంబనగా గౌరవించండి . . ఆత్మీయంగా అక్కున చేర్చుకోండి . . ! ప్రకృతంతా పరుచుకున్న ధరణి మేమైతే సూర్య చంద్రులు మీరు . . తొలి పొద్దులో మీ చుట్టూ మేము . . మలి సంధ్యలో మా చుట్టూ మీరు . . జీవితాంతం తిరగాల్సిందే . . సహగమనం సృష్టి గమనం సాగాల్సిందే . . ! నిర్మలారాణి తోట [ తేది" 08.03.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ecyzaJ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి