పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, ఆగస్టు 2012, శనివారం

నవుడూరి మూర్తి // విశాఖ నగర ప్రబంధం //


ఛందో బధ్ధ కవిత్వంలా ఉన్నాయి– ఇళ్ళూ, వాకిళ్ళు,

దుష్ట సమాసాల్లా — అక్కడక్కడ భవంతుల ప్రక్కన పూరిళ్ళు

సుదీర్ఘ సమాసంలా ఉంది - రాచబాట (National Highway)

ద్విపదలా సాగుతోంది స్టేషన్ నుండి బీచి దాకా ఉన్న రోడ్డు

ఛేకానుప్రాసల్లా ఒకటి విడిచి ఒకటి వెలుగుతున్నాయి సోడియం దీపాలు

రోడ్డుకి రెండు వైపులా- మార్జిను గీసినంత అందంగా కాలిబాటలు

దానిమీద రాసుకున్న ‘నోట్సు ‘లా చెట్లూ, చిల్లర దుకాణాలూ,

ఆశ్వాస విభజన చేసుకుంది- ఆశీలుమెట్ట జంక్షన్

శబ్దాలంకారాలులా మ్రోగుతున్నాయి 'ట్రాఫిక్ జాం'లో వాహనాలు

ఆధునిక కవిత్వానికి ఆవగింజంతైనా విలువివ్వని

పూర్వసువాసిని కవిలా బోడిగా కంచరపాలెం కొండ

తలపులు బోడులు కావని సూచిస్తూ

అక్కడక్కడ విచ్చుకున్న పచ్చని పొదలు

ద్వంద్వ సమాసాల్లా సినిమాహాళ్ళు,

'విగ్రహవాక్యం' లా కనకమహలక్ష్మి అమ్మవారి గుడి,

మారుతీ కారులో దూసుకుపోతున్నదొక బహువ్రీః

కొండమీది పార్కు వసంత ఋతు వర్ణన చేస్తుంటే,

విరహోత్కంఠితయై తిరుగుతోంది 'లైటు హౌసు'

ఉత్ప్రేక్షలా చంద్రుడికేసి ఉరుకుతోంది సముద్రం.

ఆర్ద్రతలోపించిన కావ్యంలా ఉక్కతో అసహనంగా ఉన్న నగరానికి

ఆతిధ్యమిచ్చే అన్నపూర్ణలా వచ్చిందో మేఘ మల్హార్

శ్రోతదొరికిన కవిలా, వస్తూనే కావ్యనివేదన ప్రారంభించింది…

మధ్య మధ్యలో గొంతు సవరించుకుంటూ, ధారా శుధ్ధి ప్రకటిస్తూ,

కవిత్వంలో మెరుపులు ఎత్తిచూపిస్తూ మరీ.

రసలుబ్దుడైన కవికంటే, సామాన్యుడే మెరుగన్నట్లు,

అంతో ఇంతో ఆస్వాదించిన చెట్లు ఓహో అని తలలూపుతుంటే,

ఉండీ ఉడిగీ కిటికీలు చప్పట్లు కొడుతున్నాయి.

చెవిటివాడిముందు శంఖారావంలా,

ఇంతటి రసావిష్కరణా సముద్రంపాలవడంచూసి

అలిగి వెళ్ళిపోయింది అన్నపూర్ణ.

ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలా

దివ్వు దివ్వు మంటూ మిగిలిపోయింది

పాపం! నా నగరం.



*10-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి