పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, ఆగస్టు 2012, శనివారం

పద్మా శ్రీరామ్ ||నాన్నగారూ మీరు రారా మరోమారూ....||


ఆడపిల్లనైనా పెళ్ళయ్యేవరకూ
ప్రతీదానికీ నాన్నగారి వద్దకే చేరాను

పెళ్ళయ్యాకా మాత్రం అన్నిటికీ అమ్మే...
అవునేమో... మిమ్మల్ని పక్కకి పెట్టానేమో...

అయితే మాత్రం నాన్నగారూ నాపై అలిగారా
అమ్మతో పాటే అనంతలోకాలకెళ్ళిపోయారు

అనారోగ్యంలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టి
నా అత్తింటి బాధ్యతలకై పరుగులెత్తానని నాపై కోపమా

ఇంకా కొన్నాళ్ళుంటానన్నావ్ కదమ్మా .....
అని అడిగిన మీ ప్రశ్న గుండెలో గునపంలా గుచ్చుకున్నా

అత్తగారి అనారోగ్యంలో నే పక్కనుండకపోతే
లోకం నన్ను, మీ పెంపకాన్ని దుమ్మెత్తిపోయదా

నాన్నగారూ అని అప్పుడు నే మిమ్మల్ని అడగలేదు...
కారణం మీకూ తెలుసు నేను "ఆడపిల్ల" ను

పుట్టింటి పాశం గుండె కోసే బంధమైతే...
అత్తింటి బంధం...బాధ్యతల "అణు" బంధం

మీరు నిద్రపోతున్నారని హాల్లోకి వెళ్ళి కూర్చుంటే
నే ఇక్కడుంటే నువ్వక్కడ కూర్చున్నావేమిటమ్మా అని
మీరడిగిన ప్రశ్న ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది

దేవుడు ఒక్క వసంతం కాలాన్ని వెనక్కి మరల్చితే
నాకీ సంసారం అత్తమామల బాధ్యతలూ ఏవీ వద్దంటాను నాన్నగారూ

మీ సేద తీరా మీతో ఉంటాను...కూతుళ్ళకోసం తపించిపోయే
సకల తండ్రులకు ప్రతిరూపమైన మీ ప్రేమ కోసం

మీ మమతానురాగాల క్షణాలను గుండెగదిలో
పదిలంగా దాచుకోవడం కోసం....

కానీ ఆ దేవుడికి ఆడపిల్లలు లేరేమో నాన్నగారూ
నా మొరనూ వినడు మిమ్మల్ని మాతోనూ ఉంచడు

జన్మజన్మలకూ ఆడపిల్ల గా పుట్టాలని కోరుకునే నేను
ఇప్పుడు బాధ పడుతున్నా నాన్నగారూ "ఆడ" పిల్లగానే మిగిలినందుకు....
నాన్నగారూ రారా నా కోసం మరోమారూ....


*11-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి