పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Nirmalarani Thota కవిత

ప్రత్యూషపు పద సవ్వడిని గోరు వెచ్చని అరుణ కిరణాలతో ఆత్మీయంగా స్వాగతిస్తాడు సూరీడు. . .! ఒళ్ళంతా తెరుచుకున్న ఆకుల కన్నులతో పచ్చని శ్వాసలతో ఊపిరిలూదుతూ ప్రతి హృదినీ పలకరిస్తుంది తరువు . . ! ఉరుములు మెరుపుల పిలుపులతో తొలకరి చినుకుల చేతులతో స్పృశించి తనువెల్లా తన్మయంతో తడుపుతుంది మేఘమాల . . ! గుండె రేకులు గుట్టుగా విప్పుకొని సౌరభాల సోయగాలతో మనసంతా సొగసైన సుగంధాలు నింపుతుంది సుమబాల . . .! తన తెలి తరగల తరంగిణీ నృత్యంతో తాదాత్మ్యంగా పాదాలకు ప్రణమిల్లి పారవశ్యాన పులకరిస్తుంది కడలి . . . ! పంటచేలతో సరాగాలు పాడుతూ ముంగురులు ముద్దాడుతూ మురిపెంగా పలకరిస్తుంది పైర గాలి . . ! విశ్వాలను నింపుకున్న నింగి సైతం రేయంతా నక్షత్రాల విందుతో జాబిల్లిని పంపి వెన్నెల జోల పాడుతుంది . . ! సృష్టిలో ప్రతీది తనదైన శైలితో సాటి జీవిని పలకరిస్తుంది . . . మనసున్న మనిషి మాత్రం భేషజాల ముసుగు మాటున మూతి ముడుచుకొని కుచించుకుపోతాడెందుకు . . ? ఓ మనిషీ . . ! ఓసారి నవ్వవా . . ! పెదాలు విచ్చి ఓ పలకరింత చిలకరించవా. . ? మనసు విప్పి ఓ పులకరింత చిగురించవా . . ! రెండు పెదాల మధ్య మొగ్గ విచ్చే లాస్యం . . రెండు పలకరింపు కరచాలనాల మధ్య స్పూర్తినిచ్చే ఓ మధురమైన ఙ్ఞాపకం . . ! ! నిర్మలారాణి తోట [ తేది: 21.02.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ed0B4V

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి