పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, మార్చి 2014, ఆదివారం

Nirmalarani Thota కవిత

కోడికూసిందో లేదో తెలియదుగానీ కమిట్ మెంట్ కంగారుగా లేపింది . .. చీపురుకట్టతో ప్రస్థానం మొదలు గడియారం పెద్ద ముల్లు పరుగెత్తుతోంది చిన్నముల్లు ప్రేయసిని కలుసుకోవాలనే ఆత్రంలో ఇంకా ఇల్లు తుడవాలి..వంట చేయాలి ఇంట్లో మరో మూడు జతల చేతులున్నాయ్ తినిపెట్టడానికి మరో రెండు చేతులుంటే బాగుణ్ణు ఒకటి ఇంటి పనికీ.. మరొకటి వంట పనికీ రెండు హాల్లోకి మరో రెండు కిచెన్ లోకి క్షణాలు పరుగెడుతున్నాయ్ నిమిషాలుగా మారిపోవాలని స్కూలుకెళ్ళి పిల్లలకి టిఫిన్ బాక్స్ ఇవ్వాలి ఆఫీసుకెళ్ళాలి మరో రెండు కాళ్ళుంటే బాగుండు ఆఫీసుకెల్తూనే ఐదు నిమిషాల ఆలస్యానికి బాసు ధుమధుమలు పక్క సెక్షన్ నుంచి ఏమైందే అనే పలకరింపు చూపులు రెండు జతల చెవులుంటే బాగుండు రెండు మనుషుల్ని వినడానికి రెండు మనసుల్ని వినడానికీ సీట్లో కూర్చొని పని చేసుకుంటుంటే ఉరుములు మెరుపులు నాలుగు ఫైళ్ళు చూడాలి.. డ్రాఫ్టు రాయాలి వడియాలూ, బట్టలూ తడుస్తాయో ఏమో రెండు మెదళ్ళుంటే బాగుండు ఒకటి ఆఫీసు పనికి మరొకటి ఇంటి ధ్యాసకీ నిమిషాలు పరిగెత్తుతున్నాయ్ గంటలుగా గడవాలని. . పొద్దు వాలిపోయింది శరీరం మూలుగుతోంది పెరట్లో మల్లెమొగ్గలు విచ్చుకుంటున్నాయ్ రెండు ముక్కులుంటే బాగుండు ఒకటి అలసిన నిట్టూర్పులకు మరొకటి ఆశల ఉచ్వాసలకూ గంటలు పరిగెత్తుతున్నాయ్ రోజులుగా మురవాలని . . పక్క మీద నడుం వాల్చగానే ఆలోచనా మేఘాలు తరుగుతున్న సత్తువ పెరుగుతున్న పిల్లలు రెండు జతల కళ్ళుంటే బాగుండు ఒకటి కన్నీళ్ళకు మరొకటి కలలు కనేందుకు నిద్ర రాని రెప్పలు నిద్రపోనివ్వని పక్కలు రెండు మనసులుంటే బాగుండు ఒకటి కష్టపడడానికి మరొకటి ఇష్టపడడానికీ ఒకటి క్షమించడానికి మరోటి ప్రేమించడానికీ రోజులు పరిగెత్తుతున్నాయ్ సంవత్సరాలుగా మిగలాలని . . అర్ధరాత్రి దాటిపోతుంది తనువు మనసు స్తబ్ధమవుతున్నాయ్ రోజుకు మరో రెండు గంటలుంటే బాగుండు నాకోసం నేను బ్రతకడానికి . . సంవత్సరాలు పరిగెడుతున్నాయ్ జీవితాలవ్వాలని . . పడమటి సంధ్య తొంగి చూస్తుంది రెక్కలొచ్చిన పక్షులు గూటికి తిరిగి రాలేదు . . రెండు జన్మలుంటే బాగుండు మళ్ళీ తల్లిలా పుట్టడానికి మరో ప్రపంచానికి జన్మనివ్వడానికి . . మామూలు మనిషి అవయవాలతోనే పుట్టి కూడా మరమనిషిలా.. ఇంటా బయటా పనుల్నీ , మనుషుల్నీ, మనసుల్నీ గెలుస్తూ ముందుకుపోతున్న నన్ను నేను చూసుకొని మురిసిపోవడానికీ. . ఆడజన్మ పై గర్వంతో ఉప్పొంగడానికీ. . ! ! నిర్మలారాణి తోట [ తేది: 16.03.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hoiLnq

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి