పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఏప్రిల్ 2014, సోమవారం

Kapila Ramkumar కవిత

- కె. ఆనందాచారి 9948787660 ||అభ్యు‌ద‌య‌సాహితీ శ్రామికుడు దిలావ‌ర్ || Posted on: Sun 30 Mar 23:17:25.82803 2014 కాలపు ప్రయాణంలో కలాన్ని పట్టుకుసాగిపోవటమే తప్ప ఎక్కడా ఆగిపోని ప్రస్థానం ఆయనిది. చూడ్డానిక మనిషి సాదాసీదాగా ఉంటాడు. చాలా సౌమ్యుడుగానే, ఈ అసమాన, అన్యాయ సమాజానికి మర్యాదస్తుడుగానే కనపడతాడు. కానీ, వ్యవస్థలోని దుష్టత్వాన్ని నిలువెల్లా కాల్చేయగల అగ్నిగుండాన్ని నింపుకున్న గుండె ఆయనిది. మనిషితనాన్ని సాధించడమే కవనాశయంగా కల అభ్యుదయ సాహితీ శ్రామికుడు ఆయన. తెలుగు సాహితీ లోకంలో సుపరిచితుడు, ఖమ్మం జిల్లా సాహితీ వారసత్వానికి వన్నెతెచ్చిన దిలావర్‌. 'తెలంగాణంలో ఖమ్మం జిల్లా ఎప్పుడూ కాస్త కాలానికి ముందు వరుసలోనే ఉంటుంది.' అని దిలావర్‌ గారి గురించి రాస్తూ 'చీరా' అంటారు. అవును, ఖమ్మం కాలాన్ని జయిస్తుంది. ఖమ్మం అంటే ఇక్కడి నేల, పరిసరాలు, ప్రకృతి మాత్రమే కాదు; ప్రగతిశీల భావసారపు నేల ఇది. ఉద్యమాలకు నెలవు ఇది. త్యాగధనుల రక్తంతో తడిచిన నేల, ప్రజలకోసం పరితపించిన వీరులు, ధీరులను కన్న భూమి. అందుకే ప్రతి కలమూ ఎక్కుపెట్టిన శరమై దుర్మార్గంపై పోరాటం చేస్తుంది. ఆ కోవలో నేటికీ అలుపెరగక కలం యోధుడిగా పోరాడుతున్నవాడు దిలావర్‌. ఖమ్మంలో హీరాలాల్‌ మోరియా, దాశరథి, రావెళ్ళ, కౌముది, కవిరాజమూర్తి తరువాత తరం వాడైన దిలావర్‌ శక్తిమంతమైన కవిత్వాన్ని, కతల్ని, విమర్శను అందించే తెలుగు సాహితీరంగంలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కాలంతో పాటుగా సమాజాన్ని నిత్యం అధ్యయనం చేస్తూ తన భావాలకు పదును పెట్టుకున్న వారు దిలావర్‌. 'సాహితీ మిత్రులకు లాల్‌సలామ్‌. ఇవ్వాళ నా రచనల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సింది ఏమీలేదు. సంప్రదాయవాదులు ఒకవైపు, వ్యాపార సంస్క ృతి వంట పట్టించుకున్న రచయితలు ఇంకొకవైపు సాహిత్యరంగంలో బీభత్సం చేస్తున్నారు. మనం రాయాల్సింది అథోజగత్‌ సహౌదరులగురించి, మనం వెలికి తీయాల్సింది చరిత్ర కందక అట్టడుగున పడివున్న చీకటికోణాలను, లోకపు అన్యాయాలను, వేదనను, దౌర్జన్యాలను బహిష్కరించే, పరిష్కరించే సాహిత్యం కావాలి. దానికోసమే నేను ప్రయత్నిస్తున్నాను. ఎంతవరకూ కృతకృత్యుడనయ్యానో నిర్ణయించాల్సింది మీరు' అంటూ 'గురుబ్రహ్మ' కథలో రచయిత దశరథ రామయ్య చెప్పిన మాటలు. ఇవి సాక్షాత్తూ దిలావర్‌ గుండెల్లోంచి దూసుకు వచ్చినమాటలే. దిలావర్‌ గారు కవిగా ప్రసిద్ధుడైనప్పటికీ గొప్ప కథారచయిత కూడా. 'మచ్చుబొమ్మ' పేర వేసిన వీరి కథాసంకలనంలో వ్యథార్థ జీవిత యథార్థ దృశ్యాలు చక్కని కథా కథనంతో కనిపిస్తాయి. 'నువ్వు బతికిందెప్పుడు? / ఒక్కో క్షణాన్నీ మృత్యువు అంచుదాకా/ నీ గుండెలో నువ్వే దిగజార్చుకుంటూ / కళ్ళలోంచి రక్తస్వప్నాలు స్రవించుకుంటూ ప్రాణార్తితో తల్లడిల్లందెప్పుడు?/ బతుకు వ్యవసాయంలో / భ్రమల విత్తనాలు నాటి / భద్రతా కల్తీమందులు పిచికారీ చేసి/ పిరికితనం నీడల చీడలు ఆశించి/ భద్రతా రాహిత్యం మీద రాత్రులకు రాత్రులు దార్తిస్తూ అప్పుల సంకెళ్ళు తెంపుకునీ తెంపులేక / సమస్యల దూలానికి నిన్ను నవ్వు వేలాడదీసుకుని / ఆశలను ఉరి తీయనిదెప్పుడు?' అంటూ 'రక్తఘోష' కవితలో రైతు దీనావస్థను వర్ణిస్తూ ముగింపులో 'బతుకొక పత్తిచేనైపోకుండా / నువ్వొక కొత్త విత్తనంగా మొలకెత్తాలి' అని ముగిస్తాడు. 'ఎన్నికల మైదానంలో మమ్మల్ని కోడిపిల్లల్ని చేసి నువ్వు గద్దాట ఆడినప్పుడల్లా మాకు మిగిలేది విషాదపు 'షర్గతే' మాకాళ్ళ కింద నేలను నువు చీల్చినప్పుడల్లా మేం నింపుకునేవి కన్నీటి మల్కీలే. అరే యాజీద్‌! మా విశ్వాసాన్ని కోట్ల తలకాయలుగా కోసి నీకాళ్ళ దగ్గర రాశిపోసి ఈ దేశాన్ని ఒక 'కర్చలా' మైదానం చేస్తున్నావు.' అంటూ మతోన్మాదాన్ని ఎండకడతాడు 'కర్చలా' కవితా సంకలనంలో. దిలావర్‌గారు ప్రపంచ సాహిత్యాన్ని నిత్యం పరిశీలిస్తూ, అధ్యయనం చేస్తూ విమర్శతో మంచి కృషిచేశారు. ఆ మధ్య దూరాల చేరువలో.... ప్రపంచ సాహిత్యం కొన్నిపుటలు అనే పుస్తకంలో అమెరికా, ఆఫ్రికా, అరబ్‌, చైనా, ఫ్రెంచి, జపాన్‌ మొదలైన దేశాల్లో కొత్తగా వస్తున్న కవిత్వాన్ని యుద్ధ వ్యతిరేక సాహిత్యాన్ని తెలుగులో మనకు అందించారు. ఈ కృషి ఇక్కడి తెలుగు సాహిత్యలోకానికి ఇచ్చిన పెద్ద కానుకని చెప్పుకోవచ్చు. దిలావర్‌ గారి కుమార్తె, అల్లుడు అమెరికాలో ఉన్న కారణంగా అమెరికా పర్యటించారు. అక్కడా లైబ్రరీలో అధ్యయనం చేశారు. అక్కడి సౌకర్యాలు, విలాసాలు, ఆకాశహార్మ్యాలు చూసి మురిసిపోతాడు. ప్రపంచ ప్రజలకు అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్న అన్యాయాన్ని విస్మరించలేదు. 'గ్రౌండ్‌ జీరో' అంటూ తన మనుమరాలిని గుర్తు చేసుకుంటూనే బాల్యాన్ని హరించివేస్తున్న నేటి నిస్సార చదువుల గురించి, కన్స్యూమరిజం గురించి కవితలల్లారు. 'ప్రపంచం మొత్తమ్మీద అది ఏ ప్రాంతమైనా, ఏ భాషైనా సామాన్యుడి జీవితం ఒక్కటేననీ, సమస్యలన్నీ ఒక్కటేననీ, అతని దిగుళ్ళు, వెతలు, గుబుళ్ళు ఒక్కటేననీ, అతని కన్నీళ్ల భాషా, రంగూ, రుచీ వాసనా ఒక్కటేననీ, దుఃఖం ఎగదన్నిన గుండె చప్పుడూ ఒక్కటేననీ, భావోద్రేకాలు, అనుభవాలూ, అనుభూతులూ ఒక్కటేననీ' ఈ యాత్ర ద్వారా ఆయన గ్రహించాడు. 1942లో ఖమ్మంజిల్లాలోని కారేపల్లిమండలం కమలాపురంలో పుట్టిన దిలావర్‌ ఉపాధ్యాయుడుగా, కళల ఆంధ్రోపన్యాసకుడుగా పనిచేశారు. 'ప్రహ్లాద చరిత్ర - ఎర్రన పోతన తులనాత్మక పరిశీలన' అనే సిద్ధాంత వ్యాసాన్ని, 'దాశరథి కవితా వ్యక్తిత్వ పరిశీలన' అనే సిద్ధాంత వ్యాసాన్ని రాసి పిహెచ్‌డి పట్టాపొందారు. కవిగా పేరుతెచ్చుకున్న వీరు మొదట కథలనే రాశారు. ఇప్పటికి 50 కథల దాకా రచించారు. 1974లో 'వెలుగుపూలు' అనే వచన కవితా సంకలనం చేశారు. 'వెన్నెల కుప్పలు', 'జీవనతీరాలు', 'కర్చలా' సంకలనాలను వెలువరించారు. 'ప్రణయాంజలి' అనే పద్యకావ్యం రాశారు. ఎనభైలలోనే 'భారతి' పత్రికలో 'సమిధలు' అనే నవల సీరియల్‌గా వచ్చింది. 'ముగింపు' అనే నవల 'కథాకళి' మాసపత్రికలో, 'తుషారగీతిక' జయశ్రీ మాసపత్రిలో వచ్చాయి. జిల్లాస్థాయిలో, రాష్ట్రస్థాయిలో అనేక అవార్డులు, రివార్డులు పొందిన దిలావర్‌ తెలుగు భాషాసంఘం, రాష్ట్ర సాంస్క ృతిక మండలి చేత సత్కారాలు అందుకున్నారు. నిజయితీతో, నిబద్ధతతో అభ్యుదయ సాహిత్యరంగంలో తాను కృషి చేయడమే కాకుండా తన కూతుర్లయిన షాజహాన్‌, షంషాద్‌ంబేగం కవయిత్రులుగా ఎదగటంలో స్ఫూర్తి, ప్రేరణ అందించారు. బెంగుళూరులోని సి.పి.బ్రౌన్‌ అకాడమీ దిలావర్‌కు తాజాగా పురస్కారం ప్రకటించింది. ఈ సందర్భాన ఆయన కవిత్వాన్ని, సాహిత్య కృషినీ, దృక్పథాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన మరిన్ని రచనలు వెలువరించాలని కోరుకుందాం. http://ift.tt/1ek5YR9

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fTwt40

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి