పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, ఆగస్టు 2012, శనివారం

అవ్వారి నాగరాజు || పిల్లలు ||


పిల్లలు భలే తమాషా అయిన వాళ్ళు

పాపం వాళ్ళు
లోకం లోని పువ్వుల మాదిరి పిట్టల మాదిరి
అపురూపమైన దాన్నేదో
తలపై నెమలి పించంలా ఆరోపించుకొని
మన కళ్ళ ముందర బుడి బుడి అడుగులతో తిరుగుతుంటారు

ఈ లోకానికి వచ్చింది మొదలు
చుట్టూ ఉన్న మకిలిలో పడి మాయమయ్యే వరకూ
మనం పోగొట్టుకుంటున్న దానికి
ఒక పూరకంగా నిలబడి తమకు తెలియకుండానే మనకొక ఆశ్వాసననిస్తారు

కాసేపు కవిత్వమవుతారు

మరి కాసేపు ఒక కలలా తమ సుతారపు రెక్కలను విదిల్చి ఎవరికి వారు పాడుకునే
మహేంద్ర్రజాలపు మాయా వేణుగానమవుతారు

కాలానికి ఒక కొసన మనలను నిలుచుండబెట్టి
తామే ఒక మహాద్భుత ఆలంబనమై
పారాడే ప్రతి శిశువూ భూగోళాన్ని తమ నును లేత పిరుదులపై నిలుచుండబెడతారు

ఎవడైనా ఒక కవి అర్భకంగా తమవైపు నోరు తెరచి చూసినపుడు
పురా కాలపు స్వప్నాన్నొకదాన్ని తమపైకి నెట్టి బతికే
మనుషుల మాయను జాలిగా క్షమించి
బోసిగా నవ్వుతూ చెక్కిళ్ళ వెంట కారే అమృతంతో
బతుకుపోండ్రా అని మనలని దీవిస్తారు.
*10-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి