పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, ఆగస్టు 2012, శనివారం

జుగాష్ విలి || మాకు మా ఊరే కావాలి ||

ఎక్కడ మా శిరస్సులు నేలరాలాయో
అక్కడే మా తలలు తలలెగరేయాలి

ఎక్కడ మా నెత్తురు ఏ మట్టిలో యింకిందో
అక్కడే మా జీవితాలు పుష్పించి పరిమళిoచాలి

ఎక్కడ మా కనుగుడ్లు పెకిలించబడ్డాయో
అక్కడే మా క్రొన్నెత్తుటి క్రోధం పొటెత్తాలి

మా ఆత్మగౌరవాన్ని పరిహసించేవి ఏవీ
మాకు సుఖాలనూ ఆనందాలనూ యివ్వలేవు

మేం ఓడిపోయి మా ఊరు విడిచి
ఎక్కడికో వలసవాసులుగా పోలేం
కాలనీ కంచెల మధ్య పరాయి కాలేం

మా భూములకు మా బతుకులకు సోకిన
కులాధీనా వర్గ పురుగుల్ని హతమార్చే
క్రిమి సంహారక మందు ఏదో యిప్పుడు అన్వేషించాలి

క్రూర మృగాలు లేని చోటులేదు
వాటిని వేటాడే పరికరాలు ఏవో మాకు కావాలి
మాకు మా ఊరే కావాలి

* * *

ప్రభుత్వామోదిత పరిధి దాటని ఉద్యమాలొకవైపు
పెకిలించి పెనుకంపన పుట్టించాలానే ఉద్యమాలొకవైపు

ఇప్పుడు
నేను
ఈ సందిగ్ధ ఉద్రిక్త చౌరస్తాలో నిలబడి
ఈ మాటలు మాట్లాడుతున్నాను
నిన్నటి క్రూర విషాద వాంగ్మూలాన్ని
నేటి ఆచరణాత్మక సాదృశ్యాన్ని
నేను
లక్షింపేటను మాట్లాడుతున్నాను.


*11-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి