పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మార్చి 2014, శనివారం

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ ||సాహితి రాశీభూతమైన రసానుభూతి (30న రాయప్రోలు సుబ్బారావు వర్ధంతి) - - మంగు శివరామ ప్రసాద్ కచకుచాది స్ర్తి అంగాంగ వర్ణనలతో సంభోగ శృంగారానికి పట్ట్భాషేకం చేసిన ప్రబంధ కవుల కబంధ హస్తాలనుంచి సాహిత్య సరస్వతికి విముక్తి కలిగించి శారీరక సంపర్కం లేని వియోగ శృంగారాన్ని శారదా పీఠంపై అధివసింపచేసిన మహోన్నత సాహితీవేత్త రాయప్రోలు సుబ్బారావు. అమలిన శృంగార సమారాధమే తన సాహిత్య సాధనగా పేర్కొన్నారు రాయప్రోలువారు. ‘‘శృంగారః శుచిరుజ్జలః‘‘ అన్న ఆర్యోక్తి వీరి అమలిన శృంగార సిద్ధాంతానికి మూలాధారము. ‘మేఘ సందేశం’ రెండవ సర్గ 52వ శ్లోకంలో వియోగంలోనే ప్రేమ విలసితమని కాళిదాసు ఇలా చెప్పాడు: ‘‘స్నేహనాహుః కిమపి విరహే ద్వంసినస్తే త్వభోగా దిష్టే వస్తు న్యుపచితరసాః ప్రేమ రాశీభవంతి’’ విరహంలో ప్రేమ నశిస్తుందంటారు. కాని వియోగంలోనే ఇష్టమైన వస్తువుపై ప్రేమ రసానుభూతిని చెంది రాశీభూతమవుతుందని మహాకవి కాళిదాసు భావన. కాళిదాసు ప్రవచించిన వియోగము చివరికి సంయోగానికే దారి తీయడం ప్రాచీన కవులు నిర్వచించిన శృంగార లక్షణం. రాయప్రోలువారు విఫ్రలంబ శృంగారానికే చరమస్థాయిలో ప్రాధాన్యాన్ని కల్పించారు. ‘‘కాలేనా వరణాత్యయాత్ పరిణతే యత్ స్నేహసారే స్థితం భద్రం తస్య సుమానుషస్య కథమప్యేకంహి తత్ ప్రాప్యతే’’ కాలం గడిచేకొద్దీ భార్యా భర్తల మధ్య సంబంధము స్నేహంగా మార్పు చెందుతుందని భవభూతి ఉత్తర రామ చరితలో ఈ అంశానే్న చెప్పాడు. భవభూతి ఈ భావానే్న రాయప్రోలు తన అమలిన శృంగార తత్వానికి పరమావధిగా పరిగ్రహించారు. ఆయన రచనల్లో మకుటాయమైన ‘‘తృణ కంకణము’’ ఖండ కావ్యంలో ఈ అభిప్రాయానే్న కావ్యనాయికచేత ఇలా పలికించారు. ‘‘సరససాంగత్య సుఖ వికాసముల కన్న దుస్సహవియోగ భరమై మధురము సకియ... కనుల నొండొరులను జూచుకొనుటకన్న మనసు లన్యోన్య రంజనల్ గొనుటకన్న కొసరి ‘యేమోయి’యని పిల్చుకొనుటకన్న చెలుల కిలమీదనేమి కావలయా సఖుడు’’ ఉదాత్త ప్రణయ భావనకు అపురూపమైన రూపకల్పన. పూవుకు తావి అబ్బినట్టు ఈ భావనకు రమ్యతను ప్రసాదించింది స్నేహ మాధుర్యము. చిన్నప్పటినుండి ప్రేమించుకున్న యువతీ యువకులకు విధి వశాన వివాహం కాలేదు. ఆమెకు వేరొకరితో వివాహమవడంతో అతడు భగ్నప్రేమికుడై, ఆమెనే తలుస్తూ కాలం గడుపుతూ వుంటాడు. చాలా కాలం తర్వాత వారిద్దరు కలుసుకున్నప్పుడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా నవకమోడని తృణకంకణాన్ని అతడు ఆమెకు కడ్తాడు. ఎటువంటి మనో వికారానికి లోను కాకుండా వియోగం లోనే స్నేహ మాధుర్యం వుందని భావిస్తూ దానినే జీవితమంతా అనుభవించాలనుకోవడమే ఈ ఖండ కావ్యంలోని ప్రధానాంశం. ‘తృణకంకణము’ కావ్యంలో శృంగారాన్ని సంభోగాభిముఖంగా కాక స్నేహ ఉద్దీపనగా ప్రయోగించారు రాయప్రోలువారు. ‘‘పూజా శాలకు శయ్యా గృహమునకు అంతరముండదా! శృంగారమునకు శుచి, రుచి రెండు అంశాలు ఏర్పరుచుకున్నాను. అందువలన ఇందలి శృంగారముని విలక్షించి, అమలిన శృంగారమని,’’ ఆయన అన్నారు. కామం, ప్రేమ రెండూ ఆయన భావనలో శృంగారంగా భాసించాయి. కొమర్రాజు లక్ష్మణరావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగార్ల సానిచర్యం, స్నేహంతో రాయప్రోలువారు నవ్యకవిత్వానికి కవాటాలు తెరిచారు. శబ్ద మాధుర్యము, అర్ధ ప్రసన్నత, సంప్రదాయ అభిమానము, దేశభక్తి, ఆత్మసౌందర్యము, తెలుగు సంస్కృతిపై ప్రేమ, ఆధ్యాత్మిక చింతనల సమాహారము వీరి వాజ్ఞయము. కథా కథనంలో వర్ణనలో, భావ ప్రకటనలో కొత్త బాటలు వేసారు. భావ గాంభీర్యము, భాషా సౌకుమార్యము, శైలివిన్యాసము సరస సమ్మేళనము వీరి కవిత్వము. మేఘదూతం, మృచ్ఛకటికం, స్వప్న వాసవదత్త వంటి ప్రాచీన సంస్కృత కావ్యాలు వీరిని బాగా ఆకర్షించాయనడానికి నిదర్శనం వాటి ప్రభావం ఈయన రచనల్లో ప్రతిబింబించడమే. అల్లసానిపెద్దన, శతావధాని తిరుపతి శాస్ర్తీని అనుకరించానని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. భవభూతి కాళిదాసాది ప్రాచీన సంస్కృత కవులు వీరికి ఆరాధ్య దేవతలు. శంకరాచార్యులు సౌందర్య లహరిలో చెప్పిన విషయాన్ని, ఉపనిషత్తుల సారాంశాన్ని, పాశ్చాత్యతత్వాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని ఆకళింపు చేసుకుని తన అమలిన శృంగార సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మహాకవి కాళిదాసు రచించిన ‘మేఘ సందేశం’ కావ్యాన్ని ‘దూత మత్త్భు’ పేరుతో తెనిగించారు. ‘శకుంతల’, ‘ఉత్తర రామచరిత్ర’ రాసారు. ‘ఉమర్ ఖయ్యామ్’ను ‘మధుకలశం’ పేరుతో అనువదించారు. రవీంద్రుని వ్యాసాలను తెనిగించారు. తెలుగు వాజ్ఞయాన్ని ఆంగ్లంలోకి అనువదించి ‘త్రివేణి’ పత్రికలో ప్రకటించారు. ‘సాహిత్య సౌందర్య దర్శనం’ అనే వ్యాస సంపుటిలో రాయప్రోలువారు తన జీవిత విశేషాలను, శాంతినికేతన్‌లో ఆయన అనుభవాలను ప్రస్తావించారు. వీరి సాహిత్య విమర్శ, సౌందర్య దృష్టిని వివరించే గ్రంథం ‘రమ్యాలోకం’పై సాగిన చర్చల నేపథ్యంలో ‘మాధురి దర్శనం’, ఈ రెండింటికి వ్యాఖ్యాన రూపంగా వచ్చింది ‘రూప నవనీతం’. దీనిలో స్ర్తి మనస్తత్వ పరిశీలన వుంది. ‘మిశ్రమంజరి‘ అనే రచనా సంపుటికి రాయప్రోలువారి 1962లో కేంద్రసాహితి అకాడమీ అవార్డు లభించింది. ‘స్నేహలత’ కావ్య ఖండికలో వరశుల్క నిరసనగా పితృగృహరక్షణకు ఆత్మార్పణ చేసుకున్న పధ్నాలుగు వసంతాల కన్యక కరుణామయ గాథ సాంప్రదాయ ఆర్ష వాతావరణంలో ప్రతిబింబించింది. ‘అనుమతి’లోని నాయిక తను వివాహమాడదలచిన వ్యక్తి వేరొక స్ర్తికి భర్త అయినా, అతని మరణానంతరం అతని భార్యాబిడ్డలకోసం త్యాగం చేసి పెద్ద మనసు కలిగిన దయాశీలి. ‘‘నాకు ఆంధ్రాభిమానం జన్మాంతర వాసనగా వచ్చినట్లున్నది’’ అంటూ ఆ అభిమానంతో దేశభక్తి గేయాలు, ఆంధ్రాభిమాన కవిత్వం చాలా వ్రాసారు. బంకిం చంద్రుని వందేమాతర గీతం రాయప్రోలు వారి దేశాభిమాన కవిత్వానికి ఓంకార నాదమయింది. అలనాటి ఆంధ్రౌన్యత్యాన్ని అపురూపమైన కవితా దృష్టితో చూడగల సాహితీ స్రష్ట, దార్శనికుడు రాయప్రోలు. ‘‘పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము’’ అనే ఆయన ఏ దేశమేగినా ఎందుకాలిడినా అనే దేశభక్తి గేయం తెలుగు లోకోక్తిగా ప్రజల నాల్కులపై నిలిచిపోయింది. ‘‘ఆంధ్రావళి’’, ‘‘తెనుగుతోట’’ వంటి రచనలు ఆయన ఆంధ్రాభిమానానికి ఉదాహరణలు. ‘తెనుగు తల్లి’ అనే గేయంలో ‘నందనోద్యాన సౌందర్యము నెగబోయి’ అంటూ అని ఆంధ్రదేశంలోని పలు ప్రాంతాల వైభవాన్ని స్తుతించారు. - మంగు శివరామ ప్రసాద్ 15-3-2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m5SG2k

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి