పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, ఆగస్టు 2012, శనివారం

క్రాంతి శ్రీనివాసరావు || పిశాచి మింగిన స్నేహం ||

దయ్యమై ఎప్పుడోస్తావురా దోస్తూ
నేనింకా వెతుకుతూనే వున్నా
వూగుతున్న చెట్లల్లో
రాత్రి పూట నడుస్తున్న నీడల్లో

చీకటి యెన్నెల కన్నులేసుకున్న రోజు
మూలబజారు సెంటరులో మోరీపై అంటుకొన్న మన స్నేహం
అప్పుడే మర్చిపోయావా
నీవు నేర్పిన ఉప్పెనగుండ్లాట
చిర్రగుండాట నేనింకా మరువలేదు

ఎంటీయొడి సినిమా కథ
రాకాసోడి మాయలు
రాజకుమారి రహశ్యం
నాకెవరు చెబుతారు నేస్తం

సందాకాడ కలిసి చెవిలో చెప్పింది నాకింకా గుర్తే
యెన్నెలాటలకు రావేంట్రా అంటే
కొత్త ఆటలు మొదలెట్టా చీకటే ఇప్పుడు తియ్యగా వుందన్నావు

మా తాత గూడులొంచి గుంజిచ్చిన
కంకులు నలిపి రామ్మూర్తి కొట్టులో
రూపాయుగా మార్చి
తిరువూరు హాల్లో చూసిన
ఎంటీయోడి సినిమా కంటే బాగుంటదా అంటే
చిన్నోడివి నీ కిప్పుడు అర్దం కాదన్నావు

మీ చుట్టపోళ్ళంతా మా పటేల్ తాత దగ్గర
చెప్పుకొంటే తెలిసింది
పల్లగొర్రు తోలు తున్నప్పుడు పాము కరిచి చచ్చిపోయావని

బాబూ అది అబద్దీకం
దొరసానమ్మ మా పోరగాణ్ణి తగులుకొంటే
కొట్టి చంపేసినారు బాబూఅని మీ అయ్య ఎడుస్తూ
గడ్డాము చాటున నాతో అన్న దాకా తెలియదు
నీకెందుకు చికటి తియ్యగుందో

నన్నే తాకొద్దు మీ తాత చంపుతాడు అని
దాన్నెందుకు తాకావురా
దయ్యమై అన్నా రారా
బతికున్న దెయ్యాల గొంతుకొరికేద్దాం
*10-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి