పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, మార్చి 2014, బుధవారం

Mohan Rishi కవిత

మోహన్ రుషి // కుక్క పిల్లలూ, దేవుడూ చల్లనివారే! // రాస్తాన్నేనొక కుక్క పిల్లను గురించి, ఈ రాత్రి, మిత్రులారా. ఎందుకొచ్చిందో తెలీదు. నా పక్కనే నడవడం మొదలుపెట్టింది. నా భయాలు నాకున్నాయి. నాకు మించిన సమస్యలేవో దానికున్నట్లుగా అడుగు అడుగులోనూ తెలియవచ్చింది. విచిత్రమే. పక్కన నేనున్నానన్న భరోసాతో నడుస్తుందది. నా దారిని గురించిన అంచనాల్తో అటూ, ఇటూ పరుగెడ్తుంది. తనను తాను తిట్టుకుంటూ మళ్ళీ వచ్చి పక్కన చేరుతుంది. తన భాషను నేనూ, నా బాడీ ల్యాంగ్వేజుని తనూ అర్థం చేసుకునే ప్రయత్నం. నాలుగు సర్కిళ్ళను దాటిపోయినా, విడిచిపోదే. నా సర్కిల్లోకొచ్చి కూచున్నిలబడి, నడుస్తూ దీనంగా చూస్తుంది, ఇక నువ్వే నా దిక్కన్నట్లుగా ఉంది. ప్రయాణం బాగానే ఉంది.కానీ ఇల్లు దగ్గర పడింది. గేటు ముందర నేనూ, నా ముందర తనూ. ఇక ఈ విషమ పరీక్షను దాటుడెట్లు? దరిద్రపు అపార్ట్మెంట్ బతుకు, పొమ్మనలేను, రమ్మనలేను. ఈ కరకు అర్ధరాత్రి ఒకర్నొకరం చూసుకుంటూ నిలబడ్డాం. ఎవరన్నా వచ్చి ఈ రెండు కుక్క పిల్లలూ ఒక్కచోట ఉండగలిగే ప్రదేశానికి తీసుకుపోతే బాగుణ్ణు. 12. 3. 2014

by Mohan Rishifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PponGQ

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి