పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, సెప్టెంబర్ 2012, శనివారం

శ్రీకాంత్||పురాకృతం||


తేలికగా ఉండడమంటే ఏమిటి?

బహుశా నాకు తెలీదు. అది సాయంకాలపు ఎండ కావొచ్చు. దేహంలోకి చొచ్చుకుపోయే గాలీ కావొచ్చు.ఒక అద్భుతం. నీరులానూ తుంపరలానూ వుండటం. అది ప్రేమ కూడా. తేలికగా వుండటం అదే కావొచ్చును.

ప్రేమించడం నిర్మలంగా నవ్వడం మృదువుగా మాట్లాడటం నాకు తెలీదు. ప్రతిక్షణం ముక్కలుగా రాలిపడటం యితరులను గాయపరచటం నాకు తెలిసిన జీవితం. అది యీ వాచకం కూడా - మరెప్పుడో మొదలయ్యింది సంఘర్షణతోనే. యిక్కడే అంతమవుతుంది సంఘర్షణతోనే. కానీ, పాదాల చుట్టూ చుట్టుకొనే నీడా దేహంపై కదులాడే ఎండా? యివి కూడా వాస్తవాలు.

ప్రేమ కూడా వాస్తవం.

యీ శాపగ్రస్థ పదాల ముందు ఆమె నిర్లిప్తంగా కదులాడింది. యీ శాపవిమోచనం లేని పదాలతో పాటు ఆమె నిరాసక్తతగా నడుస్తూ వుంది. సగం తెరుచుకున్న పెదవులు. కనులలో రోగగ్రస్థమైన ఎర్రటి జీర ఒక స్పర్శ. ప్ర్రాణప్రదమైనదాన్ని ఒడిసిపట్టుకున్నట్టు లేదా తల్లినుంచి విడిపోతున్న తల్లి చూపూ: ద్రోహం: వుండకపోవడం . ఉండటమూ నేరం. ఉండటం ఉండకపోవడం మధ్య, హస్తాల మధ్య తడిలా పారిపోయే నీరులా అదృశ్యమైనది ఏమిటి?

వుండటం. వుండకపోవడం.

భౌతికమైన ప్రేమ. ప్రేమ నుంచి మరింత దీర్ఘంగా,ఎండాకాలంలో పల్చనయ్యి బలహీనంగా తడిమే సన్నటి నదీ చారికలా ఆవిరవ్వకుండా మాయమయ్యే ఇంద్రజాలపు రూపం. ఒక సూర్యకిరణం లేదా చిట్లి సప్త రంగులుగా బయల్పడే సౌందర్యవంతమైన చిరునవ్వు, హింసాత్మకంగా ఏడు రంగులలో ప్రతిబింబించే వెక్కిళ్ళ రోదన. నొప్పి కూడా. అర్థరాత్రి ఎండాకాలం తన పాదం ముంగిట మోపే సుదూర సమీప సమయాన, ఎండాకాలం తన తొలిపక్షి పిల్లలతో చల్లటి వేడి రెక్కలతో వీచే దిగులు పారిజాత పరిమళ గాయపు సమయాన వొక స్వరం. లేదా వొక భాష.

సుదూరం నుంచి, మరచిపోయిన లేదా మరచిపోయినదేదో వొదిలి వెళ్ళిన సువాసనలాగా, అప్పుడెప్పుడో వర్షాకాలపు మధ్యాహ్నపు సాయంత్రం పూట, మేఘాలు మృదువుగా, కదులుతున్న రక్తంలా, గడ్డ కడుతున్న చేతివేళ్ళల్లా కదలాడుతున్నప్పుడు పెదాలపై వొదిలివెళ్ళిన వుమ్మిలా లేతగా జారుతున్నప్పుడు, సుదూరం నుంచి మరచిపోవాలనుకొన్నదేదో, మరచిపోతే మరణిస్తాననుకున్నదేదో, తిరిగి వున్మత్త వుద్రేక వృత్తాలుగా దేహాన్నీ, దేహం లోపల సమయపు నదుల మధ్య నింపాదిగా కదులుతున్న కలలనీ పిచ్చితనంతో , హింసాత్మక ప్రేమతో కత్తుల్లా గాయపరుస్తుంది.

సుదూరం లేదా దూరం (ప్రశ్న: దూరం అంటే ఏమిటి?)

సముద్రం నుంచి మేఘాల దాకా మేఘాల నుంచి సముద్రం దాకా భూమిపై నుంచి భూమి పొరల్లోని సున్నితమైన నదీ ప్రవాహాల్లా అచ్చు నాన్నాలా అమ్మలా, గోరింటాకు విచ్చుకున్న రక్తపు పత్తి పూవులా అరచేతంతా అలుముకున్నట్టు అర్థరాత్రి చీకటినొప్పిలో, నాదైన నాది కాని యీ దేహంలో: నువ్వు

నిశ్శబ్దంగా యుద్ధ భీభత్స తీవ్రతతో, వూహించీ వూహించలేనంతగా, వర్షపు చుక్కలు మట్టిని గాయపర్చిన తీవ్రతతో, అపస్మారకపు సాయంత్రం ఆకస్మికంగా నోరు నొక్కి గుండెల్లో దింపిన కత్తిమత్తు వాస్తవంతో, గోరువెచ్చని నీటిలాంటి రాత్రిపూట దేహం లోపలంతా నలుమూలలా నింపాదిగా ముళ్ళ రక్తపు ఙ్ఞాపకాలతో దిగబడే, లోతుగా విత్తనాల్లా నాటుకుని మొలుచుకువచ్చే: నువ్వు:

=ప్రశ్న రెండు= నువ్వు అంటే ఎవరు? వొట్టి ప్రతీకలు. నగిషీల భాషా ప్రతీకలు. సౌందర్యాత్మక భాష, సౌందర్యాత్మక హింస . హింసా సౌందర్యం. సౌందర్యపు హింస.

యిప్పుడే యిక్కడే వున్నంత సుదూర సమయాన, నాలుగు చినుకులు చూరు నుంచి జారి అంతదాకా కురిసి వెళ్ళిపోయిన వర్షాన్ని ఙ్ఞాపకం చేసినట్టు, ఒక వర్షాకాలపు తొలి గాలిరోజుల మధ్య నుంచి, అదే వర్షాకాలపు తొలి సజల రాత్రుళ్ళు మేఘాల మధ్య చిక్కుకుపోయిన చందమామను వెతుక్కుంటున్నట్టు ఒక దేహం గురించీ, దేహంలాంటి దిగులు కలల్నీ, వొదిలివేసి వెళ్ళిన కొడుకుల్ని మృత్యునయనాలతో ఆ వృద్ధుడు హింసాత్మక కరుణతో కంపిస్తూ గుడ్డిగా కళ్ళ వేళ్ళంచులతో గరుకుగా తడుముకూంటూ ఎదురు చూస్తున్నట్టు నేను నాకోసం ఎదురు చూస్తున్నప్పుడు చాలా మామూలుగా ఎదురుపడ్డ

నువ్వు.

I was simple
I was simpler then
It was smplicity
which seemed so sensual.

అవి పదాలన్నీ నువ్వే అయిన రోజులు. నువ్వే అయిన పదాలు అస్థిత్వాన్ని కమ్ముకున్న రోజులు. అవి గుసగుసల అమాయకత్వపు ధ్వనుల రోజులు. కనిపించనిదేదో కదలి, గడ్డి మృదువుగా రాత్రితో సన్నటి నీటి కోతలా వూగులాడినట్టు అనేకానేక సుధీర్ఘ నలుపు వర్షాల తర్వాత తిరిగి ప్రత్యక్షమయ్యే వ్యతిరేకాలు: పునరావృతమయ్యే పురాతన ప్రశ్నలు: subject and the other. అతడు అన్నాడు.

=other is the self=

అవి కొన్ని సమయాలు. అవి కొన్ని వ్యక్తిగత సమయాలు. దేహం లోపల నదులు అంచులదాకా ప్రవహించి, ఏమాత్రం కదలినా ఏ మాత్రం శబ్ధించినా దేహం జ్వలిస్తూ వొలికిపోయేంతగా నిండిపోయిన దేహపు అలల-యిద్దరిదీ అయిన – యిద్దరిదీ కాని వ్యక్తిగత పరిమళ కలల సమయాలు.

“నేనొక క్రిష్టియన్” ఆమె అంది. ”నీకు తెలుసా బైబిల్ లోని ఆమె కథనాన్ని గురించీ?” అతడు చిర్నవ్వుతో అడిగాడు. ఆరుబయట అశోక చెట్ల గాలులతో పాటు గాలిలా మారుతూ ఆమె చిర్నవ్వింది

దేహం . రహస్య దేహం. బహిర్గతమయ్యీ రహస్యంగా మిగిలిపోయే దేహం.

దేహం మారుతుంది. అశొక చెట్ల గుంపుగానూ, మేఘావృత వుద్యానవపు గులాబీల సందడిగానూ, సముద్ర తెరల నిండైన మెత్తటి పాదాల స్పర్శలగానూ, యింకా ప్రేమపూరితమైన పక్షుల కేరింతలగానూ లేదా సాయంత్రంపూట బేబీకేర్ సెంటరల నుంచి వడివడిగా పొర్లే పిల్లల హృదయాల్లానూ, విశ్వంగానూ సమయంగానూ సర్వరహితంగానూ దేహం మారుతుంది.

“body is a universe in itself” అతడు అన్నాడు.

నక్షత్రాల బిందువుల కింద, అరతెరచిన కిటికీ లోంచి సన్నగా పొగలా జొరపడుతున్న వెన్నెలలా వేకువ ఝామున వుండే నింపాది ఉన్మాద, చిక్కటి చీకటి రక్తంలాటి మంచూ, దేహం నలువైపులా వీడిపోయి మరొక దేహాన్ని ఊదారంగు సర్పంలా చుట్టుకొని మరలా అంతలోనే కరిగి పోయి, తరచూ తడిమే

ఎవరు ఎవరు?

ఆమె దేహం అతడి దేహమయ్యేంతవరకూ అతడి దేహం ఆమె దేహమయ్యేంత వరకూ కలగలిసిపోయి వ్యతిరేకార్థాలైన ఏక భాషలా మారిన పలవరింతల మత్తుసమయాలు.

” నన్ను హిందువని అంటారు కానీ మగ పందినని నా అనుమానం ” అతడు అన్నాడు.

ఒక రాత్రి పూట దేహాన్ని పూర్తిగా చూడాలనే వాంఛతొ దుస్తులను, పొలాల మధ్య కలుపు మొక్కలను ముక్కలు ముక్కలుగా చేసినట్టు, బంగారు రంగు ద్రావకపు వున్మాద మెరుపుల మధ్య తునాతునకలు చేసినప్పుడు, ఆ ముస్లిం ప్రియురాలు అంది: ” నేను రజస్వలను. మతపరంగా అపవిత్రను. వొద్దిప్పుడు, నిజంగా వొద్దిప్పుడు.”

అతడు చెప్పాడు: మనం నిజంగా మతాన్ని పునర్ నిర్వచించుకోవాలి. నిజంగా మనకు తెలియని, తెలిసీ తెలియని అస్పష్ట ఆకారపు రాముడ్నీ, జీసస్ నీ అల్లానూ. నీకు గుర్తుందా? అతడిలోని అతడు ప్రశ్నించాడు. ఆ తెల్లటి గులాబీపూల చందమామని నువ్వేమని పిలిచే వాడిని? తెరుచుకున్న తెరచాపల రెక్కల సుతిమెత్తని శబ్దాల కలకలమని కదా.

ఏదో వొకటి వుంటూనే వుంటుంది

నాకు తెలియని దుఃఖంనుంచి నీకు తెలిసిన భయ దుఃఖపూరితమైన నమాజ్ దాకా ఏదో ఒకటి వుంటూనే వుంటుంది. వెనక్కు వెడితే, దేహం లోపల వానపాముల్లా కదలాడే ఙ్ఞాపకాల వెంట నిశ్శబ్దశబ్దంగా మెలికలు తిరుగుతూ వెడితే, మొదటి రక్తస్పర్శపు ఎర్రగులాబీ పరిమళమా, మొదటి దేహంకోతలో నన్నుమృదువుగా యింకించుకున్నదానా, ఒకానొక మధ్యాహ్నంపూట నాకేమీ తెలియని, నాకు తెలిసీ తెలియని నీ దేహం లోపల నన్ను పిల్లల ఆటలలోని బొమ్మల్లా, మిఠాయి పొట్లంలా దాచుకున్నదానా

ఒకానొక రాత్రిపూట నువ్వు

జాబిలి మధ్యగా రక్తపుచారికలా పగిలితే, ఎవరూ లేని ఒంటరి వేసవి ఆకు అల్లాడని పనస ఆకుల రాత్రి మధ్య నేను ఒంటరిగా గాయపడితే, నా మొదటి అర్థంకాని చందమామా నువ్వు నా ఎదురుగా గాజుగ్లాసులోని సూర్యజలంలాంటి పాపలా తిరిగి వస్తే , నేనేం చేయను? నా చేతి వేలు నుంచి, నింపాదిగా జారిపడుతున్న రక్తంబొట్లలా నేనెవరో తెలియని ఙ్ఞాపకం మృదుమెత్తగా రాత్రిలా కదులాడుతుంటేనూ, నువ్వూ, పగటి మధ్యాహ్న సమయాలలోనూ కదులాడిన క్రైస్తవ బిడ్డ కూడా, గుండెలో యింకించుకున్న బాధలా ఎదురుపడితేనూ, యీ సముద్రమంతానూ, యీ పొంగిపోవడమంతానూ:

చాలా రోజుల క్రొతం పేరులేని, ‘నేను’లేని రోజుల క్రితం నాదయిన ‘నేను’ లేని వ్యక్తావ్యక్త రోజుల గాఢమైన అలల మధ్య నిశ్శబ్దశబ్దంగా తేలాను. తేలికగా, మోయలేనంత తేలిక బరువుగా కదలాడాను.

గది ఎదురుగా కూర్చుని ఎదురుగా కదలాడే మామిడాకుల బాషను అనువదించటం నైరాశ్యం. అదృశ్యంగా దేహాన్ని పలుకరించే గాలి వేళ్ళను కళ్ళతో స్పృశించటం నైరాశ్యం. అస్థిత్వమంతా కరిగిపోయి, ఒక చిన్ని నీటి చినుకులోకి యింకిపోయి వుండటం నైరాశ్యం. వైద్యులు దానిని ఖచ్చితంగా నైరశ్యమే అన్నారు.. మరి ,ఒక దాగుడుమూతల మత్తు రాత్రి మధ్య నువ్వేమన్నవు?”నువ్వెప్పుడూ ఎందుకంత దిగులుగా వుంటావు”...
____________________________________________________________________
29.08.2012. Couldn't load the full file. Those who are interested can read the whole text at http://blueofmoon.blogspot.in/2012/08/blog-post_5895.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి