పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, సెప్టెంబర్ 2012, శనివారం

అన్వేషి || తన జ్ఞాపకం||


ఏ పేజీతో మొదలుపెట్టను..?
డైరీలో అన్ని పేజీలు
ఆశగా అడుగుతున్నాయి
మాతో అంటే మాతో
అంటూ పోటీపడుతున్నాయి..

తన పరిచయమైన తొలిక్షణాలతో
మొదలుపెట్టాలనిపిస్తోంది..కానీ
కొన్ని అపురూపమైన క్షణాలని
మనసులోనే దాచుకోవాలంటూ
కలం కదలనని మొరాయిస్తోంది..

తొలిసారి ఫోన్‌లో తనస్వరం వినగానే
ఆత్మీయంగా అనిపించింది..
ఆ స్వరానికి ఒక రూపాన్ని
ఇవ్వడం మొదలు పెట్టింది మనసు..

సేలయేటి పరుగులా మొదలైన
మాటల ప్రవాహం మరుక్షణమే
నదిలా ఉరకలు వేస్తోంది
సమయానికి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా..

క్షణాలు నిమిషాలై
గంటలలోకి మారుతూ
రోజులు తరబడి సాగిపోయాయి..
ఏమైందో ఏమో ఒక్కసారిగా
మూగబోయింది తన స్వరం ఒకానొక క్షణాన..

వసంతంలా మురిపించిన తాను
ఒక్కసారిగా మూగబోయింది శిశిరాన చెట్టుకొమ్మలా..
మనసు పదే పదే తన స్వరం వినాలనుకున్నా
మౌనం మాత్రమే సమాధానమై మనసు ముంగిట నిలిచింది..

ఒకనొక వర్షాకాలపు సాయంత్రమో,
లేదా వెన్నెలరాత్రుల జాగారమో...
మదిలో తన జ్ఞాపకం మరోసారి కదలాడుతుంది..
కనులలోకి ఒక కన్నీటిచుక్కకి ఆహ్వానం పలుకుతూ..

కదలాడిన భావాలని
కలంలో నింపుతున్నాను,
అదేంటో.. కలం కూడా
అక్షరాల కన్నీరు కారుస్తోంది..

నా జీవనపయనంలో తన పరిచయం
ఒదిగిపోయింది డైరీలో ఒక కాగితమై..
నిలిచిపోయింది మనసు పొరలలో ఒక జ్ఞాపకమై..

30-08-12

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి