పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, సెప్టెంబర్ 2012, శనివారం

రియాజ్||సరదాగా...(సముద్రంతో సంభాషణ)||


సరదాగా ఈతాడటమొచ్చా నీకు?
తమాషా కాదు!
తీవ్రంగా అలొచించేంత సులువుకాదు!!
ఈ క్షణంలో అందంగా జీవించగలవా?
భయంకర నిరాశావాదమంత సులువుకాదు
ఈ ప్రక్రియ?!

సముద్రం గొప్పదా?
నేను గొప్పవాడినా?
ఈ అలల్లోని ఉత్సాహం
చురుకైన కదలికలూ
ప్రవాహ వేగమును నేనెప్పుడు పొందగలను?
భీతిగొలిపే ఘోష
దీనిలోతూ నా మనసు లోతూ
దీని గాఢతా నా ప్రేమలో కూడా ఉంటుందా? అమ్మో?!
ఏవేవో అలోచనలూ.. ప్రశ్నలూ...ఇక్కడకూడా నాలో?!

సరదాగా ఈతకొచ్చావ్
సరే! బాగుంది!!
అంతర్గత బహిర్గత క్లాక్ లను సరిచేసి
గతాన్ని ఓ మూల వేసేసి ఈతాడేసి
ఆ ప్రక్రియకు న్యాయం చేసెయ్! చాలు!!

మరి ఈ సోది ఆలోచనలు
సుత్తి విశ్లేషణలూ ఎందుకో!!
ఈ అల ఎలా దాటాలి?
దీనిని ఎలా తప్పించుకోవాలి?
అలా ఉన్నా పర్వాలేదు నీ అలోచనలు

నువ్వేంట్రా!
సముద్రంలో కూడా
సగం ఆలోచనా ప్రపంచాన్ని మోస్తూ
నీకూ సముద్రానికి భారంగా తోస్తావ్!!

అలోచించే పిచ్చి ఏమైనా పట్టిందా?
నువ్వు చించి చించి ఎవరిని ఉధ్ధరిద్దామనో??

ఈ క్షణం
ముందుకు వెళుతుంటే..
నువ్వేంటి వెనుకటి వెనుకబాటు
భంగపాటూ వెతుక్కుంటుంటావ్?

మరీ బలహీనంగా కనిపిస్తున్నావ్ రా?
ఈ అలలకంటే!!

ఈతాడాలంటే లోతు తెలియనక్కర్లేదు
లోతు తెలిసినా తెలియకపోయినా నష్టమేమీ లేదు
ఒక్కో క్షణం ఒక్కో అనుభవమూ బలహీనతను తొడుక్కుంటూ
సగం నీ గతమే! అంతర్గతమే!! అడ్డుపడుతోంది
కొత్తగా అందంగా సృజనక్షణాలను గుర్తిచడంలో
సరికొత్త అనుభూతించడంలో..నువ్వెప్పుడూ వెనుకబాటే!!!!
వర్తమానాన్ని ఆస్వాదించడంలో..
ప్రస్తుత క్షణంలో జీవించడంలో...!!

ఈ సముద్రం కంటే లోతైనవి
దీనికంటే విశాలమైనది
దీని అలలకంటే ఉత్సాహమైనవి
దీని అంతర్గతంకంటే గంభీరమైనవి నీలోనూ ఉన్నాయ్!
నువ్వెక్కువో సముద్రమెక్కువో ..అనవసరం
ప్రస్తుతం నువ్వూ ఆ సముద్రతీరమూ ఐక్యమై
అలల విన్యాసాలూ వాటితో నీ విన్యాసాలూ
చూస్తూ ఆ అద్భుత కలయికా దృశ్యాన్ని ప్రకృతి చూస్తూ
పరవశంతో నిశ్చేష్టగా ఉండిపోవాలి!!

ఇక్కడ నువ్వూ ప్రేక్షకుడవు కావు
ఇద్దరు ఆటగాళ్ళ మధ్య సౌందర్య ఆస్వాదనా క్రీడలో
ఒకడివి
నీ అంతర్గత వికృతిని కాసేపు బంద్ చెయ్
నీ ఆట అత్యంత సహజంగా
వర్తమానంలో వర్తమాన ఆత్మలో
వర్తమాన మనసుతో
ప్రస్తుత కదలికపై నీ అవగాహన
చైతన్యానికే అవాక్కనిపించేలా
అలలవేగాన్ని ఎదుర్కోవడంలో నీ శైలిని చూసి
సముద్రుడే ఆశ్చర్యపోయేలా ఉండాలి నీ క్రీడా నైపుణ్యం
నీ సరదా పూర్థిగా తీరాలి ఆ కాసేపు
ఆ కొన్ని క్షణాలే అద్భుత జీవన సౌందర్య సూచికలు
బాహ్య సౌందర్యంలోని ఆత్మానంద అనుభూతి చిహ్నాలు
అందుకే..
సరదాగా ఈతాడు.. తీవ్రంగా కాదు...!!

01.09.12

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి