పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Abd Wahed కవిత

ఈ రోజు గాలిబ్ కవితల్లో మొదటిది గాలిబ్ దీవాన్లో 9వ గజల్ మొదటి షేర్ దహర్ మేం నక్షె వఫా వజె తసల్లీ న హువా హై వో లఫ్జ్ కె, షర్మింద యె మానీ న హువా లోకంలో ప్రేమ దారులపై సంతుష్టి దొరకదు ఈ పదం ఎన్నడూ అర్ధానికి తగినదిగా నిలబడదు ఇది గజల్ లో మొదటి కవిత కాబట్టి రెండు పంక్తుల్లోను ప్రాస కనబడడమే కాదు, ప్రతి పంక్తి దానికదే సంపూర్ణ వాక్యం. ఈ గజల్లో మొత్తం 7 కవితలున్నాయి. గాలిబ్ ప్రసిద్ధ గజళ్లలో ఇది కూడా ఒకటి. ఈ గజల్లోని ఉర్దూ పదాలకు అర్ధాలను చూద్దాం. దహర్ అంటే ప్రపంచం, నక్ష్ అంటే చిహ్నం, గుర్తు, వఫా అంటే విశ్వాసం, ప్రేమ, బే వఫా అంటే విశ్వాసం లేనివాడని అర్ధం. ముఖ్యంగా ప్రేమికులకు సంబంధించి వాడినప్పుడు బే వఫా అంటే మోసగించిన వాడని అర్ధం చేసుకోవచ్చు. అంటే వఫా అన్న పదం ప్రేమను సూచించే పదంగా కూడా వాడడం జరుగుతుంది. శాబ్ధికంగా వఫా అంటే విశ్వాసం అన్న అర్ధమే ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇది ప్రేమను సూచిస్తుంది. వజహ్ అంటే కారణం. తసల్లీ అంటే సంతుష్టి. లఫ్జ్ అంటే పదం. షర్మిందా అంటే సాధారణంగా సిగ్గుపడడం అని చాలా మంది భావిస్తారు, కాని ఈ పదబంధానికి అర్ధం నెరవేరడం. తెలంగాణా కల నిజమయ్యిందనడానికి తెలంగాణా కా ఖ్వాబ్ షర్మిందా తాబీర్ హువా అంటాం. దీన్ని ఉర్దూ పలుకుబడి రీత్యా అర్ధం చేసుకోవాలి. ఈ కవితకు భావాన్ని చూస్తే. ప్రపంచంలో గొప్ప ప్రేమికులు చాలా మంది ఉన్నారు. గాఢమైన తమ ప్రేమ చిహ్నాలను ప్రపంచంలో వదిలివెళ్ళారు. ఎందుకంటే వారంతా అంతకు ముందు కాలాల్లోని గొప్ప ప్రేమికులతో ప్రేరణ పొందారు. వారిలాగే తాము కూడా సాటిలేని ప్రేమికులుగా మారాలనుకున్నారు. అందుకే తమ ప్రేమ ఎంత గాఢమైనదో చాటిచెప్పే చిహ్నాలను ప్రపంచంలో వదిలి వెళ్ళాలనుకుంటారు. కాని ఇలాంటి వారి ఆశలు, ఆకాంక్షలకు పునాదుల్లేవంటున్నాడు గాలిబ్. ప్రపంచంలో విశ్వాసబద్దమైన ప్రేమ అనేది కేవలం ఒక భ్రమ మాత్రమేనని, ఇందులో సత్యం లేదని, అది ఒక భ్రమ అయినపుడు దానికి సంబంధించిన చిహ్నాలను వదిలి వెళ్ళే ప్రసక్తే ఉండదు. అలాంటి ఒక భ్రమను నిజమనుకుని ఆ మార్గాన నడుస్తున్నప్పుడు మనకు సంతుష్టి ఎలా దొరుకుతుంది. ప్రేమికులు తమ ప్రేమకు నిబద్దులై ఉంటారు. కాని నిజానికి నిబద్దతతో కూడిన ప్రేమ అనేదే ఒక భ్రమ అయినప్పుడు అందులో సంతుష్టి దొరికే అవకాశం లేదంటాడు గాలిబ్. తర్వాతి కవిత గాలిబ్ 9వ గజల్ 2వ కవిత సబ్జ యే ఖత్ సే తేరా కాకులె సర్కష్ న దబా యే జుమ్ముర్ద్ భీ హరీఫె దమె ఉఫయీ న హువా కెంపులాంటి చెంపలపై తలబిరుసు కురులు చూడు నాగమణి కూడా నల్లతాచును ఆపలేకపోతున్నది ఖచ్చితంగా తెలుగు అనువాదానికి, ఉర్దూలో ఉన్న పదాలకు సంబంధం లేదు. ఈ కవితను అర్ధం చేసుకోడానికి ఉర్దూ పలుకుబడి, ఉర్దూ ప్రతీకలు, ఉర్దూ కవులు సూచనాత్మకంగా ఉపయోగించుకునే సంఘటనలు, ఉర్దూ ఉపమానాలు, ఉర్దూకు ప్రత్యేకమైన పోలికలు వగైరా అన్నీ తెలిసి ఉండాలి. ముందుగా ఈ కవితలోని పదాలకు అర్ధాలు, వాటి వివరణలు చూద్దాం సబ్జా అంటే ఆకుపచ్చ రంగు, ఖత్ అంటే కేశం, సన్నని గీత, సబ్జా యే ఖత్ అన్నది ఉర్దూ కవులు ఉపయోగించిన ప్రత్యేకమైన పోలిక. యుక్తవయస్సు తర్వాత శరీరంలో ఒక కొత్త తేజం వస్తుంది. ముఖ్యంగా చెంపలపై రోమాలు.ఇంగ్లీషులో మనం సైడ్ బర్న్స్ అనంటాం. పురుషులకే కాదు, స్త్రీలకు కూడా చెవుల వరకు పల్చని నూగు వంటి కురులు వస్తాయి. తెల్లని వంటిఛాయ ఉన్నవారిలో అవి కొంత వరకు ఆకుపచ్చ వర్ణంలో కనిపిస్తుంటాయి. వీటినే సబ్జాయే ఖత్ అని పోల్చడం జరుగుతుంది. కాకుల్ అంటే కురులు, సర్కష్ అంటే తలబిరుసు, తలెగరేస్తూ గర్వించే వాడు, జుమ్ముర్ద్ అంటే ఒక కల్పనాత్మకమైన రంగురాయి, దీని మెరుపులను ఉపయోగించి నాగుపామునైనా గుడ్డిది చేయవచ్చు. హరీఫ్ అంటే ప్రత్యర్ధి, దమ్ అంటే శ్వాస, లేదా జీవితం, ఉఫయీ అంటే తాచుపాము లేదా నాగుపాము. ఇది గాలిబ్ గజళ్ళలో చాలా ప్రసిద్ధి చెందిన గజల్ అని చెప్పుకున్నాం. లోతైన భావాలతో చక్కని పదాలతో రాసిన ఈ గజల్ ను లతా మంగేష్కర్తో సహా చాలా మంది పాడారు. పైన తెలిపిన ఉర్దూ పదాల అర్ధాలు వివరణలు చదివిన తర్వాత నేను చేసిన అనువాదం అసలు ఉర్దూ కవితకు ఆమడ దూరంలో కూడా లేదన్నది మీకు అర్ధమై ఉంటుంది. ఈ కవితలో ఉన్న ప్రతీకలు, పోలికలు తెలుగులో యథాతథంగా అనువదిస్తే తెలుగు వాతావరణంలో ఇమిడేవి కాదు కాబట్టి నేను కొంత స్వేచ్ఛ తీసుకున్నాను. ఈ కవితను అర్ధం చేసుకోడానికి, కొందరు గాలిబ్ వ్యాఖ్యాతలు చెప్పిన ఒక దృశ్యాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. ఒక చిత్రాన్ని ఊహించండి. అందమైన అమ్మాయి చిత్రాన్ని ఒక చిత్రకారుడు వేశాడు. ఒకే జడ వేశాడు. కళ్ళు, ముక్కు, చెవులు, చెంపలు, ముఖం ఏదీ చిత్రంలో వేయలేదు. కేవలం జడతో ఉన్న ముఖం ఔట్ లైన్ మాత్రమే వేశాడు. ఆ చిత్రం ఎలా కనిపిస్తుంది. పడగవిప్పిన నాగుపాము తీవ్రమైన కోపంతో కాటేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు గాలిబ్ వాడిన పదాలను చూడండి. సబ్జాయే ఖత్ అంటే ఆకుపచ్చని నూగు వంటి సైడ్ బర్న్స, ఆ తర్వాత కల్పనాత్మకమైన జుమ్ముర్ద్ అనబడే రంగురాయి గురించి రాశాడు. అది కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. ఈ రంగురాయిని నాగుపాముకు చూపిస్తే అది గుడ్డిదై పోతుందని చెప్పుకుంటారు. ఆ విధంగా ఈ రంగురాయితో నాగుపాము దాడి నుంచి రక్షణ పొందవచ్చు. అంటే, నాగుపాము ప్రత్యర్ధిలా దాడి చేయడానికి వచ్చినా ఈ రంగురాయి ఉంటే రక్షణ పొందవచ్చు. ప్రేయసి చెంపల పైన, చెవుల వరకు సబ్జాయే ఖత్ (ఆకుపచ్చని సైడ్ బర్న్స్) ఈ ఆకుపచ్చని కాల్పనిక రంగురాయితో పోల్చాడు గాలిబ్. జుమ్ముర్ద్ అనబడే కాల్పనిక ఆకుపచ్చని రంగురాయి గురించిన కథని తన కవితకు వాడుకుంటూ, చెంపలపై నూగులాంటి ఆకుపచ్చని సైడ్ బర్న్స్ వచ్చినా, అవి జుమ్ముర్ద్ అంటే ఆకుపచ్చని కాల్పనిక రంగురాయిలా ఉపయోగపడుతున్నప్పటికీ, మిరుమిట్లు గొలిపే అందమైన తలబిరుసు కురులు నాగుపాములా చేస్తున్న దాడిని ఆపలేకపోతుందట. ప్రేయసి ముఖసౌందర్యాన్ని గాలిబ్ తప్ప మరెవ్వరూ బహుశా ఇలా వర్ణించలేరు. మొత్తం కవిత భావాన్ని చూస్తే, పడగవిప్పిన నల్లతాచు లాంటి నీ అందమైన కురుల తలబిరుసు సౌందర్యాన్ని ఆకుపచ్చగా మెరిసే నూనూగు సైడ్ బర్న్స్ కూడా అదుపు చేయలేకపోతున్నాయి. తలబిరుసు కురుల సౌందర్యం అన్న ప్రయోగం కూడా గాలిబ్ తప్ప మరెవ్వరూ చేయలేరేమో. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 9వ గజల్ 3వ షేర్ మైం నే చాహాథా కె అందోహె వఫాసే ఛూటూం ఓ సితమ్ గర్ మేరే మర్నే పే భీ రాజీ న హువా ప్రేమ బంధం నుంచి బయటపడాలని అనుకున్నా కాని నా మరణానికి కూడా ఆమె ఒప్పుకోవడం లేదు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. అందోహ్ అంటే బాధ, వఫా అంటే నిబద్దత, ప్రేమ, విశ్వాసం, సితమ్ గర్ అన్న పదాన్ని ఉర్దూ పలుకుబడి రీత్యా అర్ధం చేసుకోవాలి. సితమ్ అంటే దౌర్జన్యం లేదా బాధ అని భావం. సితమ్ గర్ అంటే దౌర్జన్యం చేసే, బాధపెట్టే వ్యక్తి. కాని ఇక్కడ ప్రేయసినే సితమ్ గర్ అని పిలవడం జరిగింది. అనేక బాధలకు కారణమైన ప్రేమలో ప్రేయసి సితమ్ గర్ కాక మరేమవుతుంది. ప్రేయసిని ఖాతిల్ అంటే హంతకి అని వర్ణించడం కూడా మనకు ఉర్దూ కవితల్లో కనబడుతుంది. చూపులను ఖంజర్ అంటే చురకత్తులతో పోల్చినప్పుడు, అలాంటి చూపులున్న ప్రేయసి ఖాతిల్ అనుకోక తప్పదు మరి. రాజీ అంటే ఒప్పుకోవడం. ఇక ఈ కవిత భావాన్ని చూద్దాం. అనేక బాధలకు కారణం ప్రేమే. గాలిబ్ తన ప్రేయసిని ఎంత గాఢంగా ప్రేమించినా ఆమె మాత్రం అతని ప్రేమకు నిదర్శనాలు, రుజువులు కోరడం తగ్గలేదు. ఇక భరించలేని స్థాయికి చేరుకున్నాడు. విముక్తి కావాలనుకున్నాడు. కాని ఆమెను వదిలి బతకనూ లేడు కాబట్టి జీవితాన్ని చాలించాలనుకుని, అందుకు ఆమె అనుమతి కోరాడు. ప్రేమతో ఆమెను బాధించే తాను శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళతానంటే ఆమె వెంటనే ఒప్పుకుంటుందనుకున్నాడు. కాని దానికి కూడా ఆమె ఒప్పుకోలేదు. ఇక ఈ బాధ భరిస్తూ బతకడం గాలిబ్ కు తప్పలేదు. ఈ కవితలో మరింత లోతయిన భావం కూడా ఉంది. మనిషి ఈ లోకంలోని జీవించడానికి వచ్చాడు. దేవుడిపై ప్రేమ, భక్తితో దేవుడు చెప్పినట్లు బతకడానికి వచ్చాడు. కాని ఈ లోకంలో అలా జీవించడం కష్టసాధ్యం అవుతోంది. పరీక్షలు ఎదురవుతున్నాయి. బాధలు తట్టుకోలేకపోతున్నాడు. రోజూ దేవుని పట్ల తన నిబద్దతను నిరూపించుకుంటూ దేవుని మార్గంలో బతుకు గడపాలి. బాధలు తట్టుకోలేక మరణిద్దామన్నా వీలు లేదు. ఎందుకంటే, మరణించడానికి కూడా దేవుడి అనుమతి లేదు. ఆత్మహత్య మహాపాతకమని నిషేధించాడు. ఇదే భావాన్ని గాలిబ్ చక్కని పదాల్లో వ్యక్తం చేశాడు. గాలిబ్ కు ముగల్ చక్రవర్తి ఆస్థాన కవి, చక్రవర్తికి కవిత్వంలో గురువు దాగ్ దహెల్వీకి మధ్య ఒకవిధమైన పోటీ ఉండేది. దాగ్ రాసిన ఒక కవితకు జవాబుగా గాలిబ్ ఈ పంక్తులు రాశాడంటారు. దాగ్ రాసిన కవిత ఏమంటే : జీస్త్ సే తంగ్ హో యే దాగ్, తో జీతే క్యోం హో జాన్ ప్యారీ భీ నహీం, జాన్ సే జాతే భీ నహీం బతుకంటే విసుగొచ్చిందా, దాగ్, మరి బతుకుతావెందుకు ప్రాణం అంటే ప్రేమ లేదు, ప్రాణాన్ని వదిలిపోనూ లేవు. దాగ్ రాసిన ఈ కవితకు జవాబుగా గాలిబ్ పైన పేర్కొన్న కవిత రాశాడని అంటారు. నిజానికి దాగ్ తన కవితలో ఒక డైలమా రాశాడు. బతుకంటే విసుగొచ్చింది. కాని చావాలని కూడా లేదు, ఏం చేయాలన్నది ఆ డైలమా. ఈ డైలమాకు గాలిబ్ తన కవితలో జవాబిచ్చాడు. చావడానికి కూడా కుదరదని తేల్చేశాడు… ఇది ఈ వారం గాలిబానా. వచ్చే శుక్రవారం మరికొన్ని కవితలతో మళ్ళీ కలుద్దాం...అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cuUHzL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి