పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, ఆగస్టు 2012, శనివారం

మెర్సి మార్గరెట్ ॥ చీకటి దండెం పై ..॥

చీకటి దండెం మీద
ఎవరో
జ్ఞాపకాలు ఆరేసుకున్నారు
ఎక్కడెక్కడ తిరిగి
తడిసి వచ్చాయో

చూడు
ఏ మట్టిలొ ఆడివచ్చిందో
ఈ జ్ఞాపకం
సైకిల్ టైరుతో తొక్కించుకుని
గుబ్బ కాయల ముళ్ళు తగిలించుకొని
గోలికాయలు ఎవో రెండు
ఇంకా
దాని జేబులోనె దాచుకుని

ఈ జ్ఞాపకం
రంగు వెలిసి
ఎలా చూస్తుందో చూడు
ఒక్కొక్క వరుసని దాటి
అనుభవాల కుదింపుల్లో
ఎన్ని మనసులని
గెలిచి ఓడి
అలసిపొయిందో

చినిగి పోయినా
ఆ చినుగుల్లోంచి అటువైపు
శూన్యాన్ని చూపిస్తూ
ఈ జ్ఞాపకానికి ఇంకా తను
పసుపు అద్దడం
మానలేదెందుకో

ఎటూ కదలక
బుద్దిగా అలాగే
చీకటినే
అంటిపెట్టుకున్న
ఈ జ్ఞాపకానికి చూడు
అంటుకుని విడిపోని సన్నజాజులు
రాలిపొకుండా పట్టుకుని వేలాడే
తల వెంట్రుక నవ్వులు
ఎక్కిరిస్తూ గిచ్చుతున్నట్టు
గుస గుస శబ్దాలు చెస్తూ
నిట్టూరుస్తున్నాయెందుకో


ఆ జ్ఞాపకంపై
చూడు
శుభ్రం చేసినా పోని
రక్తపు మరకలు
ఎవరు ఎక్కడ పొడిచారో
ముద్దగా మారిన గుండెను
మూటకట్టుకుని ఆ
రక్తపు చుక్కల వెనక ఎడుస్తూ

అక్కడక్కడే తిరుగుతూ
తను
పచ్చిగా ఉన్న వాటిని
పట్టుకొని చూస్తూ
ఆ చీకటి దండాన్ని
కుదరక పోయినా
లాగి కట్టి
మిగిలిపొయిన
జ్ఞాపకాలని ఆరేయాలని
ప్రయత్నిస్తున్నాడు

కళ్ళను పొడిచే నిద్రతో
జ్ఞాపకాలు ఎగిరిపోకుండా
హుక్కులు పెడుతూ ...

*09-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి